కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతికూల ప్రపంచంలో దయ చూపించడానికి కృషి చేయడం

ప్రతికూల ప్రపంచంలో దయ చూపించడానికి కృషి చేయడం

ప్రతికూల ప్రపంచంలో దయ చూపించడానికి కృషి చేయడం

“కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును.”​సామెతలు 19:​22.

మీరు దయగలవారనే అనుకుంటున్నారా? అలాగయితే, నేటి లోకంలో జీవించడం చాలా కష్టం. నిజమే బైబిల్లో, దయ ‘ఆత్మ ఫలంలో’ ఒక భాగంగా గుర్తించబడింది, అయితే క్రైస్తవ దేశాలని పిలువబడే దేశాల్లో కూడా దయ చూపించడం ఎందుకంత కష్టంగా ఉంది? (గలతీయులు 5:​22) మనం ముందరి శీర్షికలో గమనించినట్లుగా, లోకమంతయు నిర్దయుడైన అపవాదియగు సాతాను ఆధీనంలో ఉందని అపొస్తలుడైన యోహాను వ్రాసిన మాటల్లో మనకు కొంతవరకు జవాబు లభిస్తుంది. (1 యోహాను 5:​19) యేసుక్రీస్తు సాతానును ‘లోకాధికారిగా’ గుర్తించాడు. (యోహాను 14:​30) అందువల్ల, ఈ లోకం క్రూర ప్రవర్తన ద్వారా వెల్లడయ్యే దృక్పథంగల దాని తిరుగుబాటు పాలకునిలానే ఉండే అవకాశముంది.​—⁠ఎఫెసీయులు 2:2.

2 ఇతరులు మనల్ని నిర్దయగా చూసినప్పుడు మన జీవితాలపై చెడు ప్రభావం పడుతుంది. ద్వేషించే పొరుగువారు, మిత్రభావంలేని కొత్తవారు, కొన్నిసార్లు అనాలోచితంగా ప్రవర్తించే స్నేహితులు, చివరకు కుటుంబ సభ్యులు కూడా నిర్దయగా వ్యవహరించవచ్చు. మొరటుగా ఉండే, పరస్పరం దూషించుకుంటూ శాపనార్థాలు పెట్టుకునే ప్రజలతో కలిసి మాట్లాడే పరిస్థితి తరచూ దిగులు పుట్టించవచ్చు. ఇతరులు చూపే అలాంటి నిర్దయ మనలో వైరిభావాన్ని రేకెత్తించి, కీడుకు ప్రతికీడు చేయాలని భావించడానికి కారణం కావచ్చు. అలాంటి భావాలు మన ఆధ్యాత్మిక లేదా భౌతిక అనారోగ్యానికి దారితీయవచ్చు.​—⁠రోమీయులు 12:17.

3 ఒత్తిడిగల ప్రపంచ పరిస్థితులు కూడా మనం దయ చూపించడాన్ని కష్టభరితం చేయవచ్చు. ఉదాహరణకు, ఉగ్రవాద బెదిరింపులు, వారి చర్యలు అలాగే వివిధ దేశాలు జీవాయుధాలను లేదా అణ్వస్త్రాలను ప్రయోగించే అవకాశాలున్న కారణంగా సాధారణ ప్రజానీకం ఒత్తిడికి గురవుతూ ఉంది. దానికితోడు, సరిపడా ఆహారం, వసతి, వస్త్రాలు లేక, వైద్య సహాయం లభించక కోట్లాదిమంది బీదరికంలో మగ్గుతున్నారు. పరిస్థితి ఆశారహితంగా కనిపించినప్పుడు దయ చూపించడం ఒక సవాలే.​—⁠ప్రసంగి 7:7.

