కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనమని వారికి బోధించండి’

‘నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనమని వారికి బోధించండి’

‘నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనమని వారికి బోధించండి’

‘కాబట్టి మీరు వెళ్లి శిష్యులనుగా చేయుడి నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.’​—⁠మత్తయి 28:19, 20.

ఆ వ్యక్తి ఐతియొపీయ నుండి యెరూషలేము వరకు ప్రయాణించి వచ్చాడు. అక్కడాయన తాను ప్రేమించే యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. ఆయనకు దేవుని ప్రేరేపిత వాక్యంపై కూడా ప్రేమ ఉందని స్పష్టమవుతోంది. ఆయన తన రథంపై తన స్వదేశానికి తిరిగి వెళుతూ యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథం చదువుతున్నాడు, ఆ సమయంలోనే క్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు ఆయనను కలిశాడు. ఫిలిప్పు ఆ ఐతియోపీయుణ్ణి, “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగాడు. దానికాయన “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని” జవాబిచ్చాడు. దానితో లేఖనాలు చదువుతున్న ఆ నిజాయితీగల విద్యార్థి క్రీస్తు శిష్యుడయ్యేలా ఫిలిప్పు ఆయనకు సహాయం చేశాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​26-39.

2 ఐతియోపీయుడు ఇచ్చిన జవాబు గమనార్హమైనది. ఆయనిలా అన్నాడు: ‘ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను.’ అవును ఆయనకు నిర్దేశం అవసరం, ఎవరో ఒకరు ఆయనకు త్రోవ చూపించాలి. శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞలోని నిర్దిష్టమైన ఆదేశపు ప్రాముఖ్యతను ఆ వ్యాఖ్యానం తనదైన రీతిలో ఉదహరిస్తోంది. ఆ ఆదేశమేమిటి? దానికి జవాబు కనుగొనేందుకు మనం మత్తయి 28వ అధ్యాయంలోని యేసు మాటల పరిశీలనను కొనసాగిద్దాం. దీని ముందరి ఆర్టికల్‌ ఎందుకు? ఎక్కడ? అనే అంశాలపై దృష్టి నిలిపింది. శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు సంబంధించి ఏమిటి? ఎప్పుడు? అనే మిగిలిన రెండు ప్రశ్నలను మనమిప్పుడు పరిశీలిద్దాం.

“వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి”

3 క్రీస్తు శిష్యులయ్యేలా ఇతరులకు సహాయపడేందుకు మనం ఏమి బోధించాలి? యేసు తన అనుచరులకిలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) కాబట్టి క్రీస్తు ఆజ్ఞాపించిన సంగతులను మనం బోధించాలి. * అయితే యేసు ఆజ్ఞలు బోధించబడిన వ్యక్తి శిష్యుడవడమే కాదుగానీ శిష్యునిగా స్థిరంగా ఉండేందుకు అతనికి ఏమి సహాయం చేస్తుంది? యేసు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న మాటల్లో ఒక కీలకాంశాన్ని చూడవచ్చు. ఆయన ‘నేను మీకు ఏ యే సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని వారికి బోధించుడి’ అని మాత్రమే చెప్పలేదని గమనించండి. బదులుగా ఆయనిలా చెప్పాడు: ‘నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.’ (మత్తయి 19:​17) దాని భావమేమిటి?

4 ఆజ్ఞను గైకొనడం అంటే ఆజ్ఞకు “తగ్గట్టుగా ప్రవర్తించడం” అంటే లోబడడం, లేదా పాటించడమని అర్థం. అయితే క్రీస్తు ఆజ్ఞలను గైకొనమని లేదా లోబడమని ఒక వ్యక్తికి మనమెలా బోధిస్తాం? డ్రైవింగ్‌ నేర్పేవ్యక్తి తన విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ఎలా నేర్పిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి ముందుగా ఒక తరగతి గదిలో తన విద్యార్థులకు రోడ్డు నియమాలు బోధిస్తాడు. అయితే, ఆ నియమాలను ఎలా పాటించాలో తన విద్యార్థులకు నేర్పించడానికి, వారు ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేస్తూ, తాము నేర్చుకున్నది ఆచరణలో పెట్టేందుకు బాగా కృషి చేస్తున్నప్పుడు ఆయన వారికి మార్గదర్శకమివ్వాలి. అదే విధంగా, మనం ప్రజలతో బైబిలు అధ్యయనం చేసినప్పుడు మనం వారికి క్రీస్తు ఆజ్ఞలు బోధిస్తాం. అయితే ఆ విద్యార్థులు క్రీస్తు ఆదేశాలను తమ దైనందిన జీవితంలో, పరిచర్యలో అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తుండగా మనం వారికి మార్గదర్శకం కూడా ఇవ్వాలి. (యోహాను 14:15; 1 యోహాను 2:⁠3) కాబట్టి, శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చడానికి మనం అటు బోధకులుగానూ ఇటు మార్గదర్శకులుగానూ ఉండాలి. అలా మనం, యేసు మరియు యెహోవా స్వయంగా ఉంచిన మాదిరిని అనుకరిస్తాం.​—⁠కీర్తన 48:14; ప్రకటన 7:17.

