కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధులు—మన క్రైస్తవ సౌభ్రాతృత్వంలో అమూల్యమైనవారు

వృద్ధులు—మన క్రైస్తవ సౌభ్రాతృత్వంలో అమూల్యమైనవారు

వృద్ధులు​—⁠మన క్రైస్తవ సౌభ్రాతృత్వంలో అమూల్యమైనవారు

“యెహోవా మందిరములో నాటబడినవారై వారు . . . వర్ధిల్లుదురు. వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు.”​—⁠కీర్తన 92:13, 15.

వృద్ధ సేవకులతో సహా యెహోవా నమ్మకమైన తన సేవకులందరినీ ప్రేమిస్తాడు. అయితే ఒక జాతీయ అంచనా ప్రకారం అమెరికాలో ప్రతీ సంవత్సరం దాదాపు ఐదులక్షలమంది వృద్ధులు అనాదరణకు లేదా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ప్రపంచ నలుమూలల నుండి అందుతున్న అలాంటి నివేదికలు వృద్ధుల అనాదరణ సమస్య భౌగోళిక సమస్యగా ఉందని సూచిస్తున్నాయి. “చాలామందిలో ప్రబలంగా ఉన్న దృక్పథం . . . అంటే వృద్ధులు పనికిరాకుండా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తూ, ఏ లాభం లేకుండా, కేవలం ఆధారపడే వారిగా ఉంటున్నారనే దృక్పథం” అని ఒక సంస్థ చెబుతున్నదే సమస్యకు అసలు కారణంగా ఉంది.

2 యెహోవా దేవుడు తన విశ్వసనీయ వృద్ధ సేవకులను అమూల్యమైన వారిగా పరిగణిస్తాడు. ఆయన ‘ఆంతర్యపురుషునిపై’ అంటే మన ఆధ్యాత్మిక స్థితిపై దృష్టి నిలుపుతాడే తప్ప మన భౌతిక పరిమితులపై కాదు. (2 కొరింథీయులు 4:​16) ఆయన వాక్యమైన బైబిల్లో మనం హృదయోత్తేజకరమైన ఈ హామీని చూస్తాం: “నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు. లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని . . . ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు.” (కీర్తన 92:​12-15) ఈ వచనాల పరిశీలన క్రైస్తవ సహోదరత్వానికి వృద్ధులైన మీరు అందించగల విలువైన తోడ్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వెల్లడిచేస్తుంది.

‘ముసలితనమందు చిగురు పెట్టుచుందురు’

3 కీర్తనకర్త నీతిమంతులను ‘మన దేవుని ఆవరణములలో’ నాటబడిన ఖర్జూరవృక్షాలకు పోలుస్తున్నాడు. వారు “ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు.” మరో భాషాంతరంలో ఈ వచనమిలా ఉంది: “వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.” (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఇది ప్రోత్సాహకరమైన భావన అని మీరు అంగీకరించరా? బైబిలు కాలాల్లో ప్రాచ్యదేశాల్లోని ఇండ్ల ఆవరణలో నిటారుగా ఎదిగిన సొగసైన ఖర్జూరవృక్షాలు కనబడడం సర్వసాధారణం. ఖర్జూరవృక్షాలు ఆకర్షణీయమైన రూపంతోపాటు వాటి ఫలాలనుబట్టి విలువైనవిగా ఎంచబడేవి, కొన్ని వృక్షాలైతే వంద సంవత్సరాలకుపైగా ఫలించేవి. * సత్యారాధనలో స్థిరంగా నాటుకొని ఉండడం ద్వారా మీరు కూడా “ప్రతి సత్కార్యములో సఫలు[లు]” కాగలరు.​—⁠కొలొస్సయులు 1:9.