4 అందువల్ల, దయ చూపించడం నిజానికి అంత ప్రాముఖ్యం కాదని, అది బలహీనతకు ఒక సూచన అని కూడా ఒక వ్యక్తి సులభంగా అనుకోవచ్చు. ప్రత్యేకంగా ఇతరులు తన భావాలను పనికిరానివిగా పక్కకు త్రోసిపుచ్చినప్పుడు, తనకు చాలా అన్యాయం జరుగుతోందని అతడు భావించవచ్చు. (కీర్తన 73:​2-9) అయితే, సరైన నడిపింపునిస్తూ బైబిలు మనకిలా చెబుతోంది: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:⁠1) సాత్వికం, దయాళుత్వం అనేవి ఆత్మ ఫలంలోని, దగ్గరి సంబంధమున్న రెండు లక్షణాలు, ఇవి కష్టభరితమైన, సవాలుదాయకమైన పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు కార్యసాధకంగా ఉంటాయి.

5 క్రైస్తవులుగా మనకు దేవుని పరిశుద్ధాత్మ ఫలాన్ని ప్రదర్శించడం చాలా ప్రాముఖ్యం కాబట్టి, ఆ లక్షణాల్లో ఒక దానిని అంటే దయనెలా చూపించవచ్చో మనం పరిశీలించాలి. విరోధ స్వభావమున్న లోకంలో దయ చూపించడం సాధ్యమేనా? అలాగయితే, ప్రత్యేకంగా ఒత్తిడిగల పరిస్థితుల్లో, సాతాను ప్రభావం మన దయను అణచివేయడాన్ని అనుమతించమని మనం నిరూపించగల కొన్ని రంగాలు ఏమిటి? కుటుంబంలో, ఉద్యోగస్థలంలో, పాఠశాలలో, మన పొరుగువారిపట్ల, మన పరిచర్యలో, తోటి విశ్వాసులపట్ల దయనెలా చూపించవచ్చో మనం పరిశీలిద్దాం.

కుటుంబంలో దయ చూపించడం

6 యెహోవా ఆశీర్వాదం, నిర్దేశం పొందడానికి, ఆత్మ ఫలం ఆవశ్యకం మరియు దానిని పూర్తిగా అలవరచుకోవాలి. (ఎఫెసీయులు 4:​32) కుటుంబ సభ్యులు పరస్పరం దయ చూపించుకోవలసిన ప్రత్యేక అవసరంపై మనం దృష్టిసారిద్దాం. భార్యాభర్తలు తమ దైనందిన వ్యవహారాల్లో పరస్పరం దయను, శ్రద్ధాపూర్వక స్వభావాన్ని కనబరచుకోవాలి, తమ పిల్లలతోనూ అలాగే వ్యవహరించాలి. (ఎఫెసీయులు 5:28-33; 6:​1, 2) కుటుంబ సభ్యులు పరస్పరం మాట్లాడుకునే విధానంలో, పిల్లలు తమ తల్లిదండ్రులను సన్మానించి గౌరవించడంలో, తల్లిదండ్రులు పిల్లలను సరిగాచూసే విషయంలో అలాంటి దయ స్పష్టంగా కనబడాలి. వెంటనే మెచ్చుకుంటూ, ఖండించడంలో నిదానించే వారిగా ఉండండి.

7 మన కుటుంబ సభ్యులపట్ల దయగా ఉండడంలో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరించడం ఇమిడివుంది: “ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.” ప్రతీ రోజు క్రైస్తవ కుటుంబ సభ్యులు పరస్పరం గౌరవపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే చక్కని సంభాషణ బలమైన, ఆరోగ్యదాయకమైన కుటుంబాలకు వెన్నెముక వంటిది. అభిప్రాయబేధాలు తలెత్తినప్పుడు, ఆ పరిస్థితిని చక్కబెట్టడానికి, వాదన గెలవాలని ప్రయత్నించే బదులు సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. ధన్యతగల కుటుంబ సభ్యులు పరస్పర దయను, శ్రద్ధను పురికొల్పడానికి మనఃపూర్వకంగా ప్రయత్నిస్తారు.​—⁠కొలొస్సయులు 3:8, 12-14.

