కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టి దేవుని మహిమను వివరిస్తోంది!

సృష్టి దేవుని మహిమను వివరిస్తోంది!

సృష్టి దేవుని మహిమను వివరిస్తోంది!

“ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.”​కీర్తన 19:⁠1.

“నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్నుచూచి బ్రదుకడు” అని యెహోవా మోషేను హెచ్చరించాడు. (నిర్గమకాండము 33:​20) మానవులు సున్నితమైన శరీరంతో చేయబడ్డారు కాబట్టి, వారు దేవుని మహిమను నేరుగా చూసి బ్రదుకలేరు. అయితే, యెహోవా తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడైవున్న మహాద్భుతమైన దృశ్యాన్ని అపొస్తలుడైన యోహాను చూశాడు.​—⁠ప్రకటన 4:1-3.

2 మానవులకు భిన్నంగా, ఆత్మసంబంధులైన విశ్వసనీయ ప్రాణులు యెహోవా ముఖాన్ని చూడగలుగుతున్నారు. వారిలో 1,44,000 మందికి ప్రతీకగా ఉన్న “ఇరువది నలుగురు పెద్దలు” కూడా ఉన్నట్లు పరలోక దర్శనంలో యోహాను చూశాడు. (ప్రకటన 4:4; 14:​1-3) దేవుని మహిమను చూసినప్పుడు వారి ప్రతిస్పందన ఎలా వుంది? ప్రకటన 4:⁠10, 11 ప్రకారం వారిలా అంటున్నారు: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”

ఎందుకు “నిరుత్తరులైయున్నారు”

3 దేవుణ్ణి మహిమపరిచేందుకు మీరు పురికొల్పబడ్డారా? మానవుల్లో అత్యధికులు అలా చేయడం లేదు, కొందరైతే దేవుని ఉనికినే శంకిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యోమగామి ఇలా వ్రాశాడు: “దేవుడే జోక్యం చేసుకొని అంతరిక్షాన్ని మనకు అనువుగా రూపించాడా? . . . ఆ తలంపు ఉల్లాసం కలిగించేదిగా ఉండవచ్చు. కానీ అది తప్పుదోవ పట్టించేదని నా నమ్మకం. . . . దానిని దేవుడే రూపించాడనడం సరైన వివరణ కాదు.”

4 విజ్ఞానశాస్త్ర పరిశోధన పరిమితమైనది, ఎందుకంటే అది మానవులు చూడగల లేదా అధ్యయనం చేయగల దానిమీదే ఆధారపడి ఉంటుంది. అలా కాకపోతే అది కేవలం ఒక సిద్ధాంతంగా లేదా ఊహాకల్పితంగా ఉంటుంది. “దేవుడు ఆత్మ” గనుక విజ్ఞానశాస్త్ర పద్ధతులతో ఆయనను పరిశోధించడం పూర్తిగా అసాధ్యం. (యోహాను 4:​24) అందువల్ల, దేవునిపై విశ్వాసాన్ని విజ్ఞానశాస్త్ర విరుద్ధమని కొట్టిపారేయడం అహంకారమే అవుతుంది. అసలు విజ్ఞానశాస్త్ర పద్ధతే “విశ్వాసంపై ఆధారపడి ఉంది” అని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుడైన విన్సెంట్‌ విగెల్స్‌వర్త్‌ అన్నాడు. అదెలా? “ప్రకృతిలోని దృగ్గోచర విషయాలు ‘ప్రకృతి నియమాలకు’ అనుగుణంగా ఉంటాయనే స్థిర విశ్వాసంమీదే అది ఆధారపడి ఉంటుంది.” కాబట్టి దేవునిపై నమ్మకం ఉంచడాన్ని ఎవరైనా నిరాకరించినప్పుడు, అతడు ఒకదాన్ని విశ్వసించే బదులు మరోదాన్ని విశ్వసిస్తున్నవానిగానే ఉండడా? కొన్ని సందర్భాల్లో, దేవుణ్ణి నమ్మకపోవడం కేవలం సత్యాన్ని అంగీకరించడానికి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నట్లు కనిపిస్తుంది. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: ‘దుష్టుడు మితిమీరిన అహంకారంతో ఎలాంటి పరిశీలనా చేయడు; అతడు దేవుడు లేడనే ఆలోచిస్తాడు.’​—⁠కీర్తన 10:​4, NW.

