మెక్సికోలోని ఇంగ్లీష్ మాట్లాడే క్షేత్రంలో అనియత సాక్ష్యమివ్వడం
మెక్సికోలోని ఇంగ్లీష్ మాట్లాడే క్షేత్రంలో అనియత సాక్ష్యమివ్వడం
అపొస్తలుడైన పౌలు తనతో ప్రయాణిస్తున్న సహచరుల కోసం ఏథెన్సులో వేచివున్నప్పుడు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనియత సాక్ష్యమిచ్చాడు. దాని గురించి బైబిలు ఇలా నివేదిస్తోంది: “[ఆయన] ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితో తర్కించుచు వచ్చెను.” (అపొస్తలుల కార్యములు 17:17) యేసు యూదా నుండి గలిలయకు వెళ్తున్నప్పుడు ఒక బావి దగ్గర సమరయ స్త్రీకి అనియత సాక్ష్యమిచ్చాడు. (యోహాను 4:3-26) మీరు కూడా దేవుని రాజ్య సువార్తను మాట్లాడేందుకు ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారా?
మెక్సికోలోని ఇంగ్లీషు మాట్లాడే క్షేత్రం, ముఖ్యంగా అనియత సాక్ష్యానికి అనువుగా ఉంటుంది. పర్యాటకులు వాహ్యాళి కేంద్రాలకు వెళుతుంటారు, విశ్వవిద్యాలయ విద్యార్థులు వస్తూ పోతూ ఉంటారు, మెక్సికోలో ఉద్యోగ విరమణ చేసిన విదేశీయులు తరచూ పార్కుల్లోను, రెస్టారెంట్లలోను గడుపుతుంటారు. అలాంటి వారితో సంభాషణ ప్రారంభించడంలో ఇంగ్లీషు తెలిసిన యెహోవాసాక్షులు చాలామంది ప్రావీణ్యం సంపాదించారు. వాస్తవానికి వారు, ఎవరైనా విదేశీయుల్లా కనబడినా లేక ఇంగ్లీషు మాట్లాడేవారు కలిసినా వెంటనే వారితో మాట్లాడేందుకు సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడడం ప్రారంభిస్తారో చూద్దాం.
ఆ ఇంగ్లీషు క్షేత్రంలో వేరే దేశాల నుండి వచ్చి సేవ చేస్తున్న సాక్షులు తరచుగా, విదేశీయులు తారసపడినప్పుడు వారికి తమను తాము పరిచయం చేసుకొని వారెక్కడ నుండి వచ్చారని అడుగుతారు. అది సహేతుకంగానే మెక్సికోలో ఈ సాక్షి ఏమి చేస్తున్నాడనే ప్రశ్నకు దారితీస్తుంది, దాంతో ఈ సాక్షికి క్రైస్తవ విశ్వాసాలను పంచుకునే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు, అవసరం ఎక్కువగావున్న వహాకలోని ఇంగ్లీషు క్షేత్రంలో సేవ చేస్తున్న గ్లోరియా, ప్రత్యేకించి ఆ విధంగా సంభాషణలు ప్రారంభించడం చాలా సులభమని తెలుసుకుంది. ఒకరోజు నగర కూడలి వద్ద అనియత సాక్ష్యమిచ్చి ఇంటికి తిరిగివస్తున్న గ్లోరియా, ఇంగ్లాండు నుండి వచ్చిన ఒక జంట ఆపడంతో ఆగింది. “వహాక వీధుల్లో ఒక నీగ్రో స్త్రీ నడవడాన్ని నేను చూస్తున్నానన్న విషయం నమ్మలేకపోతున్నాను!” అని ఆ స్త్రీ ఆశ్చర్యం వ్యక్తపరచింది. గ్లోరియా ఆమె మాటలకు నొచ్చుకోవడానికి బదులు నవ్వి, తను మెక్సికోలో ఎందుకుందో చెబుతూ వారితో మాట్లాడడం ప్రారంభించింది. గ్లోరియాను కాఫీ త్రాగడానికి రమ్మని ఆ స్త్రీ తనింటికి ఆహ్వానించింది. సమయం నిర్ణయించుకున్న తర్వాత గ్లోరియా ఆమెకు కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించింది, కానీ ఆ స్త్రీ తను నాస్తికురాలిని అని చెప్పి వాటిని తీసుకోవడానికి నిరాకరించింది. అందుకు జవాబుగా గ్లోరియా తాను నాస్తికులతో మాట్లాడడంలో ఆనందించాననీ, “ఆరాధనా స్థలాలు—అవి మనకు అవసరమా?” అనే ఆర్టికల్‌పై ఆమె అభిప్రాయం వినాలని ఉందని చెప్పింది. దానికి ఆ స్త్రీ అంగీకరిస్తూ ఇలా అంది: “మీరు నన్ను ఒప్పించగలిగితే, మీరు నిజంగా విజయం సాధించినట్లే.” కాఫీ త్రాగడానికి వెళ్ళినప్పుడల్లా చాలాసార్లు వారు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ దంపతులు తిరిగి ఇంగ్లాండుకు వెళ్ళిపోయారు, కానీ ఇ-మెయిల్ ద్వారా వారి చర్చలు కొనసాగాయి.