8 దయ సానుకూలంగా ఉండి ఇతరులకు మేలుచేయాలని మనం కోరుకునేలా చేస్తుంది. అందువల్ల, మనం ఇతర కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా, వారిపట్ల శ్రద్ధచూపే వారిగా, వారికి నచ్చిన రీతిలో సహాయపడేవారిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కుటుంబంపై మంచి ప్రభావం చూపేలాంటి దయను చూపించడానికి వ్యక్తిగత, సమిష్టి ప్రయత్నం అవసరం. దాని ఫలితంగా, వారికి యెహోవా ఆశీర్వాదాలు లభించడమే కాకుండా, వారు అటు సంఘంలో, ఇటు సమాజంలో దయగల దేవుడైన యెహోవాను ఘనపరుస్తారు.​—⁠1 పేతురు 2:12.

ఉద్యోగస్థలంలో దయ చూపించడం

9 ఒక క్రైస్తవునికి తన ఉద్యోగ దినచర్యలో, తోటి ఉద్యోగస్థులపట్ల దయ చూపించడం ఒక సవాలుగా ఉండవచ్చు. ఉద్యోగుల మధ్యవున్న పోటీ కారణంగా, తోటి ఉద్యోగి మోసపూరితంగా లేదా కుయుక్తిగా ప్రవర్తించడం మూలంగా ఒక వ్యక్తి ఉద్యోగం ప్రమాదంలో పడి, యజమాని దగ్గర తనకున్న మంచిపేరు పాడుకావచ్చు. (ప్రసంగి 4:⁠4) అలాంటి సమయాల్లో దయ చూపించడం సులభం కాదు. అయినప్పటికీ, యెహోవా సేవకుడు దయాపూర్వకంగా ప్రవర్తించడమే నిజానికి సరైనదిగా ఉంటుందని మనస్సులో ఉంచుకొని, సర్దుకుపోవడం అంత సులభం కాని వారిని రాబట్టుకోవడానికి శాయశక్తులా కృషిచేయాలి. ఈ విషయంలో శ్రద్ధచూపే దృక్పథం మనకు సహాయం చేయవచ్చు. తోటి ఉద్యోగి లేదా అతని కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారిపట్ల మీరు శ్రద్ధ కనబరచవచ్చు. వారి సంక్షేమం గురించి వాకబు చేయడం కూడా అవతలి వ్యక్తిపై మంచి ప్రభావం చూపగలదు. అవును, క్రైస్తవులు తమకు శక్యమైనంతమేరకు సమాధాన సమైక్యతలను పురికొల్పడానికే ప్రయత్నించాలి. కొన్నిసార్లు శ్రద్ధాసక్తులుచూపే దయగల మాట పరిస్థితి చక్కబడేలా సహాయం చేస్తుంది.

10 ఇతర సందర్భాల్లో, యజమాని తన అభిప్రాయాలను ఉద్యోగులపై రుద్ది, ప్రతీ ఒక్కరూ లేఖన విరుద్ధ స్వభావంగల జాతీయ వేడుకల్లో లేదా ఆచరణల్లో భాగం వహించాలని కోరుకోవచ్చు. భాగం వహించడానికి ఒక క్రైస్తవుని మనస్సాక్షి ఒప్పుకోనప్పుడు అది ప్రతిఘటనకు దారితీయవచ్చు. అలాంటి సమయంలో, యజమాని అభీష్టానికి అనుగుణంగా ప్రవర్తించడం ఎంత తప్పో వివరించడానికి ప్రయత్నించడం అంత వివేకం కాకపోవచ్చు. నిజానికి, క్రైస్తవ నమ్మకాలు పంచుకోని వారికి అలాంటి ఆచరణల్లో భాగం వహించడం సరైనదిగా అనిపించవచ్చు. (1 పేతురు 2:​21-23) వ్యక్తిగతంగా మీరు భాగం వహించక పోవడానికి మీకున్న కారణాల్ని మీరు ఆ తర్వాత వినయపూర్వకంగా వివరించవచ్చు. ఎత్తిపొడుపు మాటలకు అదే తరహాలో జవాబివ్వకండి. క్రైస్తవులు, “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అని రోమీయులు 12:18లో ఇవ్వబడిన మంచి సలహాను పాటించడం ఉత్తమం.

