యౌవనులారా, మీ భవిష్యత్తు కోసం పునాది వేసుకుంటున్నారా?
యౌవనులారా, మీ భవిష్యత్తు కోసం పునాది వేసుకుంటున్నారా?
“నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు.”—యిర్మీయా 29:11.
యౌవనం జీవితంలో అద్భుతమైన కాలమని వయోజనుల్లో అత్యధికులు భావిస్తారు. తమకు యౌవనంలో ఉన్నప్పటి బలాన్ని, ఉత్సాహాన్ని వారు గుర్తుచేసుకుంటారు. చాలా తక్కువ బాధ్యతలతో, ఉల్లాసంతో నిండిన, అనేక అవకాశాలతో సంపూర్ణ భవిష్యత్తుగల ఆ జీవితం మధురంగా ఉన్నట్లు వారు జ్ఞాపకం చేసుకుంటారు.
2 యౌవనులైన మీరు బహుశా మీ యౌవనాన్ని మరో విధంగా దృష్టిస్తుండవచ్చు. యౌవనకాలపు భావోద్రేక, శారీరక మార్పులతో వ్యవహరించడం మీకు సమస్యగా ఉండవచ్చు. పాఠశాలలో మీకు తోటివారి ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండవచ్చు. మాదక ద్రవ్యాలను, ఆల్కహాలును, లైంగిక దుర్నీతిని ఎదిరించడానికి మీరు కృతనిశ్చయంతో ప్రయత్నించాలి. మీలో చాలామంది తటస్థతా అంశాన్ని లేదా మీ విశ్వాస సంబంధ ఇతర వివాదాంశాలను బహుశా ఎదుర్కొంటూ ఉండవచ్చు. అవును, యౌవనకాలం కష్టకాలంగా ఉండవచ్చు. అయినప్పటికీ, అది అవకాశాల సమయం కూడా. అయితే ఇక్కడ ప్రశ్నేమిటంటే, ఆ అవకాశాలను మీరెలా ఉపయోగించుకుంటారు?
యౌవనంలోని ఆనందాన్ని అనుభవించండి
3 యౌవనం ఎక్కువకాలం ఉండదని వృద్ధులు చెబుతారు, వారలా చెప్పడం అవాస్తవం కాదు. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే, మీ యౌవనం యౌవనంలా ఉండదు. కాబట్టి యౌవనమున్నప్పుడే దాని ఆనందాన్ని అనుభవించండి! “యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము” అని వ్రాసినప్పుడు సొలొమోను రాజు ఆ ఉపదేశమే ఇచ్చాడు. అయితే, సొలొమోను యౌవనులను ఇలా హెచ్చరించాడు: “నీ హృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.” అంతేకాకుండా ఆయనిలా అన్నాడు: “లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవును.”—ప్రసంగి 11:9, 10.
4 సొలొమోను మాటల భావమేమిటో మీరు గ్రహించారా? ఉదాహరణకు, వారసత్వంగా గొప్ప సంపదను పొందిన ఒక యౌవనుని గురించే ఆలోచించండి. అతడు దానితో ఏమిచేస్తాడు? యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారునిలా అతడు తన స్వీయానందం కోసం విచ్చలవిడిగా దానినంతా ఖర్చుచేసే అవకాశముంది. (లూకా 15:11-23) అయితే ఆ డబ్బంతా ఖర్చయిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? తాను అంత బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు అతడు తప్పకుండా దుఃఖిస్తాడు. మరోవైపున, అతడు తన వారసత్వ సంపదలో అత్యధికం జ్ఞానయుక్తంగా పెట్టుబడి పెడుతూ తన భవిష్యత్ పునాది వేసుకోవడానికి ఉపయోగించాడనుకుందాం. చివరికి అతడు తన పెట్టుబడి నుండి ప్రయోజనం పొందినప్పుడు, తన యౌవనంలో ఆనందించడానికి తన డబ్బంతా ఖర్చుచేయనందుకు అతడు దుఃఖిస్తాడని మీరనుకుంటారా? అతడెంత మాత్రం దుఃఖించడు!
