కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి”

“ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి”

“ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి”

క్రైస్తవ మిషనరీలైన పౌలు, బర్నబా, యోహాను మార్కులు దాదాపు సా.శ. 47లో కుప్రకు వెళ్లినప్పుడు వారి అనుభవాల వృత్తాంతాన్ని అపొస్తలుల కార్యముల పుస్తకం పై మాటలతో ప్రారంభించింది. (అపొస్తలుల కార్యములు 13:⁠4) నేడున్నట్లే ఆ కాలంలో కూడా ప్రాచ్య మధ్యధరా ప్రాంతంలో కుప్రకు కీలకమైన ప్రదేశంగా మంచి పేరుంది.

రోమన్లు దానిపై కన్నువేయడంతో, అది సా.శ.పూ. 58లో వారి పరిపాలనలోకి వచ్చింది. అంతకుపూర్వం, కుప్రకు ఆసక్తికరమైన చరిత్ర ఉంది. దానిని ఫోనేషియన్లు, గ్రీకులు, అష్షూరీయులు, పర్షియన్లు, ఐగుప్తీయులు ఆక్రమించారు. మధ్యయుగాల్లో క్రూసేడులు, ఫ్రాంక్‌లు, వెనిటియన్లు, ఆ తర్వాత ఓట్టమాన్లు దానిని ఆక్రమించారు. 1914లో బ్రిటన్‌ ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని 1960లో దానికి స్వాతంత్ర్యం లభించేంత వరకు దానిని పరిపాలించింది.

ఆర్థిక రాబడికి నేడక్కడ పర్యాటక రంగమే ముఖ్యాధారంగా ఉంది. అయితే పౌలు కాలంలో కుప్ర, సహజ వనరుల సమృద్ధికి నెలవుగా ఉండేది, అయితే రోమ్‌లోని తమ బొక్కసాలను నింపుకోవడానికి రోమన్లు ఆ వనరులన్నీ దోచుకుపోయారు. ఆ ద్వీపపు చరిత్ర తొలికాలాల్లో అక్కడ రాగి నిలువలు ఉన్నట్లు కనుగొనబడింది, రోమన్ల పరిపాలన అంతమయ్యే నాటికి అక్కడ నుండి 2,50,000 టన్నుల రాగి వెలికి తీయబడిందని అంచనా. అయితే ఆ పరిశ్రమ శుద్ధీకరణ పనులకుగాను అడవుల్లో అధిక శాతం నాశనం చేయబడింది. పౌలు అక్కడికి వచ్చేసరికే ఆ ద్వీపంలోని అరణ్యాలు చాలావరకు అంతరించిపోయాయి.

రోమన్ల పరిపాలనలో కుప్ర

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, జూలియస్‌ సీజర్‌, ఆయన తర్వాత మార్క్‌ ఆంటొని కుప్రను ఐగుప్తుకు ఇచ్చారు. అయితే ఔగుస్తు అధికారానికి వచ్చినప్పుడు అది తిరిగి రోమ్‌కు అప్పగించబడింది. అపొస్తలుల కార్యముల రచయిత లూకా అత్యంత ప్రామాణికంగా వ్రాసిన ప్రకారం కుప్ర రోమా ప్రభుత్వాధిపతి పాలనలో ఉంది. పౌలు అక్కడ ప్రకటించినప్పుడు సెర్గి పౌలు దానికి అధిపతిగా ఉన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 13:⁠7.

రోమ్‌ బలవంతంగా అమలుచేసిన పాక్స్‌ రోమన అంటే అంతర్జాతీయ శాంతి ప్రక్రియ, కుప్రలోని గనుల, పరిశ్రమల విస్తరణను ప్రోత్సహించి వ్యాపారాభివృద్ధికి తోడ్పడింది. అక్కడ రోమన్‌ సైనిక దళాలు ఉండడంవల్ల, అక్కడి ముఖ్య దేవత అఫ్రొడైట్‌ దర్శనం కోసం అక్కడికొచ్చే యాత్రికులవల్ల ఆ ద్వీపానికి అదనపు రాబడి వచ్చేది. దాని కారణంగా కొత్త రహదారులు, ఓడరేవులు, విలాసవంతమైన ప్రజా భవనాలు నిర్మించబడ్డాయి. అక్కడ గ్రీకు అధికార భాషగానే నిలిచిపోగా, రోమన్‌ చక్రవర్తితోపాటు అఫ్రోడైట్‌, అపొల్లో, ద్యుపతివంటి దేవతలు విస్తారంగా ఆరాధించబడ్డారు. ప్రజలు వర్ధిల్లి, సుసంపన్నమైన సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని అనుభవించారు.

