కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్య ప్రభుత్వం నేడు అదొక వాస్తవం

దేవుని రాజ్య ప్రభుత్వం నేడు అదొక వాస్తవం

దేవుని రాజ్య ప్రభుత్వం నేడు అదొక వాస్తవం

“అభివృద్ధిపరంగా వివిధ స్థాయిల్లోవున్న, విభిన్న సంస్కృతులున్న ఈ దేశాలన్నీ ఎలా ఏకీభవిస్తాయి? మరో గ్రహం నుండి ముట్టడి జరిగితే తప్ప మానవజాతి ఏకం కాలేదనే అభిప్రాయం ఉంది.”​—⁠ది ఏజ్‌, ఆస్ట్రేలియా వార్తాపత్రిక.

మరో గ్రహం నుండి ముట్టడా? అది ప్రపంచ దేశాలన్నిటినీ ఏకం చేస్తుందో లేదోగానీ, బైబిలు మాత్రం ప్రపంచ జనాంగాలన్నింటినీ ఏకం చేసే, కమ్ముకొస్తున్న విపత్తు గురించి ప్రవచిస్తోంది. ఆ విపత్తు నిజంగానే భూమ్యేతర శక్తులనుండే వస్తుంది.

ప్రాచీనకాల ఇశ్రాయేలు రాజైన దావీదు ప్రవచనార్థకంగా ఈ ప్రపంచ పరిస్థితి గురించి ప్రస్తావించాడు. దైవ ప్రేరణతో ఆయనిలా వ్రాశాడు: “మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.” (కీర్తన 2:⁠2, 3; అపొస్తలుల కార్యములు 4:​25, 26) ప్రపంచ పాలకులు ఏకీభవించి విశ్వ సృష్టికర్తయైన యెహోవాకు, ఆయన అభిషిక్తుడైన లేదా ఆయన నియమిత రాజైన యేసుక్రీస్తుకు విరోధంగా నిలబడతారని గమనించండి. అదెలా జరుగుతుంది?

బైబిలు కాలవృత్తాంతం ప్రకారం, నేరవేరిన ప్రవచనాల ప్రకారం, 1914వ సంవత్సరంలో పరలోకంలో యేసుక్రీస్తు రాజుగా దేవుని రాజ్యం స్థాపించబడింది. * ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నింటికి ఒకే తలంపు ఉంది. కొత్తగా స్థాపించబడిన రాజ్యానికి సంబంధించిన దేవుని సర్వాధికారానికి లోబడడానికి బదులు, వారు అధికారం చేజిక్కించుకునే పోరాటానికి నడుం బిగించారు అంటే భీకర యుద్ధంలో లేదా మొదటి ప్రపంచ యుద్ధంలో తలమునకలయ్యారు.

మానవ పాలకులు అలా స్పందించడాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? “ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును.” ఆ తర్వాత యెహోవా రాజ్యానికి అభిషిక్త రాజైన తన కుమారునికి ఇలా చెబుతాడు: “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.”​—⁠కీర్తన 2:4, 5, 8, 9.

అలా వ్యతిరేకిస్తున్న జనాంగాలన్నీ చివరకు ఇనుప దండముతో అర్మమెగిద్దోనులో లేదా హార్‌మెగిద్దోనులో నలుగగొట్టబడతాయి. ఈ ఆఖరి ఘట్టాన్ని బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అని వర్ణిస్తోంది. ఆ యుద్ధానికి “లోకమంతట ఉన్న రాజులు” పోగుచేయబడుతున్నారు. (ప్రకటన 16:​14, 15) దయ్యాల ప్రభావం క్రింద భూ జనాంగాలన్నీ చివరకు ఏకభావంతో అంటే సర్వశక్తిగల దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనే ఏకైక ఉద్దేశంతో సంఘటితమవుతాయి.

దేవుని సర్వాధికారానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మానవులు ఏకీభవించే సమయం వేగంగా సమీపిస్తోంది. హాస్యాస్పదంగా, వారి “ఐక్యత” వారికి వ్యక్తిగత ప్రయోజనాలను తీసుకురాదు. బదులుగా, వారి చర్య యావత్‌ మానవాళి ఎంతో ఎదురుచూస్తున్న శాంతికి పరిచయ ఘటనవుతుంది. ఏ విధంగా? ఆ చివరి యుద్ధంలో, దేవుని రాజ్యం “ముందు చెప్పిన [ఈ లోకములోని] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:​44) ప్రపంచ శాంతి కావాలన్న మానవాళి కోరికను తీర్చే ప్రభుత్వం ఏ మానవ సంస్థా కాదుగానీ దేవుని రాజ్యమే.

