కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు”

“వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు”

“వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు”

దేవుని వాక్యమైన బైబిలు నుండి వచ్చే మార్గనిర్దేశం ‘బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినది.’ (కీర్తన 19:​7-10) ఎందుకు? ఎందుకంటే “జ్ఞానుల [యెహోవా] ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలోనుండి విడిపించును.” (సామెతలు 13:​14) లేఖనాల్లోని ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు అది మన జీవితపు నాణ్యతను పెంచడమే కాకుండా మన జీవితాన్ని ప్రమాదంలో పడవేసే ఉరులను తప్పించుకోవడానికి కూడా మనకు సహాయం చేస్తుంది. లేఖనాల్లోని జ్ఞానం కోసం వెదకి, మనం నేర్చుకున్నదాని ప్రకారం ప్రవర్తించడం ఎంత ఆవశ్యకమో కదా!

సామెతలు 13:​15-25 వచనాల్లో నమోదు చేయబడినట్లు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను మనం మెరుగైన, సుదీర్ఘమైన జీవితాన్ని అనుభవించగలిగేలా జ్ఞానముతో ప్రవర్తించేందుకు సహాయం చేసే సలహాలను ఇచ్చాడు. a సంక్షిప్తమైన సామెతలను ఉపయోగిస్తూ ఆయన మనం ఇతరుల ఆమోదాన్ని పొందడానికి, మన పరిచర్యలో నమ్మకంగా కొనసాగడానికి, క్రమశిక్షణపట్ల సరైన దృక్పథం కలిగివుండడానికి, మన సహవాసులను జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోవడానికి దేవుని వాక్యం ఎలా సహాయం చేయగలదో చూపించాడు. మన పిల్లల కోసం స్వాస్థ్యము వదిలిపెట్టడం, వారిని ప్రేమతో శిక్షించడం ఎంత జ్ఞానయుక్తమైనవో కూడా ఆయన చెప్పాడు.

సుబుద్ధి దయను సంపాదించుకుంటుంది

“సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 13:​15) “సుబుద్ధి” లేదా మంచి అంతర్దృష్టి అని అనువదించబడిన మూలభాషా పదం “మంచి వివేచన, విచక్షణా జ్ఞానం, జ్ఞానయుక్తమైన అభిప్రాయాలు కలిగివుండగల సామర్థ్యాన్ని వర్ణిస్తోంది” అని ఒక రెఫరెన్సు గ్రంథం నివేదిస్తోంది. ఇలాంటి లక్షణాలుగల వ్యక్తికి ఇతరుల ఆమోదం పొందడం కష్టంగా ఉండదు.

ఫిలేమోను వద్దనుండి పారిపోయి ఆ తర్వాత క్రైస్తవుడిగా మారిన ఒనేసిమును, తన తోటి క్రైస్తవుడైన ఫిలేమోను వద్దకు పంపించేటప్పుడు అపొస్తలుడైన పౌలు వివేచనతో ఎలా వ్యవహరించాడో పరిశీలించండి. అపొస్తలుడైన తనను ఎలా ఆహ్వానిస్తాడో అదే విధంగా ఒనేసిమును దయాపూర్వకంగా ఆహ్వానించమని పౌలు ఫిలేమోనును ప్రోత్సహించాడు. ఒనేసిము ఫిలేమోనుకు డబ్బేమైనా రుణపడి ఉంటే పౌలు దానిని తాను చెల్లిస్తానని ముందుకు వచ్చాడు. నిజానికి ఫిలేమోను, ఒనేసిమును సరైన విధంగా స్వీకరించేలా చేసేందుకు పౌలు తన అధికారాన్ని ఉపయోగించగలిగేవాడే. కానీ పౌలు ఆ సమస్యను యుక్తిగా ప్రేమపూర్వకంగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ద్వారా తనకు ఫిలేమోను సహకరించడమే కాకుండా అడిగిన దానికంటే ఎక్కువే చేయడానికి ఇష్టపడతాడని పౌలు విశ్వసించాడు. మనం కూడా తోటి విశ్వాసులతో అలా వ్యవహరించవద్దా?​—⁠ఫిలేమోను 8-21.

