కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పరిస్థితులు మీ జీవితాన్ని అదుపు చేస్తున్నాయా?

మీ పరిస్థితులు మీ జీవితాన్ని అదుపు చేస్తున్నాయా?

మీ పరిస్థితులు మీ జీవితాన్ని అదుపు చేస్తున్నాయా?

ఈ“అపాయకరమైన కాలముల”లో కృంగదీసే పరిస్థితులు, సమస్యలు సర్వసాధారణం. (2 తిమోతి 3:⁠1) కొన్ని సమస్యలు తాత్కాలికమైనవి, అవి కొంతకాలానికి సమసిపోతాయి. మరికొన్ని సమస్యలు నెలలపాటు, సంవత్సరాలపాటు అలాగే కొనసాగుతాయి. అందువల్ల చాలామంది కీర్తనకర్తయైన దావీదులాగే భావిస్తారు. ఆయన యెహోవాకు ఇలా మొర్రపెట్టాడు: “నా హృదయవేదనలు అతివిస్తారములు; ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.”​—⁠కీర్తన 25:17.

ముంచెత్తుతున్న సమస్యలతో మీరు సతమతమవుతున్నారా? అదే నిజమైతే, మీరు బైబిల్లో నుండి సహాయాన్ని, ప్రోత్సాహాన్ని పొందవచ్చు. కష్టాలను విజయవంతంగా ఎదుర్కొన్న నమ్మకస్థులైన యెహోవా సేవకుల్లో ఇద్దరి జీవితాల్ని అంటే యోసేపు దావీదుల జీవితాల్ని మనం పరిశీలిద్దాం. ఇబ్బందులకు వారు ప్రతిస్పందించిన తీరును పరిశీలించడం ద్వారా, నేడు అలాంటి సవాళ్లనే ఎదుర్కోవడానికి సహాయం చేసే ఆచరణాత్మక పాఠాలను మనం నేర్చుకోవచ్చు.

గంభీరమైన సవాళ్లు ఎదురయ్యాయి

పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి యోసేపుకు తన సొంత కుటుంబంలోనే తీవ్రమైన సమస్య ఎదురయ్యింది. అతని అన్నలు తమ తండ్రియైన యాకోబు “అతనిని [యోసేపును] తమ అందరికంటె ఎక్కువగా ప్రేమిం[చడం]” గమనించారు. అందువల్ల “వారు అతనిమీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.” (ఆదికాండము 37:⁠4) ఈ పరిస్థితి యోసేపుకు ఎంతటి వ్యాకులతను, బాధను కలిగించి ఉంటుందో మనం ఊహించవచ్చు. చివరకు, యోసేపు సహోదరులు అతనిపై ఎంత పగ పెంచుకున్నారంటే, అతణ్ణి వారు బానిసగా అమ్మేశారు.​—⁠ఆదికాండము 37:26-33.

ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు యోసేపు తన యజమాని భార్య నుండి వచ్చిన లైంగిక ఒత్తిళ్లను ఎదిరించాల్సి వచ్చింది. తిరస్కరించబడ్డాననే అక్కసుతో ఆమె యోసేపు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని అబద్ధ ఆరోపణ చేసింది. దానితో ఆయన ‘చెరసాలలో వేయబడగా’ అక్కడ “వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను.” (ఆదికాండము 39:7-20; కీర్తన 105:​17, 18) ఇదెంత కఠిన పరీక్షో గదా! సొంత కుటుంబ సభ్యులతోపాటు ఇతరులు చేసిన అన్యాయాల కారణంగా యోసేపు దాదాపు 13 సంవత్సరాలపాటు అటు ఖైదీగానో ఇటు బంధీగానో ఉన్నాడు.​—⁠ఆదికాండము 37:2; 41:46.

యౌవనునిగా ప్రాచీనకాల ఇశ్రాయేలీయుడైన దావీదు కూడా పరీక్షలు ఎదుర్కొన్నాడు. సౌలు రాజు ఆయనను జంతువును వేటాడినట్లు వేటాడడంతో, ఆయన అనేక సంవత్సరాలపాటు పలాయితునిగా జీవించాల్సి వచ్చింది. దావీదు అన్ని సమయాల్లో ప్రాణం అరచేతిలో పెట్టుకొని జీవించాడు. ఒకసారి ఆయన ఆహారం కోసం యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వెళ్లాడు. (1 సమూయేలు 21:​1-7) అహీమెలెకు దావీదుకు సహాయం చేశాడని తెలుసుకొన్న సౌలు, ఒక్క అహీమెలెకునే కాదు యాజకులందరినీ వారి కుటుంబాలనూ చంపాల్సిందిగా ఆజ్ఞాపించాడు. (1 సమూయేలు 22:​12-19) పరోక్షంగా ఈ విషాదానికి తాను కారణమైనందుకు దావీదు ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో మీరూహించగలరా?

