కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఖ్యాకాండములోని ముఖ్యాంశాలు

సంఖ్యాకాండములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

సంఖ్యాకాండములోని ముఖ్యాంశాలు

ఐగుప్తు నుండి వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా వ్యవస్థీకరించబడ్డారు. ఆ తర్వాత కొద్దికాలానికి వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించగలిగే వారే, కానీ వాళ్ళలా ప్రవేశించలేదు. బదులుగా, వారు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు “భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో” సంచరించాల్సి వచ్చింది. (ద్వితీయోపదేశకాండము 8:​15) ఎందుకు? బైబిల్లోని సంఖ్యాకాండములోని చారిత్రక వృత్తాంతం ఏం జరిగిందో మనకు వివరిస్తోంది. అది మనం యెహోవా దేవుని మాటకు లోబడి ఆయన ప్రతినిధులను గౌరవించాలనే పాఠాన్ని మనకు నేర్పించాలి.

మోషే అరణ్యంలో, మోయాబు మైదానాల్లో వ్రాసిన సంఖ్యాకాండము 38 సంవత్సరాల 9 నెలల కాలంలో అంటే సా.శ.పూ. 1512 నుండి సా.శ.పూ. 1473 మధ్యకాలంలో జరిగిన సంఘటనలను వివరిస్తోంది. (సంఖ్యాకాండము 1:⁠1; ద్వితీయోపదేశకాండము 1:⁠3) ఆరంభంలో ఒకసారి ఆ తర్వాత దాదాపు 38 సంవత్సరాల తర్వాత మరోసారి తీసుకున్న రెండు జనాభా లెక్కల వల్ల ఈ పుస్తకానికి ఆ పేరు వచ్చింది. (1-4, 26 అధ్యాయాలు) ఆ వృత్తాంతం మూడు భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం సీనాయి పర్వతం దగ్గర జరిగిన సంఘటనలను వివరిస్తుంది. రెండవ భాగం ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు జరిగిన వాటి గురించి చెబుతుంది. ఇక చివరి భాగం మోయాబు మైదానాల్లో జరిగిన సంఘటనలను తెలియజేస్తుంది. ఈ వృత్తాంతాన్ని మీరు చదువుతున్నప్పుడు, ‘ఈ సంఘటనలు నాకేమి బోధిస్తున్నాయి? ఈ కాలంలో నాకు ప్రయోజనం చేకూర్చగల సూత్రాలు ఏమైనా ఈ పుస్తకంలో ఉన్నాయా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిది.

సీనాయి పర్వతం దగ్గర

(సంఖ్యాకాండము 1:1–10:10)

ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడే మొదటి జనాభా లెక్క తీసుకోబడింది. లేవీయులు మినహా 20 సంవత్సరాలు అంతకు పైబడిన పురుషుల సంఖ్య 6,03,550. సైనికోద్దేశంతోనే ఆ జన సంఖ్య తీసుకోబడిందని స్పష్టమవుతోంది. స్త్రీలు, పిల్లలు, లేవీయులతో కలుపుకొని ఆ సర్వసమాజంలో 30 లక్షలకు పైగా ప్రజలున్నారు.

ఆ జన సంఖ్య తర్వాత ఇశ్రాయేలీయులకు వారు ముందుకు సాగడానికి సంబంధించిన ఆదేశాలు, లేవీయుల విధులు, దేవాలయ గుడారపు సేవల వివరాలు, కడగా ఉంచడానికి సంబంధించిన ఆజ్ఞలు, అనుమానానికి లేదా రోషానికి సంబంధించిన కట్టడలు, నాజీరులు చేసే మొక్కుబడులు ఇవ్వబడ్డాయి. 7వ అధ్యాయంలో బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి సంబంధించి గోత్రంలో ప్రముఖులు అర్పించిన అర్పణల గురించిన సమాచారం ఉంది. 9వ అధ్యాయం పస్కాపండుగ ఆచరణ గురించి చర్చిస్తుంది. ఎప్పుడు ఆగాలో ఎప్పుడు బయలుదేరాలో కూడా ఆ సమాజానికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​1, 2​—⁠అరణ్యంలో మూడు గోత్రముల వారు దిగవలసిన ‘ధ్వజములు’ ఏమిటి? ఈ ధ్వజములు ఏమిటన్న దాని గురించి బైబిలు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. వాటిని పవిత్ర చిహ్నాలుగానో లేదా వాటికి మతసంబంధ ప్రాముఖ్యత ఉన్నట్లుగానో పరిగణించలేదు. కానీ ఒక వ్యక్తి పాళెములో తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ఆ ధ్వజములు ఉపయోగించబడ్డాయి.

