కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఏ మతాన్ని ఎంపిక చేసుకోవాలి?

మీరు ఏ మతాన్ని ఎంపిక చేసుకోవాలి?

మీరు ఏ మతాన్ని ఎంపిక చేసుకోవాలి?

‘వివిధ మతాలు ఒకే గమ్యానికి తీసుకువెళ్లే వివిధ మార్గాలు మాత్రమే. వాస్తవానికి దేవుడు ఒక్కడే, కాదంటారా?’ చాలామంది ఇలాగే భావిస్తారు, వారు మతంతో కలిసివుండడం ప్రాముఖ్యమనే అనుకుంటారు కానీ ఒక వ్యక్తి ఏ మతాన్ని ఎంచుకున్నా అదంత పట్టించుకోవలసిన విషయం కాదని భావిస్తారు.

మొదటిసారి ఆలోచించినప్పుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే ఉన్నాడనేది నిజమే కాబట్టి ఈ తర్కం హేతుబద్ధమైనదనే అనిపిస్తుంది. (యెషయా 44:⁠6; యోహాను 17:⁠3; 1 కొరింథీయులు 8:​5, 6) కానీ సత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే అనేక మత గుంపుల మధ్య కనబడే స్పష్టమైన భేదాలను, వైరుద్ధ్యాలను మనం నిర్లక్ష్యం చేయలేము. ఆ గుంపులు తమ ఆచారాల్లో, విశ్వాసాల్లో, బోధనల్లోనే కాక అవి అపేక్షించేవాటిలో కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. వాటి మధ్య ఎంత గొప్ప భేదాలు ఉన్నాయంటే, ఒక మతానికి లేక గుంపుకు చెందిన వ్యక్తికి, ఇతర మతానికి చెందినవాళ్ళు బోధించేదాన్ని లేదా విశ్వసించేదాన్ని అర్థం చేసుకోవడానికైనా అంగీకరించడానికైనా చాలా కష్టంగా ఉంటోంది.

మరోవైపున చూస్తే యేసు, “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతోను ఆరాధింపవలెను” అని అన్నాడు. (యోహాను 4:​24) సత్యంతో దేవుని ఆరాధించడం, దేవుడు ఎవరు, ఆయన సంకల్పాలు ఏమిటి, మనం ఆయనను ఎలా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాల్లో అనేక వైరుద్ధ్యాలకు తావిస్తుందా? సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తామన్నది ఆయనకు అంత ప్రాముఖ్యమైనది కాదని నమ్మడం సహేతుకమేనా?

నిజ క్రైస్తవులు నాడు, నేడు

మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి భేదాభిప్రాయాలు ఉండేవి. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు కొరింథులో ఉన్నవారి గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు​—⁠నేను పౌలు వాడను, ఒకడు​—⁠నేను అపొల్లోవాడను, మరియొకడు​—⁠నేను కేఫావాడను, ఇంకొకడు​—⁠నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.”​—⁠1 కొరింథీయులు 1:​11, 12.

పౌలు ఈ భేదాలను అంత ప్రాముఖ్యమైనవి కావన్నట్లు దృష్టించాడా? వారిలో ప్రతి ఒక్కరు తమ రక్షణ కోసం తమకు తోచిన మార్గాన్ని అనుసరిస్తున్నారా? అదెంత మాత్రం నిజం కాదు! పౌలు ఇలా ప్రబోధించాడు: “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.”​—⁠1 కొరింథీయులు 1:​10.

విశ్వాసంలో ఐక్యత బలవంతంగా సాధించేది కాదు. ఒక్కొక్క వ్యక్తి ఆయా విషయాలను జాగ్రత్తగా పరిశోధించి వాటిపై ఏకాభిప్రాయానికి వచ్చి దాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే ఆ ఐక్యతను సాధించవచ్చు. కాబట్టి పౌలు మాట్లాడుతున్నటువంటి ఐక్యతను అనుభవించాలంటే, దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం, నేర్చుకున్నవాటిని అన్వయించుకోవాలని మనఃపూర్వకంగా కోరుకోవడం చాలా ప్రాముఖ్యమైన చర్యలు. మరి అటువంటి ఐక్యతను కనుగొనగలమా? మనం చూసినట్లుగా, దేవుడు ఎప్పటి నుండో తన ప్రజలతో ఒక గుంపుగానే వ్యవహరిస్తున్నాడు. నేడు ఆ గుంపును గుర్తించడం సాధ్యమేనా?