యోసేపు దావీదులు సహించిన విపత్తులు, ఇక్కట్లతో నిండిన ఆ సంవత్సరాల గురించి ఆలోచించండి. ఆ కష్ట పరిస్థితులను వారెలా అధిగమించారో పరిశీలించడం ద్వారా మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. అనుకరించడానికి వీరెందుకు యోగ్యులో తెలిపే మూడు విధానాలను మనం పరిశీలిద్దాం.

పగ, విరోధభావం ఉంచుకోకండి

మొదటిగా, నమ్మకస్థులైన ఈ వ్యక్తులు పగ, విరోధభావాల ఊబిలో చిక్కుకోలేదు. చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు తన సహోదరులు చేసిన ద్రోహం గురించి ప్రతికూలంగా ఆలోచిస్తూ వాళ్లు కనిపిస్తే ప్రతీకారం తీర్చుకోవాలని సహజంగానే అనుకొని ఉండేవాడు. అలాంటి వినాశనకర ఆలోచనను యోసేపు ఎదిరించాడని మనకెలా తెలుసు? ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చిన తన సహోదరులపై పగతీర్చుకునే అవకాశం లభించినప్పుడు ఆయనెలా ప్రతిస్పందించాడో పరిశీలించండి. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “[యోసేపు] వారియొద్ద నుండి అవతలకు పోయి యే[డ్చెను]. . . . మరియు యోసేపు వారి [సహోదరుల] గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణముకొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును [తన సేవకులకు] ఆజ్ఞ ఇచ్చెను.” ఆ తర్వాత, యోసేపు తమ తండ్రిని ఐగుప్తుకు తీసుకురావడానికి తన సహోదరులను పంపినప్పుడు ఆయన ఈ మాటలతో వారిని ప్రోత్సహించాడు: “మార్గమందు కలహపడకుడి.” పగ, విరోధభావం తన జీవితాన్ని విషపూరితం చేయడానికి తాను అనుమతించలేదని యోసేపు మాటలోనూ క్రియలోనూ నిరూపించాడు.​—⁠ఆదికాండము 42:24, 25; 45:24.

అదే విధంగా దావీదు రాజైన సౌలుపై పగ పెంచుకోలేదు. సౌలును చంపే అవకాశం దావీదుకు రెండుసార్లు లభించింది. అయినాసరే, అలా చంపమని తనవాళ్లు తనను ఒత్తిడి చేసినప్పుడు దావీదు ఇలా అన్నాడు: “ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను.” “యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును” అని తనవాళ్లకు చెబుతూ దావీదు సమస్యను యెహోవాకే వదిలేశాడు. ఆ తర్వాత సౌలు అతని కుమారుడైన యోనాతాను మరణించినప్పుడు, దావీదు వారి గురించిన ధనుర్గీతమొకటి కూర్చాడు. యోసేపులానే దావీదుకూడా పగ తనను అధిగమించడానికి అనుమతించలేదు.​—⁠1 సమూయేలు 24:3-6; 26:7-13; 2 సమూయేలు 1:17-27.

ఏదైనా అన్యాయం మనల్ని బాధిస్తే పగ, విరోధభావాలను మనం పెంచుకుంటామా? సులభంగా అలా జరిగే అవకాశముంది. మన భావావేశాల్ని మనపై పెత్తనం చేయడానికి వదిలేస్తే, తత్ఫలితంగా మనకు సంభవించే హాని బహుశా జరిగిన అన్యాయంకంటే ఎక్కువగానే ఉండవచ్చు. (ఎఫెసీయులు 4:​26, 27) ఇతరుల క్రియలను నియంత్రించే శక్తి మనకు ఉన్నా లేకపోయినా, మన ప్రతిస్పందనను మనం నియంత్రించుకోవచ్చు. యెహోవా తగిన కాలంలో చర్య తీసుకుంటాడన్న విశ్వాసం మనకున్నప్పుడు పగ, విరోధభావాలను అధిగమించడం సులభమవుతుంది.​—⁠రోమీయులు 12:17-19.

