కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా ధర్మశాస్త్రమునందు” మీరు ఆనందిస్తున్నారా?

“యెహోవా ధర్మశాస్త్రమునందు” మీరు ఆనందిస్తున్నారా?

“యెహోవా ధర్మశాస్త్రమునందు” మీరు ఆనందిస్తున్నారా?

‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు.’​—⁠కీర్తన 1:2.

యెహోవా తన విశ్వసనీయ సేవకులమైన మనకు సహాయం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నిజమే, మనమెన్నో పరీక్షలను ఎదుర్కొంటున్నాము. అయితే వాటితోపాటు మనం నిజమైన సంతోషాన్ని కూడా అనుభవిస్తున్నాం. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు, ఎందుకంటే మనం ‘సంతోషముగల దేవుణ్ణి’ సేవిస్తున్నాం, ఆయన పరిశుద్ధాత్మ మనలో సంతోషాన్ని నింపుతోంది. (1 తిమోతి 1:​11, NW; గలతీయులు 5:​22) ఏదో మంచి జరుగుతుందని ఎదురు చూసేటప్పుడు లేదా ఏదైనా మంచి జరిగినప్పుడు మనకు కలిగే నిజమైన సంతోషమే ఆనందం. మన పరలోకపు తండ్రి నిస్సందేహంగా మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తున్నాడు. (యాకోబు 1:​17) కాబట్టి మనం సంతోషంగా ఉన్నామంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు!

2 కీర్తనల్లో ధన్యత లేదా సంతోషం నొక్కిచెప్పబడింది. ఉదాహరణకు, 1, 2 కీర్తనల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు తొలి అనుచరులు రెండవ కీర్తనను ఇశ్రాయేలీయుల రాజైన దావీదుకు ఆపాదించారు. (అపొస్తలుల కార్యములు 4:​25, 26) పేరు ప్రస్తావించబడని, ఒకటవ కీర్తన రచయిత తన ప్రేరేపిత కీర్తనను ఈ మాటలతో ఆరంభిస్తున్నాడు: ‘దుష్టుల ఆలోచన చొప్పున నడువనివాడు ధన్యుడు.’ (కీర్తన 1:⁠1) ఈ ఆర్టికల్‌లోను, దీని తర్వాతి ఆర్టికల్‌లోను, సంతోషంగా ఉండడానికి 1, 2 కీర్తనలు మనకెలాంటి ఆధారాన్నిస్తున్నాయో పరిశీలిద్దాం.

సంతోషానికి రహస్యం

3 దైవభక్తిగల వ్యక్తి ఎందుకు సంతోషంగా ఉంటాడో 1వ కీర్తన వివరిస్తోంది. అలాంటి సంతోషానికి కొన్ని కారణాలను వివరిస్తూ కీర్తనకర్త ఇలా ఆలపించాడు: ‘దుష్టుల ఆలోచన చొప్పున నడువని పాపుల మార్గమున నిలువని అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండని వాడు ధన్యుడు.’​—⁠కీర్తన 1:⁠1.

4 నిజంగా సంతోషంగా ఉండడానికి మనం యెహోవా నీతియుక్తమైన కట్టడలకు లోబడాలి. బాప్తిస్మమిచ్చు యోహానుకు తల్లిదండ్రులయ్యే సంతోషకరమైన ఆధిక్యత లభించిన జెకర్యా, ఎలీసబెతు “ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.” (లూకా 1:​5, 6) మనం కూడా వారిలాగే ప్రవర్తిస్తూ ‘దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా’ లేదా వారి భక్తిహీన సలహాలచేత నిర్దేశించబడకుండా ఉంటే సంతోషంగా ఉండవచ్చు.

