కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు వెళ్లి శిష్యులను చేయుడి’

‘మీరు వెళ్లి శిష్యులను చేయుడి’

‘మీరు వెళ్లి శిష్యులను చేయుడి’

“పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.”—మత్తయి 28:18, 19.

అది ఇశ్రాయేలు దేశం, సా.శ. 33వ సంవత్సరంలో వసంత రుతువులో ఒకరోజు, యేసు శిష్యులు గలిలయలో ఒక కొండపై సమకూడారు. పునరుత్థానం చేయబడిన వారి ప్రభువు త్వరలోనే పరలోకానికి ఆరోహణమవుతాడు, అయితే దానికి ముందుగా ఆయన వారికి చెప్పవలసిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. యేసు వారికి ఒక పని అప్పగించాలి. ఏమిటా పని? ఆ పనికి ఆయన శిష్యులు ఎలా స్పందించారు? వారికి అప్పగించబడిన ఆ పని నేడు మనకెలా వర్తిస్తుంది?

2 యేసు వారికి చెప్పింది మత్తయి 28:18-20లో ఇలా నమోదు చేయబడింది: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” ఇక్కడ యేసు “సర్వాధికారము,” “సమస్తజనులు,” ‘ఆజ్ఞాపించినవన్ని,’ “సదాకాలము” వంటివాటి గురించి మాట్లాడాడు. అన్ని విషయాలకు సంబంధించిన ఆ నాలుగు మాటలున్న ఆయన ఆజ్ఞలు కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలను లేవదీస్తాయి, వాటిని ఎందుకు? ఎక్కడ? ఏమిటి? ఎప్పుడు? అనే నాలుగు సంక్షిప్త ప్రశ్నలుగా విభజించవచ్చు. ఆ ప్రశ్నలను ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. *

“నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది”

3 మొదట మనం, శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞకు ఎందుకు లోబడాలి? యేసు ఇలా చెప్పాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” “కాబట్టి” అనే మాట మనమీ ఆజ్ఞకు ఎందుకు లోబడాలో ఒక పెద్ద కారణాన్ని సూచిస్తోంది. ఎందుకంటే ఆ ఆజ్ఞ ఇచ్చిన యేసుకు “సర్వాధికారము” ఇవ్వబడింది. ఆయన అధికారం ఎంత విస్తృతమైనది?

4 యేసుకు తన సంఘంపై అధికారముంది, 1914 నుండి ఆయనకు కొత్తగా స్థాపించబడిన దేవుని రాజ్యంపై కూడా అధికారం లభించింది. (కొలొస్సయులు 1:13; ప్రకటన 11:​15) ఆయన ప్రధాన దూత, అందుకే కోట్లకొలది దేవదూతల పరలోక సైన్యం ఆయన ఆధ్వర్యంలో ఉంది. (1 థెస్సలొనీకయులు 4:16; 1 పేతురు 3:22; ప్రకటన 19:​14-16) నీతి సూత్రాలను వ్యతిరేకించే ‘సమస్త ఆధిపత్యాన్ని, సమస్త అధికారాన్ని, బలాన్ని కొట్టివేసే’ అధికారం ఆయన తండ్రి ఆయనకిచ్చాడు. (1 కొరింథీయులు 15:24-26; ఎఫెసీయులు 1:​20-23) యేసుకు ఇవ్వబడిన అధికారం సజీవులకు మాత్రమే పరిమితం చేయబడలేదు. ఆయన ‘సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా’ కూడా ఉన్నాడు, పైగా చనిపోయిన వారిని పునరుత్థానంచేసే అధికారాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 10:42; యోహాను 5:​26-28) నిశ్చయంగా అలాంటి విస్తృత అధికారంగల వ్యక్తి ఇచ్చిన ఆజ్ఞను అత్యంత ప్రాముఖ్యమైనదిగా దృష్టించాలి. అందువల్ల, “మీరు వెళ్ళి . . . శిష్యులనుగా చేయుడి” అని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు మనం గౌరవపూర్వకంగా, ఇష్టపూర్వకంగా లోబడతాం.