4 క్రైస్తవులు తమ ‘జిహ్వాఫలాన్ని అర్పించాలని’ అంటే తనను స్తుతించే, తన సంకల్పాలు తెలియజేసే మాటలు మాట్లాడాలని యెహోవా అపేక్షిస్తున్నాడు. (హెబ్రీయులు 13:​15) వృద్ధునిగా ఇది మీకూ అన్వయిస్తుందా? తప్పక అన్వయిస్తుంది.

5 యెహోవా నామం గురించి, ఆయన సంకల్పాల గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చిన వృద్ధుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. యెహోవా తన ప్రవక్తగా, ప్రతినిధిగా ఉండమని ఆజ్ఞాపించే నాటికి మోషే వయస్సు ‘డెబ్బై సంవత్సరాలకంటే’ ఎక్కువే ఉంది. (కీర్తన 90:10; నిర్గమకాండము 4:​10-17) యెహోవా సర్వాధిపత్యం గురించి ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి దానియేలు ప్రవక్తకు తన వృద్ధాప్యం అడ్డుకాలేదు. గోడమీదున్న నిగూఢమైన చేవ్రాత భావాన్ని వివరించడానికి బెల్షస్సరు పిలిపించినప్పుడు దానియేలు బహుశా తన 90వ పడిలో ఉండవచ్చు. (దానియేలు, 5వ అధ్యాయం) వృద్ధ అపొస్తలుడైన యోహాను విషయమేమిటి? “దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును” ఆయన తన నమ్మకమైన సుదీర్ఘ సేవ చరమాంకంలో పత్మాసు ద్వీపంలో చెరగా ఉన్నాడు. (ప్రకటన 1:⁠9) తమ వృద్ధాప్యంలో ‘జిహ్వాఫలం అర్పించిన,’ బైబిల్లో పేర్కొనబడిన ఇతరత్రా అనేకమంది వ్యక్తులను మీరు సులభంగానే గుర్తుచేసుకోవచ్చు.​—⁠1 సమూయేలు 8:1, 10; 12:2; 1 రాజులు 14:4, 5; లూకా 1:7, 67-79; 2:22-32.

6 హీబ్రూ ప్రవక్తయైన యోవేలును ఉదహరిస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా ప్రకటించాడు: ‘అంత్యదినములయందు నేను [‘వృద్ధులతో’ సహా] మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు అని దేవుడు చెబుతున్నాడు.’ (అపొస్తలుల కార్యములు 2:​17, 18, 21; యోవేలు 2:​28) ఆ ప్రకారమే, ఈ అంత్యదినాల్లో యెహోవా తన సంకల్పాలు ప్రకటించేందుకు అభిషిక్త తరగతిలోని, అలాగే ‘వేరే గొఱ్ఱెలలోని’ వృద్ధులను ఉపయోగించాడు. (యోహాను 10:​16) వీరిలో కొందరు దశాబ్దాలుగా నమ్మకంగా రాజ్య ఫలాలు ఫలిస్తూ ఉన్నారు.

7 సోనియా విషయమే తీసుకోండి, ఆమె 1941లో పూర్తికాల రాజ్య ప్రచారకురాలయ్యింది. దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, ఆమె తన గృహంలో క్రమంగా బైబిలు అధ్యయనాలు నిర్వహించింది. “సువార్త ప్రకటించడం నా జీవితంలో ఒక భాగమైపోయింది. నిజం చెప్పాలంటే అదే నా జీవితం. నేనలా చేయకుండా ఉండలేను” అని సోనియా వివరిస్తోంది. ఈ మధ్యనే సోనియా, ఆమె అక్క ఆలివ్‌ ఆసుపత్రిలో వేచియుండే గదిలో తమకు కలిసిన తీవ్ర వ్యాధిగ్రస్థురాలైన జానెట్‌తో బైబిల్లోని నిరీక్షణా సందేశాన్ని పంచుకున్నారు. క్యాథలిక్‌ విశ్వాసియైన జానెట్‌ తల్లి తన కూతురుపట్ల చూపించబడిన ఈ ప్రేమపూర్వక ఆసక్తికి ఎంతో ముగ్ధురాలై గృహ బైబిలు అధ్యయనానికి ఒప్పుకొని ఇప్పుడు చక్కగా అభివృద్ధి సాధిస్తోంది. రాజ్య ఫలాలు ఫలించడానికి అలాంటి అవకాశాలను మీరు చేజిక్కించుకుంటారా?

