అత్యంత ప్రయోజనకరమైన సలహాను కనుగొనడం
అత్యంత ప్రయోజనకరమైన సలహాను కనుగొనడం
జయప్రదమైన జీవితం కోరదగినది. ఈ సంశ్లిష్టమైన లోకంలో అలాంటి జీవితం పొందాలంటే, మంచి సలహా, దానికి అనుగుణంగా ప్రవర్తించే కోరికా కీలకమైన విషయాలు. అయితే మానవులు ప్రయోజనకరమైన సలహాకు చెవియొగ్గడానికి అన్ని సందర్భాల్లోనూ ఇష్టపడలేదు. మనిషి తన అభీష్టం మేరకే జీవించాలని చాలామంది వాదించారు. నిజానికి, దేవుని సర్వాధిపత్యానికి ఆది శత్రువైన సాతాను మొదటి మానవులకు స్వాతంత్ర్యం ఇవ్వజూపాడని బైబిలు వృత్తాంతం చూపిస్తోంది. అతడు ఖండితంగా హవ్వకిలా చెప్పడం ఆదికాండము 3:5లో వ్రాయబడింది: “ఏలయనగా మీరు [మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నుండి] వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.”
ఆ తర్వాత ఆదాము హవ్వలు కేవలం తమ సొంత అభిప్రాయాల ఆధారంగా, ఎలాంటి తీవ్రమైన పర్యవసానాలు లేకుండా జయప్రదంగా జీవించగలిగారా? ఎంతమాత్రం జీవించలేదు. మంచి చెడ్డలు తెలుసుకోవాలని చేసిన దుస్సాహసం మూలంగా కలిగిన పరిణామాలనుబట్టి వాళ్లు నిరుత్సాహపడ్డారు. వారు దేవుని న్యాయబద్ధమైన ఆమోదం కోల్పోయి, చివరకు మరణించేలా అపరిపూర్ణతతో ప్రయాసకరమైన జీవితం ఆరంభించారు. (ఆదికాండము 3:16-19, 23) మరణం మనందరినీ బాధిస్తుంది. బైబిలు ఇలా చెబుతోంది: “ఒక మనుష్యునిద్వారా [ఆదాముద్వారా] పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
ఆదాము హవ్వలు చేసుకున్న ఎంపికకు తీవ్రమైన పర్యవసానాలు కలిగినప్పటికీ, మానవులు సృష్టికర్త సలహాను అన్వయించుకోవడంలోని విజ్ఞతను చాలామంది ఒప్పుకోవడంలేదు. అయితే ఆ సలహా “దైవావేశమువలన” కలిగినదనీ, ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండుటకు’ మనకు సహాయం చేయగలదనీ బైబిలు చెబుతోంది. (2 తిమోతి 3:16, 17) బైబిల్లోని సలహాను పాటిస్తే మనం తప్పకుండా సంతోషంగా ఉంటాం. ఇది అన్వయించే పెద్ద రంగం కుటుంబ జీవితం.
వివాహంలో విశ్వాస్యత
బైబిలు ప్రకారం, వివాహం శాశ్వత బంధంగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. (ఆదికాండము 2:22-24; మత్తయి 19:6) అంతేకాకుండా, ‘పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి’ అంటే ఈ బంధం వివాహేతర లైంగిక సంబంధాలతో మలినం కాకూడదని లేఖనాలు చెబుతున్నాయి. (హెబ్రీయులు 13:4) అయితే, నేడు అనేక వివాహాలు ఈ ప్రమాణాన్ని పాటించడం లేదని బహుశా మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది ఉద్యోగస్థలంలో తమ జీవిత భాగస్వామికాని వారితో చెడు ఉద్దేశాలతో సరసాలాడే అలవాటులో పడిపోయారు. మరికొందరు తమ జీవిత భాగస్వామికాని మరోవ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపేందుకు తమ కుటుంబ సభ్యులకు అబద్ధాలు చెబుతుంటారు. ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన వెరోనికా విషయంలో జరిగినట్లు, యౌవనులమనే భావం తమలో కలుగుతోందనీ, తాము సుఖపడుతున్నామనీ వాదిస్తూ కొందరు యౌవన భాగస్వామితో ఉండడానికి తమ జీవిత భాగస్వాములనే విడిచిపెడుతున్నారు.
