కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

• పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికాదు కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మను మనమెలా దుఃఖపరచగలం?

“దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 4:​30) ఈ మాటలు పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా సూచిస్తున్నాయని కొందరు భావిస్తారు. అయితే తొలి క్రైస్తవులు పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగానో త్రిత్వమని పిలువబడుతున్న దానిలో భాగంగా సర్వోన్నతునికి సమానమైన దేవునిగానో దృష్టించలేదనడానికి ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అందించిన సాహిత్యాలు లేఖనాధారిత, చారిత్రక రుజువులను అందజేశాయి. * (లూకా 12:​42) కాబట్టి పౌలు దేవుని పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా సూచించడం లేదు.

దేవుని పరిశుద్ధాత్మ ఆయన అదృశ్యమైన, చురుకైన శక్తి. (ఆదికాండము 1:⁠2) యోహాను నీళ్లలో బాప్తిస్మమిచ్చినట్లుగా, యేసు “పరిశుద్ధాత్మలో” బాప్తిస్మమివ్వాలి. (లూకా 3:​16) సా.శ. 33 పెంతెకొస్తునాడు దాదాపు 120 మంది శిష్యులు ‘పరిశుద్ధాత్మతోనే నింపబడ్డారు’ గానీ వాళ్లంతా ఒక వ్యక్తితో నింపబడలేదు. (అపొస్తలుల కార్యములు 1:5, 8; 2:​4, 33) అలాంటి అభిషిక్తులు పరలోక నిరీక్షణపొందారు, నమ్మకమైన జీవితం గడిపేలా దేవుని ఆత్మ వారిని నడిపించింది. (రోమీయులు 8:14-17; 2 కొరింథీయులు 1:​22) ఆ ఆత్మ వారిలో దైవిక ఫలాలు ఫలింపజేసి దేవుని ఉగ్రతకు గురికాగల పాపభరితమైన ‘శరీరకార్యాలు’ విసర్జించడానికి వారికి సహాయం చేసింది.​—⁠గలతీయులు 5:19-25.

మనం ఒకవేళ భూసంబంధ నిరీక్షణగల దేవుని సేవకులమైతే, మనం పరిశుద్ధాత్మచే అభిషేకించబడలేదు. అయినప్పటికీ, పరలోక నిరీక్షణగలవారికి దేవుని పరిశుద్ధాత్మ ఎంతవుందో మనకూ అంతే పరిశుద్ధాత్మ ఉండే అవకాశముంది. అందువల్ల, మనం కూడా ఆ ఆత్మను దుఃఖపరిచే ప్రమాదముంది. ఎలా?

పరిశుద్ధాత్మ నిర్దేశం క్రింద వ్రాయబడిన లేఖన ఉపదేశాన్ని మనం పెడచెవినబెడితే ఆత్మకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా పాపంచేయడానికి దారి తీసే, యెహోవా అనుగ్రహం కోల్పోయేలా చేసే, చివరకు నాశనం తీసుకొచ్చే లక్షణాలను మనం అలవర్చుకొనే అవకాశముంటుంది. (మత్తయి 12:​31, 32) మనమింకా గంభీరమైన పాపం చేస్తుండకపోవచ్చు, అయితే చివరకు ఆత్మకు వ్యతిరేకమైన దిశకు మనలను మళ్లించగల మార్గంలో పయనించడం మనం మొదలుపెట్టే ప్రమాదముంది. అలాంటి పరిస్థితుల్లో, మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం.

అలాంటప్పుడు, మనం దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఎలా ఉండగలం? మనం ఖచ్చితంగా మన ఆలోచనలను, క్రియలను నియంత్రించుకోవాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు నిజాయితీలేని మాటలు పలికే, కోపం ఉంచుకునే, సోమరిగావుండే, అనుచితమైన మాటలు మాట్లాడే స్వభావాలకు దూరంగా ఉండడం గురించి చెప్పాడు. మనం “నూతన స్వభావం” ధరించుకొన్న వారమైయుండి కూడా అలాంటి కృత్యాలకు వెనక్కి మళ్లితే మనం ఏమిచేస్తున్న వారిగా ఉంటాం? దేవుని వాక్యమైన బైబిలు ఇస్తున్న ఆత్మ ప్రేరిత ఉపదేశానికి విరుద్ధంగా చేస్తున్న వారమవుతాం. అలా చేయడం ద్వారా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచిన వారమవుతాం.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం జారత్వంలో అనుచితమైన ఆసక్తిని విసర్జించాలనే పౌలు ఉపదేశం గురించి చదువుతాం. తోటి విశ్వాసులు కాముకత్వాన్ని, సరసోక్తుల్ని కూడా విసర్జించాలని అపొస్తలుడు ఉద్బోధించాడు. మనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలని కోరుకుంటే, వినోదాన్ని ఎంచుకునేటప్పుడు దీనిని మనం మనస్సులో ఉంచుకోవాలి. అలాంటి వాటి గురించి మాట్లాడడం ద్వారా, వాటి గురించి చదవడం ద్వారా, టీవీలో లేదా మరోచోట వాటికి సంబంధించిన దృశ్యాలను చూడడం ద్వారా మనం అలాంటి వాటిలో ఎందుకు ఆసక్తి చూపిస్తాము?