8 వృద్ధ క్రైస్తవులు తమకు వృద్ధాప్య పరిమితులున్నా రాజ్య ప్రచారపనిలో ధైర్యంగా ముందుకు సాగడం ద్వారా, నాలుగు దశాబ్దాలపాటు అరణ్యంలో మోషేతోపాటు ప్రయాణించిన నమ్మకమైన ఇశ్రాయేలీయుడైన కాలేబు అడుగుజాడల్లో నడుస్తున్నారు. యొర్దాను నది దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించే నాటికి కాలేబు వయస్సు 79 సంవత్సరాలు. అపజయమెరుగని ఇశ్రాయేలు సైన్యంలో ఆరు సంవత్సరాలు సైనికునిగా పనిచేసిన తర్వాత, ఆయన సంతుష్టిగా విశ్రాంతి తీసుకొని ఉండగలిగేవాడే. కానీ ఆయనలా చేయలేదు, బదులుగా యూదా కొండప్రదేశాల్లో, భారీ శరీరులైన అనాకీయులు నివాసమున్న “ప్రాకారములుగల గొప్ప పట్టణము[లను]” పట్టుకునే అతి కష్టమైన నియామకం తనకిమ్మని ఆయన ధైర్యంగా అభ్యర్థించాడు. యెహోవా సహాయంతో కాలేబు ‘యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొన్నాడు.’ (యెహోషువ 14:9-14; 15:​13, 14) వృద్ధాప్యంలో మీరు విడువక రాజ్య ఫలాలు ఫలిస్తుండగా, కాలేబుతో ఉన్నట్లే యెహోవా మీతోకూడా ఉన్నాడనే నమ్మకంతో ఉండండి. మీరు నమ్మకంగా నిలిచివుంటే, ఆయన తన వాగ్దత్త నూతనలోకంలో మీకు స్థలం అనుగ్రహిస్తాడు.​—⁠యెషయా 40:29-31; 2 పేతురు 3:​13.

“సారము కలిగి పచ్చగా నుందురు”

9 యెహోవా వృద్ధ సేవకుల నమ్మకత్వంవైపు శ్రద్ధమళ్లిస్తూ, కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు. లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు. వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు.”​—⁠కీర్తన 92:​12, 15.

10 వయస్సు పైబడుతున్నప్పటికీ మీరు మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నిలుపుకోవచ్చు? ఖర్జూరవృక్షానికి నిరంతరం నీరు లభించడమే వాడబారని దాని చక్కదనానికి రహస్యం. అదేవిధంగా, దేవుని వాక్య అధ్యయనం ద్వారా, ఆయన సంస్థతో సహవసించడం ద్వారా మీరు కూడా బైబిలు సత్య జలాలతో పోషించబడవచ్చు. (కీర్తన 1:1-3; యిర్మీయా 17:​7, 8) మీ ఆధ్యాత్మిక బలం తోటి విశ్వాసులకు మిమ్మల్ని అమూల్య సంపదగా చేస్తుంది. వృద్ధ ప్రధాన యాజకుడైన యెహోయాదా విషయంలో ఇదెలా నిజమని నిరూపించబడిందో పరిశీలించండి.

