కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వచ్చి మాకు సహాయం చేయండి’

‘వచ్చి మాకు సహాయం చేయండి’

రాజ్య ప్రచారకుల నివేదిక

‘వచ్చి మాకు సహాయం చేయండి’

బొలీవియాకు వెళ్లడానికి జర్మన్‌ భాష మాట్లాడే సాక్షులు కావాలంటూ ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలలో 2000 జూలైలో పిలుపు ఇవ్వబడింది. ఎందుకు? ఎందుకంటే బొలీవియాలోని శాంతాక్రూజ్‌కు 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో దూరదూరంగా ఉన్న వ్యవసాయ వలస ప్రాంతాల్లో జర్మన్‌ భాష మాట్లాడే మెన్నోనైట్‌ సభ్యులు బైబిలుపట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.

ఆ పిలుపుకు దాదాపు 140 మంది సాక్షులు ప్రతిస్పందించారు. కొందరు అక్కడ కొన్ని వారాలపాటు ఉండడానికి వెళితే మరికొందరు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండడానికి వెళ్లారు. అలా వెళ్లడంలో వారు, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము” అని ఇవ్వబడిన పిలుపును లక్ష్యపెట్టిన మొదటి శతాబ్దపు మిషనరీల స్ఫూర్తినే ప్రదర్శించారు.​—⁠అపొస్తలుల కార్యములు 16:9, 10.

ఆ ప్రాంతంలో సేవ చేయడం ఎలా ఉంటుంది? స్థానిక సంఘ పెద్ద ఇలా వివరిస్తున్నాడు: “మట్టి రోడ్లమీద ఫోర్‌వీల్‌ డ్రైవ్‌ వాహనంలో ఆ 43 మెన్నోనైట్‌ వలస ప్రాంతాల్లో ఒక దానిని చుట్టిరావడానికి దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కొన్ని రాత్రులు గుడారాల్లో నిద్రపోవడంతోపాటు ప్రయాణానికి మొత్తం నాలుగు రోజులు పడుతుంది. అక్కడి ప్రజలు ఇప్పటివరకు సువార్త వినలేదు కాబట్టి అక్కడికి వెళ్లడం ఖచ్చితంగా ప్రయత్నార్హమే.”

చాలామంది మెన్నోనైట్‌ సభ్యులు మొదట అలాంటి సందర్శనాలను ఇష్టపడలేదు. కానీ సాక్షులు అనేకమార్లు ప్రయత్నించడం, వారు చెప్పే సందేశాన్ని ఆ ప్రజలు ప్రశంసించడానికి సహాయం చేసింది. ఉదాహరణకు, ఒక రైతు ఒక సంవత్సరం నుండి తేజరిల్లు! పత్రిక చదువుతున్నట్లు చెప్పాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “ఇక్కడి ప్రజలు చాలామంది మీరు చెప్పేది ఒప్పుకోరని నాకు తెలుసు, అయితే ఇది సత్యమని నేను నమ్ముతున్నాను.” మరో వలస ప్రాంతంలో ఇంకొకాయన ఇలా అన్నాడు: “పొరుగువాళ్లు కొందరు మీరు అబద్ధ ప్రవక్తలని చెబుతుంటే, మరి కొందరు మీ దగ్గర సత్యముందని చెబుతున్నారు. నేనే స్వయంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను.”

బొలీవియాలో ఇప్పుడు ఒక జర్మన్‌ భాషా సంఘముంది, దానిలో మొత్తం 35 మంది ప్రచారకులున్నారు, వారిలో 14 మంది పూర్తికాల సువార్తికులు. ఇప్పటివరకు, గతంలో మెన్నోనైట్‌ సభ్యులుగావున్న 14 మంది రాజ్య ప్రచారకులుగా తయారవగా, మరో 9 మంది క్రమంగా కూటాలకు హాజరవుతున్నారు. ఈ మధ్యే బాప్తిస్మం తీసుకున్న ఒక వృద్ధుడు ఇలా అన్నాడు: “యెహోవా మార్గనిర్దేశాన్ని మేము స్పష్టంగా చూస్తున్నాం. మాకు సహాయం చేయడానికి ఆయన అనుభవంగల, జర్మన్‌ భాష మాట్లాడే సహోదర సహోదరీలను పంపించాడు. దానికి మేమెంతో కృతజ్ఞులం.” ఆయన 17 సంవత్సరాల కూతురు కూడా బాప్తిస్మం తీసుకుంది, ఆమె ఇలా అంటోంది: “ఇక్కడికి వచ్చిన యువ సహోదర సహోదరీల ఉత్సాహం అందరినీ పురికొల్పింది. వారిలో చాలామంది పయినీరు సేవచేస్తూ, ఇతరులకు సహాయం చేయడానికి తమ సమయాన్ని, డబ్బును ఖర్చుచేస్తున్నారు. నేను కూడా వారిలాగే చేయాలని అది నన్ను పురికొల్పుతోంది.”

వెళ్లి సహాయం చేయడానికి ప్రయత్నించిన వారు గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నారు.