మరోవైపున విశ్వాసఘాతకుల మార్గము ‘కష్టమైనది’ లేదా కఠినమైనది. ఏ భావంలో అది కఠినమైనది? ఒక విద్వాంసుని ప్రకారం ఇక్కడ ఉపయోగించబడిన పదానికి “బలమైన లేదా దృఢమైన” అని అర్థం, అది “దుష్టుల కఠిన ప్రవర్తనను సూచిస్తుంది. . . . ఇతరుల జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని పట్టించుకోకుండా మొండిగా తన దుష్ట విధానాలను అనుసరించే వ్యక్తి వినాశనానికి నడిపించే మార్గంలో నడుస్తున్నాడు.”

సొలొమోను ఇంకా ఇలా చెబుతున్నాడు: “వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.” (సామెతలు 13:​16) ఇక్కడ చెప్పబడిన వివేకం జ్ఞానంతో ముడిపడివుంది, అది యుక్తాయుక్త పరిజ్ఞానంగల వ్యక్తితో అంటే చర్య తీసుకునే ముందు విషయాలను జాగ్రత్తగా పరిశీలించే వ్యక్తితో జతచేయబడుతుంది. వివేకంగల వ్యక్తి అన్యాయంగా విమర్శించబడినప్పుడు లేదా అవమానించబడినప్పుడు కూడా తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడు. ఆయన అధికంగా చిరాకుపడకుండా ఉండేందుకు వీలుగా పరిశుద్ధాత్మ ఫలాలను ప్రదర్శించడానికి సహాయం చేయమని దేవునికి ప్రార్థిస్తాడు. (గలతీయులు 5:​22) వివేకంగల వ్యక్తి, మరో వ్యక్తో లేదా పరిస్థితో తనను అదుపు చేసేందుకు అనుమతించడు. దానికి బదులు ఆయన తనను తాను నిగ్రహించుకొని, నొప్పించబడినప్పుడు వెంటనే కోపం తెచ్చుకునే వ్యక్తికి తరచూ ఎదురయ్యే పోట్లాటల నుండి తప్పించుకుంటాడు.

వివేకంగల వ్యక్తి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జ్ఞానంతో ప్రవర్తిస్తాడు. ఊహాగానాల ద్వారా, భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా, ప్రజలందరూ చేస్తున్న దానిని చేయడం ద్వారా జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేమని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తన పరిస్థితిని పరిశోధించడానికి సమయం తీసుకుంటాడు. ఆయన వాస్తవాలన్నింటిని పరిశీలించి తాను ఎంపిక చేసుకోగల మార్గాలేమిటో గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆయన లేఖనాల్లో వెదకి తన పరిస్థితికి ఏ బైబిలు నియమాలు లేదా సూత్రాలు అన్వయిస్తాయో నిర్ణయించుకుంటాడు. ఇలాంటి వ్యక్తి మార్గము సరాళముగా ఉంటుంది.​—⁠సామెతలు 3:5, 6.

“నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు”

యెహోవాసాక్షులుగా మనకు దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించే బాధ్యత అప్పగించబడింది. మనకు ఇవ్వబడిన పనిని నెరవేర్చడంలో మనం నమ్మకంగా ఉండేందుకు తర్వాతి సామెతలోని మాటలు సహాయం చేస్తాయి. అదిలా చెబుతోంది: “దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.”​—సామెతలు 13:17.

ఇక్కడ రాయబారి లక్షణాల గురించి నొక్కిచెప్పబడింది. సందేశాన్ని తీసుకువెళ్ళే వ్యక్తి దుష్టబుద్ధితో దానిని వక్రీకరిస్తే లేదా దానికి మార్పులు చేస్తే ఏమి జరుగుతుంది? అతనికి వ్యతిరేకమైన తీర్పు తీర్చబడదా? సిరియా సైన్యాధిపతి నయమానుకు అత్యాశతో తప్పుడు సందేశాన్ని ఇచ్చిన ఎలీషా పనివాడైన గేహజీ గురించి ఆలోచించండి. నయమానుకు నయమైన కుష్ఠవ్యాధి గేహజీకి వచ్చింది. (2 రాజులు 5:​20-27) ఒకవేళ రాయబారి విశ్వాసఘాతకుడిగా మారి ఆ సందేశాన్ని ప్రకటించడమే మానేస్తే అప్పుడెలా? ‘అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నేను [యెహోవా] అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును’ అని బైబిలు చెబుతోంది.​—⁠యెహెజ్కేలు 33:⁠8.