ఆ రాజ్య ప్రభుత్వపు ముఖ్య కార్యనిర్వాహకుడు

“నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని అనేకమంది యథార్థపరులు ప్రార్థించింది ఆ రాజ్యం కోసమే. (మత్తయి 6:​9, 10) దేవుని రాజ్యం ఏదో అగోచరమైన హృదయ స్థితి కాదుగానీ, అది పరలోకంలో 1914లో ఆరంభమైనప్పటి నుండి అద్భుత కార్యాలు నెరవేర్చిన ఒక నిజమైన ప్రభుత్వం. నేడు దేవుని రాజ్యం సంపూర్ణ కార్యాచరణలో ఉందని వివరించే కీలకాంశాలను కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

మొట్టమొదట, ఆ ప్రభుత్వానికి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ఆధ్వర్యంలో శక్తిమంతమైన, సమర్థవంతమైన కార్య నిర్వహణా అధికారంగల శాఖ ఉంది. సా.శ. 33లో యెహోవా దేవుడు, యేసుక్రీస్తును క్రైస్తవ సంఘానికి శిరస్సుగా నియమించాడు. (ఎఫెసీయులు 1:​22) అప్పటి నుండి, యేసు తన శిరస్సత్వాన్ని నిర్వహిస్తూ తన పాలనా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదాహరణకు, మొదటి శతాబ్దంలో యూదయలో గొప్ప కరవు ప్రబలినప్పుడు, క్రైస్తవ సంఘం దాని సభ్యుల సహాయార్థమై వెంటనే చర్యలు తీసుకుంది. సహాయ కార్యక్రమం వ్యవస్థీకరించబడింది, పౌలు బర్నబాలు సహాయ సామగ్రితో అంతియొకయ నుండి అక్కడకు పంపించబడ్డారు.​—⁠అపొస్తలుల కార్యములు 11:27-30.

ఇప్పుడు రాజ్య ప్రభుత్వం స్థాపించబడి కార్యాచరణలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు అంతకంటే ఎక్కువే చేస్తాడని మనం ఆశించవచ్చు. విపత్తులు అంటే భూకంపాలు, కరవులు, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాలు విరుచుకుపడినప్పుడు యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘం, తాకిడికి గురైన ఆయా ప్రాంతాల్లోని తోటి విశ్వాసులకు, ఇతరులకు సహాయం చేయడానికి తక్షణమే స్పందిస్తారు. ఉదాహరణకు, 2001 జనవరి ఫిబ్రవరిలలో ఎల్‌సాల్వడార్‌లో వినాశనకరమైన భూకంపం సంభవించినప్పుడు, ఆ దేశమందంతటా సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి, కెనడా, గ్వాటిమాల, అమెరికా నుండి గుంపులుగా వచ్చిన యెహోవాసాక్షులు తగిన సహాయం అందించారు. వారి ఆరాధనా స్థలాలు మూడింటితోపాటు 500లకు పైగా ఇళ్లు త్వరితగతిన పునర్నిర్మించబడ్డాయి.

దేవుని రాజ్య ప్రభుత్వ ప్రజలు

దేవుని పరలోక రాజ్యం 1914లో స్థాపించబడినప్పటి నుండి, ప్రపంచ నలుమూలల నుండి దాని ప్రజలను సమకూరుస్తూ, వ్యవస్థీకరిస్తూ ఉంది. ఇది, యెషయా వ్రాసిన ఈ అసాధారణ ప్రవచన నెరవేర్పుగా జరుగుతోంది: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము [ఉన్నతపరచబడిన ఆయన ఆరాధన] పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.” “జనులు గుంపులు గుంపులుగా” ఆ పర్వతానికి వెళ్లి యెహోవా ఉపదేశాలకు, నియమాలకు హత్తుకుంటారని ఆ ప్రవచనం వివరిస్తోంది.​—⁠యెషయా 2:⁠2, 3.