వాషింగ్టన్ డి.సి., నుండి వచ్చిన శారొన్ అనే ఒక విద్యార్థినితో కూడా గ్లోరియా మాట్లాడింది. ఆ అమ్మాయి
తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడానికి, ఆ డిగ్రీలో భాగంగా వహాకలోని తన దేశపు స్త్రీలతో కలిసి స్వచ్ఛంద సేవ చేస్తోంది. శారొన్ చేస్తున్న మంచిపనిని గ్లోరియా మెచ్చుకొని, తాను మెక్సికోలో ఎందుకుందో వివరించింది. అలా ఆ సంభాషణ దేవుడు పేదలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఏమి చేస్తాడనే విషయంపై మంచి బైబిలు చర్చకు దారితీసింది. శారొన్ తాను అమెరికాలో ఉన్నప్పుడు సాక్షులతో ఎన్నడూ మాట్లాడకపోవడం, మెక్సికోలో తాను మొదటిసారిగా కలుసుకున్న ప్రజలు యెహోవాసాక్షులు కావడం గమ్మత్తుగా ఉందని వ్యాఖ్యానించింది! శారొన్ వెంటనే బైబిలు అధ్యయనానికి అంగీకరించి, క్రైస్తవ కూటాలకు హాజరవడం ప్రారంభించింది.చాలామంది విదేశీయులు పరదైసును అన్వేషిస్తూ, మెక్సికోలోని సముద్ర తీరపు వాహ్యాళి కేంద్రాలకు తమ మకాం మార్చారు. ఆకపుల్కోలో ఉంటున్న లారెల్ ఆ విషయాన్ని సంభాషణలు ప్రారంభించడానికి ఉపయోగించుకుంటుంది. వారు వచ్చిన చోటుకంటే ఆకపుల్కో చాలామట్టుకు పరదైసులా ఉందా లేదా అనీ దానిలో వారికి నచ్చినదేమిటి అనీ ప్రజలను అడుగుతుంది. ఆ తర్వాత ఆమె త్వరలోనే ఈ భూమి అంతా నిజమైన పరదైసులా మారుతుందని వివరిస్తుంది. ఈ విధమైన సంభాషణ ఆమె, ఒక పశువుల ఆసుపత్రి ఆఫీసులో కలుసుకున్న కెనడియన్ స్త్రీతో బైబిలు అధ్యయనం ప్రారంభించేందుకు నడిపించింది. మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఆ విధంగా సంభాషణ ఆరంభించడం సమర్థవంతంగా ఉంటుందా?
‘వీధుల్లో, బహిరంగ స్థలాల్లో’
“మీరు ఇంగ్లీషు మాట్లాడతారా?” అనే ప్రశ్నతో వీధుల్లోను, బహిరంగ స్థలాల్లోను తరచుగా సంభాషణ ప్రారంభమవుతుంది. చాలామంది మెక్సికన్లు తమ వృత్తి కారణంగా లేక అమెరికాలో నివసించి వచ్చిన కారణంగా ఇంగ్లీషు మాట్లాడతారు.
