కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తటస్థ వైఖరి క్రైస్తవ ప్రేమను అడ్డగిస్తుందా?

తటస్థ వైఖరి క్రైస్తవ ప్రేమను అడ్డగిస్తుందా?

తటస్థ వైఖరి క్రైస్తవ ప్రేమను అడ్డగిస్తుందా?

క్రైస్తవులుగా ఉండడమంటే బైబిలు చదవడం, ప్రార్థించడం, ఆదివారాలు కీర్తనలు పాడడం మాత్రమే కాదు. దానిలో దేవునికోసం, ప్రజలకోసం పనులు చేయడం ఇమిడివుంది. బైబిలు ఇలా చెబుతోంది: “మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” (1 యోహాను 3:​18) యేసుకు ఇతరులపట్ల యథార్థమైన శ్రద్ధవుంది, క్రైస్తవులు ఆయనను అనుకరించాలని కోరుకుంటారు. “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” అని అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులను అర్థించాడు. (1 కొరింథీయులు 15:​58) అయితే ఆ ప్రభువు కార్యమేమిటి? బీదల, బడుగువర్గాల ప్రయోజనార్థం ప్రభుత్వ విధానాన్ని మార్చే ప్రయత్నాలు దానిలో భాగమా? యేసు అలాగే చేశాడా?

రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి లేదా ఎదైనా ఒక పక్షం వహించడానికి యేసు తొందరపెట్టబడినప్పటికీ, ఆయన అలా చేయడానికి నిరాకరించాడు. ప్రపంచ రాజ్యాలన్నిటిపై అధికారం ఇస్తానన్న సాతాను ప్రతిపాదనను ఆయన తిరస్కరించాడు, పన్నులు కట్టడానికి సంబంధించిన వివాదంలో ఆయన ఇరుక్కోలేదు, తనను రాజు చేయాలనే ప్రజా ఉద్యమం నుండి ఆయన తప్పుకున్నాడు. (మత్తయి 4:8-10; 22:17-21; యోహాను 6:​15) అయితే ఆయన తటస్థ వైఖరి ఇతరుల ప్రయోజనార్థం పనిచేయకుండా ఆయనను అడ్డగించలేదు.

ఇతరులకు శాశ్వత ప్రయోజనమిచ్చే దానిపై యేసు దృష్టి నిలిపాడు. ఆయన ఐదువేల మందికి ఆహారం పెట్టడం, రోగులను బాగుచేయడం తాత్కాలిక ఉపశమనమిచ్చినా, ఆయన చేసిన బోధ సర్వ మానవాళికి నిత్యాశీర్వాదాలను అందుబాటులోకి తెచ్చింది. యేసు సహాయ ఉద్యమాలను వ్యవస్థీకరించే వ్యక్తిగా కాక, కేవలం ‘బోధకునిగానే’ పేరుగాంచాడు. (మత్తయి 26:18; మార్కు 5:35; యోహాను 11:​28) ఆయనిలా చెప్పాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.”​—⁠యోహాను 18:37.

రాజకీయాలకంటే మరింత శ్రేష్ఠమైనది ప్రబోధించడం

యేసు బోధించిన సత్యం రాజకీయ సిద్ధాంతం కాదు. బదులుగా అది తానే రాజుగావుండే రాజ్యంపై దృష్టి కేంద్రీకరించింది. (లూకా 4:​43) ఈ రాజ్యం పరలోక ప్రభుత్వమైయుండి, మానవ పరిపాలనా ప్రభుత్వాలన్నింటిని నిర్మూలించి మానవాళికి శాశ్వత శాంతిని తీసుకొస్తుంది. (యెషయా 9:6, 7; 11:9; దానియేలు 2:​44) అందువల్ల, ఆ రాజ్యమే మానవాళికి ఏకైక నిజ నిరీక్షణ. సురక్షితమైన భవిష్యత్తు కోసం మానవులపై నమ్మకముంచమని ప్రజలను ప్రోత్సహించే బదులు భవిష్యత్తుకు సంబంధించిన ఆ ఖచ్చితమైన నిరీక్షణను వారికి ప్రకటించడం మరింత ప్రేమపూర్వకం కాదా? “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 146:​3-5) కాబట్టి ప్రభుత్వ వ్యవస్థాపనకు మెరుగైన విధానం ప్రబోధించమని తన శిష్యులను పంపించడానికి బదులు, యేసు “రాజ్య సువార్త” ప్రకటించడం గురించి వారికి బోధించాడు.​—⁠మత్తయి 10:6, 7; 24:14.

