కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు

మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు

మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు

దేవుని మనోభావాలను మనం నిజంగా ప్రభావితం చేయగలమా? దేవుడసలు ఆనందించగలడా? “దేవుడు” అనే మాటను “సర్వోన్నత లేదా పరమ సత్యం” అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది. ఆ సర్వోన్నత సత్యం కేవలం ఒక శక్తి మాత్రమే అయితే అప్పుడేమిటి? వ్యక్తిత్వంలేని ఒక శక్తి సంతోషిస్తుందని మనం అనుకోగలమా? అలా ఎంతమాత్రం అనుకోలేము. అయితే దేవుని గురించి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి.

“దేవుడు ఆత్మ” అని యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 4:​24) ఆత్మసంబంధ జీవాకృతి మానవులకు భిన్నంగా ఉంటుంది. ఆత్మ మానవ నేత్రాలకు అదృశ్యంగా ఉన్నప్పటికీ, దానికి ఒక శరీరం అంటే “ఆత్మసంబంధ శరీరము” ఉంటుంది. (1 కొరింథీయులు 15:44; యోహాను 1:​18) బైబిలు అలంకారిక భాషను ఉపయోగిస్తూ దేవునికి కళ్లు, చెవులు, చేతులు మొదలైనవి ఉన్నట్లు చెబుతోంది. * దేవునికి పేరు కూడా ఉంది, యెహోవా అన్నదే ఆ పేరు. (కీర్తన 83:​18) కాబట్టి బైబిల్లోని దేవుడు ఆత్మరూపిగావున్న ఒక వ్యక్తి. “ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు.”​—⁠యిర్మీయా 10:10.

జీవముగల వ్యక్తిగా యెహోవా, ఆలోచనాశక్తిగలవాడు, చర్య తీసుకోగలడు. ఆయనకు భావావేశాలను, ఇష్టాయిష్టాలను కనబరిచే సామర్థ్యముంది. వాస్తవానికి బైబిల్లో, ఆయనకు సంతోషాన్ని లేదా కోపాన్ని కలిగించేవేవో వెల్లడిచేసే వాక్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. దానికి భిన్నంగా, మానవ నిర్మిత దేవతలు, ప్రతిమలు మానవుల లక్షణాలను లేదా గుణాలను ప్రతిబింబిస్తుండగా, ఆ లక్షణాలను మానవుల్లో పెట్టిన సర్వశక్తిగల యెహోవా దేవుడే ఆ భావావేశాల మూలకర్త.​—⁠ఆదికాండము 1:27; యెషయా 44:7-11.

యెహోవా నిస్సందేహంగా “సంతోషముగల దేవుడు.” (1 తిమోతి 1:​11, NW) ఆయన తన సృష్టికార్యాలనుబట్టి సంతోషించడమే కాదు, తన సంకల్పం నెరవేర్చడంలోనూ ఆయన ఆనందిస్తాడు. యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదనని నేను చెప్పియున్నాను, దాని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.’ (యెషయా 46:​9-11) “యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక” అని కీర్తనకర్త ఆలపించాడు. (కీర్తన 104:​31) అయితే దేవుణ్ణి సంతోషపరచేది మరొకటి ఉంది. ఆయనిలా చెబుతున్నాడు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము.” (సామెతలు 27:​11) దాని భావమేమిటో ఆలోచించండి​—⁠మనం దేవుణ్ణి సంతోషపరచగలం!

మనం దేవుని హృదయాన్నెలా సంతోషపరచగలం?

