కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చేసిన—అద్భుతాలు యథార్థాలా కట్టుకథలా?

యేసు చేసిన—అద్భుతాలు యథార్థాలా కట్టుకథలా?

యేసు చేసిన—అద్భుతాలు యథార్థాలా కట్టుకథలా?

“సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన [యేసుక్రీస్తు] యొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను.” (మత్తయి 8:​16, 17) “ఆయన [యేసు] లేచి గాలిని గద్దించి​—⁠నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.” (మార్కు 4:​39) ఈ మాటలు మీకెలా అనిపిస్తున్నాయి? అవి నిజంగా జరిగిన చారిత్రక ఘటనలను వివరిస్తున్నాయని మీరు నమ్ముతారా లేక సూచనార్థక కథలనో, కట్టుకథలనో భావిస్తారా?

యేసు చేసిన అద్భుతాల ప్రామాణికత విషయంలో చాలామంది తీవ్ర సందేహాలను వెలిబుచ్చుతారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, అంతరిక్ష స్థితిగతుల వివరాలు, జన్యు నిర్మాణం వంటివి అందుబాటులో ఉన్న ఈ యుగం, అద్భుతాలు, అతీత ఘటనల గురించిన నివేదికలను నమ్మకుండా సందేహించేలా చేస్తున్నట్లుంది.

కొందరు, ఆ అద్భుతాలకు సంబంధించిన వృత్తాంతాలు ఊహాగానాలని లేక సూచనార్థక కథలని భావిస్తారు. “నిజమైన” యేసును వెల్లడిచేసే పుస్తకమని చెప్పుకునే ఒక పుస్తక రచయిత ప్రకారం, క్రీస్తు చేసిన అద్భుతాల గురించిన కథలు క్రైస్తవత్వాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించబడిన “వ్యాపార ప్రకటనలు” మాత్రమే.

మరికొందరు, యేసు చేసిన అద్భుతాలు పుర్తిగా మోసాలన్నట్లుగా దృష్టిస్తారు. మోసం చేశాడనే ఫిర్యాదు కొన్నిసార్లు యేసు మీద వేయబడింది. సా.శ. రెండవ శతాబ్దానికి చెందిన జస్టిన్‌ మార్టిర్‌ ప్రకారం, యేసు విమర్శకులు “ఆయనొక మంత్రగాడు,

ప్రజలను మోసగించేవాడు అని పిలిచేందుకు కూడా తెగించారు.” ఇంకొందరైతే, యేసు “యూదా ప్రవక్త చేసినట్లు అద్భుతాలు చేయలేదు కానీ, అన్యుల దేవాలయాల్లో శిక్షణ పొందిన ఒక మంత్రగాడు చేసినట్లు చేశాడు” అని వాదించారు.

అసంభవానికి నిర్వచనం

ఇటువంటి సందేహాల వెనక, ప్రజలు అద్భుతాలను నమ్మకపోవడానికి గట్టి కారణం ఉందని మీరు అనుకుంటుండవచ్చు. అతీత శక్తులు ఇలాంటి అద్భుతాలకు కారణమనే భావనను అంగీకరించడం వారికి కష్టంగాను, అసంభవంగాను ఉంది. నాస్తికుడినని చెప్పుకునే ఒక యువకుడు “అద్భుతాలు జరగనే జరగవు” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన 18వ శతాబ్దపు స్కాటిష్‌ తత్త్వవేత్త డేవిడ్‌ హ్యూమ్‌ వ్రాసిన ఈ మాటలను ఉటంకించాడు: “అద్భుతమంటే ప్రకృతి నియమాలను ఉల్లఘించడం.”

అయినప్పటికీ, గమనార్హమైన ఒక విషయాన్ని అసంభవమని నొక్కి చెప్పడం విషయంలో అనేకమంది చాలా జాగ్రత్తగా ఉంటారు. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా అద్భుతం అంటే “మనకు తెలిసిన ప్రకృతి నియమాల ద్వారా వివరించలేని ఒక సంఘటన” అని చెబుతోంది. ఆ నిర్వచనం ప్రకారం ఒక శతాబ్దం క్రితం వరకు, అంతరిక్ష ప్రయాణం, వైర్‌లెస్‌ సంభాషణ, ఉపగ్రహాన్ని నడిపించడం వంటివి చాలామందికి “అద్భుతాలే.” కాబట్టి అద్భుతాలను ప్రస్తుత పరిజ్ఞానం ఆధారంగా వివరించలేనంత మాత్రాన అవి అసంభవమని నొక్కి చెప్పడం ఎంతమాత్రం వివేకవంతం కాదు.

యేసుక్రీస్తు చేశాడని చెప్పబడుతున్న అద్భుతాలకు సంబంధించిన కొన్ని లేఖనాధారిత రుజువులను మనం పరిశీలిస్తే, ఏమి తెలుసుకుంటాం? యేసు చేసిన అద్భుతాలు యథార్థాలా కట్టుకథలా?