కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధులపట్ల శ్రద్ధ తీసుకోవడం—క్రైస్తవ బాధ్యత

వృద్ధులపట్ల శ్రద్ధ తీసుకోవడం—క్రైస్తవ బాధ్యత

వృద్ధులపట్ల శ్రద్ధ తీసుకోవడం​—⁠క్రైస్తవ బాధ్యత

“ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే; తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే.”​—⁠యెషయా 46:⁠4.

అంకిత భావంగల తల్లిదండ్రులు శైశవ దశనుండి బాల్యం వరకు, ఆ తర్వాత కౌమార దశవరకు తమ పిల్లలను పెంచి పోషిస్తారు. యౌవనులు వయోజనులై తమ సొంత కుటుంబాలు ఏర్పరచుకున్నా, వారి తండ్రులు, తల్లులు ఇంకా వారిపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తుంటారు, సహాయ హస్తం అందిస్తుంటారు.

2 మానవులు తమ పిల్లలకు చేసే వాటికి పరిమితులున్నా, మన పరలోకపు తండ్రి మాత్రం తన నమ్మకమైన సేవకులపట్ల ఎల్లప్పుడూ ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడు, సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. యెహోవా తాను ఏర్పరచుకొనిన తన ప్రాచీనకాల ప్రజలతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే; తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే.” (యెషయా 46:⁠4) వృద్ధ క్రైస్తవులకు ఇవి ఎంత ఓదార్పుకరమైన మాటలో కదా! యెహోవా తనపట్ల విశ్వసనీయంగా ఉండేవారిని ఎడబాయడు. బదులుగా వారిని జీవితమంతా, చివరికి వృద్ధాప్యంలో కూడా ఆదుకుంటానని, బలపరుస్తానని, నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.​—⁠కీర్తన 48:14.

3 వృద్ధులపట్ల యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను మనమెలా అనుకరించగలం? (ఎఫెసీయులు 5:​1, 2) పిల్లలు, సంఘ పైవిచారణకర్తలు, ఆయా క్రైస్తవులు మన ప్రపంచవ్యాప్త సౌభ్రాత్రుత్వంలోని వృద్ధుల అవసరాల గురించి శ్రద్ధ తీసుకోగల విధానాలను మనం పరిశీలిద్దాం.

పిల్లలుగా మన బాధ్యత

4 “నీ తండ్రిని తల్లిని సన్మానింపుము.” (ఎఫెసీయులు 6:2; నిర్గమకాండము 20:​12) హీబ్రూ లేఖనాల నుండి ఎత్తివ్రాయబడిన ఈ సరళమైనవే అయినా అర్థవంతమైనవైన మాటలతో అపొస్తలుడైన పౌలు, పిల్లలకు తమ తల్లిదండ్రులపట్ల ఉన్న బాధ్యతను వారికి గుర్తుచేశాడు. అయితే వృద్ధులపట్ల శ్రద్ధ చూపడానికి ఈ మాటలెలా అన్వయిస్తాయి? క్రైస్తవపూర్వ కాలాల్లోని ఒక శ్లాఘనీయ ఉదాహరణ ఈ ప్రశ్నకు జవాబిచ్చేందుకు మనకు సహాయం చేస్తుంది.

5 యోసేపుకు తన వృద్ధ తండ్రియైన పితరుడగు యాకోబుతో దాదాపు 20 సంవత్సరాలపాటు ఎలాంటి సంప్రదింపులు లేకుండాపోయాయి. అయినంత మాత్రాన, యాకోబుపట్ల యోసేపుకున్న పితృప్రేమ ఏ మాత్రం సన్నగిల్లలేదు. వాస్తవానికి, యోసేపు తనెవరో తన అన్నలకు తెలిపిన తర్వాత, ‘నా తండ్రి యింక బ్రదికియున్నాడా?’ అని అడిగాడు. (ఆదికాండము 43:7, 27; 45:⁠3) ఆ కాలంలో కనాను దేశం కరవు కోరల్లో ఉంది. అందువల్ల, యోసేపు ‘నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవు నాకు సమీపముగా ఉందువు. నేను నిన్ను పోషించెదను’ అని తన తండ్రికి కబురు పంపాడు. (ఆదికాండము 45:9-11; 47:​12) అవును, వృద్ధ తల్లిదండ్రులను సన్మానించడంలో వారు సొంతగా తమనుతాము చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని సంరక్షించడం, వారికి కావలసినవి సమకూర్చి వారిని పోషించడం ఇమిడివున్నాయి. (1 సమూయేలు 22:1-4; యోహాను 19:​25-27) యోసేపు సంతోషంగా ఈ బాధ్యతను అంగీకరించాడు.