ఇలాంటి పరిస్థితుల్లో పౌలు కుప్రకు వెళ్లి అక్కడి ప్రజలకు క్రీస్తు గురించి బోధించాడు. అయితే, పౌలు కుప్రకు చేరక ముందే అక్కడ క్రైస్తవత్వం ప్రవేశపెట్టబడింది. మొదటి క్రైస్తవ హతసాక్షియైన స్తెఫను మరణించిన తర్వాత, తొలి క్రైస్తవుల్లో కొందరు కుప్రకు పారిపోయారని అపొస్తలుల కార్యాల్లోని వృత్తాంతం మనకు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 11:​19) పౌలు సహవాసి బర్నబా కుప్రకు చెందినవాడే, ఆయనకు ఆ ద్వీపం కొట్టిన పిండి, అందువల్ల ఈ ప్రకటనా యాత్రలో ఆయన పౌలుకు అద్భుతమైన మార్గదర్శిగా ఉన్నాడనడంలో సందేహం లేదు.​—⁠అపొస్తలుల కార్యములు 4:​36; 13:⁠2.

కుప్రలో పౌలు ప్రయాణ విశేషాలు

కుప్రలో పౌలు ప్రయాణాల వివరణాత్మక పట్టిక తయారుచేయడం అంత సులభం కాదు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలకు రోమా కాలంనాటి విశిష్ఠమైన రహదారి వ్యవస్థ గురించి మంచి అవగాహన ఉంది. ఆ ద్వీపానికున్న నైసర్గిక స్వరూపాన్నిబట్టి ఆధునిక రహదారులు సైతం ఆ కాలపు మిషనరీలు బహుశా ప్రయాణించిన దారుల్లోనే ఉండాలి.

పౌలు, బర్నబా, యోహాను మార్కులు సెలూకయ నుండి సలమీ ఓడరేవుకు సముద్ర ప్రయాణం చేశారు. పాఫు రాజధానిగా మరియు ముఖ్య ఓడరేవుగా ఉండగా సలమీకి ఎందుకు వెళ్లారు? ఒక కారణమేమిటంటే సలమీ తూర్పు తీరంలో ఉండడమే కాక ప్రధాన భూభాగంలోవున్న సెలూకయకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రోమన్ల అధికారంలో సలమీకి బదులు పాఫు రాజధానిగా చేయబడినప్పటికీ, సలమీ ఆ ద్వీపపు సాంస్కృతిక, విద్యా, వ్యాపార కేంద్రంగానే ఉండిపోయింది. సలమీలో యూదులు అధిక సంఖ్యలో ఉండడంతో ఆ మిషనరీలు “యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 13:⁠5.

నేడు, సలమీలో కేవలం శిధిలాలే మిగిలాయి. అయినప్పటికీ, ఆ నగర వైభవాన్ని, సంపన్నతను పురావస్తు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. రాజకీయ, మతసంబంధ కార్యకలాపాల కేంద్రంగా విరాజిల్లిన సంతవీధి, మధ్యధరా ప్రాంతంలోనే, త్రవ్వకాల్లో బయల్పడిన అత్యంత విశాలమైన బజారుగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఔగుస్తు కైసరు కాలంనాటివైన దాని శిథిలాల్లో సంశ్లిష్టమైన నమూనాల్లో మొజాయిక్‌ పరచిన నేలలు, వ్యాయామశాలలు, అసాధారణమైన స్నాన వాటికలు, ఒక క్రీడా ప్రాంగణం, పోరాట ప్రదర్శనశాల (ఆంఫి థియేటర్‌), వైభవోపేతమైన సమాధులు, 15,000 మంది కూర్చోగల ఒక పెద్ద రంగస్థలం ఉన్నాయి! ఆ సమీపంలోనే గొప్ప ద్యుపతి దేవాలయపు శిథిలాలు ఉన్నాయి.

అయితే భూకంపాల వినాశనం నుండి ద్యుపతి ఆ నగరాన్ని కాపాడలేకపోయాడు. సా.శ.పూ. 15లో సంభవించిన గొప్ప భూకంపం సలమీలోని అత్యధిక ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది, అయితే ఆ తర్వాత ఔగుస్తు దానిని తిరిగి నిర్మించాడు. సా.శ. 77లో వచ్చిన మరో భూకంపంవల్ల అది మళ్లీ నాశనమైంది, అయినా అది మరోసారి పునఃనిర్మించబడింది. నాల్గవ శతాబ్దంలో, సలమీ వరుసగా సంభవించిన భూకంపాలవల్ల బొత్తిగా నాశనం చేయబడడంతో అది తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందలేక పోయింది. మధ్య యుగాలకల్లా దాని ఓడరేవు మట్టితో పూడుకుపోవడంతో అది పనికిరాకుండా పోయింది.