ఇది ఆధునిక కాలాల్లో అతి విశిష్ఠమైన లక్ష్యసాధనకు, అంటే భూవ్యాప్తంగా 230 కంటే ఎక్కువ దేశాల్లో 60,00,000 కంటే ఎక్కువమంది క్రైస్తవులు అంతర్జాతీయ సహోదరత్వాన్ని ఆస్వాదించేందుకు దారితీసింది. యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశాల్లో, జాతీయ, సాంస్కృతిక, భాషా హద్దులు దాటి సమకూడిన విస్తారమైన ప్రజల ప్రేమను, సమాధానాన్ని, ఐక్యతనుచూసిన వారు తరచూ విస్మయమొందుతున్నారు. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) వందలకొద్దీ జాతుల గుంపుల్ని సమాధాన సామరస్యాలతో ఒక దగ్గరకు చేర్చగలగాలంటే ఆ ప్రభుత్వం సమర్థవంతమైనదిగా, స్థిరమైనదిగా, వాస్తవమైనదిగా ఉండాలని మీరు ఒప్పుకోరా?

దేవుని రాజ్యం మరియు విద్య

ప్రతీ ప్రభుత్వానికి దాని పౌరులు పాటించవలసిన నియమాలు ఉంటాయి, ఆ ప్రభుత్వ పాలన క్రింద జీవించాలని కోరుకునే ప్రతీ ఒక్కరూ ఆ నియమాలు పాటించాలి. అదే విధంగా, దేవుని రాజ్య ప్రజలుగా అర్హులయ్యే వారందరూ తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు దానికున్నాయి. అయితే, ఎన్నో విభిన్న నేపథ్యాలున్న ఆ ప్రజలందరూ ఒకే విధమైన నియమాలను అంగీకరించి, వాటికి కట్టుబడి ఉండేలా చేయడం నిశ్చయంగా బృహత్తర కార్యమే. కాబట్టి ఇది, దేవుని రాజ్య వాస్తవికతను, అంటే కేవలం మనస్సులనే కాదు హృదయాలను కూడా చేరి వాటిని మార్చేంతటి ఫలవంతమైన దాని విద్యా కార్యక్రమ వాస్తవికతను రుజువుపరిచే మరో అంశం.

ఆ రాజ్య ప్రభుత్వం ఈ బృహత్తర కార్యాన్ని ఎలా నెరవేరుస్తుంది? “ఇంటింట” ప్రకటించడమనే అపొస్తలుల పద్ధతిని అనుసరించడం ద్వారా, ఆయా వ్యక్తులకు వ్యక్తిగతంగా దేవుని వాక్యం బోధించడం ద్వారా. (అపొస్తలుల కార్యములు 5:42; 20:​20) ఈ విధమైన విద్య ఎంత ఫలవంతంగా ఉంది? ఒక స్త్రీ యెహోవాసాక్షులతో అధ్యయనం చేయకుండా ఆమెను అడ్డుకోవాలని తాను చేసిన ప్రయత్నాల గురించి జాక్‌ జాన్సన్‌ అనే క్యాథలిక్‌ ప్రీస్టు, కెనడాకు చెందిన ఒక వార్తాపత్రికకు ఇలా వ్రాశాడు: “నాకు చాలా ఆశాభంగం కలిగింది, విజయం సాధించడం నావల్ల కాదని గ్రహించాను. బయటకు కదల్లేని ఆ యువ తల్లితో యెహోవాసాక్షులైన ఆ స్త్రీలు అనేక నెలలుగా చక్కని సంబంధం పెంచుకున్నట్లు నేను అర్థం చేసుకోవడం ఆరంభించాను. ఆమెకు సహాయం చేస్తూ, స్నేహం వృద్ధిచేసుకుంటూ వారు ఆమెతో సన్నిహిత అనుబంధం పెంచుకున్నారు. త్వరలోనే ఆమె వారి మతంలో క్రియాశీల సభ్యురాలయ్యింది, ఆమెను అడ్డుకోవడం నావల్ల కాలేదు.” యెహోవాసాక్షులు బోధించే బైబిలు సందేశాన్ని బట్టి, వారి క్రైస్తవ ప్రవర్తనను బట్టి ఈ పూర్వపు క్యాథలిక్‌ హృదయం కదిలించబడినట్లే, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలు స్పృశించబడుతున్నాయి.