మరోవైపున నమ్మకమైన రాయబారి తనకు తానే కాకుండా ఇతరులకు కూడా ఔషధమువంటివాడు. పౌలు తిమోతిని ఇలా ప్రోత్సహించాడు: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:​16) రాజ్య సువార్తను నమ్మకంగా ప్రకటించడం ద్వారా వచ్చే స్వస్థత గురించి ఆలోచించండి. సరైన హృదయ పరిస్థితిగల ప్రజలను అది కదిలించి వాళ్ళను స్వతంత్రులను చేసే సత్యమువైపుకు వారిని నడిపిస్తుంది. (యోహాను 8:​32) ప్రజలు ఆ సందేశాన్ని వినకపోయినప్పటికీ నమ్మకస్థుడైన రాయబారి ‘తన ప్రాణమును దక్కించుకుంటాడు.’ (యెహెజ్కేలు 33:⁠9) ప్రకటించవలసిన మన బాధ్యతను మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. (1 కొరింథీయులు 9:​16) మనం ఎల్లప్పుడూ ‘వాక్యాన్ని ప్రకటించడానికి’ జాగ్రత్తపడుతూ బైబిలు సందేశాన్ని నీరుగార్చేసి అది ప్రజలకు నచ్చేలా దానిని మరింత ఆకర్షణీయంగా చేయడానికి ప్రయత్నించకుండా ఉందాం.​—⁠2 తిమోతి 4:⁠2.

“గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును”

వివేకంగల వ్యక్తి తనకు లభించే సహాయకరమైన సలహాలపట్ల అయిష్టతను చూపించాలా? సామెతలు 13:⁠18 ఇలా చెబుతోంది: “శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.” మనం అడగకముందే ఇవ్వబడిన మందలింపును కూడా కృతజ్ఞతతో స్వీకరించడం జ్ఞానయుక్తమైనది. మనకు సలహా అవసరమని మనం గ్రహించనప్పుడు మనకు ఇవ్వబడే సరైన సలహా అత్యంత సహాయకరంగా ఉండవచ్చు. అలాంటి ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం మనల్ని ఎంతో బాధనుండి తప్పించి విపత్తును తప్పించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే అది అవమానానికే దారితీస్తుంది.

యోగ్యమైన ప్రశంస మనల్ని బలపరుస్తుంది, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే మనం గద్దింపును కూడా ఆశించాలి, దానిని స్వీకరించాలి. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండు లేఖలను పరిశీలించండి. పౌలు తిమోతి విశ్వాసాన్ని ప్రశంసించినప్పటికీ ఆ లేఖలు ఉపదేశంతో నిండివున్నాయి. విశ్వాసాన్నీ మంచి మనస్సాక్షినీ కాపాడుకోవడం, సంఘంలో ఇతరులతో వ్యవహరించడం, దైవభక్తిని పెంపొందించుకోవడం, ఉన్నవాటితో తృప్తిగా ఉండడాన్ని అలవర్చుకోవడం, ఇతరులకు ఉపదేశించడం, మతభ్రష్టత్వాన్ని నిరోధించడం, తన పరిచర్యను నెరవేర్చడం వంటివాటి గురించి యువకుడైన తిమోతికి ఎంతో ఉపదేశాన్నిచ్చాడు. సంఘంలోని యౌవనస్థులు అనుభవంగల వారినుండి ఉపదేశం కోసం ఆశించి దానిని స్వీకరించాలి.

‘జ్ఞానులతో సహవాసము చేయండి’

“ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము” అని జ్ఞానియైన రాజు చెబుతున్నాడు. (సామెతలు 13:​19) ఈ సామెత భావం గురించి ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “ఒక వ్యక్తి తన లక్ష్యానికి చేరుకున్నప్పుడు లేదా అతని కోరిక నెరవేరినప్పుడు అతను సంతృప్తి భావంతో నిండిపోతాడు . . . లక్ష్యాలను చేరుకోవడం అత్యంత ఆహ్లాదకరమైన అనుభవం కాబట్టి చెడుతనమును విడవడం ఖచ్చితంగా మూర్ఖులకు అసహ్యముగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లక్ష్యాలు కేవలం చెడు మార్గాల ద్వారానే సాధించబడగలవు, వాళ్ళు ఒకవేళ చెడుతనమును విడిచిపెడితే వాళ్ళకు తమ కోరికలు నెరవేరినప్పుడు కలిగే ఆనందం దొరకదు.” మనం సరైన కోరికలను వృద్ధి చేసుకోవడం ఎంత ఆవశ్యకమో కదా!