5 యేసు ఆజ్ఞలు గైకొనమని ఇతరులకు బోధించడంలో, శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడానికి వారికి సహాయం చేయడం కూడా ఇమిడివుంది. మనం బైబిలు అధ్యయనం చేసే కొందరికి అలా చేయడం భయపెట్టేదిగా ఉండవచ్చు. వారు అంతకుముందు క్రైస్తవమత సామ్రాజ్యపు ఏదోక చర్చిలో క్రియాశీల సభ్యులైనప్పటికీ, వారి మత బోధకులు వెళ్లి శిష్యులను చేయమని వారికి బోధించి ఉండరు. సువార్త ప్రకటించమని తమ మందకు నేర్పే విషయానికి వస్తే క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు ఘోరంగా విఫలమైనట్లు కొందరు చర్చీ నాయకులు నిర్మొహమాటంగా ఒప్పుకుంటారు. లోకంలోకి వెళ్లి శిష్యులయ్యేందుకు సకల జనులకు సహాయం చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞపై వ్యాఖ్యానిస్తూ, బైబిలు విద్వాంసుడైన ఆర్‌. డబ్ల్యు. స్కాట్‌ ఇలా అన్నాడు: “ఈనాడు సువార్త క్షేత్రంలోని క్రైస్తవ సువార్తికుల మహాగొప్ప బలహీనత ఏమిటంటే ఈ ఆజ్ఞలోని అంతస్సూచనలకు లోబడకపోవడమే.” ఆయనింకా ఇలా అన్నాడు: “మనం దూరంగా నిలబడే మన సందేశాన్ని ప్రకటించడానికి ఇష్టపడతాం. మనం కొన్నిసార్లు సురక్షితంగా సముద్రపు ఒడ్డున నిలబడి, మునుగుతున్న వ్యక్తులకు సలహాలిస్తున్న ప్రజలుగా ఉంటాం. వాళ్లను రక్షించడానికి మనం నీళ్లలోకి దూకం. ఎందుకంటే తడిసిపోతామేమోనని మనకు భయం.”

6 అలంకారిక భాషలో చెప్పాలంటే, మనం బైబిలు అధ్యయనం చేస్తున్న వ్యక్తి, “తడిసిపోతామేమో” అని భయపడే సభ్యులున్న మతంలో భాగస్థునిగా ఉంటే, తనలోని నీళ్ల భయాన్ని అధిగమించడం అంటే శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు లోబడడం ఆయనకు ఒక సవాలుగా ఉండవచ్చు. ఆయనకు సహాయం అవసరమవుతుంది. ఫిలిప్పు బోధలెలా ఐతియోపీయునికి జ్ఞానోదయం కలిగించి, బాప్తిస్మం తీసుకోవడానికి ఆయనను పురికొల్పాయో, అలాగే ఆ వ్యక్తి అవగాహనను పెంచే చర్య తీసుకునేలా ఆయనను పురికొల్పే ఉపదేశాన్ని, నిర్దేశాన్ని అందించేటప్పుడు మనం సహనం చూపించడం అవసరం. (యోహాను 16:13; అపొస్తలుల కార్యములు 8:​35-38) దానికితోడు, శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞను గైకొనడానికి బైబిలు విద్యార్థులకు సహాయం చేయాలనే మన కోరిక, రాజ్య ప్రకటనా పనిలో వారుచేసే తొలి ప్రయత్నాల్లో వారిని నిర్దేశించడానికి మనం వారితో కలిసి సేవచేసేలా మనలను పురికొల్పుతుంది.​—⁠ప్రసంగి 4:9, 10; లూకా 6:40.

