కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా బలం మీద ఆధారపడే మేము జీవించాం

యెహోవా బలం మీద ఆధారపడే మేము జీవించాం

జీవిత కథ

యెహోవా బలం మీద ఆధారపడే మేము జీవించాం

ఎర్జేబెట్‌ హాఫ్నర్‌ చెప్పినది

నేను జెకోస్లోవేకియా విడిచిపోవాలనే ఉత్తర్వు జారీ చేయబడిందని తెలియగానే “నిన్ను ఈ దేశం నుండి బహిష్కరించడానికి నేను వాళ్లను అనుమతించను” అని అంటూ, టీబార్‌ హాఫ్నర్‌ ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు అంగీకరిస్తే, నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను, అప్పుడు నువ్వు ఇక ఎప్పటికీ నాతోనే ఉండిపోవచ్చు.”

ఊహించని ఆ ప్రతిపాదన తర్వాత కొన్ని వారాలకే అంటే 1938 జనవరి 29న నేను నా కుటుంబానికి మొట్టమొదట సాక్ష్యమిచ్చిన క్రైస్తవ సహోదరుడైన టీబార్‌ను పెళ్లిచేసుకున్నాను. అదంత సులభమైన నిర్ణయమేమీ కాదు. నాకప్పుడే 18 ఏళ్లు నిండాయి, పైగా యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకురాలిగా నేను యౌవన సంవత్సరాలను కేవలం యెహోవా సేవకే అంకితం చేయాలని కోరుకున్నాను. నేను ఏడ్చాను, ప్రార్థించాను. ఆ తర్వాత నెమ్మదిగా తేరుకొని టీబార్‌ ప్రతిపాదన కేవలం నాపై దయతో చేసినది కాదని గ్రహించాను, నన్ను యథార్థంగా ప్రేమించిన ఈ వ్యక్తితోనే జీవించాలని నేను నిర్ణయించుకున్నాను.

అయితే నేను దేశబహిష్కరణ ప్రమాదంలో ఎందుకున్నాను? ప్రజాస్వామిక వ్యవస్థని, మత స్వాతంత్ర్యం ఉందని గర్వించే దేశంలోనే నేను నివసిస్తున్నాను. అయితే ఇక్కడ నేను నా నేపథ్యం గురించి మీకు మరింత తెలియజేయడం మంచిది.

హంగరిలో, బుడాపెస్ట్‌కు తూర్పుగా సుమారు 160 కిలోమీటర్ల దూరంలోవున్న షేయాసెంట్‌పీటర్‌ గ్రామంలో 1919, డిసెంబరు 26న నేను గ్రీకు-క్యాథలిక్‌ మత నేపథ్యంగల తల్లిదండ్రులకు జన్మించాను. విషాదకరంగా, నేను పుట్టకముందే నాన్న చనిపోయారు. ఆ తర్వాత కొద్దికాలానికే మా అమ్మ నలుగురు పిల్లలున్న విధురుణ్ణి మళ్లీ పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత మేము అప్పటి జెకోస్లోవేకియాలోని అందమైన లుచనియెట్జ్‌ అనే నగరానికి మకాం మార్చాము. ఆ కాలంలో సవతి తండ్రి కుటుంబంలో జీవించడం అంత సులభం కాదు. ఐదుగురు పిల్లల్లో అందరికంటే చిన్నదాన్నయిన నేను వాహనానికి పనికిరాని ఐదవ చక్రంలా ఉన్నట్లు భావించేదాన్ని. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో నా కనీస అవసరాలు తీరకపోవడమే కాక తల్లిదండ్రుల సాధారణ శ్రద్ధ, ప్రేమ కూడా కరవయ్యాయి.

జవాబు ఎవరికైనా తెలుసా?