పితరుడైన నోవహు యెహోవా హృదయాన్నెలా సంతోషపరచాడో పరిశీలించండి. నోవహు ‘తన తరములో నిందారహితునిగా’ ఉన్నందున, ఆయన “యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.” ఆ కాలంలోని దుష్టులకు పూర్తి భిన్నంగా నోవహుకున్న విశ్వాసం, విధేయత దేవుణ్ణి ఎంత సంతోషపరచాయంటే, “నోవహు దేవునితోకూడ నడచినవాడు” అని ఆయన గురించి చెప్పవచ్చు. (ఆదికాండము 6:6, 8, 9, 22) “విశ్వాసమునుబట్టి నోవహు . . . తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను.” (హెబ్రీయులు 11:⁠7) నోవహు విషయంలో యెహోవా సంతోషించి మానవ చరిత్రలోని ఆ సంక్షోభిత కాలంనుండి ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించాడు.

పితరుడైన అబ్రాహాముకు కూడా యెహోవా భావాలేమిటో బాగా తెలుసు. సొదొమ గొమొర్రాల దుర్నీతినిబట్టి అవి నాశనం చేయబడతాయని యెహోవా ఆయనకు తెలిపినప్పుడు దేవుని ఆలోచనపట్ల ఆయనకున్న సుపరిచిత పరిజ్ఞానం స్పష్టంగా వెల్లడయింది. యెహోవా దేవుడు దుష్టులతోపాటు నీతిమంతులనూ హతమార్చడం తలంచలేనిది అని చెప్పగలిగేంతగా ఆయన గురించి అబ్రాహాముకు తెలుసు. (ఆదికాండము 18:​17-33) చాలా సంవత్సరాల తర్వాత, “మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని” అబ్రాహాము ఎంచాడు కాబట్టే ‘ఇస్సాకును బలిగా అర్పించడానికి’ కూడా వెనకాడనంతగా దేవుని నిర్దేశానికి లోబడ్డాడు. (హెబ్రీయులు 11:17-19; ఆదికాండము 22:​1-18) అబ్రాహాము దేవుని భావాలను ఎంతగా ఎరిగివుండి, ఎంతటి బలమైన విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శించాడంటే, ‘దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది.’​—⁠యాకోబు 2:23.

దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి ప్రయత్నించిన మరోవ్యక్తి ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు. ఆయన గురించి యెహోవా ఇలా చెప్పాడు: “నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చును.” (అపొస్తలుల కార్యములు 13:​22) భారీకాయుడైన గొల్యాతును ఎదుర్కోవడానికి ముందు, దేవునిపై అచంచల విశ్వాసముంచి ఇశ్రాయేలు రాజైన సౌలుతో దావీదు ఇలా అన్నాడు: “సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించు[ను].” దావీదు తనపై ఉంచిన నమ్మకాన్నిబట్టి యెహోవా ఆయనను ఆశీర్వదించి, గొల్యాతును హతమార్చేలా ఆయనను బలపరిచాడు. (1 సమూయేలు 17:​37, 45-54) దావీదు కేవలం తన క్రియలే కాదుగానీ ‘తన నోటి మాటలు, తన హృదయ ధ్యానము యెహోవా దృష్టికి అంగీకారములు కావాలని’ కోరుకున్నాడు.​—⁠కీర్తన 19:14.

మరి మన విషయమేమిటి? యెహోవాను మనమెలా సంతోషపరచగలం? దేవుని భావాలను మనమెంత ఎక్కువగా తెలుసుకుంటామో, ఆయన హృదయాన్ని సంతోషపరచడానికి ఏమి చేయాలన్నది అంత ఎక్కువగా తెలుసుకుంటాము. కాబట్టి బైబిలు చదివేటప్పుడు, మనం ‘సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారిగా, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారిగా అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననే’ ఉద్దేశంతో దేవుని భావాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించడం ఆవశ్యకం. (కొలొస్సయులు 1:​9) ఆ పరిజ్ఞానం విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఇది ఆవశ్యకం ఎందుకంటే, “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీయులు 11:⁠6) అవును, బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి గట్టి ప్రయత్నంచేస్తూ, యెహోవా చిత్తానికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకోవడం ద్వారా మనమాయన హృదయాన్ని సంతోషపరచగలం. అదే సమయంలో మనం యెహోవా హృదయాన్ని నొప్పించకుండా జాగ్రత్తపడాలి.

