కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎనబాప్టిస్టులు ఎవరు?

ఎనబాప్టిస్టులు ఎవరు?

ఎనబాప్టిస్టులు ఎవరు?

జర్మనీలోని వెస్ట్‌ఫాలియాలో ఉన్న మ్యూన్‌స్టర్‌ నగర కేంద్రాన్ని మొదటిసారి సందర్శించే వారు నిలబడి, చర్చి గోపురంపై వ్రేలాడదీయబడిన మూడు ఇనుప బోన్లను పరీక్షగా చూడకుండా వెళ్లరు. ఏవో కొద్ది సమయాల్లో తప్ప ఆ బోన్లు దాదాపు 500 సంవత్సరాలుగా అక్కడే వ్రేలాడుతున్నాయి. మొదట్లో వాటిలో, బహిరంగంగా చిత్రహింసలుపెట్టి, హతమార్చిన ముగ్గురి శవాలు ఉండేవి. వాళ్లు ఎనబాప్టిస్టులు, ఆ బోన్లు వారి రాజ్యసంబంధ స్మారక చిహ్నాలు.

ఎవరీ ఎనబాప్టిస్టులు? వారి ఉద్యమమెలా ఆరంభమైంది? దాని ముఖ్య బోధలేమిటి? ఆ మనుష్యులు ఎందుకు చంపబడ్డారు? ఆ మూడు బోన్లకు, ఒక రాజ్యానికి ఎలాంటి సంబంధముంది?

చర్చిని సంస్కరించాలి​—⁠కానీ ఎలా?

15వ శతాబ్దపు మలి సంవత్సరాలు, 16వ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో రోమన్‌ క్యాథలిక్‌ చర్చిపై, మతనాయకులపై విమర్శలు వెల్లువెత్తాయి. చర్చిలో ఎక్కడచూసినా అవినీతి, లైంగిక దుర్నీతి వ్యాపించిపోయాయి; అందువల్ల దానిలో పెద్దయెత్తున మార్పులు జరగాలని చాలామంది భావించారు. 1517వ సంవత్సరంలో మార్టిన్‌ లూథర్‌ బహిరంగంగానే సంస్కరణకు పిలుపు ఇచ్చాడు, ఆ పోరాటంలో ఇతరులు కూడా చేరడంతో ప్రొటస్టెంట్‌ సంస్కరణోద్యమం ఊపందుకుంది.

అయితే ఏమిచేయాలి, ఎంతమేరకు మార్పులు తీసుకురావాలి అనే విషయాల్లో ఆ సంస్కరణకర్తలకు ఒక సమైక్య కార్యప్రణాళిక లేకపోయింది. అయితే ఆరాధన విషయంలో బైబిలుకు కట్టుబడి ఉండాలని మాత్రం చాలామంది గుర్తించారు. అంతేగాక ఆ సంస్కరణకర్తలు బైబిలు బోధలకు సంబంధించి ఒక్క సాధారణ వివరణపై కూడా అంగీకారానికి రాలేకపోయారు. కొందరు సంస్కరణోద్యమ ప్రగతి నత్త నడక నడుస్తోందని భావించారు. ఇలాంటి సంస్కరణకర్తల మధ్యనే ఎనబాప్టిస్టు ఉద్యమం వేళ్లూనుకుంది.

“నిజానికి, ఆ ఒక్క బాప్టిస్టు ఉద్యమం మాత్రమే కాదు; అనేకం పుట్టుకొచ్చాయి” అని హ్యాన్స్‌ యూరిజెన్‌ గోయర్ట్స్‌ తన స్వీయ గ్రంథమైన డి టోయ్‌ఫే​—⁠గెషిక్టే అండ్‌ డోయిటంగ్‌లో వ్రాశాడు. ఉదాహరణకు, 1521లో ట్సిఫికావ్‌ ప్రవక్తలని పిలువబడిన నలుగురు మనుష్యులు విట్టెన్‌బర్గ్‌లో ఎనబాప్టిస్టుల బోధలు ప్రచారంచేస్తూ అలజడి సృష్టించారు. 1525లో స్విట్జర్లాండ్‌, జూరిచ్‌లో ఎనబాప్టిస్టుల ప్రత్యేక గుంపు స్థాపించబడింది. ప్రస్తుతం చెక్‌ రిపబ్లిక్‌గావున్న మొరేవియాలో, నెదర్లాండ్స్‌లో కూడా ఎనబాప్టిస్టుల సమాజాలు ఆరంభమయ్యాయి.