“వాటినన్నిటిని”

7 శిష్యులను చేసే విధంగా కొత్త శిష్యులకు బోధించడంతోనే మనం సరిపెట్టుకోము. యేసు తాను ఆజ్ఞాపించిన ‘వాటినన్నిటిని గైకొనవలెనని’ ఇతరులకు బోధించమని మనకు ఆదేశించాడు. దానిలో దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించాలనే రెండు మహాగొప్ప ఆజ్ఞలు కూడా ఖచ్చితంగా ఇమిడివున్నాయి. (మత్తయి 22:​37-39) ఆ రెండు ఆజ్ఞలు గైకొనేలా కొత్త శిష్యునికి ఎలా బోధించవచ్చు?

8 డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న విద్యార్థి ఉదాహరణ గురించి మళ్లీ ఒకసారి ఆలోచించండి. డ్రైవింగ్‌ నేర్పించే వ్యక్తి తన ప్రక్కన ఉన్నప్పుడు ట్రాఫిక్‌లో ఆ విద్యార్థి డ్రైవింగ్‌ చేస్తూ, తనకు నేర్పించే వ్యక్తి చెప్పేది వింటూ, ఇతర డ్రైవర్లను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటాడు. ఉదాహరణకు, ఒక డ్రైవర్‌ ఓపికగా ట్రాఫిక్‌లో మరో వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వడాన్ని; ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లలో సూటిగా కాంతి పడకుండా తన కారు హెడ్‌లైట్లు ఆర్పడాన్ని; లేదా కారు చెడిపోయిన పరిచయస్థునికి సహాయం చేయడానికి వెళ్లిన ఒక డ్రైవరును ఆ నేర్పించే వ్యక్తి విద్యార్థికి చూపించవచ్చు. అలాంటి ఉదాహరణలు ఆ విద్యార్థి తాను డ్రైవింగ్‌ చేసేటప్పుడు అనువర్తించుకోగల విలువైన పాఠాలు నేర్పిస్తాయి. అదే విధంగా, జీవ మార్గంలో పయనించే కొత్త శిష్యుడు తన బోధకుని నుండే కాక, సంఘంలో తానుచూసే చక్కని మాదిరుల నుండి కూడా నేర్చుకుంటాడు.​—⁠మత్తయి 7:​13, 14.

9 ఉదాహరణకు, తన చిన్న పిల్లలనందరినీ వెంటబెట్టుకుని రాజ్య మందిరానికి రావడానికి ఎంతో ప్రయాసపడే ఒక ఒంటరి తల్లిని ఒక బైబిలు విద్యార్థి గమనించవచ్చు. మానసిక కృంగుదలను అనుభవిస్తున్నప్పటికీ నమ్మకంగా కూటాలకు వస్తున్న వ్యక్తినీ, ప్రతీ సంఘకూటానికి ఇతర వృద్ధులను కారులో తీసుకొస్తున్న ఒక వృద్ధ విధవరాలినీ, లేదా రాజ్య మందిరాన్ని శుభ్రం చేయడంలో భాగం వహిస్తున్న ఒక టీనేజర్‌నీ ఆయన చూడవచ్చు. ఒక సంఘ పెద్ద తనకు అనేక సంఘ బాధ్యతలున్నప్పటికీ క్షేత్రసేవలో నమ్మకంగా సారథ్యం వహించడాన్ని ఆ బైబిలు విద్యార్థి గమనించవచ్చు. వికలాంగునిగా ఇంటికే పరిమితమైనప్పటికీ తనను సందర్శించే వారికి ఆధ్యాత్మిక ప్రోత్సాహమిచ్చే సాక్షిని ఆయన కలుసుకోవచ్చు. తమ వృద్ధ తల్లిదండ్రులపట్ల శ్రద్ధ చూపించడానికి తమ జీవితాల్లో చెప్పుకోదగ్గ సర్దుబాట్లు చేసుకుంటున్న దంపతులను కూడా ఆ విద్యార్థి గమనించవచ్చు. అలాంటి దయగల, సహాయకరమైన, ఆధారపడదగిన క్రైస్తవులను గమనించడం ద్వారా ఆ కొత్త శిష్యుడు దేవుణ్ణి, పొరుగువారిని, ప్రాముఖ్యంగా తోటి విశ్వాసులను ప్రేమించమని ఇవ్వబడిన క్రీస్తు ఆజ్ఞకు లోబడడమంటే ఏమిటో చూసిన మాదిరినిబట్టి నేర్చుకుంటాడు. (సామెతలు 24:32; యోహాను 13:35; గలతీయులు 6:10; 1 తిమోతి 5:4, 8; 1 పేతురు 5:​2, 3) ఈ విధంగా, సంఘంలోని ప్రతీ సభ్యుడు అటు బోధకునిగా ఇటు మార్గదర్శకునిగా ఉండగలడు, అలా ఉండాలి కూడా.​—⁠మత్తయి 5:16.

