కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులకు మంచి చేయాలా లేక చెడు చేయకుండా ఉంటే సరిపోతుందా?

ఇతరులకు మంచి చేయాలా లేక చెడు చేయకుండా ఉంటే సరిపోతుందా?

ఇతరులకు మంచి చేయాలా లేక చెడు చేయకుండా ఉంటే సరిపోతుందా?

“ఇతరులు మీకు ఏమి చేయకూడదని మీరు కోరుకుంటారో, అదే మీరు ఇతరులకు చేయకండి.” ఇది ప్రఖ్యాత చైనా బోధకుడు, తత్త్వవేత్త అయిన కన్‌ఫ్యూషియస్‌ చెప్పిన నీతిసూత్రం. నేడు దాదాపు 2,500 సంవత్సరాల తర్వాత కూడా, ఒక వ్యక్తి ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా ఉంటే తన విధ్యుక్త ధర్మం నిర్వర్తించినట్లే అని అనేకమంది నమ్ముతున్నారు.

కన్‌ఫ్యూషియస్‌ చెప్పిన ఈ నీతిసూత్రం ప్రయోజనకరమైనదేనని అంగీకరించవలసిందే. అయితే మరోవైపున బైబిలు మానవ ప్రవర్తనకు, పరస్పర వ్యవహారాలకు సంబంధించిన మరో దృక్కోణాన్ని తెలియజేస్తోంది. తోటి మానవులకు హాని చేయడం అనే పాపం గురించే కాక, చేయవలసింది చేయకపోవడం అనే పాపం గురించి కూడా బైబిలు మాట్లాడుతోంది. క్రైస్తవ శిష్యుడు యాకోబు ఇలా వ్రాశాడు: “మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.” (యాకోబు 4:​17) యేసుక్రీస్తు, ఇతరులకు చెడు చేయకండి అని క్రైస్తవులకు బోధించడం మాత్రమే కాక ఈ సలహా కూడా ఇచ్చాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”​—⁠మత్తయి 7:​12.

మానవులందరూ ఇతరులు తమతో ఎలా వ్యవహరించాలని ఇష్టపడతారో అదేవిధంగా వారు ఇతరులతో వ్యవహరించాలనే దేవుడు మొట్ట మొదట సంకల్పించాడు. ఆయన మానవులను సృష్టించిన విధానంలో, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధను వ్యక్తం చేయడంలో అత్యుత్తమ మాదిరి ఉంచాడు: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆదికాండము 1:​27) దీనర్థం దేవుడు ప్రేమపూర్వకంగా మానవులకు మనస్సాక్షిని ఇచ్చాడు, దానికి సరిగ్గా శిక్షణనిస్తే అది వారు ఇతరులు తమతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నారో అదేవిధంగా వారు ఇతరులతో వ్యవహరించేలా నడిపిస్తుంది.

నేడు అనేకమంది, ఇతరుల గురించి ఆలోచించని స్వార్థపరుల క్రియలవల్ల నిరాశతో, నిస్సహాయతతో బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇతరులకు చెడు లేదా హానికరమైనది చేయకుండా ఉండడం మాత్రమేకాదు, వారికి మంచిది, సహాయకరమైనది ఏమిటో అది చేయడం ముఖ్యమని స్పష్టమవుతోంది. ఈ కారణంగానే యెహోవాసాక్షులు, దేవుని వాక్యంలోని అద్భుతమైన నిరీక్షణ గురించి ఇతరులు తెలుసుకునేలా వారికి సహాయం చేయడానికి స్వచ్ఛందంగా నిశ్చితమైన చర్యలు తీసుకుంటారు. వారు బైబిల్లోని సువార్తతో తమ పొరుగువారిని సందర్శించినప్పుడు వారు ప్రేమ స్ఫూర్తితో అలా చేస్తారు, ఇతరులు తమకు ఏమి చేయాలని కోరుకుంటున్నారో అదే ఇతరులకు చేస్తారు.