బాప్తిస్మం​—⁠పిల్లలకా లేక వయోజనులకా?

ఎనబాప్టిస్టుల సమాజాలు సాధారణంగా చిన్నగావుండి, వాటి సభ్యులు సమాధానపరులుగా ప్రవర్తించేవారు. వాటి సభ్యులు తమ నమ్మకాలను ఏ మాత్రం రహస్యంగా ఉంచలేదు; నిజానికి వారు ఇతరులకు వాటిని ప్రకటించారు. ఎనబాప్టిస్టుల ప్రాథమిక సిద్ధాంతాలు 1527లో ష్లీట్‌హిమ్‌ కన్ఫెషన్‌లో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఆయుధాలు ధరించకపోవడం, లోకం నుండి వేరుగా ఉండడం, తప్పిదస్థుల్ని బహిష్కరించడం వంటివి వారి సిద్ధాంతాల్లో ఉన్నాయి. అన్నింటికంటే మిన్నగా ఇతర మతాల నుండి ఎనబాప్టిస్టులను విస్పష్టంగా గుర్తించిందేమిటంటే, బాప్తిస్మం పిల్లలకు కాదు వయోజనులకు మాత్రమే ఇవ్వాలనే గట్టి నమ్మకం. *

వయోజనుల బాప్తిస్మం కేవలం మత సంబంధమైన వివాదం కాదు; అది అధికార సంబంధమైన వివాదం కూడా. వయోజనులయ్యే వరకు బాప్తిస్మాన్ని వాయిదావేసి, ఆ విధంగా ఒక వ్యక్తి తన విశ్వాసం ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తే కొందరు అసలే బాప్తిస్మం తీసుకోకపోవచ్చు. అలా బాప్తిస్మం తీసుకోని వ్యక్తులు కొంతలో కొంతైనా చర్చి ఆధిపత్యం క్రిందికి రాకుండా ఉండే అవకాశముంది. కొన్ని చర్చీలకు వయోజనుల బాప్తిస్మమంటే అధికార నష్టమనే భావాన్నిచ్చింది.

అందువల్ల క్యాథలిక్కులు, లూథరన్లు ఏకరీతిన వయోజనుల బాప్తిస్మాన్ని నిరుత్సాహపరచాలనే కోరుకున్నారు. 1529 తర్వాత కనీసం కొన్ని ప్రాంతాల్లో వయోజనులకు బాప్తిస్మమిచ్చినవారు లేదా వయోజనులుగా బాప్తిస్మం తీసుకున్నవారు మరణశిక్ష అనుభవించే ప్రమాదం ఏర్పడింది. ఎనబాప్టిస్టులు “జర్మన్‌ దేశపు పరిశుద్ధ రోమా సామ్రాజ్యమంతటా భయంకరంగా హింసించబడ్డారు” అని పత్రికా విలేఖరి థామస్‌ సీఫెర్ట్‌ వివరిస్తున్నాడు. ఆ హింస మ్యూన్‌స్టర్‌లో పరాకాష్ఠకు చేరింది.

