కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో బైబిలు మీకు సహాయం చేయగలదా?

పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో బైబిలు మీకు సహాయం చేయగలదా?

పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో బైబిలు మీకు సహాయం చేయగలదా?

ఆర్కిడ్‌ ఆకర్షణీయమైన ఒక పూలమొక్క, కానీ దానిని పెంచడం మాత్రం కష్టం. దానిని విజయవంతంగా పెంచడానికి మీరు ఉష్ణోగ్రతను, వెలుతురును, పూలకుండీ సైజును నియంత్రించాల్సి ఉంటుంది. ఆర్కిడ్‌ మట్టి తీరుకు, ఎరువులకు త్వరగా ప్రభావితం చెందుతుంది. అంతేకాక చీడవల్ల, పురుగులవల్ల సులభంగా దెబ్బతింటుంది. అందుకే, ఆర్కిడ్‌ను పెంచడానికి చేసే మొదటి ప్రయత్నం సాధారణంగా విఫలమవుతుంది.

పిల్లల్ని పెంచడం అంతకంటే ఎంతో కష్టమైనదీ, క్లిష్టమైనదే కాకుండా దానికి చాలా శ్రద్ధ చూపించడం అవసరం. కాబట్టి పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులకు నిస్సహాయతా భావాలు కలగడం మామూలే. ఆర్కిడ్‌లు పెంచే వ్యక్తికి నిపుణుని సలహా అవసరమైనట్లే, తమకూ సహాయం అవసరమని చాలామంది తల్లిదండ్రులు భావిస్తారు. స్పష్టంగా, ప్రతీ తల్లి/తండ్రి శ్రేష్ఠమైన మార్గనిర్దేశం కావాలనే కోరుకుంటారు. అలాంటి మార్గనిర్దేశం ఎక్కడ లభిస్తుంది?

బైబిలు, ప్రత్యేకంగా పిల్లల పెంపకానికే సంబంధించిన నిర్దేశక పుస్తకం కాకపోయినా, తత్సంబంధమైన ఆచరణాత్మక సలహాలెన్నో అందులో వ్రాయబడేలా సృష్టికర్త దాని రచయితలను ప్రేరేపించాడు. చక్కని లక్షణాలు వృద్ధిచేసుకోవడాన్ని బైబిలు నొక్కిచెబుతోంది, అయితే ఆ విషయం తరచూ ఉపేక్షించబడుతోందని చాలామంది భావిస్తున్నారు. (ఎఫెసీయులు 4:​22-24) ఈ విషయంలో లేఖనాధారిత సలహా, సమతుల్య విద్యకు సంబంధించిన ఒక కీలకాంశాన్ని తెలియజేస్తోంది. ఆ సలహా, దాన్ని అన్వయించుకున్న వేలాదిమంది ఏ కాలానికి చెందినవారైనప్పటికీ, ఏ సాంస్కృతిక నేపథ్యానికి చెందినవారైనప్పటికీ ఇప్పటికే వారికి ప్రయోజనం చేకూర్చింది. కాబట్టి, లేఖనాధారిత సలహాను పాటించడం మీ పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో విజయం సాధించడానికి మీకు సహాయం చేయగలదు.

తల్లిదండ్రుల మాదిరే శ్రేష్ఠమైన విద్య

“ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా?”​—రోమీయులు 2:21, 22.