11 ప్రగాఢ వాంఛగల అతల్యా రాణి తన సొంత మనవళ్లను హత్యచేసి యూదా ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నప్పుడు యెహోయాదా బహుశా శతాధిక వృద్ధుడై ఉండవచ్చు. ఈ వృద్ధ యెహోయాదా ఏమిచేయగలడు? ఆయన, ఆయన భార్య, బ్రతికున్న ఏకైక రాజ్యవారసుడైన యోవాషును దాదాపు ఆరు సంవత్సరాలపాటు దేవాలయంలో దాచిపెట్టారు. ఆ తర్వాత, యెహోయాదా నాటకీయంగా ఏడేళ్ల యోవాషును రాజుగా ప్రకటించి అతల్యాను చంపించాడు.​—⁠2 దినవృత్తాంతములు 22:​10-12; 23:1-3, 15, 21.

12 రాజ సంరక్షకునిగా యెహోయాదా సత్యారాధనను పెంపొందింపజేయడానికి తన పలుకుబడిని ఉపయోగించాడు. యెహోయాదా “జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను.” యెహోయాదా ఆజ్ఞమేరకు, ప్రజలు అబద్ధ దేవతయైన బయలుయొక్క గుడిని పడగొట్టి, దాని బలిపీఠములను, విగ్రహములను, దాని యాజకుణ్ణి నిర్మూలించారు. అలాగే యెహోయాదా నిర్దేశం మేరకే యోవాషు దేవాలయ సేవలను పునరుద్ధరించి, ఎంతో అవసరమైన దేవాలయ మరమ్మత్తులు కొనసాగించాడు. “యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడై యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.” (2 దినవృత్తాంతములు 23:​11, 16-19; 24:11-14; 2 రాజులు 12:⁠2) యెహోయాదా తన 130వ యేట మరణించినప్పుడు, ఆయనకు రాజులతోపాటు పాతిపెట్టబడే అసాధారణమైన ఘనత ఇవ్వబడింది ఎందుకంటే ఆయన “ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను.”​—⁠2 దినవృత్తాంతములు 24:​15, 16.

13 సత్యారాధనను పెంపొందింపజేయడానికి మీరు చేయగల దానిని క్షీణిస్తున్న మీ ఆరోగ్యం లేదా ఇతర పరిస్థితులు బహుశా పరిమితం చేయవచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, ‘సత్య దేవుని దృష్టికి, ఆయన ఇంటివారి దృష్టికి’ మీరు మంచివారిగా ఉండే అవకాశముంది. సంఘ కూటాలకు హాజరవడం ద్వారా, వాటిలో భాగం వహించడం ద్వారా, సాధ్యమైనప్పుడల్లా క్షేత్ర పరిచర్యలో పాల్గోవడం ద్వారా మీరు యెహోవా ఆధ్యాత్మిక గృహంపట్ల ఆసక్తిని ప్రదర్శించవచ్చు. బైబిలు ఉపదేశాన్ని మీరు ఇష్టపూర్వకంగా అంగీకరించడం, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి,’ సంఘానికి యథార్థంగా మీరిచ్చే మద్దతు క్రైస్తవ సౌభ్రాత్రుత్వంపై బలవర్ధకమైన ప్రభావం చూపుతుంది. (మత్తయి 24:​45-47) అంతేగాక మీరు ‘ప్రేమచూపడానికి, సత్కార్యములు చేయడానికి’ కూడా మీ తోటి ఆరాధకులను పురికొల్పవచ్చు. (హెబ్రీయులు 10:​24, 25; ఫిలేమోను 8, 9) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఉపదేశానికి అనుగుణంగా మీరు ప్రవర్తించినప్పుడు మీరు ఇతరులకు ఒక ఆశీర్వాదంగా ఉంటారు: ‘వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలెను. ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెను.’​—⁠తీతు 2:2-4.