నాకు 16 సంవత్సరాల వయసప్పుడే నన్ను చాలా ప్రశ్నలు చుట్టుముట్టాయి. నేను మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రను గొప్ప ఆసక్తితో చదివి, క్రైస్తవ దేశాలని చెప్పుకునే నాగరిక దేశాల మధ్య జరిగిన మారణహోమం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంతేకాకుండా, ఎక్కడ చూసినా యుద్ధ స్వభావం పెచ్చరిల్లడం నేను గమనించాను. నేను పొరుగువారి పట్ల ప్రేమ గురించి చర్చీలో నేర్చుకున్నదానితో ఏదీ పొంతనగా లేదు.

దానితో నేను రోమన్‌ క్యాథలిక్‌ ప్రీస్టు దగ్గరకు వెళ్లి, “క్రైస్తవులుగా మనం ఏ ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి​—⁠యుద్ధంలో చేరి పొరుగువాళ్లను చంపడమా లేక వారిని ప్రేమించడమా?” అని అడిగాను. ఆయన నా ప్రశ్నకు మండిపడి, తనకు పై అధికారులు చెప్పినదే బోధించానని జవాబిచ్చాడు. కాల్విన్‌ మతశాఖ పరిచారకుని దగ్గరికి, ఆ తర్వాత యూదా మతబోధకుని దగ్గరకు వెళ్లినప్పుడు కూడా అలాగే జరిగింది. నేను వేసిన ప్రశ్నకు వాళ్లు నోరు వెళ్లబెట్టడం తప్ప నాకెలాంటి జవాబూ లభించలేదు. చివరకు నేను ఒక లూథరన్‌ పరిచారకుని దగ్గరకు వెళ్లాను. ఆయన కూడా చికాకుపడ్డాడు, అయితే నేను వచ్చేముందు “నీకు దాని గురించి నిజంగా తెలుసుకోవాలనుంటే, వెళ్లి యెహోవాసాక్షులను అడుగు” అని చెప్పాడు.

సాక్షులను కలుసుకోవడానికి నేను విఫలయత్నం చేశాను. కొన్ని రోజుల తర్వాత, నేను పని నుండి ఇంటికి తిరిగివస్తూ, తలుపు తెరచి ఉండడం, ఓ అందమైన యువకుడు గుమ్మం దగ్గర నిలబడి అమ్మకు బైబిలు చదివి వినిపించడం గమనించాను. ‘ఆయన యెహోవాసాక్షే అయుంటాడు’ అనే తలంపు చటుక్కున నా మదిలో మెదిలింది. ఆ యువకుణ్ణి, అంటే టీబార్‌ హాఫ్నర్‌ను ఇంట్లోకి ఆహ్వానించి, యథావిధిగా నా ప్రశ్నలన్నీ ఆయనను అడిగాను. ఆయన తన సొంత మాటల్లో జవాబులు చెప్పడానికి బదులు, నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నం గురించి, అలాగే మనం జీవిస్తున్న కాలాల గురించి బైబిలేమి చెబుతుందో నాకు చూపించాడు.​—⁠యోహాను 13:​34, 35; 2 తిమోతి 3:​1-5.

కొద్ది నెలల్లోనే, నాకు 17 ఏండ్లుసంవత్సరాలు నిండకముందే నేను బాప్తిస్మం తీసుకున్నాను. నేనెంతో కష్టపడి తెలుసుకున్న ఈ ప్రశస్త సత్యాలను ప్రతీ ఒక్కరూ వినాలని భావించాను. జెకోస్లోవేకియాలో ఆ 1930వ దశాబ్దపు చివరి సంవత్సరాల్లో ప్రకటించడం పెద్ద సవాలుగా ఉన్నప్పటికీ, నేను పూర్తికాల పరిచర్య ఆరంభించాను. మన సేవ అధికారికంగా రిజిస్టర్‌ అయినప్పటికీ, మతనాయకులు పురికొల్పిన తీవ్ర వ్యతిరేకతను మేము ఎదుర్కొన్నాం.