5:​27​—⁠వ్యభిచారం చేసిన భార్య ‘నడుము పడిపోవడం’ అంటే ఏమిటి? ఇక్కడ “నడుము” అనే మాట సంతానోత్పత్తి అవయవాలను సూచించడానికి ఉపయోగించబడింది. (ఆదికాండము 46:26) “పడి పోవును” అంటే ఈ అవయవాలు కృశించిపోతాయి, ఆ కారణంగా ఆమె గర్భం ధరించడం అసాధ్యమవుతుంది.

మనకు పాఠాలు:

6:​1-7. నాజీరులు ద్రాక్షారస మద్యములను, అన్నిరకాల మత్తు పానీయాలను విసర్జిస్తూ, తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలి. స్త్రీలు తమ భర్తలకు లేదా తండ్రులకు లోబడి ఉన్నట్లే, తాము యెహోవాకు లోబడుతున్నామనడానికి సూచనగా వారు తమ జుట్టు పొడవుగా పెంచుకోవాలి. సన్నిహిత బంధువులతో సహా ఎవరి శవాన్నీ ముట్టుకోకుండా ఉండడం ద్వారా నాజీరులు పవిత్రంగా ఉండాలి. నేడు పూర్తికాల పరిచారకులు తమ కోరికలను అదుపులో పెట్టుకోవడానికీ యెహోవాకు ఆయన ఏర్పాట్లకు లోబడి ఉండడానికీ స్వయం త్యాగ స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. కొన్ని నియామకాల్లో దూర దేశానికి వెళ్లవలసి రావచ్చు, అప్పుడు సన్నిహిత కుటుంబ సభ్యుని అంత్యక్రియల కోసం ఇంటికి తిరిగి రావడం కష్టంకావచ్చు లేదా అసాధ్యంకావచ్చు.

8:​25, 26. లేవీయుల స్థానాల్లో సమర్థులైన వారు నియమించబడేలా, అలాగే తమ వయస్సును బట్టి, వృద్ధులు తప్పనిసరిగా సేవ నుండి విరమించుకోవాలని ఆజ్ఞాపించబడ్డారు. అయితే ఇతర లేవీయులకు సహాయం చేసేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. నేడు రాజ్య ప్రచారకునిగా విరమించుకోవడం అనేది లేనప్పటికీ, ఈ నియమంలోని సూత్రం మనకొక విలువైన పాఠాన్ని నేర్పిస్తుంది. వయస్సు పైబడిన కారణంగా ఒక క్రైస్తవుడు కొన్ని బాధ్యతలను నెరవేర్చలేకపోయినప్పుడు తన శక్తిమేరకు చేయగల సేవ ఏదైనా చేయవచ్చు.

అరణ్యంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి

(సంఖ్యాకాండము 10:11-21:35)

గుడారము మీది నుండి మేఘము నెమ్మదిగా పైకి లేచినప్పుడు, ఇశ్రాయేలీయులు ప్రయాణమయ్యేవారు. అలా వారు 38 సంవత్సరాల ఒకటి రెండు నెలల తర్వాత మోయాబు ఎడారి మైదానాలకు చేరుకున్నారు. యెహోవాసాక్షులు ప్రచురించిన ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్‌లో 9వ పేజీలోని మ్యాప్‌లో వారు వెళ్లిన మార్గం చూడడం మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు.

