కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కప్పదొకియ ఇక్కడి ప్రజలు గాలి, నీరు చెక్కిన ఇళ్ళలో నివసించారు

కప్పదొకియ ఇక్కడి ప్రజలు గాలి, నీరు చెక్కిన ఇళ్ళలో నివసించారు

కప్పదొకియ ఇక్కడి ప్రజలు గాలి, నీరు చెక్కిన ఇళ్ళలో నివసించారు

అపొస్తలుడైన పేతురు కప్పదొకియ గురించి మాట్లాడాడు. ఆయన తన మొదటి ప్రేరేపిత లేఖను ఇతరులతోపాటు “కప్పదొకియ . . . యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు” వ్రాశాడు. (1 పేతురు 1:⁠1) కప్పదొకియ ఎలాంటి దేశము? దాని నివాసులు రాళ్ళతో చెక్కబడిన ఇళ్ళలో ఎందుకు నివసించేవారు? వాళ్ళకు క్రైస్తవత్వం ఎలా పరిచయమయ్యింది?

“అకస్మాత్తుగా మేము శంకువు ఆకారంలోవున్న రాళ్ళతో, రాతి స్తంభాలతో నిండివున్న ప్రాంతంలోకి అడుగుపెట్టాం” అని 1840లలో కప్పదొకియను సందర్శించిన బ్రిటీషు యాత్రికుడు డబ్యు. ఎఫ్‌. ఎయిన్స్‌వర్త్‌ చెప్పారు. టర్కీలోవున్న ఈ ప్రాంతాన్ని సందర్శించే ఆధునిక దిన సందర్శకులను ఈ వింత దృశ్యం ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. కప్పదొకియ లోయల్లో, ఈ వింత రాతి “శిల్పాలు” గుంపులు గుంపులుగావున్న మూగ సైనికుల్లా కనిపిస్తాయి. కొన్ని 30 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తుతో ఆకాశంలోకి దూసుకుపోతున్న పెద్ద పొగగొట్టాల్లా కనిపిస్తాయి. మరికొన్ని పెద్ద ఐస్‌క్రీమ్‌ కోన్‌లలా, పెద్ద స్తంభాల్లా, పుట్ట గొడుగుల్లా కనిపిస్తాయి.

రోజంతటిలోను సూర్య కిరణాలు ఈ శిల్పాలను వేర్వేరు రంగుల్లో అందంగా ప్రకాశింపజేస్తాయి! అరుణోదయమప్పుడు అవి లేత గులాబి రంగులో ఉంటాయి. మధ్యాహ్నానికల్లా అవి పాలిపోయిన దంతం రంగులోకి మారతాయి, సూర్యాస్తమయ సమయానికి అవి బంగారు జేగురు వర్ణానికి మారతాయి. ‘శంకువు ఆకారంలోని రాళ్ళతో, రాతి స్తంభాలతో నిండివున్న ఈ ప్రాంతం’ ఎలా తయారయ్యింది? ఆ ప్రాంతంలోని ప్రజలు వాటిని ఇళ్ళుగా ఎందుకు చేసుకున్నారు?

గాలి, నీరు చెక్కినవి

ఆసియాను యూరప్‌ను కలిపే అనాటోలియన్‌ ద్వీపకల్పం నడిబొడ్డున కప్పదొకియ ఉంది. ఆ ప్రాంతంలో రెండు అగ్నిపర్వతాలు లేకుండా ఉంటే అది పీఠభూమిగా ఉండేది. ఎన్నో సహస్రాబ్దాల క్రితం ఆ అగ్నిపర్వతాలు పేలడంవల్ల ఆ ప్రాంతం రెండు రకాల రాళ్ళతో కప్పబడివుంటుంది, ఒకటేమో గట్టిగావుండే అగ్గిరాయి, రెండవదేమో అగ్నిపర్వతపు బూడిద ఘనీభవించడంవల్ల రూపొందిన తెల్లని మెత్తని ట్యూఫా రాయి.

నదులు, వర్షాలు, గాలులు మెత్తని ట్యూఫా రాళ్ళను క్రమంగా హరింపజేయడం ప్రారంభించినప్పుడు లోయలు తయారయ్యాయి. కొంతకాలానికి ఈ లోయల అంచునవున్న కొండలు కొన్ని క్రమంగా విభజించబడి శంకువు ఆకారంలోని రాళ్ళుగా, స్తంభాలుగా తయారయ్యాయి, ఆ కారణంగా భూమిపై మరెక్కడా లేని శిల్పాలు ఆ ప్రాంతంలో కన్పిస్తాయి. కొన్ని రాతి శంకువుల్లో ఎన్ని రంథ్రాలు ఏర్పడ్డాయంటే అవి తేనెతెట్టుల్లా కనిపిస్తాయి. స్థానిక నివాసులు ఆ మెత్తని రాళ్ళల్లో గదులు చెక్కి, కుటుంబం పెరిగే కొద్ది ఇంకా ఎక్కువ గదులను వాటికి జోడించేవారు. ఈ ఇళ్ళు ఎండాకాలంలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉన్నట్లు వారు కనుగొన్నారు.