పాఠశాలలో దయ చూపించడం

11 తోటి విద్యార్థులపట్ల దయ చూపించడం యౌవనులకు నిజంగా ఒక సవాలుగా ఉండగలదు. యౌవనులు తరచూ తోటి విద్యార్థులు తమను గుర్తించాలని కోరుకుంటారు. ఇతర విద్యార్థుల మెప్పు కోసం కొందరు బాలురు పాఠశాలలో బలహీనంగా కనబడ్డ ఇతర పిల్లల్ని భయపెట్టి ఏడిపించడంలో వీరుల్లా ప్రవర్తిస్తారు. (మత్తయి 20:​25) ఇంకొందరు యౌవనులైతే విద్యావిషయిక పాండిత్యంలో, క్రీడల్లో లేదా ఇతర కార్యకలాపాల్లో తమ సామర్థ్యాలు ప్రదర్శించడానికి ఇష్టపడతారు. తమ సామర్థ్యాన్ని గొప్పగా చాటుకోవడంలో వారు తరచూ తమ తరగతి విద్యార్థులతో, ఇతర విద్యార్థులతో నిర్దయగా వ్యవహరిస్తారు, అదే ఏదో విధంగా తమను గొప్పవారిగా చేస్తుందని తప్పుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులను అనుకరించకుండా ఉండడానికి యౌవన క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. (మత్తయి 20:​26, 27) ప్రేమ ‘దీర్ఘకాలం సహిస్తుందనీ, దయ చూపిస్తుందనీ,’ అది ‘డంబంగా ప్రవర్తించదనీ, ఉప్పొంగదనీ’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అందువల్ల, ఒక క్రైస్తవునికి, నిర్దయగా ప్రవర్తించే వారి చెడు మాదిరిని అనుసరించకుండా తోటి విద్యార్థులతో తన వ్యవహారాల్లో లేఖన ఉపదేశానికి కట్టుబడివుండవలసిన బాధ్యత ఉంది.​—⁠1 కొరింథీయులు 13:4.

12 యౌవనులు తమ టీచర్లతోనూ దయగా వ్యవహరించాలి. చాలామంది విద్యార్థులకు తమ టీచర్లను విసిగించడమంటే సరదా. పాఠశాల నియమాలు ఉల్లంఘించే కార్యకలాపాల్లో పాల్గొంటూ తమ టీచర్ల గౌరవాన్ని పాడుచేసినప్పుడు తామెంతో తెలివైనవారమని వారు తలస్తారు. ఇతరులను భయపెట్టి వారు కూడా తమతో చేతులు కలిపేలా చేసుకుంటారు. వారితోపాటు వెళ్లడానికి ఒక యౌవన క్రైస్తవుడు నిరాకరించినప్పుడు, అతను లేదా ఆమె అపహాస్యానికి లేదా దాడికి గురికావచ్చు. ఒక విద్యా సంవత్సరమంతటిలో అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం దయ చూపించాలనే ఒక క్రైస్తవుని తీర్మానాన్ని పరీక్షిస్తుంది. అయితే, యెహోవా విశ్వసనీయ సేవకునికి దయ చూపించడం ఎంత ప్రాముఖ్యమో మర్చిపోవద్దు. జీవితంలోని ఈ క్లిష్ట సమయాల్లో ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు మద్దతిస్తాడనే నమ్మకంతో ఉండండి.​—⁠కీర్తన 37:28.