పారాను అరణ్యంలో కాదేషుకు వెళ్లే మార్గంలో వారు ఫిర్యాదు చేసిన సందర్భాలు కనీసం మూడు ఉన్నాయి. అగ్నిచే యెహోవా వారిలో కొందరిని సంహరించినప్పుడు మొదటిది అణచివేయబడింది. ఆ పిమ్మట ఇశ్రాయేలీయులు మాంసం కోసం రోదించినప్పుడు యెహోవా వారికోసం పూరేళ్లను రప్పిస్తాడు. అహరోను, మిర్యాము మోషేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినప్పుడు మిర్యాము తాత్కాలికంగా కుష్ఠు రోగముతో మొత్తబడుతుంది.

కాదేషులో దిగినప్పుడు, వాగ్దాన దేశాన్ని వేగు చూసి రావడం కోసం మోషే పన్నెండు మందిని పంపిస్తాడు. వారు 40 రోజుల తర్వాత తిరిగి వస్తారు. వాళ్లలో పదిమంది చెప్పిన చెడ్డ నివేదికను నమ్మి ప్రజలు మోషేను, అహరోనును వారితోపాటు నమ్మకస్థులైన వేగుల వారైన యెహోషువను, కాలేబును రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. యెహోవా తెగులు రప్పించి ఆ ప్రజలను నాశనం చేయడానికి సంకల్పించినప్పుడు మోషే కలుగజేసుకుంటాడు, దానితో మొదటి జనాభా లెక్కలో ఉన్న వారందరూ మరణించేవరకు 40 సంవత్సరాలపాటు వారు అరణ్యంలో సంచరిస్తారని యెహోవా ప్రకటిస్తాడు.

యెహోవా వారికి అదనపు నియమాలు ఇస్తాడు. కోరహు, ఇతరులు మోషేకు, అహరోనుకు విరుద్ధంగా తిరుగుబాటు చేస్తారు, అయితే ఆ తిరుగుబాటు దారులు అగ్ని ద్వారా, భూమి మింగివేయడం ద్వారా హతం చేయబడతారు. ఆ మరుసటి దినం సమాజపు వారందరు మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా సణుగుతారు. దాని ఫలితంగా యెహోవా తెచ్చిన తెగులు వల్ల 14,700 మంది చనిపోతారు. తాను ప్రధాన యాజకునిగా ఎవరిని ఎంపిక చేసుకున్నానో తెలియజేయడానికి దేవుడు అహరోను కఱ్ఱను చిగురింపజేస్తాడు. ఆ పిమ్మట యెహోవా లేవీయుల విధులకు సంబంధించి, ప్రజలను పవిత్రులను చేయడానికి సంబంధించి మరిన్ని నియమాలిస్తాడు. ఎఱ్ఱని ఆవుదూడ బూడిద చల్లడం యేసు బలి ద్వారా పవిత్రపరచడానికి పూర్వఛాయగా ఉంది.​—⁠హెబ్రీయులు 9:​13, 14.

ఇశ్రాయేలీయులు తిరిగి కాదేషుకు వచ్చినప్పుడు, మిర్యాము అక్కడే మరణిస్తుంది. సర్వ సమాజం మళ్లీ మోషేకు, అహరోనుకు విరుద్ధంగా సణుగుతుంది. వారి సణుగులకు కారణం? నీరు లభ్యం కాకపోవడం. మోషే, అహరోను అద్భుత రీతిలో నీళ్లను అందజేసినప్పుడు, యెహోవా నామాన్ని పరిశుద్ధపరచని కారణంగా వాళ్లు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ఆధిక్యతను కోల్పోతారు. ఇశ్రాయేలీయులు కాదేషు నుండి బయలుదేరినప్పుడు, అహరోను హోరు కొండ దగ్గర మరణిస్తాడు. ఎదోము చుట్టు తిరిగి వెళుతున్న సమయంలో ఇశ్రాయేలీయులు అలసిపోయి దేవునికి, మోషేకు విరుద్ధంగా మాట్లాడతారు. వారిని శిక్షించడానికి యెహోవా వారిపైకి విష సర్పాలను పంపిస్తాడు. మోషే మళ్లీ కలుగజేసుకోవడంతో, దేవుడు ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభం మీద పెట్టమని ఆదేశిస్తాడు, ఆ విధంగా పాముకాటు తిన్నవారు దానిని తేరిచూచి బ్రతుకుతారు. మన శాశ్వత ప్రయోజనం కోసం యేసుక్రీస్తు వ్రేలాడదీయబడడానికి ఆ సర్పం పూర్వఛాయగా ఉంది. (యోహాను 3:​14, 15) ఇశ్రాయేలీయులు అమోరీయ రాజులైన సీహోను ఓగులను ఓడించి వారి దేశాలను స్వాధీనం చేసుకుంటారు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