5 అయితే దేవునిపై నమ్మకం ఉంచడం అంధ విశ్వాసం మాత్రం కాదు, ఎందుకంటే దేవుని ఉనికికి సంబంధించి తిరుగులేని రుజువు ఉంది. (హెబ్రీయులు 11:⁠1) “[విశ్వంలోవున్న] ఇంతగొప్ప క్రమం అవ్యక్త స్థితి నుండి పుట్టుకు రావడం అసంభవమని నేను భావిస్తున్నాను. దానికి తప్పకుండా ఒక వ్యవస్థీకరణ సూత్రం ఉండాలి. ఆ దేవుడెవరో నాకు తెలియదు గానీ, శూన్యానికి బదులు ప్రతీదీ ఎందుకు ఉనికిలో ఉందనేదానికి, అవి ఉనికిలో ఉన్నాయనే అద్భుతానికి అసలు వివరణ దేవుడే” అని వ్యోమగామి ఆలెన్‌ సెండాజ్‌ అన్నాడు. దేవుని “అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు [అవిశ్వాసులు] నిరుత్తరులై యున్నారు” అని అపొస్తలుడైన పౌలు రోమాలోని క్రైస్తవులకు చెప్పాడు. (రోమీయులు 1:​20) “జగదుత్పత్తి” నుండి, ప్రత్యేకంగా దేవుని ఉనికిని గ్రహించగల బుద్ధిసూక్ష్మతవున్న మానవులు సృష్టించబడిన దగ్గర నుండి అపార శక్తిగల, ఆరాధనార్హుడైన సృష్టికర్త ఉన్నాడనే రుజువు తేటతెల్లమవుతోంది. అందువల్ల దేవుని మహిమను గుర్తించని వారు నిరుత్తరులై ఉన్నారు. అయితే సృష్టి ఎలాంటి రుజువు ఇస్తోంది?

విశ్వం దేవుని మహిమను వివరిస్తోంది

6 “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” అని చెబుతూ కీర్తన 19:1 ఆ ప్రశ్నకు జవాబిస్తోంది. “అంతరిక్షము”లో లేదా ఆకాశ విశాలంలో వెలుగు విరజిమ్మే నక్షత్రాలు, గ్రహాలు మహిమాన్విత దేవుని ఉనికికి తిరుగులేని నిదర్శనమిస్తున్నాయని దావీదు గ్రహించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.” (కీర్తన 19:⁠2) పగటికి పగలు, రాత్రికి రాత్రి ఆకాశములు దేవుని జ్ఞానాన్ని, సృష్టించే శక్తిని ప్రదర్శిస్తున్నాయి. అది దేవుని స్తుతిస్తున్న పెద్ద శబ్దం ఆకాశం నుండి ‘బోధిస్తున్నట్టుగా’ ఉంది.

7 అయితే ఈ స్తుతుల శబ్దాన్ని వినడానికి వివేచన కావాలి. “వాటికి భాషలేదు, మాటలులేవు; వాటి స్వరము వినబడదు.” అయినప్పటికీ, ఆకాశాలు ఇచ్చే మౌన సాక్ష్యం చాలా శక్తిమంతమైనది. “వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి.” (కీర్తన 19:​3, 4) అది ఆకాశముల మౌన సాక్ష్యం భూమి నలుమూలలా వెల్లడయ్యేలా అవి ‘కొలనూలును’ వ్యాపింపజేసినట్లుగా ఉంది.

8 ఇప్పుడు దావీదు, యెహోవా సృష్టిలోని మరో అద్భుతాన్ని వర్ణిస్తున్నాడు: “వాటిలో [దృశ్య ఆకాశంలో] ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు, శూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు; అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.”​—⁠కీర్తన 19:4-6.

9 ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు, సూర్యగ్రహం కేవలం ఒక మోస్తరు పరిమాణంలోనే ఉంటుంది. అయినప్పటికీ అది ఒక అసాధారణ నక్షత్రం, అది తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలను మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. దాని ద్రవ్యరాశి “2 వందలకోట్ల వందకోట్ల వందకోట్ల టన్నులు” అని ఒక గ్రంథం చెబుతోంది, అంటే అది మన యావత్‌ సౌరకుటుంబపు ద్రవ్యరాశిలో 99.9 శాతం. దాని గురుత్వాకర్షణ శక్తి మన భూమిని అటు దూరంగా కొట్టుకొనిపోకుండా ఇటు దగ్గరకు ఆకర్షించబడకుండా 15 కోట్ల కిలోమీటర్ల పరిధిలోనే పరిభ్రమించేలా చేస్తుంది. సూర్యశక్తిలో 200 కోట్లలో ఒక భాగం మాత్రమే మన భూమికి చేరుతుంది, జీవకోటిని కాపాడేందుకు అది చాలు.