అయితే పర్యవసానాలు ఎలావున్నా స్వయం తృప్తికే మొగ్గుచూపడం శాశ్వత సంతోషాన్నివ్వదు. రొనాల్డ్ దానికి ప్రత్యక్ష సాక్షి. తన జీవితాన్ని మెరుగుపరచుకుంటాననే గట్టి నమ్మకంతో, అతను గత 6 సంవత్సరాలుగా తన రహస్య ప్రేమికురాలిగా ఉంటూ, తన ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన స్త్రీతో కొత్త జీవితం ఆరంభించడానికి తన భార్యను విడిచిపెట్టాడు. అయితే తన వివాహాన్ని రద్దుచేసుకున్న కొంతకాలానికి, అతని ప్రేమికురాలు అతన్ని విడిచివెళ్లిపోయింది. రొనాల్డ్ చివరకు తన తల్లిదండ్రుల పంచన చేరాడు. అతను తన పరిస్థితి “దిగజారుతున్నట్లు” వర్ణించాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. స్వార్థపూరిత కోరికలతో పెడత్రోవపట్టిన అలాంటి ప్రవర్తన ఒక్కసారిగా ఉప్పొంగిన విడాకుల, కుటుంబ విచ్ఛిన్నాల తరంగానికి కారణమవడమే కాక, పిల్లలు పెద్దలు అనే తేడాలేకుండా అసంఖ్యాకులు కష్టాల కడలిలో పడేందుకు దారితీసింది.
మరోవైపున, బైబిలు సలహాను పాటించడం నిజమైన సంతోషాన్ని తీసుకొస్తుంది. రాబర్టొ విషయంలో అలాగే జరిగింది, ఆయనిలా చెబుతున్నాడు: “బైబిలు సలహా మూలంగా, నేను నా భార్యను పోగొట్టుకోలేదు. జీవిత భాగస్వామికాని మరో వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, అలాంటి వ్యక్తి శోధనలో పడిపోవడంవల్ల మనం నిజమైన సంతోషాన్ని పొందలేము. అనేక సంవత్సరాలుగా నాకు చేదోడు వాదోడుగావున్న నా భార్యను విలువైనదిగా పరిగణించడానికి బైబిలు విద్య నాకు సహాయం చేసింది.” రాబర్టొ జీవితంలో, “యౌవనమున పెండ్లి చేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి” అనే బైబిలు సలహా ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. (మలాకీ 2:15) దేవుని సలహా నుండి మనం ఇంకా ఎలాంటి విషయాల్లో ప్రయోజనం పొందవచ్చు?
మన పిల్లల పెంపకం
దశాబ్దాల క్రితం, తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచే విషయంలో అనేక హద్దులు పెట్టకూడదనే ఆలోచన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎలా తలంచాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్లో పిల్లలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించడం సముచితంగా ఉన్నట్లు అనిపించింది. వారి అభివృద్ధిని అణగార్చకూడదనేదే
దాని ఉద్దేశం. కొన్ని ప్రాంతాల్లో అల్ప వ్యవస్థీకృత విద్యా పాఠశాలలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి, అలాంటి పాఠశాలల్లో ఇతర విషయాలతోపాటు విద్యార్థులు తాము తరగతులకు హాజరుకావాలా వద్దా అనేది కూడా నిర్ణయించుకోవచ్చు అంతేగాక ఎంతసేపు ఉల్లాస కార్యకలాపాల్లో పాల్గొంటాము లేదా తమకెంత ఉపదేశం కావాలి అనేవి ఎంచుకోవచ్చు. ఇలాంటి ఒక పాఠశాలలో “పెద్దవారి ప్రమేయం, అభిప్రాయం లేకుండా పిల్లలు తమ భావాలను పూర్తిస్థాయిలో అనుభవించడానికి వారిని అనుమతించే” విధానం ప్రవేశపెట్టబడింది. నేడు, తల్లిదండ్రులు ప్రేమపూర్వక క్రమశిక్షణ ఇవ్వడం అవసరమని పరిగణించిన సందర్భాల్లో సైతం కొన్నిరకాల క్రమశిక్షణను అమలుచేయడాన్ని మానవ ప్రవర్తనా సలహాదారులు కొందరు సవాలు చేస్తున్నారు.దాని ఫలితమేమిటి? పిల్లల పెంపకంలో అనుజ్ఞా విధానాలు పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛనిచ్చాయని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. ఇది నేరం, మాదకద్రవ్యాల వ్యసనం పెరిగిపోవడానికి దారితీసిందని వారు భావిస్తున్నారు. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేకు ప్రతిస్పందించిన వారిలో దాదాపు 70 శాతం మంది పిల్లలకు, యౌవనులకు తగినంత తల్లిదండ్రుల మార్గనిర్దేశం లభించడం లేదనే అభిప్రాయపడ్డారు. టీనేజర్లు పాఠశాలల్లో జరిపిన కాల్పులకు, పాల్పడిన ఇతర ఘోరమైన నేరాలకు కారణాలేమిటో వివరించడానికి ప్రయత్నిస్తూ చాలామంది “తల్లిదండ్రుల నియంత్రణా లోపాన్నే” నిందిస్తున్నారు. ఫలితాలు అంత విషాదకరంగా లేని సందర్భాల్లో కూడా ఇటు తల్లిదండ్రులు, అటు పిల్లలు తప్పుదోవపట్టిన పిల్లల పెంపకపు బాధాకరమైన పర్యవసనాలు అనుభవించక తప్పదు.