12:​1​—⁠మిర్యాము, అహరోనులు మోషేకు విరుద్ధంగా ఎందుకు ఫిర్యాదు చేశారు? వారి ఫిర్యాదుకు నిజమైన కారణం మిర్యాము తనకు ఎక్కువ అధికారం కావాలని కోరుకోవడమే అని స్పష్టమవుతోంది. మోషే భార్య సిప్పోరా ఆయనను తిరిగి అరణ్యంలో కలుసుకుంది, అందువల్ల పాళెంలో తను ప్రముఖ మహిళగా ఇక ఎంతమాత్రం దృష్టించబడనని మిర్యాము భయపడి ఉండవచ్చు.​—⁠నిర్గమకాండము 18:​1-5.

12:​9-11​—⁠మిర్యాము మాత్రమే ఎందుకు కుష్ఠు రోగంతో మొత్తబడింది? బహుశా ఆమే ఫిర్యాదును ప్రేరేపించి తనతో ఏకీభవించడానికి అహరోనును ఒప్పించి ఉంటుంది. అహరోను తన తప్పు ఒప్పుకుంటూ సరైన దృక్పథం కనబరిచాడు.

21:​14, 15​—⁠ఇక్కడ పేర్కొనబడిన గ్రంథం ఏమిటి? బైబిలు రచయితలు మూల సమాచారంగా ఉపయోగించిన వివిధ పుస్తకాలు లేఖనాల్లో సూచించబడ్డాయి. (యెహోషువ 10:12, 13; 1 రాజులు 11:41; 14:​19, 29) అలాంటి గ్రంథాల్లో “యెహోవా యుద్ధముల గ్రంథము” ఒకటి. దానిలో యెహోవా ప్రజల యుద్ధ వృత్తాంతాలు వ్రాయబడ్డాయి.

మనకు పాఠాలు:

11:​27-29. యెహోవా సేవలో ఇతరులకు ఆధిక్యతలు లభించినప్పుడు మనమెలా స్పందించాలనే విషయంలో మోషే అద్భుతమైన మాదిరి ఉంచాడు. ఎల్దాదు, మేదాదులు ప్రవక్తలుగా పని చేయడం ప్రారంభించినప్పుడు, తనకే ఘనత రావాలని అసూయపడకుండా మోషే వారిని బట్టి ఆనందించాడు.

12:​2, 9, 10; 16:​1-3, 12-14, 31-35, 41, 46-50. యెహోవా దేవుడు, తన ఆరాధకులు తాను అనుగ్రహించిన అధికారాన్ని గౌరవించాలని ఆశిస్తున్నాడు.

14:24. తప్పుచేయాలనే లోకపు వత్తిళ్లను ఎదిరించడానికి ఒక కీలకమేమిటంటే “మంచి మనస్సును” లేదా మానసిక స్వభావాన్ని వృద్ధిచేసుకోవడమే. అది లోకసంబంధమైనదిగా ఉండకూడదు.

