కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అలసిపోతారు గానీ సొమ్మసిల్లరు

అలసిపోతారు గానీ సొమ్మసిల్లరు

అలసిపోతారు గానీ సొమ్మసిల్లరు

“భూదిగంతములను సృజించిన యెహోవా . . . సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు, . . . శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు.”​—⁠యెషయా 40:28, 29.

యేసు శిష్యులుగా ఆయన మనకిచ్చిన ఆకర్షణీయమైన ఈ ఆహ్వానం మనకు బాగా తెలుసు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. . . . ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:​28-30) అలాగే ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు” కూడా క్రైస్తవులకు ఇవ్వబడ్డాయి. (అపొస్తలుల కార్యములు 3:​19) బైబిలు సత్యాలను నేర్చుకోవడంవల్ల, చక్కని భవిష్యత్‌ నిరీక్షణ కలిగివుండడంవల్ల, మీ జీవితంలో యెహోవా సూత్రాలను అన్వయించుకోవడంవల్ల కలిగే ఉత్తేజకర ప్రభావాలను మీరు వ్యక్తిగతంగా చవిచూసే ఉంటారు.

2 అయినప్పటికీ, యెహోవా ఆరాధకుల్లో కొందరు మానసికంగా అలసిపోతారు. కొన్ని సమయాల్లో నిరుత్సాహపు తాకిడి కొద్దిగానే ఉంటుంది. మరితర సమయాల్లో ఆ అలసట దీర్ఘకాలం కొనసాగవచ్చు. కాలం గడుస్తున్నకొద్దీ, కొందరు తమ క్రైస్తవ బాధ్యతలు యేసు వాగ్దానం చేసినట్లు విశ్రాంతిదాయక బరువుగా ఉండడానికి బదులు భారంగా తయారైనట్లు భావించవచ్చు. అలాంటి ప్రతికూల భావాలు యెహోవాతో ఒక క్రైస్తవుని సంబంధానికి తీవ్రమైన ముప్పువాటిల్లజేయవచ్చు.

3 యేసు చెరపట్టబడి, చంపబడటానికి కొద్దికాలం ముందే తన శిష్యులకిలా చెప్పాడు: “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.” (యోహాను 14:⁠1) అపొస్తలులు విషాదకరమైన సంఘటనలు ఎదుర్కొనే ముందు యేసు ఈ మాటలు పలికాడు. వీటి తర్వాత వారు తీవ్రమైన హింసను అనుభవిస్తారు. తన అపొస్తలులు తీవ్ర నిరుత్సాహంవల్ల అభ్యంతరపడతారని యేసుకు తెలుసు. (యోహాను 16:⁠1) అదుపు చేయకపోతే ఆ విషాదకర భావాలు ఆధ్యాత్మిక బలహీనతను కలిగించి యెహోవాపై వారికున్న నమ్మకం సడలిపోయేలా చేయగలవు. ఇది నేటి క్రైస్తవుల విషయంలోనూ నిజం. ఎక్కువకాలముండే నిరుత్సాహం తీవ్రమైన వేదనకు కారణం కాగలదు, అందువల్ల మన హృదయం మందగించవచ్చు. (యిర్మీయా 8:​18) మన అంతరంగ పురుషుడు బలహీనపడవచ్చు. ఈ ఒత్తిడి క్రింద మనం మానసికంగా, ఆధ్యాత్మికంగా చచ్చుబడిపోవచ్చు, చివరకు యెహోవాను ఆరాధించాలనే మన కోరిక అణగారిపోవచ్చు.

4 కాబట్టి “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అనే బైబిలు సలహా నిజంగా సముచితం. (సామెతలు 4:​23) నిరుత్సాహం నుండి, ఆధ్యాత్మిక అలసట నుండి మన అలంకారార్థ హృదయాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఆచరణాత్మక సలహాను బైబిలు మనకు అందిస్తోంది. అయితే మొదట మనం మన అలసటకు కారణమేమిటో గుర్తించాలి.