10 సూర్యగ్రహం గురించి కీర్తనకర్త అలంకారార్థ భావంలో మాట్లాడుతూ, దానిని పగటిపూట ఒక క్షితిజం నుండి మరో క్షితిజానికి పరుగెత్తి రాత్రిపూట ‘గుడారములో’ విశ్రమించే ‘శూరునిగా’ వర్ణిస్తున్నాడు. ఆ గొప్ప నక్షత్రం క్షితిజరేఖపై అస్తమిస్తున్నప్పుడు భూమి నుండి చూసేవారికి అది విశ్రాంతి కోసం “గుడారము” లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఉదయాన్నే అది తన ‘అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారునిలా’ వెలుగు విరజిమ్ముతూ భళ్లున బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. గొర్రెల కాపరియైన దావీదుకు ఎముకలు కొరికే రాత్రిచలి ఎలా ఉంటుందో తెలుసు. (ఆదికాండము 31:​40) సూర్యకిరణాలు తనకు, తనచుట్టూ పరచుకొనివున్న భూతలానికి వేగంగా వెచ్చదనం ఎలా తీసుకొస్తాయో ఆయన గుర్తు చేసుకున్నాడు. నిస్సందేహంగా, తూర్పునుండి పశ్చిమానికి చేసే “ప్రయాణంవల్ల” అది అలసిపోవడంలేదు గానీ, తిరిగి ఆ ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధంగావున్న ఒక ‘శూరుని’వలె ఉంది.

సంభ్రమాశ్చర్యం కలిగించే నక్షత్రాలు, నక్షత్ర వీధులు

11 దుర్భిణి సహాయం లేకుండా దావీదు కేవలం కొన్నివేల నక్షత్రాలను మాత్రమే చూడగలిగాడు. కానీ ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం విశ్వంలో ఆధునిక దుర్భిణి ద్వారా చూడగల నక్షత్రాల సంఖ్య 70 వేల వందకోట్ల వందకోట్లు అంటే, 7 తర్వాత 22 సున్నాలు ఉన్నన్ని నక్షత్రాలున్నాయి! యెహోవా నక్షత్రాల సంఖ్యను “సముద్రతీరమందలి యిసుక”తో పోల్చినప్పుడు వాటి సంఖ్య విస్తారమని ఆయన సూచించాడు.​—⁠ఆదికాండము 22:17.

12 ఎన్నో సంవత్సరాలుగా వ్యోమగాములు “స్పష్టంగా తెలియని, సరైన ఆకారంలేని తెల్లని మబ్బులాంటి ప్రాంతాలు” అని వర్ణించబడిన వాటిని గమనిస్తూ వచ్చారు. ఈ “చక్రల్లాంటి మబ్బులు” మన పాలపుంత నక్షత్ర వీధిలో భాగమేనని శాస్త్రజ్ఞులు అనుకున్నారు. అయితే 1924లో అత్యంత సమీపంగా ఉన్న అలాంటి మబ్బు, నిజానికి ఆండ్రోమిడా నక్షత్ర వీధి అనీ, అది దాదాపు 20 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని కనిపెట్టారు. పదివేలకోట్లకంటే ఎక్కువ నక్షత్ర వీధులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు, అలాంటి ఒక్కొక్క నక్షత్ర వీధిలో వేలసంఖ్యలో, కొన్నింటిలోనైతే వందల కోట్ల సంఖ్యలో నక్షత్రాలున్నాయి. అయినప్పటికీ, యెహోవా ఆ ‘నక్షత్రాల సంఖ్యను నియమించాడు; వాటికన్నిటికి పేర్లు పెడుతున్నాడు.’​—⁠కీర్తన 147:⁠4.