5 మీ యౌవన సంవత్సరాలను దేవుడిచ్చిన బహుమానంగా తలంచండి. నిజానికి ఆ సంవత్సరాలు దేవుడు అనుగ్రహించిన వరప్రసాదమే. మీరు వాటినెలా ఉపయోగిస్తారు? ఎలాంటి భవిష్యత్ ఆలోచన లేకుండా ప్రతీదీ అనుభవిస్తూ స్వీయానందం కోసం మీరు ఆ బలాన్ని, ఉత్సాహాన్ని వ్యర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరలాచేస్తే, మీ విషయంలో నిజానికి మీ “లేతవయస్సును నడిప్రాయమును” వ్యర్థమే అవుతాయి. భవిష్యత్ కోసం సిద్ధపడేలా మీ యౌవనాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత శ్రేష్ఠమో కదా!
ప్రసంగి 12:2) విజయానికి అదే కీలకం అంటే యెహోవా చెప్పేది విని ఆయన చిత్తం చేయడం. ప్రాచీన ఇశ్రాయేలీయులకు తానేమి చేయాలని ఇష్టపడుతున్నాడో యెహోవా వారికిలా చెప్పాడు: “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు.” (యిర్మీయా 29:11) యెహోవా మీకు ‘రాబోవు కాలమందు నిరీక్షణ’ ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు. మీ క్రియల్లో, తలంపుల్లో, నిర్ణయాల్లో ఆయనను స్మరణకు తెచ్చుకుంటే, ఆ రాబోయే భవిష్యత్తు, నిరీక్షణ నిజమవుతాయి.—ప్రకటన 7:16, 17; 21:3, 4.
6 మీ యౌవనం నుండి మీరు అత్యధిక ప్రయోజనం పొందేందుకు సహాయపడే సూత్రాన్ని సొలొమోను పేర్కొంటూ ఇలా అంటున్నాడు: “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” (“దేవునికి సన్నిహితమవండి”
7 ‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు’ అని మనకు ఉద్బోధించినప్పుడు యాకోబు యెహోవాను స్మరణకు తెచ్చుకొమ్మని మనలను ప్రోత్సహిస్తున్నాడు. (యాకోబు 4:8, NW) యెహోవా సృష్టికర్త, పరలోకపు సర్వాధిపతి, మన సమస్త ఆరాధనకు, స్తుతికి పాత్రుడు. (ప్రకటన 4:10) అయినప్పటికీ, మనమాయనకు సన్నిహితమైనప్పుడు, ఆయన మనకు సన్నిహితమవుతాడు. అలాంటి ప్రేమపూర్వక ఆసక్తి మీ హృదయాన్ని ఉత్తేజపరచడం లేదా?—మత్తయి 22:37.
8 మనం అనేకవిధాలుగా యెహోవాకు సన్నిహితమవుతాం. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.” (కొలొస్సయులు 4:2) మరో విధంగా చెప్పాలంటే, ప్రార్థనా అలవాటును పెంపొందించుకోండి. మీ నాన్నగారు లేదా సంఘంలో మీ తరఫున తోటి క్రైస్తవుడు ప్రార్థించిన తర్వాత కేవలం ఆమేన్ అనడంతోనే సరిపుచ్చుకోకండి. మీరెప్పుడైనా యెహోవా ఎదుట మీ హృదయం కుమ్మరించి మీరేమి ఆలోచిస్తున్నారో, దేని విషయంలో మీరు భయపడుతున్నారో, ఎలాంటి సవాళ్లు మీకు ఎదురవుతున్నాయో ఆయనతో చెప్పారా? మరెవరితోనైనా చర్చించడానికి మీరు కలతచెందే విషయాలను మీరెప్పుడైనా ఆయనకు చెప్పారా? యథార్థమైన, హృదయపూర్వక ప్రార్థనలు ప్రశాంతతా భావాన్ని కలుగజేస్తాయి. (ఫిలిప్పీయులు 4:6, 7) అవి మనం యెహోవాకు సన్నిహితమవడానికీ ఆయన మనకు సన్నిహితుడవుతున్నాడన్న విషయాన్ని గ్రహించడానికీ మనకు సహాయంచేస్తాయి.