5 యేసు తన భూ పరిచర్య ఆరంభంలో, తన అధికారాన్ని గుర్తించి తన ఆజ్ఞలకు లోబడడం ఆశీర్వాదాలనిస్తుందని తన శిష్యుల మనస్సులో నాటుకునేలా వారికి బోధించాడు. జాలరియైన పేతురుతో ఆయన ఒకసారిలా అన్నాడు: “దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి.” ఖచ్చితంగా అక్కడ చేపలు లేవని తెలిసిన పేతురు యేసుతో ఇలా అన్నాడు: “ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు.” అయితే, పేతురు వినయంగా ఇంకా ఇలా అన్నాడు: “అయినను నీ మాట చొప్పున వలలు వేతును.” అలా పేతురు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు లోబడిన తర్వాత ఆయన “విస్తారమైన చేపలు” పట్టాడు. పేతురు భయపడి “యేసు మోకాళ్లయెదుట సాగిలపడి​—⁠ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని” అన్నాడు. దానికి యేసు “భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు” అని బదులిచ్చాడు. (లూకా 5:1-10; మత్తయి 4:​18) ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకుంటాం?

6 ఆశ్చర్యం కలిగించిన విధంగా చేపలు పట్టడానికి ముందు కాదుగానీ ఆ తర్వాతనే యేసు పేతురు, అంద్రెయ, ఇతర అపొస్తలులకు ‘మనుష్యులను పట్టు జాలరులయ్యే’ పని అప్పగించాడు. (మార్కు 1:​16, 17) గుడ్డిగా తనకు లోబడమని యేసు కోరడం లేదని స్పష్టమవుతోంది. ఆయన తన మాటకు వారు ఎందుకు లోబడాలనే దానికి ఒప్పింపజేసే కారణాన్ని ఇచ్చాడు. వలలు వేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడడమెలా విస్మయం కలిగించే ఫలితాలు తీసుకువచ్చిందో అలాగే ‘మనుష్యులను పట్టమని’ యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడడం గొప్ప ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. పూర్ణ విశ్వాసంతో అపొస్తలులు ప్రతిస్పందించారు. ఆ వృత్తాంతమిలా ముగుస్తోంది: “వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” (లూకా 5:​11) నేడు మనం శిష్యులనుచేసే పనిలో భాగం వహించమని ఇతరులను ప్రోత్సహిస్తున్నప్పుడు, మనం యేసును అనుకరిస్తాం. ప్రజలు కేవలం మనం చెప్పినట్లు చేయాలని కోరం గానీ, క్రీస్తు ఆజ్ఞకు విధేయులవడానికి ఒప్పింపజేసే కారణాలను మనం వారికి చూపిస్తాం.

ఒప్పింపజేసే కారణాలు, సరైన ఉద్దేశాలు

7 మనం క్రీస్తు అధికారాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి, రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులనుచేసే పనిలో మనం భాగం వహిస్తున్నాం. సత్క్రియలు చేయమని మనం ఎవరిని పురికొల్పాలని కోరుకుంటామో, వారితో మనం చేస్తున్న పనికి సంబంధించిన ఏ ఇతర లేఖనాధారిత కారణాలను పంచుకోవచ్చు? వివిధ దేశాల్లోని సాక్షులు చెప్పిన ఈ క్రింది మాటలను గమనించి, ఉదహరించబడిన లేఖనాలు వారి వ్యాఖ్యానాలను ఎలా బలపరుస్తున్నాయో పరిశీలించండి.

8 రాయ్‌ 1951లో బాప్తిస్మం తీసుకున్నాడు: “నేను యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, ఎల్లప్పుడూ ఆయననే సేవిస్తానని వాగ్దానం చేశాను. ఆ మాట నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను.” (కీర్తన 50:14; మత్తయి 5:​37) హీథెర్‌ 1962లో బాప్తిస్మం తీసుకుంది: “నా కోసం యెహోవా చేసినదంతా ఆలోచించినప్పుడు, ఆయనకు నా సంపూర్ణ సేవ ద్వారా ఆయనపట్ల నా కృతజ్ఞతను చూపించాలని కోరుకుంటున్నాను.” (కీర్తన 9:1, 9-11; కొలొస్సయులు 3:​15) హానలోర 1954లో బాప్తిస్మం తీసుకుంది: “మనం పరిచర్యలో ఉన్న ప్రతీసారి, మనకు దేవదూతల మద్దతు ఉంటుంది​—⁠అదెంత ఆధిక్యతో కదా!” (అపొస్తలుల కార్యములు 10:30-33; ప్రకటన 14:​6, 7) ఆనర్‌ 1969లో బాప్తిస్మం తీసుకుంది: “యెహోవా తీర్పు తీర్చే ఘడియ వచ్చినప్పుడు, ఆయనా ఆయన సాక్షులూ నిర్లక్ష్యపరులనీ, ‘నాకసలు హెచ్చరికే లభించలేదనీ’ మా ఇరుగుపొరుగు వారెవరూ ఆక్షేపించకూడదని నేను కోరుకుంటున్నాను.” (యెహెజ్కేలు 2:5; 3:17-19; రోమీయులు 10:​16, 18) క్లాడియో 1974లో బాప్తిస్మం తీసుకున్నాడు: “మనం ప్రకటిస్తున్నప్పుడు, ‘దేవునియెదుట,’ ‘క్రీస్తునందు’ లేదా క్రీస్తు సహవాసంలో ఉంటాం. దానిని ఒక్కసారి ఊహించండి! మనం పరిచర్యలో ఉన్నప్పుడు మన అత్యుత్తమ స్నేహితుల సహవాసాన్ని ఆస్వాదిస్తాం.”​—⁠2 కొరింథీయులు 2:17. *