14 మీరు చాలా సంవత్సరాల పాటు సంఘ పెద్దగా సేవ చేశారా? “వయస్సుతోపాటు వచ్చే జ్ఞానాన్ని నిస్వార్థంగా ఉపయోగించండి. బాధ్యత అప్పగించండి, దానిపట్ల ఇష్టత చూపించేవారితో మీ అనుభవం పంచుకోండి. . . . ఇతరుల్లోవున్న సామర్థ్యాన్ని పసిగట్టండి. ఆ సామర్థ్యాన్ని వృద్ధిచేసి, పెంపొందించండి. భవిష్యత్తులో ఆయా బాధ్యతల కోసం ఏర్పాట్లుచేయండి” అని ఒక దీర్ఘకాల సంఘపెద్ద సూచిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 3:​27, 28) అంతకంతకూ విస్తరిస్తున్న రాజ్య సేవపట్ల మీ యథార్థ ఆసక్తి మన క్రైస్తవ సౌభ్రాత్రుత్వంలోని ఇతరులకు అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తుంది.

‘యెహోవా యథార్థవంతుడని ప్రసిద్ధి చేయండి’

15 దేవుని వృద్ధ సేవకులు ‘యెహోవా యథార్థవంతుడని ప్రసిద్ధి చేయవలసిన’ తమ బాధ్యతను ఆనందంగా నెరవేరుస్తారు. మీరొక వృద్ధ క్రైస్తవుడైతే మీ మాటలు, క్రియలు ‘యెహోవా మీ ఆశ్రయదుర్గమని, ఆయనయందు ఏ చెడుతనమూ లేదని’ ఇతరులకు చూపించగలవు. (కీర్తన 92:​14) ఖర్జూరవృక్షం తన సృష్టికర్త సర్వోన్నత లక్షణాలకు మౌన సాక్ష్యమిస్తుంది. కానీ ఇప్పుడు సత్యారాధనను హత్తుకొంటున్న వారికి తన గురించి సాక్ష్యమిచ్చే ఉత్కృష్ట ఆధిక్యతను యెహోవా మీకిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 32:7; కీర్తన 71:17, 18; యోవేలు 1:​2, 3) ఇదెందుకు ప్రాముఖ్యం?

16 ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువ ‘బహు సంవత్సరములుగల వృద్ధుడైనప్పుడు,’ ఆయన “ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి” వారికి దేవుని యథార్థ వ్యవహారాలను గుర్తుచేశాడు. ఆయన వారికిలా గుర్తుచేశాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలే[దు].” (యెహోషువ 23:​1, 2, 14) ఈ మాటలు కొంతకాలం వరకు, నమ్మకంగా ఉండాలనే ప్రజల తీర్మానాన్ని బలపరిచాయి. అయితే యెహోషువ మరణం తర్వాత, “యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, . . . బయలు దేవతలను పూజించి[రి].”​—⁠న్యాయాధిపతులు 2:8-11.

17 ప్రస్తుత దిన క్రైస్తవ సంఘపు యథార్థత దేవుని వృద్ధ సేవకుల మౌఖిక సాక్ష్యంపై ఆధారపడదు. అయినప్పటికీ, ఈ అంత్యదినాల్లో యెహోవా తన ప్రజలకోసం చేసిన గొప్ప “కార్యములను” ప్రత్యక్షంగా చూసినవారు చెప్పినవి విన్నప్పుడు ఆయనపై, ఆయన వాగ్దానాలపై మనకున్న విశ్వాసం బలపడుతుంది. (న్యాయాధిపతులు 2:7; 2 పేతురు 1:​16-19) మీరు యెహోవా సంస్థతో అనేక సంవత్సరాలుగా సహవసిస్తుంటే, మీ ప్రాంతంలో లేదా దేశంలో రాజ్య ప్రచారకులు చాలా తక్కువగా ఉన్న కాలాన్ని లేదా రాజ్య ప్రకటనా పనికి తీవ్ర వ్యతిరేకత ఎదురైన కాలాన్ని మీరు గుర్తుచేసుకోవచ్చు. కాలప్రవాహంలో, యెహోవా ఆయా అడ్డంకులను తొలగించడాన్ని, రాజ్యాభివృద్ధిని ‘త్వరపెట్టడాన్ని’ మీరు చూశారు. (యెషయా 54:17; 60:​22) బైబిలు సత్యాల స్పష్టీకరణను మీరు గమనించారు, దేవుని దృశ్య సంస్థ ప్రగతిశీల సవరణలు మీరు చూశారు. (సామెతలు 4:18; యెషయా 60:​17) యెహోవా యథార్థ వ్యవహారాలకు సంబంధించిన మీ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వారిని పురికొల్పడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? క్రైస్తవ సౌభ్రాత్రుత్వంపై ఇదెంత సానుకూలమైన, బలవర్ధకమైన ప్రభావం చూపగలదో కదా!