ఈ విషయంలో బైబిలేమి చెబుతోంది? తల్లిదండ్రులు ప్రేమతోనూ స్థిరత్వంతోనూ తమ అధికారాన్ని ఉపయోగించాలని లేఖనాలు సలహా ఇస్తున్నాయి. బైబిలిలా చెబుతోంది: “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును; శిక్షాదండము దానిని దానిలోనుండి తోలివేయును.” (సామెతలు 22:15) అవును, తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణంతా సందర్భానికి అనుగుణంగా ఉండాలి. ఎలాంటి క్రమశిక్షణనైనా మృదువుగా, మరీ కఠినంగా కాకుండా, అర్థం చేసుకొని అమలుచేయాలి. అప్పుడది ప్రేమకు చిహ్నంగా ఉంటుంది. క్రూరత్వంతో కాక తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా అధికారం చేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ సలహాను పాటించడంవల్ల గమనించదగిన సత్ఫలితాలు లభిస్తాయి. ఈ మధ్యనే వివాహం చేసుకున్న 30 ఏళ్ల మెక్సికో నివాసి ఆర్టురో ఇలా చెబుతున్నాడు: “మా నాన్నగారు, ఇంట్లో తనకు, అమ్మకు అధికారం ఉందనే విషయం నాకు మా అన్నదమ్ములకు స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని శిక్షించడానికి వారెప్పుడూ వెనుకాడలేదు. అయినప్పటికీ, వారెల్లప్పుడూ మాతో మాట్లాడేందుకు సమయం తీసుకొనేవారు. వయోజనునిగా నేనిప్పుడు ఆనందిస్తున్న సుస్థిరమైన జీవితాన్ని అమూల్యమైనదిగా పరిగణిస్తున్నాను. ఇది ఎక్కువగా నేను పొందిన మంచి నిర్దేశపు ఫలితమేనని నాకు తెలుసు.
అత్యంత ప్రయోజనకరమైన సలహాను సద్వినియోగం చేసుకోండి
దేవుని వాక్యమైన బైబిల్లో మానవాళికి లభ్యంకాగల అత్యంత ప్రయోజనకరమైన సలహాలున్నాయి. అందులోని నిర్దేశం కుటుంబ పరిధికి మాత్రమే పరిమితం కాదు. ఆ నిర్దేశం మనల్ని ఎన్నో రీతులుగా సన్నద్ధులను చేస్తుంది. ఎందుకంటే, అది జ్ఞాన సంపన్నుడైన దేవుడు మేలు కలిగేలా తమ జీవితాలను నిర్దేశించడాన్ని ఇష్టపడని అనేకులున్న ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో మనకు బోధిస్తుంది.
మానవాళి సృష్టికర్తయైన యెహోవా దేవుడు కీర్తనకర్త దావీదు ద్వారా మనకీ హామీ ఇచ్చాడు: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించె[ద]ను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” (కీర్తన 32:8) ప్రమాదం నుండి రక్షించడానికి సృష్టికర్త మనమీద దృష్టి ఉంచడమంటే ఏమిటో మీరూహించగలరా? అయితే మనందరి ఎదుటవున్న ప్రశ్నేమిటంటే: ‘యెహోవా ఇచ్చే రక్షణ నిర్దేశాన్ని నేను వినయంగా అంగీకరిస్తానా?’ ఆయన వాక్యం ప్రేమతో మనకిలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6.
యెహోవాను తెలుసుకోవడానికి ప్రయత్నం, అంకితభావం అవసరం, అయినప్పటికీ అది బైబిలు ద్వారా మానవాళికి అందుబాటులోనే ఉంది. ఆయన సిఫారసుచేసే జీవన విధానం “యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై” ఉంది. అది అందించే ప్రయోజనాల దృష్ట్యా నిజముగా గొప్ప లాభసాధనమై యున్నది.—1 తిమోతి 4:8; 6:6.
బైబిలు అందించే అంతర్దృష్టి, దానికి అనుగుణంగా జీవించడంవల్ల వచ్చే ఆశీర్వాదాలచే మీరు ఆకర్షితులైనట్లయితే, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడాన్ని మీ జీవితపు ప్రధాన అంశంగా చేసుకోండి. అలా చేయడం నేటి సవాళ్లను, రాబోయే ఏ సవాళ్లనైనా జయప్రదంగా ఎదుర్కోవడానికి మీకు సహాయం చేస్తుంది. దానికితోడు, దేవుని నూతనలోకంలో జీవించే నిరీక్షణ మీకుంటుంది, అక్కడ అందరికీ యెహోవా ఉపదేశిస్తాడు, వారికి అధిక విశ్రాంతి లభిస్తుంది.—యెషయా 54:13.
[5వ పేజీలోని చిత్రం]
బైబిలు సలహా వివాహ బంధాన్ని బలపరుస్తుంది
[6వ పేజీలోని చిత్రాలు]
చక్కని నిర్దేశానికి బైబిలు సలహా పునాది, అయినా అది ఆహ్లాదకర సమయాలకు తావిస్తుంది
[7వ పేజీలోని చిత్రాలు]
బైబిలు సలహాను అన్వయించుకొనేవారు చక్కని సమతుల్యమైన జీవితాన్ని అనుభవించవచ్చు