13 యెహోవా యోబునిలా అడిగాడు: ‘కృత్తిక నక్షత్రములను [‘నక్షత్రరాశిని,’ NW] నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?’ (యోబు 38:​31) ఈ నక్షత్రరాశుల్లోని చాలా నక్షత్రాలు ఒక విశిష్ఠ నమూనాగా ఏర్పడినట్లు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలు ఒకదానికొకటి చాలా దూరంలో ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ, భూమి నుండి చూసినప్పుడు మాత్రం వాటి సాపేక్షిక స్థానాలు ఎలాంటి మార్పులేకుండా ఉంటాయి. ఆ నక్షత్రాల స్థానాలు అంత ఖచ్చితంగా ఉండబట్టే, అవి “సముద్రయానంలో, వ్యోమగాములకు అంతరిక్షయానంలో, అలాగే నక్షత్రాలను గుర్తించడంలో సహాయక మార్గదర్శకాలుగా” ఉన్నాయి. (ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా) అయితే ఆ నక్షత్రరాశులను బంధించివుంచే ఆ ‘బంధకాలు’ ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అవును, “ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా?” అని యోబు 38:33లో వేయబడిన ప్రశ్నకు శాస్త్రజ్ఞులు ఇప్పటికీ జవాబు చెప్పలేకపోతున్నారు.

14 “వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది?” అని యోబుకు వేయబడిన మరో ప్రశ్నకూ శాస్త్రజ్ఞులు జవాబు చెప్పలేరు. (యోబు 38:​24) వెలుగుకు సంబంధించిన ఈ ప్రశ్నను ఒక రచయిత “అత్యాధునిక విజ్ఞానశాస్త్ర ప్రశ్న” అని పిలిచాడు. దీనికి భిన్నంగా, కొందరు గ్రీకు తత్త్వవేత్తలు వెలుగు మానవ నేత్రం నుండి వెలువడుతుందని విశ్వసించారు. ఆధునిక కాలాల్లోని, శాస్త్రజ్ఞులు వెలుగులో సూక్ష్మరేణువులు ఉన్నాయని తలిస్తే, మరికొందరు అది తరంగాలుగా కదులుతుందని భావించారు. నేడు, వెలుగు రెండు విధాలుగా అంటే ఇటు తరంగాల్లా అటు సూక్ష్మరేణువుల్లా ఉంటుందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అయితే వెలుగు సహజ స్వభావమేమిటో, అదెలా ‘విభాగించబడుతుందో’ ఇంకా పూర్తిగా అర్థంకాలేదు.

15 ఇదంతా ఆలోచిస్తూవుంటే మనం కూడా కీర్తనకర్తయైన దావీదులాగే భావించకుండా ఉండలేము, ఆయనిలా అన్నాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?”​—⁠కీర్తన 8:3, 4.

భూమి, అందులోని జీవకోటి యెహోవాను మహిమపరుస్తున్నాయి

16 సృష్టి ఏ ఇతర విధానాల్లో దేవుని మహిమను ప్రకటిస్తుందో కీర్తన 148 పేర్కొంటోంది. ఏడవ వచనం ఇలా చెబుతోంది: “భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి.” అవును, ‘అగాధజలములు’ దేవుని జ్ఞానాన్ని, శక్తిని నొక్కిచెప్పే అద్భుతాలతో నిండివున్నాయి. నీలి తిమింగిలం సగటు బరువు 120 టన్నులు ఉంటుంది, ఇది 30 ఏనుగుల బరువుకు సమానం! దాని గుండె ఒక్కటే 450 కిలోలకంటే ఎక్కువ బరువుండి, దాని శరీరమంతటికీ దాదాపు 6,400 కిలోల రక్తాన్ని సరఫరా చేస్తుంది! ఈ సముద్ర తిమింగిలాలు నీళ్లలో మందకొడిగా నెమ్మదిగా కదులుతుంటాయా? లేదు. అవి గమనార్హమైన వేగంతో “సముద్రాల్లో దూసుకువెళ్తుంటాయి” అని యురోపియన్‌ సైటేషన్‌ బైక్యాచ్‌ కాంపెయిన్‌ నివేదిక చెబుతోంది. “ఒక నీలి తిమింగిలం 10 నెలల్లో 16,000 కిలోమీటర్లు ప్రయాణించి మరో ప్రదేశానికి వెళ్లినట్లు” ఉపగ్రహ జాడ చూపించింది.