18 మీరు మీ వ్యక్తిగత జీవితంలో యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను, నిర్దేశాన్ని పొందిన సందర్భాల విషయమేమిటి? (కీర్తన 37:25; మత్తయి 6:33; 1 పేతురు 5:⁠7) “ఏమి జరిగినాసరే, ఎప్పటికీ యెహోవాను విడిచిపెట్టకండి, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు” అని చెబుతూ మార్తా అనే ఒక వృద్ధ సహోదరి ఇతరులను ప్రోత్సహించేది. ఈ సలహా 1960వ దశాబ్దం తొలిభాగంలో బాప్తిస్మం తీసుకున్న మార్తా బైబిలు విద్యార్థినియైన టోల్మినాపై గట్టి ప్రభావం చూపింది. “నా భర్త మరణించినప్పుడు నేను చాలా నిరుత్సాహపడ్డాను, అయితే ఆ మాటలు నేను ఒక్క కూటాన్ని కూడా తప్పిపోకూడదని తీర్మానించుకొనేలా చేశాయి. నేనలా కొనసాగేందుకు యెహోవా నిజంగా నన్ను బలపరిచాడు” అని టోల్మినా జ్ఞాపకం చేసుకుంటోంది. కాలగమనంలో టోల్మినా కూడా తన బైబిలు విద్యార్థులనేకులకు అదే సలహా ఇచ్చింది. అవును ప్రోత్సాహాన్నిస్తూ, యెహోవా యథార్థ వ్యవహారాలను వివరిస్తూ మీరు తోటి విశ్వాసుల విశ్వాసాన్ని బలపరిచేందుకు ఎంతైనా చేయవచ్చు.

నమ్మకమైన వృద్ధులను యెహోవా అమూల్యమైనవారిగా పరిగణిస్తాడు

19 కృతఘ్నతా భావం నిండిన నేటి ప్రపంచంలో వృద్ధులపట్ల శ్రద్ధచూపడానికి సమయమే లేదు. (2 తిమోతి 3:​1, 2) వారిని గుర్తుచేసుకున్నా, వారు గతంలో చేసినవాటిని బట్టే అంటే వారు ఒకప్పుడు చేసినదాన్ని బట్టే గాని వారిప్పుడు చేస్తున్నదాన్ని బట్టి కాదు. దానికి భిన్నంగా, బైబిలు ఇలా చెబుతోంది: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:​10) మీ విశ్వాస కార్యాల గత చరిత్రను యెహోవా దేవుడు మరచిపోడు. అయితే తన సేవలో మీరింకనూ చేస్తున్నదాన్నిబట్టి కూడా ఆయన మిమ్మల్ని విలువైన వారిగా పరిగణిస్తాడు. అవును, నమ్మకమైన వృద్ధులను ఆయన ఫలవంతమైనవారిగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, శక్తిమంతులైన క్రైస్తవులుగా అంటే తన శక్తికి సజీవ సాక్ష్యంగా దృష్టిస్తాడు.​—⁠ఫిలిప్పీయులు 4:13.