దేవుడు నొచ్చుకొనేలా చేయకండి

యెహోవా నొచ్చుకుంటాడని చెప్పడానికి ఒక ఉదాహరణను నోవహు కాలంనాటి వృత్తాంతంలో చూడవచ్చు. ఆ కాలంలో “భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.” ఆ చెడు నడతను, బలాత్కారాన్ని దేవుడు పరికించి చూసినప్పుడు ఆయనెలా భావించాడు? “తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 6:5, 6, 11, 12) మానవుల నడత ఎంతగా చెడిపోయిందంటే దేవుడు ఎంతో సంతాపపడి, జలప్రళయానికి పూర్వమున్న దుష్టుల విషయంలో తన దృక్పథం మార్చుకున్నాడు. వారి దుష్టత్వాన్నిబట్టి తనకు కలిగిన అసంతుష్టి కారణంగా, దేవుడు తన దృక్పథాన్ని మానవుల సృష్టికర్తకు ఉండవలసిన దృక్పథం నుండి వారి వినాశకునికి ఉండే దృక్పథంగా మార్చుకున్నాడు.

యెహోవా తన సొంత ప్రజలైన ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం తన భావాలను, తన ప్రేమపూర్వక నిర్దేశాన్ని పెడచెవిన పెట్టినప్పుడు కూడా నొచ్చుకున్నాడు. “అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి” అని కీర్తనకర్త తన దుఃఖం వెలిబుచ్చాడు. అయినప్పటికీ, “ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.” (కీర్తన 78:​38-41) తిరుగుబాటుదారులైన ఆ ఇశ్రాయేలీయులు తమ సొంత పాపాన్నిబట్టి తగిన పర్యవసానాలు అనుభవించినప్పటికీ, “వారి యావద్బాధలో ఆయన [దేవుడు] బాధనొందెను” అని బైబిలు మనకు చెబుతోంది.​—⁠యెషయా 63:9.

తమపట్ల దేవునికి వాత్సల్యపూరిత భావాలు ఉన్నాయనడానికి స్పష్టమైన రుజువు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ‘నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము వారిమీదికి వచ్చేవరకు దేవుని దూతలను ఎగతాళిచేస్తూ, ఆయన వాక్యములను తృణీకరిస్తూ, ఆయన ప్రవక్తలను హింసిస్తూ’ వచ్చారు. (2 దినవృత్తాంతములు 36:​16) వారి మూర్ఖపు తిరుగుబాటు ధోరణి ఎంతమేరకు ‘ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచిందంటే’ చివరకు వారు యెహోవా అనుగ్రహాన్నే కోల్పోయారు. (యెషయా 63:​10) దాని ఫలితమేమిటి? న్యాయంగానే దేవుడు వారికిక తన కాపుదలనివ్వలేదు, దానితో బబులోనీయులు యూదాను జయించి యెరూషలేమును నాశనం చేసినప్పుడు వారు విపత్తుల పాలయ్యారు. (2 దినవృత్తాంతములు 36:​17-21) తమ సృష్టికర్తను అవమానపరిచే, నొప్పించే పాపభరితమైన జీవన విధానాన్ని ప్రజలు ఎన్నుకోవడం ఎంత విచారకరం!

దుర్నీతికర ప్రవర్తననుబట్టి దేవుడు బహుగా నొచ్చుకుంటాడని బైబిలు మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. (కీర్తన 78:​41) దేవునికి అవమానకరమైన చివరకు హేయకరమైన వాటిలో అహంకారం, అబద్ధాలాడడం, నరహత్య, మంత్రవిద్య అభ్యసించడం, సోదె చెప్పడం, పూర్వికుల ఆరాధన, అనైతిక ప్రవర్తన, సలింగ సంయోగం, వివాహపు నమ్మకాన్ని వమ్ముచేయడం, రక్తసంబంధీకుల మధ్య లైంగిక దుర్నీతి, బీదలను అణగద్రొక్కడం వంటివి ఉన్నాయి.​—⁠లేవీయకాండము 18:9-29; 19:29; ద్వితీయోపదేశకాండము 18:9-12; సామెతలు 6:16-19; యిర్మీయా 7:5-7; మలాకీ 2:14-16.

