కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నదులు చప్పట్లు కొట్టునుగాక”

“నదులు చప్పట్లు కొట్టునుగాక”

యెహోవా సృష్టి వైభవాలు

“నదులు చప్పట్లు కొట్టునుగాక”

భూమియొక్క రేఖాచిత్రం చూడండి, అందులో చాలాచోట్ల వంకరటింకరగావున్న సన్నని గీతలు ఖండాలపై అటుఇటుగా గీసి ఉండడం మీరు గమనిస్తారు. ఈ గీతలు మైదానాలు, ఎడారులు, పచ్చిక ప్రాంతాలగుండా వెళుతుంటాయి. అవి వంకర్లు తిరుగుతూ లోయలు, కొండల సందులు, అడవులగుండా ప్రయాణిస్తుంటాయి. (హబక్కూకు 3:⁠9) ఇవి మన భూగ్రహపు జీవనాడులైన నదులు. అలాంటి నదీప్రవాహాలు ఈ భూమిని సృష్టించిన యెహోవా జ్ఞానానికి, శక్తికి రుజువుగా నిలుస్తాయి. మనం వాటిని చూస్తున్నప్పుడు, “ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక” అని పాడిన కీర్తనకర్త భావాలనే మనమూ పంచుకుంటాం.​—⁠కీర్తన 98:8, 9. *

నదులకు మానవ చరిత్రకు సన్నిహిత సంబంధం ఉంది. ఏదెనులో పుట్టిన నది నాలుగు మహా నదులుగా చీలిపోవడం గురించి బైబిలు మాట్లాడుతోంది. (ఆదికాండము 2:​10-14) మధ్యప్రాచ్య నదులైన టైగ్రిస్‌, యూఫ్రటీస్‌ నదుల మధ్యగల సారవంతమైన లోయలే అతి పురాతన నాగరికతలకు పుట్టిల్లు. చైనాలోని హోయాంగ్‌హో, దక్షిణాసియాలోని గంగా, సింధు, ఐగుప్తులోని నైలు నదులవల్లే ప్రసిద్ధమైన నాగరికతలు విలసిల్లడం సాధ్యమైంది.

కాబట్టి, నదుల బలం, నీటి సమృద్ధి, వాటి సోయగాలు చూసినప్పుడల్లా మనిషి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఐగుప్తులోని నైలునది దాదాపు 6,670 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పొడవైన నది అనే విశిష్టత దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ నదికి దక్కుతుంది. కొన్ని నదులు గంభీరంగా కనబడితే, జపాన్‌లోని టోన్‌వంటి హోరుగా ప్రవహించే చిన్న నదులు చూడ ముచ్చటగా ఉంటాయి.

నదీ ప్రవాహానికి ఏది దోహదపడుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, గురుత్వాకర్షణ. ఈ గురుత్వాకర్షణే మెట్ట ప్రాంతాలనుండి పల్లపు ప్రాంతాలకు నీరు ప్రవహించేలా చేస్తుంది. కొన్నిసార్లు దాని ఫలితం భీకర జలపాతాలు. కనుల పండుగచేసే ఆ వేగాన్ని, శోభను బైబిలు ఇలా వర్ణిస్తోంది: “వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి.”​—⁠కీర్తన 93:⁠3.

‘కుండపోతగా వర్షం కురిసేలా చేసేది ఎవరు?’ అని భక్తిపరుడైన యోబును యెహోవా ప్రశ్నించాడు. (యోబు 38:​26, కంటెంపొరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌) నిజమే, ఆ నీరంతా ఎక్కడ నుండి వస్తుంది? దానికి జవాబు నీటి చక్రం అని పిలువబడే సంశ్లిష్ట విధానంలో దొరుకుతుంది. సూర్యుని శక్తి, గురుత్వాకర్షణ ప్రాబల్యంవల్ల భూమ్మీది నీరు నిరంతరం చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటుంది. నీరు ఆవిరైన తర్వాత, అది వాతావారణంలోకి చేరి, చివరకు చల్లబడి మేఘాలుగా తయారవుతుంది. తగిన సమయంలో ఈ ఆవిరి మంచుగా లేదా వర్షంగా తిరిగి భూమికి చేరుతుంది. నీటిలో అధికశాతం సముద్రాల్లో, సరస్సుల్లో, నదుల్లో, హిమఖండాల్లో, మంచు కప్పబడిన ధృవాల్లో, నీటి అడుగున నిలువచేయబడుతుంది.