9 ఈ ప్రేరేపిత మాటల్లో యెహోవాకు సన్నిహితమయ్యే మరో విధానాన్ని మనం చూస్తాం: “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.” (సామెతలు 19:20) అవును, యెహోవా చెప్పేది వింటూ ఆయనకు లోబడితే మీరు మీ భవిష్యత్తు కోసం పునాది వేసుకుంటున్నట్లే. యెహోవా చెప్పేది వింటున్నారని మీరెలా చూపించవచ్చు? మీరు క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవుతూ కార్యక్రమ భాగాలను వింటున్నారనే విషయంలో సందేహం లేదు. అలాగే కుటుంబ బైబిలు అధ్యయనంలో పాల్గొంటూ మీరు మీ ‘తల్లిదండ్రులకు విధేయులుగా’ కూడా ఉన్నారు. (ఎఫెసీయులు 6:1, 2; హెబ్రీయులు 10:24, 25) అది మెచ్చుకోదగినదే. అయితే వాటితోపాటు, కూటాలకు సిద్ధపడడానికి, క్రమంగా బైబిలు చదవడానికి, పరిశోధించడానికి మీరు ‘సమయం పోనివ్వక సద్వినియోగం’ చేసుకుంటున్నారా? ‘జ్ఞానివలె’ నడుచుకోవడానికి వీలుగా మీరు చదివింది అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? (ఎఫెసీయులు 5:15-17; కీర్తన 1:1-3) మీరలా చేసినట్లయితే, మీరు యెహోవాకు సన్నిహితమవుతారు.
10 సామెతల గ్రంథంలోని ప్రారంభ మాటల్లో, ప్రేరేపిత రచయిత ఆ బైబిలు పుస్తకపు ఉద్దేశమేమిటో వివరిస్తూ ఇలా చెబుతున్నాడు: “జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.” (సామెతలు 1:1-4) కాబట్టి సామెతల్లోని మాటలను, వాటితోపాటు మిగిలిన బైబిలు పుస్తకాలను మీరు చదువుతూ అన్వయించుకుంటుండగా మీరు నీతి యథార్థతలను అలవరచుకుంటారు, దాన్నిబట్టి తనకు మీరు సన్నిహితమవడాన్ని యెహోవా సంతోషంగా స్వీకరిస్తాడు. (కీర్తన 15:1-5) మీరు ఎంత ఎక్కువగా వివేకాన్ని, బుద్ధిని, పరిజ్ఞానాన్ని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారో మీ నిర్ణయాలు అంత మెరుగ్గా ఉంటాయి.
11 ఒక యౌవనుడు ఇలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలని ఆశించడం అనుచితమా? ఎంతమాత్రం కాదు, ఎందుకంటే క్రైస్తవ యౌవనులు అనేకులు అలాగే చేస్తున్నారు. అందువల్ల ఇతరులు వారి ‘యౌవనమునుబట్టి వారిని తృణీకరించక’ వారిని గౌరవిస్తున్నారు. (1 తిమోతి 4:12) వారి తల్లిదండ్రులు న్యాయంగానే వారినిబట్టి గర్విస్తుండగా, అలాంటి వారు తన హృదయాన్ని సంతోషపెడుతున్నారని యెహోవా చెబుతున్నాడు. (సామెతలు 27:11) వారు యౌవనులుగా ఉన్నప్పటికీ, వారు ఈ ప్రేరేపిత మాటలు తమకూ అన్వయిస్తాయనే నమ్మకంతో ఉండవచ్చు: ‘నిర్దోషిని కనిపెట్టుము యథార్థవంతుని చూడుము, ఆ మనుష్యుని భవిష్యత్తు సమాధానకరంగా ఉంటుంది.’—కీర్తన 37:37, NW.
సరైన ఎంపికలు చేసుకోండి
12 యౌవనం ఎంపికలు చేసుకునే సమయం, అలాంటి ఎంపికలు కొన్నింటికి దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయి. మీరిప్పుడు చేసుకొనే ఎంపికల్లో కొన్ని రాబోయే అనేక సంవత్సరాలపాటు మీపై ప్రభావం చూపుతాయి. జ్ఞానయుక్తమైన ఎంపికలు సంతోషభరితమైన, విజయవంతమైన జీవితానికి దోహదపడతాయి. అజ్ఞానపు ఎంపికలు యావత్ జీవితానికి మచ్చ తెస్తాయి. మీరు చేసుకోవలసిన రెండు ఎంపికల విషయంలో అదెలా నిజమో పరిశీలించండి. మొదటిది: మీరు ఎవరితో సహవసించడాన్ని ఎంచుకుంటారు? అదెందుకు ప్రాముఖ్యం? ప్రేరేపిత సామెత ఇలా చెబుతోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) మరో విధంగా చెప్పాలంటే, మనం ఎవరితో సహవాసం చేస్తామో చివరకు వారిలాగే అంటే అటు జ్ఞానులుగానో, ఇటు మూర్ఖులుగానో తయారవుతాం. మీరు ఎవరిలా ఉండాలని కోరుకుంటారు?