6 యెహోవా ఆశీర్వాదంతో యోసేపు ఐగుప్తులోని అత్యధిక సంపన్నుల్లో, తిరుగులేని అధికారంగల వారిలో ఒకడయ్యాడు. (ఆదికాండము 41:​40) తన 130 ఏండ్ల తండ్రిని సన్మానించడానికి కుదరనంతటి ముఖ్యమైన వ్యక్తినన్నట్లుగా ఆయన తననుతాను ఎంచుకోలేదు లేక తనకు తీరదన్నట్లుగా చేయలేదు. యాకోబు (లేదా ఇశ్రాయేలు) సమీపించాడని తెలిసిన వెంటనే, “యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.” (ఆదికాండము 46:​28, 29) ఈ విధంగా స్వాగతించడం మామూలుగా గౌరవం చూపడం కంటే ఎక్కువే. యోసేపు తన తండ్రిని ప్రగాఢంగా ప్రేమించాడు, అంతేకాదు ఆ ప్రేమను ప్రదర్శించడానికి ఆయన సిగ్గుపడలేదు. మనకూ వృద్ధ తల్లిదండ్రులుంటే, వారిపట్ల మనం కూడా అదే రీతిలో అంతే ధారాళంగా మన అనురాగాన్ని వ్యక్తపరుస్తున్నామా?

7 యెహోవాపట్ల యాకోబుకున్న భక్తి ఆయన జీవితాంతం అలాగే బలంగా ఉంది. (హెబ్రీయులు 11:​21) యాకోబు దేవుని వాగ్దానాల్లో తనకున్న విశ్వాసాన్నిబట్టి తనను కనానులో సమాధి చేయమని అడిగాడు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి యోసేపు తన తండ్రి అడిగినట్లే చేయడం ద్వారా ఆయనను సన్మానించాడు.​—⁠ఆదికాండము 47:29-31; 50:7-14.

8 తన తండ్రి గురించి శ్రద్ధ తీసుకోవడానికి యోసేపును పురికొల్పిందేమిటి? తనను కని పెంచిన తండ్రి పట్ల ప్రేమ, తాను ఆయనకు రుణపడి ఉన్నాననే భావం అందుకు కొంత కారణమే అయినప్పటికీ, యోసేపుకు యెహోవాను సంతోషపెట్టాలనే ప్రగాఢమైన కోరికకూడా ఉండేదనడంలో సందేహం లేదు. మనకు కూడా అలాంటి కోరికే ఉండాలి. పౌలు ఇలా వ్రాశాడు: “ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.” (1 తిమోతి 5:⁠4) నిజంగా, వృద్ధ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చినా అలాచేయడానికి యెహోవాపట్ల మనకున్న ప్రేమ, భక్తిపూర్వక భయం మనలను పురికొల్పుతాయి. *

తాము శ్రద్ధచూపేవారమని సంఘపెద్దలెలా చూపిస్తారు

9 యాకోబు తన సుదీర్ఘ జీవిత అవసానదశలో, ‘ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటివరకు నన్ను పోషించాడని’ యెహోవాను సూచిస్తూ మాట్లాడాడు. (ఆదికాండము 48:​15-16) ‘ప్రధాన కాపరియగు’ తన కుమారుడైన యేసుక్రీస్తు నిర్దేశం క్రింద క్రైస్తవ పైవిచారణకర్తల లేదా పెద్దల ద్వారా నేడు యెహోవా తన భూసంబంధ సేవకులను కాస్తున్నాడు. (1 పేతురు 5:​2-4) పైవిచారణకర్తలు మందలోని వృద్ధ సభ్యుల గురించి శ్రద్ధ తీసుకునేటప్పుడు యెహోవానెలా అనుకరించవచ్చు?