5 దుష్టుల ఆలోచనను మనం నిరాకరించినప్పుడు, మనం ‘పాపుల మార్గంలో నిలబడము.’ నిజానికి మనం అక్షరార్థంగా, వారుండే స్థలాలకు అంటే దుర్నీతికరమైన వినోదం ఉండే లేదా చెడ్డపేరున్న స్థలాలకు వెళ్లం. అయితే పాపుల లేఖనవిరుద్ధ ప్రవర్తనకు లోనయ్యేలా మనం శోధించబడితే అప్పుడేమిటి? అలాంటప్పుడు, అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలకు అనుగుణంగా ప్రవర్తించేందుకు దేవుని సహాయం కోసం మనం ప్రార్థించాలి. ఆయనిలా వ్రాశాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?” (2 కొరింథీయులు 6:​14) దేవునిపై ఆధారపడడంతోపాటు “హృదయశుద్ధి” గలవారమైతే, మనం పాపుల స్వభావాన్ని, జీవన విధానాన్ని విసర్జించి ‘నిష్కపటమైన విశ్వాసాన్ని’ కలిగివుండడమే కాక పరిశుభ్రమైన ఉద్దేశాలతోను, కోరికలతోను ఉంటాం.​—⁠మత్తయి 5:8; 1 తిమోతి 1:5.

6 యెహోవాను సంతోషపెట్టడానికి మనం ఖచ్చితంగా ‘అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు.’ కొందరు దైవభక్తినే అపహసిస్తారు, కానీ ఈ “అంత్యదినములలో” మతభ్రష్టులైన మాజీ క్రైస్తవులు తమ అపహాస్యంలో ముఖ్యంగా తిరస్కార స్వభావాన్నే ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. అపొస్తలుడైన పేతురు తోటి విశ్వాసులను ఇలా హెచ్చరించాడు: “ప్రియులారా, . . . అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,​—⁠ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.” (2 పేతురు 3:​1-4) మనం ‘అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా’ ఉంటే వారికి కలిగే ఆకస్మిక ముప్పును తప్పించుకుంటాం.​—⁠సామెతలు 1:22-27.

7 మొదటి కీర్తనలోని తొలిపలుకుల్ని మనం పెడచెవినబెడితే, లేఖనాల అధ్యయనం ద్వారా మనం సంపాదించుకున్న ఆధ్యాత్మికతను మనం కోల్పోవచ్చు. అప్పుడు మనం మరింత దిగజారిపోవచ్చు. దుష్టుల ఆలోచనను వెంబడిస్తే, మనం ఆధ్యాత్మికంగా దిగజారడం ఆరంభించినట్లే. ఆ తర్వాత మనం వారితో క్రమంగా సహవసించవచ్చు. చివరకు మనం అవిశ్వాసులైన మతభ్రష్ట అపహాసకులుగా కూడా తయారుకావచ్చు. దుష్ట సాంగత్యం నిస్సందేహంగా మనలో భక్తిహీన స్వభావాన్ని పురికొల్పి యెహోవా దేవునితో మనకున్న సంబంధాన్ని నాశనం చేయగలదు. (1 కొరింథీయులు 15:33; యాకోబు 4:⁠4) అలా ఎన్నటికీ జరగకుండా మనం చూసుకుందాం!

8 ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు కేంద్రీకరించడానికి, దుష్ట సాంగత్యాన్ని నివారించడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని పౌలు వ్రాశాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి స్తుతిపాత్రమైనవో వాటిపై ధ్యానముంచాలని ఆ అపొస్తలుడు ప్రోత్సహించాడు. (ఫిలిప్పీయులు 4:​6-8) పౌలు ఇచ్చిన సలహా ప్రకారం ప్రవర్తిస్తూ ఎప్పటికీ దుష్టుల స్థాయికి దిగజారకుండా ఉందాం.

9 మనం దుష్ట కార్యాలను విసర్జించినప్పటికీ, “నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు” అపొస్తలుడైన పౌలు రోమా అధిపతియైన ఫేలిక్సుతో మాట్లాడినట్లుగా మనం ఇతరులకు యుక్తిగా సాక్ష్యమిస్తాం. (అపొస్తలుల కార్యములు 24:24, 25; కొలొస్సయులు 4:⁠6) అన్నిరకాల ప్రజలకు మనం రాజ్యసువార్త ప్రకటిస్తాం, వారితో మనం దయాపూర్వకంగా వ్యవహరిస్తాం. “నిత్యజీవంపట్ల సరైన మానసిక వైఖరిగల” వారు విశ్వాసులై దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తారనే నమ్మకం మనకుంది.​—⁠అపొస్తలుల కార్యములు 13:​48, NW.

