కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్హేతుకంగా ద్వేషించబడ్డారు

నిర్హేతుకంగా ద్వేషించబడ్డారు

నిర్హేతుకంగా ద్వేషించబడ్డారు

“నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి.”​—⁠యోహాను 15:25.

యెహోవాసాక్షులు దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి కృషిచేస్తారు. తత్ఫలితంగా వారనేక దేశాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే కొన్నిసార్లు, వారి గురించి తప్పుడు ప్రచారం చేయబడింది. ఉదాహరణకు, రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలోని ఒక ప్రభుత్వాధికారి ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “యెహోవాసాక్షులు పిల్లలను చాటుగా హతమారుస్తూ, తమనుతాము హతమార్చుకునే ఒక రకమైన రహస్య మత శాఖగా మాకు నివేదించబడింది.” అయితే ఒక అంతర్జాతీయ సమావేశం సందర్భంగా యెహోవాసాక్షులతో కలిసి పనిచేసిన అదే అధికారి ఇలా చెప్పాడు: “నేనిప్పుడు చిరునవ్వుతో ఉండే మామూలు ప్రజలను చూస్తున్నాను . . . వారు ప్రశాంతమైన, సమాధానకరమైన ప్రజలు, వారు ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకుంటారు.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “వాళ్ల గురించి ప్రజలెందుకు అలా అబద్ధాలు చెబుతారో నాకు నిజంగా అర్థం కావడం లేదు.”​—⁠1 పేతురు 3:​15-16.

2 దేవుని సేవకులు, తాము కీడుచేసేవారని నిందించబడినప్పుడు సంతోషించరు, అయినప్పటికీ ప్రజలు వారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోరు. యేసు తన అనుచరులను ముందే ఇలా హెచ్చరించాడు: “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. . . . నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.” * (యోహాను 15:18-20, 25; కీర్తన 35:19; 69:⁠4) అంతకుముందు ఆయన తన శిష్యులకిలా చెప్పాడు: “ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.” (మత్తయి 10:​25) అలాంటి నిందలు భరించడం, తాము క్రీస్తు అనుచరులైనప్పుడు మోయడానికి తాము అంగీకరించిన ‘హింసాకొయ్యలో’ భాగమని క్రైస్తవులు అర్థం చేసుకుంటారు.​—⁠మత్తయి 16:​24, NW.

3 “నీతిమంతుడైన హేబెలు” మొదలుకొని సత్యారాధకుల హింసకు పెద్ద చరిత్ర ఉంది. (మత్తయి 23:​34, 35) అదేదో ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట జరిగిన సంఘటనలకు మాత్రమే పరిమితం కాలేదు. యేసు తన అనుచరులు తన నామం నిమిత్తం ‘అందరిచేత ద్వేషించబడతారని’ చెప్పాడు. (మత్తయి 10:​22) అంతేకాదు, దేవుని సేవకులమైన మనలో ప్రతీ ఒక్కరూ హింసించబడతామని ఎదురుచూడవచ్చని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:​12) ఆ హింసకు కారణమేమిటి?

అన్యాయపు హింసకు మూలకారణం

4 ఆదినుండే ఒక అదృశ్య ప్రబోధకుడు ఉన్నాడని దేవుని వాక్యం వెల్లడి చేస్తోంది. మొదటి విశ్వాస పురుషుడైన హేబెలు క్రూరంగా హత్య చేయబడడాన్ని పరిశీలించండి. హత్యకు పాల్పడ్డ అతని అన్న కయీను అపవాదియగు సాతాననే “దుష్టునిసంబంధి” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 3:​12) కయీను సాతాను స్వభావం కనబరిచాడు, దానితో అపవాది తన దుష్ట పన్నాగాలు నెరవేర్చుకోవడానికి అతణ్ణి ఉపయోగించుకున్నాడు. యోబుపై, యేసుక్రీస్తుపై చేయబడిన క్రూరమైన దాడుల్లో సాతాను పాత్ర గురించి కూడా బైబిలు వెల్లడి చేస్తోంది. (యోబు 1:12; 2:6, 7; యోహాను 8:​37, 44; 13:​27) యేసు అనుచరుల హింసకు మూలకారణమెవరో ప్రకటన గ్రంథం స్పష్టంగా చూపిస్తూ ఇలా చెబుతోంది: ‘ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు.’ (ప్రకటన 2:10) అవును, దేవుని ప్రజలకు విరోధంగా చేయబడుతున్న సమస్త అన్యాయపు ద్వేషానికి సాతానే మూలకారణం.

