కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవముగల దేవునిచేత నడిపించబడండి

జీవముగల దేవునిచేత నడిపించబడండి

జీవముగల దేవునిచేత నడిపించబడండి

“ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరు[గుడి].”​—⁠అపొస్తలుల కార్యములు 14:​15.

అపొస్తలుడైన పౌలు బర్నబాలు ఒక మనిషిని స్వస్థపరచిన తర్వాత, లుస్త్రలో గుమికూడిన ప్రజలకు పౌలు ఇలా హామీ ఇచ్చాడు: “మేముకూడ మీ స్వభావమువంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.”​—⁠అపొస్తలుల కార్యములు 14:15.

2 యెహోవా నిర్జీవమైన విగ్రహం కాదుగానీ “జీవముగల దేవుడు” అనే మాట ఎంత నిజం! (యిర్మీయా 10:10; 1 థెస్సలొనీకయులు 1:​9, 10) యెహోవా జీవముగలవాడే కాదు, ఆయన జీవానికి ఊటగా కూడా ఉన్నాడు. “ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.” (అపొస్తలుల కార్యములు 17:​25) మనం ఇప్పుడూ, భవిష్యత్తులోనూ జీవితం అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పౌలు ఇంకా ఇలా అన్నాడు: “[దేవుడు] ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదు.”​—⁠అపొస్తలుల కార్యములు 14:17.

3 మన జీవం విషయంలో దేవునికున్న ఆసక్తి, ఆయన మార్గనిర్దేశంలో నమ్మకముంచే కారణాన్ని మనకిస్తోంది. (కీర్తన 147:8; మత్తయి 5:​45) కొందరు తమకు అర్థంకాని లేదా హద్దులు పెడుతున్నట్లు అనిపించే బైబిలు ఆజ్ఞను చూసినప్పుడు వారు మరోలా ప్రతిస్పందించవచ్చు. అయితే, యెహోవా నిర్దేశాన్ని నమ్మడం జ్ఞానయుక్తమని నిరూపించబడింది. ఉదాహరణకు, కళేబరం ముట్టుకోవడాన్ని ధర్మశాస్త్రం ఎందుకు ఖండిస్తుందో ఒక ఇశ్రాయేలీయునికి అర్థం కాకపోయినా, ఆ ఆజ్ఞకు విధేయత చూపించడం ద్వారా అతను ప్రయోజనం పొందాడు. మొదటిగా, అతని విధేయత అతణ్ణి జీవముగల దేవునికి సన్నిహితుణ్ణి చేస్తుంది, రెండవదిగా, అది రోగాలు సోకకుండా అతనికి సహాయం చేస్తుంది.​—⁠లేవీయకాండము 5:2; 11:24.

4 రక్తం గురించిన దేవుని నిర్దేశం విషయంలో కూడా అంతే. మానవులు రక్తం తినకూడదని ఆయన నోవహుతో చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ధర్మశాస్త్రంలో, రక్తాన్ని కేవలం బలిపీఠంవద్ద వాడడానికి అంటే పాప క్షమాపణ కోసం మాత్రమే వాడాలని వెల్లడిచేశాడు. ఆ నిర్దేశాలతో దేవుడు రక్తాన్ని ఉత్కృష్ఠ భావంలో వినియోగించడానికి అంటే యేసు విమోచన క్రయధనం ద్వారా ప్రాణాలు రక్షించడానికి పునాది వేస్తున్నాడు. (హెబ్రీయులు 9:​14) అవును, మన జీవాన్ని, సంక్షేమాన్ని మనస్సులో ఉంచుకునే దేవుడు ఆ నిర్దేశాన్నిచ్చాడు. ఆదికాండము 9:​4ని చర్చిస్తూ 19వ శతాబ్దపు బైబిలు విద్వాంసుడైన ఆడమ్‌ క్లార్క్‌ ఇలా వ్రాశాడు: “[నోవహుకు ఇచ్చిన] ఈ ఆజ్ఞకు ప్రాచ్యదేశ క్రైస్తవులు ఇప్పటికీ జాగ్రత్తగా లోబడుతున్నారు . . . రక్తం తినడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది, ఎందుకంటే లోక పాపాల కోసం రక్తం చిందించబడాలని అది సూచించింది; సువార్తల నియమం ప్రకారం దానిని తినకూడదు, ఎందుకంటే అది పాప విమోచన కోసం చిందించబడిన రక్తానికి ప్రతీకగా ఉందని అన్ని సందర్భాల్లో దానిని పరిగణించాలి.”

