పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
“సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని” అని యేసు తన శిష్యులతో అనడంలో ఆయన ఉద్దేశమేమిటి?
యేసు 70 మంది శిష్యులను ఎంపిక చేసుకొని “తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా” పంపించాడు. ఆ 70 మంది తమకు లభించిన విజయాన్ని బట్టి ఎంతో సంతోషపడుతూ తిరిగివచ్చి, “ప్రభువా, దయ్యములు కూడా నీ నామమువలన మాకు లోబడుచున్నవని” చెప్పారు. అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు: “సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని.”—లూకా 10:1, 17, 18.
మొదటిసారి చూస్తే, యేసు అప్పటికే జరిగిన సంఘటనను సూచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే యేసు ఆ మాటలు పలికిన 60 సంవత్సరాల తర్వాత, వృద్ధ అపొస్తలుడైన యోహాను అదే తరహా భాషను ఉపయోగిస్తూ ఇలా వ్రాశాడు: “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.”—ప్రకటన 12:9.
యోహాను ఆ మాటలు వ్రాసేటప్పటికి, సాతాను ఇంకా పరలోకంలోనే ఉన్నాడు. అలాగని మనకెలా తెలుసు? ఎలాగంటే ప్రకటన పుస్తకం ఒక ప్రవచన గ్రంథం, చరిత్ర కాదని గుర్తుంచుకోవాలి. (ప్రకటన 1:1) కాబట్టి, యోహాను ఆ గ్రంథం వ్రాసేసరికి సాతాను ఇంకా భూమ్మీదికి పడద్రోయబడలేదు. నిజానికి, ఇది 1914లో దేవుని రాజ్యానికి రాజుగా యేసు సింహాసనాన్ని అధిష్ఠించిన కొద్దికాలం వరకు జరగలేదని రుజువులు చూపిస్తున్నాయి. *—ప్రకటన 12:1-10.
అలాంటప్పుడు, ఆ సంఘటన అప్పటికే జరిగిపోయినట్లు సాతాను పరలోకం నుండి పడద్రోయబడ్డాడని యేసు ఎందుకు మాట్లాడాడు? యేసు తన శిష్యులు అనుచిత అహంకారం ప్రదర్శించినందుకు వారిని గద్దిస్తున్నాడని కొందరు విద్వాంసులు సూచిస్తున్నారు. ఆయన నిజానికి ‘మీరు దయ్యాలపై విజయం సాధించారు, అంతమాత్రాన మీరు గర్వించకండి. సాతాను గర్విష్ఠి అయ్యాడు, అది అతని సత్వర పతనానికి దారితీసింది’ అని చెప్పినట్లుగా వారు నమ్ముతున్నారు.
ఈ విషయంలో మనం పిడివాదం చేయడానికి వీల్లేదు. అయితే యేసు తన శిష్యులతోపాటు సంతోషిస్తూ సాతాను భవిష్యత్తులో పడిపోవడాన్నే సూచిస్తున్నాడని అనుకోవడమే సబబుగా అనిపిస్తోంది. శిష్యులకంటే ఎక్కువగా యేసుకే అపవాది దుష్ట శత్రుత్వం గురించి తెలుసు. తన అపరిపూర్ణ మానవ శిష్యులకు బలమైన దయ్యాలు లోబడుతున్నాయని విన్నప్పుడు యేసు ఎంత సంతోషించి ఉంటాడో ఊహించండి! దయ్యాలు ఆ విధంగా లోబడడం, ప్రధాన దూతయైన మిఖాయేలుగా యేసు సాతానుతో యుద్ధం చేసి అతణ్ణి పరలోకం నుండి భూమ్మీదికి పడద్రోసే భవిష్యత్తులోని దినానికి కేవలం పూర్వఛాయ మాత్రమే.
“సాతాను పడుట చూచితిని” అని యేసు చెప్పినప్పుడు, ఆయన సాతాను ఖచ్చితంగా పడిపోవడాన్నే నొక్కిచెబుతున్నాడని స్పష్టమవుతోంది. భవిష్యత్తు సంఘటనలను భూతకాలంలో మాట్లాడే ఇతర బైబిలు ప్రవచనాల్లాగే ఇదీ ఉంది. ఉదాహరణకు, యెషయా 52:13-53:12లో మెస్సీయాకు సంబంధించిన ప్రవచనంలో భూతభవిష్యత్తు కాలాలు కలిపి చెప్పబడడం గమనించండి. యేసు తన తండ్రి సంకల్పానికి అనుగుణంగా, సాతాను పరలోకం నుండి పడద్రోయబడతాడనే తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అలాగే దేవుని నియమిత కాలంలో సాతాను అతని దయ్యాలు అగాధంలో బంధించబడి, ఆ తర్వాత శాశ్వతంగా నాశనం చేయబడతారని కూడా యేసుకు తెలుసు.—రోమీయులు 16:20; హెబ్రీయులు 2:14; ప్రకటన 20:1-3, 7-10.
[అధస్సూచి]
^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 10వ అధ్యాయాన్ని, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలోని 27వ అధ్యాయాన్ని చూడండి.