హింసను మొదటిసారి చవిచూడడం

1937 చివరి నెలల్లో ఒకరోజు లుచనియెట్జ్‌ సమీపంలోని గ్రామంలో నేను, మరో క్రైస్తవ సహోదరి కలిసి ప్రకటిస్తున్నాం. ఎంతోసేపు గడవకముందే మమ్మల్ని అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. అక్కడి గార్డు “మీరిక్కడ చావబోతున్నారు” అంటూ జైలు గది తలుపు ధబాలున మూశాడు.

సాయంత్రానికల్లా మరో నలుగురు మాకు తోడయ్యారు. వారిని ఓదారుస్తూ వారికి సాక్ష్యమివ్వడం ఆరంభించాం. వారు తేరుకోవడంతో, ఆ రాత్రంతా మేము వారితో బైబిలు సత్యాన్ని పంచుకున్నాం.

ఉదయం ఆరు గంటలకు గార్డు నన్ను జైలుగది బయటకు పిలిచాడు. “మనం మళ్లీ దేవుని రాజ్యంలో కలుసుకుందాం” అని నా సహవాసికి చెప్పి, ఆమె ఒకవేళ విడుదలైతే జరిగింది నా కుటుంబానికి తెలియజేయమని అడిగాను. మౌనంగా ప్రార్థన చేసుకొని ఆ గార్డు వెంట వెళ్లాను. ఆయన జైలు ఆవరణలోవున్న తన ఇంటికి నన్ను తీసుకెళ్లాడు. “చూడమ్మా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలడగాలి” అంటూ ఆయన, “గత రాత్రి నువ్వు దేవుని పేరు యెహోవా అని చెప్పావు. అది బైబిల్లో ఎక్కడవుందో నాకు చూపించగలవా?” అని అడిగాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఉపశమనం! ఆయన తన బైబిలు తెచ్చుకున్నాడు, నేను ఆయనకు ఆయన భార్యకు యెహోవా పేరు చూపించాను. రాత్రి మేము ఆ నలుగురు స్త్రీలతో చర్చించిన అంశాలపై ఆయన చాలా ప్రశ్నలు అడిగాడు. నేనిచ్చిన జవాబులతో తృప్తిపడి నాకు, నా సహవాసికి అల్పాహారం తయారుచేయమని తన భార్యకు చెప్పాడు.

రెండు రోజుల తర్వాత మేము విడుదల చేయబడ్డాం, అయితే నేను హంగరి దేశస్థురాలిని కాబట్టి నేను జెకోస్లోవేకియా విడిచిపోవాలని ఒక న్యాయాధిపతి తీర్పు చెప్పాడు. ఈ సంఘటన జరిగిన తర్వాతే టీబార్‌ హాఫ్నర్‌ తనను పెళ్లి చేసుకొమ్మని నన్నడిగాడు. అలా నేనాయనను పెళ్లిచేసుకొని మా అత్త వారింటికి వెళ్ళాను.

హింస తీవ్రరూపం దాల్చడం

టీబార్‌కు సంస్థాపరంగా చేయవలసిన పని ఉన్నప్పటికీ, దంపతులుగా మేము ప్రకటనా పనిలో కొనసాగాం. 1938 నవంబరులో హంగరి సైనికులు మా నగరంలోకి ప్రవేశించడానికి కొద్దిరోజుల ముందు మా కుమారుడు జూనియర్‌ టీబార్‌ జన్మించాడు. ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. జెకోస్లోవేకియాలో అధికభాగాన్ని హంగరి ఆక్రమించుకొని, ఆ ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న యెహోవాసాక్షులపై తీవ్ర హింసను తీసుకొచ్చింది.