సియోల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అధ్యక్షుడు ఇలా అన్నాడు: “మాటలో, ప్రవర్తనలో మంచి మాదిరి ఉంచడం పిల్లలకు సర్వ శ్రేష్ఠమైన విద్యగా ఉంటుంది.” తల్లిదండ్రులు తమ మాటల్లో, చేతల్లో మంచి మాదిరిగా ఉండకుండా, పిల్లలకు ఏదైనా బోధిస్తే తమ తల్లిదండ్రులు వేషధారులని వాళ్లు వెంటనే పసిగట్టేస్తారు. తల్లిదండ్రుల మాటలకు విలువ లేకుండా పోతుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీని బోధించాలనుకుంటే, ముందు వారే నిజాయితీపరులుగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్‌ ఎత్తి అవతలి వ్యక్తితో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు, తమ పిల్లవాడు ఫోన్‌ ఎత్తి “మా నాన్నగారు (లేదా మా అమ్మ) ఇంట్లో లేరండీ” అని చెప్పిస్తారు. అలా చెప్పే పిల్లవాడు ఇబ్బందికి గురవుతూ తికమకపడతాడు. చివరకు, ఆ పిల్లవాడు తనకు కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు, ఎలాంటి అపరాధ భావంలేకుండా అబద్ధం చెప్పడం ఆరంభించవచ్చు. అందువల్ల, తమ పిల్లవాడు నిజాయితీపరుడు కావాలని తల్లిదండ్రులు నిజంగా కోరుకుంటే, ముందు వారే నిజాయితీగా మాట్లాడాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి.

మీ పిల్లవాడు మర్యాదగా మాట్లాడేలా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారా? అలాగైతే మీరే మంచి మాదిరిగా ఉండాలి. అప్పుడు మీ పిల్లవాడు మిమ్మల్నే అనుకరిస్తాడు. నలుగురు పిల్లల తండ్రియైన సాంగ్‌సిక్‌ ఇలా చెబుతున్నాడు: “అమర్యాదగా మాట్లాడుకోకూడదని నేనూ నా భార్య నిర్ణయించుకున్నాం. మేమిద్దరం పరస్పరం గౌరవించుకునే వాళ్లం. మేము ఒత్తిడికి గురైనా, మాకు కోపమొచ్చినా అరచుకోలేదు. మంచి మాదిరి మాటలకంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. మా పిల్లలు ఇతరులతో మర్యాదగా, మన్ననగా ప్రవర్తిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది.” గలతీయులు 6:7లో బైబిలు ఇలా చెబుతోంది: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” తమ పిల్లలు ఉన్నత నైతిక ప్రమాణాలు కలిగి ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు, మొదటిగా తామే అలాంటి ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నామని చూపించాలి.

సంభాషణా ద్వారాలు తెరచివుంచండి

‘నీవు నీ కుమారులకు వాటిని [దేవుని ఆజ్ఞలను] అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.’​—ద్వితీయోపదేశకాండము 6:⁠7.

ఓవర్‌టైమ్‌ చెయ్యాలనే ప్రవృత్తి అంతకంతకు ఎక్కువవుతోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే దాని ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలతో గడిపే సమయం తక్కువగా ఉంటోంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు, వారు ఇంటి పనులు ఇతర పనులు చేసుకోవాల్సి ఉంటుంది, దానితో వారు అలసిపోతారు లేదా వారికి ఓపిక నశిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, మీరు మీ పిల్లలతో చక్కగా ఎలా సంభాషించవచ్చు? మీరు, మీ పిల్లలు కలిసి ఇంటిపనులు చేసుకుంటే వారితో సంభాషించే అవకాశాలు మీకు లభించవచ్చు. ఒక తండ్రి తన పిల్లలతో సంభాషించడానికి ఎక్కువ సమయం గడపాలనే ప్రాథమిక ఉద్దేశంతో ఇంట్లోవున్న టీవీ అమ్మేశాడు. ఆయనిలా అంటున్నాడు: “మొదట్లో పిల్లలకు కాస్త విసుగనిపించింది, అయితే నేను వారితో పజిల్స్‌ ఆడాను, ఆసక్తికరమైన పుస్తకాలు పరిశీలించాను, దానితో వాళ్లు నెమ్మదిగా ఆ మార్పుకు అలవాటు పడ్డారు.”