మధ్యయుగాల మ్యూన్‌స్టర్‌ మార్పుకోరడం

మధ్యయుగాల మ్యూన్‌స్టర్‌లో దాదాపు 10,000 మంది నివాసులు ఉండేవారు, దానిచుట్టూ 90 మీటర్ల వెడల్పు, దాదాపు 5 కిలోమీటర్ల చుట్టుకొలతతో దుర్భేద్యమైన ప్రాకారం ఉంది. అయితే ఆ నగరంలో పరిస్థితి మాత్రం దాని ప్రాకారాలంత సుస్థిరంగా లేదు. సిటీ మ్యూజియమ్‌ ఆఫ్‌ మ్యూన్‌స్టర్‌ ప్రచురించిన ద కింగ్‌డమ్‌ ఆఫ్‌ ఎనబాప్టిస్ట్స్‌ “నగర శాసనసభ సభ్యుల, ప్రజా సంఘాల మధ్యవున్న ఆంతరంగిక రాజకీయ విభేదాల” గురించి పేర్కొంది. అంతేకాకుండా, దాని నివాసులు మతనాయకుల ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. సంస్కరణల ఫలితంగా 1533లో మ్యూన్‌స్టర్‌ నగరం క్యాథలిక్‌ నుండి లూథరన్‌ నగరంగా తయారైంది.

మ్యూన్‌స్టర్‌లో సంస్కరణల ప్రచార ప్రముఖుల్లో అతివాద బెర్న్‌హార్డ్‌ రోట్‌మ్యాన్‌ ఒకరు. రోట్‌మ్యాన్‌కు “ఎనబాప్టిస్టుల దృక్కోణాలే ఉన్నాయి; ఆయన, ఆయన తోటివారు శిశు బాప్తిస్మాన్ని నిరాకరించారు” అని గ్రంథకర్తయైన ఫ్రీడ్రిక్‌ ఓయినింగర్‌ వివరిస్తున్నాడు. ఆయన అతివాద దృక్కోణాలు కొందరికి అతిగా తోచినప్పటికీ, ఆయన మ్యూన్‌స్టర్‌లో ప్రజా మద్దతు కూడగట్టుకున్నాడు. పాత మత విధానాన్ని ప్రేమించినవారు అంతకంతకు ఎక్కువమంది ఏదో జరుగుతుందనే భయాందోళనలతో నగరం విడిచివెళ్లిపోయారు. దానితో తమ ఆదర్శాలు నెరవేర్చుకోవాలనే ఆశతో అన్నిచోట్ల నుండి తండోపతండాలుగా ఎనబాప్టిస్టులు మ్యూన్‌స్టర్‌కు చేరుకున్నారు.” ఇలా ఎనబాప్టిస్టులందరూ ఒక్కచోటుకు చేరుకోవడం భయానక పరిస్థితికి దారితీసింది.

ముట్టడివేయబడిన నూతన యెరూషలేము

అక్కడి పరిణామాల్లో, మ్యూన్‌స్టర్‌కు వచ్చిన ఇద్దరు డచ్‌ వలసదారులు, హార్లీమ్‌కు చెందిన బేకరు యాన్‌ మాటిస్‌, లైడన్‌కు చెందిన జాన్‌ అని పిలువబడే జేన్‌ బ్యుకెల్‌సన్‌ నిర్ణయాత్మక పాత్ర వహించనున్నారు. మాటిస్‌ తానొక ప్రవక్తనని చెప్పుకుంటూ, 1534 ఏప్రిల్‌ను క్రీస్తు రెండవ రాకడ సమయంగా ప్రకటించాడు. ఆ నగరం బైబిల్లో ప్రస్తావించబడిన నూతన యెరూషలేము అవుతుందని ప్రకటించబడింది, దానితో అక్కడి వాతావరణం లోకాంతం వచ్చేసిందన్నట్లు మారిపోయింది. అదే సమయంలో, ఆస్తులన్నీ ఉమ్మడిగా అందరికీ చెందాలని రోట్‌మ్యాన్‌ తీర్మానించాడు. దానితో వయోజనులుగా ఉన్న నివాసులు బాప్తిస్మం తీసుకోవడమో లేదా నగరం విడిచివెళ్లడమో నిర్ణయించుకోవలసి వచ్చింది. తత్ఫలితంగా, కేవలం తమ ఇంటిని, ఆస్తుల్ని కాపాడుకోవడానికే చాలామంది గుంపులుగుంపులుగా బాప్తిస్మం తీసుకున్నారు.

