కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉత్తమ ప్రభుత్వం కోసం అన్వేషణ

ఉత్తమ ప్రభుత్వం కోసం అన్వేషణ

ఉత్తమ ప్రభుత్వం కోసం అన్వేషణ

“ప్రపంచంలోని దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడడం ఎక్కువవడంతో, అవి తమంతటతాము ఇక ఎంతమాత్రం పరిష్కరించుకోలేని భౌగోళిక సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వచ్చిపడుతున్నాయి. కేవలం ప్రపంచవ్యాప్త సహకారంతోనే మానవాళికి అంతకంతకు ఎక్కువవుతున్న ప్రమాదాలను, సవాళ్లను మనం విజయవంతంగా ఎదుర్కోగలం.”​—⁠గులామ్‌ ఉమర్‌, పాకిస్తానీ రాజకీయ విశ్లేషకుడు.

నేటి ప్రపంచం పరస్పర వైరుధ్యాలతో నిండివుంది. ప్రపంచంలో ద్రవ్య సమృద్ధి ఉన్నప్పటికీ, అనేకులు అతికష్టంమీద బొటాబొటిగా జీవనోపాధి సంపాదించుకోగలుగుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్‌ తరాన్ని అధిక విద్యా, పరిజ్ఞానాల తరమని చెప్పవచ్చు, అయినప్పటికీ అంతకంతకు ఎక్కువమందికి స్థిరమైన ఉద్యోగాలే కరువవుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత స్వేచ్ఛ మానవులకు ఉన్నట్లు అనిపిస్తున్నా, కోట్లాదిమంది భయం, అభద్రత, అనిశ్చిత వాతావరణంలోనే మనుగడ సాగిస్తున్నారు. మనచుట్టూ ఆకర్షణీయమైన అవకాశాలు ఉండవచ్చు, కానీ అన్ని స్థాయిల్లోనూ అవినీతి, అక్రమం పెరిగిపోవడం చాలామందిలో నిరాశను మిగిల్చింది.

మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, అవి ఏ ఒక్క దేశం లేదా కొన్నిదేశాలు కలిసినా పరిష్కరించలేనంత భీకరంగా ఉన్నాయి. అందువల్ల, ప్రపంచంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే, అన్నిదేశాలూ ఒకే ప్రభుత్వాధిపత్యం క్రిందకు రావాలి అని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఏనాడో అలాంటి ఆలోచనను బలపరిచాడు. 1946లోనే ఆయనిలా అన్నాడు: “ప్రపంచంలోని అధిక జనాభా శాంతిభద్రతలతో జీవించాలనే కోరుకుంటారని నేను బలంగా నమ్ముతున్నాను . . . శాంతి కొరకైన మానవాళి కోరిక కేవలం ప్రపంచవ్యాప్త ప్రభుత్వ స్థాపనతోనే నెరవేరుతుంది.”

ఇప్పటికి ఐదు దశాబ్దాలు గడిచిపోయినా, ఈ ప్రాథమిక అవసరం ఇంకా తీరలేదు. 21వ శతాబ్దపు సవాళ్లను పేర్కొంటూ, ఫ్రాన్సులోని పారిస్‌కు చెందిన ల మొండ్‌ వార్తాపత్రిక ఇలా వ్యాఖ్యానిస్తోంది: “ప్రపంచంలో జాతి సంహారం ఏ మూల జరిగినా వెంటనే జోక్యం చేసుకునే సామర్థ్యంగల ఒకే న్యాయవ్యవస్థ, ఒకే పరిపాలన, ఒకే రాజ్యాంగం ఉన్న ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించడం అత్యంత ప్రాముఖ్యం. అలాగే ఇకపై భూమంతా ఒకే దేశమన్న ఆలోచనను అంగీకరించడం కూడా ప్రాముఖ్యం.” మానవాళికి నిశ్చయంగా శాంతిపూర్వక భవిష్యత్తు ఉండేలా దీన్ని సాధించే శక్తిసామర్థ్యాలు ఎవరికి లేదా దేనికి ఉన్నాయి?

ఐక్యరాజ్య సమితి పరిష్కరించగలదా?

ప్రపంచ శాంతి కోసం చాలామంది ఐక్యరాజ్య సమితిపై ఆశలు పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి శాంతిభద్రతలు తీసుకురాగల ఒక ప్రభుత్వమా? దానిపై కురిపించే రాజకీయ ప్రశంసల జల్లు నిస్సందేహంగా ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంది. ఉదాహరణకు, అది విడుదల చేసిన 2000 “సహస్రాబ్ది ప్రకటన”లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఈ విధంగా తీర్మానించింది: “గత దశాబ్దంలో 50 లక్షలకుపైగా ప్రజల ప్రాణాలు బలిగొన్న యుద్ధ పీడనుండి, అంటే అది దేశంలో జరిగినా దేశాలమధ్య జరిగినా దాని నుండి మన ప్రజలను రక్షించడానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తాం.” అలాంటి ప్రకటనలను అనేక వర్గాల ప్రజలు కొనియాడి, శ్లాఘించారు. అంతేకాక అలాంటి ప్రకటనలు చేసి అది 2001 నోబుల్‌ బహుమతిని కూడా గెల్చుకుంది. ఐక్యరాజ్య సమితిని కీర్తిస్తూ నార్వేయన్‌ నోబుల్‌ కమిటీ ఇలా చెప్పింది: “అంతర్జాతీయ శాంతి సహకారాలు కేవలం ఐక్యరాజ్య సమితి ద్వారానే సార్థకమవుతాయి.”

అయినప్పటికీ, 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి నిజమైన, శాశ్వతమైన ప్రపంచ శాంతిని తీసుకురాగల ప్రభుత్వంగా నిరూపించుకుందా? లేదు, ఎందుకంటే దాని సభ్యదేశాల స్వీయాసక్తి, జాతీయాభిలాషలు దాని అనేక ప్రయత్నాలను భగ్నం చేశాయి. ప్రజాభిప్రాయాన్ని ఒక వార్తాపత్రిక సంపాదకుడి మాటల్లో చెప్పాలంటే, ఐక్యరాజ్య సమితి కేవలం “ప్రపంచ ప్రజల అభిప్రాయాలను కొలిచే ఒక విధమైన భారమితి” మాత్రమే, “సమస్యాంశాలతో నిండిన దాని ఎజెండా ఏ మాత్రం పురోగతి లేకుండా అనేక సంవత్సరాలుగా చర్చలకే పరిమితమైంది.” అందువల్ల, ‘ప్రపంచ దేశాలు ఒకనాటికి నిజంగా ఐక్యం కాగలవా?’ అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.

అయితే అలాంటి ఐక్యత త్వరలోనే సాధ్యం కాబోతుందని బైబిలు వెల్లడిచేస్తోంది. అదెలా సాధించబడుతుంది? దానిని ఏ ప్రభుత్వం తీసుకురాగలదు? జవాబుల కోసం దయచేసి తర్వాతి ఆర్టికల్‌ చదవండి.

[3వ పేజీలోని చిత్రం]

ప్రపంచ ప్రభుత్వం అవసరమని ఐన్‌స్టీన్‌ నొక్కిచెప్పాడు

[చిత్రసౌజన్యం]

ఐన్‌స్టీన్‌: U.S. National Archives photo