ఇతర విధాలుగా కూడా మనం ఆత్మను దుఃఖపరిచే అవకాశముంది. యెహోవా ఆత్మ సంఘ ఐక్యతకు తోడ్పడుతుంది, కానీ మనం హానికరమైన పుకార్లు వ్యాప్తిచేస్తున్నామో లేదా సంఘంలో ముఠా తత్వాలు ప్రోత్సహిస్తున్నామో అనుకోండి. అలాచేస్తే ఐక్యతకు నడిపించే ఆత్మకు విరుద్ధంగా మనం పనిచేయడం లేదా? సాధారణ రీతిలో చెప్పాలంటే, కొరింథు సంఘంలో విభేదాలు కలుగజేసిన వారివలెనే మనమూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. (1 కొరింథీయులు 1:10; 3:​1-4, 16, 17) సంఘంలో నియమించబడిన పురుషుల గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా పాడుచేస్తే కూడా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం.​—⁠అపొస్తలుల కార్యములు 20:28; యూదా 8.

కాబట్టి, ఇటు బైబిల్లో అటు క్రైస్తవ సంఘంలో ప్రతిబింబించబడినట్లుగా పరిశుద్ధాత్మ నిర్దేశాలని మనకు తెలిసిన వాటి వెలుగులో మన దృక్పథాన్ని, క్రియలను పరిశీలించుకోవడం జ్ఞానయుక్తం. పరిశుద్ధాత్మ ప్రభావానికి లోబడుతూ, అన్ని సందర్భాల్లో దేవుని ప్రేరేపిత వాక్యంలో చెప్పబడినదానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, మనం ‘పరిశుద్ధాత్మతో ప్రార్థనచేస్తూ’ ఉందాం. (యూదా 20) పరిశుద్ధాత్మను ఎప్పటికీ దుఃఖపరచకుండా అన్ని సందర్భాల్లో యెహోవా పరిశుద్ధ నామానికి ఘనత తెచ్చేలా దానిచే నడిపించబడాలనేదే మన తీర్మానమైయుండును గాక!

యేసుక్రీస్తు ఒక ధనవంతుడు రాజ్యంలోకి ప్రవేశించడానికి పడే కష్టాన్ని, ఒంటె సూదిబెజ్జంలోకి ప్రవేశించడానికి పడే కష్టంతో పోల్చాడు. ఇక్కడ యేసు అక్షరార్థమైన ఒంటెను, కుట్టేసూదిని సూచిస్తున్నాడా?

ఈ వ్యాఖ్యకు సంబంధించి మత్తయి 19:24, మార్కు 10:25, లూకా 18:25 లో కనిపించే మూడు లేఖనాలు తెలుగు బైబిల్లో దాదాపు ఒకేలా ఉన్నాయి. మత్తయి వృత్తాంతం ప్రకారం యేసు ఇలా అన్నాడు: “ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము.”—మత్తయి 19:24.

కొన్ని రెఫరెన్సు గ్రంథాలు “సూదిబెజ్జము” అనేది, యెరూషలేములోవున్న పెద్ద గవునుల్లో ఒకదానిలో ఉండే చిన్న గవిని అని సూచిస్తున్నాయి. రాత్రుల్లో పెద్ద గవిని మూసివేయబడినప్పుడు, ఆ చిన్న గవిని తెరవడానికి వీలుండేది. దానిగుండా ఒక ఒంటె వెళ్లడానికి వీలుండేదని విశ్వసించబడుతోంది. యేసు దీనినే సూచిస్తున్నాడా?

కాదని తెలుస్తుంది. నిజానికి యేసు నిజమైన కుట్టేసూదినే సూచిస్తున్నాడని స్పష్టమవుతోంది. ప్రాచీనకాలానికి చెందిన ఎముకతో, లోహంతో చేయబడిన సూదులు ఆ ప్రాంతంలో లభించాయి కాబట్టి అవి ప్రతీ ఇంటిలో సాధారణంగా ఉండే వస్తువులే కావచ్చు. నూతనలోక అనువాదము (ఆంగ్లం) ప్రకారం లూకా 18:25 వ వచనం యేసు మాటలను గురించిన అనిశ్చయతను పూర్తిగా తొలగిస్తుంది. ఎందుకంటే అక్కడిలా ఉంది: ‘ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె కుట్టేసూది బెజ్జములో ఒంటె దూరుట సులభం.’