15:​37-41. ఇశ్రాయేలీయుల బట్టల అంచులకు కుచ్చులు చేసుకోవడం, వాళ్లు దేవుని ఆరాధన కోసం ప్రత్యేకించబడిన, ఆయన ఆజ్ఞలకు లోబడవలసిన ప్రజలని వారికి జ్ఞాపకం చేయడానికి ఉద్దేశించబడింది. మనం కూడా దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తూ లోకానికి వేరుగా జీవించే ప్రజలుగా ప్రస్ఫుటంగా కనబడవద్దా?

మోయాబు మైదానాల్లో

(సంఖ్యాకాండము 22:1-36:13)

ఇశ్రాయేలీయులు మోయాబు మైదానాల్లో దిగినప్పుడు, వారిని చూచి మోయాబీయులు మిక్కిలి భయపడతారు. అందువల్ల మోయాబీయుల రాజైన బాలాకు ఇశ్రాయేలీయులను శపించడానికి బిలామును కిరాయికి తెచ్చుకుంటాడు. అయితే యెహోవా, బిలాము ఇశ్రాయేలీయులను దీవించేలా చేస్తాడు. దానితో ఇశ్రాయేలీయ పురుషులతో వ్యభిచారం చేయించి, విగ్రహారాధనలో పడగొట్టేందుకు వాళ్లను ప్రలోభపెట్టడానికి మోయాబీయ, మిద్యానీయ స్త్రీలు ఉపయోగించబడతారు. దాని ఫలితంగా, యెహోవా దోషులైన 24,000 మందిని నాశనం చేస్తాడు. యెహోవా పట్ల స్పర్ధతను తానెంత మాత్రం ఓర్వలేనని ఫీనెహాసు ప్రదర్శించినప్పుడు చివరకు ఆ తెగులు ఆగిపోతుంది.

రెండవసారి చేసిన లెక్క, యెహోషువ, కాలేబులు తప్ప మొదటి జనాభా లెక్కలోని పురుషులెవ్వరూ లేరని వెల్లడిచేసింది. యెహోషువ, మోషే వారసునిగా ఉండడానికి ఆజ్ఞాపించబడ్డాడు. వివిధ అర్పణలకు సంబంధించిన విధానాలు, ప్రమాణం చేయడానికి సంబంధించిన ఉపదేశాలు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడతాయి. ఇశ్రాయేలీయులు మిద్యానీయులపై కూడా పగ తీర్చుకుంటారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్రంలో సగం మంది యొర్దాను నదికి తూర్పున స్థిరపడతారు. యొర్దాను దాటి దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలీయులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆ దేశపు హద్దులు స్పష్టంగా వివరించబడ్డాయి. చీట్లువేసి వారికి స్వాస్థ్యం నిర్ణయించబడుతుంది. లేవీయులకు 48 పురములు నియమించబడ్డాయి, వాటిలో 6 ఆశ్రయ పురములుగా ఉంటాయి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

22:​20-22​—⁠యెహోవా కోపం బిలాముపై ఎందుకు రగులుకొంది? ఇశ్రాయేలీయులను శపించకూడదని యెహోవా బిలాము ప్రవక్తకు చెప్పాడు. (సంఖ్యాకాండము 22:​12) అయినప్పటికీ, ఆ ప్రవక్త ఇశ్రాయేలీయులను శపించాలనే ఉద్దేశంతోనే బాలాకు మనుష్యులతో కూడా బయలుదేరి వెళ్లాడు. బిలాము రాజును సంతోషపెట్టి అతని నుండి బహుమానం పొందాలని ఆశించాడు. (2 పేతురు 2:15, 16; యూదా 11) ఇశ్రాయేలీయులను శపించడానికి బదులు దీవించడానికి ఒత్తిడి చేయబడినప్పుడు కూడా అతడు ఇశ్రాయేలీయ పురుషులను ప్రలోభ పెట్టడానికి బయలును ఆరాధించే స్త్రీలను ఉపయోగించాలని రాజుకు సూచిస్తూ రాజానుగ్రహం పొందడానికి ప్రయత్నించాడు. (సంఖ్యాకాండము 31:​15, 16) ఆ విధంగా, బిలాముపై దేవుని కోపం రగులుకోవడానికి కారణం ఆ ప్రవక్తకున్న లజ్జాకరమైన దురాశే.

