కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒకరినొకరు బలపరచుకోండి

ఒకరినొకరు బలపరచుకోండి

ఒకరినొకరు బలపరచుకోండి

‘వీరు నన్ను బలపరచే సహాయకమయ్యారు.’​కొలొస్సయులు 4:​11, Nw.

మీస్నేహితుడు అన్యాయంగానే జైల్లో వేయబడినప్పటికీ, జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఆ వ్యక్తికి స్నేహితునిగా ఉండడం ప్రమాదకరం కావచ్చు. జైలు అధికారులు మిమ్మల్ని అనుమానిస్తూ, మీరెలాంటి నేరానికీ పాల్పడడం లేదని రూఢి చేసుకోవడానికి మీ ప్రతీ కదలికను జాగ్రత్తగా కనిపెట్టవచ్చు. అందువల్ల, జైల్లోవున్న మీ స్నేహితునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికీ, అతణ్ణి సందర్శించడానికీ ధైర్యం కావాలి.

2 అయినప్పటికీ, దాదాపు 1,900 సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు స్నేహితులు కొందరు ఖచ్చితంగా అలాగే చేశారు. పౌలుకు అవసరమైన ఆదరణ, ప్రోత్సాహమిచ్చి ఆయనను ఆధ్యాత్మికంగా బలపరచేందుకు చెరసాలలోవున్న ఆయనను సందర్శించడానికి వారు వెనుకాడలేదు. ఈ యథార్థ స్నేహితులు ఎవరు? వారి ధైర్యం, యథార్థత, స్నేహం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?​—⁠సామెతలు 17:17.

‘బలపరచే సహాయకం’

3 మనం వెనక్కి సా.శ. 60వ సంవత్సరానికి వెళదాం. రాజ ద్రోహానికి పాల్పడ్డాడనే అబద్ధ ఆరోపణపై అపొస్తలుడైన పౌలు రోములో బందీగా ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 24:5; 25:​11, 12) తన పక్షాన నిలబడిన ఐదుగురు క్రైస్తవులను పౌలు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వారిలో, ఆసియకు చెందిన తన వ్యక్తిగత దూతగా, ‘ప్రభువునందు తోడి సేవకునిగా’ ఉన్న తుకికు; కొలొస్సయి నుండి వచ్చిన “నమ్మకమైన ప్రియసహోదరుడైన” ఒనేసిము; థెస్సలొనీక నుండి వచ్చిన మాసిదోనియ వాడును, పౌలుతోపాటు ఒక సందర్భంలో “చెరలో ఉన్న” అరిస్తార్కు; పౌలు మిషనరీ సహవాసియైన బర్నబాకు సమీపజ్ఞాతి, తన పేరుమీదున్న సువార్త రచయిత అయిన మార్కు; “దేవుని రాజ్యము నిమిత్తము” అపొస్తలుని జత పనివారిలో ఒకడైన యూస్తు అను వారు ఉన్నారు. ఆ ఐదుగురి గురించి పౌలు ఇలా చెబుతున్నాడు: ‘వీరు నన్ను బలపరచే సహాయకమయ్యారు.’​—⁠కొలొస్సయులు 4:​7-11, NW.

4 తన యథార్థ స్నేహితులు తనకుచేసిన సహాయం గురించి పౌలు శక్తిమంతమైన వాఖ్యానం చేశాడు. ఇక్కడ ‘బలపరచే సహాయకం’ అని అనువదించబడిన గ్రీకు పదాన్ని (పారీగోరియా) ఆయన ఉపయోగించాడు, బైబిల్లో కేవలం ఈ వచనంలోనే ఆ పదం కనబడుతుంది. ఈ పదానికి ఇంకా చాలా అర్థాలున్నాయి, ప్రత్యేకంగా ఇది వైద్య సంబంధంగా ఉపయోగించబడింది. * దీనిని ‘ఊరట, ఉపశమనము, ఓదార్పు లేదా సహాయం’ అని అనువదించవచ్చు. పౌలును అలా బలపరచడం అవసరమైంది, ఆ ఐదుగురు మనుష్యులు ఆయనను బలపరిచారు.