ఒక సాక్షుల జంట, ఒక నర్సు తోసుకువెళ్తున్న చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక వృద్ధ స్త్రీని సమీపించారు. తను ఇంగ్లీషు మాట్లాడుతుందా అని వారు ఆ స్త్రీని అడిగారు. అమెరికాలో చాలా సంవత్సరాలు ఉండడం వల్ల తను ఇంగ్లీషు మాట్లాడగలనని ఆమె జవాబిచ్చింది. అంతకుముందు తానెన్నడూ చదవని కావలికోట, తేజరిల్లు!లను ఆమె స్వీకరించింది, తన పేరు కోన్స్వెలో అని చెప్పి తన అడ్రసు కూడా ఇచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆ అడ్రసు వెతుక్కుంటూ వెళ్ళేసరికి అది క్యాథలిక్ సన్యాసినులు నడిపిస్తున్న ఒక నర్సింగ్ హోమ్ అని తెలిసింది. అక్కడి సన్యాసినులు సంశయిస్తూ, కోన్స్వెలో వారిని లోపలికి ఆహ్వానించడం కుదరదని చెప్పడంతో, కోన్స్వెలోను కలుసుకోవడం వారికి మొదట కాస్త కష్టమైంది. తాము కోన్స్వెలోను పలకరించడానికి వచ్చినట్లుగా ఆమెకు తెలియజేయమని ఆ దంపతులు వారిని బ్రతిమాలారు. కోన్స్వెలో ఆ దంపతులను లోపలికి ఆహ్వానించింది. అప్పటి నుండి ఆ 86 ఏండ్ల స్త్రీ, సన్యాసినులు ప్రతికూల వ్యాఖ్యానాలు చేసినా కూడా క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తూ ఆనందిస్తోంది. ఆమె కొన్ని క్రైస్తవ కూటాలకు కూడా హాజరైంది.
“జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది” అని సామెతలు 1:20 చెబుతోంది. అది సాన్ మిగల్ డే ఆయెండె కూడలి వద్ద ఎలా జరిగిందో గమనించండి. ఒకరోజు తెల్లవారు జామున, ఒక బెంచి మీద కూర్చున్న ఒక మధ్య వయస్కుడ్ని రాల్ఫ్ సమీపించాడు. తనకు కావలికోట, తేజరిల్లు!లు ఇవ్వడం చూసి ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయి, రాల్ఫ్‌కు తన జీవితం గురించి చెప్పాడు.
ఆయన వియత్నాంకు చెందిన మాజీ సైనికుడు, ఆయన మిలటరీలో ఉన్నప్పుడు ఎంతోమంది చనిపోవడాన్ని చూడడం వల్ల మానసిక రుగ్మతకు గురయ్యాడు. ఆయన యుద్ధరంగం నుండి క్యాంప్ బేస్‌కు పంపించబడ్డాడు. అక్కడ చనిపోయిన సైనికుల శవాలను అమెరికాకు పంపించడానికి కడిగి సిద్ధపరచడం ఆయన పని. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పీడకలలతో, భీతిగొలిపే భావాలతో
బాధపడుతున్నాడు. ఆ ఉదయం ఆ కూడలి వద్ద కూర్చొని సహాయం కోసం మౌనంగా ప్రార్థిస్తున్నాడు.ఆ మాజీ సైనికుడు ఆ సాహిత్యాలతోపాటు, రాజ్యమందిరానికి రావలసిందిగా ఇవ్వబడిన ఆహ్వానాన్ని కూడా స్వీకరించాడు. కూటానికి హాజరైన తర్వాత, రాజ్యమందిరంలో కూర్చున్న ఆ రెండు గంటల్లో తాను గత 30 సంవత్సరాల్లో పొందని ప్రశాంతతను మొదటిసారిగా పొందానని ఆయన అన్నాడు. ఆయన సాన్ మిగల్ డే ఆయెండెలో రెండు వారాలే ఉన్నాడు, అయినా పలుసార్లు బైబిలు అధ్యయనాలు చేశాడు, ఇంటికి తిరిగి వెళ్ళేంతవరకు అన్ని కూటాలకు హాజరయ్యాడు. ఆయన అధ్యయనం కొనసాగేందుకు కావలసిన ఏర్పాట్లు చేయబడ్డాయి.