అతడు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు

10 సంతోషంగల వ్యక్తి గురించి కీర్తనకర్త ఇంకా ఇలా చెబుతున్నాడు: ‘అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తాడు’ లేదా తగ్గుస్వరంతో చదువుతాడు. (కీర్తన 1:⁠2) దేవుని సేవకులుగా మనం ‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాం.’ వ్యక్తిగత అధ్యయనం, ధ్యానం చేస్తున్నప్పుడు సాధ్యమైనప్పుడల్లా మనం పదాలను బయటకే పలుకుతూ ‘ధ్యానిస్తాం’ లేదా తగ్గుస్వరంతో చదువుతాము. లేఖనాల్లో ఏ భాగం చదివేటప్పుడైనా అలా బిగ్గరగా చదవడం మన మనస్సుపై, హృదయంపై చెరగని ముద్రవేయడానికి సహాయపడుతుంది.

11 “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రతిరోజు బైబిలు చదవమని మనలను ప్రోత్సహిస్తున్నాడు. (మత్తయి 24:​45) మానవాళికొరకైన యెహోవా సందేశాన్ని మరియెక్కువగా అర్థంచేసుకోవాలనే ప్రగాఢమైన కోరికతో మనం “దివారాత్రము” బైబిలు చదవాలి. అవును, ఏదైన కారణంచేత నిద్రపట్టనప్పుడు కూడా బైబిలు చదవడం మంచిది. పేతురు ఇలా ఉద్బోధించాడు: “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:⁠1) ప్రతిరోజు రాత్రిపూట బైబిలు చదువుతూ, దేవుని వాక్యాన్ని, ఆయన సంకల్పాలను ధ్యానించడంలో మీరు ఆనందిస్తున్నారా? కీర్తనకర్త అలా చేశాడు.​—⁠కీర్తన 63:​4-6.

12 దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించడంపైనే మన నిత్య సంతోషం ఆధారపడివుంది. అది యథార్థమైనది, న్యాయమైనది దానిని గైకొనడంవల్ల గొప్ప లాభం కలుగుతుంది. (కీర్తన 19:​7-11) శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” (యాకోబు 1:​25) మనం నిజంగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే, మనం ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయాలపట్ల శ్రద్ధ చూపిస్తాం. ‘దేవుని మర్మములను పరిశోధించడానికీ,’ జీవితంలో రాజ్యాసక్తులకు ప్రథమ స్థానం ఇవ్వడానికీ మనం పురికొల్పబడతాం.​—⁠1 కొరింథీయులు 2:10-13; మత్తయి 6:33.

అతడు చెట్టువలె ఉంటాడు

13 యథార్థవంతుణ్ణి ఇంకా వర్ణిస్తూ కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:⁠3) అపరిపూర్ణులైన ఇతర మానవుల్లాగే, యెహోవాను సేవించే మనం కూడా జీవితంలో కష్టాలు అనుభవిస్తాం. (యోబు 14:⁠1) మనం హింసను అనుభవించవచ్చు, విశ్వాస సంబంధమైన వివిధరకాల పరీక్షలను ఎదుర్కోవచ్చు. (మత్తయి 5:​10-12) అయితే, ఆరోగ్యంగావున్న చెట్టు బలమైన గాలుల్ని తట్టుకుని నిలబడినట్లే మనం కూడా దేవుని సహాయంతో ఈ పరీక్షల్ని విజయవంతంగా సహించగలం.