9 అద్భుత రీతిలో చేపలు పట్టడానికి సంబంధించిన ఆ వృత్తాంతం క్రీస్తుకు లోబడే విషయంలో సరైన ప్రేరణను అంటే ప్రేమను కలిగివుండే ప్రాముఖ్యతను సూచిస్తోంది. “నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని” పేతురు అన్నప్పుడు, యేసు అలా విడిచి వెళ్లిపోలేదు లేదా అతనిలో ఏదైనా పాపముందని పేతురును ఖండించనూ లేదు. (లూకా 5:⁠8) పేతురు తనను వెళ్లిపొమ్మన్నందుకు యేసు ఆయనను విమర్శించనూ లేదు. దానికి భిన్నంగా, యేసు ప్రేమపూర్వకంగా “భయపడకుము” అని అన్నాడు. మరణకరమైన భయంతో క్రీస్తుకు లోబడడం సరైన ప్రేరణగా ఉండదు. దానికి బదులు పేతురు, ఆయన సహవాసులు ప్రయోజనకరమైన మనుష్యులను పట్టు జాలరులవుతారని యేసు పేతురుతో చెప్పాడు. నేడు, మనం కూడా క్రీస్తుకు లోబడేలా బలవంతం చేయడానికి ఇతరులపై భయం లేదా అపరాధభావం, సిగ్గు వంటి ప్రతికూల భావాలను ప్రయోగించం. దేవునిపట్ల, క్రీస్తుపట్లగల ప్రేమపై ఆధారపడిన పూర్ణాత్మ విధేయత మాత్రమే యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది.​—⁠మత్తయి 22:37.

“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి”

10 క్రీస్తు ఆజ్ఞకు సంబంధించి లేవదీయబడిన రెండవ ప్రశ్నేమిటంటే, శిష్యులనుచేసే ఈ పనిని ఎక్కడ చెయ్యాలి? యేసు తన శిష్యులకిలా చెప్పాడు: “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” యేసు పరిచర్య కాలానికి పూర్వం, అన్యజనులు యెహోవాను సేవించడానికి ఇశ్రాయేలుకు వస్తే వారు సాదరంగా ఆహ్వానించబడేవారు. (1 రాజులు 8:​41-43) యేసు ప్రాథమికంగా సహజ యూదులకే ప్రకటించాడు, కానీ ఆయనిప్పుడు తన అనుచరులతో సమస్త అన్యజనుల దగ్గరకు వెళ్లమని చెప్పాడు. నిజానికి ఆయన శిష్యులకున్న చేపలు పట్టే ప్రాంతం లేదా ప్రకటనా క్షేత్రం చిన్న “కొలనుకు” అంటే సహజ యూదులకు మాత్రమే పరిమితమైంది, కానీ అది త్వరలోనే మానవజాతి అనే “సముద్రం” అంతటికీ విస్తరిస్తుంది. ఈ మార్పు శిష్యులకు ఒక సవాలుగా ఉన్నప్పటికీ, వారు యేసు ఆదేశానికి ఇష్టపూర్వకంగా లోబడ్డారు. యేసు మరణించి 30 సంవత్సరాలు కాకముందే, సువార్త కేవలం యూదులకే కాదుగానీ “ఆకాశము క్రింద ఉన్న సమస్తసృష్టికి” ప్రకటించబడిందని అపొస్తలుడైన పౌలు వ్రాయగలిగాడు.​—⁠కొలొస్సయులు 1:23.