మీ పరిస్థితులను ప్రయోజనకరంగా మలుచుకోండి

మనం నేర్చుకోగల రెండవ పాఠమేమంటే, పరిస్థితులు మన జీవితాన్ని కృంగదీయకుండా చూసుకోవడమే. మనం చేయలేని పనుల గురించి అతిగా చింతిస్తూ మనం చేయగల పనులను అలక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటప్పుడు మన పరిస్థితులు మనల్ని అదుపు చేయడం ప్రారంభిస్తాయి. యోసేపు విషయంలో అలా జరిగి ఉండేదే. అయితే ఆయన దానికి భిన్నంగా తన పరిస్థితులను ప్రయోజనకరంగా మలుచుకోవడానికే ఎంచుకున్నాడు. యోసేపు తాను బానిసగా ఉన్నప్పుడు ‘[యజమానికి] తనపై కటాక్షం కలిగేలా అతనివద్ద పరిచర్య చేసేవాడయ్యాడు, అందువల్ల అతడు ఆయనను తన ఇంటిమీద విచారణకర్తగా నియమించాడు.’ చెరసాలలో ఉన్నప్పుడు కూడా యోసేపు అలాగే ప్రవర్తించాడు. యెహోవా ఆశీర్వాదం మూలంగా, యోసేపుకున్న కష్టపడే తత్వం కారణంగా “చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువా[నిగా]” అయ్యాడు.​—⁠ఆదికాండము 39:​4, 21-23.

దావీదు పలాయితునిగా గడిపిన సంవత్సరాల్లో, ఆయన కూడా తన పరిస్థితులను ప్రయోజనకరంగా మలుచుకున్నాడు. పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన, ఆయన మనుష్యులు బంటుల గుంపుల నుండి నాబాలు మందలను కాపాడారు. “వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి” అని నాబాలు గొర్రెల కాపరులు చెప్పారు. (1 సమూయేలు 25:​16) ఆ తర్వాత దావీదు సిక్లగులో ఉన్నప్పుడు దక్షిణ దిక్కున ఇశ్రాయేలీయుల శత్రువులు పట్టుకున్న పట్టణాలపై దాడులు జరిపి, యూదా సరిహద్దులను సంరక్షించాడు.​—⁠1 సమూయేలు 27:8; 1 దినవృత్తాంతములు 12:​20-22.

మన పరిస్థితులను ప్రయోజనకరంగా మలుచుకోవడానికి మనం మరింత కృషి చేయడం అవసరమా? అలా చేయడం ఒక సవాలుగా ఉన్నప్పటికీ మనం విజయం సాధించగలుగుతాం. అపొస్తలుడైన పౌలు తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటూ ఇలా వ్రాశాడు: “నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. . . . ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను.” పౌలు తన జీవితంలో అలాంటి స్వభావాన్ని ఎలా వృద్ధిచేసుకున్నాడు? యెహోవాపై ఎల్లప్పుడూ ఆధారపడి ఉండడం ద్వారానే. ఆయనిలా అంగీకరించాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”​—⁠ఫిలిప్పీయులు 4:​11-13.

యెహోవాపై ఆధారపడండి

మూడవ పాఠమేమిటంటే, మన పరిస్థితులను మార్చుకోవడానికి లేఖనరహిత మార్గాలు అన్వేషించడానికి బదులు మనం యెహోవాపై ఆధారపడాలి. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకోబు 1:⁠4) ఒకానొక పరీక్షను తప్పించుకోవడానికి లేఖనరహిత విధానాలను ఆశ్రయించకుండా చివరివరకు ఆ పరీక్షను తాళుకోవడం ద్వారా ఓర్పు ‘దాని క్రియను కొనసాగించడానికి’ మనం అనుమతించాలి. అప్పుడే మన విశ్వాసం పరీక్షించబడి శుద్ధి చేయబడుతుంది, దాని బలవర్ధక శక్తి తేటపడుతుంది. యోసేపు దావీదులకు ఇలాంటి ఓర్పే ఉంది. యెహోవా కోపానికి గురిచేయగల పరిష్కారం కనిపెట్టడానికి వారు ప్రయత్నించలేదు. బదులుగా, వారు తమ పరిస్థితిని ప్రయోజనకరంగా మలుచుకొనేందుకు కృషిచేశారు. వారు యెహోవాపై ఆధారపడ్డారు, అలా చేసినందుకు వారెంతగా ఆశీర్వదించబడ్డారో! యెహోవా తన ప్రజలను విడిపించేందుకు, నడిపించేందుకు వారిద్దరినీ ఉపయోగించుకున్నాడు.​—⁠ఆదికాండము 41:39-41; 45:5; 2 సమూయేలు 5:4, 5.