13 మీరు సహవాసం గురించి ఆలోచించినప్పుడు, బహుశా మీరు ప్రజలతో ఉండడం గురించి ఆలోచిస్తుండవచ్చు. అది నిజమే, అయితే అది మాత్రమే కాదు. మీరు టీవీ చూస్తున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు, నవల చదువుతున్నప్పుడు, సినిమాకు వెళ్లినప్పుడు లేదా ఇంటర్నెట్‌లో కొన్నిరకాల వెబ్‌సైట్లు చూస్తున్నప్పుడు నిజానికి మీరు సహవాసం చేస్తున్నారు. ఆ సహవాసం హింసాత్మక, దుర్నీతికరమైన లేదా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని, త్రాగుబోతుతనాన్ని లేదా బైబిలు సూత్రాలకు భిన్నమైన మరి దేన్నైనా అందిస్తూవుంటే, మీరు యెహోవా లేడన్నట్లు కీర్తన 14:1.
ప్రవర్తించే ‘బుద్ధిహీనులతో’ సహవాసం చేస్తున్నట్లే లెక్క.—14 నేను క్రైస్తవ కూటాలకు హాజరవుతూ సంఘంతో చురుగ్గానే ఉన్నానని, హింసాత్మక సినిమాలు గానీ చెడు పదాలున్న వినసొంపైన పాటలు గానీ నాపై ఎలాంటి ప్రభావం చూపవని బహుశా మీరనుకోవచ్చు. ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్ క్షణమాత్రం చూసినందువల్ల దుష్ఫలితాలు కలుగవని మీరు భావించవచ్చు. మీరలా అనుకుంటే పొరబడుతున్నట్టే అని అపొస్తలుడైన పౌలు మీకు చెబుతున్నాడు! ఆయనిలా అంటున్నాడు: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) విచారకరంగా, ప్రజ్ఞావంతులైన చాలామంది క్రైస్తవ యౌవనులు అజ్ఞానపు సహవాసాలవల్ల తమ మంచి అలవాట్లు చెరుపుకున్నారు. కాబట్టి, అలాంటి సహవాసాలు విసర్జించడానికి తీర్మానించుకోండి. మీరలా చేసినప్పుడు, “ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించిన వారవుతారు.—రోమీయులు 12:2.
15 ఇప్పుడు మీకు ఎదురయ్యే రెండవ ఎంపిక. మీ పాఠశాల విద్య ముగిసినప్పుడు మీరేమి చేయాలో నిర్ణయించుకొనే సమయమొస్తుంది. ఉద్యోగ అవకాశాలు తక్కువగావున్న దేశంలో మీరు నివసిస్తుంటే, అందుబాటులోవున్న మంచి ఉద్యోగంలో చేరిపోదామనే ఒత్తిడి మీకు ఉండవచ్చు. మీరొకవేళ వర్ధమాన దేశంలో జీవిస్తుంటే ఎంచుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఉండవచ్చు, వాటిలో కొన్ని చాలా ఆకర్షణీయంగా ఉండవచ్చు. మీ టీచర్లు లేదా మీ తల్లిదండ్రులు ఆర్థిక భద్రతనిచ్చే, బహుశా సంపదనిచ్చే ఉద్యోగంలో చేరమని మంచి ఉద్దేశంతోనే మిమ్ములను బలవంతం చేయవచ్చు. అయితే, అలాంటి ఉద్యోగం కోసం తీసుకొనే శిక్షణ యెహోవా సేవలో మీరు ఉపయోగించగల సమయాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.