“యుగసమాప్తి వరకు”

10 శిష్యులను చేసే పనిలో మనం ఎప్పటి వరకు కొనసాగాలి? యుగసమాప్తి వరకు. (మత్తయి 28:​20) యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞను మనం నెరవేర్చగలమా? ప్రపంచవ్యాప్త సంఘంగా, అలా చేయడానికే మనం తీర్మానించుకున్నాం. గడచిన సంవత్సరాల్లో ‘నిత్యజీవం పట్ల సరైన మానసిక వైఖరిగలవారిని’ కనుగొనేందుకు మనం సంతోషంగా మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని వెచ్చించాం. (అపొస్తలుల కార్యములు 13:​48, NW) ప్రస్తుతం యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా రాజ్య ప్రకటనా పనికి, శిష్యులను చేసే పనికి సంవత్సరం పొడవునా ప్రతీరోజు సగటున 30 లక్షలకంటే ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారు. యేసు మాదిరిని అనుకరిస్తున్నాం కాబట్టే మనమలా చేస్తున్నాం. ఆయనిలా అన్నాడు: ‘నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.’ (యోహాను 4:​34) మన హృదయపూర్వక అభిలాష కూడా అదే. (యోహాను 20:​21) మనకు అప్పగించబడిన పనిని కేవలం ఆరంభించడం కంటే ఎక్కువే చేయాలని మనం అభిలషిస్తాం; అవును దానిని తుదముట్టించాలని మనం కోరుకుంటాం.​—⁠మత్తయి 24:13; యోహాను 17:4.

11 అయితే, మన తోటి విశ్వాసులు కొందరు ఆధ్యాత్మికంగా బలహీనమై తత్ఫలితంగా శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడంలో వెనకబడిపోయారని లేదా ఆగిపోయారని తెలుసుకోవడం మనకు బాధ కలిగిస్తుంది. వాళ్లు సంఘంతో మళ్లీ తమ సహవాసాన్ని పునర్నూతనం చేసుకోవడానికి, శిష్యులను చేయడంలో మళ్లీ తమ వంతు నిర్వహించడానికి మనం సహాయం చేయగల మార్గమేదైనా ఉందా? (రోమీయులు 15:1; హెబ్రీయులు 12:​12) తాత్కాలికంగా బలహీన స్థితిలోవున్న తన అపొస్తలులకు యేసు సహాయం చేసిన విధానం నేడు మనమేమి చేయవచ్చో సూచిస్తోంది.

శ్రద్ధ చూపించండి

12 భూమ్మీద యేసు పరిచర్య ముగిసి, ఆయన మరణం సమీపించినప్పుడు అపొస్తలులు ‘ఆయనను విడిచి పారిపోయారు.’ యేసు ముందే చెప్పినట్లు ‘ఎవరి యింటికి వారు చెదరిపోయారు.’ (మార్కు 14:50; యోహాను 16:​32) ఆధ్యాత్మికంగా బలహీనపడిన తన సహవాసులతో యేసు ఎలా వ్యవహరించాడు? యేసు తాను పునరుత్థానం చేయబడిన కొద్దిరోజులకే తన అనుచరుల్లో కొందరికిలా చెప్పాడు: “భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి.” (మత్తయి 28:​10) అపొస్తలులు తీవ్రమైన బలహీనతలు కనబరచినప్పటికీ, యేసు వారిని “నా సహోదరులు” అని పిలిచాడు. (మత్తయి 12:​49) ఆయన వారిపై ఆశ వదులుకోలేదు. యెహోవా జాలి, క్షమాగుణం చూపించినట్లే, యేసు కూడా వారిపట్ల జాలి, క్షమాగుణం ప్రదర్శించాడు. (2 రాజులు 13:​23) యేసును మనమెలా అనుకరించవచ్చు?