పిల్లలు చిన్నప్పటి నుండే తమ తల్లిదండ్రులతో సంభాషించడానికి అలవాటుపడడం ప్రాముఖ్యం. లేకపోతే, పిల్లలు పెద్దవారై బహుశా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, వాళ్లు తమ తల్లిదండ్రులను మాట్లాడగల తమ స్నేహితులుగా భావించరు. వారు తమ మనస్సు విప్పి మాట్లాడేందుకు వారికి మీరెలా సహాయం చేయవచ్చు? సామెతలు 20:5 ఇలా చెబుతోంది: “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది, వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.” తల్లిదండ్రులు “నీ అభిప్రాయమేమిటి?” లాంటి తమ పిల్లల మనోభావాలను రాబట్టే ప్రశ్నలు అడగడం ద్వారా పిల్లలు తమ తలంపులను, భావాలను వ్యక్తం చేయడానికి ప్రోత్సహించవచ్చు.

మీ పిల్లవాడు గంభీరమైన తప్పుచేస్తే అప్పుడు మీరేమి చేస్తారు? అలాంటప్పుడే ప్రేమపూర్వకంగా అతను చెప్పేది వినడం అవసరం. మీ పిల్లవాడు చెబుతున్నది వినేటప్పుడు మీ భావోద్రేకాలను అదుపులో ఉంచుకోండి. అలాంటి పరిస్థితితో తాను వ్యవహరించే విధానం గురించి ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “పిల్లలు తప్పు చేసినప్పుడు, నేను అతిగా స్పందించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. సావధానంగా కూర్చొని వారు చెప్పాలనుకున్నది జాగ్రత్తగా వింటాను. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు, ఆగి ఆ కోపం తగ్గించుకుంటాను.” మీ భావోద్రేకాలను అదుపుచేసుకొని, జాగ్రత్తగా వింటే మీరిచ్చే దిద్దుబాటును పిల్లలు మరింత సంసిద్ధంగా అంగీకరిస్తారు.

ప్రేమతో క్రమశిక్షణ ఇవ్వడం ఆవశ్యకం

“తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”​—ఎఫెసీయులు 6:⁠4.

సత్ఫలితాలు సాధించాలంటే, మీరిచ్చే క్రమశిక్షణ ప్రేమపూర్వకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులు ఏ విధంగా ‘తమ పిల్లలకు కోపము రేపిన’ వారవుతారు? ఇచ్చే క్రమశిక్షణ జరిగిన తప్పిదానికి తగినవిధంగా లేకపోతే లేదా అతిగా ఆక్షేపిస్తే పిల్లలు తిరగబడతారు. కాబట్టి క్రమశిక్షణ ఎల్లప్పుడూ ప్రేమతో ఇచ్చేదై ఉండాలి. (సామెతలు 13:​24) మీ పిల్లలతో తర్కిస్తూ మాట్లాడినప్పుడు, మీరు ప్రేమతో వారికి క్రమశిక్షణ ఇస్తున్నారని వారు గ్రహిస్తారు.​—⁠సామెతలు 22:15; 29:19.

మరోవైపున, దోష ప్రవర్తనకు ఫలితంగా వారు వారిష్టపడని పర్యవసానాలు అనుభవించేలా చేయడం మంచిది. ఉదాహరణకు, పిల్లవాడు మరో వ్యక్తిపట్ల తప్పుచేస్తే ఆయనకు క్షమాపణ చెప్పమని మీరు గట్టిగా అడగవచ్చు. అతడు కుటుంబ నియమాలను ఉల్లంఘించినప్పుడు, నియమాలు పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికిగాను అతడికిష్టమైన కొన్ని పనులు చేయకుండా అతనిపై మీరు ఆంక్షలు విధించవచ్చు.

సరైన సమయంలో క్రమశిక్షణ అమలుచేయడం మంచిది. “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు” అని ప్రసంగి 8:⁠11 సూచిస్తోంది. చాలామంది పిల్లలు కూడా తప్పుచేసి తాము శిక్ష నుండి తప్పించుకోగలమో లేదో చూద్దామని అనుకుంటారు. కాబట్టి, ఫలాని తప్పుచేస్తే శిక్ష పడుతుందని మీరొకసారి హెచ్చరించిన తర్వాత ఆ శిక్షవేయడం మానకండి.