20 మీరు మన క్రైస్తవ సౌభ్రాత్రుత్వంలోని వృద్ధ సభ్యులను యెహోవా దృష్టించినట్లే దృష్టిస్తారా? మీరలా దృష్టిస్తే, వారిపట్ల మీ ప్రేమ చూపడానికి మీరు పురికొల్పబడతారు. (1 యోహాను 3:​18) వారి అవసరాలపట్ల శ్రద్ధ తీసుకోవడంలో అలాంటి ప్రేమ చూపడానికి కొన్ని ఆచరణాత్మక విధానాలను తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 6 ఖర్జూరవృక్షపు ప్రతీ గుత్తిలో వెయ్యికిపైగా ఖర్జూరపు పండ్లువుండి, అవి ఎనిమిది కిలోలు లేక అంతకంటే ఎక్కువ బరువు తూగుతాయి. “కాపుకాసే ప్రతీ ఖర్జూరవృక్షం బ్రతికిన కాలంలో దాని యజమానికి రెండు, మూడు టన్నుల ఖర్జూరపు పంట అందిస్తుంది” అని ఒక రచయిత అంచనా వేస్తున్నాడు.

మీ జవాబులేమిటి?

వృద్ధులెలా ‘ఫలాలు ఫలిస్తారు’?

వృద్ధ క్రైస్తవుల ఆధ్యాత్మిక బలం ఎందుకు ఒక అమూల్య సంపద?

‘యెహోవా యథార్థవంతుడని’ వృద్ధులెలా ‘ప్రసిద్ధి చేయగలరు’?

యెహోవా తన దీర్ఘకాల సేవకులను అమూల్యమైనవారిగా ఎందుకు పరిగణిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. వృద్ధులను అనేకమంది ఎలా దృష్టిస్తున్నారు?

2. (ఎ) నమ్మకమైన తన వృద్ధ సేవకులను యెహోవా ఎలా దృష్టిస్తున్నాడు? (బి) కీర్తన 92:12-15లో మనకు ఎలాంటి హృదయోత్తేజకరమైన వర్ణన కనబడుతుంది?

3. (ఎ) నీతిమంతులు ఖర్జూరవృక్షాలతో ఎందుకు పోల్చబడ్డారు? (బి) వృద్ధులెలా తమ ‘ముసలితనమందు చిగురు పెట్టగలరు’?

4, 5. (ఎ) క్రైస్తవులు ఏ ప్రాముఖ్యమైన ఫలాలు ఫలించాలి? (బి) తమ ‘జిహ్వాఫలం అర్పించిన’ వృద్ధుల కొన్ని లేఖనాధారిత ఉదాహరణలు చెప్పండి.

6. ఈ అంత్యదినాల్లో ప్రవచించేందుకు యెహోవా ‘వృద్ధులను’ ఎలా ఉపయోగించాడు?

7. భౌతిక పరిమితులున్నా కొందరు వృద్ధులు రాజ్య ఫలాలను ఫలించడంలో ఎలా కొనసాగుతున్నారో ఉదహరించండి.

8. వృద్ధుడైన కాలేబు యెహోవాపై తన నమ్మకాన్ని ఎలా ప్రదర్శించాడు, వృద్ధ క్రైస్తవులు ఆయన మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

9, 10. వృద్ధ క్రైస్తవులు విశ్వాసంలో ఆరోగ్యంగా ఉంటూ తమ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నిలుపుకుంటారు? (13వ పేజీలోని బాక్సు చూడండి.)

11, 12. (ఎ) యూదా రాజ్య చరిత్రలో యెహోయాదా ఎలాంటి ఆవశ్యక పాత్ర పోషించాడు? (బి) సత్యారాధనను పెంపొందింపజేయడానికి యెహోయాదా తన పలుకుబడినెలా ఉపయోగించాడు?

13. వృద్ధ క్రైస్తవులు ‘సత్య దేవుని దృష్టికి, ఆయన ఇంటివారి దృష్టికి’ ఎలా మంచివారిగా ఉండవచ్చు?

14. సత్యారాధనను పెంపొందింపజేయడానికి దీర్ఘకాల పైవిచారణకర్తలు ఏమి చేయవచ్చు?

15. ‘యెహోవా యథార్థవంతుడని’ వృద్ధ క్రైస్తవులెలా ‘ప్రసిద్ధి చేస్తారు’?