5 ఈ విద్వాంసుడు బహుశా, యేసుపై కేంద్రీకరించబడిన ప్రాథమిక సువార్తను సూచిస్తుండవచ్చు. దానిలో మనకోసం చనిపోవడానికి, మనం నిత్యజీవం పొందేలా తన రక్తాన్ని చిందించడానికి, దేవుడు తన కుమారుణ్ణి పంపించడం ఇమిడివుంది. (మత్తయి 20:28; యోహాను 3:16; రోమీయులు 5:​8, 9) ఆ వ్యాఖ్యానంలో, క్రీస్తు అనుచరులు రక్తాన్ని విసర్జించాలని ఆ తర్వాత ఇవ్వబడిన ఆజ్ఞ కూడా ఉంది.

6 ఇశ్రాయేలీయులకు దేవుడు వందలాది నియమాలిచ్చాడని మీకు తెలుసు. యేసు మరణించిన తర్వాత, ఆ నియమాలన్నీ పాటించాల్సిన బాధ్యత ఆయన శిష్యులకు లేదు. (రోమీయులు 7:4, 6; కొలొస్సయులు 2:13, 17; హెబ్రీయులు 8:​6, 13) కానీ ఆ తర్వాత ఒక ప్రాథమిక బాధ్యత విషయంలో అంటే మగవారి సున్నతి విషయంలో ఒక ప్రశ్న తలెత్తింది. క్రీస్తు రక్తం నుండి ప్రయోజనం పొందాలని కోరుకున్న యూదులుకాని వారు, తామింకా ధర్మశాస్త్రం క్రిందే ఉన్నామనే అర్థంతో సున్నతిపొందాలా? సా.శ. 49లో క్రైస్తవ పరిపాలక సభ ఆ వివాదాంశాన్ని పరిశీలించింది. (అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం) దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో అపొస్తలులు, పెద్దలు ధర్మశాస్త్రంతోపాటు సున్నతి బాధ్యత కూడా రద్దయిందనే నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ, దేవుని నియమాల్లో కొన్ని క్రైస్తవులకు ఇంకా వర్తిస్తాయి. సంఘాలకు వ్రాసిన ఉత్తరంలో ఆ పరిపాలక సభ ఇలా వ్రాసింది: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు.”​—⁠అపొస్తలుల కార్యములు 15:​28, 29.

7 అలా ‘రక్తాన్ని విసర్జించడాన్ని’ పరిపాలక సభ లైంగిక దుర్నీతిని లేదా విగ్రహారాధనను విసర్జించవలసినంత ప్రాముఖ్యమైన నైతిక ఆవశ్యకతగా దృష్టించింది. ఇది రక్తానికి సంబంధించిన నిషేధం గంభీరమైనదని నిరూపిస్తోంది. పశ్చాత్తాపం లేకుండా విగ్రహారాధన చేసే లేదా లైంగిక దుర్నీతిని జరిగించే క్రైస్తవుడు ‘దేవుని రాజ్యమునకు వారసుడు’ కానేరడు; ‘అతడు రెండవ మరణంలో పాలుపొందుతాడు.’ (1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:8; 22:​15) తేడాను గమనించండి: ప్రాణరక్తం యొక్క పవిత్రతకు సంబంధించిన దేవుని నియమాన్ని అలక్ష్యం చేయడంవల్ల శాశ్వత మరణం సంభవించగలదు. అయితే యేసు బలిపట్ల గౌరవం చూపించడం నిత్యజీవానికి నడిపించగలదు.

8 రక్తానికి సంబంధించిన దేవుని నిర్దేశాన్ని తొలి క్రైస్తవులు ఎలా అర్థం చేసుకున్నారు, దాన్ని ఎలా అనుసరించారు? క్లార్క్‌ వ్యాఖ్యానాన్ని గుర్తుతెచ్చుకోండి: “సువార్తల నియమం ప్రకారం దానిని తినకూడదు, ఎందుకంటే అది పాప విమోచన కోసం చిందించబడిన రక్తానికి ప్రతీకగా ఉందని అన్ని సందర్భాల్లో దానిని పరిగణించాలి.” ఆ విషయాన్ని తొలి క్రైస్తవులు గంభీరంగా పరిగణించారని చరిత్ర ధృవీకరిస్తోంది. టెర్టూలియన్‌ ఇలా వ్రాశాడు: “క్రీడా స్థలంలో జరిగే ప్రదర్శనప్పుడు రక్తదాహంగల వారు తమ మూర్ఛరోగ స్వస్థతకోసం దుష్టులైన అపరాధుల తాజా రక్తం సేకరించి తీసుకెళ్లేవారు.” రక్తం విషయంలో అన్యులకు భిన్నంగా క్రైస్తవులు “కనీసం జంతు రక్తాన్నైనా [తమ] సహజ ఆహారంలో చేర్చలేదు . . . క్రైస్తవుల న్యాయ విచారణల్లో మీరు వారికి రక్తం నిండిన సాసేజ్‌లు ఇవ్వజూశారు. అయితే [అది] వారికి ధర్మవిరుద్ధమనే విషయం మీకిప్పటికే తెలుసు” అని టెర్టూలియన్‌ అన్నాడు. అవును, ప్రాణ భయం ఉన్నప్పటికీ, క్రైస్తవులు రక్తం తినలేదు. దేవుని నిర్దేశం వారికి అంత ప్రాముఖ్యమైనదిగా ఉంది.