ఈ అసాధారణ నీటిచక్రం గురించి బైబిలు ఇలా చెబుతోంది: “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును.” (ప్రసంగి 1:⁠7) అంతులేని జ్ఞానంగల, ప్రేమపూర్వక శ్రద్ధగల యెహోవా దేవుడు మాత్రమే అలాంటి చక్రాలను ఏర్పాటుచేయగలడు. చాతుర్యం నిండిన అలాంటి రూపకల్పన దేవుడెలాంటి వ్యక్తని మనకు చెబుతోంది? ఆయన మహాగొప్ప జ్ఞానం మరియు ప్రేమపూర్వక శ్రద్ధ గల దేవుడు.​—⁠కీర్తన 104:13-15, 24, 25; సామెతలు 3:19, 20.

నదులు వాటి పరిమాణం, సంఖ్య ఎంతున్నా ప్రపంచంలోని తాజా నీటిలో కొద్దిశాతం మాత్రమే వాటిలో ప్రవహిస్తుంటుంది. అయినప్పటికీ, అవి జీవనానికి అత్యంత ఆవశ్యకం. “నీరు లేకపోవడం, దానిపై నియంత్రణ లేకపోవడం, మానవజీవితాన్ని అన్నిరకాలుగా అసాధ్యం చేస్తుంది. ఆ నిజంపట్ల మానవుని ప్రతిస్పందనా విధానం నాగరికత చరిత్రలో అత్యంత ప్రధాన విషయంగా ఉంది” అని వాటర్‌ అనే పుస్తకం పేర్కొంటోంది.

వేలాది సంవత్సరాలుగా నదులు మానవుని దాహం తీరుస్తూ, అతని ఉద్యానవనాలకు నీటిని అందించాయి. నదీ పరీవాహక ప్రాంతపు సారవంతమైన నేలలు పంటలకు శ్రేయస్కరంగా ఉంటాయి. యెహోవా సేవకులకు కలిగే ఆశీర్వాదంలో ఈ విషయమెలా వ్యక్తపరచబడిందో గమనించండి: “యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.” (సంఖ్యాకాండము 24:​5, 6) మీరిక్కడ చూస్తున్నట్లుగా నదులు బాతులు, నక్కలవంటి జంతుజాలాల జీవనానికి కూడా తోడ్పడతాయి. నిజానికి నదుల గురించి మనమెంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంత ఎక్కువగా మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్ప బద్ధులమవుతాము.

[అధస్సూచి]

^ పేరా 3 2004 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ (ఆంగ్లం)లో మే/జూన్‌ చూడండి.

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

అర్జెంటీనా బ్రెజిల్‌లమధ్య సరిహద్దులో ఉన్న ఇగ్వాకు జలపాతం అన్ని జలపాతాలకంటే అత్యంత వెడల్పయినదిగా పరిగణించబడుతోంది. దాని వెడల్పు దాదాపు మూడు కిలోమీటర్లు. కాలుష్యరహిత ఉష్ణమండల అడవుల్లోవున్న ఈ జలపాతం దాదాపు 300 చిన్న జలపాతాలతో రూపొందింది. వర్షాకాలంలో ఈ జలపాతాల మీదుగా ప్రతి సెకనుకు 10,000 క్యూబిక్‌ మీటర్ల నీరు క్రిందికి జారి పడుతుంది.

[9వ పేజీలోని చిత్రం]

జపాన్‌లోని టోన్‌ నది