16. ‘యెహోవా యథార్థవంతుడని ప్రసిద్ధి చేయడం’ యొక్క ప్రాముఖ్యతను ఏ బైబిలు ఉదాహరణ దృష్టాంతపరుస్తోంది?

17. ఆధునిక కాలాల్లో యెహోవా తన ప్రజలతో ఎలా వ్యవహరించాడు?

18. (ఎ) ‘యెహోవా యథార్థవంతుడని ప్రసిద్ధి చేయడంలో’ ఉన్న దీర్ఘకాలిక ప్రభావాన్ని ఉదహరించండి. (బి) యెహోవా యథార్థతను వ్యక్తిగతంగా మీరెలా చవిచూశారు?

19, 20. (ఎ) యెహోవా తన వృద్ధ సేవకుల కార్యకలాపాలను ఎలా దృష్టిస్తాడు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[13వ పేజీలోని బాక్సు]

విశ్వాసవిషయంలో వారెలా స్వస్థులుగా నిలిచారు?

ఎంతోకాలంగా క్రైస్తవులుగా ఉన్నవారు అలా విశ్వాసవిషయంలో స్వస్థులుగా నిలిచి తమ ఆధ్యాత్మిక కార్యశీలతను కాపాడుకోవడానికి వారికి సహాయం చేసిందేమిటి? వారిలో కొందరు చెప్పినవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

“యెహోవాతో మన సంబంధంపై దృష్టినిలిపే లేఖనాలు చదవడం చాలా ప్రాముఖ్యం. అనేక రాత్రులు నేను కీర్తన 23 మరియు 91 వల్లెవేస్తాను.”​—⁠ఆలివ్‌, 1930లో బాప్తిస్మం తీసుకుంది.

“నేను ప్రతీ బాప్తిస్మ ప్రసంగానికి తప్పకుండా హాజరై అది నా బాప్తిస్మమే అన్నట్టు జాగ్రత్తగా వినడం అలవాటు చేసుకున్నాను. నమ్మకంగా నిలిచి ఉండడానికి నా సమర్పణను స్పష్టంగా మనస్సులో ఉంచుకోవడం ప్రాముఖ్యమైన చర్యగా తోడ్పడింది.”​—⁠హారీ, 1946లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“ఎల్లప్పుడూ యెహోవా సహాయాన్ని, కాపుదలను, ఆశీర్వాదాన్ని అర్థిస్తూ ‘మన ప్రవర్తనంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుంటూ’ ప్రతిదినం ప్రార్థించడం ఆవశ్యకం.” (సామెతలు 3:5, 6)​—⁠ఆంటోనియో, 1951లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“అనేక సంవత్సరాల తర్వాత కూడా ఇంకా యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్న వారి అనుభవాలు వినడం, ఆయనపట్ల యథార్థంగా, నమ్మకంగా నిలిచివుండాలనే నా తీర్మానాన్ని పునర్నూతనం చేస్తుంది.”​—⁠జోన్‌, 1954లో బాప్తిస్మం తీసుకుంది.

“మన గురించి మనం అధికంగా తలంచకుండా ఉండడం ప్రాముఖ్యం. మనకున్నది యెహోవా ఉచిత కృపవల్ల కలిగిందే. ఈ దృక్కోణం కలిగివుండడం, అంతంవరకు సహించడానికి కావలసిన ఆధ్యాత్మిక పోషణకై మనం సరైన దిశవైపే చూసేలా చేస్తుంది.”​—⁠ఆర్లీన్‌, 1954లో బాప్తిస్మం తీసుకుంది.

[11వ పేజీలోని చిత్రం]

వృద్ధులు విలువైన రాజ్యఫలాలు ఫలిస్తారు

[14వ పేజీలోని చిత్రం]

వృద్ధుల ఆధ్యాత్మిక బలం ఒక అమూల్య సంపద