సరైన సహవాస ప్రయోజనాలు

కీర్తనకర్త దావీదు ఒకసారి “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగినవాడెవడు?” అని అడిగాడు. ఇది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న. దానికి దావీదే ఇలా జవాబిచ్చాడు: “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.” (కీర్తన 15:​1, 2) బైబిలు గురించిన ఖచ్చితమైన అవగాహన, దేవుడు అపేక్షిస్తున్నవాటికి అనుగుణంగా ఉన్న మతాన్ని గుర్తించడానికి సహాయం చేస్తుంది. అప్పుడు ఆ గుంపుతో సహవాసం చేయడం ద్వారా, దేవుణ్ణి ఐక్యంగా “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించే ప్రజలతో క్షేమాభివృద్ధికరమైన సాంగత్యాన్ని అనుభవించవచ్చు.

నేటి అనైక్య లోకంలో కూడా విశ్వాసంలో, క్రియల్లో ఐక్యతను సాధించడం సాధ్యమేనని యెహోవాసాక్షులు నిరూపించారు. వాళ్ళలో అనేక విభిన్న మతాలకు, మత గుంపులకు చెందిన మాజీ సభ్యులు ఉన్నారు. కొందరు సాక్షులు గతంలో అస్తిత్వవాదులుగా లేదా నాస్తికులుగా ఉండేవారు. మరి కొందరైతే అసలు మతం గురించి ఎన్నడూ గంభీరంగా ఆలోచించలేదు. అలాంటి విభిన్న మతాల, సంస్కృతుల, తత్త్వాల నుండి వచ్చిన వ్యక్తులు, నేడు ప్రపంచంలో వేరే ఎక్కడా కనబడని మత ఐక్యతను అనుభవిస్తున్నారు.

అలాంటి ఐక్యతకు మూలాధారం దేవుని వాక్యమైన బైబిలే. అయితే ఇతరులు ఏమి చేయాలో తాము ఆదేశించలేమని యెహోవాసాక్షులకు తెలుసు. కానీ ఆరాధనకు సంబంధించి ఎంపిక చేసుకునే విషయాలకు బైబిలు బలమైన పునాదిగా ఉండేలాగ, దాని నుండి నేర్చుకొమ్మని ఇతరులను ప్రోత్సహించే ఆధిక్యత తమకున్నందుకు వారు కృతజ్ఞత కలిగివున్నారు. ఆ విధంగా దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించడం ద్వారా వచ్చే ప్రయోజనాలను ఇంకా అనేకమంది పొందగలుగుతారు.

నేడు హానికరమైన ప్రభావాలకు, ప్రలోభాలకు లొంగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సరైన సహవాసాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. బైబిలు, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అనీ “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అనీ చెబుతోంది. (సామెతలు 13:​20; 1 కొరింథీయులు 15:​33) దేవుని యథార్థ ఆరాధకులతో సహవాసం చేయడం రక్షణగా ఉంటుంది. అందుకే బైబిలు మనకు ఇలా గుర్తుచేస్తోంది: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:​24, 25) దేవుని ఎదుట తమ బాధ్యతలను నెరవేర్చేందుకు నిజమైన స్నేహితులు, ఆధ్యాత్మిక సహోదరసహోదరీలు, ఒకరికొకరు ప్రేమపూర్వకంగా సహకరించుకోవడం ఎంత చక్కని ఆశీర్వాదమో కదా!

ఓట్‌మార్‌ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాడు. జర్మనీలో ఒక క్యాథలిక్‌ కుటుంబంలో పెరిగిన ఈయన చర్చికి వెళ్ళడం మానేశాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “నేను చర్చికి వెళ్లినప్పుడల్లా, నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత వెలితితో వెళ్ళేవాడినో తిరిగి బయటికి వచ్చేటప్పుడూ అంతే వెలితితో వచ్చేవాడిని.” అయినప్పటికీ ఆయన దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత ఆయన యెహోవాసాక్షులను కలుసుకున్నాడు, వారు దేవుని నిజమైన సేవకులనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. వారితో సహవసించాల్సిన అవసరాన్ని ఆయన చూశాడు. ఆయనిప్పుడు ఇలా అంటున్నాడు: “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సంస్థలో కార్యశీలకంగా ఉండడం వల్ల, నా మనస్సు, హృదయం ప్రశాంతంగా ఉన్నాయి. నేను బైబిలు గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ పొందేందుకు క్రమంగా నాకు సహాయం అందుతోంది. వ్యక్తిగతంగా అది నాకెంతో విలువైనది.”