పొరుగువారిపట్ల దయ చూపించడం

13 మీరు ఒక గృహంలో, ఒక అపార్టుమెంటులో లేదా మరెక్కడైనా నివసిస్తుంటే మీ పొరుగువారిపట్ల దయ చూపించే, వారి సంక్షేమంపట్ల శ్రద్ధను వ్యక్తపరిచే మార్గాల గురించి ఆలోచించండి. ఇది కూడా అన్ని సందర్భాల్లో సులభమేమీ కాదు.

14 మీ తెగనుబట్టి, జాతీయతనుబట్టి లేదా మతాన్నిబట్టి మీ పక్కింటివారు వివక్ష చూపిస్తే అప్పుడేమిటి? వారు కొన్నిసార్లు మొరటుగా ప్రవర్తిస్తే లేదా మిమ్మల్ని అసలే పట్టించుకోకపోతే అప్పుడేమిటి? యెహోవా సేవకునిగా, సాధ్యమైనంత మేరకు దయను వ్యక్తపరచడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పునరుత్తేజాన్నిచ్చేలా భిన్నంగా ఉంటారు, అది దయ చూపించడంలో మాదిరికర్త అయిన యెహోవాకు నిజమైన స్తుతిని తీసుకొస్తుంది. మీ దయా ప్రవర్తనా ఫలితంగా మీ పొరుగువారి దృక్పథంలో ఎప్పుడు మార్పువస్తుందో మీకు తెలియదు. ఆయన యెహోవాను స్తుతించే వ్యక్తిగా తయారుకావచ్చు.​—⁠1 పేతురు 2:12.

15 మనమెలా దయ చూపించవచ్చు? కుటుంబ సభ్యులందరూ ఆత్మ ఫలాన్ని ప్రదర్శిస్తూ మంచి ప్రవర్తన ద్వారా అలాంటి దయ చూపించవచ్చు. దీనిని పొరుగువారు గమనించవచ్చు. అప్పుడప్పుడూ మీరు మీ పొరుగువారికి ఏదైనా మేలుచేయవచ్చు. దయ చూపించడమంటే ఇతరుల సంక్షేమంపట్ల కార్యశీల శ్రద్ధ చూపించడమనే విషయం మరచిపోకండి.​—⁠1 పేతురు 3:8-12.

మన పరిచర్యలో దయ చూపించడం

16 ప్రజలను వారి ఇండ్ల దగ్గర, వారి వ్యాపార ప్రాంతంలో, ప్రజాసంబంధ ప్రాంతాల్లో కలుసుకోవడానికి మనం గట్టిగా ప్రయత్నిస్తాం కాబట్టి మన పరిచర్యలో దయ చూపించడం ప్రముఖ లక్షణంగా ఉండాలి. ఎల్లప్పుడూ దయాపరునిగా ఉండే యెహోవాకు మనం ప్రాతినిథ్యం వహిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి.​—⁠నిర్గమకాండము 34:6.

17 మీరు మీ పరిచర్యలో దయ చూపించేందుకు చేసే ప్రయత్నాల్లో ఏమేమి ఇమిడివున్నాయి? ఉదాహరణకు, మీరు వీధి సాక్ష్యమిచ్చేటప్పుడు క్లుప్తంగా ముగించడం ద్వారా, వారిని అర్థంచేసుకోవడం ద్వారా మీరు దయ చూపించవచ్చు. ఫుట్‌పాత్‌లు సాధారణంగా పాదచారులతో రద్దీగా ఉంటాయి కాబట్టి మీరు ఆటంకం కలిగించేవారిగా ఉండకుండా జాగ్రత్త వహించండి. అలాగే మీరు వ్యాపార ప్రాంతంలో సాక్ష్యమిచ్చేటప్పుడు, దుకాణదారులు ఖాతాదారులకు కావలసినవి ఇవ్వాల్సి ఉంటుందని జ్ఞాపకముంచుకొని క్లుప్తంగా మాట్లాడడం ద్వారా వారిపట్ల దయ చూపించవచ్చు.