పౌలు ప్రకటనకు సలమీ ప్రజలెలా ప్రతిస్పందించారో తెలియదు. అయితే పౌలు ఇతర సమాజాల ప్రజలకు కూడా ప్రకటించాల్సివచ్చింది. సలమీ నుండి బయలుదేరుతున్న ఆ మిషనరీలకు ఎంచుకోవడానికి మూడు రహదార్లు ఉన్నాయి: మొదటిది కిరేనియా పర్వత శ్రేణుల్ని దాటి ఉత్తర తీరానికి చేరుకుంటుంది; మరొకటి ద్వీపపు ప్రధాన భూభాగం గుండా మెసావోర్యా మైదానానికి అడ్డంగా పశ్చిమానికి వెళుతుంది; మూడవది దక్షిణ తీరం వెంబడే వెళుతుంది.

పౌలు మూడవ రహదారిలో ప్రయాణించాడని తెలుస్తోంది. అది విశిష్ఠమైన ఎర్రనేలల సారవంతమైన వ్యవసాయ క్షేత్రాల్లోనుంచి వెళుతుంది. ఆ రహదారి ఉత్తరదిక్కున భూభాగంవైపు తిరగడానికి ముందు నైరృతి దిక్కున 50 కిలోమీటర్ల దూరంలోవున్న లార్నకా నగరానికి చేరుతుంది.

‘ఆ ద్వీపమందంతట సంచరించారు’

ఆ రహదారి ప్రాచీనకాల లెడ్రా నగరం చేరుకుంటుంది. నేడు ఆ నగరం స్థానంలో ఆధునిక రాజధాని నికోషియా నిర్మించబడింది. ఆ ప్రాచీన నగర ఆనవాళ్లన్నీ తుడిచివేయబడ్డాయి. అయితే 16వ శతాబ్దంలో, నికోషియా నడిబొడ్డున వెనిటియన్లు నిర్మించిన ప్రాకారాలున్నాయి, దానిలో రద్దీగా ఉండే లెడ్రా అనే ఇరుకు వీధి ఉంది. పౌలు లెడ్రాకు వెళ్లాడో లేదో మనకు తెలియదు. వాళ్లు ‘ఆ ద్వీపమంతటా సంచరించారని’ మాత్రమే బైబిలు మనకు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 13:⁠6) “ఆ మాటకు అర్థం బహుశా వాళ్లు సాపేక్షికంగా కుప్రలోని యూదుల సమాజాలన్నీ చుట్టివచ్చారనికావచ్చు” అని ద వైక్లిఫ్‌ హిస్టారికల్‌ జియోగ్రఫీ ఆఫ్‌ బైబిల్‌ ల్యాండ్స్‌ చెబుతోంది.

పౌలుకు కుప్రలో సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుసుకోవాలనే ఆసక్తి ఖచ్చితంగా ఉంది. అందుకే, ఆయన లెడ్రా నుండి అధిక జనాభాగల గొప్ప వివిధ భాషా నగరాలైన ఆమథస్‌, కూర్యన్‌ గుండా వెళ్లే దక్షిణ రహదారిలోనే వెళ్లుంటాడు.

సముద్ర మట్టానికి ఎంతో ఎత్తుగా నిట్టనిలువుగా సముద్ర తీరంవరకూ వ్యాపించిన పర్వత శిఖరాలపై కూర్యన్‌ నగరం ఉంది. గ్రీసు, రోమన్‌ల సంస్కృతి మేళవించిన ఈ సుందర నగరం సా.శ. 77లో సలమీని నేలమట్టం చేసిన భూకంపంవల్లనే నాశనమైంది. అక్కడిప్పుడు సా.శ. 100కు ముందు అపొల్లోకు ప్రతిష్ఠించబడిన దేవాలయపు శిధిలాలు ఉన్నాయి. అక్కడున్న ఒక క్రీడా ప్రాంగణంలో 6,000 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. కూర్యన్‌లో అనేకుల విలాసవంతమైన జీవన విధానాన్ని వ్యక్తిగత భవనాల్లో సహితం నేలమీద అమర్చబడిన అందమైన మొజాయిక్‌ అలంకృతుల్లో చూడవచ్చు.

పాఫుకు వెళ్లడం

కూర్యన్‌ నుండి ప్రకృతి అందాల నడుమ సాగే ఆ రహదారి పశ్చిమంగా, ద్రాక్షారసం ఉత్పత్తిచేసే ప్రాంతాలగుండా ముందుకెళుతూ క్రమేణా ఇంకా ఎత్తుకుపోయి ఊహించని మలుపు తిరిగి పల్లంలోకి జారిపడుతున్నట్లుగా, పాములా వంపులు తిరుగుతూ గులకరాళ్లుండే సముద్ర తీరాలవరకు వెళుతుంది. గ్రీకు పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలోనే సముద్ర గర్భం నుండి కొత్తగా పుట్టిన అఫ్రొడైట్‌ దేవత అవతరించింది.