9 పరిపాలక సభ ఉద్దేశం కేవలం క్రైస్తవులు నేరుగా రక్తాన్ని తినకూడదు లేదా త్రాగకూడదనీ అలాగే రక్తం ఒలికించని మాంసం తినకూడదు లేదా రక్తం కలిపిన ఆహారం భుజించకూడదనీ మాత్రమేనని కొందరు అనుకోవచ్చు. నిజమే, నోవహుకు దేవుడిచ్చిన ఆజ్ఞలోని మొదటి భావం అదే. అయితే అపొస్తలుల ఆజ్ఞ కూడా ‘గొంతు పిసికి చంపినదానికి,’ అంటే రక్తంతోపాటు ఉన్న మాంసానికి దూరంగా ఉండమని క్రైస్తవులను ఆదేశించింది. (ఆదికాండము 9:3, 4; అపొస్తలుల కార్యములు 21:​25) కానీ ఆ ఆజ్ఞలో అంతకంటే ఎక్కువే ఇమిడివుందని తొలి క్రైస్తవులు గ్రహించారు. కొన్నిసార్లు వైద్యపరమైన కారణాలను బట్టి రక్తం తినేవారు. మూర్ఛరోగానికి చికిత్స కోసం అన్యులు కొందరు తాజా రక్తం సేవించేవారని టెర్టూలియన్‌ వ్రాశాడు. ఆ కాలంలో వ్యాధి చికిత్సకు లేదా బహుశా ఆరోగ్యాభివృద్ధికి ఇతర విధాలుగా కూడా రక్తం ఉపయోగించబడి ఉండవచ్చు. అందువల్ల, క్రైస్తవులు రక్తాన్ని విసర్జించడంలో వారు “వైద్య” కారణాలనుబట్టి కూడా రక్తాన్ని తీసుకోకుండా ఉండడం ఇమిడివుంది. తమను అది ప్రాణాపాయ పరిస్థితికి గురిచేసినప్పటికీ వారు ఈ దృఢవైఖరిని కాపాడుకున్నారు.

రక్తాన్ని మందుగా ఉపయోగించడం

10 రక్తాన్ని మందుగా ఉపయోగించడం ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. తొలుత రక్తమార్పిళ్లు రక్తాన్ని యథాతథంగా అంటే దాత నుండి సేకరించిన రక్తాన్ని నిలువచేసి, ఒక రోగికి, బహుశా యుద్ధ క్షతగాత్రునికి ఎక్కించేవారు. ఆ తర్వాత, రక్తాన్ని ప్రధాన భాగాలుగా విడగొట్టడాన్ని పరిశోధకులు నేర్చుకున్నారు. ఈ ప్రధాన భాగాల మార్పిడి ద్వారా వైద్యులు, దానంగా సేకరించిన రక్తాన్ని ఎక్కువమంది రోగులకు, అంటే బహుశా గాయపడ్డ మనిషికి ప్లాస్మాను, వేరొక మనిషికి ఎర్ర రక్త కణాలను ఇవ్వడం సాధ్యమవుతుంది. కొనసాగిన పరిశోధనలు మరియెక్కువ మంది రోగులకు ఇవ్వడానికి వీలయ్యేలా, రక్తంలోని ప్లాస్మావంటి ఒక ప్రధాన భాగం నుండి వివిధ సూక్ష్మభాగాలు సేకరించవచ్చని చూపించాయి. ఈ ప్రక్రియ దిశగా చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి, ఈ సూక్ష్మభాగాల కొత్త ఉపయోగాలు నివేదించబడుతున్నాయి. వీటి విషయంలో ఒక క్రైస్తవుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? రక్తమార్పిడిని ఎప్పటికీ అంగీకరించకూడదని ఆ క్రైస్తవుడు స్థిరంగా నిర్ణయించుకున్నాడని అనుకుందాం, కానీ ఆయనకు చికిత్సచేస్తున్న వైద్యుడు రక్తంలోని ఒక ప్రధాన భాగాన్ని, బహుశా సాంద్రీకృత ఎర్ర రక్త కణాలను ఎక్కించుకోవడానికి అంగీకరించమని బలవంతం చేయవచ్చు. లేదా ఆ వైద్యంలో రక్తంలోని ప్రధాన భాగం నుండి సేకరించిన సూక్ష్మభాగం కొద్దిగా ఇవ్వడం ఇమిడివుండవచ్చు. రక్తం పవిత్రమని, గొప్ప భావంలో క్రీస్తు రక్తం జీవరక్షకమనే విషయాలు మదిలో ఉంచుకొని, ఆ దేవుని సేవకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?