11 ఇటీవలి కాలాల్లో ప్రకటనా క్షేత్రంలో అలాంటి విస్తరణే జరిగింది. 20వ శతాబ్దారంభంలో ‘చేపలు పట్టే ప్రాంతాలు’ కేవలం కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. అయినప్పటికీ, ఆ కాలంలోని క్రైస్తవులు మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరిని అనుకరించి తాము ప్రకటించాల్సిన క్షేత్రాన్ని ఆసక్తితో విస్తరింపజేశారు. (రోమీయులు 15:​20) 1930 దశాబ్దపు ఆరంభానికి వారు దాదాపు వంద దేశాల్లో శిష్యులను తయారుచేస్తూ ఉన్నారు. నేడు ‘చేపలు పట్టే ప్రాంతాలు’ 235 దేశాలకు విస్తరించాయి.​—⁠మార్కు 13:10.

‘ఆయా భాషలు మాటలాడే వారి నుండి’

12 సమస్త జనులను శిష్యులను చేయడం ఆయా ప్రాంతాల విస్తీర్ణతనుబట్టే కాకుండా భాషాపరంగా కూడా ఒక సవాలే. జెకర్యా ప్రవక్త ద్వారా యెహోవా ముందుగానే ఇలా చెప్పాడు: ‘ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని​—⁠దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.’ (జెకర్యా 8:​23) ఈ ప్రవచనంయొక్క విస్తృత నెరవేర్పులో ‘యూదుడు’ అభిషిక్త క్రైస్తవుల శేషానికి ప్రతీకగా ఉండగా, “పదేసిమంది” ‘గొప్పసమూహానికి’ ప్రతీకగా ఉన్నారు. * (ప్రకటన 7:9, 10; గలతీయులు 6:​16) ఈ గొప్పసమూహానికి చెందిన క్రీస్తు శిష్యులు అనేక దేశాల్లో ఉన్నారు, జెకర్యా పేర్కొన్నట్లుగానే, వాళ్ళు అనేక భాషలు మాట్లాడతారు. మరి దేవుని ప్రజల ఆధునిక చరిత్ర శిష్యులకు సంబంధించిన ఆ అంశాన్ని ఉదహరిస్తోందా? ఖచ్చితంగా!

13 ప్రపంచవ్యాప్తంగా 1950వ సంవత్సరంలో యెహోవాసాక్షుల్లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురి మాతృభాష ఇంగ్లీషు. 1980వ సంవత్సరానికల్లా ఆ నిష్పత్తి ప్రతీ ఐదుగురిలో ఇద్దరిగా మారింది, కానీ నేడు ప్రతీ ఐదుగురిలో ఒక్కరిదే ఇంగ్లీషు మాతృభాషగా ఉంది. భాషాపరమైన ఈ మార్పుకు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎలా ప్రతిస్పందించాడు? అంతకంతకు ఎక్కువ భాషల్లో ఆధ్యాత్మిక ఆహారం అందించడం ద్వారానే. (మత్తయి 24:​45) ఉదాహరణకు, 1950లో మన సాహిత్యాలు 90 భాషల్లో ప్రచురించబడేవి, కానీ నేడు ఆ సంఖ్య దాదాపు 400లకు పెరిగింది. వివిధ భాషా ప్రజలపట్ల అధికంగా చూపించబడిన ఈ శ్రద్ధకు తగిన ఫలితాలు లభించాయా? లభించాయి! ‘ఆయా భాషల’ నుండి సంవత్సరం పొడవునా ప్రతీ వారం సగటున దాదాపు 5,000 మంది క్రీస్తు శిష్యులవుతున్నారు. (ప్రకటన 7:⁠9) ఆ పెరుగుదల అలా కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో “వలల” నిండుగా చేపలు లభిస్తున్నాయి!​—⁠లూకా 5:6; యోహాను 21:6.

ప్రతిఫలదాయకమైన పరిచర్య—⁠మీరు దానిలో భాగంవహించగలరా?