ఈ విధమైన విద్య అంటే రాజ్య విద్య బైబిలు ఆధారితమైనది, ఇది నైతిక విషయాల పట్ల బైబిలు విలువలను, ప్రమాణాలను సమర్థిస్తుంది. ప్రజల నేపథ్యమేదైనా వారు పరస్పరం ప్రేమించుకోవాలనీ, గౌరవించుకోవాలనీ అది బోధిస్తోంది. (యోహాను 13:​34, 35) “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అనే బోధనకు స్పందించేలా కూడా అది ప్రజలకు సహాయం చేస్తోంది. (రోమీయులు 12:⁠2) లక్షలాదిమంది తమ పూర్వ జీవన విధానాన్ని విసర్జించి, రాజ్య ప్రభుత్వ నియమాలకు, సూత్రాలకు సంతోషంగా కట్టుబడడం ద్వారా ప్రస్తుతం సంతోష సమాధానాలు పొందడమే కాక భవిష్యత్తుకు సంబంధించిన తేజోవంతమైన ఉత్తరాపేక్షను కూడా పొందారు.​—⁠కొలొస్సయులు 3:9-11.

ఈ ప్రపంచవ్యాప్త ఐక్యత సాధించడానికి కావలికోట అనే ఈ పత్రిక, అసాధారణ రీతిలో సహాయం చేసింది. వ్యవస్థీకృత అనువాద పద్ధతులు, వివిధ భాషా ప్రచురణ సాధనసంపత్తి ద్వారా కావలికోటలోని ముఖ్యమైన ఆర్టికల్స్‌ ఏక కాలంలో 135 భాషల్లో ప్రచురించబడుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగావున్న దీని పాఠకుల్లో 95 శాతానికి పైగా ఇందులోని విషయాలను తమ సొంత భాషలో ఏక కాలంలో అధ్యయనం చేయగలుగుతున్నారు.

ఒక మార్మోన్‌ మత రచయిత తన చర్చికి సంబంధించని ఇతర మిషనరీ సేవల విజయాల లిస్టు తయారుచేశాడు. యెహోవాసాక్షులు ప్రచురించే కావలికోట, తేజరిల్లు! సువార్త ప్రకటించే అత్యుత్తమ పత్రికలని ఆ లిస్టులో పేర్కొంటూ ఆయనిలా అన్నాడు: “కావలికోట లేదా తేజరిల్లు! పత్రికలు స్వయం తృప్తిని పెంచి పోషిస్తున్నట్లు ఎవ్వరూ ఎప్పటికీ నిందించలేరు. దానికి భిన్నంగా అవి ఇతర మత ప్రచురణల్లో నాకు అరుదుగా కనిపించే అప్రమత్తతను పెంపొందిస్తున్నాయి. కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలు వాస్తవాలపై ఆధారపడి, పరిశోధనాత్మకంగా, ప్రస్తుత లోకంలోని వాస్తవిక ఘటనలను తెలియజేసేవిగా ఉంటాయి.”

దేవుని రాజ్యం పూర్తి స్థాయి కార్యాచరణలో ఉన్న ఒక వాస్తవమని తిరుగులేని రీతిలో రుజువవుతోంది. యెహోవాసాక్షులు సంతోషంగా, చురుకుగా తమ పొరుగువారితో “ఈ రాజ్య సువార్త” పంచుకుంటూ దాని ప్రజలయ్యేందుకు వారిని ఆహ్వానిస్తున్నారు. (మత్తయి 24:​14) అలాంటి ఉత్తరాపేక్ష మీకు ఆకర్షణీయంగా ఉందా? ఆ రాజ్య విద్యను పొందుతూ దాని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి కృషిచేస్తున్న వారితో సహవసించడం వల్ల కలిగే ఆశీర్వాదాలను మీరూ అనుభవించవచ్చు. అంతకంటే మిన్నగా, ‘నీతి నివసించే’ వాగ్దత్త నూతనలోకంలో రాజ్య పాలన క్రింద జీవించే ఉత్తరాపేక్షను మీరు కలిగివుండవచ్చు.​—⁠2 పేతురు 3:13.

[అధస్సూచి]

^ పేరా 5 వివరణాత్మక చర్చకోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో “దేవుని రాజ్యం పరిపాలిస్తుంది” అనే 10వ అధ్యాయం చూడండి.

[4, 5వ పేజీలోని చిత్రం]

1914లో జనాంగాలు ప్రపంచ యుద్ధంలో తలమునకలయ్యాయి

[6వ పేజీలోని చిత్రాలు]

స్వచ్ఛంద సహాయ సేవ కార్యశీల క్రైస్తవ ప్రేమకు రుజువు

[7వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు ఒకే విధమైన విద్యా కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతున్నారు