క్రైస్తవత్వం క్రూరమైనది కాదు

5 నిజమే క్రైస్తవునిగా ఉండడానికి తీవ్రమైన పోరాటం అవసరం. (లూకా 13:​24) యేసు ఇలా కూడా అన్నాడు: “ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.” (లూకా 14:​27) పైకి ఈ మాటలు, నా భారము తేలికగా, విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది అని యేసు చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ వాస్తవానికి అవి పరస్పర విరుద్ధమైనవి కావు.

6 తీవ్ర పోరాటం, శ్రమ శారీరకంగా అలసిపోయేలా చేసినప్పటికీ, ఒక మంచి పనికొరకు చేసినప్పుడు అవి సంతృప్తికరంగా, సేదదీర్పునిచ్చేవిగా ఉండగలవు. (ప్రసంగి 3:​13, 22) మన పొరుగువారితో అద్భుతమైన బైబిలు సత్యాలు పంచుకోవడానికి మించిన మంచిపని మరొకటి ఏది? అంతేకాకుండా, దేవుని ఉన్నత నైతిక ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి మనంచేసే పోరాటం, తత్ఫలితంగా మనకు లభించే ప్రయోజనాలతో పోలిస్తే వెలవెలపోతుంది. (సామెతలు 2:​10-20) హింసించబడినప్పుడు కూడా దేవుని రాజ్యం నిమిత్తం కష్టాలు అనుభవించడాన్ని మనం ఒక ఘనతగా పరిగణిస్తాం.​—⁠1 పేతురు 4:14.

7 అబద్ధమతపు కాడి క్రింద ఉన్నవారి ఆధ్యాత్మిక అంధకారంతో పోలిస్తే, యేసు మోపిన భారం విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది. దేవునికి మనపట్ల వాత్సల్యపూరిత ప్రేమవుంది, ఆయన మన నుండి అనుచితమైనవి ఎప్పుడూ అడగడు. యెహోవా “ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:⁠3) లేఖనాల్లో వివరించబడినట్లుగా, నిజ క్రైస్తవత్వం క్రూరమైనది కాదు. మన ఆరాధనా విధానం మనకు అలసటను, నిరుత్సాహాన్ని కలిగించదు.

‘ప్రతి భారమును విడిచిపెట్టండి’

8 మనం అనుభవించే ఎలాంటి ఆధ్యాత్మిక అలసటైనా తరచూ ఈ భ్రష్ట విధానం మనపై పెట్టిన అదనపు భారంవల్ల కలగవచ్చు. “లోకమంతయు దుష్టునియందున్నది” కాబట్టి, మనల్ని అలసిపోయేలా చేసే, మనం మన క్రైస్తవ సమతూకాన్ని కోల్పోయేలాచేసే ప్రతికూల శక్తులు మనచుట్టూ ఉన్నాయి. (1 యోహాను 5:​19) అంత ప్రాముఖ్యంకాని విషయాలు మన క్రైస్తవ కార్యకలాపాలను చిక్కులుబెట్టి, చిరాకుపరచవచ్చు. ఈ అదనపు భారాలు మనల్ని అలసిపోయేలా చేయడమే కాక, మన స్ఫూర్తిని కూడా అణచివేయవచ్చు. అందుకే బైబిలు మనకు సముచితంగానే ‘ప్రతి భారమును విడిచిపెట్టండి’ అని ప్రబోధిస్తోంది.​—⁠హెబ్రీయులు 12:1-3.

9 ఉదాహరణకు ప్రధానత్వం, ధనం, వినోదం, ఉల్లాస ప్రయాణాలు, భౌతికమైన ఇతర విషయాలను వెంటాడడం వంటివాటితో నిండివున్న లోకం మన ఆలోచనపై ప్రభావం చూపవచ్చు. (1 యోహాను 2:​15-17) సంపదను వెంటాడిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొందరు తమ జీవితాలను చిక్కుల్లో పడేసుకున్నారు. అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”​—⁠1 తిమోతి 6:9, 10.

10 దేవుని సేవలో మనం అలసిపోయినట్లుగా, మనకు నిరుత్సాహం కలుగుతున్నట్లుగా అనిపించినప్పుడు, ఐశ్వర్యాసక్తి మన ఆధ్యాత్మికతను అణచివేయడం దానికి కారణం కావచ్చా? విత్తువాని గురించి యేసు చెప్పిన ఉపమానం సూచిస్తున్నట్లు, ఈ విధంగా జరిగే అవకాశముంది. యేసు “ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును” మన హృదయాల “లోపల చొచ్చి” దేవుని వాక్యమనే విత్తనాన్ని ‘అణచివేసే’ ముండ్లపొదలతో పోల్చాడు. (మార్కు 4:​18, 19) కాబట్టి బైబిలు మనకిలా ఉపదేశిస్తోంది: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.”​—⁠హెబ్రీయులు 13:⁠5.