ఉద్యోగ స్థలంలో, స్కూల్లో అనియత సాక్ష్యమివ్వడం
మీరు ఒక యెహోవాసాక్షి అని మీ సహోద్యోగులకు తెలుసా? కేప్ సాన్ లూకాస్‌లో సెలవులు గడపడానికి వచ్చేవారికి అపార్టుమెంట్స్ విక్రయించే ఆడ్రియన్ అలాగే తనను పరిచయం చేసుకుంటాడు. దాని ఫలితమేమిటో ఆయన సహోద్యోగురాలు జూడీ ఇలా చెబుతోంది: “కేవలం మూడు సంవత్సరాల క్రితం, నేను యెహోవాసాక్షిని అవుతానని మీరు నాతో చెప్పివుంటే, ‘అదెన్నటికీ జరగని విషయం!’ అని నేను అని ఉండేదాన్ని. కానీ నేను బైబిలు చదవాలని నిర్ణయించుకున్నాను. ‘నాకు చదవడం అంటే ఇష్టం కాబట్టి, అదంత కష్టమేమీ కాదు’ అని అనుకున్నాను. అయితే అయిదారు పేజీలు పూర్తికాకముందే నాకు సహాయం అవసరం అని గ్రహించాను. అప్పుడు నా మనసులో మెదిలింది నా సహోద్యోగి అయిన ఆడ్రియన్ మాత్రమే. అక్కడున్నవారిలో ఆయనొక్కడే నిజంగా మర్యాదస్థుడిగా ఉంటాడు కాబట్టి నేను ఆయనతో మాట్లాడాలనుకున్నాను.” దానికి ఆడ్రియన్ తను పెళ్ళి చేసుకోబోయే కాటీథీతో వచ్చి జూడీ ప్రశ్నలన్నిటికీ జవాబులివ్వడానికి సత్వరమే ఒప్పుకున్నాడు. కాటీథీ ఆమెతో బైబిలు అధ్యయనం ప్రారంభించింది, ఆ తర్వాత కొద్దికాలానికే జూడీ బాప్తిస్మం పొందిన ఒక సాక్షి అయ్యింది.
స్కూల్లో అనియత సాక్ష్యమివ్వడం విషయం ఏమిటి? ఇద్దరు సాక్షులు స్పానిష్ పాఠాల కోసం విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు, అయితే ఒకరోజు క్రైస్తవ సమావేశానికి హాజరవడం వల్ల వారు తరగతికి హాజరుకాలేదు. వారు తిరిగి తరగతికి వెళ్ళినప్పుడు, ఆ రోజు వారేమి చేశారో స్పానిష్‌లో చెప్పమని అడిగారు. వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమకు తెలిసిన స్పానిష్లోనే మంచి సాక్ష్యమిచ్చారు. బైబిలు ప్రవచనాలపై వాళ్ళ టీచర్ సిల్వియాకు చాలా ఆసక్తి ఉంది. ఆమె ఇంగ్లీషులో బైబిలు అధ్యయనాన్ని అంగీకరించింది, ఇప్పుడు ఆమె ఒక సువార్త ప్రచారకురాలు. ఆమె కుటుంబ సభ్యులు కూడా కొందరు అధ్యయనం చేస్తున్నారు. సిల్వియా ఇలా అంటోంది: “నా జీవితమంతటిలో నేను వెదికినది నేను పొందాను.” అవును అనియత సాక్ష్యం మంచి ఫలితాలను ఇవ్వగలదు.