1942, అక్టోబరు 10న టీబార్‌ కొంతమంది సహోదరులను కలుసుకోవడానికి డెబ్రెసెన్‌ వెళ్లారు. అయితే, ఆయన ఎప్పటిలాగే ఈ సారి మాత్రం వెనక్కి తిరిగిరాలేదు. అక్కడేమి జరిగిందో ఆయన ఆ తర్వాత నాకు చెప్పారు. వాళ్లు కలుసుకోవలసిన వంతెన మీద సహోదరులకు బదులు పనివాళ్ల దుస్తుల్లో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు అక్కడికి చేరుకోవలసిన నా భర్తకోసం, పాల్‌ నాజ్‌పాల్‌ కోసం వేచివున్నారు. ఆ పోలీసులు వాళ్లను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి, నొప్పితో స్పృహ కోల్పోయేంత వరకు వారి అరికాళ్లపై లాఠీలతో కొట్టారు.

ఆ తర్వాత బూట్లు వేసుకొని నిలబడమని వారికి ఆజ్ఞాపించారు. విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ వారిని బలవంతంగా రైల్వే స్టేషనుకు నడిపించారు. పోలీసులు అక్కడకు చూడ్డానికి కూడా వీల్లేనంతగా తలకు బ్యాండేజి చుట్టబడిన మరో వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన సహోదరుడైన ఆండ్రాష్‌ పిలింక్‌, ఆయన కూడా సహోదరులను కలుసుకోవడానికి వచ్చినవాడే. రైల్లో నా భర్తను బుడాపెస్ట్‌ సమీపంలోని ఏలాగ్‌ నిర్బంధ శిబిరానికి తీసుకెళ్లారు. దెబ్బలతో వాచిపోయిన టీబార్‌ పాదాలు చూసి అక్కడి గార్డుల్లో ఒకరు హేళనగా “కొందరెంత క్రూరంగా ప్రవర్తిస్తారో కదా! బాధపడొద్దు, మేం బాగుచేస్తాం” అన్నాడు. ఆ వెంటనే మరో ఇద్దరు గార్డులు నెత్తురు కారేలా టీబార్‌ పాదాలపై కొట్టారు. కొద్ది నిమిషాల్లోనే ఆయన స్పృహ కోల్పోయారు.

ఆ మరుసటి నెల టీబార్‌తోపాటు మరో 60 మంది సహోదర సహోదరీలను న్యాయవిచారణకు నిలబెట్టారు. సహోదరులైన ఆండ్రాస్‌ బార్టా, డానెష్‌ ఫాలూవేగీ, యానోష్‌ కోనరాడ్‌లకు ఉరిశిక్ష విధించబడింది. సహోదరుడు ఆండ్రాష్‌ పిలింక్‌కు జీవిత ఖైదు, నా భర్తకు 12 సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది. వారు చేసిన నేరమేమిటి? వాళ్లు దేశ ద్రోహానికి పాల్పడ్డారనీ, సైనిక సేవను నిరాకరించారనీ, గూఢచారులనీ, అతి పవిత్రమైన చర్చీని దూషించారనీ ప్రభుత్వ న్యాయవాది నిందించాడు. మరణశిక్షలు ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చబడ్డాయి.

నా భర్తను అనుసరించడం

డెబ్రెసెన్‌లో సహోదరులను కలవడానికి టీబార్‌ వెళ్లిన రెండు రోజుల తర్వాత, నేను ఉదయం ఆరుగంటలకే నిద్రలేచి బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. అకస్మాత్తుగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. ‘అదిగో, వాళ్లు వచ్చేశారు’ అని అనుకున్నాను. ఆరుగురు పోలీసులు లోపలికి వచ్చి ఇంటిని సోదా చేయడానికి తమకు అనుమతి ఉందని చెప్పారు. ఇంట్లో ఉన్నవారందరినీ అరెస్టు చేసి మా మూడు సంవత్సరాల కుమారునితో సహా అందరినీ పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఆ రోజే మమ్మల్ని హంగరిలోని పీటర్‌వెసారా జైలుకు తరలించారు.