18 ఇంటింటి పరిచర్యలో వివేచన ఉపయోగించండి. ప్రత్యేకంగా వాతావరణం సరిగా లేనప్పుడు, ఒక ఇంట్లోనే ఎక్కువ సేపు గడపకండి. మీరక్కడ ఉండడాన్నిబట్టి ఒక వ్యక్తిలో ఓపిక నశించడాన్ని లేదా విసుగును మీరు పసిగట్టగలరా? బహుశా మీరు నివసిస్తున్న ప్రాంతంలో యెహోవాసాక్షులు తరచూ సందర్శిస్తుండవచ్చు. ఒకవేళ అదే నిజమైతే, అన్ని సందర్భాల్లో దయగలవారిగా, ఆహ్లాదకరమైన వారిగా ఉంటూ ప్రత్యేక శ్రద్ధచూపించండి. (సామెతలు 17:​14) ఆ రోజు వినకపోవడానికి ఇంటి యజమానికి ఉన్న కారణమేమిటో గుర్తించడానికి ప్రయత్నించండి. సమీప భవిష్యత్తులోనే మీ క్రైస్తవ సహోదర సహోదరీల్లో ఎవరో ఒకరు ఆ ఇంటిని సందర్శిస్తారని గుర్తుంచుకోండి. మొరటుగా ప్రవర్తించే ఎవరినైనా మీరు కలిస్తే, దయ చూపించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించండి. మీ స్వరం పెంచకండి లేదా కోపం వెలిబుచ్చకండి, బదులుగా ప్రశాంతంగా మాట్లాడండి. దయగల క్రైస్తవుడు ఇంటి యజమానిని మాటల యుద్ధంలోకి దించడు. (మత్తయి 10:​11-14) ఏదోకరోజున ఆ వ్యక్తి బహుశా సువార్త వినవచ్చు.

సంఘకూటాల్లో దయ చూపించడం

19 తోటి విశ్వాసులపట్ల దయ చూపించడం కూడా ప్రాముఖ్యమే. (హెబ్రీయులు 13:⁠1) మనం ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగస్థులం కాబట్టి, మన పరస్పర వ్యవహారాల్లో దయ చూపించుకోవడం ఆవశ్యకం.

20 ఒకే రాజ్య మందిరాన్ని ఒకటికంటే ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటుంటే, ఇతర సంఘాల వారితో మీ వ్యవహారాల్లో వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం ద్వారా పరస్పరం దయ చూపించుకోవడం ప్రాముఖ్యం. కూటాల సమయాలు, శుభ్రం చేయడం లేదా బాగుచేయడం వంటివి తీర్మానించే సమయం వచ్చినప్పుడు పోటీ తత్వం సహకార స్ఫూర్తికి అడ్డుపడుతుంది. అభిప్రాయభేదాలు ఉండే అవకాశమున్నప్పటికీ దయ చూపించేవారిగా, శ్రద్ధ కనబరిచే వారిగా ఉండండి. ఈ విధంగా దయ విజయం సాధిస్తుంది, ఇతరులపట్ల మీరు చూపే శ్రద్ధను యెహోవా నిజంగా ఆశీర్వదిస్తాడు.

ఎల్లప్పుడూ దయ చూపిస్తూ ఉండండి

21 దయ ఎంతో విస్తృత పరిధిగల లక్షణం కాబట్టి అది మన జీవితాల్లోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల మనం దానిని మన క్రైస్తవ వ్యక్తిత్వంలో అంతర్భాగంగా చేసుకోవాలి. ఇతరులపట్ల దయ చూపించడం ఒక అలవాటుగా మారాలి.

22 మనలో ప్రతీ ఒక్కరం అనుదినం ఇతరులపట్ల దయ చూపిస్తూ, “దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి” అని పలికిన అపొస్తలుడైన పౌలు మాటలను వ్యక్తిగతంగా అన్వయించుకుందాం.​—⁠కొలొస్సయులు 3:12.

మీకు జ్ఞాపకమున్నాయా?