17 బాటిల్‌నోస్డ్‌ డాల్ఫిన్లు సాధారణంగా నీళ్లలో 45 మీటర్ల లోతువరకు వెళతాయి, అయితే డాల్ఫిన్‌ అత్యంత లోతుకు వెళ్లిన రికార్డు 547 మీటర్లుగా నమోదయ్యింది! అంతలోతుకు ఈ డాల్ఫిన్‌ ఎలా వెళ్లగలదు? అలా వెళుతున్నప్పుడు దాని గుండె కొట్టుకునే వేగం తగ్గి, రక్తం గుండెకు, ఊపిరితిత్తులకు, మెదడుకు మళ్లించబడుతుంది. అంతేకాకుండా, ప్రాణవాయువు నిలువజేసే రసాయనం దాని కండరాల్లో ఉంటుంది. ఎలిఫెంట్‌ సీల్‌, స్పెర్మ్‌ తిమింగిలాలు ఇంకా ఎక్కువ లోతుకు వెళ్లగలవు. “నీటి ఒత్తిడిని ఎదురొడ్డడానికి బదులు అవి తమ ఊపిరితిత్తుల్ని పూర్తిగా అచేతనం చేస్తాయి” అని డిస్కవర్‌ అనే పత్రిక చెబుతోంది. అవసరమైన ప్రాణవాయువులో అధికభాగం అవి తమ కండరాల్లోనే నిలువచేసుకుంటాయి. నిస్సందేహంగా ఈ ప్రాణులు సర్వశక్తిగల, జ్ఞానవంతుడైన దేవుని ఉనికికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి.

18 సముద్ర జలాలు సైతం యెహోవా జ్ఞానానికి అద్దంపడుతున్నాయి. “సముద్రంలో 100 మీటర్ల లోతువరకు ఉపరితలం మీదున్న నీటిలోని ప్రతీచుక్కలో వృక్షప్లవకాలు అని పిలువబడే, స్వేచ్ఛగా తేలియాడే, సూక్ష్మాతి సూక్ష్మమైన వృక్ష సముదాయం వేలసంఖ్యలో ఉంటాయి” అని సైంటిఫిక్‌ అమెరికన్‌ చెబుతోంది. ఈ “అదృశ్య అరణ్యం” వందలకోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని మన గాలిని శుభ్రం చేస్తుంటుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్‌లో సగం ఈ వృక్ష ప్లవకాలే ఉత్పత్తి చేస్తుంటాయి.

19 “అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ” అని కీర్తన 148:8 చెబుతోంది. అవును, యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చేందుకు ప్రకృతిలోని నిర్జీవ శక్తులను కూడా ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకు, అగ్నినే తీసుకోండి. దశాబ్దాల పూర్వం, అడవి మంటలు కేవలం నాశనకరము అన్నట్లు దృష్టించబడ్డాయి. కానీ ఆ మంటలు పాత వృక్షాలను లేదా చనిపోతున్న వృక్షాలను తొలగిస్తూ, అనేక కొత్త విత్తనాలు మొలకెత్తేలాచేస్తూ, పోషక పదార్థాలు తిరిగి లభ్యమయ్యేలా చేస్తూ అదే సమయంలో దావాగ్ని ప్రమాదాన్ని కూడా అరికడుతూ పర్యావరణంలో ఒక ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయని పరిశోధకులు ఇప్పుడు నమ్ముతున్నారు. నేలను తడిపి ఫలవంతం చేయడానికి, నదుల్లో నీరు నిండడానికి, గడ్డకట్టించే శీతల వాతావరణం నుండి చెట్లను, జంతువులను కాపాడడానికి మంచు కురవడం కూడా చాలా ప్రాముఖ్యం.