16 ఒక నిర్ణయానికి వచ్చేముందు బైబిలును సంప్రదించడం మరచిపోకండి. మనలను మనం పోషించుకొనే బాధ్యత మనకుందని చూపిస్తూ, జీవనాధారం కోసం పనిచేయాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తోంది. (2 థెస్సలొనీకయులు 3:10-12) అయితే, దీనిలో ఇతర విషయాలూ చేరివున్నాయి. ఈ క్రింది లేఖనాలను చదివి ఉద్యోగ ఎంపికలో ఒక యౌవనుడు సమతూకం కలిగి ఉండేలా అవెలా సహాయం చేస్తాయో ఆలోచించమని మేము మిమ్ములను ప్రోత్సహిస్తున్నాం: సామెతలు 30:8, 9; ప్రసంగి 7:11, 12; మత్తయి 6:33; 1 కొరింథీయులు 7:31; 1 తిమోతి 6:9, 10. ఈ వచనాలు చదివిన తర్వాత, ఈ విషయంలో యెహోవా దృక్కోణమేమిటో మీరు చూస్తున్నారా?
17 లౌకిక ఉద్యోగం యెహోవాకు మనంచేసే సేవను మరుగుచేసేంత ప్రాముఖ్యమైనదిగా ఎప్పటికీ ఉండకూడదు. ఉన్నత పాఠశాల విద్యతోనే మీరు తగిన ఉద్యోగానికి అర్హులు కాగలిగితే అదే సరిపోతుంది. ఉన్నత పాఠశాల విద్య తర్వాత మీకు అదనపు శిక్షణ అవసరమైతే, ఆ విషయాన్ని మీరు మీ తల్లిదండ్రులతో చర్చించాలి. అయితే మీరు ఎప్పటికీ “శ్రేష్ఠమైన కార్యముల” ప్రాముఖ్యతను, అంటే ఆధ్యాత్మిక విషయాల ప్రాముఖ్యతను మరచిపోకూడదు. (ఫిలిప్పీయులు 1:9) యిర్మీయా లేఖికుడైన బారూకు చేసిన తప్పే మీరూ చేయకండి. ఆయన తన సేవాధిక్యతపట్ల ప్రశంస కోల్పోయి ‘తన నిమిత్తం గొప్పవాటిని వెదికాడు.’ (యిర్మీయా 45:5) ఈ లోకంలో ‘గొప్పగా’ ఉన్నదేదీ తనను యెహోవాకు సన్నిహితం చేయదనీ లేదా అది యెరూషలేము నాశనం నుండి తనను రక్షించదనీ ఆయన తాత్కాలికంగా మరచిపోయాడు. నేడు మన విషయంలో కూడా అదే విధంగా చెప్పబడే అవకాశముంది.
ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా పరిగణించండి
18 సమాచార మాధ్యమాల్లో కరవు పీడిత దేశాల్లోని పిల్లల బొమ్మలు మీరు చూశారా? మీరలా చూసివుంటే వారిపై మీరు జాలిపడే ఉంటారు. మీ పొరుగువారిపట్ల కూడా మీకలాంటి జాలే ఉందా? వారిపై ఎందుకు జాలిపడాలి? ఎందుకంటే వారిలో అత్యధికులు కూడా అలమటిస్తున్నారు. “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు” అని ఆమోసు 8:11.
ఆమోసు ప్రవచించిన కరవుతో వారు బాధపడుతున్నారు.—19 నిజమే, ఈ ఆధ్యాత్మిక క్షామంతో బాధపడుతున్న వారిలో అత్యధికులు ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారిగా’ లేరు. (మత్తయి 5:3) అనేకులు తమకు ఆధ్యాత్మిక ఆకలి ఉన్నట్లు భావించరు. తాము పుష్టిగానే ఉన్నామని కూడా కొందరు భావించవచ్చు. ఒకవేళ వారలా పుష్టిగా ఉన్నా, వారు ఐశ్వర్యాసక్తి, విజ్ఞానశాస్త్ర వాదన, నైతికత్వ అభిప్రాయాలు, అలాంటి ఇతర విషయాల వ్యర్థమైన ‘ఈ లోక జ్ఞానముచేత’ పోషించబడుతున్నారు. ఆధునిక ‘జ్ఞానం’ బైబిలు బోధలను పనికిరానివిగా చేస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే ‘లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగలేదు.’ ఈ లోక జ్ఞానం మీరు దేవునికి సన్నిహితమవడానికి సహాయం చేయదు. అది “దేవుని దృష్టికి వెఱ్ఱితనమే” తప్ప మరొకటి కాదు.—1 కొరింథీయులు 1:20, 21; 3:19.