11 కొన్నిసార్లు మనము అదనపు సంపదవెంట పరుగెత్తడం కాదుగానీ మనకున్న వాటితో మనం చేసేదాన్నిబట్టే మన జీవితాల్ని చిక్కుల్లో పెట్టుకుంటాం. కొందరు తీవ్ర ఆరోగ్య సమస్యలవల్లా, తమ ప్రియమైనవారిని పోగొట్టుకున్నందువల్ల లేదా మరితర కృంగదీసే సమస్యలవల్లా మానసిక అలసటను అనుభవించవచ్చు. ఎప్పటికప్పుడు సర్దుబాట్లు చేసుకోవలసిన అవసరతను వారు చూశారు. ఒక వివాహిత జంట తమకిష్టమైన కొన్ని పనుల్ని, అంత ప్రాముఖ్యంకాని వ్యక్తిగత పథకాలను విరమించుకోవాలని నిర్ణయించుకుంది. వారు తమ దగ్గరున్న వస్తువులన్నీ ఒకసారి పరీక్షించి చూసుకొని అలాంటి పథకాలకు సంబంధించిన వస్తువుల్ని అటక ఎక్కించేశారు. అప్పుడప్పుడు, మనం మన అలవాట్లను, మనకున్న వస్తువులను పరిశీలించి చూసుకొని మనం అలసిపోకుండా, మన ప్రాణాలు విసుకక ఉండడానికి అనవసరమైన ప్రతి భారాన్ని వదిలించుకుందాం.

సహేతుకత, నమ్రత ఆవశ్యకం

12 చిన్నచిన్న విషయాల్లో సహితం మనం చేసే పొరపాట్లు క్రమేణా మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తాయి. “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి; నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి” అని వ్రాసిన దావీదు మాటలెంత వాస్తవమో గదా! (కీర్తన 38:⁠4) తరచూ కొన్ని ఆచరణాత్మక సర్దుబాట్లు మోయలేని బరువుల్ని మన నుండి తొలగిస్తాయి.

13 ఆచరణాత్మక లేదా “లెస్సయైన జ్ఞానమును వివేచనను” వృద్ధి చేసుకోవాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (సామెతలు 3:​21, 22) “పైనుండివచ్చు జ్ఞానము . . . మృదువైనది” లేదా సహేతుకమైనది అని బైబిలు చెబుతోంది. (యాకోబు 3:​17) క్రైస్తవ పరిచర్యలో ఇతరులు చేసినంతగా చేయాలనే ఒత్తిడి తమపై ఉన్నట్లు కొందరు భావించారు. అయితే బైబిలు మనకిలా సలహా ఇస్తోంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?” (గలతీయులు 6:​4, 5) నిజమే తోటి క్రైస్తవుల మంచి మాదిరి యెహోవాను పూర్ణహృదయంతో సేవించడానికి మనల్ని ప్రోత్సహించవచ్చు, అయితే ఆచరణాత్మక జ్ఞానం, సహేతుకత మన పరిస్థితులనుబట్టి వాస్తవిక లక్ష్యాలు పెట్టుకోవడానికి మనకు సహాయం చేస్తాయి.