14 నిరంతరం నీరుండేచోట నాటబడిన చెట్టు వేడి వాతావరణంలో లేదా అనావృష్టిలో ఎండిపోకుండా ఉంటుంది. మనం దైవభక్తిగల వ్యక్తులుగా ఉన్నప్పుడు, స్థిర మూలాధారమైన యెహోవా దేవుని నుండి మనకు బలం లభిస్తుంది. సహాయం కోసం దేవునివైపు చూసిన పౌలు ఇలా చెప్పగలిగాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:​13) మనం యెహోవా పరిశుద్ధాత్మచేత నడిపించబడి ఆధ్యాత్మికంగా పోషించబడినప్పుడు, మనం నిష్ఫలులమవుతూ లేదా ఆధ్యాత్మికంగా క్రియాశూన్యులమవుతూ వాడిపోము. మనం దేవుని సేవలో ఫలవంతంగా ఉండడమే కాకుండా ఆయన ఆత్మ ఫలాలను ఫలిస్తూ ఉంటాం.​—⁠యిర్మీయా 17:7, 8; గలతీయులు 5:​22.

15 “వలె” అని అనువదించబడిన హీబ్రూ పదాకృతిని ఉపయోగిస్తూ కీర్తనకర్త ఉపమాలంకారాన్ని ప్రయోగిస్తున్నాడు. ఒకే లక్షణాన్ని పంచుకున్నప్పటికీ, విభిన్నంగా ఉండే రెండు పదార్థాలను ఒకదానితో ఒకటి ఆయన పోలుస్తున్నాడు. మనుష్యులకు, చెట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది, అయితే సమృద్ధిగా నీరు లభించే చోట నాటబడిన పచ్చనిచెట్టు, “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు” వ్యక్తియొక్క ఆధ్యాత్మిక ప్రగతిని కీర్తనకర్తకు గుర్తుచేసి ఉంటుంది. మనం దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే, మన ఆయుష్షు వృక్షాయుష్షంత అవుతుంది. అంటే మనం నిరంతరం జీవించగలం.​—⁠యోహాను 17:3.

16 మనం యథార్థంగా జీవిస్తుండగా మనకు కలిగే పరీక్షల, కష్టాల ఒత్తిడిని తట్టుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. దేవుని సేవలో మనం ఆనందంగా ఫలవంతంగా ఉంటాం. (మత్తయి 13:23; లూకా 8:​15) మన ముఖ్య ఉద్దేశం యెహోవా చిత్తం చేయడం కాబట్టి ‘మనం చేసే ప్రతీది సఫలమవుతుంది.’ ఆయన సంకల్పాలెప్పుడూ సఫలమవుతూ ఉంటాయి అంతేకాక మనమాయన ఆజ్ఞల్లో ఆనందిస్తుంటాం కాబట్టి మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాం. (ఆదికాండము 39:23; యెహోషువ 1:7, 8; యెషయా 55:​11) మనం కష్టాలెదుర్కొంటున్నప్పటికీ నిశ్చయంగా వర్ధిల్లుతాం.​—⁠కీర్తన 112:1-3; 3 యోహాను 2.

దుష్టులు వర్ధిల్లుతున్నట్లుగా అనిపిస్తుంది

17 నీతిమంతుల జీవితానికి, దుష్టుల జీవితానికి ఎంత తేడా ఉంటుందో కదా! దుష్టులు కొద్దికాలంపాటు వస్తుపరంగా వర్ధిల్లుతున్నట్లు అనిపించవచ్చు, కానీ వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం లేదు. కీర్తనకర్త తర్వాత చెప్పిన మాటల్లో ఇది స్పష్టమవుతోంది. “దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.” (కీర్తన 1:​4, 5) ‘దుష్టులు ఆలాగున ఉండరని’ కీర్తనకర్త చెప్పడాన్ని గమనించండి. అంటే వాళ్లు ఫలవంతమైన, దీర్ఘకాలం నిలిచే చెట్లతో పోల్చబడిన దైవభక్తిగల ప్రజల్లా ఉండరని ఆయన చెబుతున్నాడు.