ఇతర అవకాశాలను ఉపయోగించుకోవడం
ఆతిథ్యమిచ్చే స్వభావం కూడా సాక్ష్యమివ్వడానికి నడిపించగలదు. సొనోరాలోని సాన్ కార్లొస్లో సేవ చేస్తున్న జిమ్, గేల్లు అది నిజమని తెలుసుకున్నారు. ఒక స్త్రీ ఉదయం 6 గంటలకు తన కుక్కలను బయట తిప్పుతూ, ముచ్చటగా ఉన్న వారి పెరటిని చూస్తూ అక్కడే నిలబడిపోయింది. అది చూసిన జిమ్, గేల్లు కాఫీ తాగడానికి ఆమెను లోనికి ఆహ్వానించారు. ఆమె తన 60 ఏండ్లలో యెహోవా గురించి, నిత్యజీవపు ఉత్తరాపేక్ష గురించి మొదటిసారిగా విన్నది. బైబిలు అధ్యయనం ఆరంభించబడింది.
ఏడ్రియన్ అదేవిధంగా అపరిచితులను ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆమె కాన్కున్లోని ఒక రెస్టారెంటులో భోజనం చేస్తున్నప్పుడు, ఒక అబ్బాయి వచ్చి మీరు కెనడా నుండి వచ్చారా అని అడిగాడు. ఆమె అవునని చెప్పగానే, కెనడియన్ల మీద తన చెల్లెలు ఒక స్కూలు నివేదిక సిద్ధం చేస్తోందని ఆమెకు సహాయం చేయడానికి, నేనూ మా అమ్మ ప్రయత్నిస్తున్నామని వివరించాడు. అంతలో ఇంగ్లీషు మాట్లాడగల వాళ్ళ అమ్మ ఆమె దగ్గరకు వచ్చింది. కెనడియన్ల గురించి వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా జవాబిచ్చిన తర్వాత, ఏడ్రియన్ ఇలా అన్నది: “కానీ నేను కెనడా నుండి ఇక్కడకు రావడంలో చాలా ముఖ్యమైన కారణముంది, అదేమిటంటే బైబిలు గురించి తెలుసుకోవడంలో ప్రజలకు సహాయం చేయడం. మీకు బైబిలు గురించి తెలుసుకోవడం ఇష్టమేనా?” తనకు ఇష్టమేనని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె తన చర్చి వదిలేసి పది సంవత్సరాలైంది, అప్పటి నుండి తనే స్వయంగా బైబిలు అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఏడ్రియన్‌కు తన ఫోన్ నంబర్, అడ్రస్ ఇచ్చింది, ఆ తర్వాత ఒక ఫలవంతమైన బైబిలు అధ్యయనం ప్రారంభమైంది.
“నీ ఆహారమును నీళ్లమీద వేయుము”
బైబిలు సత్యం గురించి ప్రతి సందర్భంలో మాట్లాడడం, రాజ్య సందేశం వినే అవకాశం తక్కువగా ఉన్నవారికి లేదా అసలే లేనివారికి సాక్ష్యమిచ్చే అవకాశమిస్తుంది. ఓడరేవుగల సివాటానెకో నగరంలో రద్దీగా ఉండే ఒక హోటల్లో, ఇద్దరు విదేశీయులు సీట్ల కోసం చూడడాన్ని గమనించిన ఒక సాక్షి తన టేబిల్ వద్ద కూర్చొమ్మని వారిని ఆహ్వానించింది. ఆ జంట ఏడు సంవత్సరాలుగా ఒక చోట నుండి మరోచోటుకు ఓడ ప్రయాణం చేస్తున్నారు. వారు యెహోవాసాక్షుల గురించి తమ ప్రతికూల భావాలను వ్యక్తం చేశారు. ఆ హోటల్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ సాక్షి, వారుంటున్న పడవలో వారిని సందర్శించి తనింటికి ఒకసారి రమ్మని ఆహ్వానించింది. వారు 20 కంటే ఎక్కువ పత్రికలను, 5 పుస్తకాలను తీసుకున్నారు, తమ తదుపరి మజిలీలో సాక్షులను కలుసుకుంటామని వాగ్దానం చేశారు.