14 అంత ప్రాముఖ్యం కావని అనిపించిన రంగాల్లో కూడా మన సహేతుకత అలసట భావాలను నిరోధించడానికి మనకు సహాయం చేయగలదు. ఉదాహరణకు, మంచి శారీరక ఆరోగ్యానికి దోహదపడే సమతూకమైన అలవాట్లను మనం అలవరచుకుంటున్నామా? యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానిలో పనిచేస్తున్న ఒక వివాహిత జంట విషయమే తీసుకోండి. అలసటను నిరోధించే విషయంలో ఆచరణాత్మక జ్ఞానానికున్న విలువను వారు చూశారు. భార్య ఇలా చెబుతోంది: “మా కెంత పనివున్నాసరే, ప్రతీ రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే మేము క్రమంగా వ్యాయామం కూడా చేస్తాము, అది నిజంగా మాకెంతో సహాయం చేసింది. మా పరిమితులేమిటో మేము గ్రహించాము, వాటికి అనుగుణంగానే మేము పనులు చేసుకుంటాం. అంతులేని శక్తి ఉన్నట్లనిపించే వారితో మమ్మల్ని మేము పోల్చుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం.” మనం క్రమంగా ఆరోగ్యకరమైన ఆహారం భుజిస్తూ, తగినంత విశ్రాంతి తీసుకుంటున్నామా? మన ఆరోగ్యంపట్ల సహేతుకమైన శ్రద్ధనివ్వడం మానసిక, ఆధ్యాత్మిక అలసట భావాలను తక్కువ చేయగలదు.

15 మనలో కొందరికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక క్రైస్తవ సహోదరి ఎన్నో సవాలుదాయకమైన నియామకాల్లో పూర్తికాల సేవ చేసింది. క్యాన్సర్‌తోపాటు ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒత్తిడిగల పరిస్థితులను తట్టుకోవడానికి ఆమెకేది సహాయం చేస్తోంది? ఆమె ఇలా చెబుతోంది: “ఒంటరిగా ప్రశాంతంగా ఉండడం నాకు చాలా ప్రాముఖ్యం. ఒత్తిడి, అలసట ఎంత ఎక్కువైనట్లు అనిపిస్తే, అంత అత్యవసరంగా నేను ఒంటరిగా, ప్రశాంతంగా చదువుతూ విశ్రాంతి తీసుకోవడం నాకు ప్రాముఖ్యం.” ఆచరణాత్మక జ్ఞానం, వివేచన మన వ్యక్తిగత అవసరతలను గుర్తించి, వాటిని తీర్చుకుంటూ, ఆధ్యాత్మిక అలసటకు దూరంగా ఉండడానికి సహాయం చేస్తాయి.

యెహోవా మనకు శక్తినిస్తాడు

16 మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపడం ఎంతో ప్రాముఖ్యం. మనకు యెహోవా దేవునితో సన్నిహిత సంబంధమున్నప్పుడు, మనం శారీరకంగా అలసిపోయినా, మనమెప్పటికీ ఆయనను ఆరాధించడంలో సొమ్మసిల్లము. యెహోవాయే “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు.” (యెషయా 40:​28, 29) ఈ మాటల సత్యసంధతను వ్యక్తిగతంగా చవిచూసిన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.”​—⁠2 కొరింథీయులు 4:16.

17 “దినదినము” అనే మాటను గమనించండి. ఇది ప్రతీ దినం యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడాన్ని సూచిస్తుంది. 43 సంవత్సరాలు నమ్మకంగా సేవచేసిన ఒక మిషనరీ సహోదరి శారీరక అలసటను, నిరుత్సాహాన్ని ఎదుర్కొంది. అయితే ఆమె సొమ్మసిల్లలేదు. ఆమె ఇలా చెబుతోంది: “నా పని ఆరంభించడానికి ముందు యెహోవాకు ప్రార్థించి, ఆయన వాక్యాన్ని చదవడానికి సమయం దొరికేలా ఉదయమే లేవడాన్ని అలవాటు చేసుకున్నాను. నేను ఇప్పటివరకు సహించడానికి ఈ దైనందిన వాడుకే నాకు సహాయం చేసింది.” అవును మనం “దినదినము” క్రమంగా యెహోవాకు ప్రార్థించి ఆయన ఉన్నత లక్షణాలను, వాగ్దానాలను ధ్యానిస్తే మనకు నిజంగా ఆయన బలవర్థకమైన శక్తి లభిస్తుందని నమ్మవచ్చు.