18 దుష్టులు వస్తుదాయకంగా వర్ధిల్లినా, వారికి శాశ్వత భద్రత ఉండదు. (కీర్తన 37:16; 73:​3, 12) పిత్రార్జితం విషయంలో తీర్పుతీర్చమని అడిగినప్పుడు యేసు చెప్పిన ఒక ఉపమానంలోని అనుచిత ధనవంతునిలా వారున్నారు. అక్కడున్న వారికి యేసు ఇలా చెప్పాడు: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” సమృద్ధిగా పంట చేతికి రావడంతో పాత కొట్లు పడగొట్టి వాటికంటె గొప్పవి కట్టించి తన సర్వసంపదను వాటిలో దాచుకోవాలని ఒక ధనవంతుడు పథకం వేసుకొన్నాడని చెబుతూ యేసు ఈ అంశాన్ని ఉదహరించాడు. ఆ తర్వాత ఆ ధనవంతుడు తిని, త్రాగి సంతోషించాలని ఆలోచించాడు. అయితే దేవుడు, “వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో” అన్నాడు. విషయాన్ని నొక్కిచెప్పడానికి యేసు ఇంకా ఇలా అన్నాడు: “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.”​—⁠లూకా 12:13-21.

19 దుష్టులు ‘దేవునియెడల ధనవంతులుగా’ లేరు. అందువల్ల, వారికి ధాన్యపు పొట్టుకు మించిన భద్రత గానీ, స్థిరత్వం గానీ లేవు. ప్రాచీన కాలాల్లో పంట కోయబడి ధాన్యం నూర్చబడడానికి సాధారణంగా సమతలంగా కాస్త ఎత్తుగావున్న ప్రాంతానికి చేరవేయబడేది. ఆ ధాన్యాన్ని నలిపి పొట్టు తొలగించడానికి రాళ్లు లేదా ఇనుప ముండ్లు పొదిగిన బరువైన బల్లల్ని పశువులచేత లాగించేవారు. ఆ తర్వాత ధాన్యాన్ని తూర్పారబట్టి పొట్టు గాలికి ఎగిరిపోయేలా చేస్తారు. (యెషయా 30:24) అలా పొట్టు గాలికి ఎగిరిపోయి సిసలైన ధాన్యం నేలపై పడుతుంది. (రూతు 3:⁠2) ఆ తర్వాత ఆ ధాన్యాన్ని రాళ్లు రప్పలు లేకుండా జల్లిస్తారు, అలా ఆ ధాన్యం కొట్లకు చేర్చడానికి లేదా పిండికొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ పొట్టు మాత్రం గాలికి ఎగిరిపోయింది.

20 పొట్టు ఎగిరిపోయి నేలపైపడిన సిసలైన ధాన్యం భద్రపరచబడినట్లే, నీతిమంతులు నిలిచి, దుష్టులు తొలగించబడతారు. అలా కీడుచేసే వారందరూ శాశ్వతంగా నిర్మూలించబడడం మనకు సంతోషదాయకం. అట్టివారిక లేకపోవడంతో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు ప్రజలు బహుగా ఆశీర్వదించబడతారు. అవును, విధేయతగల మానవులు చివరకు దేవుడిచ్చే నిత్యజీవమనే బహుమానం అందుకుంటారు.​—⁠మత్తయి 25:34-46; రోమీయులు 6:23.

దీవెనకరమైన “నీతిమంతుల మార్గము”

21 మొదటి కీర్తన ఈ మాటలతో ముగుస్తోంది: “నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.” (కీర్తన 1:⁠6) ‘నీతిమంతుల మార్గాన్ని దేవుడెలా తెలుసుకుంటాడు’? మనం యథార్థ మార్గం అనుసరించినప్పుడు మన పరలోకపు తండ్రి మన భక్తిగల జీవన విధానాన్ని గమనిస్తాడనీ, మనల్ని తన ఆమోదిత సేవకులుగా దృష్టిస్తాడనీ మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. కాబట్టి, ఆయన మనపట్ల నిజంగా శ్రద్ధచూపిస్తాడనే దృఢనమ్మకంతో మన చింత అంతటినీ ఆయనపై వేయవచ్చు, వేయాలి.​—⁠యెహెజ్కేలు 34:11; 1 పేతురు 5:6, 7.

22 “నీతిమంతుల మార్గము” శాశ్వతంగా నిలిచివుంటుంది, అయితే సరిదిద్దబడడానికి అనుమతించని దుష్టులు యెహోవా కఠిన తీర్పు కారణంగా నశిస్తారు. వారి “మార్గము” లేదా జీవన విధానం వారితోపాటే ముగుస్తుంది. దావీదు పలికిన ఈ మాటలు నెరవేరతాయని మనం నమ్మవచ్చు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”​—⁠కీర్తన 37:10, 11, 29.