కాబట్టి క్రైస్తవ ప్రచారకులకు చేయమని ఆజ్ఞాపించబడిన ‘ప్రభువు కార్యమిదే.’ దేవుని రాజ్య ప్రజలు పరస్పరం ప్రేమించుకోవాలనే నియమం ఉంది కాబట్టి, మానవాళి వనరులను సమతూకంగా పంచడం ద్వారా దారిద్ర్య నిర్మూలనలో ఆ రాజ్యం విజయం సాధిస్తుంది. (కీర్తన 72:​8, 12, 13) ఇది సువార్త మాత్రమే కాదు ప్రకటించ యోగ్యమైనది కూడా.

ఈ ‘ప్రభువు కార్యం’ కోసం, నేడు 235 దేశాల్లో యెహోవాసాక్షులు వ్యవస్థీకరించబడ్డారు. యేసు ఆజ్ఞకు అనుగుణంగా వారు అన్ని ప్రభుత్వాలపట్ల గౌరవ భావంతో ఉన్నారు. (మత్తయి 22:​21) అయితే యేసు తన అనుచరులతో చెప్పిన ఈ మాటలను కూడా వారు గౌరవిస్తూ వాటికి లోబడతారు: “మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని.”​—⁠యోహాను 15:19.

రాజకీయాలు ప్రబోధించిన కొందరు బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత తమ పద్ధతి మార్చుకున్నారు. చర్చి నియంత్రిత సంస్థయైన, క్యాథలిక్‌ యాక్షన్‌ అనే సంస్థ సభ్యునిగావున్న ఇటలీ దేశపు రాజకీయ నాయకుడు ఇలా చెప్పాడు: “సమాజపు సాంఘిక, రాజకీయ అభివృద్ధికి ఒక వ్యక్తి చురుకుగా తోడ్పడాలని భావిస్తూ నేను రాజకీయాల్లో చేరాను.” ఒక యెహోవాసాక్షిగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి నగర మేయర్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత, రాజకీయాల్లో యథార్థ ప్రజల ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతాయో ఆయనిలా వివరించాడు. “మెరుగైన సామాజిక పరిస్థితుల కోసం మంచివాళ్లు ప్రయత్నించక పోవడంవల్ల కాదుగానీ, కొందరు చేసిన యథార్థ ప్రయత్నాలను అనేకుల దుష్టత్వం అణచివేసిన కారణంగా ప్రపంచం ఇప్పుడిలా ఉంది.”

మానవాళికున్న ఏకైక నిజ నిరీక్షణను ప్రకటించడానికి రాజకీయాలకు దూరంగా ఉండడం, ఆచరణాత్మక విధానాల్లో ఇతరులకు సహాయపడకుండా నిజ క్రైస్తవులను అడ్డగించదు. దేవుని రాజ్య ప్రజలయ్యేలా వారు సహాయంచేసే ప్రజలు వినాశనకర దృక్పథాలను మార్చుకోవడాన్ని, అధికారులను గౌరవించడాన్ని, తమ కుటుంబ జీవితం మెరుగుపరచుకోవడాన్ని, భౌతిక సంపదల విషయంలో సమతూక దృక్కోణం కలిగివుండడాన్ని నేర్చుకుంటారు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవునితో సన్నిహిత సంబంధం అనుభవించేలా యెహోవాసాక్షులు ప్రజలకు సహాయం చేస్తున్నారు.