14 అనేక పాశ్చాత్త్య దేశాల్లో ప్రవాసుల రాక తమ స్వదేశంలోనే ‘ఆయా భాషలు’ మాట్లాడే ప్రజలను శిష్యులను తయారుచేసే సవాలును ముందుంచింది. (ప్రకటన 14:⁠6) మన సేవా ప్రాంతంలోనే మనదికాని భాష మాట్లాడే వారికి మనమెలా సహాయం చేయవచ్చు? (1 తిమోతి 2:⁠4) అలంకారికంగా చెప్పాలంటే, వారికి తగిన వలను మనం ఉపయోగించవచ్చు. అలాంటి వ్యక్తులకు వారు మాట్లాడే భాషలో సాహిత్యాలు అందించాలి. సాధ్యమైతే వారి భాషే మాట్లాడే సాక్షి వారిని సందర్శించేలా ఏర్పాటు చేయాలి. (అపొస్తలుల కార్యములు 22:⁠2) అలాంటి ఏర్పాట్లు చేయడం ఇప్పుడు సులభమే, ఎందుకంటే చాలామంది సాక్షులు క్రీస్తు శిష్యులయ్యేందుకు పరదేశులకు సహాయం చేయడానికి తమ మాతృ భాషకు తోడుగా మరో భాషను కూడా నేర్చుకున్నారు. ఈ విధంగా సహాయం చేయడం ప్రతిఫలదాయక అనుభవంగా ఉన్నట్లు నివేదికలు చూపిస్తున్నాయి.

15 నెదర్లాండ్స్‌లోని రెండు ఉదాహరణలు పరిశీలించండి, అక్కడ రాజ్య ప్రకటనా పని 34 భాషల్లో జరుగుతోంది. పోలిష్‌ భాషా ప్రవాసులను శిష్యులను చేయడానికి ఒక సాక్షి దంపతులు ముందుకొచ్చారు. వారి ప్రయత్నాలకు ప్రతిస్పందన ఎంత అధికంగా ఉందంటే, ఆసక్తి చూపుతున్న వారితో బైబిలు అధ్యయనం చేయడానికి వీలుగా భర్త వారంలో మరో రోజు కూడా తన ఉద్యోగానికి సెలవు పెట్టాలని భావించేలా పురికొల్పబడ్డాడు. త్వరలోనే ఆ దంపతులు ప్రతీ వారం 20 కంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం ఆరంభించారు. వారిలా అంటున్నారు: “మా పరిచర్య మాకెంతో సంతోషాన్నిస్తోంది.” బైబిలు సత్యాలను తమ సొంత భాషలో వినేవారు తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేసేందుకు పురికొల్పబడినప్పుడు శిష్యులను తయారుచేసేవారు విశేషంగా ఎంతో సంతోషిస్తారు. ఉదాహరణకు, వియత్నామీ భాషలో కూటం జరుగుతున్న సమయంలో, ఒక వృద్ధుడు లేచి నిలబడి మాట్లాడేందుకు అనుమతించాల్సిందిగా కోరాడు. కళ్లనిండా నీళ్లతో ఆయన సాక్షులకిలా చెప్పాడు: “కష్టమైన మా భాష నేర్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు నా ధన్యవాదాలు. నా వృద్ధాప్యంలో బైబిలు నుండి అనేక అద్భుత సంగతులను నేర్చుకొంటున్నందుకు నేనెంతో కృతజ్ఞుడనై ఉన్నాను.”

16 కాబట్టి వేరే భాషా సంఘాల్లో సేవచేస్తున్న వారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతున్నారంటే దానిలో ఆశ్చర్యమేమీ లేదు. బ్రిటన్‌లోని ఒక దంపతులు ఇలా చెప్పారు: “మా 40 ఏళ్ల రాజ్య సేవలో వేరే భాషా క్షేత్రంలో చేసిన సేవ అత్యంత ఉల్లాసభరితమైన ఒక అనుభవంగా ఉంది.” ఈ ఉత్తేజకరమైన పరిచర్యలో భాగం వహించడానికి మీ పరిస్థితులను మీరు సవరించుకోగలరా? మీరింకా పాఠశాల విద్యార్థులైతే, ఇలాంటి పరిచర్య నిమిత్తం సిద్ధపడేందుకు వేరే భాషను మీరు నేర్చుకోగలరా? అలా నేర్చుకోవడం, మీకు ఆశీర్వాదాలు నిండిన ప్రతిఫలదాయకమైన జీవితానికి అవకాశం కల్పించవచ్చు. (సామెతలు 10:​22) ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో ఎందుకు చర్చించకూడదు?