లేఖనరహిత పరిష్కారాలు వెదకేలా శోధించబడే పరిస్థితులను మనమూ ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు, ఇంకా తగిన వివాహ జత లభించనందువల్ల మీరు నిరాశ చెందుతున్నారా? అదే నిజమైతే, “ప్రభువునందు మాత్రమే” పెళ్ళి చేసుకోవాలనే యెహోవా ఆజ్ఞను పెడచెవినబెట్టే ఎలాంటి శోధననైనా తప్పించుకోండి. (1 కొరింథీయులు 7:​39) మీ వైవాహిక జీవితంలో సమస్యలున్నాయా? వేరుపడడాన్ని, విడాకులను ప్రోత్సహించే లోక స్వభావానికి లొంగిపోవడానికి బదులుగా ఆ సమస్యల్ని అధిగమించడానికి కలిసి కృషిచేయండి. (మలాకీ 2:16; ఎఫెసీయులు 5:​21-33) మీ ఆర్థిక పరిస్థితినిబట్టి కుటుంబాన్ని పోషించడం మీకు కష్టంగా ఉందా? యెహోవాపై ఆధారపడడంలో, డబ్బు సంపాదించేందుకు అనుమానాస్పదమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను విసర్జించడం కూడా ఒక భాగమే. (కీర్తన 37:25; హెబ్రీయులు 13:​18) అవును, మన పరిస్థితులను ప్రయోజనకరంగా మలుచుకోవడానికి కృషి చేస్తూ మన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించేలా మనమందరం కష్టపడి పనిచెయ్యాలి. అలాచేస్తూ సంపూర్ణ పరిష్కారం కోసం యెహోవాపై ఆధారపడి ఉండడానికి మనం తీర్మానించుకుందాం.​—⁠మీకా 7:​7.

యెహోవా మిమ్మల్ని ఆదుకుంటాడు

యోసేపు దావీదుల్లాంటి బైబిల్లోని వ్యక్తులు నిరుత్సాహాల్ని, కష్ట పరిస్థితుల్ని విజయవంతంగా ఎదుర్కొన్న విధానాన్ని ధ్యానించడం మనపై ప్రయోజనాత్మక ప్రభావం చూపించగలదు. వారి గాథలు బైబిల్లో కొన్ని పేజీల్లో మాత్రమే వివరించబడినా, వారికి కలిగిన పరీక్షలు చాలా సంవత్సరాలు నిలిచాయి. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘అలాంటి దేవుని సేవకులు తమకు ఎదురైన పరిస్థితులను అంగీకరించడం ఎలా నేర్చుకున్నారు? వారు తమ ఆనందాన్ని ఎలా కాపాడుకున్నారు? వారు ఎలాంటి లక్షణాలు వృద్ధిచేసుకోవాల్సి వచ్చింది?’

యెహోవా ఆధునిక సేవకుల సహనాన్ని పరిశీలించడం నుండి కూడా మనం ప్రయోజనం పొందవచ్చు. (1 పేతురు 5:⁠9) కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో ప్రతీ సంవత్సరం అనేక జీవిత కథలు వస్తుంటాయి. ఈ నమ్మకమైన క్రైస్తవుల దృష్టాంతాలు మీరు చదివి, ధ్యానిస్తున్నారా? వీటికి తోడు, మన సంఘాల్లోనే క్లిష్ట పరిస్థితులను నమ్మకంగా సహిస్తున్నవారు ఉన్నారు. వారితో క్రమంగా సహవసిస్తూ సంఘ కూటాల్లో వారినుండి మీరు నేర్చుకుంటున్నారా?​—⁠హెబ్రీయులు 10:​24, 25.

కష్టమైన పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, యెహోవాకు మీపట్ల శ్రద్ధవుందనీ, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడనే నమ్మకంతో ఉండండి. (1 పేతురు 5:​6-10) మీ పరిస్థితులు మీ జీవితాన్ని అదుపులో పెట్టడానికి వీల్లేకుండా గట్టిగా కృషిచేయండి. పగ పెంచుకోకుండా ఉండడం ద్వారా, మీ పరిస్థితిని ప్రయోజనకరమైన విధంగా మలుచుకోవడం ద్వారా, సంపూర్ణ పరిష్కారం కోసం యెహోవాపై ఆధారపడడం ద్వారా యోసేపు, దావీదు, మరితరుల మాదిరులను అనుసరించండి. ప్రార్థన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల ద్వారా ఆయనకు సన్నిహితమవండి. అలా, కష్ట కాలాల్లో సైతం సంతోషానందాలను మీ సొంతం చేసుకుంటారు.​—⁠కీర్తన 34:⁠8.

[20, 21వ పేజీలోని చిత్రం]

యోసేపు తన పరిస్థితులను ప్రయోజనకరమైన విధంగా మలుచుకోవడానికి ప్రయత్నించాడు

[23వ పేజీలోని చిత్రం]

దావీదు తన సమస్యల పరిష్కారం కోసం యెహోవామీద ఆధారపడ్డాడు