కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆమె తన మతాన్ని గౌరవించడం మాకు నేర్పింది’

‘ఆమె తన మతాన్ని గౌరవించడం మాకు నేర్పింది’

‘ఆమె తన మతాన్ని గౌరవించడం మాకు నేర్పింది’

ఇటలీలోని రొవిగో ప్రాంతపు యెహోవాసాక్షి ఒకరు తనకు ఒక కంతి ఉందనీ, అందువల్ల తన పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించిందనీ తెలుసుకుంది. ఆమె ఎన్నోసార్లు ఆసుపత్రిలో చేరింది, అలా చేరినప్పుడల్లా తనకు రక్త మార్పిడిలేని చికిత్సకోసం అడిగేది, అయితే ఆ తర్వాత ఆమె ఇంటి దగ్గరే ఉన్నప్పుడు స్థానిక క్యాన్సర్‌ నర్సింగ్‌ సేవాసంస్థకు చెందిన నర్స్‌లు ఆమెకు సహాయపడుతూ ఉండేవారు.

ఈ 36 సంవత్సరాల రోగికున్న బలమైన విశ్వాసం, సహకరించే సంసిద్ధత, ఆమెకు చికిత్సచేసిన వైద్య సిబ్బందిని ఎంతగానో ముగ్ధుల్నిచేశాయి. క్యాన్సర్‌ మూలంగా ఆ రోగి చనిపోవడానికి కొంతకాలం ముందు, ఆమెకు సహాయపడిన ఒక నర్స్‌ తనకు కలిగిన అనుభవం గురించి నర్సింగ్‌ సంబంధిత పత్రికకు వ్రాశాడు, ఆమెను అతడు ఆంజెలా అని పిలిచాడు.

“ఆంజెలా ఎంతో ఉత్సాహవంతంగా ఉండేది, ఆమెకు జీవించాలనే కోరిక బలంగా ఉండేది. ఆమెకు తన పరిస్థితి గురించి, తనకున్న ప్రమాదకరమైన వ్యాధి గురించి తెలుసు, మనలో అందరూ చేసినట్లే, ఆమె కూడా ఏదైనా నివారణ కోసం లేదా మందుకోసం అన్వేషించింది. . . . నర్స్‌లమైన మేము నెమ్మదిగా ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాం. ఆమె మా సహాయాన్ని ప్రతిఘటించలేదు. బదులుగా, దాపరికంలేని ఆమె స్వభావం ప్రతీ విషయాన్ని సులభం చేసింది. ఆమెపట్ల శ్రద్ధ తీసుకోవడం మాకు సంతోషాన్నిచ్చేది, ఎందుకంటే అది ఒక మంచి మనిషిని కలుసుకొని, పరస్పరం ప్రయోజనంపొందే సమయమని మాకు తెలుసు. . . . ఆమెకున్న వ్యాధితో వ్యవహరించడానికి ఆమె మతం ఒక ప్రతిబంధకం కాబోతుందని మేము త్వరలోనే గ్రహించాము.” ఇది ఆయన అభిప్రాయం, ఎందుకంటే ఆంజెలాకు రక్త మార్పిడి చేయాలని అతను భావించాడు, కానీ ఆమె దానికి నిరాకరించింది.​—⁠అపొస్తలుల కార్యములు 15:28, 29.

“ఆరోగ్య సంరక్షణలో శిక్షణపొందిన వారిగా మేము తన నిర్ణయంతో ఏకీభవించలేమని ఆంజెలాకు చెప్పాము, కానీ ఆమె సహాయంతోనే, ఆమెకు జీవితమంటే ఏమిటో అర్థంచేసుకున్నాము. ఆమెకు, ఆమె కుటుంబానికి వారి మతమెంత ప్రాముఖ్యమో కూడా మేము అర్థం చేసుకున్నాము. ఆంజెలా ధైర్యం కోల్పోలేదు. వ్యాధినిబట్టి కృంగిపోలేదు. ఆమె స్థిరంగా నిలబడింది. ఆమె జీవించాలనీ, జీవించడానికి పోరాడాలనీ, జీవిస్తూనే ఉండాలనీ కోరుకుంది. ఆమె తన తీర్మానాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరచింది. తరచూ మాకు లేని నిబ్బరం ఆమెకు ఉంది, ఆమెకున్నంత దృఢ విశ్వాసం మాకు లేదు. . . . ఆంజెలా తన మతాన్ని గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను మాకు నేర్పింది, ఇది వృత్తిపరమైన మా నీతి సూత్రాలకు చాలా భిన్నం. . . . ఆంజెలా మాకు నేర్పింది చాలా ప్రాముఖ్యమైనదని మేము నమ్ముతున్నాం, ఎందుకంటే మాకు అన్ని రకాల ప్రజలు ఎదురవుతుంటారు, అన్ని రకాల పరిస్థితులు, అన్ని రకాల మతాలు మాకు ఎదురవుతాయి, మాకు ఎదురయ్యే ప్రతీ ఒక్కరి నుండి మేము నేర్చుకోగలం, వారికీ కొంత నేర్పించగలం.”

పత్రికలోని ఆ ఆర్టికల్‌ 1999లో ఆమోదించబడిన ఇటాలియన్‌ నర్స్‌ల వృత్తిపరమైన నీతి సూత్రావళిని నొక్కిచెప్పింది. అదిలా చెబుతోంది: “నర్సులు, ఆడ, మగా అనే తేడాలేకుండా ప్రతీ వ్యక్తి యొక్క మత, నైతిక, సాంస్కృతిక విలువల్ని అలాగే వారి తెగను పరిగణలోకి తీసుకొని చర్య తీసుకుంటారు.” కొన్ని సందర్భాల్లో రోగి మతనమ్మకాలను గౌరవించడం వైద్యులకు, నర్సులకు కష్టంగా ఉండవచ్చు, అయితే అలా చేయడానికి ఇష్టపడే వారిపట్ల కృతజ్ఞత చూపించకుండా, వారిని విలువైనవారిగా ఎంచకుండా ఉండలేము.

ఆరోగ్యం విషయంలో, వైద్యపరంగా శ్రద్ధ తీసుకోవడం విషయంలో యెహోవాసాక్షులు తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకునేవే. వారు లేఖనాలు చేప్పే విషయాలను గంభీరంగా పరిగణిస్తారు, అలాగే ఆంజెలా ద్వారా ఉదహరించబడినట్లు వారు చాంధసులు కాదు. (ఫిలిప్పీయులు 4:⁠5) ఆరోగ్య సంరక్షణా వృత్తుల్లో ఉన్నవారు భూవ్యాప్తంగా అంతకంతకు అనేకమంది తమ దగ్గర రోగులుగావున్న సాక్షుల మనస్సాక్షిని గౌరవించడానికి ఇష్టపడుతున్నారు.