పౌలుకు ‘బలపరచే సహాయకం’ ఎందుకు అవసరమైంది

5 అపొస్తలునిగావున్న పౌలును బలపరచడం అవసరమైందనే ఆలోచన కొందరిని ఆశ్చర్యపరచవచ్చు. అయితే అదాయనకు అవసరమైంది. నిజమే, పౌలుకు బలమైన విశ్వాసముంది, పైగా ఆయన ‘అపరిమితమైన దెబ్బలు, అనేకమారులు ప్రాణాపాయ పరిస్థితులు’ ఇతర విధాలైన శ్రమలవంటి శారీరక హింసల నుండి బ్రతికి బయటపడ్డాడు. (2 కొరింథీయులు 11:​23-27) అయినా, ఆయన కూడా ఒక మనిషే, ఏదోక సందర్భంలో మనుష్యులందరికీ ఇతరుల సహాయంవల్ల ఓదార్పు పొందడం, విశ్వాసం బలపరచబడడం అవసరమవుతుంది. చివరకు యేసు విషయంలో కూడా ఇది నిజమని నిరూపించబడింది. ఆయనకు తన చివరి రాత్రి గెత్సేమనేలో ఒక దేవదూత కనబడి ఆయనను “బలపర[చాడు].”​—⁠లూకా 22:43.

6 అదే విధంగా పౌలును కూడా బలపరచడం అవసరమైంది. రోముకు ఆయన ఖైదీగా వచ్చినప్పుడు, తన సొంత ప్రజలే ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించలేదు. ఆ యూదుల్లో అత్యధికులు రాజ్య సందేశాన్ని పట్టించుకోలేదు. యూదుల్లోని ముఖ్యులు పౌలు బంధించబడిన చోటికి వచ్చి ఆయనను సందర్శించిన తర్వాత, ఏమి జరిగిందో అపొస్తలుల కార్యములలోని వృత్తాంతమిలా చెబుతోంది: “అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున . . . వారు వెళ్లిపోయిరి.” (అపొస్తలుల కార్యములు 28:​17, 24, 25) యెహోవా కృపపట్ల వారికి ప్రశంస లేకపోవడం చూసి పౌలు ఎంతగా నొచ్చుకొని ఉంటాడో కదా! ఈ విషయంలో ఆయనకు కలిగిన బాధాకరమైన భావాలు ఆయన కొద్ది సంవత్సరాల ముందు రోములో ఉన్న సంఘానికి వ్రాసిన ఉత్తరంలో స్పష్టంగా కనబడతాయి. “నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల [యూదుల] కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును” అని ఆయన వ్రాశాడు. (రోమీయులు 9:​1, 3) అయినప్పటికీ, రోములో ఆయనకు యథార్థమైన, నిజ సహవాసులు లభించారు, వారి ధైర్యం, అనురాగం ఆయనకు ఉపశమనమిచ్చాయి. వారాయన నిజమైన ఆధ్యాత్మిక సహోదరులు.

7 ఆ ఐదుగురు సహోదరులు తాము ‘బలపరచే సహాయకంగా’ ఉన్నామని ఎలా నిరూపించుకున్నారు? పౌలు చెరసాల బంధకాలు, తమను ఆయన నుండి దూరంగా వెళ్లిపోయేలా చేయడాన్ని వారు అనుమతించలేదు. బదులుగా, పౌలు బంధించబడి ఉన్నందున తాను స్వయంగా చేసుకోలేకపోతున్న పనులు ఆయనకు చేసిపెడుతూ వారు ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆయనకు తమ వ్యక్తిగత సేవలందించారు. ఉదాహరణకు, వారాయన దూతలుగా పనిచేస్తూ పౌలు ఉత్తరాలను, మౌఖిక ఆదేశాలను వివిధ సంఘాలకు అందజేశారు; రోమాలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న సహోదరుల సంక్షేమం గురించిన ప్రోత్సాహకరమైన నివేదికలు పౌలుకు వినిపించారు. వారు బహుశా ఆయనకు కావలసినవి అంటే శీతాకాల దుస్తులు, గ్రంథపు చుట్టలు, వ్రాత పరికరాలు సమకూర్చారు. (ఎఫెసీయులు 6:21, 22; 2 తిమోతి 4:​11-13) అలాంటి సహాయకరమైన పనులన్నీ ఖైదీగావున్న అపొస్తలుణ్ణి బలపరచి ప్రోత్సహించాయి, అందువల్ల ఆయన, తిరిగి సంఘాలన్నిటితోపాటు ఇతరులకు ‘బలపరచే సహాయకంగా’ ఉండగలిగాడు.​—⁠రోమీయులు 1:11, 12.