13 పరిచర్యలో వెనకబడిపోయిన లేదా ఆగిపోయిన వారిపట్ల మనం ఎంతో శ్రద్ధ చూపించాలి. ఆ తోటి విశ్వాసులు గతంలో, కొంతమంది బహుశా దశాబ్దాలపాటు ప్రేమపూర్వకంగా చేసిన కార్యాలు మనకింకా జ్ఞాపకమున్నాయి. (హెబ్రీయులు 6:​10) వారి సహచర్య లేమి మనకు తీరనిలోటుగా ఉంది. (లూకా 15:4-7; 1 థెస్సలొనీకయులు 2:​17) అయితే వారిపట్ల మనం నిజంగా ఎలా శ్రద్ధ చూపించవచ్చు?

14 అధైర్యపడిన ఆ అపొస్తలులు గలిలయకు వెళ్లాలనీ వారక్కడ తనను చూస్తారనీ యేసు చెప్పాడు. నిజానికి, ఒక ప్రత్యేకమైన సమావేశానికి రమ్మని యేసు వారిని ఆహ్వానించాడు. (మత్తయి 28:​10) అదే ప్రకారం నేడు, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని క్రైస్తవ సంఘ కూటాలకు హాజరవమని మనం ప్రోత్సహిస్తాం, అలా ఒక్కసారి కాదుగానీ పదేపదే మనం ప్రోత్సహించవలసి ఉంటుంది. అపొస్తలుల విషయంలో ఆ ఆహ్వానం ఫలితాన్నిచ్చింది, ఎందుకంటే ఆ “పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.” (మత్తయి 28:​16) బలహీనులు అదే ప్రకారం మనం ఆప్యాయంగా ఇచ్చిన ఆహ్వానానికి స్పందించి, క్రైస్తవ కూటాలకు హాజరవడం ఆరంభిస్తే మనమెంత ఆనందిస్తామో కదా!​—⁠లూకా 15:6.

15 బలహీనుడైన ఒక క్రైస్తవుడు రాజ్య మందిరానికి వచ్చినప్పుడు మనమెలా స్పందిస్తాం? తనను కలుసుకోవడానికి ఏర్పాటు చేయబడిన స్థలంలో, తాత్కాలికంగా విశ్వాసం బలహీనపడిన అపొస్తలులను చూసినప్పుడు యేసు ఏమిచేశాడు? “యేసు వారియొద్దకు వచ్చి” వారితో మాట్లాడాడు. (మత్తయి 28:​18) ఆయన దూరంగా నిలబడి వారివైపు కోపంగా చూడలేదు గానీ వారివద్దకే వెళ్లాడు. యేసు అలా చొరవ తీసుకున్నప్పుడు అపొస్తలులు ఎంత హాయిగా ఊపిరి పీల్చుకొని ఉంటారో ఊహించండి. అలాగే మనం కూడా చొరవ తీసుకొని, క్రైస్తవ సంఘానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆధ్యాత్మిక బలహీనులను ఆప్యాయంగా ఆహ్వానిద్దాం.

16 యేసు ఇంకా ఏమిచేశాడు? మొదటిగా ఆయన వారికిలా చెప్పాడు: “నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” రెండవదిగా, ఆయన వారికొక పని అప్పగిస్తూ ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” మూడవదిగా, ఆయన వారికిలా వాగ్దానం చేశాడు: “సదాకాలము మీతో కూడ ఉన్నాను.” అయితే యేసు ఏమి చేయలేదో మీరు గమనించారా? ఆయన వారి వైఫల్యాలనుబట్టి, సందేహాలనుబట్టి వారిని గద్దించలేదు. (మత్తయి 28:​17) ఆయన వైఖరి ఫలవంతంగా ఉందా? ఉంది. త్వరలోనే అపొస్తలులు మళ్లీ “బోధించుచు, . . . ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:​42) బలహీనులను ఎలా దృష్టించాలి, వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో యేసు మాదిరిని అనుకరించడం ద్వారా, మన స్థానిక సంఘంలో మనం కూడా అలాంటి ఉత్తేజకరమైన ఫలితాలనే చూడవచ్చు. *​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

‘సదాకాలము మీతో కూడ ఉన్నాను’

17 యేసు ఆజ్ఞలోని ‘సదాకాలము మీతో కూడ ఉన్నాను’ అనే ఆ చివరి మాటలు, శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి కృషిచేసే వారందరినీ బలపరుస్తాయి. మన రాజ్య ప్రకటనా పనికి విరోధులు ఎంత వ్యతిరేకత తెచ్చినా, మనపై ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేసినా మనకు భయపడడానికి కారణమే లేదు. ఎందుకు? ‘పరలోకమందును భూమిమీదను సర్వాధికారంగల’ మన నాయకుడైన యేసు మనకు మద్దతు ఇచ్చేందుకు మనకు తోడుగా ఉన్నాడు.

