కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

1 సమూయేలు 19:12, 13లో సూచించబడినట్లుగా, యెహోవా నమ్మకమైన సేవకుడైన దావీదు, తన భార్య మీకాలును గృహదేవతా బొమ్మ ఉంచుకోవడానికి ఎందుకు అనుమతించాడు?

ముందుగా మనం క్లుప్తంగా ఆ సందర్భాన్ని పరిశీలిద్దాం. దావీదును హతమార్చాలనే సౌలు రాజు పన్నాగం దావీదు భార్యకు తెలిసినప్పుడు ఆమె వెంటనే ప్రతిస్పందించింది. జరిగిన దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘మీకాలు కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. తరువాత మీకాలు ఒక గృహదేవతా బొమ్మను [బహుశా మనిషి ఆకారంలో, పరిమాణంలో ఉన్న బొమ్మను] తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసెను.’ దావీదును పట్టుకోవడానికి సౌలు దూతలు వచ్చినప్పుడు, మీకాలు “అతడు రోగియై యున్నాడని” వారికి చెప్పింది. ఈ యుక్తివల్ల దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని దావీదు తప్పించుకు పారిపోయాడు.​—⁠1 సమూయేలు 19:11-16.

ప్రాచీన కాలాల్లో గృహదేవతా బొమ్మలను మతసంబంధంగానే కాక చట్టపరమైన పనుల కోసం కూడా దగ్గర ఉంచుకునేవారని పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. నేడు హక్కు దస్తావేజులు, వ్రాతపూర్వక వీలునామాలు వారసత్వ హక్కులను నిర్ధారిస్తున్నట్లుగానే, పూర్వకాలంలో ఇందుకోసం గృహదేవతా బొమ్మలు వాడుకలో ఉండేవి. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో గృహదేవతా బొమ్మ అల్లుడి దగ్గర ఉంటే అతడు చనిపోయిన తన మామ స్తిరాస్థిని సంపాదించుకునే హక్కును పొందుతాడు. అంతకుపూర్వం రాహేలు తన తండ్రి గృహదేవతలను ఎందుకు తనవెంట తీసుకెళ్లిందో, వాటిని మళ్లీ దక్కించుకోవడానికి ఆమె తండ్రి ఎందుకు ఆత్రపడ్డాడో ఇది వివరించవచ్చు. ఆ సందర్భంలో, రాహేలు భర్త యాకోబుకు తన భార్య చేసినదేమిటో తెలియదు.​—⁠ఆదికాండము 31:14-34.

ఇశ్రాయేలీయులు ఒక జనాంగమైనప్పుడు, వారికి పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, వాటిలో రెండవది విగ్రహాల తయారీని నిర్ద్వందంగా ఖండిస్తోంది. (నిర్గమకాండము 20:​4, 5) ఆ తర్వాత సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో మాట్లాడేటప్పుడు ఈ నియమాన్ని పరోక్షంగా సూచిస్తూ ఇలా అన్నాడు: “తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము.” (1 సమూయేలు 15:​23) ఈ కారణం చేతనే, గృహదేవతా బొమ్మలు ఇశ్రాయేలులో వారసత్వంగా పొందేవాటి కోసం వాడుకలో ఉండి ఉండకపోవచ్చు. అయినప్పటికీ, యూదుల ఈ ప్రాచీన మూఢనమ్మకం కొన్ని ఇశ్రాయేలు కుటుంబాల్లో కొనసాగినట్లు కనబడుతోంది. (న్యాయాధిపతులు 17:5, 6; 2 రాజులు 23:​24) మీకాలు తనకు చెందిన ఇతర వస్తువులతోపాటు గృహదేవతా బొమ్మను దగ్గర ఉంచుకోవడం ఆమె హృదయం యెహోవాపట్ల సంపూర్ణంగా లేదనే సూచిస్తోంది. దావీదుకు గృహదేవతా బొమ్మ గురించి బహుశా తెలిసి ఉండకపోవచ్చు లేదా మీకాలు సౌలు రాజు కుమార్తె కాబట్టి ఆయన దానిని అనుమతించి ఉండవచ్చు.

యెహోవాపట్ల అవిభాగిత భక్తి కనబరచాలనే దావీదు దృక్పథం ఈ మాటల్లో వ్యక్తపరచబడింది: “యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు, సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.”​—⁠1 దినవృత్తాంతములు 16:25, 26.

[29వ పేజీలోని చిత్రం]

పది ఆజ్ఞల్లో రెండవది ఇక్కడ చూపబడిన గృహదేవతా బొమ్మ వంటి విగ్రహాల తయారీని నిషేధించింది

[చిత్రసౌజన్యం]

The Holy Land, Vol. II, 1859 పుస్తకం నుండి