11 దశాబ్దాల పూర్వమే యెహోవాసాక్షులు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఉదాహరణకు, వారు ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు ఒక ఆర్టికల్‌ అందించారు (నవంబరు 27, 1981; ఇది, రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? బ్రోషుర్‌లో 27-9 పేజీల్లో పునఃముద్రించబడింది). * ఆ ఆర్టికల్‌ విషయాలను ఆదికాండము, లేవీయకాండము, అపొస్తలుల కార్యములు నుండి ఉదహరించింది. అదిలా చెప్పింది: “ఈ వచనములు వైద్యపర పదజాలములో చెప్పబడనప్పటికీ, పూర్తి రక్తము, ఆర్‌బిసి సముదాయము [ఎర్ర రక్త కణములు], ప్లాస్మా, డబ్ల్యుబిసి [తెల్ల రక్త కణములు], ప్లేట్‌లెట్ల మార్పిడినందు వాడుటను, అవి త్రోసిపుచ్చుచున్నవని సాక్షులు తలంచుదురు.” 2001వ సంవత్సరపు పాఠ్యపుస్తకం ఎమర్జెన్సీ కేర్‌ “కాంపోజిషన్‌ ఆఫ్‌ బ్లడ్‌” అనే ఉపశీర్షిక క్రింద ఇలా చెప్పింది: “రక్తం ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు వంటి వివిధ పదార్థాలతో తయారైంది.” అందువల్ల, వైద్య వాస్తవాలకు అనుగుణంగా సాక్షులు, యథాతథంగా రక్తాన్ని ఎక్కించుకోవడానికి లేదా దానిలోని నాలుగు ప్రధాన భాగాల్లో దేన్నైనా ఎక్కించుకోవడానికి నిరాకరిస్తారు.

12 వైద్య సంబంధమైన ఆ ఆర్టికల్‌ ఇంకా ఇలా చెప్పింది: “ఆల్బుమిన్‌, ఇమ్యూనోగ్లోబులిన్‌, హిమోఫిలియాక్‌ పదార్థములను వాడుటను సాక్షుల మత అవగాహన పూర్తిగా నిషేధించుటలేదు; ప్రతి సాక్షి వీటిని అంగీకరించగలడో లేదో వ్యక్తిగతంగా నిర్ణయించుకొనవలెను.” 1981 నుండి వాడడానికి అనువుగా అనేక సూక్ష్మభాగాలు (ఆ నాలుగు ప్రధాన భాగాల్లో ఒక దాని నుండి విడగొట్టి సేకరించిన చిన్న భాగాలు) వేరుచేయబడ్డాయి. తదనుగుణంగా కావలికోట జూన్‌ 15, 2000 సంచికలో “పాఠకుల ప్రశ్నలు” అనే ఆర్టికల్‌లో ఈ అంశంపై సహాయకరమైన సమాచారం అందించబడింది. లక్షల సంఖ్యలోవున్న ప్రస్తుత పాఠకుల ప్రయోజనార్థమై, ఆ సమాచార సారాంశం ఈ పత్రికలో 29-31 పేజీల్లో మళ్లీ ఇవ్వబడింది. అది వివరాలను, తర్కసహితమైన వాదనలను అందిస్తుంది, అయినప్పటికీ అది చెప్పేది 1981లో అందించబడిన మౌలిక అంశాలతో ఏకీభవించడం మీరు చూస్తారు.

మీ మనస్సాక్షి పాత్ర

13 అలాంటి సమాచారం మనస్సాక్షిని రంగంలోకి దించుతుంది. ఎందుకు? దేవుని నిర్దేశాన్ని అనుసరించాలని క్రైస్తవులు ఒప్పుకుంటారు, అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవాలి అలాంటి సందర్భాల్లో మనస్సాక్షి ప్రస్తావన వస్తుంది. ఆయా విషయాల విలువను, తరచూ నైతిక విషయాల విలువను లెక్కలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే స్వాభావిక సామర్థ్యమే మనస్సాక్షి. (రోమీయులు 2:​14, 15) అయితే మనస్సాక్షి నిర్ణయాలు విభిన్నంగా ఉంటాయని మీకు తెలుసు. * కొందరి మనస్సాక్షి బలంగా ఉంటుందని సూచిస్తూ బైబిలు, ‘బలహీనమైన మనస్సాక్షిగలవారి’ గురించి ప్రస్తావిస్తోంది. (1 కొరింథీయులు 8:​12) దేవుని చిత్తమేమిటో నేర్చుకోవడంలో ఆయన తలంపును అర్థంచేసుకొని దానిని తమ నిర్ణయాలకు అన్వయించుకోవడంలో తాము సాధించిన ప్రగతి విషయంలో క్రైస్తవులు విభిన్నంగా ఉంటారు. యూదులు మరియు మాంసం తినే విషయంతో మనం దీనిని ఉదహరించవచ్చు.