అక్కడికి చేరుకున్న తర్వాత, నాకు జ్వరం రావడంతో ఇతర ఖైదీలకు దూరంగా ఉంచారు. నేను కోలుకున్న తర్వాత, ఇద్దరు సైనికులు నేనున్న జైలు గదిలోకి వచ్చి నా విషయమై వాదులాడుకోవడం ఆరంభించారు. “ఆమెను మనం కాల్చివేయాలి! నేనామెను కాల్చివేస్తాను!” అని వారిలో ఒక సైనికుడు అన్నాడు. అయితే అలా వారు కాల్చివేయడానికి ముందు నా పరిస్థితి చూడాలని ఇంకొక సైనికుడు అన్నాడు. నన్ను బ్రతకనివ్వండని నేను వారిని బ్రతిమాలాను. చివరకు వాళ్లు నా జైలుగది విడిచి వెళ్లిపోయారు, నాకు సహాయం చేసినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను.

గార్డులు ఒక ప్రత్యేక పద్ధతిలో విచారించేవాళ్లు. బోర్లా పడుకోమని నాకు ఆజ్ఞాపించి, నోట్లో సాక్సులు కుక్కి, కాళ్లూ చేతులూ కట్టేసి నెత్తురు కారేంతవరకు కొరడాలతో కొట్టారు. ఆ సైనికుల్లో ఒకరు తాను అలసిపోయానని చెప్పినప్పుడే కొట్టడం ఆపుజేశారు. నా భర్త అరెస్టు చేయబడిన రోజు ఆయన ఎవరిని కలుసుకోవడానికి వెళ్లాడని వాళ్ళు నన్నడిగారు. నేను చెప్పలేదు, దానితో మూడు రోజులపాటు ఆపకుండా నన్నలా కొడుతూనే ఉన్నారు. నాల్గవ రోజు, నేను మా బాబును మా అమ్మ దగ్గర వదిలి రావడానికి అనుమతించారు. ఎముకలు కొరికే చలిలో, పచ్చి పుండుగా మారిన నా వీపుమీద మా బాబును మోసుకుంటూ సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషనుకు నడిచివెళ్లాను. అక్కడ నుండి నేను రైల్లో ఇంటికి చేరుకున్నాను, అయితే ఆ రోజే నేను వెనక్కి జైలుకు వచ్చెయ్యాలి.

బుడాపెస్ట్‌ జైల్లో నాకు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అక్కడికి చేరుకున్న తర్వాత టీబార్‌ కూడా అక్కడే ఉన్నట్లు నాకు తెలిసింది. అడ్డంగా ఉన్న ఇనుప కంచెలో నుంచి కొద్ది నిమిషాలే అయినా, మేమిద్దరం కలిసి మాట్లాడుకునే అనుమతి లభించినందుకు నేనెంత సంతోషపడ్డానో! ఆ ప్రశస్తమైన క్షణాలను బట్టి మేమిద్దరం యెహోవా ప్రేమను చవిచూసి బలపరచబడ్డాం. మేము తిరిగి కలుసుకునేలోపు భయంకరమైన పరీక్షల్ని అనుభవించాం, ఎన్నోసార్లు వెంట్రుకవాసిలో మరణం నుండి తప్పించుకున్నాం.

ఒక జైలు నుండి మరో జైలుకు

దాదాపు 80 మంది సహోదరీలం కేవలం ఒక్క జైలు గదిలోనే కుక్కబడ్డాం. కొద్దిగానైనా ఆధ్యాత్మిక ఆహారం లభించాలని మేము ఆశపడ్డాం, కానీ జైల్లోకి అలాంటిదేదైనా రావడం అసాధ్యం అనిపించింది. జైలు ఆవరణలోనే ఏదైనా లభించే అవకాశముందా? నేనేం చేశానో నన్ను చెప్పనివ్వండి. జైలు గుమస్తాల సాక్సులు బాగుచేస్తానని నేను ముందుకొచ్చాను. జైలు గ్రంథాలయంలోని క్యాటలాగ్‌లో బైబిలు ఉన్న నంబరు కోసం విజ్ఞప్తిచేస్తూ ఒక కాగితం ముక్కను ఒక సాక్సులో పెట్టాను. అనుమానానికి తావివ్వకూడదని, మరో రెండు పుస్తకాల పేర్లు కూడా అందులో చేర్చాను.