20 ఆకలితోవున్న ఆ పిల్లల బొమ్మలు మీరు చూసినప్పుడు, మీరూ వారిలో ఒకరై ఉండాలని కోరుకుంటారా? ఎంతమాత్రం కోరుకోరు! కానీ క్రైస్తవ కుటుంబాల్లోని కొందరు యౌవనులు తమచుట్టూ ఉన్న అలమటించే ప్రజల్లా ఉండాలనే కోరికను ప్రదర్శించారు. అలాంటి యౌవనులు, బహుశా లోకంలోని యౌవనులు బాదరబందీలేని జీవితం హాయిగా అనుభవిస్తున్నారని ఆలోచిస్తుండవచ్చు. అలాంటి యౌవనులు యెహోవాకు దూరమయ్యారనే విషయం వారు మరచిపోతున్నారు. (ఎఫెసీయులు 4:17, 18) అలాగే వారు ఆధ్యాత్మికంగా ఆకలితో అలమటించడం వల్ల కలిగే దుష్ప్రభావాన్ని కూడా మరచిపోతున్నారు. వీటిలో కొన్ని అవాంఛిత గర్భధారణలు, లైంగిక దుర్నీతికి సంబంధించిన శారీరక, భావోద్రేక ప్రభావాలు, పొగత్రాగడం, త్రాగుబోతుతనం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం. ఆధ్యాత్మిక ఆకలితో అలమటించడం తిరుగుబాటు స్వభావానికి, అంతర్లీనమైన నిరాశకు, గమ్యంలేని జీవితానికి దారితీస్తుంది.
21 అందువల్ల, మీరు పాఠశాలలో యెహోవా తోటి ఆరాధకులు కానివారి మధ్య ఉన్నప్పుడు, వారి దృక్పథాలనుబట్టి మీరు ప్రభావితం చెందకండి. (2 కొరింథీయులు 4:18) ఆధ్యాత్మిక విషయాల గురించి కొందరు నీచంగా మాట్లాడతారు. అంతేకాదు లైంగిక దుర్నీతికి పాల్పడడం, త్రాగడం లేదా బూతులు మాట్లాడడం సాధారణమనే భావమిస్తూ సమాచార మాధ్యమాలు కుయుక్తిగా వాటి ప్రచారం సాగిస్తాయి. ఆ ప్రభావానికి విరుద్ధంగా పోరాడండి. “విశ్వాసమును మంచి మనస్సాక్షియు” కలిగిన ప్రజలతో విడువక క్రమంగా సహవసించండి. “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండండి. (1 తిమోతి 1:18; 1 కొరింథీయులు 15:58) రాజ్యమందిరంలో, క్షేత్రసేవలో బిజీగా ఉండండి. మీ పాఠశాల విద్యా సంవత్సరాల్లో, అప్పుడప్పుడూ సహాయ పయినీరు సేవలో భాగం వహించండి. ఈ విధంగా మీ ఆధ్యాత్మిక దృక్కోణాన్ని బలపరచుకోండి, అప్పుడు మీరు మీ సమతుల్యం కోల్పోరు.—2 తిమోతి 4:5.
22 ఆధ్యాత్మిక దృక్కోణం కలిగి ఉండడం బహుశా మీరు ఇతరులు అర్థంచేసుకోని నిర్ణయాలు తీసుకొనేలా మిమ్ములను నడిపించవచ్చు. ఉదాహరణకు, ఒక యౌవన క్రైస్తవుడికి సంగీతంలో చక్కని ప్రావీణ్యం ఉంది, పాఠశాలలో ప్రతీ సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. విద్య ముగిసినప్పుడు, తానిష్టపడిన విధంగా పూర్తికాల సువార్తికునిగా లేదా పయినీరుగా సేవచేసేందుకు వీలుగా కిటికీలు శుభ్రంచేసే తన తండ్రి వ్యాపారంలో చేరాడు. ఈ నిర్ణయం అతని టీచర్లకు అంతుబట్టలేదు, కానీ మీరు యెహోవాకు సన్నిహితులుగా ఉంటే అదేమిటో మీరు తప్పక అర్థం చేసుకుంటారని మాకు తెలుసు.