‘బలపరచే సహాయకంగా’ ఉండడం

8 పౌలు, ఆయన ఐదుగురు జతపనివాళ్ల వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ప్రత్యేకంగా మనం ఒక పాఠాన్ని చూద్దాం. అదేమిటంటే, మనం ఇతరులకు వారి విపద్దశలో సహాయం చేయాలంటే దానికి ధైర్యం, స్వయం త్యాగం అవసరం. అంతేకాకుండా, వ్యక్తిగతంగా విపద్దశలో ఉన్న సమయాల్లో మనకు సహాయం అవసరమని అంగీకరించడానికి వినయం అవసరం. తనకు సహాయం అవసరమని పౌలు అంగీకరించడమే కాకుండా, ఆయన అలాంటి సహాయాన్ని కృతజ్ఞతాభావంతో అంగీకరించి, తనకా సహాయంచేసిన వారిని మెచ్చుకున్నాడు. ఇతరుల నుండి సహాయం తీసుకోవడాన్ని ఆయన ఒక బలహీనతగా లేదా తనకు అవమానంగా దృష్టించలేదు, మనం కూడా ఆ విధంగా దృష్టించకూడదు. మనకెప్పటికీ బలపరచే సహాయం అవసరమే ఉండదనడం మనం మానవాతీతులమనే భావమిస్తుంది. పరిపూర్ణ మానవుడు కూడా కొన్నిసార్లు సహాయం కోసం అర్థించడం అవసరమని యేసు ఉదాహరణ చూపిస్తోందని మరచిపోకండి.​—⁠హెబ్రీయులు 5:7.

9 బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు తమకూ పరిమితులున్నాయని, తాము కూడా ఇతరుల మద్దతుపై ఆధారపడి ఉన్నామని అంగీకరించడంవల్ల సత్ఫలితాలు రాగలవు. (యాకోబు 3:⁠2) అలా అంగీకరించడం అధికారంలో ఉన్నవారికి, అధికారానికి లోబడే వారికి మధ్యగల బంధాన్ని బలపరచి, స్నేహపూర్వకమైన, నిర్మొహమాట సంభాషణను పురికొల్పుతుంది. సహాయం అంగీకరించడానికి ఇష్టపడే వారి వినయం, అలాంటి స్థితిలోనేవున్న ఇతరులకు వస్తుపాఠంగా పనిచేస్తుంది. అది, సారధ్యం వహించేవారు మామూలు మనుష్యులేననీ, సమీపించదగిన వారేననీ చూపిస్తుంది.​—⁠ప్రసంగి 7:20.