వెదకుతున్నవారికి ఆహ్వానం

ఎవరికి వారు స్వతంత్రంగా పని చేసే వ్యక్తులకంటే, ఏక మనస్సుతో సన్నిహితంగా ఒక గుంపుగా పనిచేసే వారు ఒక లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా చేరుకోవచ్చు. ఉదాహరణకు, యేసు తన అనుచరులకిచ్చిన వీడ్కోలు సూచనలు ఇలా ఉన్నాయి: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) ఒక మార్గనిర్దేశము గానీ సంస్థీకరణ గానీ లేకుండా అలాంటి లక్ష్యాన్ని సంతృప్తికరంగా నెరవేర్చడం ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిస్తే, ఈ లేఖనాధారిత ఆజ్ఞకు విధేయుడెలా కాగలడు?

గత సంవత్సరంలో యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా 9,19,33,280 బైబిలు ఆధారిత పుస్తకాలు, బుక్‌లెట్లు, బ్రోషుర్లతోపాటు 69,76,03,247 పత్రికలను పంచిపెట్టి, తద్వారా వారు దేవుని వాక్యంలోని సందేశాన్ని 235 ప్రాంతాల్లోని కోట్లాదిమందికి అందజేశారు. ఏ సహకారం లేకుండా ఒక వ్యక్తి చేసే కృషి సాధించగలిగిన దానికంటే ఐక్యత, చక్కని వ్యవస్థీకరణ గల ఒక గుంపు చేసే కృషి ఎంతో ఎక్కువ సాధిస్తుందనడానికి ఇదెంత విశిష్టమైన నిదర్శనమో కదా!

యెహోవాసాక్షులు బైబిలు సాహిత్యాలు పంచిపెట్టడంతోపాటు, దేవుడు ఏమి అపేక్షిస్తున్నాడో లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రజలకు సహాయం చేయడానికి ఉచితంగా బైబిలు కోర్సులు కూడా నిర్వహిస్తారు. గత సంవత్సరం సగటున 57,26,509 బైబిలు అధ్యయనాలు, ప్రతీ వారం ఒక్కో వ్యక్తికి లేదా గుంపులకు నిర్వహించబడ్డాయి. ఈ బైబిలు ఉపదేశం లక్షలాదిమంది తమ ఆరాధనకు సంబంధించిన విషయాల్లో తమకిష్టమైన ఎంపిక చేసుకునేందుకు వారికి బలమైన మూలాధారం పొందడానికి దోహదపడింది. బైబిల్లో తెలియజేయబడిన ప్రకారం, దేవుడు అపేక్షించేవాటి గురించి తెలుసుకునేందుకు మీరు ఆహ్వానించబడుతున్నారు. ఆ తర్వాత మీరే సరైన ఎంపిక చేసుకోవచ్చు.​—⁠ఎఫెసీయులు 4:​11,12; ఫిలిప్పీయులు 1:​9-11; 1 తిమోతి 6:​20; 2 పేతురు 3:​18.

మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే మతపరమైన సహవాసం చాలా ముఖ్యం​—⁠అయితే ఏదో ఒక మతగుంపుతో లేక మతశాఖతో కాదు. మీరు మీకిష్టమైన మతాన్ని ఎంపిక చేసుకోవడానికి మూలాధారంగా ఉండవలసింది ఖచ్చితమైన బైబిలు పరిజ్ఞానమే కానీ, నిరూపించబడని సిద్ధాంతాలో లేక ఎవరో చెప్పిన మాటలో కాదు. (సామెతలు 16:​25) నిజమైన మతానికి కావలసినవి ఏమిటో తెలుసుకోండి. వాటిని మీ విశ్వాసాలతో పోల్చుకోండి. ఆ తర్వాత తదనుగుణంగా ఎంపిక చేసుకోండి.​—⁠ద్వితీయోపదేశకాండము 30:​19.

[7వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షులు అనైక్య లోకంలో ఐక్యతను అనుభవిస్తారు