కుప్రలోని దేవతలందరిలో అఫ్రొడైట్‌ అత్యధిక ప్రజాదరణపొంది సా.శ. రెండవ శతాబ్దం వరకు భక్తి ప్రపత్తులతో ఆరాధించబడింది. అఫ్రొడైట్‌ ఆరాధనా కేంద్రం పాఫులో ఉంది. ప్రతి సంవత్సరం వసంత రుతువులో అక్కడ ఆమె గౌరవార్థం ఒక గొప్ప పండుగ జరిగేది. ఆ పండుగలకు ఆసియా మైనర్‌, ఐగుప్తు, గ్రీసు నుండి అలాగే ఎక్కడోవున్న పర్షియా నుండి యాత్రికులు పాఫుకు వచ్చేవారు. కుప్ర టోలమీ వంశస్థుల పాలన క్రింద ఉన్నప్పుడు, కుప్రవాసులకు ఫరోల ఆరాధన పరిచయం చేయబడింది.

పాఫు కుప్రకు రోమన్‌ ముఖ్యపట్టణంగా, రోమా అధిపతి స్థానంగా ఉండి రాగి నాణేల టంకసాలగా విరాజిల్లింది. ఇది కూడా సా.శ.పూ. 15లో సంభవించిన భూకంపంవల్ల సలమీలాగే నాశనమయింది, ఔగుస్తు ఆ నగర పునఃనిర్మాణానికి నిధులు సమకూర్చాడు. మొదటి శతాబ్దపు పాఫులోని సంపన్నుల విలాసవంతమైన జీవన సరళికి సంబంధించిన వివరాలు అంటే అక్కడి విశాలమైన నగర వీధులు, ఖరీదైన అలంకరణతో నిండిన వ్యక్తిగత భవంతులు, సంగీత పాఠశాలలు, వ్యాయామశాలలు, వృత్తాకారపు ప్రేక్షకాగారం త్రవ్వకాల్లో బయటపడ్డాయి.

ఈ విధంగా ఉన్న పాఫునే పౌలు, బర్నబా, యోహాను మార్కులు సందర్శించారు, ఇక్కడే గారడీవాడైన ఎలుమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, “వివేకముగల” అధిపతియైన సెర్గి పౌలు ‘దేవుని వాక్యం వినడానికి ఇష్టపడ్డాడు.’ ఆ అధిపతి యెహోవా ‘బోధకు ఆశ్చర్యపడ్డాడు.’​—⁠అపొస్తలుల కార్యములు 13:​6-12.

కుప్రలో విజయవంతంగా తమ ప్రకటనా పనిని ముగించిన తర్వాత, ఆ మిషనరీలు ఆసియా మైనర్‌లో తమ సేవను కొనసాగించారు. పౌలు చేసిన ఆ మొదటి మిషనరీ యాత్ర నిజ క్రైస్తవత్వాన్ని వ్యాపింపజేయడంలో కీలకపాత్ర వహించింది. ఆ యాత్రను సెయింట్‌ పౌల్స్‌ జర్నీస్‌ ఇన్‌ ద గ్రీక్‌ ఓరియంట్‌ అనే పుస్తకం “క్రైస్తవ మత ప్రచారానికి . . . పౌలు మిషనరీ సేవకు నిజమైన ఆరంభం” అని పిలిచింది. ఆ పుస్తకమింకా ఇలా చెబుతోంది: “సిరియా, ఆసియా మైనర్‌, గ్రీసులకు వెళ్లే సముద్ర మార్గాల కూడలిగా ఉన్నందువల్ల కుప్ర మిషనరీ సేవకు స్వభావసిద్ధంగానే మొదటి స్థానమైంది.” అయితే అది తొలిమెట్టు మాత్రమే. ఇరవై శతాబ్దాల తర్వాత కూడా ఆ క్రైస్తవ మిషనరీ సేవ కొనసాగుతూనే ఉంది, యెహోవా రాజ్యసువార్త అక్షరార్థంగా “భూదిగంతముల వరకు” చేరుకుందని నిజంగా చెప్పవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠8.

[20వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కుప్ర

నికోషియా (లెడ్రా)

సలమీ

పాఫు

కూర్యన్‌

ఆమథస్‌

లార్నకా

కిరేనియా పర్వతాలు

మెసోరియా మైదానం

ట్రూడోస్‌ పర్వతాలు

[21వ పేజీలోని చిత్రం]

పాఫులో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు గారడీవాడైన ఎలుమను గుడ్డివాణ్ణి చేశాడు