మరుసటి రోజు, గుమస్తాల దగ్గర నుండి మరో సాక్సుల కుప్ప నాకు అందింది. ఆ సాక్సుల్లో ఒకదానిలో నాకు జవాబు లభించింది. దానితో నేను ఆ నంబర్లు గార్డుకిచ్చి ఆ పుస్తకాలు అడిగాను. బైబిలుతోపాటు ఆ పుస్తకాలు అందుకున్నప్పుడు మేమెంతో ఆనందించాం! ప్రతీవారం మిగిలిన పుస్తకాలకు బదులు వేరే పుస్తకాలు రప్పించుకున్నాం, అయితే బైబిలును మా దగ్గరే ఉంచుకున్నాం. దాని గురించి గార్డు అడిగినప్పుడల్లా “అది చాలా పెద్ద పుస్తకం, ప్రతీ ఒక్కరూ దాన్ని చదవాలనుకుంటున్నారు” అని సమాధానమిచ్చాం. ఆ విధంగా మేము బైబిలు చదవగలిగాం.

ఒకరోజు, ఒక అధికారి నన్ను తన ఆఫీసుకు పిలిచాడు. ఆయన చాలా మర్యాదస్థుడిలా కనిపించాడు.

“మిసెస్‌ హాఫ్నర్‌, మీకొక శుభవార్త. మీరు ఇంటికి వెళ్లవచ్చు. రేపే వెళ్లవచ్చు. ఒకవేళ రైలువుంటే ఈ రోజే మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు” అన్నాడు.

“నాకు చాలా ఆనందంగా ఉంది” అని నేను జవాబిచ్చాను.

“అవును చాలా ఆనందంగానే ఉంటుంది. మీకొక బాబున్నాడు, వాడిని పెంచి పెద్దచెయ్యాలని మీకుంటుందని నాకు తెలుసు. అందుకే ఈ పత్రంపై సంతకం చెయ్యండి చాలు” అన్నాడు.

“ఆ పత్రమేమిటి?” అనడిగాను.

“దాని గురించి మీరేం కంగారుపడకండి. కేవలం సంతకం చేయండి, మీరు హాయిగా వెళ్లిపోవచ్చు” అని బలవంతపెడుతూ, ఇంకా ఇలా అన్నాడు: “మీ ఇంటికి వెళ్లి మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. కానీ యెహోవాసాక్షిగా ఉండడం విరమించుకుంటున్నానని మీరు సంతకం చేయాలి.”

అడుగు వెనక్కివేసి, చెయ్యనని దృఢంగా చెప్పాను.

“అలాగయితే ఇక్కడే చస్తావు!” అని కోపంతో గట్టిగా అరిచి, అక్కడ నుండి నన్ను పంపివేశాడు.