మ్యూన్‌స్టర్‌ ఎనబాప్టిస్టులు బలమైన మత, రాజకీయ శక్తిగా తయారైన మొదటి నగరంగా మారడంతో ఇతర సమాజాల వారు భయబడ్డారు. డి టాయ్‌ఫెట్సు మ్యూన్‌స్టర్‌ అనే పుస్తకం ప్రకారం ఈ చర్య “జర్మన్‌ దేశ యావత్‌ పరిశుద్ధ రోమా సామ్రాజ్యపు శత్రుత్వం మ్యూన్‌స్టర్‌పై విరుచుకుపడేలా చేసింది.” స్థానిక ప్రముఖుడైన ప్రిన్స్‌బిషప్‌ కౌంట్‌ ఫ్రాంజ్‌ వోన్‌ వాల్‌డెక్‌ మ్యూన్‌స్టర్‌ను ముట్టడించేందుకు సైన్యాన్ని సమకూర్చాడు. ఆ సైన్యంలో అటు లూథరన్లు ఇటు క్యాథలిక్కులు కూడా ఉన్నారు. అంతకుముందు సంస్కరణోద్యమంలో ప్రత్యర్ధి వర్గాలుగావుండి, త్వరలో ఆరంభమయ్యే ముప్పై సంవత్సరాల యుద్ధంలో పరస్పరం పీకలు పట్టుకునే ఈ రెండు మతాలవారు కలిసి ఎనబాప్టిస్టులపై యుద్ధానికి సమాయత్తమయ్యారు.

ఎనబాప్టిస్టుల రాజ్యం నాశనం కావడం

నగర ప్రాకారాల మధ్య సురక్షితంగావున్న వారిపై ముట్టడివేసిన సైన్యాలు పెద్దగా ప్రభావం చూపలేదు. క్రీస్తు రెండవ రాకడ సంభవిస్తుందని ఎదురుచూసిన 1534వ సంవత్సరం, ఏప్రిల్‌లో దైవిక రక్షణ కలుగుతుందని ఆశిస్తూ, మాటిస్‌ తెల్లని గుర్రంమీద స్వారీచేస్తూ నగరం బయటకు వెళ్లాడు. ముట్టడివేసిన సైనిక దళాలు మాటిస్‌ను ముక్కలుగా నరికి అతని తలను కొయ్యకు వ్రేలాడదీసిన దృశ్యాన్ని నగర ప్రాకారంపై నిలబడి చూసిన మాటిస్‌ మద్దతుదారులు ఎంత భయపడి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి.

లైడన్‌కు చెందిన జాన్‌, మాటిస్‌కు వారసుడు కాగా అతనికి మ్యూన్‌స్టర్‌ ఎనబాప్టిస్టుల రాజైన జేన్‌ అని పేరుపెట్టబడింది. నగరంలో పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ఉండడంతో, తమకు ఎంతమంది నచ్చితే అంతమంది స్త్రీలను భార్యలుగా స్వీకరించడానికి పురుషులను ప్రోత్సహిస్తూ అతను ఈ స్త్రీపురుష ఎక్కువ తక్కువల పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించాడు. మ్యూన్‌స్టర్‌లో ఎనబాప్టిస్టుల రాజ్యమందున్న విపరీత పరిస్థితులకు ఉదాహరణగా చెప్పాలంటే వ్యభిచారం, జారత్వం మరణశిక్షకు తగిన ఘోరకృత్యాలుగా పరిగణించబడ్డాయి, అయితే అక్కడ బహుభార్యత్వం అనుమతించబడింది, ప్రోత్సహించబడింది కూడా. రాజైన జేన్‌ స్వయంగా 16 మందిని భార్యలుగా చేసుకున్నాడు. వారిలో ఒకరైన ఎలీసబెట్‌ వాండ్‌షెరెర్‌ ఆ నగరం విడిచి వెళ్లడానికి అతని అనుమతి కోరినప్పుడు, ఆమెకు బహిరంగంగా శిరచ్ఛేదన చేయబడింది.