ఆరోగ్యదాయకమైన వినోద క్రీడలు ఎంతో విలువైనవి

‘ప్రతిదానికి సమయము కలదు. నవ్వుటకు; నాట్యమాడుటకు.’​—ప్రసంగి 3:1, 4.

పిల్లవాడు ఎదగాలంటే వాడి మనస్సుకు, శరీరానికి విరామం, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన వినోద క్రీడలు అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లలతోపాటు వినోద క్రీడల్లో పాల్గొన్నప్పుడు, కుటుంబ బంధాలు బలపడతాయి, పిల్లలకు భద్రతా భావం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు కలిసి ఎలాంటి వినోద క్రీడలు ఆడవచ్చు? మీరు సమయం తీసుకుని ఆలోచిస్తే, ఆహ్లాదకరమైన క్రీడలెన్నో మీకు స్ఫురించవచ్చు. ఆరు బయట సైకిలు తొక్కడం, టెన్నీస్‌, బ్యాట్మింటన్‌, వాలీబాల్‌వంటి ఆటలున్నాయి. కుటుంబమంతా కలిసి సంగీతం వాయించినప్పుడు కలిసి ఆనందించగల సంతోషభరితమైన సమయాల గురించి ఒక్కసారి ఊహించుకోండి. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి సమీప ప్రాంతాలకు వెళ్లడం మధుర స్మృతులను మిగల్చవచ్చు.

అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్లో వినోదం గురించిన సమతుల్య దృక్కోణాన్ని మనస్సులో నాటవచ్చు. ముగ్గురు కుమారులున్న ఒక క్రైస్తవుడు ఇలా చెప్పాడు: “సాధ్యమైనప్పుడు నేను కూడా మా పిల్లల వినోదంలో పాల్గొంటాను. ఉదాహరణకు, వాళ్లు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడినప్పుడు, నేను వాటి గురించి అడుగుతాను. వాటి గురించి వాళ్లు ఉత్సాహంగా నాకు వివరించిన తర్వాత, అనారోగ్యకరమైన వినోదంలో ఉన్న ప్రమాదం గురించి మాట్లాడేందుకు నేను ఆ అవకాశం ఉపయోగించుకుంటాను. వాళ్లు అనుచిత వినోదాన్ని పక్కకు నెట్టేయడం నేను గమనించాను.” అవును, కుటుంబ వినోదంతో సంతోషపడే పిల్లలు, హింస, లైంగిక దుర్నీతి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి వాటిని చూపించే టీవీ కార్యక్రమాలకు, వీడియోలకు, సినిమాలకు, ఇంటర్నెట్‌ గేమ్స్‌కు వెళ్లడానికి తక్కువ మొగ్గుచూపుతారు.

మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

“జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”​—సామెతలు 13:​20.

తన నలుగురు పిల్లలను విజయవంతంగా పెంచిన ఒక క్రైస్తవ తండ్రి ఇలా చెప్పాడు: “స్నేహితులను వాళ్లు ఎంచుకొనే ప్రాముఖ్యతను అధికంగా నొక్కిచెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసినదంతా నాశనం చేయడానికి ఒక్క చెడ్డ స్నేహితుడు చాలు.” మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి తన పిల్లలకు సహాయం చేయడంలో భాగంగా, ఆయన విజ్ఞతతో వారిని ఇలాంటి ప్రశ్నలడిగేవాడు: నీ సన్నిహిత స్నేహితుడు ఎవరు? అతన్నే ఎందుకు ఇష్టపడుతున్నావు? అతనిలో నువ్వు అనుకరించాలని కోరుకునేదేమిటి? మరో తండ్రి, తన పిల్లలు వాళ్ల సన్నిహిత స్నేహితులను ఇంటికి పిలిచేలా ఏర్పాటుచేస్తాడు. ఆ విధంగా ఆయన వారిని గమనించి తన పిల్లలకు సముచితమైన మార్గనిర్దేశమిస్తాడు.