14 దేవునిపట్ల విధేయత చూపే వ్యక్తి రక్తం ఒలికించని మాంసం తినడని బైబిలు స్పష్టంగా చెబుతోంది. అదెంత ప్రాముఖ్యమంటే అత్యవసర సమయంలో సైతం ఇశ్రాయేలు సైనికులు రక్తం ఒలికించని మాంసం తినడం వారిని ఘోరమైన తప్పిదస్థులుగా లేదా పాపులుగా చేసింది. (ద్వితీయోపదేశకాండము 12:15, 16; 1 సమూయేలు 14:​31-35) అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. ఒక ఇశ్రాయేలీయుడు గొర్రెను చంపినప్పుడు, అతడెంత త్వరగా దాని రక్తం ఒలికించాలి? దాని రక్తం ఒలికించడానికి దాని మెడ కోయాలా? అందుకోసం ఆ గొర్రెను వెనుక కాళ్లపై వ్రేలాడదీయడం అవసరమా? అలా ఎంతసేపటి వరకు? అదే ఒక పెద్ద ఆవయితే అతడేమి చేయాలి? ఒలికించిన తర్వాత కూడా కొంత రక్తం మాంసంలోనే ఉండిపోతుంది. అలాంటి మాంసం అతడు తినవచ్చా? ఎవరు నిర్ణయిస్తారు?

15 ఆసక్తిగల ఒక యూదునికి అలాంటి ప్రశ్నలు ఎదురవడాన్ని ఊహించండి. అతడు బజారులో అమ్మే మాంసాన్ని అసలు కొనకుండా ఉండడమే మేలని తలంచవచ్చు, మరొకరు బజారులో అమ్మే మాంసం విగ్రహాలకు అర్పించే అవకాశం ఉండవచ్చన్న దృష్టితో దానిని తినకుండా మానేయవచ్చు. మరికొందరు యూదులు రక్తాన్ని ఒలికించే ప్రక్రియలు పూర్తయిన తర్వాతే మాంసాన్ని భుజించి ఉండవచ్చు. * (మత్తయి 23:​23, 24) అలాంటి విభిన్న ప్రతిస్పందనల గురించి మీరేమనుకుంటారు? అంతేకాకుండా, దేవుడు అలాంటి ప్రతిస్పందనలు కోరలేదు కాబట్టి, ప్రతీ దానికి సంబంధించి ఒక నిర్ణయం రాబట్టడం కోసం రబ్బీల సమాలోచక సభకు యూదులు విస్తారంగా ప్రశ్నలు పంపించడం సముచితమంటారా? యూదామతంలో అలాంటి వాడుక వృద్ధి అయినప్పటికీ, రక్తం విషయంలో సత్యారాధకులు ఆ విధంగా నిర్ణయాలు అన్వేషిస్తూ వెళ్లాలని యెహోవా నిర్దేశించనందుకు మనం సంతోషించవచ్చు. పరిశుభ్రమైన జంతువులను వధించి, వాటి రక్తం ఒలికించే విషయంలో దేవుడు ప్రాథమిక నిర్దేశమిచ్చాడే తప్ప అదనంగా ఆయన మరే వివరాలు ఇవ్వలేదు.​—యోహాను 8:32.