20 “పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా” అని కీర్తన 148:9 మాట్లాడుతోంది. మహా పర్వతాలు యెహోవా ప్రబల శక్తికి రుజువుగా ఉన్నాయి. (కీర్తన 65:⁠6) అంతేకాదు అవి ఉపయుక్తంగా కూడా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లోవున్న భూగోళశాస్త్ర సంస్థ నివేదిక ఇలా చెబుతోంది: “ప్రపంచంలోని మహానదులన్నీ పర్వతాల్లోనే పుట్టాయి. మానవుల్లో యాభైశాతం పర్వతాల్లో సమకూర్చబడే తాజా నీటిమీదే ఆధారపడుతున్నారు . . . మానవాళి సంక్షేమానికి ఈ ‘నీటి బురుజులు’ అత్యంతావశ్యకం.” మామూలు చెట్టుకూడా దాని సృష్టికర్తకు మహిమ తెస్తుంది. వృక్షాలు “అన్ని దేశాల్లోని ప్రజల సంక్షేమానికి అవశ్యం . . . అనేక రకాల వృక్షాలు కలప, పళ్లు, గట్టికాయలు, గుగ్గిలం, జిగురువంటి ఉత్పత్తులకు మూలాలుగా అధిక ఆర్థిక ప్రాముఖ్యతగలవిగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2 వందలకోట్ల మంది ప్రజలు వంటకు, ఇంధనానికి కలపమీద ఆధారపడుతున్నారు” అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ పథకం ఇచ్చిన నివేదిక చెబుతోంది.

21 ప్రతీ వృక్షపు పరికల్పనలో జ్ఞానవంతుడైన సృష్టికర్త ఉన్నాడనడానికి రుజువు కనబడుతుంది. మామూలు ఆకునే తీసుకోండి. ఆకు ఎండిపోకుండా పైన దానికి మైనపు పూత ఉంటుంది. ఆ పూత క్రింద ఆకు పైభాగంలో హరితకణాలుంటాయి. వీటిలో పత్రహరితం ఉంటుంది, ఇది వెలుగు నుండి శక్తిని సేకరిస్తుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆకులు “ఆహార కర్మాగారాల్లా” పనిచేస్తాయి. చెట్టు వేరునుండి సేకరించబడిన నీరు ఒక సంశ్లిష్టమైన “నీటి సరఫరా విధానం” ద్వారా ఆకులకు చేర్చబడుతుంది. ఆకు క్రింది భాగంలో వేల సంఖ్యలోవుండే (పత్ర రంధ్రాలు అని పిలువబడే) “కవాటములు” కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకోవడానికి తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంటాయి. నీరు కార్బన్‌డయాక్సైడ్‌ కలిసి పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి కావలసిన శక్తిని, వెలుగు ఇస్తుంది. ఆ విధంగా చెట్టు స్వయంగా తయారుచేసుకున్న ఆహారంతోనే పోషించబడుతుంది. అయినప్పటికీ, ఈ “కర్మాగారం” శబ్దంలేనిదీ చక్కనైనదీ. కాలుష్యం కలుగజేయడానికి బదులు, ఉపోత్పత్తిగా అది ప్రాణవాయువును బయటకు వదులుతుంది!

22 “మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా” అని కీర్తన 148:⁠10 మాట్లాడుతోంది. అనేక జంతువులు, పక్షులు అబ్బురపరచే సామర్థ్యాలను ప్రదర్శిస్తుంటాయి. లేసాన్‌ ఆల్‌బెట్రోస్‌ పక్షి అపరిమిత దూరం ఎగిరి వెళ్లగలదు (ఒకసారి కేవలం 90 రోజుల్లో 40,000 కిలోమీటర్లు ప్రయాణించింది). బ్లాక్‌పోల్‌ వార్‌బ్లర్‌ ఆగకుండా 80 గంటలపాటు అలా ఎగురుతూనే ఉత్తర అమెరికా నుండి దక్షిణ అమెరికాకు వెళుతుంది. ఒంటె నిర్జలీకరణకు గురికాకుండా ఎక్కువకాలం తట్టుకోవడానికి, సాధారణంగా నమ్మబడుతున్నట్లు నీటిని తన గూనిలో కాక జీర్ణాశయంలో దాచుకుంటుంది. యంత్రాల్ని, కొత్త వస్తువుల్ని పరికల్పించేటప్పుడు ఇంజనీర్లు జంతు ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనిస్తారనడంలో ఆశ్చర్యమేమీ లేదు. “సమర్థవంతంగా పనిచేస్తూ . . . దోషరహితంగా పర్యావరణంలో ఇమిడిపోయేదేదైనా తయారు చేయాలని మీరు అనుకుంటే, దానికి చక్కని నమూనాలు ప్రకృతిలోనే మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంది” అని గేల్‌ క్లీర్‌ అనే రచయిత్రి అంటోంది.