మన విధానాలు మార్చుకోవడం

17 మనలో చాలామందికి వేరే భాషా క్షేత్రాల్లో “వలలు” వేయడానికి పరిస్థితులు అనుమతించకపోవచ్చనే విషయం అర్థం చేసుకోదగినదే. అయితే, మన సంఘ సేవా ప్రాంతంలోనే మనం ప్రస్తుతం కలుస్తున్న ప్రజలకంటే మరెక్కువ మందిని మనం కలుసుకొనే అవకాశముంది. ఎలా? మన సందేశాన్ని మార్చడం ద్వారా కాదుగానీ మన విధానాలు మార్చుకోవడం ద్వారానే. చాలా ప్రాంతాల్లో అంతకంతకు ఎక్కువమంది అధిక భద్రతగల భవనాల్లో నివసిస్తున్నారు. ఇంటింటి పరిచర్యలో మనం ఇళ్లకు వెళ్లినప్పుడు చాలామంది ఇళ్లల్లో ఉండడంలేదు. అందువల్ల మనం విభిన్న సమయాల్లో, విభిన్న ప్రాంతాల్లో “వలలు” వేయాల్సి ఉంటుంది. అలాచేస్తే మనం యేసును అనుకరించిన వారమవుతాం. వివిధ పరిస్థితుల్లోవున్న ప్రజలతో మాట్లాడేందుకు ఆయన మార్గాలు అన్వేషించాడు.​—⁠మత్తయి 9:9; లూకా 19:1-10; యోహాను 4:6-15.

18 ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రజలెక్కడ తారసపడితే అక్కడ సాక్ష్యమివ్వడం శిష్యులను చేసే ముఖ్య విధానంగా ఉంది. శిష్యులను చేయడంలో అనుభవజ్ఞులైనవారు వివిధ ప్రాంతాల్లో సాక్ష్యమివ్వడానికి మరింత శ్రద్ధ చూపుతున్నారు. ప్రచారకులు ఇప్పుడు ఇంటింటి పరిచర్యలో భాగం వహించడంతోపాటు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, దుకాణాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, బస్‌ స్టాపులు, వీధులు, పార్కులు, బీచ్‌లు తదితర ప్రాంతాల్లో సాక్ష్యమిస్తున్నారు. హవాయిలో కొత్తగా బాప్తిస్మం తీసుకున్న చాలామంది సాక్షులు మొదట అలాంటి ప్రాంతాల్లో కలిసిన వారే. వివిధ విధానాలు చేపట్టడం శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠1 కొరింథీయులు 9:22, 23.

19 యేసు తన శిష్యులకు అప్పగించిన పనిలో ఆ పనిని ఎందుకు, ఎక్కడ చేయాలనే వివరాలు మాత్రమే కాదుగానీ మనం ఏమి ప్రకటించాలి ఎప్పటి వరకు మనమలా చేస్తూనే ఉండాలి అనే వివరాలు కూడా ఇమిడివున్నాయి. యేసు మనకిచ్చిన ఆజ్ఞలోని ఈ రెండు అంశాలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఈ ఆర్టికల్‌లో మనం మొదటి రెండు ప్రశ్నలను పరిశీలిస్తాం. మిగిలిన రెండు ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

^ పేరా 12 ప్రకటించడానికి గల అదనపు కారణాలు సామెతలు 10:5; ఆమోసు 3:8; మత్తయి 24:42; మార్కు 12:17; రోమీయులు 1:14, 15లో ఉన్నాయి.

^ పేరా 18 ఈ ప్రవచన నెరవేర్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన కావలికోట మే 15, 2001, 12వ పేజీ, యెషయా ప్రవచనం​—⁠సర్వమానవాళికి వెలుగు, సంపుటి II, 408వ పేజీ చూడండి.

మీరు జ్ఞాపకం తెచ్చుకోగలరా?

ఏ కారణాలనుబట్టి, ఏ ప్రేరణతో మనం రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేయడంలో భాగం వహిస్తాం?

సమస్త జనులను శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను యెహోవా సేవకులు నేడు ఎంత విస్తృతంగా నెరవేర్చారు?

మన ‘చేపలు పట్టే విధానాన్ని’ మనమెలా మార్చుకోవచ్చు, మనమలా ఎందుకు మార్చుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యేసు తన అనుచరులకు ఏ పనిని అప్పగించాడు? (బి) యేసు ఆజ్ఞలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు పరిశీలించబడతాయి?

3. శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞకు మనమెందుకు లోబడాలి?

4. (ఎ) యేసుకు ఇవ్వబడిన అధికారం ఎంత విస్తృతమైనది? (బి) యేసు అధికారాన్ని అర్థంచేసుకోవడం శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞకు సంబంధించిన మన దృక్కోణాన్ని ఎలా ప్రభావితం చేయాలి?