30:​6-8​—⁠ఒక క్రైస్తవుడు తన భార్య ప్రమాణాలను రద్దుచేయగలడా? ప్రమాణాలకు సంబంధించి యెహోవా ఇప్పుడు తన ఆరాధకులతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడు. ఉదాహరణకు, యెహోవాకు సమర్పించుకోవడం వ్యక్తిగత ప్రమాణం. (గలతీయులు 6:⁠5) అలాంటి ప్రమాణాన్ని త్రోసిపుచ్చడానికి లేదా రద్దుచేయడానికి భర్తకు అధికారం లేదు. అయితే భార్య దేవుని వాక్యానికి లేదా తన భర్తపట్ల తన విధ్యుక్త ధర్మాలకు విరుద్ధంగా ప్రమాణాలు చేయకూడదు.

మనకు పాఠాలు:

25:⁠11. యెహోవా ఆరాధన పట్ల ఆసక్తి విషయంలో ఫీనెహాసు మనకెంత చక్కని మాదిరి ఉంచాడో కదా! సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే కోరిక, ఘోర లైంగిక దుర్నీతికి సంబంధించిన విషయం తెలిసినప్పుడు క్రైస్తవ పెద్దలకు ఆ విషయాన్ని చెప్పేలా మనలను పురికొల్పవద్దా?

35:​9-29. ఉద్దేశరహిత నరహంతకుడు తన ఇల్లువిడిచి పారిపోయి కొంతకాలం వరకు ఆశ్రయపురంలో ఉండాలనే వాస్తవం ప్రాణం పవిత్రమైనదనీ దానిని మనం గౌరవించాలనీ మనకు బోధిస్తోంది.

35:​33. అమాయకుల రక్తాన్ని చిందించి భూమిని అపవిత్రపరిచేవారి రక్తం చిందించబడడం ద్వారానే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ భూమి పరదైసుగా మార్చబడక ముందు యెహోవా దుష్టులను నాశనం చేయడం ఎంత సముచితమో కదా!​—⁠సామెతలు 2:​21, 22; దానియేలు 2:​44.

దేవుని వాక్యం బలమైనది

మనం యెహోవాను, ఆయన ప్రజల మధ్య బాధ్యతగల స్థానాల్లో నియమించబడిన వారిని గౌరవించాలి. సంఖ్యాకాండము ఈ సత్యాన్ని స్పష్టం చేస్తోంది. నేడు సంఘంలో సమాధాన ఐక్యతలను కాపాడవలసిన విషయంలో ఎంత ప్రాముఖ్యమైన పాఠమో కదా!

సంఖ్యాకాండములో వివరించబడిన సంఘటనలు తమ ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేసేవారు సణగడం, లైంగిక దుర్నీతి, విగ్రహారాధన వంటి తప్పిదాల్లో ఎంత సులభంగా పడిపోతారో చూపిస్తున్నాయి. ఈ బైబిలు పుస్తకంలోని కొన్ని ఉదాహరణలు, పాఠాలు యెహోవాసాక్షుల సంఘాల్లో సేవాకూటంలో ప్రాంతీయ అవసరాలు అనే భాగాల నిర్వహణకు ఆధారంగా ఉంటాయి. అవును, మన జీవితాల్లో “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉంది.​—⁠హెబ్రీయులు 4:​12.

[24, 25వ పేజీలోని చిత్రం]

దేవాలయ గుడారంపై అద్భుతరీతిలో ఉంచబడిన మేఘం ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులు పాళెం దిగడాన్ని, బయలుదేరడాన్ని నిర్దేశించాడు

[26వ పేజీలోని చిత్రాలు]

మనం యెహోవాకు విధేయత చూపించడమే కాక తన ప్రతినిధులనూ మనం గౌరవించాలని ఆయన కోరుతున్నాడు