16పైన 11, 12 పేరాల్లో పేర్కొన్నట్లుగా యెహోవాసాక్షులు రక్తాన్ని యథాతథంగా ఎక్కించుకోరు లేదా దాని నాలుగు ప్రధాన భాగాలైన ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ల వంటివాటిని ఎక్కించుకోవడానికి కూడా అంగీకరించరు. అయితే ప్రధాన భాగం నుండి సేకరించిన సూక్ష్మభాగాలు, వ్యాధి నిరోధకంలా పోరాడే లేదా పాము విషానికి విరుగుడుగా పనిచేసే ప్రతిరక్షకాలున్న సెరమ్‌ల వంటివాటి విషయమేమిటి? (30వ పేజీ, 4వ పేరా చూడండి.) అలాంటి సూక్ష్మభాగాలు నిజానికి రక్తం కానేకాదని, అందువల్ల అవి ‘రక్తాన్ని విసర్జించండి’ అనే ఆజ్ఞ క్రిందికి రావనే నిర్ణయానికి కొందరు వచ్చారు. (అపొస్తలుల కార్యములు 15:28; 21:​25; 31వ పేజీ, 1వ పేరా) అది వారి వ్యక్తిగత నిర్ణయం. మరోవైపున, ఒకేఒక ప్రధాన భాగం నుండి సేకరించిన కొద్దిపాటి సూక్ష్మభాగమైనా సరే, (మానవుని లేదా జంతువు) రక్తం నుండి సేకరించిన ప్రతీదీ నిరాకరించడానికి మరికొందరి మనస్సాక్షి వాళ్లను పురికొల్పుతుంది. * ఇంకా కొందరు వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే లేదా పాము విషానికి విరుగుడుగా పనిచేసే ప్లాస్మా మాంసకృత్తి ఇంజక్షన్లు అంగీకరించినా వారు ఇతర సూక్ష్మభాగాలను నిరాకరించవచ్చు. అంతేకాకుండా, ఆ నాలుగు ప్రధాన భాగాల్లో ఒకదాని నుండి సేకరించిన కొన్ని పదార్థాలు రక్తంలోని యథాతథ ప్రధాన భాగంలా పనిచేస్తూ శరీర జీవపోషక పనిలో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తాయంటే, వాటిని తీసుకోవడం చాలామంది క్రైస్తవులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు.

17మనం అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనస్సాక్షి గురించి బైబిలు చెబుతున్నది పరిగణలోకి తీసుకోవడం సహాయకరంగా ఉంటుంది. దానికి మొదటగా, దేవుని వాక్యం చెబుతున్నదేమిటో నేర్చుకొని దాని ప్రకారం మీ మనస్సాక్షిని మలుచుకోవడానికి కృషిచేయాలి. మీ కోసం నిర్ణయాలు తీసుకోమని వేరొకరిని అడిగే బదులు దేవుని నిర్దేశానికి అనుగుణంగా మీరే సొంతగా నిర్ణయం తీసుకోవడానికి అది మిమ్మల్ని సంసిద్ధులను చేస్తుంది. (కీర్తన 25:​4, 5) రక్తంలోని సూక్ష్మభాగాలను అంగీకరించే విషయంలో, ‘ఇది మనస్సాక్షికి సంబంధించిన విషయం, అందువల్ల అదంత ప్రాముఖ్యం కాదు’ అని కొందరు తలంచారు. ఇది సరైన వాదం కాదు. అది మనస్సాక్షికి సంబంధించిన నిర్ణయం అంటే దానర్థం అది అల్పమైన విషయమని కాదు. అది ఎంతో గంభీరమైనదై ఉండవచ్చు. ఎలాగంటే మన మనస్సాక్షికి భిన్నమైన మనస్సాక్షిగల ఆయావ్యక్తులపై అది ప్రభావం చూపగలదు. దీనిని మనం మొదటిగా విగ్రహానికి బహుశా అర్పించబడి ఆ తర్వాత బజారులో అమ్మకానికి పెట్టిన మాంసం విషయంలో పౌలు ఇచ్చిన సలహాలో చూడవచ్చు. ‘బలహీనమైన మనస్సాక్షిని నొప్పించ’ కూడదని ఒక క్రైస్తవుడు ఆలోచించాలి. ఆయన ఒకవేళ ఇతరులను అభ్యంతరపరిచే వ్యక్తిగా ఉంటే, ‘ఎవరికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ సహోదరుణ్ణి నాశనంచేసి’ క్రీస్తుకు విరోధంగా పాపం చేసినవాడు కాగలడు. కాబట్టి, రక్తంలోని సూక్ష్మభాగాల చిన్నమోతాదుల విషయంలో తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగతమైనవైనప్పటికీ, ఆ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.​—⁠1 కొరింథీయులు 8:8, 11-13; 10:25-31.

18రక్తం విషయంలో తీసుకునే నిర్ణయాల గంభీరతను మరో సంబంధిత అంశం నొక్కిచెబుతోంది. అదేమిటంటే, అలాంటి నిర్ణయాలు వ్యక్తిగతంగా మీమీద చూపగల ప్రభావం. చిన్న మోతాదులో రక్తంలోని సూక్ష్మభాగాన్ని తీసుకోవడం మీ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఇబ్బందిపెడితే, మీరు దానిని నిర్లక్ష్యం చేయకూడదు. లేదా “ఇది తీసుకుంటే ఫరవాలేదు; చాలామంది తీసుకున్నారు” అని ఎవరో చెప్పినందుకు మీరు మీ మనస్సాక్షిని అణచివేయకూడదు. నేడు లక్షలాదిమంది తమ మనస్సాక్షిని పట్టించుకోరు, అందువల్ల అది మొద్దుబారిపోతోంది, తత్ఫలితంగా వారు ఎలాంటి పరితాపం లేకుండా అబద్ధాలు చెబుతారు, ఇతర తప్పులు చేస్తారు. క్రైస్తవులు నిశ్చయంగా అలాంటి వైఖరిని విసర్జించాలని కోరుకుంటారు.​—⁠2 సమూయేలు 24:10; 1 తిమోతి 4:1, 2.