5 సత్యారాధకులను సాతాను ద్వేషించడానికి కారణమేమిటి? విపరీతమైన స్వాతిశయాన్ని సూచించే కుట్రలో భాగంగా, సాతాను ‘సకల యుగములలో రాజైన’ యెహోవా దేవుణ్ణే సవాలు చేశాడు. (1 తిమోతి 1:​17; 3:⁠6) దేవుడు తన సృష్టి ప్రాణులపై చేసే పరిపాలన అపరిమితమైన హద్దులతో ఉందనీ, ఎవరూ స్వచ్ఛమైన ఉద్దేశంతో యెహోవాను సేవించరనీ, ప్రజలు కేవలం స్వలాభాపేక్షతోనే అలా చేస్తారనీ అతడు వాదిస్తున్నాడు. మానవులను పరీక్షించడానికి అనుమతిస్తే తాను ప్రతి ఒక్కరినీ దేవుని సేవించకుండా చేయగలనని సాతాను వాదిస్తున్నాడు. (ఆదికాండము 3:1-6; యోబు 1:6-12; 2:​1-7) యెహోవా నిరంకుశ పాలకుడని, అబద్ధికుడని, విఫలుడయ్యాడని నిందలుమోపుతూ సాతాను తనను తాను ప్రత్యర్థ సర్వాధిపతిగా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దేవుని సేవకుల పట్ల అతనికున్న కోపం, తాను ఆరాధించబడాలనే తృష్ణ మూలంగా కలిగినదే.​—⁠మత్తయి 4:8, 9.

6 ఈ వివాదాంశం మీ జీవితాన్నెలా ప్రభావితం చేస్తుందో మీరు గమనించారా? యెహోవా సేవకునిగా మీరు, దేవుని చిత్తాన్ని చేయడానికి హృదయపూర్వక కృషి అవసరమైనా, అలా చేయడంవల్ల కలిగే ప్రయోజనాలు అత్యధికంగా ఉంటాయని బహుశా గ్రహించే ఉంటారు. అయితే యెహోవా నియమాలకు, సూత్రాలకు అనుగుణంగా జీవించడాన్ని మీ జీవన పరిస్థితులు కష్టభరితం చేస్తే, చివరకు బాధాకరం చేస్తే అప్పుడేమిటి? యెహోవాను సేవించడంవల్ల మీకెలాంటి ప్రయోజనం కలగనట్లు అనిపిస్తే అప్పుడేమిటి? యెహోవాను సేవిస్తూ ఉండడం నిష్ప్రయోజనమనే నిర్ణయానికి వచ్చేస్తారా? లేక యెహోవాపట్ల ప్రేమ, ఆయన మహిమాన్విత లక్షణాలపట్ల అభిమానం, ఆయన మార్గాలన్నింటి అనుసారంగా నడుచుకోవడంలో కొనసాగడానికి మిమ్మల్ని పురికొల్పుతాయా? (ద్వితీయోపదేశకాండము 10:​12, 13) మనకు కొంతమేర కష్టం కలిగించడానికి సాతానును అనుమతించడం ద్వారా, సాతాను సవాలుకు మనలో ప్రతీ ఒక్కరం వ్యక్తిగతంగా జవాబిచ్చే అవకాశాన్ని యెహోవా మనకిస్తున్నాడు.​—⁠సామెతలు 27:11.