పిల్లలకు తమ ఈడు వారితోనే కాక పెద్దవారితో కూడా స్నేహం చేయవచ్చని నేర్పించడం కూడా ప్రాముఖ్యం. ముగ్గురు పిల్లల తండ్రియైన బమ్‌సన్‌ ఇలా చెబుతున్నాడు: “బైబిల్లోని దావీదు యోనాతానుల విషయంలోలాగే, తమ స్నేహితులు కేవలం తమ ఈడువారే కానవసరం లేదని అర్థంచేసుకోవడానికి నేను నా పిల్లలకు సహాయం చేస్తాను. నిజానికి, నా పిల్లలతో సహవసించడానికి నేను వివిధ వయస్సులున్న క్రైస్తవులను ఆహ్వానిస్తాను. ఫలితంగా, పిల్లలు తమ ఈడువారు కాని చాలామందితో సహవసించడానికి వీలవుతుంది.” ఆదర్శవంతులైన పెద్దవారితో సహవసించడం పిల్లలు అనేక విషయాలు నేర్చుకొనే సదవకాశమిస్తుంది.

మీరు పిల్లలకు శిక్షణనివ్వడంలో విజయం సాధించవచ్చు

అమెరికాలో నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం, చాలామంది తమ పిల్లల్లో ఆశానిగ్రహం, స్వీయ క్రమశిక్షణ, నిజాయితీ వంటి లక్షణాలను క్రమేణా వృద్ధిచేసే ప్రయత్నాల్లో ఎక్కువగా విజయం సాధించలేకపోయారు. అది ఎందుకంత కష్టం? ఆ సర్వేకు జవాబిచ్చిన ఒక తల్లి ఇలా చెప్పింది: ‘విచారకరమైన విషయమేమిటంటే మన పిల్లలను కాపాడడానికి వారిని గదిలో బంధించి, వాళ్లను ఎప్పటికీ బయటి ప్రపంచంలోకి వెళ్లనీయకుండా చేయడమే దానికి ఏకైక మార్గంగా ఉండడం.’ పిల్లలు పెరిగే పర్యావరణం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా దిగజారిపోయిందనే విషయం మనస్సులో పెట్టుకునే ఆమె అలా మాట్లాడింది. ఇలాంటి పరిస్థితిలో పిల్లలను విజయవంతంగా పెంచడం నిజంగా సాధ్యపడుతుందా?

ఆర్కిడ్‌ను పెంచాలనే కోరిక మీకున్నా అది వాడిపోవచ్చనే చింత మీకుంటే మీరు నిరుత్సాహపడవచ్చు. ఒకవేళ ఆర్కిడ్‌ మొక్కల పెంపకంలో నిపుణుడు మీ దగ్గరకొచ్చి కొన్ని చక్కని సూచనలిచ్చి, “మీరిలాచేస్తే తప్పక విజయం సాధిస్తారు” అని నమ్మకంగా చెబితే మీ మనస్సెంత కుదుట పడుతుందో కదా! మానవ ప్రవృత్తి విషయంలో సర్వోన్నత నిపుణుడైన యెహోవా పిల్లలను పెంచే విషయంలో అతి శ్రేష్ఠమైన సలహాను అందిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:⁠6) మీరు బైబిలు ఉపదేశం ప్రకారం మీ పిల్లలను పెంచితే, వాళ్లు బాధ్యతగల పెద్దవారిగా, ఇతరులపట్ల శ్రద్ధచూపేవారిగా, నైతికత ఉన్నవారిగా ఎదగడంచూసే ఆనందం మీకు దక్కవచ్చు. అప్పుడు వాళ్లు మనుష్యులు ప్రేమించే వారిగా, అందరికంటే పైగా మన పరలోకపు తండ్రియైన యెహోవా ప్రేమించే వారిగా ఉంటారు.