23 మీ యౌవనపు అమూల్య వనరులను ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ, ‘వాస్తవమైన జీవం సంపాదించుకొనే నిమిత్తం రాబోవు కాలానికి సురక్షితంగా మంచి పునాది వేసుకోండి.’ (1 తిమోతి 6:18) మీ బాల్యమందు అలాగే మీ మిగిలిన జీవితమంతా ‘మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనేందుకు’ తీర్మానించుకోండి. విజయవంతమైన భవిష్యత్తు కోసం, నిరంతరముండే భవిష్యత్తు కోసం పునాది వేసుకోవడానికి ఇదే ఏకైక మార్గం.
మీరేమి చెబుతారు?
• తమ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోవడంలో యౌవనులకు ఏ ప్రేరేపిత ఉపదేశం సహాయం చేస్తుంది?
• ఒక యౌవనుడు ‘దేవునికి సన్నిహితమయ్యే’ మార్గాలు కొన్ని ఏమిటి?
• తన భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఒక యౌవనస్థుడు తీసుకొనే కొన్ని నిర్ణయాలు ఏమిటి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. యౌవన సంవత్సరాలను ఎలాంటి విభిన్నరీతుల్లో దృష్టించవచ్చు?
3. యౌవనులకు సొలొమోను ఎలాంటి ఉపదేశాన్ని, హెచ్చరికను ఇచ్చాడు?
4, 5. భవిష్యత్ కోసం యౌవనులు సిద్ధపడడం ఎందుకు జ్ఞానయుక్తం? వివరించండి.
6. (ఎ) యౌవనులకు సొలొమోను ఇచ్చిన ఏ ఉపదేశం మార్గనిర్దేశమిస్తోంది? (బి) యౌవనుల విషయంలో యెహోవా ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు, దీనినుండి ఒక యౌవనుడెలా ప్రయోజనం పొందవచ్చు?
7, 8. ఒక యౌవనుడు దేవునికెలా సన్నిహితుడు కాగలడు?
9. ఒక యౌవనుడు యెహోవా చెప్పేది ఎలా వినగలడు?
10, 11. యెహోవా చెప్పేది విన్నప్పుడు యౌవనులు ఎలాంటి గొప్ప ప్రయోజనాలు పొందుతారు?
12. యౌవనులు చేసుకునే ఎంపికల్లో ఏది ఒక ప్రాముఖ్యమైన ఎంపికగా ఉంటుంది, ఆ ఎంపికకు ఎందుకు దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయి?
13, 14. (ఎ) నేరుగా ప్రజలతో సంబంధం కలిగి ఉండడంతోపాటు, సహవాసంలో ఇంకా ఏమి ఇమిడివుంది? (బి) యౌవనులు ఎలాంటి తప్పుకు దూరంగా ఉండాలి?
15. యౌవనులు చేసుకోవలసిన రెండవ ఎంపిక ఏమిటి, ఈ విషయంలో వారిపై కొన్నిసార్లు ఎలాంటి ఒత్తిడి తేబడుతుంది?
16, 17. ఉద్యోగం విషయంలో ఒక యౌవనుడు సమతుల్య దృక్కోణం కలిగి ఉండేందుకు వివిధ లేఖనాలు ఎలా సహాయం చేయగలవో వివరించండి.
18, 19. (ఎ) మీ పొరుగువారిలో అత్యధికులు దేనితో బాధపడుతున్నారు, వారి గురించి మీరెలా భావించాలి? (బి) అనేకులు తమకు ఆధ్యాత్మిక ఆకలి ఉన్నట్లు ఎందుకు భావించరు?
20. యెహోవాను ఆరాధించని ప్రజలను అనుకరించాలని కోరుకోవడం ఎందుకు సముచితం కాదు?
21. యెహోవాను ఆరాధించని వారి తప్పుడు దృక్పథాలను స్వీకరించకుండా మనలను మనమెలా కాపాడుకోవచ్చు?
22, 23. (ఎ) ఒక యౌవన క్రైస్తవుడు తరచూ ఇతరులు అర్థంచేసుకోని ఎంపికలు ఎందుకు చేసుకుంటాడు? (బి) యౌవనులు ఏమిచేయడానికి ప్రోత్సహించబడుతున్నారు?
[15వ పేజీలోని చిత్రాలు]
మీ యావత్ యౌవన బలాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తిగత లక్ష్యాలు హరించి వేయడానికి అనుమతిస్తారా?
[16, 17వ పేజీలోని చిత్రం]
జ్ఞానులైన క్రైస్తవ యౌవనులు తమ ఆధ్యాత్మిక దృష్టిని తేటగా ఉంచుకుంటారు