5. (ఎ) యేసు మాటలకు పేతురు ఎలా లోబడ్డాడు? (బి) యేసు ఆదేశాలకు పేతురు లోబడడం ఎలాంటి ఆశీర్వాదాలకు దారితీసింది?

6. (ఎ) అద్భుతరీతిలో చేపలు పట్టడానికి సంబంధించిన వృత్తాంతం యేసు ఎలాంటి విధేయతను కోరుతున్నాడని ఉదహరిస్తోంది? (బి) మనం యేసును ఎలా అనుకరించవచ్చు?

7, 8. (ఎ) రాజ్య ప్రకటనకు, శిష్యులను చేయడానికి ఉన్న కొన్ని లేఖనాధారిత కారణాలేమిటి? (బి) ప్రకటనా పనిలో కొనసాగేందుకు ప్రత్యేకంగా ఏ లేఖనం మిమ్మల్ని పురికొల్పుతుంది? (అధస్సూచి కూడా చూడండి.)

9. (ఎ) పేతురు, ఇతర అపొస్తలుల చేపలు పట్టే అనుభవపు వృత్తాంతం క్రీస్తుకు లోబడడానికి సంబంధించిన సరైన ప్రేరణ గురించి ఏమి వెల్లడిచేస్తోంది? (బి) నేడు దేవునికి, క్రీస్తుకు లోబడివుండడానికిగల సరైన ప్రేరణ ఏమిటి, అది ఎందుకు సరైనది?

10. (ఎ) శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆదేశంలోని ఏ వివరం ఆయన శిష్యులకు గొప్ప సవాలుగా ఉంది? (బి) యేసు ఆదేశానికి శిష్యులెలా ప్రతిస్పందించారు?

11. ఇరవయ్యవ శతాబ్దారంభం నుండి ‘చేపలు పట్టే ప్రాంతాలు’ ఎలా విస్తరించాయి?

12. జెకర్యా 8:23లోని ప్రవచనం ఏ సవాలును నొక్కిచెబుతోంది?

13. (ఎ) దేవుని ఆధునిక దిన ప్రజల్లో భాషా సంబంధంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది? (బి) వివిధ భాషల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆహారపు అవసరతను తీర్చడానికి నమ్మకమైన దాసుని తరగతి ఎలా ప్రతిస్పందించింది? (“అంధుల కోసం సాహిత్యాలు” అనే బాక్సులోని అంశాలు కూడా చేర్చండి.)

14. మన సేవా ప్రాంతంలో వేరే భాష మాట్లాడే వారికి మనమెలా సహాయం చేయవచ్చు? (“సంజ్ఞా భాష మరియు శిష్యులను చేయడం” అనే బాక్సులోని అంశాలు కూడా చేర్చండి.)

15, 16. (ఎ) వేరే భాష మాట్లాడేవారికి సహాయం చేయడం ప్రతిఫలదాయకంగా ఉంటుందని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) వేరే భాషా క్షేత్రంలో సేవకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలను మనం పరిశీలించవచ్చు?

17. మన సంఘ సేవా ప్రాంతంలోనే మనమెలా ఎక్కువ మందిని కలుసుకోవచ్చు?

18. వివిధ పరిస్థితుల్లో సాక్ష్యమివ్వడం ఫలవంతమని ఎలా నిరూపించబడింది? (“వ్యాపారస్థులను శిష్యులనుగా చేయడం” అనే బాక్సులోని అంశాలు చేర్చండి.)

19. తర్వాతి ఆర్టికల్‌లో యేసు మనకిచ్చిన ఆజ్ఞలోని ఏ రెండు అంశాలు పరిశీలించబడతాయి?

[10వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

అంధుల కోసం సాహిత్యాలు

ఆల్బర్ట్‌ క్రైస్తవ పెద్ద, పూర్తికాల పరిచారకుడు, ఆయన అమెరికాలో నివసిస్తున్నాడు. ఆయన అంధుడు. బ్రెయిలీలోవున్న బైబిలు సాహిత్యాలు ఉపయోగించడం ఆయనకు తన పరిచర్యలో మరింత ఫలవంతంగా ఉండడానికీ, అలాగే సేవా పైవిచారణకర్తగా తన పనులను చేయడానికీ సహాయం చేస్తోంది. ఆయన తన సంఘ నియామకాన్ని ఎలా నిర్వహిస్తున్నాడు?