10 క్రైస్తవ సంఘం స్థాపించబడిన అనతికాలంలోనే, బీదలైన క్రైస్తవ విధవరాండ్రకు “ఆహారము పంచిపెట్టుట[ను]” పర్యవేక్షించేందుకు అపొస్తలులు “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని[న] . . . యేడుగురు మనుష్యులను” నియమించారు. (అపొస్తలుల కార్యములు 6:​1-6) ఆ తర్వాత, పౌలు మాదిరికరంగా ఉన్న వృద్ధ విధవరాండ్రను సహాయం పొందనర్హులైన వారి లెక్కలో చేర్చవలసిందిగా పైవిచారణకర్తగా ఉన్న తిమోతిని ఆదేశించాడు. (1 తిమోతి 5:​3, 9, 10) అదే విధంగా, నేటి సంఘ పైవిచారణకర్తలు కూడా అవసరమైనప్పుడు వృద్ధ క్రైస్తవులకు ఆచరణాత్మక సహాయం అందించే ఏర్పాటు చేయడానికి సంతోషిస్తారు. అయితే, నమ్మకమైన వృద్ధులపట్ల శ్రద్ధచూపడంలో ఇంకా ఎక్కువే ఇమిడివుంది.

11 యేసు తన భూసంబంధ పరిచర్య చివరిదశలో దేవాలయంలో కూర్చొని “జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను.” ఆ సమయంలో ఒకరు ఆయన దృష్టినాకర్షించారు. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వే[సింది].” యేసు తన శిష్యులను పిలిచి వారితో ఇలా అన్నాడు, “కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను.” (మార్కు 12:​41-44) డబ్బుపరంగా మాట్లాడాలంటే ఆ విధవరాలి కానుక అల్పమే, అయితే భక్తికి సంబంధించిన అలాంటి హృదయపూర్వక వ్యక్తీకరణలను తన పరలోకపు తండ్రి ఎంత అమూల్యంగా పరిగణిస్తాడో యేసుకు తెలుసు. ఆ బీద విధవరాలి వయస్సేదైనా, ఆమె చేసిన పనిని యేసు అలక్ష్యం చేయలేదు.

12 యేసు మాదిరిగానే, క్రైస్తవ పైవిచారణకర్తలు సత్యారాధనకు తోడ్పడేందుకు వృద్ధులు చేసేవాటిని అలక్ష్యం చేయరు. వృద్ధులు పరిచర్యలో తమవంతు చేసినందుకు, కూటాల్లో భాగం వహించినందుకు, సంఘంలో వారి సానుకూల ప్రభావాన్నిబట్టి, వారి సహనాన్నిబట్టి పెద్దలు వారిని మెచ్చుకోవాలి. అలా యథార్థంగా ప్రోత్సహించడం వృద్ధులు తమ పవిత్ర సేవలో ‘అతిశయించడానికి’ సహాయపడడమే కాక, వారు ఇతర క్రైస్తవులు చేయగలుగుతున్న దానితో లేదా గతంలో తామే చేసినవాటితో పోల్చుకొని నిరుత్సాహపడకుండా ఉండడానికి తోడ్పడుతుంది.​—⁠గలతీయులు 6:4.

13 వృద్ధ క్రైస్తవుల అనుభవం నుండి, సామర్థ్యాల నుండి ప్రయోజనం పొందడం ద్వారా వారి విలువైన తోడ్పాటును పెద్దలు గుర్తించవచ్చు. ఆదర్శవంతులైన వృద్ధులను అప్పుడప్పుడు ప్రదర్శనల్లో లేదా ఇంటర్వ్యూల్లో ఉపయోగించవచ్చు. “సత్యంలో పిల్లలను పెంచిన ఒక వృద్ధ సహోదరుడిని లేదా సహోదరిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రేక్షకులు నిజంగా ఎంతో శ్రద్ధగా వింటారు” అని ఒక పెద్ద చెబుతున్నాడు. రాజ్య ప్రచారకులు క్షేత్రసేవకు క్రమంగా వచ్చేలా వారికి సహాయం చేయడంలో 71 సంవత్సరాల పయినీరు సహోదరి విజయం సాధించిందని మరో సంఘంలోని పెద్దలు నివేదిస్తున్నారు. బైబిలు చదవడం, దిన వచనం పరిశీలించడం, చదివిన వాటిని ధ్యానించడం వంటి “ప్రాథమిక” పనులు చేయమని కూడా ఆమె వారిని ప్రోత్సహిస్తుంది.