23 దుష్టుల్లేని పరదైసు భూమిపై జీవించే ఆధిక్యత లభించినప్పుడు మనమెంత సంతోషిస్తామో కదా! అప్పుడు దీనులు, నీతిమంతులు నిజమైన శాంతిని అనుభవిస్తారు, ఎందుకంటే వారు “యెహోవా ధర్మశాస్త్రమునందు” ఎల్లప్పుడూ ఆనందిస్తారు. అయితే అది నెరవేరడానికి ముందు ‘యెహోవా కట్టడ’ అమలుచేయబడాలి. (కీర్తన 2:7ఎ) ఆ కట్టడ ఏమిటో, మనకూ మానవ కుటుంబానికంతటికీ అదెలా ప్రయోజనకరమో చూసేందుకు తర్వాతి ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది.

మీరెలా సమాధానమిస్తారు?

దైవభక్తిగల వ్యక్తి ఎందుకు సంతోషంగా ఉంటాడు?

మనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నామని ఏది చూపిస్తోంది?

ఒక వ్యక్తి సమృద్ధిగా నీరందే చెట్టుగా ఎలా ఉండగలడు?

నీతిమంతుల మార్గం, దుష్టుల మార్గం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా సేవకులముగా మనమెందుకు సంతోషంగా ఉన్నాం?

2. మనం ఏ కీర్తనలను పరిశీలించబోతున్నాం?

3. కీర్తన 1:1 ప్రకారం, దైవభక్తిగల వ్యక్తి సంతోషంగా ఉండడానికిగల కొన్ని కారణాలు ఏమిటి?

4. జెకర్యా, ఎలీసబెతు ఎలాంటి ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అనుసరించారు?

5. ‘పాపుల మార్గాన్ని’ విసర్జించడానికి మనకేది సహాయం చేయవచ్చు?

6. అపహాసకుల విషయంలో మనమెందుకు అప్రమత్తంగా ఉండాలి?

7. కీర్తన 1:1లోని మాటలను మనమెందుకు లక్ష్యపెట్టాలి?

8. ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు కేంద్రీకరించడానికి మనకేది సహాయం చేస్తుంది?

9. మనం దుష్ట కార్యాలను విసర్జించినప్పటికీ, అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి ఎలా ప్రయత్నిస్తాం?

10. మన వ్యక్తిగత అధ్యయన సమయాల్లో మన మనస్సుపై, హృదయంపై చెరగని ముద్రవేయడానికి ఏది సహాయం చేస్తుంది?

11. మనమెందుకు “దివారాత్రము” బైబిలు చదవాలి?

12. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే మనమేమి చేస్తాము?

13-15. ఏ భావంలో మనం సమృద్ధిగా నీరు లభించే చోట నాటబడిన చెట్టువలె ఉండగలం?

16. ‘మనం చేసే ప్రతీది’ ఎందుకు, ఎలా సఫలమవుతుంది?

17, 18. (ఎ) కీర్తనకర్త దుష్టులను దేనికి పోల్చాడు? (బి) వస్తుపరంగా దుష్టులు వర్ధిల్లినా, వారికెందుకు శాశ్వత భద్రత ఉండదు?

19, 20. (ఎ) ప్రాచీనకాలపు నూర్చే, తూర్పారబట్టే విధానాన్ని వివరించండి. (బి) దుష్టులెందుకు పొట్టుతో పోల్చబడ్డారు?

21. యెహోవా ఎలా ‘నీతిమంతుల మార్గాన్ని తెలుసుకుంటాడు’?

22, 23. దుష్టులకు, నీతిమంతులకు ఏమి జరుగుతుంది?

[11వ పేజీలోని చిత్రం]

దుష్టసాంగత్యాన్ని విసర్జించడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది

[12వ పేజీలోని చిత్రం]

నీతిమంతుడు ఎందుకు ఒక చెట్టువలె ఉంటాడు?