‘జనులు మిమ్మును నిందించినప్పుడు’

7 ఆ వివాదాంశంలో సాతాను తన స్థానాన్ని నిరూపించుకోవడానికి ఉపయోగించే కుయుక్తుల్లో ఒక దాన్ని మనమిప్పుడు మరింత నిశితంగా పరిశీలిద్దాం, అదే అబద్ధారోపణ. సాతానును యేసు “అబద్ధమునకు జనకుడు” అని పిలిచాడు. (యోహాను 8:​44) “కొండెములు చెప్పువాడు” అనే భావమున్న అపవాది అనే పేరు, అతడే దేవునిపై, ప్రయోజనకరమైన ఆయన వాక్యంపై, ఆయన పరిశుద్ధ నామంపై అపనిందలు మోపిన ప్రధాన వ్యక్తని గుర్తిస్తోంది. యెహోవా సర్వాధిపత్యాన్ని సవాలు చేయడానికి అపవాది డొంకతిరుగుడు విధానాలు, అబద్ధ ఆరోపణలు, పచ్చి అబద్ధాలు ప్రయోగిస్తాడు, అవే తంత్రాలను అతడు దేవుని విశ్వసనీయ సేవకులకు హాని తలపెట్టడానికి కూడా ప్రయోగిస్తాడు. సాతాను సవాలుకు వ్యక్తిగతంగా జవాబిచ్చే అవకాశాన్ని యెహోవా మనలో ప్రతీ ఒక్కరికి ఇచ్చాడు.

8 “శత్రుత్వానికి హేతువు” అనే అర్థమున్న పేరుగల యోబుకు ఏంజరిగిందో పరిశీలించండి. యోబు తన జీవనాధారాన్ని, పిల్లలను, ఆరోగ్యాన్ని పోగొట్టుకునేలా చేయడమే కాక ఆయన పాపియనీ, దేవునిచే శిక్షించబడుతున్నాడనీ అనిపించేలా సాతాను చేశాడు. ఆయనెంతో గౌరవించబడినప్పటికీ, చివరికి బంధువులచే, ప్రాణ స్నేహితులచే తృణీకరించబడిన వాడయ్యాడు. (యోబు 19:​13-19; 29:​1, 2, 7-11) అంతేకాకుండా, సాతాను కపట ఆదరణకర్తల మూలంగా ‘యోబును మాటలచేత నలుగగొట్టడానికి’ ప్రయత్నించాడు, దానిలో భాగంగా, ఆయన ఏదో గంభీరమైన పాపంచేసి ఉంటాడని మొదట ఆరోపించాడు, ఆ తర్వాత ఆయన తప్పిదస్థుడని సూటిగా నేరం మోపాడు. (యోబు 4:6-9; 19:2; 22:​5-10) యోబును అదెంతగా కృంగదీసి ఉంటుందో కదా!

9 యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించిన ప్రముఖునిగా దేవుని కుమారుడు కూడా సాతాను విద్వేషానికి ప్రధాన లక్ష్యమయ్యాడు. యేసు భూమిపైకి వచ్చినప్పుడు, సాతాను యోబు విషయంలో చేసినట్లే, యేసును కూడా పాపిలా కనబడేలాచేస్తూ ఆధ్యాత్మిక కళంకం ఆయనకు అంటగట్టడానికి ప్రయత్నించాడు. (యెషయా 53:2-4; యోహాను 9:​24) ప్రజలాయనను త్రాగుబోతనీ, తిండిబోతనీ పిలుస్తూ ఆయనకు ‘దయ్యంపట్టిందని’ అన్నారు. (మత్తయి 11:18, 19; యోహాను 7:20; 8:48; 10:​20) దైవదూషణ చేస్తున్నాడని ఆయనపై అబద్ధ ఆరోపణ చేయబడింది. (మత్తయి 9:2, 3; 26:63-66; యోహాను 10:​33-36) ఇది యేసును ఎంతగానో కృంగదీసింది, ఎందుకంటే అది తన తండ్రికి చెడ్డ పేరు తెస్తుందని ఆయనకు తెలుసు. (లూకా 22:​41-44) చివరకు యేసు శపించబడిన నేరస్థుడిలా కొయ్యకు వ్రేలాడదీయబడ్డాడు. (మత్తయి 27:​38-44) పరిపూర్ణ యథార్థతను కాపాడుకోవడంలో యేసు “పాపాత్ములు తనకు వ్యతిరేకముగాచేసిన తిరస్కారమంత[టినీ]” ఓర్చుకున్నాడు.​—⁠హెబ్రీయులు 12:​1-3.