14 తోటి వృద్ధ పైవిచారణకర్తల తోడ్పాటును కూడా పెద్దలు విలువైనదిగా పరిగణిస్తారు. అనేక దశాబ్దాలపాటు పెద్దగా సేవచేసిన 70వ పడిలో ఉన్న జోజేకు ఇటీవలనే పెద్దాపరేషను అయ్యింది. కోలుకోవడానికి చాలాకాలం పడుతుండడంతో సంఘ పైవిచారణకర్తగా సేవచేసే తన ఆధిక్యతను వదులుకుందామని ఆయన తలంచాడు. జోజే ఇలా చెబుతున్నాడు: “దానికి ఇతర పెద్దల ప్రతిస్పందన నాకు ఆశ్చర్యం కలిగించింది. నా సూచనను అంగీకరించడానికి బదులు, నేను నా బాధ్యతలు కొనసాగించేందుకు నాకెలాంటి ఆచరణాత్మక సహాయం కావాలని వారు అడిగారు.” ఒక యౌవన పెద్ద సహాయంతో జోజే సంఘ పైవిచారణకర్తగా సేవచేయడంలో ఆనందంగా కొనసాగాడు, ఇది సంఘానికి దీవెనకరమయింది. తోటి పెద్ద ఒకరు ఇలా అంటున్నాడు: “పెద్దగా జోజే చేస్తున్న సేవను సహోదరులు ఎంతో విలువైనదిగా పరిగణిస్తున్నారు. ఆయనకున్న అనుభవాన్నిబట్టి, విశ్వాస మాదిరినిబట్టి ఆయనంటే వారికి ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆయన మా సంఘాన్ని సుసంపన్నం చేస్తున్నాడు.”

పరస్పరం శ్రద్ధ చూపుకోవడం

15వృద్ధులపట్ల శ్రద్ధ ఉండవలసింది కేవలం వృద్ధ తల్లిదండ్రులున్న పిల్లలకు, నియమిత సేవకులకు మాత్రమే కాదు. క్రైస్తవ సంఘాన్ని మానవ శరీరంతో పోలుస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.” (1 కొరింథీయులు 12:25) క్రైస్తవ సంఘం సామరస్యంగా పనిచేయాలంటే, వృద్ధులతోసహా అందులోని ప్రతీ సభ్యుడికి తోటి విశ్వాసుల సంక్షేమంపట్ల శ్రద్ధ ఉండాలి.—గలతీయులు 6:2.

16వృద్ధులపట్ల మన ఆసక్తిని ప్రదర్శించడానికి క్రైస్తవ కూటాలు చక్కని అవకాశమిస్తాయి. (ఫిలిప్పీయులు 2:4; హెబ్రీయులు 10:24, 25) అలాంటి సందర్భాల్లో వృద్ధులతో మాట్లాడేందుకు మనం సమయం తీసుకుంటామా? వారి భౌతిక సంక్షేమం గురించి వాకబు చేయడం సముచితమే అయినప్పటికీ, బహుశా క్షేమాభివృద్ధికరమైన ఒక అనుభవాన్నో లేదా ఒక లేఖన తలంపునో వారితో పంచుకోవడం ద్వారా మనం వారికి “ఆత్మసంబంధమైన కృపావరమేదైనా” ఇవ్వగలమా? కొంతమంది వృద్ధులు అంతగా లేచి తిరగలేరు కాబట్టి, వారే మనదగ్గరకు రావాలని ఎదురుచూడడం కంటే మనమే వారి దగ్గరకు వెళ్లడం దయగల పనిగా ఉంటుంది. వారికి వినికిడి సమస్య ఉంటే, మనం పదాలను స్పష్టంగా పలుకుతూ నెమ్మదిగా మాట్లాడవలసి ఉంటుంది. పరస్పరం నిజంగా “ఆదరణ పొందవలె[నంటే]” మనం వృద్ధులు చెప్పేది శ్రద్ధగా వినాలి.—రోమీయులు 1:11, 12.