జెఫ్, డెబ్లు కాన్కున్లోని ఒక షాపింగ్ సెంటర్లోని ఫుడ్ కోర్టులో అందమైన పాపతో ఉన్న ఒక కుటుంబాన్ని గమనించారు. వారు ఆ పాప గురించి వ్యాఖ్యానించినప్పుడు, ఆ పాప తల్లిదండ్రులు తమతోపాటు పిజ్జా తినమని వారిని ఆహ్వానించారు. ఆ కుటుంబం భారతీయులని తెలిసింది. వారు యెహోవాసాక్షుల గురించి ఎన్నడూ వినలేదు, మన సాహిత్యాలను చూడలేదు. వారు ఆ షాపింగ్ సెంటర్ నుండి వెళ్ళేటప్పుడు సాక్షుల సాహిత్యాల్లో కొన్నింటిని తీసుకెళ్ళారు.
ఇలాంటి సంఘటనే యూకటాన్ సముద్రతీరంలోని ఒక ద్వీపంలో జరిగింది. కొత్తగా పెళ్ళయిన ఒక చైనీస్ దంపతులు తమ ఫోటోలు తీయమని జెఫ్‌ను కోరారు, ఆయన ఫోటోలు తీయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. వారు గత 12 సంవత్సరాల నుండి అమెరికాలో ఉంటున్నప్పటికీ యెహోవాసాక్షులను చూడడం గానీ, వారి గురించి వినడం గానీ జరగలేదని ఆయన తెలుసుకున్నాడు! వారి మధ్య ఆహ్లాదకరమైన సంభాషణ కొనసాగింది. వారు ఇంటికి తిరిగి వెళ్ళాక సాక్షుల కోసం చూడమని జెఫ్ వారిని ప్రోత్సహించాడు.
మీ ప్రాంతంలోని ఏదైనా ప్రత్యేక సంఘటన, మీరు అనియత సాక్ష్యమిచ్చేందుకు అవకాశం ఇవ్వవచ్చు. అమెరికా అధ్యక్షుడు, గువానజువాటొ సమీపానున్న మెక్సికో అధ్యక్షుని పశుపాలనా క్షేత్రంలో ఆయనను సందర్శించడానికి వచ్చినప్పుడు, దాని కథనం కోసం ప్రపంచ నలుమూలల నుండి పత్రికా విలేఖరులు వచ్చారు. ఇంగ్లీషులో ప్రకటించడానికి ఒక సాక్షి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రతిస్పందన సానుకూలంగా ఉంది. ఉదాహరణకు ఒక రిపోర్టర్, కొసావో, కువైట్‌లో జరిగినటువంటి పలు యుద్ధాల వార్తలు సేకరించాడు. తన సహోద్యోగి ఒకాయన, చాటు నుండి కాల్చిన ఒక సైనికుని తూటాకు గురై తన చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఆ విలేఖరి పునరుత్థానం గురించి విన్న తర్వాత, జీవితానికి ఒక సంకల్పం ఉందనే విషయాన్ని తెలుసుకునే అవకాశం తనకు కలిగించినందుకు దేవునికి కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సాక్షి జంటను తాను మళ్ళీ చూడలేకపోయినా, బైబిల్లోని ఆ సువార్తను తన హృదయంలో ఉంచుకొని వెళ్తానని ఆయన అన్నాడు.
పైన చూసినవాటిని బట్టి, ఇలా సాక్ష్యమివ్వడం వల్ల చివరకు ఎలాంటి ఫలితం ఉంటుందో తరచూ తెలియదు. అయినప్పటికీ జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఇలా అన్నాడు: “నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.” ఆయన ఇంకా ఇలా కూడా అన్నాడు: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” (ప్రసంగి 11:1, 6) అవును పౌలు, యేసు, ఈ ఆధునిక దినపు సాక్షులు మెక్సికోలోని ఇంగ్లీషు మాట్లాడే క్షేత్రంలో చేసినట్లే మీరూ ‘మీ ఆహారమును’ ఆసక్తితో ‘నీళ్ళమీద వేయండి’, ‘విత్తనమును’ సమృద్ధిగా ‘విత్తండి.’