18‘సదాకాలము మీతో కూడ ఉన్నాను’ అని యేసు చేసిన వాగ్దానం కూడా గొప్ప ఓదార్పునిస్తుంది. శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి మనం కృషి చేస్తుండగా, ఆనందాన్నే కాదు మనం కష్టాలు కూడా అనుభవిస్తాం. (2 దినవృత్తాంతములు 6:​29) మనలో కొందరు తమ ప్రియమైన వారి మరణంవల్ల కలిగే దుఃఖాన్ని సహించాల్సి ఉంటుంది. (ఆదికాండము 23:2; యోహాను 11:​33-36) మరికొందరు ఆరోగ్యం, బలం క్షీణించే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నారు. (ప్రసంగి 12:​1-6) మానసిక కృంగుదల కారణంగా ఇంకొందరు ధైర్యం కోల్పోతున్నారు. (1 థెస్సలొనీకయులు 5:​14) మనలో అంతకంతకూ ఎక్కువమంది తీవ్ర ఆర్థిక ఇక్కట్లను అనుభవిస్తున్నాము. అలాంటి సవాళ్లున్నప్పటికీ, మన జీవితపు విషాదకర కాలాలతోసహా ‘సదాకాలము’ యేసు మనతో ఉన్నందువల్లే మన పరిచర్యలో విజయం సాధిస్తున్నాం.​—⁠మత్తయి 11:28-30.

19 దీనిలో, దీని ముందరి ఆర్టికల్‌లో మనం చూసినట్లుగా, శిష్యులను చేయుమని యేసు ఇచ్చిన ఆజ్ఞలో ప్రతీ అంశం ఇమిడివుంది. ఆయన ఆజ్ఞను మనం ఎందుకు, ఎక్కడ నెరవేర్చాలో యేసు మనకు చెప్పాడు. అలాగే మనం ఏమి బోధించాలో ఎప్పటి వరకు బోధించాలో కూడా ఆయన మనకు చెప్పాడు. నిజమే, ఈ గొప్ప ఆజ్ఞను నెరవేర్చడం ఒక సవాలే. అయితే క్రీస్తు అధికారపు మద్దతు మనకు అండగా, ఆయన ప్రత్యక్షత మనకు తోడుగా ఉంది కాబట్టి మనం దానిని నెరవేర్చగలం! ఈ విషయాన్ని మీరు అంగీకరించరా?

[అధస్సూచీలు]

^ పేరా 6 ఒక రెఫరెన్సు గ్రంథం, యేసు, “వారికి బాప్తిస్మమిచ్చుచు . . . వారికి బోధించుడి” అనే చెప్పాడు గానీ ‘వారికి బాప్తిస్మమిచ్చి ఆ తర్వాత వారికి బోధించుడి’ అని చెప్పలేదనే వాస్తవాన్ని సూచిస్తోంది. కాబట్టి బాప్తిస్మమిస్తూ బోధించమని ఆయనిచ్చిన ఆజ్ఞ “ఖచ్చితంగా . . . వెంటవెంట జరిగేవి కావు.” బదులుగా “బోధించడమనేది కొనసాగే ప్రక్రియ, అది కొంతమేరకు బాప్తిస్మానికి ముందు . . . కొంతమేరకు బాప్తిస్మం తర్వాత జరుగుతుంది.”

^ పేరా 22 బలహీనులనెలా దృష్టించాలి, వారికెలా సహాయం చేయాలి అనే విషయంలో అదనపు సమాచారాన్ని కావలికోట ఫిబ్రవరి 1, 2003, 15-18 పేజీల్లో చూడవచ్చు.

మీరెలా జవాబిస్తారు?

యేసు ఆజ్ఞాపించినది గైకొనేలా ఇతరులకు మనమెలా బోధిస్తాం?

సంఘంలోని ఇతరుల నుండి కొత్త శిష్యులు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

ఆధ్యాత్మికంగా బలహీనులైన వారికి సహాయం చేయడానికి మనమేమి చేయవచ్చు?

