కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన సమస్యలకు దేవుడు బాధ్యుడా?

మన సమస్యలకు దేవుడు బాధ్యుడా?

మన సమస్యలకు దేవుడు బాధ్యుడా?

మెరీన్‌ పెద్ద కూతురు మెదడుకు తీవ్రంగా గాయమైనప్పుడు, మనలో చాలామంది చేసినట్లే ఆమె కూడా చేసింది. * సహాయం కోసం దేవునికి ప్రార్థించింది. “ఇంతకు ముందెప్పుడూ ఇంతటి నిస్సహాయతను, ఒంటరితనాన్ని అనుభవించినట్లు నాకు గుర్తులేదు” అని మెరీన్‌ అంటోంది. ఆ తర్వాత తన కూతురు పరిస్థితి క్షీణించినప్పుడు, “ఎందుకిలా జరుగుతోంది?” అని ఆమె దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభించింది. ప్రేమగల, శ్రద్ధచూపే దేవుడు తన చెయ్యినెలా విడువగలిగాడో ఆమె అర్థం చేసుకోలేకపోయింది.

మెరీన్‌ అనుభవం అసాధారణమైనదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమకు సహాయం అవసరమైనప్పుడే దేవుడు తమను విడిచిపెట్టినట్లు భావించారు. లీసా తన మనమడు హత్యకు గురైన తర్వాత ఇలా అంటోంది: “‘దేవా, ఎందుకిలా జరిగింది వంటి ప్రశ్నలతో’ మదనపడుతూనే ఉన్నాను. దేవునిపై నా నమ్మకం పూర్తిగా పోలేదు, కానీ సన్నగిల్లింది.” అదేవిధంగా, పసివాడైన తన కుమారునికి సంబంధించి హఠాత్తుగా విషాదం ఎదురైనప్పుడు, ఒక స్త్రీ ఇలా అంది: “జరిగిన సంఘటన విషయంలో దేవుడు నాకు ఏ విధమైన ఓదార్పూ ఇవ్వలేదు. ఆయన నా పట్ల ఎలాంటి శ్రద్ధ, దయ చూపలేదు.” చివరికి ఆమె ఇలా అంది: “నేను దేవుణ్ణి క్షమించలేను.”

మరికొందరు తమచుట్టూవున్న ప్రపంచాన్ని చూసినప్పుడు దేవునిపట్ల కోపం పెంచుకుంటారు. బీదరికంతో, ఆకలితో, దిక్కుతోచని స్థితిలోవున్న యుద్ధ శరణార్థులతో, ఎయిడ్స్‌వల్ల అనాథలైన అసంఖ్యాకులైన పిల్లలతో, ఇతర వ్యాధులవల్ల పీడించబడుతున్న లక్షలాదిమందితో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశాలను వారు చూస్తున్నారు. వీటితోపాటు ఇంకా ఇలాంటి విషాదాలే జరుగుతుండడంతో చాలామంది దేనినీ పట్టించుకోనట్లు అనిపిస్తున్నందుకు దేవుణ్ణి నిందిస్తారు.

అయితే వాస్తవానికి, మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యలకు దేవుడు నిందార్హుడు కాడు. బదులుగా, మానవ కుటుంబానికి వచ్చిన ఈ సమస్యలను దేవుడు త్వరలోనే తొలగిస్తాడని నమ్మడానికి తగిన కారణాలు ఉన్నాయి. తర్వాతి ఆర్టికల్‌ ద్వారా, దేవునికి మనపట్ల నిజంగా శ్రద్ధవుందని తెలుసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

[అధస్సూచి]

^ పేరా 2 పేర్లు మార్చబడ్డాయి.