17కొంతమంది వృద్ధులు క్రైస్తవ కూటాలకు హాజరు కాలేనట్లయితే అప్పుడెలా? “దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుట” మన విధ్యుక్త ధర్మమని యాకోబు 1:⁠27 చూపిస్తోంది. “పరామర్శించుట” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదానికి “వెళ్లి చూడడం” అనే అర్థం కూడా ఉంది. (అపొస్తలుల కార్యములు 15:​36) వృద్ధులను మనం వెళ్లి చూసినప్పుడు వారెంత ఆనందిస్తారో కదా! ‘వృద్ధుడైన’ పౌలు దాదాపు సా.శ. 65లో రోములో చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఆయన తన తోటి పనివాడైన తిమోతిని చూడాలనే కోరికతో ఇలా వ్రాశాడు: “నాయొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.” (ఫిలేమోను 8; 2 తిమోతి 1:3, 4; 4:⁠9) కొంతమంది వృద్ధులు అక్షరార్థంగా చెరసాలలో లేకపోయినా, అనారోగ్య సమస్యల కారణంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. నిజానికి వారు ‘దయచేసి నా యొద్దకు వచ్చేందుకు ప్రయత్నం చేయండి’ అని అంటుండవచ్చు. అలాంటి విన్నపాలకు మనం ప్రతిస్పందిస్తున్నామా?

18వృద్ధ ఆధ్యాత్మిక సహోదరుణ్ణి లేదా సహోదరిని సందర్శించడంలోని ప్రయోజనాత్మక ప్రభావాలను ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. ఓనేసిఫోరు అనే క్రైస్తవుడు రోములో ఉన్నప్పుడు శ్రద్ధగా పౌలును వెదకి కనుగొని, ‘అనేక పర్యాయములు ఆయనను ఆదరించాడు.’ (2 తిమోతి 1:16, 17) “యౌవనులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. నేను బాగా ఇష్టపడేదేమిటంటే వారు నన్ను వారి కుటుంబ సభ్యురాల్లాగే చూస్తారు. అది నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది” అని ఒక వృద్ధ సహోదరి చెబుతోంది. మరో వృద్ధ క్రైస్తవురాలు ఇలా చెబుతోంది: “ఎవరైనా నాకు గ్రీటింగ్‌ కార్డు పంపినా, ఫోన్‌చేసి కొద్దిసేపు మాట్లాడినా లేక కొద్ది సమయం నాతో గడపడానికి నా దగ్గరకు వచ్చినా నిజంగా నేనెంతో సంతోషిస్తాను. అవి నాకెంతో ఉత్తేజాన్నిస్తాయి.”

శ్రద్ధ తీసుకునే వారికి యెహోవా ప్రతిఫలమిస్తాడు

19వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకోవడం అనేక ఆశీర్వాదాలు తెస్తుంది. వృద్ధులతో సహవసించడం, వారి జ్ఞానం నుండి, అనుభవం నుండి ప్రయోజనం పొందడమే ఒక గొప్ప ఆధిక్యత. శ్రద్ధచూపేవారు ఇవ్వడం వల్ల లభించే గొప్ప ఆనందాన్ని చవిచూస్తారు, అలాగే తమకున్న లేఖన బాధ్యతను నెరవేర్చామనే భావనతోపాటు అంతరంగ సమాధానం కూడా అనుభవిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:35) అంతేకాదు, వృద్ధులపట్ల శ్రద్ధచూపేవారు తమ వృద్ధాప్యంలో తాము విడిచిపెట్టబడతామని భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మనకిలా అభయమిస్తోంది: “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”​—⁠సామెతలు 11:25.

20తోటి వృద్ధ విశ్వాసుల అవసరాల గురించి నిస్వార్థంగా శ్రద్ధ తీసుకున్న దైవభయంగల పిల్లలకు, పైవిచారణకర్తలకు, ఇతర క్రైస్తవులకు యెహోవా ప్రతిఫలమిస్తాడు. అలాంటి స్ఫూర్తి ఈ సామెతకు అనుగుణంగా ఉంటుంది: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” (సామెతలు 19:17) దీనులను, బీదలను ఆదరించడానికి ప్రేమ మనలను పురికొల్పితే అలా ఇవ్వడాన్ని దేవుడు తనకు అప్పిచ్చినట్లుగా పరిగణించి, ఆయన దీవెనలతో ప్రత్యుపకారం చేస్తాడు. ‘లోక విషయంలో దరిద్రులుగా ఉన్నప్పటికీ విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్న’ ఎంతోమంది తోటి వృద్ధ ఆరాధకుల గురించి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకున్నందుకు కూడా ఆయన మనకు ప్రతిఫలమిస్తాడు.​—⁠యాకోబు 2:5.