దేవుని రాజ్య ప్రచారకులు తాము నివసించే సమాజానికి మేలుచేస్తారు. అయితే అంతకంటే ప్రాముఖ్యంగా వారు దేవుని ప్రేమించే వారందరికీ శాశ్వత శాంతిని తీసుకొచ్చే వాస్తవిక ప్రభుత్వంపై నమ్మకముంచేలా ప్రజలను నడిపిస్తారు. ఈ క్రైస్తవులు తమ తటస్థ వైఖరి కారణంగానే నేడు అందుబాటులోవున్న నిరంతరం నిలిచివుండే ఆచరణాత్మక సహాయమందించే స్వేచ్ఛను కలిగివున్నారు.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

రాజకీయాలు వదిలి దేవుని రాజ్య ప్రచారకునిగా మారడం

ఆటీలె చిన్నవయస్సులోనే బ్రెజిల్‌లోని బెలెమ్‌లో తన ప్యారిష్‌ ప్రీస్టుల నుండి లిబరేషన్‌ థియోలజీ ఒంటబట్టించుకున్నాడు. మానవాళి చివరకు అణచివేత నుండి విడుదల పొందుతుందనే మాటలకు ముగ్ధుడై ఆక్టివిస్ట్‌ కమ్యూనిటీలోచేరి నిరసన ప్రదర్శనలు, చట్ట ఉల్లంఘనోద్యమాలు ఏర్పాటుచేయడం నేర్చుకున్నాడు.

అయితే తనకివ్వబడిన గొప్ప బోధకుడు చెప్పేది వినడం * (ఆంగ్లం) పుస్తకాన్ని ఉపయోగించి ఆక్టివిస్ట్‌ కమ్యూనిటీ పిల్లలకు బోధించడం కూడా ఆటీలెకు చాలా ఇష్టం. సత్ప్రవర్తన గురించి, అధికార్లకు లోబడడం గురించి ఆ పుస్తకం మాట్లాడింది. ఇది లిబరేషన్‌ థియోలజీని బలపరిచేవారు ఎందుకు యేసు ఉన్నత నైతిక ప్రమాణాలను అనుసరించడం లేదో, కొందరు అధికారం దొరకిన వెంటనే బడుగు ప్రజలను ఎందుకు మరచిపోతారో ఆటీలెను ఆలోచింపజేసింది. ఆయన ఆ కమ్యూనిటీ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత యెహోవాసాక్షులు ఆయన ఇంటి తలుపుతట్టి దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. త్వరలోనే ఆయన బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించి మానవాళి అణచివేతకు నిజమైన పరిష్కారమేమిటో తెలుసుకున్నాడు.

ఆ సమయంలోనే ఆటీలె, మతం మరియు రాజకీయాలపై జరిగిన క్యాథలిక్‌ సదస్సుకు హాజరయ్యాడు. ఆ ఉపదేశకులు ఇవి రెండూ “ఒకే నాణానికున్న బొమ్మ బొరుసు” అని వివరించారు. ఆయన రాజ్యమందిరంలోని కూటానికి కూడా హాజరయ్యాడు. ఈ రెండింటి మధ్య ఆయనెంతో వ్యత్యాసం చూశాడు. ఒక విషయం ఏమిటంటే, అక్కడ పొగత్రాగడం లేదు, సురాపానం లేదు, అశ్లీల హాస్యోక్తులు లేవు. వారు చేసే ప్రకటనా పనిలో తను కూడా పాల్గోవాలని తీర్మానించుకుని ఆయన త్వరలోనే బాప్తిస్మం తీసుకున్నాడు. బీదల సమస్యలకు లిబరేషన్‌ థియోలజీ ఎందుకు నిజమైన పరిష్కారం కాదో ఆయనిప్పుడు చూడగలుగుతున్నాడు.

[అధస్సూచి]

^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[6వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ పరిచారకుల తటస్థ వైఖరి ఇతరులకు సహాయపడకుండా వారిని అడ్డగించదు