10 ఆధునిక కాలాల్లో, క్రీస్తు అభిషిక్త అనుచరుల్లో మిగిలివున్నవారు కూడా అదే విధంగా అపవాది ద్వేషానికి గురయ్యారు. సాతాను, “రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన [క్రీస్తు] సహోదరులమీద నేరము మోపువాడు” అని వర్ణించబడ్డాడు. (ప్రకటన 12:​9, 10) అతడు పరలోకం నుండి పడద్రోయబడి భూ పరిధికే పరిమితం చేయబడిన దగ్గర నుండి క్రీస్తు సహోదరులను నీచులుగా, సమాజ బహిష్కృతులుగా చిత్రీకరించడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. (1 కొరింథీయులు 4:​13) మొదటి శతాబ్దపు క్రైస్తవులపై వేయబడినట్లే, కొన్ని దేశాల్లో వారిపై ప్రమాదకరమైన మతభేదమనే అబద్ధ ఆరోపణ చేయబడుతోంది. (అపొస్తలుల కార్యములు 24:5, 14; 28:​22) శీర్షికారంభంలో పేర్కొన్నట్లు, ద్రోహబుద్ధితో వారిపై అబద్ధాలు ప్రచారం చేయబడుతున్నాయి. అయినప్పటికీ, క్రీస్తు అభిషిక్త సహోదరులు, వారి సహవాసులైన “వేరే గొఱ్ఱెల” మద్దతుతో “ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను” ‘దేవుని ఆజ్ఞలు గైకొనుచూ యేసునుగూర్చి సాక్ష్యమివ్వడానికి’ వినయ స్వభావంతో కృషి చేస్తున్నారు.​—⁠2 కొరింథీయులు 6:8; యోహాను 10:16; ప్రకటన 12:17.

11 అయితే, దేవుని సేవకులు అనుభవించే నిందంతా “నీతినిమిత్తము” కాదు. (మత్తయి 5:​10) కొన్ని సమస్యలు మన అపరిపూర్ణత కారణంగా కలగవచ్చు. మనం చేసిన “తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు [మనం] సహించినయెడల” దానికి ప్రత్యేకంగా ఏ ఘనతా ఉండదు. కానీ ఒక క్రైస్తవుడు “అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల” అది యెహోవా దృష్టిలో ‘హితమవుతుంది.’ (1 పేతురు 2:​19, 20) ఇది ఎలాంటి పరిస్థితుల్లో జరగవచ్చు?

12 లేఖన విరుద్ధమైన అంత్యక్రియల ఆచారాల్లో పాల్గొనడానికి నిరాకరించిన కారణంగా కొందరు కష్టాలు అనుభవించాల్సివచ్చింది. (ద్వితీయోపదేశకాండము 14:⁠1) యెహోవా నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు యౌవన సాక్షులు క్రూరమైన దూషణలకు గురయ్యారు. (1 పేతురు 4:⁠4) కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్తరహిత చికిత్సకోసం ప్రయత్నించిన కారణంగా “నిర్లక్ష్యపరులని,” లేదా “చెడ్డవారనీ” తప్పుగా ముద్రవేయబడ్డారు. (అపొస్తలుల కార్యములు 15:​28-29) కేవలం యెహోవా సేవకులైన కారణంగా క్రైస్తవులను బంధువులు, పొరుగువారు వెలివేశారు. (మత్తయి 10:​34-37) అలాంటి వారందరూ అన్యాయంగా కష్టాలు అనుభవించడంలో ప్రవక్తలు, యేసు ఉంచిన మాదిరినే అనుసరిస్తున్నారు.​—⁠మత్తయి 5:11, 12; యాకోబు 5:10; 1 పేతురు 2:21.