21దేవుడిచ్చే ప్రతిఫలం ఎంత ఉదారంగా ఉంటుందో కదా! ఆ ప్రతిఫలంలో నిత్యజీవం ఇమిడివుంది. యెహోవా సేవకుల్లో అత్యధికులకు ఆ ప్రతిఫలం, పరదైసు భూమిపై నిత్యం జీవించడమై ఉంటుంది, అక్కడ వారసత్వ పాపపు ప్రభావాలు తొలగించబడతాయి అలాగే నమ్మకస్థులైన వృద్ధులు తమకు తిరిగి తమ యౌవన బలం పునరుద్ధరించబడడం చవిచూస్తారు. (ప్రకటన 21:3-5) ఆ దీవెనకర కాలం కోసం మనం ఎదురుచూస్తుండగా, వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకోవడమనే మన క్రైస్తవ బాధ్యతను నెరవేర్చడంలో కొనసాగుదము గాక.

[అధస్సూచి]

^ పేరా 11 వృద్ధ తల్లిదండ్రులపట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలనే దానిపై ఆచరణాత్మక సలహాల కోసం తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 1994, 3-10 పేజీలు చూడండి.

మీ జవాబులేమిటి?

పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులనెలా సన్మానించగలరు?

మందలోని వృద్ధులపట్ల పెద్దలెలా మెప్పు చూపిస్తారు?

వృద్ధులపట్ల యథార్థమైన ఆసక్తి ప్రదర్శించడానికి ఆయావ్యక్తులుగా క్రైస్తవులు ఏమిచేయవచ్చు?

వృద్ధ క్రైస్తవులపట్ల శ్రద్ధ తీసుకోవడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మన పరలోకపు తండ్రిచూపే శ్రద్ధ మానవ తల్లిదండ్రులు చూపే శ్రద్ధకు ఎలా భిన్నంగా ఉంటుంది?

3. ఈ ఆర్టికల్‌లో ఏ విషయం పరిశీలించబడుతుంది?

4. క్రైస్తవ పిల్లలకు తమ తల్లిదండ్రులపట్ల ఎలాంటి బాధ్యత ఉంది?

5. (ఎ) కుమారునిగా తన విధ్యుక్త ధర్మాన్ని యోసేపు విస్మరించలేదని ఏది సూచిస్తోంది? (బి) మన తల్లిదండ్రులను సన్మానించడమంటే అర్థమేమిటి, ఈ విషయంలో యోసేపు ఎలాంటి చక్కని మాదిరి ఉంచాడు?

6. యోసేపు తన తండ్రిపట్ల తన యథార్థ ప్రేమనెలా ప్రదర్శించాడు, ఆయన మాదిరిని మనమెలా అనుకరించగలం?

7. యాకోబు తనను కనానులో సమాధిచేయమని ఎందుకు కోరుకున్నాడు?

8. (ఎ) వృద్ధ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడంలో మన ముఖ్య పురికొల్పు ఏమైయుంది? (బి) తన వృద్ధ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఒక పూర్తికాల సేవకుడు ఏమి చేశాడు? (17వ పేజీలోని బాక్సు చూడండి.)

9. వృద్ధ క్రైస్తవులతోసహా మందను కాయడానికి యెహోవా ఎవరిని నియమించాడు?

10. వృద్ధ క్రైస్తవులకు అవసరమైనవి అందించేందుకు ఏమి చేయబడింది? (19వ పేజీలోని బాక్సు చూడండి.)

11. అల్పకానుక వేసిన బీద విధవరాలి గురించి యేసు ఏమిచెప్పాడు?

12. వృద్ధ క్రైస్తవులు చేస్తున్న వాటిపట్ల పెద్దలు తమ ప్రశంసను ఎలా వ్యక్తపరచవచ్చు?

13. పెద్దలు వృద్ధుల సామర్థ్యాల నుండి, అనుభవం నుండి ఏయే విధాలుగా ప్రయోజనం పొందవచ్చు?

14. తోటి వృద్ధ పైవిచారణకర్తపట్ల ఒక పెద్దల సభ ఎలా ప్రశంస చూపింది?

15. క్రైస్తవులందరికీ తమ మధ్యగల వృద్ధుల సంక్షేమంపట్ల ఎందుకు ఆసక్తి ఉండాలి?

16. క్రైస్తవ కూటాలకు హాజరైనప్పుడు వృద్ధులపట్ల మనమెలా ఆసక్తి చూపవచ్చు?

17. ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధ క్రైస్తవులపట్ల మనమెలా శ్రద్ధ చూపించగలం?