“ఆల్బర్ట్‌ కంటే సమర్థుడైన సేవా పైవిచారణకర్త ఇంతవరకు మా సంఘంలో లేడు” అని సంఘ పైవిచారణకర్త జేమ్స్‌ చెబుతున్నాడు. అమెరికాలో సంవత్సరం పొడవునా ఇంగ్లీషు, స్పానిష్‌ బ్రెయిలీలో బైబిలు సాహిత్యాలు అందుకునే దాదాపు 5,000 మంది అంధుల్లో ఆల్బర్ట్‌ ఒకరు. వాస్తవానికి, 1912 నుండి నమ్మకమైన దాసుని తరగతి బ్రెయిలీలో వందకంటే ఎక్కువ సాహిత్యాలను అందజేసింది. ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తూ యెహోవాసాక్షుల ముద్రణాలయాలు ప్రస్తుతం ప్రతీ సంవత్సరం పదికంటే ఎక్కువ భాషల్లో బ్రెయిలీ పేజీలను లక్షల సంఖ్యలో ఉత్పత్తిచేస్తూ వాటిని 70 కంటే ఎక్కువ దేశాల్లో అందిస్తున్నారు. అంధుల కోసం తయారుచేయబడిన బైబిలు సాహిత్యాల నుండి ప్రయోజనం పొందేవారు ఎవరైనా మీకు తెలుసా?

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

సంజ్ఞా భాష మరియు శిష్యులను చేయడం

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగల అనేకమంది యౌవనులతోపాటు వేలాదిమంది సాక్షులు, క్రీస్తు శిష్యులయ్యేందుకు బధిరులకు సహాయం చేయడానికి సంజ్ఞా భాష నేర్చుకున్నారు. తత్ఫలితంగా, ఒక్క బ్రెజిల్‌లోనే ఇటీవల ఒక సంవత్సరంలో 63 మంది బధిరులు బాప్తిస్మం తీసుకోగా, వారిలో 35 మంది సాక్షులు ఇప్పుడు పూర్తికాల సువార్తికులుగా సేవచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంజ్ఞా భాషా సంఘాలు లేదా గుంపులు 1,200లకు పైగా ఉన్నాయి. రష్యాలోవున్న కేవలం ఒకే ఒక సంజ్ఞా భాషా సర్క్యూట్‌, ప్రాంత విస్తీర్ణతనుబట్టి చెప్పాలంటే, ప్రపంచంలోకెల్లా అదే అతి పెద్ద సర్క్యూట్‌, ఎందుకంటే దాదాపు రష్యా అంతా ఆ సర్క్యూట్‌ క్రిందికే వస్తుంది.

[12వ పేజీలోని బాక్సు]

వ్యాపారస్థులను శిష్యులనుగా చేయడం

తమ కార్యాలయాల్లో పనిచేసుకునే వ్యాపారస్థులను సందర్శిస్తుండగా హవాయిలోని ఒక సాక్షి, ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీకి చెందిన ఒక అధికారిని కలిసింది. ఆయన తనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ తన కార్యాలయంలోనే 30 నిమిషాలపాటు బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆయన ప్రతీ బుధవారం ఉదయం, ఫోన్‌కాల్స్‌తో తనకు అంతరాయం కలిగించవద్దని సిబ్బందికి చెప్పి అధ్యయనానికి పూర్తి అవధానమిస్తున్నాడు. హవాయిలోని మరో సాక్షి బూట్లు బాగుచేసే షాపు యజమానితో వారానికి ఒకసారి బైబిలు అధ్యయనం చేస్తోంది. ఆ షాపు కౌంటర్‌ దగ్గరే అధ్యయనం నిర్వహించబడుతుంది. ఖాతాదారు వచ్చినప్పుడు ఆ సాక్షి పక్కకు జరిగి వేచివుంటుంది. ఆ ఖాతాదారు వెళ్లిపోయిన తర్వాత అధ్యయనం మళ్లీ కొనసాగుతుంది.

సాక్షులు చొరవ తీసుకొని వివిధ ప్రాంతాల్లో తమ “వలలు” వేశారు కాబట్టే వాళ్లు ఆ అధికారిని, ఆ షాపు యజమానిని కలుసుకోగలిగారు. ఇంటి దగ్గర కలుసుకోవడానికి కష్టమయ్యే ప్రజలను కలుసుకునేలా మీ సంఘ సేవా క్షేత్రంలోని వివిధ ప్రాంతాల గురించి మీరు ఆలోచించగలరా?

[12వ పేజీలోని చిత్రం]

వేరే భాషా క్షేత్రంలో మీరు సేవచేయగలరా?