23 అవును, సృష్టి నిజంగా దేవుని మహిమను వివరిస్తోంది! నక్షత్రాలతో నిండిన ఆకాశం మొదలుకొని వృక్షాలు జంతువుల వరకు ప్రతీది తనదైన విధానంలో తమ సృష్టికర్తకు స్తుతులు తెస్తున్నాయి. మరి మానవులమైన మన విషయమేమిటి? దేవునికి స్తుతులు పాడడంలో ప్రకృతితో మనమెలా గళం కలపగలం?

మీకు జ్ఞాపకమున్నాయా?

దేవుని ఉనికిని నిరాకరించేవారు ఎందుకు నిరుత్తరులై ఉన్నారు?

నక్షత్రాలు, గ్రహాలు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాయి?

జలచరాలు, నేలమీది జంతువులు ప్రేమగల సృష్టికర్తకు ఎలా రుజువిస్తున్నాయి?

ప్రకృతిలోని నిర్జీవ శక్తులు యెహోవా చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మానవులు దేవుని మహిమను నేరుగా ఎందుకు చూడలేరు? (బి) ఆ 24 మంది పెద్దలు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నారు?

3, 4. (ఎ) దేవునిపై విశ్వాసం ఎందుకు విజ్ఞానశాస్త్ర విరుద్ధం కాదు? (బి) కొన్ని సందర్భాల్లో, దేవునిపై విశ్వాసాన్ని త్రోసిపుచ్చడానికి కారణమేమిటి?

5. దేవునిపై నమ్మకం లేనివారు ఎందుకు నిరుత్తరులై ఉన్నారు?

6, 7. (ఎ) ఆకాశములు దేవుని మహిమనెలా ప్రచురిస్తున్నాయి? (బి) ఏ ఉద్దేశంతో ఆకాశములు ‘కొలనూలును’ వ్యాపింపజేశాయి?

8, 9. సూర్యునికి సంబంధించిన కొన్ని విశేషమైన వాస్తవాలేమిటి?

10. (ఎ) సూర్యగ్రహం తన “గుడారము” లోపలికి, బయటకు ఎలా వెళుతుంది? (బి) ఒక ‘శూరుని’వలె అదెలా పరుగెత్తుతుంది?

11, 12. (ఎ) బైబిలు, నక్షత్రాలను ఇసుక రేణువులతో పోల్చడంలో ఏ విషయం గమనార్హంగా ఉంది? (బి) విశ్వమెంత విస్తారమై ఉండవచ్చు?

13. (ఎ) నక్షత్రరాశుల విషయంలో ఏది గమనార్హంగా ఉంది? (బి) శాస్త్రజ్ఞులకు “ఆకాశమండలపు కట్టడలు” తెలియవని ఎలా రుజువవుతోంది?

14. వెలుగు విభాగించబడడం ఏ విధంగా ఒక రహస్యంగానే మిగిలిపోయింది?

15. దావీదులాగే, ఆకాశములను చూసినప్పుడు మనమెలా భావించాలి?

16, 17. ‘అగాధజలాల్లోని’ జలచరాలు యెహోవాను ఎలా స్తుతిస్తున్నాయి?

18. సముద్ర జలాలు యెహోవా జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాయి?

19. అగ్ని, మంచు యెహోవా చిత్తాన్నెలా నెరవేరుస్తున్నాయి?

20. పర్వతాలు, వృక్షాలు మానవాళికెలా ప్రయోజనం చేకూరుస్తున్నాయి?

21. మామూలు ఆకు సైతం పరికల్పనకు రుజువుగా ఎలా నిరూపించుకుంటుందో వివరించండి.

22, 23. (ఎ) కొన్ని పక్షులకు, జంతువులకు ఎలాంటి అసాధారణ సామర్థ్యాలున్నాయి? (బి) అదనంగా మనమింకా ఏ ప్రశ్నలు పరిశీలించవలసి ఉంది?

[10వ పేజీలోని చిత్రం]

చూడగల నక్షత్రాలు 70వేల వందకోట్ల వందకోట్లు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు!

[చిత్రసౌజన్యం]

Frank Zullo

[12వ పేజీలోని చిత్రం]

బాటిల్‌నోస్డ్‌ డాల్ఫిన్‌

[13వ పేజీలోని చిత్రం]

మంచుకణం

[చిత్రసౌజన్యం]

snowcrystals.net

[13వ పేజీలోని చిత్రం]

లేసాన్‌ ఆల్‌బెట్రోస్‌ పక్షి