10 ఉదాహరణకు, తమ తల్లిదండ్రులు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు తమలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారని పిల్లలు గ్రహించినప్పుడు తమ సమస్యలతో వ్యవహరించడానికి తల్లిదండ్రుల సహాయాన్ని అంగీకరించడం వారికి సులభంగా ఉంటుంది. (కొలొస్సయులు 3:​21) ఆ విధంగా పిల్లవానికి తల్లికి/తండ్రికి మధ్య సంభాషణా ద్వారాలు తెరచుకుంటాయి. మరింత ఫలవంతంగా లేఖన పరిష్కారాలు పంచుకొని, సంసిద్ధంగా వాటిని అంగీకరించే అవకాశముంది. (ఎఫెసీయులు 6:⁠4) అదే ప్రకారం, పెద్దలకు కూడా సమస్యలు, భయాలు, కలతలు ఉంటాయని సంఘస్థులు గ్రహించినప్పుడు వారు పెద్దలిచ్చే సహాయం అందుకోవడానికి మరింత సంసిద్ధంగా ఉంటారు. (రోమీయులు 12:3; 1 పేతురు 5:⁠3) అలాగే, వారిమధ్య మంచి సంభాషణ కొనసాగుతుంది, లేఖనాధారిత సలహాలు పంచుకోవడం జరుగుతుంది, తద్వారా విశ్వాసం బలపరచబడుతుంది. క్రితమెన్నటికంటే ఇప్పుడే మన సహోదర సహోదరీలను బలపరచడం అవసరమని మరచిపోకండి.​—⁠2 తిమోతి 3:1.

11 మనమెక్కడ నివసిస్తున్నా, మనమెవరిమైనా లేదా మన వయస్సు ఎంతైనా మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒత్తిళ్లను ఎదుర్కొంటాం. నేటి లోకంలో ఇది ఒక భాగమైపోయింది. (ప్రకటన 12:​12) భౌతికంగా లేదా భావోద్రేకంగా కలవరపరిచే అలాంటి పరిస్థితులు మన విశ్వాస నాణ్యతను పరీక్షిస్తాయి. ఉద్యోగ స్థలంలో, పాఠశాలలో, కుటుంబంలో లేదా సంఘంలో కష్టభరితమైన పరిస్థితులు తలెత్తవచ్చు. ప్రమాదకరమైన వ్యాధి లేదా మానసిక ఆందోళన అలాంటి ఒత్తిడికి కారణం కావచ్చు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు, ఒక పెద్ద లేదా ఒక స్నేహితుడు ఆలోచనాపూర్వకమైన మాటలతో, సహాయకరమైన క్రియలతో ప్రోత్సహించినప్పుడు, అదెంత ఓదార్పుకరంగా ఉంటుందో కదా! అది చర్మానికి ఉపశమనమిచ్చే పూతమందులా ఉంటుంది. అందువల్ల, మీ సహోదరుల్లో ఎవరైనా అలాంటి పరిస్థితిలోవున్నట్లు మీరు గమనించినప్పుడు, అతనిని బలపరచే సహాయకంగా ఉండండి. లేదా కలవరపెడుతున్న సమస్య ప్రత్యేకంగా మిమ్మల్ని కృంగదీస్తుంటే, ఆధ్యాత్మిక యోగ్యతగల వారి సహాయం కోరండి.​—⁠యాకోబు 5:14, 15.

సంఘమెలా సహాయం చేయవచ్చు

12 యౌవనులతోసహా సంఘంలోని వారందరూ ఇతరులను బలపరచడానికి ఏదో ఒకటి చేయవచ్చు. ఉదాహరణకు, మీరు క్రమంగా కూటాలకు హాజరు కావడం, క్షేత్రసేవకు వెళ్లడం ఇతరుల విశ్వాసాన్ని బలపరచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. (హెబ్రీయులు 10:​24, 25) పవిత్రసేవలోని మీ స్థిరత్వం యెహోవాపట్ల మీ విశ్వాస్యతకు రుజువుగా ఉండడంతోపాటు, మీకున్న కష్టాల మధ్యనూ మీరు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నారనీ చూపిస్తుంది. (ఎఫెసీయులు 6:​18) అలాంటి స్థిరత్వం ఇతరులను బలపరిచేలాంటి ప్రభావం చూపగలదు.​—⁠యాకోబు 2:18.

