కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అవసరమున్న సమయాల్లో మేలు చేయడం

అవసరమున్న సమయాల్లో మేలు చేయడం

అవసరమున్న సమయాల్లో మేలు చేయడం

“అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (గలతీయులు 6:​10) ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు ప్రతీ ఒక్కరికి, ప్రత్యేకంగా తోటి విశ్వాసులకు మేలు చేస్తూ ఆ సూత్రాన్ని అన్వయించుకోవడానికి శ్రద్ధతో కృషి చేస్తున్నారు. అవసరమున్న సమయాల్లో మేలు చేయడానికి ఇలా కృషి చేయడం పదేపదే కనిపిస్తుంది. మూడు దేశాల్లోని ఇటీవలి ఉదాహరణలను మనం పరిశీలిద్దాం.

2002 డిసెంబరులో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులతో భయంకరమైన తుఫాను విరుచుకుపడడంతో గ్వామ్‌ అతలాకుతలమైంది. చాలా ఇళ్లు ఛిన్నాభిన్నమైతే, మరికొన్ని పూర్తిగా నాశనమయ్యాయి. స్థానిక సంఘాలు, తీవ్రంగా నష్టపోయిన సాక్షుల కుటుంబాలకు సహాయం చేసే ఉద్దేశంతో సహాయక బృందాలను హుటాహుటిన ఏర్పాటు చేశాయి. గ్వామ్‌ బ్రాంచి కార్యాలయం పాడైన ఇళ్లను బాగుచేసేందుకు కావలసిన సామగ్రిని, మనుష్యుల్ని పంపిస్తే, హవాయి బ్రాంచి తనవంతు మద్దతునిచ్చింది. కొన్ని వారాల్లోనే పునర్నిర్మాణ పనిలో సహాయం చేయడానికి హవాయినుండి వడ్రంగుల బృందమొకటి అక్కడికి చేరుకోగా, వారికి తోడ్పడేందుకు స్థానిక సహోదరులు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టారు. సంతోషంతో చూపబడిన సహకార స్ఫూర్తి సమాజంలోని వారందరికీ చక్కని సాక్ష్యమిచ్చింది.

మియన్మార్‌లోని మాండలే నగర శివారుల్లో, ఒక రాజ్య మందిరానికి కాస్త దూరంలో మంటలు చెలరేగాయి. దానికి దగ్గర్లోనే క్రియాశూన్యురాలిగా మారిన ఒక సహోదరి కుటుంబానికి చెందిన ఇల్లు ఉంది. గాలి ఆమె ఇంటివైపే వీయడంతో, సహాయం కోసం అర్ధిస్తూ ఆమె రాజ్యమందిరానికి పరుగెత్తింది. ఆ సమయంలో రాజ్యమందిరపు మరమ్మత్తు జరుగుతోంది, అందువల్ల అక్కడ చాలామంది సహోదరులు ఉన్నారు. ఆ సహోదరి ఆ ప్రాంతంలోనే నివసిస్తున్న సంగతి తెలియని సహోదరులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే సహోదరులు ఆమె ఇంటిలోని వస్తువులన్నింటినీ సురక్షిత ప్రాంతానికి చేరవేయడంలో సహాయం చేశారు. సాక్షికాని ఆమె భర్తకు ఆ అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఇంటికి పరుగెత్తుకువచ్చేసరికి అక్కడ సహోదరులు తన కుటుంబానికి సహాయం చేయడం చూశాడు. కృతజ్ఞతాభావంతో ముగ్ధుడైన అతని మనస్సు కూడా కుదుటపడింది, ఎందుకంటే అలాంటి సందర్భాల్లో తరచూ సామాన్ల లూటీ జరుగుతుంది. ఈ విధంగా దయచూపించడం, క్రైస్తవ సంఘంతో మళ్లీ సహవసించడానికి ఆ సహోదరిని, ఆమె కుమారుణ్ణి పురికొల్పింది, వారిప్పుడు అన్ని కూటాలకు హాజరవుతున్నారు.

మొజాంబిక్‌లో, గత సేవా సంవత్సరం అనావృష్టి, పంటనష్టంతో చాలామంది కరవు పరిస్థితులు ఎదుర్కొన్నారు. సత్వరమే ప్రతిస్పందించిన స్థానిక యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం అవసరమున్న వారికి ఆహార సరఫరా చేసింది. రాజ్యమందిరాల్లో కొన్నిసార్లు కూటం అయిపోయిన తర్వాత ఆహారం సరఫరా చేయబడింది. ఒంటరి తల్లిగా ఉన్న ఒక సహోదరి, “ఇంటికి తిరిగి వచ్చాక పిల్లలకేమి పెట్టాలో తెలియని బాధతో నేను కూటానికి వచ్చాను.” సహోదరులు చేసిన సహాయంతో ఆమె వెంటనే తెప్పరిల్లి, “ఇది నాకు పునరుత్థానంలాగే ఉంది!” అని చెప్పింది.

ఓదార్పుకరమైన, నిరీక్షణాధారమైన బైబిలు సందేశాన్ని పంచుకోవడం ద్వారా సాక్షులు ఆధ్యాత్మిక “మేలు” కూడా చేస్తారు. పూర్వకాలపు జ్ఞాని నమ్మినట్లే వారూ ఈ విషయాన్ని నమ్ముతారు: “[దైవిక జ్ఞానాన్ని] అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.”​—⁠సామెతలు 1:33.

[31వ పేజీలోని చిత్రాలు]

1, 2. మొజాంబిక్‌లో అవసరమున్న వారికి ఆహారం సరఫరా చేయడం

3, 4. గ్వామ్‌లో విరుచుకుపడ్డ తుఫాను ఎన్నో ఇళ్లను నాశనం చేసింది

[చిత్రసౌజన్యం]

పిల్లవాడు, ఎడమవైపు: Andrea Booher/FEMA News Photo; స్త్రీ, పైన: AP Photo/Pacific Daily News, Masako Watanabe