నాగరికత కూడలిలో నివసించడం

కప్పదొకియలోని గుహల్లో నివసించేవారు నాగరికత యొక్క ముఖ్య కూడలి అయిన ఆ ప్రాంతంలో నివసిస్తుండకపోతే వాళ్ళకు ఇతర ప్రజలతో సంబంధం ఉండేదే కాదు. రోమా సామ్రాజ్యాన్ని చైనాతో కలిపే ప్రఖ్యాతిగాంచిన సిల్కు రహదారి అంటే 6,500 కిలోమీటర్ల వర్తక మార్గం కప్పదొకియ గుండా వెళ్ళేది. వర్తకులే కాక పర్షియా, గ్రీకు, రోమా సైన్యాలు కూడా ఈ మార్గంలో ప్రయాణించేవి. ఈ ప్రయాణికులు ఆ ప్రాంతానికి కొత్త మతపరమైన సిద్ధాంతాలను పరిచయం చేశారు.

సా.శ.పూ. రెండవ శతాబ్దానికల్లా యూదుల జనసముదాయాలు కప్పదొకియలో స్థానం సంపాదించుకున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన యూదులు కూడా సా.శ. 33లో యెరూషలేములో ఉన్నారు. వాళ్ళు పస్కా పండుగను ఆచరించడానికి అక్కడకు వెళ్ళారు. ఆ విధంగా అపొస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత కప్పదొకియ యూదులకు ప్రకటించాడు. (అపొస్తలుల కార్యములు 2:​1-9) కొంతమంది ఆయన సందేశానికి ప్రతిస్పందించి, వాళ్ళు కొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని తమతోపాటు తమ ఇంటికి తీసుకెళ్ళారని స్పష్టమవుతోంది. కాబట్టే పేతురు తన మొదటి లేఖలో కప్పదొకియ క్రైస్తవులను ప్రస్తావించాడు.

అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ కప్పదొకియలోని క్రైస్తవులు అన్యమత సిద్ధాంతాలచేత ప్రభావితమవ్వడం ప్రారంభించారు. నాలుగవ శతాబ్దానికి చెందిన, పలుకుబడిగల కప్పదొకియ చర్చీ నాయకులు ముగ్గురు లేఖనవిరుద్ధమైన త్రిత్వ సిద్ధాంతాన్ని బలంగా సమర్థించారు. ఆ ముగ్గురు నజీన్జెస్‌కు చెందిన గ్రెగరీ, బేసిల్‌ ద గ్రేట్‌, ఆయన సహోదరుడైన నిస్సాకు చెందిన గ్రెగరీ.

బేసిల్‌ ద గ్రేట్‌ సన్యాసుల జీవిత విధానాన్ని కూడా ప్రోత్సహించాడు. ఆయన సిఫార్సు చేసిన సన్యాసి జీవితానికి రాళ్ళతో చెక్కబడిన కప్పదొకియ ఇళ్ళు సరిగ్గా సరిపోయాయి. సన్యాసి సమాజం పెరిగే కొద్దీ పెద్ద పెద్ద శంకువుల్లాంటి రాళ్ళలో చర్చీలు నిర్మించబడ్డాయి. 13వ శతాబ్దానికల్లా ఆ రాళ్ళలో దాదాపు మూడు వందల చర్చీలు చెక్కబడ్డాయి. వాటిలో చాలామట్టుకు నేటి వరకూ భద్రంగానే ఉన్నాయి.

ప్రస్తుతం ఆ చర్చీలు, సన్యాసుల మఠాలు ఉపయోగించబడడం లేదు, అయితే స్థానిక ప్రజల జీవిత విధానం మాత్రం అంతగా మారలేదు. చాలా గుహలు ఇప్పటికీ ఇళ్ళుగా ఉపయోగించబడుతున్నాయి. కప్పదొకియను సందర్శించినవారిలో చాలామంది, అక్కడి నేర్పుగల నివాసులు సహజంగా ఏర్పడినవాటిని ఇళ్ళుగా ఎలా మార్చుకున్నారో చూసి ఆశ్చర్యపోతారు.

[24, 25వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కప్పదొకియ

చైనా (కాథే)