నిందను సహించడం

13 మన విశ్వాసాన్నిబట్టి మనం తీవ్రంగా నిందించబడినప్పుడు నిరుత్సాహపడి, యిర్మీయాలాగే, మనమిక దేవుణ్ణి సేవించలేమన్నట్లు భావించవచ్చు. (యిర్మీయా 20:​7-9) అయితే మన ఆధ్యాత్మిక సమతూకాన్ని కాపాడుకోవడానికి మనకేది సహాయం చేయవచ్చు? విషయాన్ని యెహోవా దృక్కోణం నుండి చూడడానికి ప్రయత్నించండి. పరీక్షల్లోనూ విశ్వసనీయంగా నిలబడ్డవారిని ఆయన బాధితులుగా కాక విజేతలుగా దృష్టిస్తాడు. (రోమీయులు 8:​37) హేబెలు, యోబు, యేసు తల్లియైన మరియ మరితర ప్రాచీన నమ్మకస్థులు, అలాగే ఆధునిక కాలాల్లోని మన తోటి సేవకులు తమపై అపవాది తీసుకొచ్చిన ప్రతీ అవమానాన్ని సహిస్తూ యెహోవా సర్వాధిపత్యాన్ని ఎలా సమర్థించారో మనస్సులో చిత్రీకరించుకోవడానికి ప్రయత్నించండి. (హెబ్రీయులు 11:​35-37; 12:⁠1) వారి యథార్థతా విధానాన్ని ధ్యానించండి. తమ విశ్వాసం ద్వారా లోకాన్ని జయించిన వారికోసం కేటాయించబడిన విజేతల స్థానంలో నిలబడిన వారితో మనమూ ఉండాలని, మేఘమువలె ఉన్న ఆ విశ్వసనీయుల గొప్ప సమూహం మనలను ఆహ్వానిస్తోంది.​—⁠1 యోహాను 5:⁠4.

14 ‘మన అంతరంగ విచారములు ఎక్కువైనప్పుడు’ మనం పట్టుదలతో యెహోవాను ప్రార్థించవచ్చు, అప్పుడాయన మనలను ఆదరిస్తూ బలపరుస్తాడు. (కీర్తన 50:15; 94:​19) పరీక్షను ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానం ఆయన మనకిచ్చి, తన సేవకులపైకి తీసుకురాబడుతున్న అన్యాయపు ద్వేషానికి కారణమైన యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదంపై దృష్టి నిలపడానికి మనకు సహాయం చేస్తాడు. (యాకోబు 1:⁠5) అంతేకాకుండా యెహోవా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము[ను]” కూడా మనకు దయచేస్తాడు. (ఫిలిప్పీయులు 4:​6, 7) దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమాధానం తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ, సందేహానికి లేదా భయానికి తావివ్వకుండా మనం ప్రశాంతంగా, స్థిరంగా ఉండడానికి సహాయం చేస్తుంది. యెహోవా తన పరిశుద్ధాత్మ మూలంగా, మనమీదికి రావడానికి ఆయన అనుమతించిన ప్రతి పరీక్ష నుండి మనలను ఆదుకోగలడు.​—⁠1 కొరింథీయులు 10:13.

15 నిర్హేతుకంగా మనలను ద్వేషించేవారిపట్ల కోపంతో రగిలి పోకుండా ఉండడానికి మనకేది సహాయం చేయగలదు? సాతాను అతని దయ్యాలు మన ప్రధాన శత్రువులని గుర్తుంచుకోండి. (ఎఫెసీయులు 6:​12) కొందరు తెలిసీ లేదా ఉద్దేశపూర్వకంగా మనల్ని హింసిస్తున్నప్పటికీ దేవుని ప్రజలను వ్యతిరేకించే చాలామంది తమ అజ్ఞానంవల్ల లేదా ఇతరుల ప్రోత్సాహం వల్ల అలా చేస్తున్నారు. (దానియేలు 6:4-16; 1 తిమోతి 1:​12, 13) ‘రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారయ్యే’ అవకాశం ‘మనుష్యులందరికీ’ లభించాలని యెహోవా కోరుతున్నాడు. (1 తిమోతి 2:⁠4) నిజానికి, నిర్దోషమైన మన ప్రవర్తనను గమనించిన కారణంగా, ఒకప్పుడు మనలను వ్యతిరేకించిన వారు ఇప్పుడు మన క్రైస్తవ సహోదరులయ్యారు. (1 పేతురు 2:​12) అంతేకాక, మనం యాకోబు కుమారుడైన యోసేపు మాదిరి నుండి పాఠం నేర్చుకోగలం. యోసేపు తన అన్నల కారణంగా దారుణమైన కష్టాలు అనుభవించినప్పటికీ, వారిపట్ల ఆయన పగ పెంచుకోలేదు. ఎందుకు? ఎందుకంటే యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయా సంఘటనలను తన చేతులమీదుగానే జరిగిస్తున్నాడని ఆయన గ్రహించాడు. (ఆదికాండము 45:​4-8) అదే విధంగా మనం అనుభవించే ఎలాంటి అన్యాయపు కష్టమైనా అది చివరకు తన నామానికి మహిమతెచ్చేలా యెహోవా చేయగలడు.​—⁠1 పేతురు 4:16.