‘సదాకాలము మీతో కూడ ఉన్నాను’ అని యేసు చేసిన వాగ్దానం నుండి మనమెలాంటి బలాన్ని, ఓదార్పును పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. శిష్యుడైన ఫిలిప్పుకు, ఐతియోపీయునికి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది?

2. (ఎ) ఐతియోపీయుడు ఇచ్చిన జవాబు ఏ విధంగా అర్థవంతమైనది? (బి) శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు సంబంధించిన ఏ ప్రశ్నలను మనం పరిశీలిస్తాం?

3. (ఎ) ఒక వ్యక్తి ఎలా యేసుక్రీస్తు శిష్యుడవుతాడు? (బి) శిష్యులను చేయడంలో ఏమి బోధించడం కూడా ఇమిడివుంది?

4. (ఎ) ఆజ్ఞను గైకొనడం అంటే దానర్థమేమిటి? (బి) క్రీస్తు ఆజ్ఞలు గైకొనడానికి ఒక వ్యక్తికి మనమెలా బోధిస్తామో సోదాహరణంగా వివరించండి.

5. మనం బైబిలు అధ్యయనం చేస్తున్న వ్యక్తి శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు లోబడడానికి ఎందుకు వెనుకంజ వేయవచ్చు?

6. (ఎ) బైబిలు విద్యార్థికి సహాయం చేస్తున్నప్పుడు మనం ఫిలిప్పు మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (బి) బైబిలు విద్యార్థి ప్రకటనా పనిలో భాగం వహించడం ఆరంభించినప్పుడు మనం మన శ్రద్ధను ఎలా చూపించవచ్చు?

7. ‘వాటినన్నిటిని గైకొనవలెనని’ ఇతరులకు బోధించడంలో వారికి ఏ ఆజ్ఞలు బోధించడం ఇమిడివుంది?

8. ప్రేమ చూపించమని ఇవ్వబడిన ఆజ్ఞను కొత్త విద్యార్థికి ఎలా బోధించవచ్చో సోదాహరణంగా చెప్పండి.

9. ప్రేమ చూపించమని ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడడమంటే ఏమిటో ఒక కొత్త శిష్యుడెలా నేర్చుకుంటాడు?

10. (ఎ) శిష్యులను చేసే పనిలో మనం ఎప్పటి వరకు కొనసాగుతాం? (బి) నియామకాలు నెరవేర్చే విషయంలో యేసు ఎలాంటి మాదిరిని ఉంచాడు?

11. మన క్రైస్తవ సహోదర సహోదరీల్లో కొందరికి ఏమి సంభవించింది, మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

12. (ఎ) యేసు మరణానికి ముందు, ఆయన అపొస్తలులు ఏమిచేశారు? (బి) యేసు తన అపొస్తలులు తీవ్రమైన బలహీనతలను కనబరచినప్పటికీ వారితో ఎలా వ్యవహరించాడు?

13. ఆధ్యాత్మికంగా బలహీనపడిన వారిని మనమెలా దృష్టించాలి?

14. యేసును అనుకరిస్తూ, బలహీనుడైన వ్యక్తికి మనమెలా సహాయం చేయవచ్చు?

15. మన కూటాలకు వచ్చే బలహీనులను ఆహ్వానించడంలో మనమెలా యేసు మాదిరిని అనుకరించగలం?

16. (ఎ) యేసు తన అనుచరులతో వ్యవహరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) బలహీనుల గురించి యేసుకున్న దృక్కోణాన్ని మనమెలా ప్రతిబింబించవచ్చు? (అధస్సూచి చూడండి.)

17, 18. ‘సదాకాలము మీతో కూడ ఉన్నాను’ అనే యేసు మాటల్లో బలపరిచే ఎలాంటి తలంపులున్నాయి?

19. (ఎ) శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞలో ఎలాంటి ఆదేశాలున్నాయి? (బి) క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చడానికి మనలను ఏది శక్తిమంతులను చేస్తుంది?

[15వ పేజీలోని చిత్రాలు]

మనం బోధకులుగానూ మార్గదర్శకులుగానూ ఉండాలి

[17వ పేజీలోని చిత్రాలు]

ఇతరులు చూపించే మాదిరి నుండి కొత్త శిష్యులు విలువైన పాఠాలు నేర్చుకుంటారు