18 వృద్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల నిరుత్సాహపడే వారికిది ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటుంది. అలాంటి వారు ఇతరులతో తమను పోల్చుకోవడం ద్వారా కాదుగానీ తామొకప్పుడు చేసినదానితో పోల్చుకొని నిరాశచెందుతారు. యెహోవా వృద్ధులను సన్మానిస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! బైబిలు ఇలా చెబుతోంది: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.” (సామెతలు 16:​31) యెహోవాకు మన పరిమితులు తెలుసు, పైగా మనకు బలహీనతలున్నప్పటికీ ఆయనను పూర్ణహృదయంతో ఆరాధించడాన్ని ఆయన ప్రశస్తమైనదిగా పరిగణిస్తాడు. మనమిప్పటికే చేసిన సత్క్రియలు దేవుని జ్ఞాపకంలో చెరగని విధంగా లిఖితమైయున్నాయి. లేఖనాలు మనకిలా హామీనిస్తున్నాయి: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:​10) అనేక దశాబ్దాలుగా యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉన్నవారు మనమధ్య ఉండడం మనకెంత ఆనందదాయకమో కదా!

ఆశ వదులుకోకండి

19 ఒక క్రమపద్ధతిలో కాయకష్టం చేయడం ఊరకనే అలసిపోవడాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్ముతారు. అదే విధంగా క్రమమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎలాంటి మానసిక, ఆధ్యాత్మిక అలసట భావాలనైనా పోగొట్టుకొనేలా సహాయం చేస్తాయి. బైబిలు ఇలా చెబుతోంది: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము. కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:​9, 10) “మేలుచేయుట,” “మేలుచేయుదము” అనే మాటలు గమనించండి. ఇవి మనవైపు నుండి కార్యశీలతను సూచిస్తున్నాయి. ఇతరులకు మేలుచేయడం నిజానికి, యెహోవాకు మనం చేసే సేవలో సొమ్మసిల్లకుండా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.

20 దీనికి భిన్నంగా, దేవుని నియమాలను నిర్లక్ష్యంచేసే ప్రజలతోచేసే సహవాసం, కార్యకలాపాలు అలసట కలిగించే భారంగా తయారుకాగలవు. బైబిలు మనల్నిలా హెచ్చరిస్తోంది: “రాయి బరువు ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.” (సామెతలు 27:⁠3) నిరుత్సాహాన్ని, అలసట భావాలను తప్పించుకోవాలంటే మనం ప్రతికూల భావాలతో నిండివున్న, ఇతరుల్లో తప్పులు వెదికే లేదా విమర్శించే వారి సాంగత్యాన్ని విసర్జించాలి.

21 మనకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చడానికి యెహోవా చేసిన ఒక ఏర్పాటు క్రైస్తవ కూటాలు. అక్కడ మనకు నూతనోత్తేజాన్నిచ్చే ఉపదేశంతో, సహవాసంతో పరస్పరం ప్రోత్సహించుకొనే చక్కని అవకాశం లభిస్తుంది. (హెబ్రీయులు 10:​24-25) సంఘ సభ్యులందరూ కూటాల్లో వ్యాఖ్యానించేటప్పుడు లేదా వేదిక మీది నుండి కార్యక్రమ భాగం నిర్వహిస్తున్నప్పుడు, అవి ప్రోత్సాహకరంగా ఉండేలా కృషిచేయాలి. ఇతరులను ప్రోత్సహించే విషయంలో ప్రత్యేకంగా బోధకులుగా ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంది. (యెషయా 32:​1, 2) బుద్ధిచెప్పవలసిన లేదా గద్దించవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా ఉపదేశమిచ్చే విధానం ఉత్తేజాన్నిచ్చేదిగా ఉండాలి. (గలతీయులు 6:​1, 2) ఇతరులపట్ల మనకున్న ప్రేమ నిజానికి, మనం సొమ్మసిల్లక యెహోవాను సేవించడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠కీర్తన 133:1; యోహాను 13:35.

22 ఈ యుగాంతంలో యెహోవాను ఆరాధించడంలో పనిచేయడం కూడా ఇమిడివుంది. అలాగే క్రైస్తవులు భావోద్రేక అలసటకు, మానసిక బాధకు, ఒత్తిడిగల పరిస్థితులకు అతీతులు కారు. మన అపరిపూర్ణ మానవ నైజం మట్టి పాత్రల్లా పెళుసైనది. అయినప్పటికీ, బైబిలు ఇలా చెబుతోంది: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” (2 కొరింథీయులు 4:⁠7) అవును, మనం అలసిపోయినా మనమెప్పటికీ సొమ్మసిల్లకూడదు లేదా ఆశ వదులుకోకూడదు. బదులుగా, మనం ‘మంచి ధైర్యంతో యెహోవా నాకు సహాయుడు అని చెబుదాం.’​—⁠హెబ్రీయులు 13:⁠6.

క్లుప్త పునఃసమీక్ష

మనం తొలగించుకోగల కొన్ని భారమైన బరువులు ఏమిటి?

మనతోటి క్రైస్తవులకు ‘మేలుచేయడంలో’ మనమెలా భాగం వహించగలము?

మనం అలసిపోయినట్లు భావిస్తున్నప్పుడు లేదా నిరుత్సాహపడుతున్నప్పుడు యెహోవా మనలనెలా బలపరుస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) స్వచ్ఛారాధన చేయాలని కోరుకునే వారందరికీ ఎలాంటి ఆకర్షణీయమైన ఆహ్వానం ఇవ్వబడింది? (బి) మన ఆధ్యాత్మికతకు ఏది తీవ్రమైన ముప్పువాటిల్లజేయవచ్చు?

3. యోహాను 14:1లోవున్న హితవును యేసు ఎందుకిచ్చాడు?

4. అలసిపోకుండా మన అలంకారార్థ హృదయాల్ని కాపాడుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

5. క్రైస్తవ శిష్యరికం విషయంలో ఎలాంటి పరస్పర విరుద్ధత ఉన్నట్లు కనబడుతోంది?

6, 7. మన ఆరాధనా విధానం అలసట కలిగించదని ఎందుకు చెప్పవచ్చు?

8. ఆధ్యాత్మిక అలసటకు తరచూ కారణమేమిటి?

9. వస్తుసంపదను వెంటాడడం ఎలా మనం అలసిపోయేలా చేయగలదు?

10. విత్తువానికి సంబంధించిన యేసు ఉపమానం నుండి ధనాన్ని గురించి మనమేమి నేర్చుకోవచ్చు?

11. మనల్ని అలసిపోయేలా చేసే వాటిని మనమెలా వదిలించుకోవచ్చు?

12. మన సొంత తప్పిదాల గురించి మనం ఏమి గుర్తించాలి?

13. మన పరిచర్యకు సంబంధించి సమతూక దృక్కోణాన్ని కలిగివుండడానికి సహేతుకత మనకెలా సహాయం చేయగలదు?

14, 15. మన శారీరక, మానసిక అవసరతలపట్ల శ్రద్ధ చూపడంలో మనమెలా ఆచరణాత్మక జ్ఞానం కనబరచవచ్చు?

16, 17. (ఎ) మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవడం ఎందుకు అత్యంత ప్రాముఖ్యం? (బి) మన దైనందిన వాడుకలో వేటిని మనం చేర్చాలి?

18. వృద్ధులుగా లేదా అనారోగ్యంగా ఉన్న నమ్మకస్థులకు బైబిలు ఎలాంటి ఓదార్పునిస్తోంది?

19. మేలుచేయడంలో నిమగ్నమైవుండడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

20. నిరుత్సాహాన్ని తప్పించుకోవాలంటే మనమెవరి సాంగత్యాన్ని విసర్జించాలి?

21. క్రైస్తవ కూటాల్లో మనమెలా ఇతరులను ప్రోత్సహించవచ్చు?

22. మనకు అపరిపూర్ణ మానవ నైజం ఉన్నప్పటికీ, మనమెందుకు మంచి ధైర్యంతో ఉండగలం?

[23వ పేజీలోని చిత్రం]

దీర్ఘకాల నిరుత్సాహం అపొస్తలులను ఇబ్బందిపెట్టగలదని యేసుకు తెలుసు

[24వ పేజీలోని చిత్రం]

కొందరు కొన్నిరకాల వ్యాసంగాలను, అప్రాముఖ్యమైన వ్యక్తిగత పథకాలను విడిచిపెట్టారు

[26వ పేజీలోని చిత్రం]

మనకు పరిమితులున్నప్పటికీ, మన హృదయపూర్వక ఆరాధనను యెహోవా ఎంతో విలువైనదిగా పరిగణిస్తాడు