కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని చిత్తం నెరవేరుతోందా?

దేవుని చిత్తం నెరవేరుతోందా?

దేవుని చిత్తం నెరవేరుతోందా?

“నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”​మత్తయి 6:⁠9.

హూలియో, క్రిస్టీనా భయంతో నిశ్చేష్ఠులై కళ్ళెదుటే తమ నలుగురు పిల్లలు సజీవంగా కాలిపోవడం చూశారు. నిలిపి ఉంచిన తమ కారును ఒక త్రాగుబోతు డ్రైవరు ఢీకొనడంతో, అది పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. తమ ఐదవ బిడ్డ మార్కోస్‌ ఆ మంటల్లోంచి రక్షించబడ్డాడు గానీ, ఒళ్లంతా కాలి కురూపి అయ్యాడు. అతని వయసు తొమ్మిది సంవత్సరాలు. అతని తండ్రి దుఃఖభారంతో కృంగిపోయాడు. ఆయన “ఇది దేవుని చిత్తం, అది మంచైనా, చెడైనా దానిని మనం అర్థం చేసుకోవాలి” అని అంటూ తనను, తన కుటుంబాన్ని ఓదార్చుకున్నాడు.

ఇలాంటి దుఃఖకర సంఘటనలు ఎదురైనప్పుడు చాలామంది ఈ ప్రకారమే ప్రతిస్పందిస్తారు. ‘దేవుడు సర్వశక్తిమంతుడూ, మనపట్ల శ్రద్ధ చూపేవాడూ అయినప్పుడు, జరిగిన సంఘటన అర్థంచేసుకోవడానికి ఎంత కష్టంగావున్నా అది ఏదోక రీతిలో మన మేలుకోసమే అయివుంటుంది’ అని వారు సర్దిచెప్పుకుంటారు. దానికి మీరు అంగీకరిస్తారా?

మేలు జరిగినా కీడు జరిగినా అది దేవుని చిత్తాన్నే వెల్లడిచేస్తుంది అనే అభిప్రాయం, తరచూ పైన ఉదహరించబడిన ప్రభువు ప్రార్థన అని పిలువబడే ప్రార్థనలోని యేసు మాటలపై ఆధారపడివుంటుంది. పరలోకంలో దేవుని చిత్తం జరుగుతోంది కదా? ‘నీ చిత్తం భూమియందును నెరవేరును గాక’ అని ప్రార్థించినప్పుడు, ఈ భూమ్మీద జరిగేది దేవుని చిత్తమేనని మనం అంగీకరించవద్దా?

చాలామంది ఈ అభిప్రాయం విషయంలో సంశయాత్మకంగా ఉన్నారు. ఎందుకంటే అది దేవుణ్ణి, తను సృష్టించిన మానవుల భావాలను పట్టించుకోని వ్యక్తిగా చిత్రీకరిస్తోంది. ‘అమాయక ప్రజలను భయకంపితులను చేసేదానిని ప్రేమగల దేవుడెలా కోరుకోగలడు? ఒకవేళ అలాంటి సంఘటనల ద్వారా దేవుడు మనకు ఏదైనా పాఠమే నేర్పించాలనుకుంటే, అదెలాంటి పాఠం?’ అని వారడుగుతున్నారు. బహుశా మీరు కూడా అలాగే భావిస్తుండవచ్చు.

ఈ విషయానికి సంబంధించి యేసు సోదరుడు, శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:​13) చెడుకు మూలకారణం దేవుడు కాదు. అందువల్ల, నేడు భూమ్మీద జరిగే సమస్తం దేవుని చిత్తం కాదనేది స్పష్టమవుతోంది. మనుషేచ్ఛ గురించి, జనాంగాల ఇష్టం గురించి, చివరకు అపవాది ఇష్టం గురించి కూడా లేఖనాలు మాట్లాడుతున్నాయి. (యోహాను 1:13; 2 తిమోతి 2:26; 1 పేతురు 4:⁠3) హూలియో, క్రిస్టీనాల కుటుంబానికి జరిగింది ప్రేమగల పరలోకపు తండ్రి చిత్తం కానేరదని మీరు అంగీకరిస్తారా?

అలాగైతే, ‘నీ చిత్తం నెరవేరును గాక’ అని ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించడంలో ఆయన భావమేమై ఉంది? అది కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు కలుగజేసుకోవాలని చేసిన విన్నపమా, లేక అందరూ నిరీక్షించగల మరింత ముఖ్యమైన, మేలైన మార్పుకోసం ప్రార్థించమని యేసు మనకు నేర్పిస్తున్నాడా? ఆ విషయంలో బైబిలు ఇంకా ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాం.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

కారు: Dominique Faget-STF/AFP/Getty Images; పిల్లవాడు: FAO photo/B. Imevbore