13 కొన్నిసార్లు, జీవితపు ఒత్తిళ్లు లేదా ఇతర ఇబ్బందులు కొందరు క్షేత్రసేవలో వెనుకబడడానికి లేదా నిష్క్రియులుగా మారడానికి దారితీయవచ్చు. (మార్కు 4:​18, 19) సంఘ కూటాల్లో మనకు నిష్క్రియులు కనబడకపోవచ్చు. అయినప్పటికీ వారికి దేవునిపట్ల తమ హృదయాల్లో బహుశా ఇంకా ప్రేమ ఉండవచ్చు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఏమి చేయవచ్చు? వారిని సందర్శించడం ద్వారా పెద్దలు దయాపూర్వక సహాయం అందించవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:​35) సహాయం చేయమని ఇతర సంఘ సభ్యులను కూడా అడగవచ్చు. ఆ విధమైన ప్రేమపూర్వక సందర్శనాలు విశ్వాసంలో బలహీనంగావున్న వారిని ఉత్తేజపరచడానికి సరైన మందులా పనిచేస్తాయి.

14 “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి” అని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (1 థెస్సలొనీకయులు 5:​14) బహుశా ఆ ‘ధైర్యము చెడినవారు’ తమ ధైర్యం సన్నగిల్లుతున్నట్లు, సహాయహస్తం లేకుండా తాము అడ్డంకులను అధిగమించలేమని భావిస్తుండవచ్చు. మీరు ఆ సహాయహస్తం అందించగలరా? “బలహీనులకు ఊత నియ్యుడి” అనే మాటలు, బలహీనులను “హత్తుకొని ఉండండి” లేదా “అంటిపెట్టుకొని ఉండండి” అని అనువదించబడ్డాయి. యెహోవా తన గొర్రెలన్నింటినీ విలువైనవిగా పరిగణిస్తూ వాటిని ప్రేమిస్తున్నాడు. ఆయన వారిని అల్పులుగా దృష్టించడు, పైగా వారిలో ఎవ్వరూ కొట్టుకొనిపోకూడదని ఆయన కోరుతున్నాడు. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారు బలంగా తయారయ్యే పర్యంతం వారికి సంఘం “హత్తుకొని” ఉండడానికి మీరు చేయూతనివ్వగలరా?​—⁠హెబ్రీయులు 2:1.

15 ఆరు సంవత్సరాల నుండి క్రియా రహితంగా ఉన్న ఒక వివాహ జంటను ఒక పెద్ద సందర్శించాడు. ఆ పెద్ద ఇలా వ్రాస్తున్నాడు: “సంఘమంతా వారిపట్ల చూపిన దయగల ప్రేమపూర్వక శ్రద్ధ వారు మళ్లీ మందలో తిరిగిచేరేంత అద్భుతమైన ప్రభావాన్ని వారిపై చూపింది.” ఒకప్పుడు నిష్క్రియురాలిగా మారిన సహోదరి సంఘ సభ్యుల సందర్శనాల విషయమై ఎలా భావించింది? ఆమె ఇప్పుడిలా చెబుతోంది: “మమ్మల్ని సందర్శించిన సహోదరులు గానీ వారితోపాటువచ్చిన సహోదరీలు గానీ మమ్ములను నిందాత్మకంగా చూడకపోవడం లేదా మాపట్ల ఆక్షేపణా దృక్పథం కనబరచకపోవడమే మేము మళ్లీ క్రియాత్మకంగా తయారుకావడానికి మాకు సహాయం చేసింది. బదులుగా వారు మమ్మల్ని అర్థంచేసుకొని, తగిన లేఖనాధారిత ప్రోత్సాహం అందించారు.”

16 అవును, ఇతరులను బలపరచే సహాయకంగా ఉండడానికి యథార్థ క్రైస్తవుడు ఆనందిస్తాడు. అలాగే మన జీవితాల్లో పరిస్థితులు మారుతుండగా, మనం ధైర్యంగా ఉండడానికి, మన సహోదరులే మనల్ని బలపరచవలసిన అవసరం ఏర్పడవచ్చు. అయితే, ఎలాంటి మానవ సహాయం అందుబాటులోలేని పరిస్థితివచ్చే అవకాశముంది. అలాంటప్పుడు కూడా, బలానికి మూలాధారంగా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే, అన్ని సందర్భాల్లో సహాయం చేయడానికి ఇష్టపడే యెహోవా దేవుడు మనకున్నాడు.​—⁠కీర్తన 27:10.