1943 మేలో నన్ను బుడాపెస్ట్‌లోని మరో జైలుకు, ఆ తర్వాత మారియానోస్ట్రా గ్రామానికి పంపారు. అక్కడ ఒక మఠంలో సుమారు 70 మంది క్రైస్తవ సన్యాసినులతోపాటు మేము నివసించాం. ఆకలి, ఇతర కష్టాలు ఉన్నప్పటికీ, వారితో మా నిరీక్షణ పంచుకోవడానికి మేము ఆత్రంగా ఎదురుచూశాం. ఒక సన్యాసిని మా సందేశం వినడానికి నిజమైన ఆసక్తి ప్రదర్శిస్తూ “ఇవి చాలాచక్కని బోధలు. ఇలాంటివి నేనెన్నడూ వినలేదు. దయచేసి నాకింకా ఎక్కువ తెలియజేయండి” అని అడిగింది. ఆమెకు మేము నూతనలోకం గురించి, అక్కడుండే అద్భుతమైన జీవితం గురించి వివరించాం. మేమలా మాట్లాడుతుండగా మదర్‌ సుపీరియర్‌ (కాన్వెంట్‌ ప్రధానాధికారి) అక్కడకు వచ్చింది. ఆసక్తిగల ఆ సన్యాసినిని వెంటనే అక్కడ నుండి తీసుకెళ్లి ఆమె ఉడుపులు తీసి కొరడాతో తీవ్రంగా కొట్టారు. ఆమెను మేము మళ్లీ కలుసుకున్నప్పుడు “నన్ను కాపాడి, ఇక్కడ నుండి నన్ను దూరంగా తీసుకెళ్లేలా దయచేసి యెహోవాకు ప్రార్థించండి. నేను కూడా మీలో ఒకదాన్ని కావాలనుకుంటున్నాను” అని మమ్మల్ని బ్రతిమాలింది.

మమ్మల్ని అక్కడ నుండి బుడాపెస్ట్‌కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో డాన్యూబ్‌ నదికి అనుకునివున్న కొమారోమ్‌ నగరంలోని ఒక పాత జైలుకు తరలించారు. అక్కడ జీవన పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. చాలామంది ఇతర సహోదరీల్లాగే నేను కూడా విషజ్వరం వల్ల బాగా జబ్బుపడి రక్తపు వాంతులతో చాలా బలహీనంగా తయారయ్యాను. వేసుకోవడానికి మా దగ్గర మందులు కూడా లేకపోవడంతో నేనిక బ్రతకననే అనుకున్నాను. కానీ అదే సమయంలో ఆఫీసులో పనిచేసే సామర్థ్యం గలవారి కోసం అధికారులు చూస్తుండడంతో సహోదరీలు వాళ్లకు నా పేరు సూచించారు. అలా నాకు మందులు లభించడంతో, చివరకు తేరుకున్నాను.

కుటుంబం తిరిగి ఐక్యమవడం

తూర్పు నుండి సోవియట్‌ సైన్యం సమీపించడంతో, మమ్మల్ని బలవంతంగా పశ్చిమం వైపు తరలించారు. మేము అనుభవించిన భయంకర పరిస్థితులన్నీ వివరించడం ఒక పెద్ద కథవుతుంది. ఎన్నోసార్లు నేను మరణానికి చేరువయ్యాను, అయితే యెహోవా అందించిన సహాయ హస్తం వల్ల నేను రక్షించబడ్డాను. యుద్ధం ముగిసే నాటికి మేము ప్రేగ్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోవున్న జెకోస్లోవేకియా నగరమైన టాబోర్‌లో ఉన్నాం. చివరకు నేను, మా ఆడపడుచు మాగ్దలేనా 1945, మే 30న లుచనియెట్జ్‌లో మా ఇంటికి చేరుకోవడానికి మరో మూడువారాలు పట్టింది.

దూరం నుండే నేను పెరట్లోవున్న మా అత్తగారిని, నా ముద్దుల బాబు టీబార్‌ను చూడగలిగాను. కళ్ల నిండా నీళ్లతో “టైబైక్‌” అని గట్టిగా కేకవేశాను. వాడు పరుగెత్తుకొచ్చి నా చేతుల్లో వాలిపోయాడు. “మమ్మీ, మళ్లీ ఎప్పుడూ నన్ను విడిచివెళ్లవుగా?” అని వాడు నాతో అన్న ఆ మొదట మాటల్ని నేనెన్నటికీ మరచిపోలేను.