మన ఆలోచనలపై, ఇష్టాయిష్టాలపై మన సహవాసులు ఎంత బలమైన ప్రభావం చూపగలరో కదా! “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని చెప్పినప్పుడు సొలొమోను ఒక తిరుగులేని వాస్తవాన్ని చెబుతున్నాడు. (సామెతలు 13:​20) అవును వినోదం ద్వారానైనా, ఇంటర్నెట్‌ ద్వారానైనా, చదివే పుస్తకాల ద్వారానైనా సరే మనం ఎవరితో సహవసిస్తామనేది మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాము, ఎలాంటి వ్యక్తులుగా తయారవుతాము అనే దానిపై ప్రభావం చూపిస్తుంది. మన సహవాసులను జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!

“పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును”

“కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును” అని ఇశ్రాయేలు రాజు ప్రకటిస్తున్నాడు. (సామెతలు 13:​21) నీతి మార్గాల్లో నడవడం ప్రతిఫలదాయకమైనది, ఎందుకంటే యెహోవాకు నీతిమంతులపట్ల శ్రద్ధవుంది. (కీర్తన 37:​25) అయితే ‘కాలవశము చేతను అనూహ్యంగాను’ అనేక పరిస్థితులు మనందరికి ఎదురవ్వవచ్చని మనం గుర్తించాలి. (ప్రసంగి 9:​11, NW) అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలకు సిద్ధంగా ఉండడానికి మనమేమైనా చేయవచ్చా?

“మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 13:​22ఎ) తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవా జ్ఞానమును తెలుసుకోవడానికి, ఆయనతో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేసినప్పుడు ఎంత విలువైన ఆస్తిని వారికి ఇస్తున్నారో కదా! అయితే తల్లిదండ్రులు అకాలంగా మరణిస్తే ఆ కుటుంబపు ఆర్థిక సంక్షేమం కోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం కూడా జ్ఞానయుక్తం కాదంటారా? చాలా ప్రాంతాల్లో కుటుంబ శిరస్సులు భీమా చేసే, చట్టబద్ధమైన వీలునామా వ్రాసే లేదా కొంత డబ్బును కూడబెట్టే అవకాశం ఉంటుంది.

పాపాత్ముల ఆస్తి విషయమేమిటి? “పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 13:22బి) ఇప్పుడు కలిగే ప్రయోజనాల విషయంలోనే కాక నీతి నివసించబోయే ‘క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని’ సృష్టిస్తానని యెహోవా తాను చేసిన వాగ్దానం నెరవేర్చినప్పుడు కూడా అది నిజమవుతుంది. (2 పేతురు 3:​13) అప్పుడు పాపాత్ములు నిర్మూలించబడతారు, ‘దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు.’​—⁠కీర్తన 37:11.

వివేకంగల వ్యక్తికి ఆస్తులు తక్కువగా ఉన్నా ఆయన జ్ఞానముతో వ్యవహరిస్తాడు. “బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు” అని సామెతలు 13:⁠23 చెబుతోంది. ఆర్థికంగా చాలా తక్కువగల ప్రజలు కూడా కష్టించి పనిచేయడంవల్ల, దేవుని ఆశీర్వాదాలవల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అయితే న్యాయం లోపిస్తే, అన్యాయంవల్ల, ఉన్న సంపద కూడా పోతుంది.

“వానిని శిక్షించును”

అపరిపూర్ణ మానవులకు క్రమశిక్షణ అవసరం, బాల్యం నుండే అది వారికి అవసరం. “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును” అని ఇశ్రాయేలు రాజు చెబుతున్నాడు.​సామెతలు 13:24.