16 వ్యతిరేకులు సువార్త వ్యాపకాన్ని అడ్డుకోవడంలో కొంతకాలంపాటు విజయం సాధిస్తున్నట్లు అనిపించినా మనం అధికంగా చింతించనవసరం లేదు. భూవ్యాప్తంగా ఇవ్వబడుతున్న సాక్ష్యపు పని మూలంగా యెహోవా ఇప్పుడు అన్యజనులనందరిని కదిలిస్తున్నాడు, అందువల్ల ఇష్టవస్తువులు తేబడుతున్నాయి. (హగ్గయి 2:⁠7) మంచి కాపరియైన క్రీస్తు యేసు ఇలా అన్నాడు: ‘నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను, . . . ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.’ (యోహాను 10:​27-29) ఈ గొప్ప కోతపనిలో పరిశుద్ధ దేవదూతలు కూడా భాగంవహిస్తున్నారు. (మత్తయి 13:39, 41; ప్రకటన 14:​6, 7) కాబట్టి, వ్యతిరేకులు చెప్పేదీ, చేసేదీ ఏదీ కూడా దేవుని సంకల్పాన్ని అడ్డగించలేవు.​—⁠యెషయా 54:17; అపొస్తలుల కార్యములు 5:38, 39.

17 తరచూ వ్యతిరేకుల ప్రయత్నాలు తిరిగి వారికే తగులుతుంటాయి. ఒక ఆఫ్రికా సమాజంలో, యెహోవాసాక్షులు అపవాది ఆరాధకులు అనే దానితోసహా వారి గురించి అనేక ఘోర అబద్ధాలు వ్యాప్తి చేయబడ్డాయి. దీని కారణంగా సాక్షులు సందర్శించినప్పుడల్లా గ్రేస్‌ ఇంటి వెనక్కి పరుగెత్తికెళ్లి వాళ్లు వెళ్లిపోయేంతవరకు అక్కడే దాగి ఉండేది. ఒకరోజు ఆమె చర్చి పాస్టరు మన సాహిత్యాల్లో ఒక దానిని పైకెత్తి పట్టుకుని అక్కడున్న వారందరితో దాన్ని చదవకూడదనీ ఎందుకంటే అది వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుందనీ చెప్పాడు. ఇది గ్రేస్‌ కుతూహలాన్ని పెంచింది. సాక్షులు ఈసారి వచ్చినప్పుడు దాక్కోవడానికి బదులు ఆమె వారిని సంభాషణలోకి దించి వారినుండి తనకోసం ఒక సాహిత్యం తీసుకుంది. బైబిలు అధ్యయనం ఆరంభించబడి 1996లో ఆమె బాప్తిస్మం తీసుకుంది. గ్రేస్‌ ఇప్పుడు యెహోవాసాక్షుల గురించి తప్పుగా చెప్పబడిన వారిని అన్వేషించడానికి సమయం వెచ్చిస్తోంది.

మీ విశ్వాసాన్ని ఇప్పుడే బలపరచుకోండి

18 సాతాను ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా అన్యాయపు ద్వేషాన్ని ప్రబలింపజేయగలడు కాబట్టి మనమిప్పుడే మన విశ్వాసాన్ని బలపరచుకోవడం ఆవశ్యకం. దీనిని మనమెలా చేయగలం? యెహోవా ప్రజలు హింసించబడిన ఒక దేశపు నివేదిక ఇలా చెబుతోంది: “ఒక విషయం మాత్రం స్పష్టమైంది: చక్కని ఆధ్యాత్మిక అలవాట్లు, బైబిలు సత్యంపట్ల ప్రగాఢమైన కృతజ్ఞత గలవారికి పరీక్షలు వచ్చినప్పుడు స్థిరంగా ఉండడం సమస్యకాలేదు. అయితే ‘అనుకూల సమయమందు’ కూటాలకు సరిగ్గా హాజరుకాని వారు, క్షేత్రసేవలో క్రమంగా పాల్గొనని వారు, చిన్న విషయాల్లో రాజీ పడినవారు తరచూ ‘అగ్ని’ పరీక్షకు తట్టుకోలేక పడిపోతారు.” (2 తిమోతి 4:2) మీరు ప్రగతి సాధించవలసిన రంగాలేమైనా ఉన్నాయని మీరు భావిస్తే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ మేరకు కృషి చేయండి.​—⁠కీర్తన 119:60.