ఒక క్రైస్తవుడు దయ చూపించడాన్ని ఏది కష్టభరితం చేస్తుంది?

కుటుంబంలో దయ చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

పాఠశాలలో, ఉద్యోగస్థలంలో, పొరుగువారిపట్ల దయ చూపించడంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏమిటి?

క్రైస్తవులు తమ బహిరంగ పరిచర్యలో దయనెలా చూపించవచ్చో వివరించండి.

[అధ్యయన ప్రశ్నలు]

1. దయ చూపించడం ఎందుకు కష్టంకావచ్చు?

2. మనం దయ చూపించడాన్ని ఎలాంటి సవాళ్లు ప్రభావితం చేయవచ్చు?

3. దయచూపించాలనే తమ ఇష్టాన్ని పరీక్షించే ఎలాంటి గంభీరమైన సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు?

4. ఇతరులపట్ల దయచూపించడం గురించి తలంచేటప్పుడు కొందరెలాంటి తప్పుడు నిర్ణయానికి రావచ్చు?

5. దయ చూపించాల్సిన జీవితపు రంగాలు కొన్ని ఏమిటి?

6. కుటుంబంలో దయ ఎందుకు అంత ప్రాముఖ్యం, దానినెలా కనబరచవచ్చు?

7, 8. (ఎ) కుటుంబంలో మనం నిజమైన దయ చూపించాలంటే ఎలాంటి ప్రవర్తనకు మనం దూరంగా ఉండాలి? (బి) బలమైన కుటుంబ బంధానికి మంచి సంభాషణ ఎలా దోహదపడుతుంది? (సి) మీ కుటుంబంలో మీరెలా దయను ప్రదర్శించవచ్చు?

9, 10. ఉద్యోగస్థలంలో ఉత్పన్నమయ్యే కొన్ని సమస్యల్ని వివరించి, వాటితో దయాపూర్వకంగా ఎలా వ్యవహరించవచ్చో వ్యాఖ్యానించండి.

11. తోటి విద్యార్థులపట్ల దయ చూపించడంలో యౌవనులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు?

12. (ఎ) యౌవనులకు తమ టీచర్లతో దయగా వ్యవహరించడం ఎందుకు ఒక సవాలుగా ఉండవచ్చు? (బి) నిర్దయగా ప్రవర్తించడానికి ఒత్తిడి చేయబడినప్పుడు సహాయం కోసం యౌవనులు ఎవరివైపు చూడవచ్చు?

13-15. పొరుగువారిపట్ల దయ చూపించడాన్ని ఏది అడ్డుకోవచ్చు, అయితే ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చు?

16, 17. (ఎ) మన బహిరంగ పరిచర్యలో దయ చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) క్షేత్ర సేవలోని వివిధ అంశాల్లో దయనెలా చూపించవచ్చు?

18. మన పరిచర్యలో దయ చూపించడంలో వివేచన ఏ పాత్ర పోషిస్తుంది?

19, 20. సంఘంలో దయ చూపించడం ఎందుకు అవసరం, ఆ దయను ఎలా చూపించవచ్చు?

21, 22. కొలొస్సయులు 3:⁠12 ప్రకారం, మన తీర్మానమేమై ఉండాలి?

[18వ పేజీలోని చిత్రం]

కుటుంబ సభ్యులందరూ చూపించే దయ ఐక్యతకు, సహకారానికి తోడ్పడుతుంది

[19వ పేజీలోని చిత్రం]

తోటి ఉద్యోగి లేదా అతని కుటుంబం అస్వస్థత పాలైనప్పుడు మీరు వారిపట్ల దయ చూపించవచ్చు

[20వ పేజీలోని చిత్రం]

అపహాస్యానికి గురైనా నమ్మకంగా దయ చూపించేవారిని యెహోవా బలపరుస్తాడు

[21వ పేజీలోని చిత్రం]

అవసరంలోవున్న పొరుగువారికి సహాయ హస్తం అందించడం దయాపూర్వక చర్య