యెహోవాయే బలానికి తిరుగులేని మూలాధారం

17 మేకులతో హింసాకొయ్యకు కొట్టబడిన యేసు, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా[ను]” అని బిగ్గరగా కేకవేశాడు. (లూకా 23:​46) ఆ తర్వాత ఆయన చనిపోయాడు. కేవలం కొద్ది గంటల ముందు ఆయన చెర పట్టబడినప్పుడు, ఆయన సన్నిహిత స్నేహితులు ఆయనను విడిచిపెట్టి, భయంతో పారిపోయారు. (మత్తయి 26:​56) బలానికి ఏకైక మూలాధారమైన తన పరలోక తండ్రితప్ప వేరెవ్వరూలేక యేసు ఒక్కడే మిగిలిపోయాడు. అయినప్పటికీ, యెహోవాపై ఆయనకున్న నమ్మకం వమ్ముకాలేదు. తండ్రిపట్ల యేసుకున్న యథార్థతకు ప్రతిఫలంగా యెహోవా యథార్థ మద్దతు ఆయనకు లభించింది.​—⁠కీర్తన 18:25; హెబ్రీయులు 7:26.

18 భూమ్మీద యేసు చేసిన పరిచర్యా కాలమంతటిలో, యెహోవా తన కుమారుడు తుది శ్వాసవిడిచే వరకు యథార్థత కాపాడుకోవడానికి అవసరమైనది ఆయనకు అందించాడు. ఉదాహరణకు, తన పరిచర్యారంభానికి గుర్తుగా యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే, తండ్రి తన ఆమోదాన్ని, తన ప్రేమను వ్యక్తం చేయడం ఆయన విన్నాడు. యేసుకు మద్దతు అవసరమైనప్పుడు, ఆయనను బలపరచేందుకు యెహోవా దేవదూతలను పంపించాడు. యేసు తన భూజీవిత ముగింపులో మహాగొప్ప పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, ఆయన చేసిన యాచనలను, విన్నపాలను యెహోవా అనుగ్రహపూర్వకంగా విన్నాడు. నిశ్చయంగా ఇవన్నీ యేసును బలపరచే సహాయకంగా ఉన్నాయి.​—⁠మార్కు 1:11, 13; లూకా 22:​43.

19 మనలను కూడా బలపరచే ముఖ్యమైన ఆధారంగా ఉండాలని యెహోవా ఇష్టపడుతున్నాడు. (2 దినవృత్తాంతములు 16:⁠9) యావత్‌ అధికశక్తికి, బలాతిశయానికి నిజమైన మూలాధారమైన యెహోవా మనకు సహాయం అవసరమైన ఘడియలో మనల్ని బలపరచే సహాయకంగా ఉండగలడు. (యెషయా 40:​26) యుద్ధం, దారిద్ర్యం, వ్యాధి, మరణం లేదా మన సొంత అపరిపూర్ణతలు మనపై భరించలేని ఒత్తిడిని తీసుకురావచ్చు. ‘బలమైన పగవారిలా’ జీవన పరీక్షలు మనలను ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడు, యెహోవాయే మన బలముగా, రక్షణగా ఉండగలడు. (కీర్తన 18:17; నిర్గమకాండము 15:⁠2) మనకోసం ఆయన దగ్గర బలమైన ఉపకరణం అంటే పరిశుద్ధాత్మ ఉంది. ‘పక్షిరాజులా రెక్కలు చాపి పైకి ఎగరగలిగేలా,’ యెహోవా తన ఆత్మ ద్వారా, ‘సొమ్మసిల్లినవారికి బలమిస్తాడు.’​—⁠యెషయా 40:29, 31.