బెత్తము అధికారానికి చిహ్నం. సామెతలు 13:24లో అది తల్లిదండ్రుల అధికారాన్ని సూచిస్తోంది. ఈ సందర్భంలో బెత్తము ఉపయోగించడం అంటే పిల్లలను కొట్టడమనే అర్థం చేసుకోనక్కరలేదు. దానికి బదులుగా అది సరిదిద్దే పద్ధతిని​—⁠అది ఎలాంటి పద్ధతైనా సరే​—⁠సూచిస్తోంది. ఒక సందర్భంలో పిల్లవాడి అనుచితమైన ప్రవర్తనను సరిచేయడానికి వాడిని దయతో మందలించడం సరిపోవచ్చు. మరో పిల్లవాడిని బలంగా మందలించవలసి రావచ్చు. “బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును” అని సామెతలు 17:⁠10 చెబుతోంది.

తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణ ఎల్లప్పుడూ ప్రేమచేత, వివేచనచేత నియంత్రించబడాలి, అది పిల్లల ప్రయోజనార్థమై ఉండాలి. ప్రేమగల తండ్రి తన పిల్లల తప్పులను చూసీచూడనట్లు వదిలిపెట్టడు. దానికి బదులుగా ఆయన తన పిల్లలు చేసే తప్పులను గమనిస్తాడు, అవి తన పిల్లల్లో బలంగా నాటుకోకముందే వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆయనలా చేస్తాడు. అయితే ప్రేమగల తండ్రి పౌలు ఇచ్చిన ఈ ఉద్బోధను లక్ష్యపెడతాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”​—⁠ఎఫెసీయులు 6:⁠4.

తల్లిదండ్రులు తమ పిల్లల తప్పులను అనుమతిస్తూ అవసరమైన దిద్దుబాటును ఇవ్వకపోతే అప్పుడెలా? అలాంటి తల్లిదండ్రులు పిల్లల తప్పులను అనుమతించినందుకు తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకు కృతజ్ఞత చూపిస్తారా? లేదు! (సామెతలు 29:​21) బైబిలు ఇలా చెబుతోంది: “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” (సామెతలు 29:​15) తల్లిదండ్రులు తమ అధికారాన్ని ఉపయోగించకపోతే వాళ్ళకు పిల్లలంటే పట్టింపు లేదని ప్రేమ లేదని వెల్లడవుతుంది. తల్లిదండ్రులు తమ అధికారాన్ని దయాపూర్వకంగానే అయినా స్థిరంగా ఉపయోగించడం ద్వారా, వాళ్ళకు పిల్లలపట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఉందని చూపిస్తారు.

నిజమైన జ్ఞానముతో ప్రవర్తించే వివేచనగల నీతిమంతుడు ఆశీర్వదించబడతాడు. “నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును” అని సొలొమోను మనకు హామీ ఇస్తున్నాడు. (సామెతలు 13:​25) మన జీవితంలోని ఏ రంగంలోనైనా సరే​—⁠కుటుంబ విషయాలు, ఇతరులతో మన సంబంధాలు, మన పరిచర్య, లేదా మనకు క్రమశిక్షణ ఇవ్వబడుతున్నప్పుడు​—⁠మనకు ఏది ప్రయోజనకరమైనదో యెహోవాకు తెలుసు. ఆయన వాక్యంలోని ఉపదేశాన్ని జ్ఞానయుక్తంగా అన్వయించుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా అత్యుత్తమమైన జీవితాన్నే అనుభవిస్తాము.

[అధస్సూచి]

a సామెతలు 13:​1-14 వచనాలపై చర్చ కోసం కావలికోట, 2003, సెప్టెంబరు 15, 21-5 పేజీలను చూడండి.

[28వ పేజీలోని చిత్రం]

అన్యాయంగా విమర్శించబడినప్పుడు వివేకంగల వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడు

[29వ పేజీలోని చిత్రం]

నమ్మకమైన రాజ్య ప్రచారకులు ఎంతో మంచిని సాధిస్తారు

[30వ పేజీలోని చిత్రం]

ప్రశంస ప్రోత్సాహకరమైనదే అయినా మనం దిద్దుబాటును సంతోషంగా స్వీకరించాలి

[31వ పేజీలోని చిత్రం]

ప్రేమగల తండ్రి తన పిల్లల తప్పులను చూసీచూడనట్లుగా వదిలేయడు