కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేడు పిల్లలకు శిక్షణ ఇవ్వడం అనే సవాలు

నేడు పిల్లలకు శిక్షణ ఇవ్వడం అనే సవాలు

నేడు పిల్లలకు శిక్షణ ఇవ్వడం అనే సవాలు

సాయంకాలం చాలా పొద్దుపోయిన తర్వాత ఆ హోటల్‌ యజమాని హోటల్‌ మూసేసి ఇంటికెళ్లే హడావుడిలో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఇద్దరు స్త్రీలు, ఒక పిల్లవాడు హోటల్‌కు వచ్చి తినడానికేదో ఆర్డరు చేశారు. అప్పటికే అలసిపోయిన ఆ యజమాని హోటల్‌ మూసేశానని వారికి చెబుదామనుకున్నా, సరేలే వారడిగింది ఇద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఆరగిస్తుండగా, ఆ పిల్లవాడు బిస్కట్లు కిందపడేస్తూ వాటిని తొక్కుకుంటూ హోటలంతా పరుగులు తీయడం ప్రారంభించాడు. ఆ పిల్లవాణ్ణి వారించడానికి బదులు, వాడి తల్లి ముసిముసి నవ్వులు నవ్వుతోంది. చివరికి వారు వెళ్లిపోయిన తర్వాత, అప్పటికే అలసిపోయిన ఆ యజమాని మళ్లీ అంతా శుభ్రంచేసి సర్దుకోవాల్సివచ్చింది.

బహుశా మీకు తెలిసినట్లుగానే, ఈ నిజ జీవన పరిస్థితి అనేక కుటుంబాల్లో, పిల్లలకిచ్చే శిక్షణ విజయవంతం కావడం లేదని ఉదహరిస్తోంది. దానికి కారణాలు వివిధ రకాలు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పెంచాలని అనుకుంటూ వాళ్ళను వారిష్టారాజ్యమన్నట్లు వదిలేస్తుంటారు. లేదా తల్లిదండ్రులు తమ జీవితాల్లో తీరికలేని కారణంగా, తమ పిల్లలపట్ల శ్రద్ధ వహించడానికి, అవసరమైన శిక్షణ ఇవ్వడానికి సమయం వెచ్చించలేకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల విద్యే అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా భావిస్తూ పిల్లవాడు పాఠశాలలో మంచి మార్కులు సంపాదించి, మంచిపేరున్న కాలేజీలో సీటు పొందితే చాలని భావిస్తూ వాడికి దాదాపు అపరిమితమైన స్వేచ్ఛనిస్తారు.

అయితే తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిని, సామాజిక విలువల్ని సవరించవలసిన అవసరముందని కొందరు చెబుతున్నారు. పిల్లలు ప్రతివిధమైన నేరానికి పాల్పడుతున్నారనీ, పాఠశాలలో దౌర్జన్యం రోజు రోజుకూ మితిమీరుతున్నదనీ వారు వాదిస్తున్నారు. అందువల్ల, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలోని సియోల్‌లో ఒక మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యక్తిత్వ శిక్షణకు ప్రాధాన్యతనివ్వాలని నొక్కిచెబుతూ ఇలా అన్నాడు: “జ్ఞానార్జనకు ముందే చక్కని ప్రవర్తన అలవడాలి.”

తమ పిల్లలు కాలేజీకి వెళ్లాలనీ, జీవితంలో పైకి రావాలనీ కోరుకునే చాలామంది తల్లిదండ్రులు హెచ్చరికల్ని పెడచెవినబెడతారు. మీరు తల్లి/తండ్రి అయినట్లయితే మీ పిల్లవాడు ఎలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటారు? అతను నైతికతగల, బాధ్యతగల వ్యక్తిగా ఎదగాలనుకోరా? అలాగే అతను ఇతరులపట్ల శ్రద్ధచూపే, పరిస్థితులకు తగ్గట్టు తననుతాను మలుచుకునే, అనుకూల స్వభావమున్న వ్యక్తిగా ఉండాలనీ ఇష్టపడరా? అలాగయితే, దయచేసి తర్వాతి ఆర్టికల్‌ను పరిశీలించండి.