వివిధ నిఘంటుకారులు నూతనలోక అనువాదములో ఉన్న ‘కుట్టేసూది’ అనే అనువాదంతో ఏకీభవిస్తున్నారు. మత్తయి 19:24; మార్కు 10:25 ల్లో “సూది” అని అనువదించబడిన గ్రీకు పదం (రాఫిస్‌) “కుట్టడం” అనే భావంగల క్రియాపదం నుండి తీసుకోబడింది. లూకా 18:25 లో కనబడే గ్రీకు పదం (బిలోనె) అక్షరార్థమైన శస్త్రచికిత్స సంబంధంగా ఉపయోగించే సూదిని సూచిస్తుంది. వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ఇలా చెబుతోంది: “‘సూది బెజ్జమును’ చిన్న గవినికి అన్వయించే ఆలోచన ఆధునికమైనది. ఆ ఆలోచనకు ప్రాచీన రుజువులేమీ లేవు. ఆ వ్యాఖ్యానం ద్వారా ప్రభువు వ్యక్తం చేయాలనుకున్నది ఏమిటంటే, మానవరీత్యా అది అసాధ్యమన్న విషయాన్నే, ఆ సూదిని సాధారణ ఉపకరణమని కాకుండా దానికి మరో అర్థమివ్వడం ద్వారా ఆ ఉద్దేశ భావాన్ని బలహీనం చేయడానికి ప్రయత్నించడం అనవసరం.”—1981, సంపుటి 3, 106వ పేజీ.

ఈ వచనాల్లోని ‘ఒంటెను’ ‘తాడు’ అని అనువదించాలని కొందరు సూచిస్తున్నారు. ‘తాడుకు,’ (కామిలోస్‌) ‘ఒంటెకు’ (కామెలోస్‌) ఉపయోగించబడిన గ్రీకు పదాలు ఒకే రకంగా ఉన్నాయి. అయితే మత్తయి సువార్తకు సంబంధించిన అతి ప్రాచీన గ్రీకు (సైనాటిక్‌, వాటికన్‌ నెం. 1209, అలెగ్జాండ్రియన్‌) చేవ్రాత ప్రతుల్లో, మత్తయి 19:24 లో ‘తాడుకు’ ఉపయోగించబడే గ్రీకు పదానికి బదులు ‘ఒంటెకు’ ఉపయోగించబడే గ్రీకు పదం కనబడుతుంది. నివేదికల ప్రకారం, మత్తయి మొదట తన సువార్తను హీబ్రూ భాషలో వ్రాసి వ్యక్తిగతంగా తనే గ్రీకులోకి అనువదించి ఉండవచ్చు. యేసు ఏమిచెప్పాడో ఆయనకు ఖచ్చితంగా తెలుసు, కాబట్టి ఆయన సరైన పదమే ఉపయోగించాడు.

అందువల్ల, యేసు నిజమైన ఒంటెను, అక్షరార్థమైన కుట్టేసూదిని సూచించాడు. ఫలానాది అసాధ్యమనే భావాన్ని నొక్కిచెప్పడానికే ఆయన వీటిని ఉపయోగించాడు. అంటే ఏ ధనవంతుడూ ఎప్పటికీ రాజ్యంలోకి ప్రవేశించడం దుర్లభమని యేసు భావమా? ఎంతమాత్రం కాదు, ఎందుకంటే యేసు మాటల భావాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. అక్షరార్థమైన ఒంటె నిజమైన కుట్టేసూది బెజ్జములోకి దూరడం ఎలా అసాధ్యమో, అలాగే ధనవంతుడు తన ధనానికి అంటిపెట్టుకొని తన జీవితంలో యెహోవాకు ప్రథమ స్థానమివ్వకుండా జీవిస్తుంటే, అతడు రాజ్యంలోకి ప్రవేశించడం అసాధ్యమని ఉదహరించడానికి ఆయన ఆ మాటలను అతిశయోక్తిగా ఉపయోగించాడు.—లూకా 13:24; 1 తిమోతి 6:17-19.

ఒక యౌవన అధికారి యేసు అనుచరుడయ్యే గొప్ప ఆధిక్యతను చేజార్చుకున్న వెంటనే ఆయన ఈ మాటలు పలికాడు. (లూకా 18:18-24) ఆధ్యాత్మిక విషయాలకంటే తన వస్తు సంపదపట్ల ఎక్కువ ప్రేమగల ఒక సంపన్నుడు దేవుని రాజ్యంలో నిత్యజీవం పొందడానికి అపేక్షించలేడు. అయినప్పటికీ, కొందరు ధనవంతులు యేసు శిష్యులయ్యారు. (మత్తయి 27:57; లూకా 19:2, 9) కాబట్టి తన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించి, దైవిక సహాయాన్ని అర్థించే ధనవంతుడు దేవుడు అనుగ్రహించే రక్షణ పొందగలడు.—మత్తయి 5:3; 19:16-26.

[అధస్సూచి]

^ పేరా 3 యెహోవాసాక్షులు ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? బ్రోషుర్‌ చూడండి.