19 సాతాను ద్వేషపు తాకిడి క్రింద కూడా సత్యారాధకులు చూపే యథార్థత యెహోవా సర్వాధిపత్యపు సత్యత్వానికీ, యోగ్యతకూ, నీతికీ సజీవ సాక్ష్యంగా ఉంటుంది. వారి నమ్మకత్వం దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. ప్రజలు వారిపై అపనిందలు మోపినా భూమ్యాకాశాలకు పైగా ఉన్నవాడు ‘వారి దేవుడనని అనిపించుకోవడానికి వారినిగూర్చి సిగ్గుపడడు.’ నిజానికి, అలాంటి విశ్వసనీయులందరి గురించి, “అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు” అని సరిగా చెప్పవచ్చు.​—⁠హెబ్రీయులు 11:16, 38.

[అధస్సూచి]

^ పేరా 4 లేఖనాల్లో ‘ద్వేషము’ అనే మాటకు చాలా అర్థాలున్నాయి. కొన్ని సందర్భాల్లో దానికి తక్కువగా ప్రేమించడం అనే సామాన్య భావముంది. (ద్వితీయోపదేశకాండము 21:​15, 16) కొన్ని సందర్భాల్లో ‘ద్వేషము’ ఒకానొక విషయాన్ని పూర్తిగా అయిష్టపడి, హాని తలపెట్టాలనే ఉద్దేశం లేకుండా, ఆ విషయాన్ని హేయభావంతో విసర్జించడాన్ని కూడా సూచిస్తుంది. అయితే ‘ద్వేషము’ అనే మాట తరచూ ద్రోహబుద్ధి కలిగిన తీవ్ర విరోధభావాన్ని, తీరని కోపాన్ని కూడా సూచించవచ్చు. ఈ ఆర్టికల్‌లో, ఆ పదం యొక్క ఈ భావం పరిశీలించబడుతుంది.

మీరు వివరించగలరా?

సత్యారాధకులపైకి తీసుకురాబడే అన్యాయపు ద్వేషానికి మూల కారణమేమిటి?

యోబు యేసుల యథార్థతను భంగపరచడానికి సాతాను అపనిందనెలా ఉపయోగించాడు?

సాతాను తీసుకొచ్చే ద్వేషం ఎదుర్కొన్నప్పుడు మనం స్థిరంగా ఉండడానికి యెహోవా మనల్నెలా బలపరుస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కొందరెందుకు దిగ్భ్రాంతి చెందుతారు, అయితే అలాంటి మాటలు మనలను ఎందుకు ఆశ్చర్యపరచకూడదు? (బి) ‘ద్వేషము’ అనే మాటయొక్క ఏ భావాన్ని మనమీ ఆర్టికల్‌లో పరిశీలిస్తాము? (అధస్సూచి చూడండి.)

3. సత్యారాధకులు ఎంతమేరకు హింసించబడ్డారు?

4. సమస్త అన్యాయపు ద్వేషానికి మూలకారణం ఎవరని బైబిలు వెల్లడి చేస్తోంది?

5. సత్యారాధకులను సాతాను ద్వేషించడానికి కారణమేమిటి?

6. (ఎ) యెహోవా సర్వాధిపత్యపు వివాదాంశంలో మనం వ్యక్తిగతంగా ఎలా ఇమిడివున్నాము? (బి) ఈ వివాదాంశాన్ని అర్థం చేసుకోవడం, మన యథార్థతను కాపాడుకోవడానికి మనకెలా సహాయం చేస్తుంది? (16వ పేజీలోని బాక్సుకూడా చూడండి.)

7. మనల్ని యెహోవా నుండి త్రిప్పివేసే ప్రయత్నంలో అపవాది ఎలాంటి తంత్రం ఉపయోగిస్తాడు?