యెహోవా నా భర్త టీబార్‌ పట్ల కూడా ఎంతో కనికరం చూపాడు. బుడాపెస్ట్‌లోని జైలు నుండి ఆయన దాదాపు మరో 160 మంది సహోదరులతో బోర్‌లోని లేబర్‌ క్యాంపుకు పంపబడ్డారు. అనేకమార్లు వారు మరణానికి చేరువగా వచ్చారు, కానీ ఒక గుంపుగా వారు ప్రాణాలతో రక్షించబడ్డారు. నాకంటే ఒక నెలముందే అంటే 1945 ఏప్రిల్‌ 8న టీబార్‌ ఇంటికి తిరిగి చేరుకున్నారు.

యుద్ధం ముగిసిన తర్వాత జెకోస్లోవేకియాలో కమ్యూనిస్టు పరిపాలనలో తర్వాతి 40 సంవత్సరాల్లో కలిగిన అనేక పరీక్షల్లో రక్షించబడడానికి మాకు యెహోవా బలం అవసరమయ్యింది. టీబార్‌కు మళ్లీ దీర్ఘకాలం జైలు శిక్ష విధించబడింది, నేను ఒంటరిగానే మా బాబును పెంచాల్సివచ్చింది. టీబార్‌ విడుదల చేయబడిన తర్వాత, ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేశారు. ఆ 40 ఏళ్ల కమ్యూనిస్టు పాలనలో మా విశ్వాసం పంచుకోవడానికి మేము ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. సత్యం నేర్చుకోవడానికి మేము అనేకులకు సహాయం చేయగలిగాం. ఆ విధంగా వారు మా ఆధ్యాత్మిక సంతానమయ్యారు.

1989లో మాకు మత స్వాతంత్ర్యం లభించడంతో మేమెంతో ఆనందించాం! ఆ మరుసటి సంవత్సరం చాలాకాలం తర్వాత మేము మా దేశంలో మొట్టమొదటి సమావేశానికి హాజరయ్యాం. దశాబ్దాలపాటు తమ యథార్థతను కాపాడుకున్న వేలాదిమంది సహోదర సహోదరీలను మేము చూసినప్పుడు, వారందరికీ యెహోవాయే బలమిచ్చే గొప్ప ఊటగా ఉన్నాడని మాకు తెలుసు.

ప్రియమైన నా భర్త 1993 అక్టోబరు 14న దేవుని పట్ల నమ్మకస్థునిగా మరణించారు. నేనిప్పుడు స్లొవేకియాలోని, జీలీనాలో మా అబ్బాయికి దగ్గర్లోనే ఉంటున్నాను. నా శరీరంలో శక్తి అంతంత మాత్రంగానే ఉంది, అయితే యెహోవా శక్తి వల్ల నా స్ఫూర్తి మాత్రం ఇంకా బలంగానే ఉంది. ఆయనిచ్చే బలంతో ఈ పాత విధానంలో ఎలాంటి పరీక్షలనైనా నేను తట్టుకోగలననే తిరుగులేని నమ్మకం నాకుంది. అంతేకాకుండా, యెహోవా అనుచిత కృపవల్ల నేను నిత్యం జీవించగల కాలం కోసం ఎదురుచూస్తున్నాను.

[20వ పేజీలోని చిత్రం]

నేను విడిచి వెళ్లాల్సివచ్చిన మా బాబు జూనియర్‌ టీబార్‌ (నాలుగేళ్లప్పుడు)

[21వ పేజీలోని చిత్రం]

బోర్‌లో ఇతర సహోదరులతో సీనియర్‌ టీబార్‌

[22వ పేజీలోని చిత్రం]

1947లో, బ్రునోలో టీబార్‌, మా ఆడపడుచు మాగ్దలేనాతో

[23వ పేజీలోని చిత్రాలు]

ఎన్నోసార్లు నేను మరణానికి చేరువయ్యాను, అయితే యెహోవా అందించిన సహాయ హస్తం వల్ల నేను రక్షించబడ్డాను