19ఈ పత్రికలోని 29-31 పేజీల్లో పునఃముద్రించబడిన సమాచారపు సారాంశం చివర్లో ఇలా చెబుతోంది: “అభిప్రాయాలు, మనస్సాక్షినిబట్టి తీసుకునే నిర్ణయాలు విభిన్నంగా ఉండవచ్చంటే వివాదాంశం పర్యవసానరహితమని దానర్థమా? ఎంతమాత్రం కాదు. అది గంభీరమైన విషయమే.” అది ప్రత్యేకంగా చాలా గంభీరమైన విషయం, ఎందుకంటే ఇందులో ‘జీవముగల దేవునితో’ మీ సంబంధం ఇమిడివుంది. ఆ సంబంధం మాత్రమే, మిమ్మల్ని యేసు చిందించిన రక్తంయొక్క రక్షణశక్తి ఆధారంగా నిత్యజీవానికి నడిపించగలదు. రక్తం విషయంలో ప్రగాఢ గౌరవం పెంపొందించుకోండి, ఎందుకంటే దాని మూలంగా దేవుడు ప్రాణాలను రక్షిస్తున్నాడు. పౌలు యుక్తంగా ఇలా వ్రాశాడు: ‘నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుంటిరి, అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.’​—⁠ఎఫెసీయులు 2:12, 13.

[అధస్సూచీలు]

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 17 ఒక సందర్భంలో పౌలు, వేరే నలుగురు క్రైస్తవులు ఆచారబద్ధంగా తమను శుద్ధి చేసుకోవడానికి దేవాలయానికి వెళ్లారు. ధర్మశాస్త్రం అప్పటికే తీసివేయబడింది, అయినప్పటికీ పౌలు యెరూషలేములోని పెద్దల సలహా ప్రకారం ఆ చర్య చేపట్టాడు. (అపొస్తలుల కార్యములు 21:​23-25) కానీ కొందరు క్రైస్తవులు తాము దేవాలయానికి వెళ్ళమని, అలాంటిదేమీ చేయమని భావించి ఉండవచ్చు. మనస్సాక్షి నిర్ణయాలు అప్పట్లో విభిన్నంగా ఉన్నాయి, నేడు కూడా అంతే.

^ పేరా 19 ఎన్‌సైక్లోపీడియా జుడైకా “యూదుల శాసనానుగుణంగా అమ్మే” మాంసం విషయంలోవున్న “సంశ్లిష్టమైన, సంగ్రహమైన” నియమాలను వివరిస్తోంది. వాటిలో మాంసాన్ని ఎన్ని నిమిషాలు నీళ్లలో ఉంచాలి, కొయ్యపలకపై దానిలో నుండి రక్తాన్ని ఎలా తొలగించాలి, దానికి ఎలాంటి ఉప్పు రుద్దాలి, ఆ తర్వాత ఎన్నిసార్లు దానిని చల్లని నీళ్లలో కడగాలి వంటివి ఉన్నాయి.

^ పేరా 20 కొన్ని ఇంజక్షన్లలో చాలావరకు రక్తం నుండి సేకరించబడని సింథటిక్‌ ద్రావణమే ముఖ్యమైన, చురుకుగా పనిచేసే పదార్థంగా ఉంటోంది. అయితే కొన్ని సందర్భాల్లో రక్తం నుండి సేకరించిన ఆల్బుమిన్‌వంటి సూక్ష్మభాగం కొద్ది మోతాదులో చేర్చబడవచ్చు.​—⁠కావలికోట అక్టోబరు 1, 1994 “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

మీరు జ్ఞాపకం తెచ్చుకోగలరా?

రక్తం గురించి నోవహుకు, ఇశ్రాయేలీయులకు, క్రైస్తవులకు దేవుడెలాంటి నిర్దేశమిచ్చాడు?

రక్తం విషయంలో యెహోవాసాక్షులు వేటిని ఖచ్చితంగా నిరాకరిస్తారు?

రక్తంలోని ప్రధాన భాగాల నుండి సేకరించిన సూక్ష్మభాగాలు స్వీకరించడం ఏ భావంలో ఒక వ్యక్తి మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుంది, అయితే దానర్థమేది కాదు?

నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవునితో మన సంబంధాన్ని మనమెందుకు అత్యున్నతంగా మనస్సులో ఉంచుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవాను “జీవముగల దేవుడు” అని గుర్తించడం ఎందుకు సముచితం?

3. దేవుడిచ్చే నిర్దేశాన్ని మనమెందుకు నమ్మవచ్చు?

4, 5. (ఎ) క్రైస్తవ కాలాలకు ముందు, రక్తానికి సంబంధించి యెహోవా ఎలాంటి నిర్దేశమిచ్చాడు? (బి) రక్తానికి సంబంధించిన దేవుని నిర్దేశం క్రైస్తవులకు కూడా వర్తిస్తుందని మనకెలా తెలుసు?

6. రక్తం విషయంలో క్రైస్తవులకు ఎలాంటి నిర్దేశాలు ఇవ్వబడ్డాయి, ఎందుకు?

7. ‘రక్తాన్ని విసర్జించడం’ క్రైస్తవులకు ఎంత ప్రాముఖ్యం?

8. రక్తం విషయంలో దేవుని నిర్దేశాన్ని తొలి క్రైస్తవులు గంభీరంగా తీసుకున్నారని ఏది సూచిస్తోంది?

9. రక్తాన్ని విసర్జించడంలో నేరుగా రక్తాన్ని తినకుండా ఉండడమే కాకుండా ఇంకా ఏమి ఇమిడివుంది?

10. వైద్యపరంగా రక్తం ఉపయోగించబడుతున్న కొన్ని విధానాలేమిటి, ఇది ఎలాంటి ప్రశ్నను ఉత్పన్నం చేస్తోంది?

11. రక్తం విషయంలో వైద్యపరంగా ఎలాంటి ఖచ్చితమైన సమాచారానికి సాక్షులు దీర్ఘకాలంగా కట్టుబడ్డారు?

12. (ఎ) రక్తంలోని ప్రధాన భాగాల నుండి సేకరించిన సూక్ష్మభాగాలకు సంబంధించి ఎలాంటి వైఖరి అందించబడింది? (బి) దీనికి సంబంధించిన అదనపు సమాచారాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?

13, 14. (ఎ) మనస్సాక్షి అంటే ఏమిటి, రక్తం విషయంలో అదెలా ప్రస్తావనకు వస్తుంది? (బి) మాంసం తినే విషయంలో ఇశ్రాయేలీయులకు దేవుడెలాంటి నిర్దేశమిచ్చాడు, అయితే ఎలాంటి ప్రశ్నలు తలెత్తి ఉండవచ్చు?

15. మాంసం తినే విషయంలో కొందరు యూదులు ఎలా ప్రతిస్పందించారు, అయితే దేవుని నిర్దేశమేమిటి?

16. రక్తం నుండి సేకరించిన సూక్ష్మభాగం కొద్ది మోతాదులోవుండే ఇంజక్షన్‌ తీసుకోవడంలో క్రైస్తవులకు ఎందుకు భిన్న దృక్కోణాలు ఉండవచ్చు?

17. (ఎ) రక్తంలోని సూక్ష్మభాగాలకు సంబంధించిన ప్రశ్నలను మనం ఎదుర్కొంటున్నప్పుడు మన మనస్సాక్షి ఎలా సహాయం చేయగలదు? (బి) ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు చాలా గంభీరమైన విషయం?

18. రక్తం విషయంలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి తమ మనస్సాక్షి మొద్దుబారిపోకుండా ఒక క్రైస్తవుడు ఎలా తప్పించుకోగలడు?

19. రక్తం ఇమిడివున్న వైద్య వివాదాంశాల విషయంలో నిర్ణయాలు తీసుకొంటున్నప్పుడు దేనిని మనం అత్యున్నతంగా మనస్సులో ఉంచుకోవాలి?

[22వ పేజీలోని చార్టు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రక్తం విషయంలో ప్రధాన వైఖరి

యథాతథంగా రక్తం ఎక్కించుకోవడం

అంగీకృతంకానివి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్‌లెట్లు ప్లాస్మా

క్రైస్తవులు

నిర్ణయించుకోవలసినవి ఎర్ర రక్త తెల్ల రక్త ప్లేట్‌లెట్ల ప్లాస్మా

కణాల కణాల

సూక్ష్మభాగాలు సూక్ష్మభాగాలు సూక్ష్మభాగాలు సూక్ష్మభాగాలు

[20వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు ‘రక్తం విసర్జించాలని’ పరిపాలక సభ నిర్ణయించింది

[23వ పేజీలోని చిత్రం]

రక్తంలోని సూక్ష్మభాగానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ మనస్సాక్షిని నిర్లక్ష్యం చేయకండి