ఆ ముట్టడి 14 నెలలు కొనసాగి చివరకు 1535 జూన్‌లో ఆ నగరం పట్టుబడింది. మ్యూన్‌స్టర్‌ ఘోర నాశనం చవిచూసింది, రెండవ ప్రపంచ యుద్ధంవరకు దానికి మళ్లీ అలాంటి నాశనం సంభవించలేదు. రోట్‌మ్యాన్‌ తప్పించుకున్నాడు గానీ రాజైన జేన్‌తోపాటు మరో ఇద్దరు ఎనబాప్టిస్టుల ప్రముఖులు పట్టుబడి, తీవ్రంగా హింసించబడి, హతమార్చబడ్డారు. వారి శవాలనే మూడు బోన్లలోపెట్టి సెయింట్‌ లాంబర్ట్‌ చర్చి గోపురంపై వ్రేలాడదీశారు. అది “భవిష్యత్తులో ఇబ్బందిపెట్టగల వారందరికీ ఒక భయానక హెచ్చరికగా ఉండడానికే” అని సీఫర్ట్‌ వివరిస్తున్నాడు. అవును, రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తీవ్ర పరిణామాలు తీసుకొచ్చింది.

ఎనబాప్టిస్టుల ఇతర సమాజాలకు ఏమి సంభవించింది? యూరప్‌ అంతటా అనేక సంవత్సరాలపాటు హింస కొనసాగింది. కొద్దిమందిలో సంఘర్షణా స్వభావం ఉన్నప్పటికీ, ఎనబాప్టిస్టుల్లో చాలామంది సమాధానకరమైన తమ సూత్రాలకు కట్టుబడ్డారు. ఆ తర్వాత, మాజీ ప్రీస్టు మెన్నో సైమన్స్‌ ఎనబాప్టిస్టులకు సారథ్యం వహించడంతో, ఆ గుంపు క్రమేణా మెన్నోనైట్స్‌ అనే పేరుతో, మరితర పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఆ మూడు బోన్లు

ఎనబాప్టిస్టులు ప్రాథమికంగా బైబిలు సూత్రాలకు కట్టుబడడానికి ప్రయత్నించిన మతాసక్తిగల ప్రజలు. కానీ మ్యూన్‌స్టర్‌లోని అతివాదులు ఎనబాప్టిస్టులు ఆ మార్గం విడిచిపెట్టి రాజకీయాల్లో పాల్గొనేటట్లు చేశారు. ఎప్పుడైతే అలా జరిగిందో, ఆ ఉద్యమం ఒక విప్లవ శక్తిగా అవతరించింది. ఇది ఎనబాప్టిస్టుల ఉద్యమానికి, మధ్యయుగాల మ్యూన్‌స్టర్‌ నగరానికి తీవ్రమైన ముప్పు తీసుకొచ్చింది.

దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగిన ఈ భయానక సంఘటనలు ఆ నగర కేంద్రం సందర్శించే వారికి ఇంకా గుర్తుచేయబడుతున్నాయి. ఏ విధంగా? చర్చి గోపురానికి వ్రేలాడుతున్న ఆ మూడు బోన్ల ద్వారానే.

[అధస్సూచి]

^ పేరా 9 ఈ ఆర్టికల్‌ పిల్లల బాప్తిస్మం విషయంలో అనుకూల, ప్రతికూల వాదాల సూక్ష్మపరిశీలన చేయడం లేదు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1986 సంచికలోని “పసిపిల్లలకు బాప్తిస్మమివ్వాలా?” అనే ఆర్టికల్‌ చూడండి.

[13వ పేజీలోని చిత్రాలు]

జేన్‌ రాజు హింసించబడి, హతమార్చబడి సెయింట్‌ లాంబర్ట్‌ చర్చి గోపురానికి వ్రేలాడదీయబడ్డాడు