విగ్రహారాధనను యెహోవా ఎలా పరిగణిస్తాడు? నిర్గమకాండము 20:4, 5 ఇలా చెబుతోంది: “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.” ఎందుకు? ఎందుకంటే విగ్రహమనేదే ‘యెహోవాకు హేయము.’ (ద్వితీయోపదేశకాండము 7:​25, 26) అపొస్తలుడైన యోహాను ఇలా హెచ్చరించాడు: “చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.” (1 యోహాను 5:​21) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.”​—⁠1 కొరింథీయులు 10:14.

దేవుని ఆమోదం కోసం ప్రయత్నించండి

దేవుడు ‘యథార్థవంతులకు తోడుగా ఉంటాడు.’ “యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.” (సామెతలు 3:32; 11:​20) దీనికి భిన్నంగా, దేవుని నీతియుక్త భావాలను మూర్ఖంగా పెడచెవిన పెడుతూ లేదా ప్రతిఘటిస్తూ ఆయనను అదేపనిగా అవమానపరిచేవారు త్వరలోనే ఆయన ఉగ్రతను చవిచూస్తారు. (2 థెస్సలొనీకయులు 1:​6-9) అవును, నేడు ప్రబలముగా ఉన్న సమస్త దుష్టత్వాన్ని ఆయన త్వరలోనే అంతమొందిస్తాడు.​—⁠కీర్తన 37:9-11; జెఫన్యా 2:2, 3.

అయితే, యెహోవా ‘యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడని’ బైబిలు స్పష్టం చేస్తోంది. (2 పేతురు 3:⁠9) కావాలనే చెడ్డవారిగా ఉన్నవారిపై అయిష్టతను ప్రకటించే బదులు తనను ప్రేమించే నీతిగల ప్రజలపట్ల అనురాగం చూపడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. యెహోవాకు ‘దుర్మార్గుడు మరణము నొందుటవలన సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన సంతోషము కలుగుతుంది.’​—⁠యెహెజ్కేలు 33:11.

కాబట్టి ఎవరూ యెహోవా ఉగ్రతకు గురికావలసిన అవసరమే లేదు. ‘యెహోవా ఎంతో జాలి, కనికరము గలవాడు.’ (యాకోబు 5:​11) దేవుడు “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక,” ఆయన భావాల్లో సంపూర్ణ నమ్మకంతో మీరు “మీ చింత యావత్తు ఆయనమీద” వేయవచ్చు. (1 పేతురు 5:⁠7) దేవుని హృదయాన్ని సంతోషపరచేవారికి ఆయన ఆమోదాన్ని, స్నేహాన్ని అనుభవించే అద్భుతమైన ఉత్తరాపేక్ష ఉందనే నమ్మకంతో ఉండండి. కాబట్టి, “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు[కోవడం]” క్రితమెన్నటికంటే ఇప్పుడు మరింత అత్యవసరం.​—⁠ఎఫెసీయులు 5:10.

దేవుడు తన ఉచిత కృపనుబట్టి తన మహిమాన్విత లక్షణాలను, భావాలను వెల్లడిచేయడం నిజంగా అద్భుతం! ఆయన హృదయాన్ని సంతోషపరచడం మన చేతుల్లో ఉంది. మీరలా చేయడానికి ఇష్టపడుతుంటే, మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించవలసిందిగా మేము మిమ్ములను కోరుతున్నాము. దేవుణ్ణి సంతోషపరచాలనే తమ ప్రయత్నాల్లో ఏది ఆచరణాత్మకమనీ, సాధించ సాధ్యమేననీ వారు కనుగొన్నారో అది మీకు చూపించడానికి వారు సంతోషిస్తారు.

[అధస్సూచి]

^ పేరా 3 “బైబిలు ఎందుకు మానవ పరిభాషలో దేవుణ్ణి వర్ణిస్తోంది?” అనే బాక్సు చూడండి.

[7వ పేజీలోని బాక్సు]

బైబిలు ఎందుకు మానవ పరిభాషలో దేవుణ్ణి వర్ణిస్తోంది?

“దేవుడు ఆత్మ గనుక” భౌతిక నేత్రాలతో మనమాయనను చూడలేము. (యోహాను 4:​24) అందుకే దేవుని శక్తిని, గాంభీర్యాన్ని, కార్యకలాపాలను గ్రహించడానికి మనకు సహాయపడేలా బైబిలు సారూప్యాలను, రూపకాలంకారములను, మానవ పరిభాషను అలంకారార్థంగా ఉపయోగిస్తోంది. అందువల్ల దేవుని ఆత్మసంబంధ శరీరం ఎలా ఉంటుందో మనకు తెలియకపోయినా, దేవునికి కన్నులు, చెవులు, చేతులు, బాహువులు, వేళ్లు, పాదాలు, హృదయం ఉన్నట్లు బైబిలు మాట్లాడుతోంది.​—⁠ఆదికాండము 6:6; నిర్గమకాండము 3:20; 31:18; యోబు 40:9; కీర్తన 18:9; 34:15.

ఆ వర్ణనాత్మక భాషకు అర్థం, దేవుని ఆత్మసంబంధ శరీరానికి కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలే ఉన్నాయని కాదు. మానవ పరిభాషలో చెప్పబడిన విషయాలను అక్షరార్థంగా తీసుకోకూడదు. అవి కేవలం దేవుని గురించి మానవులు మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయంతే. అలాంటి అలంకారార్థమైన భాష లేకుండా, అల్పులైన మానవులు దేవుని గురించిన ఎలాంటి వర్ణననైనా అర్థం చేసుకోవడం అసాధ్యం కాకపోయినా, చాలా కష్టమవుతుంది. అలాగని యెహోవా దేవుని వ్యక్తిత్వం మానవ కల్పితమని కాదు. దేవుడు మానవుని స్వరూపంలో కాదుగానీ, దేవుని స్వరూపంలోనే మానవుడు సృష్టించబడ్డాడని బైబిలు స్పష్టంగా వివరిస్తోంది. (ఆదికాండము 1:​27) బైబిలు రచయితలు “దైవావేశమువలన” వ్రాశారు కాబట్టి, దేవుని వ్యక్తిత్వాన్ని గురించిన వారి వర్ణన, నిజానికి తన వ్యక్తిగత లక్షణాల గురించి ఆయన వర్ణించినదే. అవే లక్షణాలను ఆయన వివిధ స్థాయిల్లో మానవుల్లో నాటాడు. (2 తిమోతి 3:​16, 17) కాబట్టి, మానవుని లక్షణాలు దేవునిలో ఉండడం కాదుగానీ దేవుని లక్షణాలే నిజానికి మానవునిలో ఉన్నాయి.

[4వ పేజీలోని చిత్రం]

నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు

[5వ పేజీలోని చిత్రం]

అబ్రాహాముకు దేవుని భావాలేమిటో బాగా తెలుసు

[6వ పేజీలోని చిత్రం]

దావీదు యెహోవాపై సంపూర్ణ నమ్మకముంచాడు

[7వ పేజీలోని చిత్రం]

మీరు బైబిలు చదువుతుండగా, దేవుణ్ణి ఎలా సంతోషపరచవచ్చో నేర్చుకోగలరు

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin