కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అమూల్యమైన వారసత్వ సంపద

అమూల్యమైన వారసత్వ సంపద

అమూల్యమైన వారసత్వ సంపద

వృద్ధ అపొస్తలుడైన యోహాను తన అవసాన దశలో ఇలా వ్రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.”​—⁠3 యోహాను 4.

విశ్వసనీయుడైన ఈ అపొస్తలుడు ఆధ్యాత్మిక భావంలో తన పిల్లలను సూచిస్తున్నాడు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఆ అపొస్తలుని మాటలను నిజంగా ప్రతిధ్వనిస్తారు. వారు తమ పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడానికి చాలా కష్టపడ్డారు. అందుకే పెరిగి పెద్దవారైన తమ పిల్లలు ‘సత్యమును అనుసరించి నడుచుకోవడం’ చూసి వారిప్పుడు సంతోషిస్తున్నారు. (ఎఫెసీయులు 6:⁠4) వాస్తవానికి, పిల్లలకు జీవ మార్గాన్ని బోధించడమంటే వారికి అమూల్యమైన వారసత్వ సంపదను కట్టబెట్టడమనే అర్థం. దానికి కారణమేమిటంటే, క్రైస్తవులు ఎలా జీవించాలని యెహోవా కోరుతున్నాడో అలా జీవించడంలో ఇమిడివున్న దైవభక్తి మూలంగా ‘ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మేలు కలుగుతుంది.’​—⁠1 తిమోతి 4:⁠8.

పరిపూర్ణ తండ్రియైన యెహోవా, తమ పిల్లలకు ఆధ్యాత్మిక విద్యాబుద్ధులు నేర్పించడానికి కృషిచేసే భక్తిపరులైన తల్లిదండ్రులను ఎంతో విలువైనవారిగా ఎంచుతాడు. పిల్లలు దానికి అనుకూలంగా ప్రతిస్పందిస్తే, వారు తమ తల్లిదండ్రులతోపాటు సత్యారాధనలో సాగిపోవడంలో ఎంతో ఆనందిస్తారు. అలాంటి పిల్లలు పెద్దవారైనప్పుడు వారిలో ఆ అనుభవాల మధురస్మృతులు చెదిరిపోకుండా ఉంటాయి. కొందరు తాము దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మొదటిసారి భాగం వహించడాన్ని సంతోషంగా గుర్తుచేసుకుంటారు. * లేదా తమ తల్లిదండ్రుల్లో ఒకరితో ఇంటింటి పరిచర్యలో మొదటిసారి బైబిలు వచనం చదవడాన్ని వారు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. తమ తల్లిదండ్రులు నా బైబిలు కథల పుస్తకము లేదా గొప్ప బోధకుడు చెప్పేది వినడం * (ఆంగ్లం) నుండి చదివి వినిపించడాన్ని వారెలా మరచిపోగలరు? గాబ్రియేల్‌ తనకెంతో నచ్చిన దానిని ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నాకు నాలుగేళ్లున్నప్పుడు మా అమ్మ వంటచేస్తూ ప్రతీరోజు నాకోసం ఒక పాట పాడేది. అలాంటి ఒక రాజ్య గీతాన్ని నేనిప్పటికీ ఎంతో ఇష్టంగా గుర్తుతెచ్చుకుంటాను. ఆ తర్వాత, అది యెహోవా సేవలోని ప్రాముఖ్యతను చూడడానికి నాకు సహాయపడింది.” గాబ్రియేల్‌ సూచిస్తున్న ఆ చక్కని పాట బహుశా మీకు కూడా గుర్తు ఉండవచ్చు. అది యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (ఆంగ్లం) అనే పాటల పుస్తకంలోని, “యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి” అనే పాట.

ఆ పాట ఇలా ఆరంభమవుతుంది: “పిల్లలు దేవునికి స్తుతులు తెలిపారు;/గళమెత్తి యేసుకు జేజేలు పలికారు.” అవును, యేసుతో సహవసించే ఉత్కృష్ట అవకాశం లభించిన పిల్లలున్నారు, వారు తమ ఉత్తేజకరమైన, యథార్థవర్తనతో ఆయనను ఆనందపరచి ఉంటారు. యేసు చంటి పిల్లల గుణాన్ని తన అనుచరులు అనుకరించడానికి బోధింపతగిన ఒక ఉదాహరణగా కూడా పేర్కొన్నాడు. (మత్తయి 18:​3, 4) కాబట్టి యెహోవా ఆరాధనలో పిల్లలకు ఒక సముచిత స్థానం ఉంది. వాస్తవానికి, ఆ పాటలోని పదాలు ఇలా కొనసాగాయి: “చంటి పిల్లలు సైతం దేవుణ్ణి శ్లాఘిస్తారు.”

చాలామంది పిల్లలు ఇంట్లో, పాఠశాలలో, ఇతర స్థలాల్లో తమ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా దేవునికి, తమ కుటుంబానికి ఘనత తీసుకొచ్చారు. “సత్యాన్ని ప్రేమించే క్రైస్తవ తల్లిదండ్రులు” వారికి ఉండడం ఎంత దీవెనకరమో కదా! (ద్వితీయోపదేశకాండము 6:⁠7) ప్రేమగల తండ్రిగా తన సృష్టి ప్రాణులు నడువవలసిన త్రోవను వారికి నేర్పించే దేవుని మాటను దైవభక్తిగల తల్లిదండ్రులు వింటారు. అలా చేసినందుకు వారెంతగా దీవించబడతారో కదా! తిరిగి వాళ్లు తమ కుటుంబంలోని పిల్లలకు బోధించినప్పుడు వారి “మాటవిని వారిని ఆనందపరిచే” పిల్లలు ఉండడం వారినెంత పులకరింపజేస్తుందో కదా! (యెషయా 48:17, 18) ప్రస్తుతం యెహోవాసాక్షుల మెక్సికో బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న ఆంజిలికా ఇలా చెబుతోంది: “నా తల్లిదండ్రులు అన్ని సందర్భాల్లో బైబిలు సూత్రాల ప్రకారం జీవించడానికి ప్రయత్నించారు. అది నా బాల్యాన్ని ఆహ్లాదకరం చేసింది. నేను సంతోషించాను.”

మీ ఆధ్యాత్మిక వారసత్వ సంపదపట్ల మీరు శ్రద్ధవహించడం యుక్తమని అలాంటి క్రైస్తవులు ఒప్పుకుంటారు. యౌవనస్థులైన మీరు బహుశా నిజ క్రైస్తవ విలువలున్న కుటుంబంలో పెరుగుతుండవచ్చు. అలాగయితే, అదే పాట మీకిలా ఉపదేశిస్తోంది: “ఓ క్రైస్తవ యువకా, నీ మార్గం పరిశుభ్రంగా ఉంచుకో.” మీరు మీ సొంతగా నిర్ణయాలు తీసుకోవలసిన సమయం వస్తుంది కాబట్టి ఇప్పుడే అంటే “బాల్యంలోనే యెహోవాపై ఆధారపడడం నేర్చుకో./ఎన్నడూ జనసమ్మతికై ప్రయాసపడకు.”

మీ జీవితంలో పొరపాటున జనసమ్మతిని మొదట ఉంచితే, మీరు పొందిన శిక్షణంతా వ్యర్థమవుతుంది, పైగా మీ భవిష్యత్‌ ఉత్తరాపేక్షల్ని సర్వనాశనం చేసుకునే ప్రమాదముంది. జనసమ్మతం కావాలనే కోరిక మీరు అప్రమత్తంగా ఉండకుండా చేస్తుంది. క్రైస్తవ ప్రమాణాలపై అసలు ఆసక్తిలేకపోయినా మంచివారిగా, ఆకర్షణీయంగా కూడా కనిపించిన వారితో కొందరు సహవాసం చేశారు. యువత ఇలా అడుగుతోంది​—⁠నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియోలో ప్రధాన పాత్రధారి టార విషయంలో అదే జరిగింది. టారలాగే, సత్యారాధనను విలువైనదిగా పరిగణించని వారితో సహవసించే యౌవన క్రైస్తవులు ఆ పాట చెబుతున్నట్లుగా, “చెడు సావాసంతో మంచి అలవాట్లు పాడవుతాయి” అని తెలుసుకోక తప్పదు. మంచి అలవాట్లు వృద్ధి చేసుకోవడానికి చాలాకాలం పడుతుంది, అయితే అవి నాశనం కావడానికి ఒక్క క్షణం కూడా పట్టదు.

నిజమే, దైవభక్తితో జీవించడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆ పాట చెబుతున్నట్లుగా, “బాల్యమందే నీ దేవుణ్ణి స్మరిస్తే,/ఆత్మసత్యాలతో యెహోవాను సేవిస్తే,” నిజమైన విజయానికి మీరు గట్టి పునాది వేసుకున్న వారవుతారు. అప్పుడు మీరు ఎదిగేకొద్దీ “మరింత ఆనందం మీ సొంతం” అవుతుంది. అలా యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ ఉండగా, ఆయన దృష్టిలో సరైనది చేయకుండా మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదని మీరు మరింత ఎక్కువగా అర్థంచేసుకుంటారు. పరిణతి చెందిన, దైవభక్తిగల వయోజనులయ్యేందుకు అదొక్కటే మార్గం. అంతకంటే ఎక్కువగా, క్రైస్తవ పెంపకాన్ని జ్ఞానయుక్తంగా సద్వినియోగం చేసుకోవడం “దేవుని హృదయాన్ని ఆనందపరిచే” ప్రతీ అవకాశాన్ని మీకిస్తుంది. మానవునికి ఇంతకంటే ఇంకా గొప్ప ఘనత ఏముంటుంది?​—⁠సామెతలు 27:11.

కాబట్టి యౌవనులారా, యెహోవా నుండి, మీ క్రైస్తవ తల్లి లేక తండ్రి నుండి లభించే శిక్షణ ఎంత విలువైనదో అన్నిసమయాల్లో గుర్తుంచుకోండి. మీ పట్ల వారు చూపించే గొప్ప ప్రేమ మీరు యెహోవా దృష్టిలో సంతోషకరమైనది చేసేలా మిమ్మల్ని పురిగొల్పును గాక. అప్పుడు యేసుక్రీస్తువలె, నమ్మకమైన యువకుడైన తిమోతివలె మీరు మీ పరలోకపు తండ్రిని, మీ భూసంబంధమైన తల్లిదండ్రులను సంతోషపెడతారు. ఒకవేళ భవిష్యత్తులో మీరు పిల్లల్ని కంటే ముందు ప్రస్తావించబడిన ఆంజిలికాతో బహుశా ఏకీభవిస్తారు, ఆమె ఇలా అంటోంది: “ఒకవేళ నేనే ఎప్పుడైనా పిల్లవాడ్ని కంటే, చిన్నతనం నుండే వాడి హృదయంలో యెహోవాపట్ల ప్రేమను నాటేందుకు, అది వాడికి మార్గనిర్దేశమిచ్చేదిగా ఉండేలా చేసేందుకు కష్టపడి ప్రయత్నిస్తాను.” నిత్యజీవానికి నడిపే యథార్థతా మార్గం, ఖచ్చితంగా ఒక అమూల్యమైన వారసత్వ సంపదే!

[అధస్సూచీలు]

^ పేరా 4 యెహోవాసాక్షుల సంఘాల్లో నిర్వహించబడే బైబిలు విద్యా కార్యక్రమంలో ఇదొక భాగం. దీనిలో యౌవనులు వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ పాల్గొనవచ్చు.

^ పేరా 4 పేర్కొనబడిన ఈ సాహిత్యాలు యెహోవాసాక్షులు ప్రచురించినవి.