20 దేవుని ఆత్మ సమస్త విశ్వంలో అత్యంత బలమైన శక్తి. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని పౌలు చెప్పాడు. అవును, మన ప్రేమగల పరలోకపు తండ్రి ఇప్పుడు ఎంతో సమీపంలో ఉన్న తన వాగ్దత్త పరదైసులో “సమస్తమును నూతనమైనవిగా” చేసేవరకు మనం సమస్త బాధాకరమైన సమస్యలను తాళుకోవడానికి మనకు “బలాధిక్యము” అనుగ్రహించగలడు.​—⁠ఫిలిప్పీయులు 4:13; 2 కొరింథీయులు 4:7; ప్రకటన 21:4, 5.

[అధస్సూచి]

^ పేరా 7 డబ్ల్యు. ఇ. వైన్‌ రచించిన, వైన్స్‌ కంప్లీట్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ఇలా చెబుతోంది: [పారీగోరియా] అనే పదంయొక్క క్రియార్థక రూపం నొప్పిని ఉపశమింపజేసే మందులను సూచిస్తుంది.

మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా?

రోములోని సహోదరులు పౌలును ‘బలపరచే సహాయకంగా’ ఎలా ఉన్నారు?

సంఘంలో మనం ఏయే విధాలుగా ‘బలపరచే సహాయకంగా’ ఉండవచ్చు?

యెహోవా ఎలా మనకు తిరుగులేని బలాధారముగా ఉన్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ప్రమాదాలు ఉన్నప్పటికీ పౌలు స్నేహితులు చెరసాలలో ఆయనను ఎందుకు సందర్శించారు?

3, 4. (ఎ) పౌలు ఐదుగురు స్నేహితులు ఎవరు, ఆయనకు వారెలాంటి వారయ్యారు? (బి) ‘బలపరచే సహాయకం’ అంటే ఏమిటి?

5. పౌలు అపొస్తలుడైనప్పటికీ ఆయనకు ఏమి అవసరమైంది, మనందరికీ అప్పుడప్పుడూ ఏమి అవసరం?

6, 7. (ఎ) రోములో పౌలును ఎవరు నిరుత్సాహపరిచారు, ఎవరు ప్రోత్సహించారు? (బి) పౌలుయొక్క క్రైస్తవ సహోదరులు తాము ‘బలపరచే సహాయకంగా’ ఉన్నామని నిరూపించుకుంటూ, రోములో ఆయనకు ఎలాంటి సేవలందించారు?

8. ‘బలపరచే సహాయపు’ అవసరాన్ని పౌలు వినయంగా అంగీకరించడం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

9, 10. తనకు సహాయం అవసరమనే విషయాన్ని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఎలాంటి సత్ఫలితం కలుగవచ్చు, కుటుంబంలో మరియు సంఘంలో ఇతరులపై ఇదెలాంటి ప్రభావం చూపవచ్చు?

11. నేడు అనేకులు ‘బలపరచే సహాయకం’ అవసరమైన స్థితిలో ఎందుకు ఉన్నారు?

12. తన సహోదరులను బలపరచడానికి సంఘంలోని ప్రతీ ఒక్కరు ఏమిచేయవచ్చు?

13. కొందరెందుకు నిష్క్రియులుగా మారతారు, వారికి సహాయం చేసేందుకు ఏమిచేయవచ్చు?

14, 15. ఇతరులను బలపరచే విషయంలో పౌలు ఎలాంటి ఉపదేశమిచ్చాడు? ఆయన ఉపదేశాన్ని అన్వయించుకున్న ఒక సంఘంయొక్క ఉదాహరణ చెప్పండి.

16. బలపరచడం అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎవరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు?

17, 18. యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును ఏయే విధాలుగా బలపరచాడు?

19, 20. మనకు సహాయం అవసరమైన సమయంలో యెహోవా మనకు బలమిస్తాడని మనమెలా నమ్మకంతో ఉండవచ్చు?

[18వ పేజీలోని చిత్రం]

యథార్థ మద్దతు, ప్రోత్సాహం, వ్యక్తిగత సేవలు అందించడం ద్వారా సహోదరులు పౌలుకు ‘బలపరచే సహాయకంగా’ ఉన్నారు

[21వ పేజీలోని చిత్రం]

మందను బలపరచడంలో పెద్దలు నాయకత్వం వహిస్తారు