18. మనం వృద్ధులను సందర్శించడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

19. వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

20, 21. వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకునే వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు, మన తీర్మానమేమైయుండాలి?

[17వ పేజీలోని బాక్సు]

ఆయన తల్లిదండ్రులకు సహాయం అవసరమైనప్పుడు

ఫిలిప్‌ 1999లో, లైబీరియాలో స్వచ్ఛంద నిర్మాణ పనివానిగా సేవచేస్తుండగా, తన తండ్రికి బాగా జబ్బుచేసిందనే వార్త అందుకున్నాడు. తన తల్లి సొంతగా ఏమీ చేయలేని స్థితిలో ఉంటుందనే విషయం గ్రహించి ఆయన తన తండ్రికి వైద్యం చేయించే ఉద్దేశంతో ఇంటికి వెళ్లాలని తీర్మానించుకున్నాడు.

“వెనక్కి తిరిగి వెళ్లడం అంత సులభం కాలేదు, అయితే నా తల్లిదండ్రులపట్ల శ్రద్ధ చూపించడం నా ప్రాథమిక కర్తవ్యంగా నేను భావించాను” అని ఫిలిప్‌ చెబుతున్నాడు. తర్వాతి మూడు సంవత్సరాల కాలంలో ఆయన తన తల్లిదండ్రులను మరింత అనుకూలమైన ఇంటికి మార్చి, స్థానిక తోటి క్రైస్తవుల సహాయంతో ఆయన తన తండ్రి ప్రత్యేక అవసరాలకు తగ్గట్లుగా ఆ నివాసానికి మార్పులు చేశాడు.

ఇప్పుడు ఫిలిప్‌ తల్లి, ఆయన తండ్రికున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వ్యవహరించడానికి మరింత సంసిద్ధంగా ఉంది. ఇటీవలనే, ఫిలిప్‌ మాసిడోనియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో స్వచ్ఛంద సేవకునిగా పనిచేసేందుకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించగలిగాడు.

[19వ పేజీలోని బాక్సు]

ఆమె అవసరాలను వారు అలక్ష్యం చేయలేదు

ఆడే అనే 85 సంవత్సరాల వృద్ధ క్రైస్తవురాలు ఆస్ట్రేలియాలో ఉంటోంది, ఆమె అనారోగ్య కారణాలవల్ల ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, సంఘ పెద్దలు ఆమెకు సహాయంచేసే ఏర్పాట్లు చేశారు. ఆమెకు సహాయం చేయగల తోటి విశ్వాసులను కొందరిని ఏర్పాటు చేశారు. ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, వంట చేయడం, సరుకులు కొనుక్కురావడంవంటి పనుల్ని ఈ సహోదర సహోదరీలు సంతోషంగా చేశారు.

అలా సహాయం చేయడం దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించబడింది. ఇప్పటివరకు తోటి యెహోవాసాక్షులు 30 కంటే ఎక్కువమంది ఆడేపట్ల శ్రద్ధ చూపడంలో సహాయం చేశారు. వారు ఆమెను సందర్శిస్తూ ఆమెకు బైబిలు సాహిత్యాలు చదివి వినిపించడంలో, సంఘంలోని వారి ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆమెకు తెలియజేయడంలో, క్రమంగా ఆమెతో కలిసి ప్రార్థించడంలో ఇప్పటికీ కొనసాగుతున్నారు.

స్థానిక పెద్ద ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: “ఆడేపట్ల శ్రద్ధ తీసుకుంటున్నవారు ఆమెకు సహాయం చేయడాన్ని ఒక ఆధిక్యతగా భావిస్తున్నారు. దశాబ్దాలుగా ఆమెచేసిన నమ్మకమైన సేవ అనేకులకు స్ఫూర్తిదాయకంగా ఉంది, అందువల్ల ఆమె అవసరాలను నిర్లక్ష్యం చేయడాన్ని వారు ఊహించలేకపోతున్నారు.”

[16వ పేజీలోని చిత్రం]

వృద్ధ తల్లిదండ్రులపట్ల మన అనురాగాన్ని వ్యక్తపరచడంలో మనం ఉదారంగా ఉన్నామా?

[18వ పేజీలోని చిత్రాలు]

సంఘంలోని వారందరూ తోటి వృద్ధ విశ్వాసులపట్ల తమ ప్రేమను ప్రదర్శించవచ్చు