8. సాతాను యోబునెలా నిందించాడు, దాని ఫలితమేమిటి?

9. యేసు పాపిలా కనబడేటట్లు ఎలా చేయబడ్డాడు?

10. ఆధునిక కాలాల్లో, అభిషిక్తులలో మిగిలివున్నవారు సాతాను దాడికి ఎలా గురయ్యారు?

11, 12. (ఎ) క్రైస్తవులు అనుభవించే కొంత నిందకు కారణమేమై ఉండవచ్చు? (బి) ఒక క్రైస్తవుడు తన విశ్వాసాన్నిబట్టి ఏయే విధాలుగా అన్యాయంగా కష్టాలు అనుభవించవచ్చు?

13. మనం తీవ్రమైన నిందలను సహిస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక సమతూకాన్ని కాపాడుకోవడానికి మనకేది సహాయం చేయవచ్చు?

14.నమ్మకంగా నిలిచి ఉండడానికి పట్టుదలతో ప్రార్థించడం ఎలా సహాయం చేయగలదు?

15. మనం కష్టం అనుభవించినప్పుడు కోపించకుండా ఉండడానికి మనకేది సహాయం చేయగలదు?

16, 17. ప్రకటనా పనిని అడ్డగించడానికి వ్యతిరేకులు చేసే ప్రయత్నాలనుబట్టి మనమెందుకు చింతించకూడదు?

18. తీవ్రమైన పరీక్షలు రాకముందే మన విశ్వాసాన్ని మనమెందుకు బలపరచుకోవాలి, అది మనమెలా చేయగలం?

19. అన్యాయంగా ద్వేషానికి గురవుతున్న సమయంలో కూడా దేవుని సేవకులు చూపించే యథార్థత దేనిని నెరవేరుస్తుంది?

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

వారు నిజమైన వివాదాంశాన్ని గ్రహించారు

దాదాపు 50 సంవత్సరాలకు పైగా రాజ్య ప్రకటనా పని నిషేధం క్రిందవున్న యుక్రెయిన్‌లో ఒక యెహోవాసాక్షి ఇలా అన్నాడు: “యెహోవాసాక్షులున్న పరిస్థితిని కేవలం మానవ సంబంధాల పరిధిలోనే లెక్కకట్టకూడదు. . . . అధికారుల్లో అత్యధికులు తమ పని తాము చేశారు. ప్రభుత్వం మారినప్పుడు, అధికారులు తమ విశ్వాస్యతను మార్చుకున్నారు, కానీ మేమయితే అలాగే ఉండిపోయాం. మన కష్టాలకు నిజమైన మూలకారణమేమిటో బైబిల్లో వెల్లడి చేయబడిందని మేము గ్రహించాం.

“మమ్మల్ని మేము క్రూరుల చేతుల్లోని అమాయక బలిపశువులుగా దృష్టించుకోలేదు. ఏదెను వనంలో లేవదీయబడిన వివాదాంశాన్ని అంటే, దేవుని పరిపాలనా హక్కుకు సంబంధించిన వివాదాన్ని మేము స్పష్టంగా అర్థం చేసుకోవడమే సహించడానికి మాకు సహాయం చేసింది. . . . మేము మానవుల వ్యక్తిగత ఆసక్తికి సంబంధించిన వివాదాంశం పక్షాన కాక విశ్వ సర్వాధిపతి ఆసక్తులకు సంబంధించిన వివాదాంశం పక్షాన స్థిరంగా నిలబడ్డాం. ఇమిడివున్న నిజమైన వివాదాంశాల ఉన్నతమైన అవగాహన మాకుంది. ఇది తీవ్ర పరిస్థితుల్లోనూ మా యథార్థతను కాపాడుకొనేలా మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచింది.”

[చిత్రం]

1970లో అరెస్టు చేయబడిన విక్టర్‌ పొపొవిచ్‌

[13వ పేజీలోని చిత్రం]

యేసుపై మోపబడిన నిందలకు కారణమెవరు?

[15వ పేజీలోని చిత్రాలు]

యోబు, మరియ, ఆధునిక కాలాల్లోని స్టాన్లీ జోన్స్‌వంటి దేవుని సేవకులు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించారు