కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి సలహా అవసరమా?

మంచి సలహా అవసరమా?

మంచి సలహా అవసరమా?

నేడు చాలామంది తమకు మంచి చెడ్డలను వివేచించే సామర్థ్యముందనీ, తమకు ఇష్టమైనది చేసే హక్కు తమకుందని నమ్ముతున్నారు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నంతవరకు ఏమిచేసినా అది ఆమోదకరమే అని మరికొందరు అంటారు. అనాదిగా మానవ సమాజపు ప్రాథమిక ఏర్పాట్లుగా పరిగణించబడుతున్న వివాహం, కుటుంబ జీవితం ఘోరంగా దెబ్బతింటున్నాయి.​—⁠ఆదికాండము 3:5.

మెక్సికోలో నివసించే వెరోనికా విషయమే తీసుకోండి. * ఆమె ఇలా చెబుతోంది: “మా వివాహమై 15 సంవత్సరాలు ఇక పూర్తవుతాయి అనుకునేంతలో, నా భర్త మరో స్త్రీతో తనకు సంబంధముందని చెప్పాడు. ఆమె వయస్సులో చిన్నదైనందువల్ల తనను సుఖపెడుతోందని ఆమెను వదులుకోలేనని చెప్పాడు. ప్రాణ స్నేహితుడనుకొన్న భర్తే నాకు దూరమై నాకిక తోడుగా ఉండడనే తలంపుతో నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. మన ప్రియమైన వారి మరణమే అత్యంత బాధాకరమైనదని నేననుకునే దాన్ని. కానీ అతను వ్యభిచారం చేయడం నాకు మరి ఎక్కువ బాధకలిగించింది, ఎందుకంటే నేనెంతో ప్రేమించిన వ్యక్తి నాకు దూరం కావడమే కాక నన్ను బాధపెట్టే పనులు చేయడం అతడు మానలేదు.”

మరో పరిస్థితి పరిశీలించండి, విడాకులు తీసుకున్న ఓ 22 సంవత్సరాల వ్యక్తికి ఒక కొడుకున్నాడు, అతను తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించడానికి ఇష్టపడడంలేదు. తనను, తన కొడుకును తన తల్లే చూసుకోవాలని పట్టుబట్టాడు. అతను అడిగే వాటన్నింటికి ఆమె తల ఊపకపోతే రౌడీ పిల్లవాడిలా చిందులు తొక్కేవాడు, ఆమెపై అరిచేవాడు. అతని తల్లి నిస్సహాయంగా అదంతా భరించేది.

ఇవి అక్కడక్కడా మాత్రమే జరుగుతున్న సంఘటనలు కాదు. చట్టబద్ధంగా విడిపోవడం, విడాకులు తీసుకోవడం సర్వత్రా మామూలైపోయాయి. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కొత్తజీవితం ఆరంభించడానికి ఇల్లు విడిచివెళ్లిపోవడం చూస్తున్నారు. కొందరు యౌవనులు తమ తల్లిదండ్రులతోసహా ఇతరులపట్ల గౌరవం పూర్తిగా కోల్పోయి, గతంలో అయితే కనీసం ఊహకు కూడా అందని విధంగా నేడు ప్రవర్తిస్తున్నారు. లైంగిక ప్రయోగాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడడం, యువత దాడులు చేయడం, టీచర్లను తల్లిదండ్రులను పిల్లలే హత్య చేయడం అనేక దేశాల్లో మామూలైపోయింది. నేటి ప్రపంచంలో పిల్లల్ని పెంచడం, వివాహం మాత్రమే కష్టాలెదుర్కొంటున్న రంగాలు కాదని మీరు గమనించే ఉంటారు.

ఈ పరిణామాలను మనం కళ్లారా చూస్తుండగా, సమాజానికి ఏమయిందని మనం ఆశ్చర్యపోవచ్చు. ప్రజలకు నిజంగా మంచేదో చెడేదో తెలిస్తే, ఇన్ని సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కరించబడకుండా ఉన్నాయి? మంచి సలహా అవసరమా? నమ్మదగినదని రుజువైన, ప్రయోజనకరమైన సలహా ఏదైనా ఉందా? దేవునిపై, ఆయన లిఖిత వాక్యంపై తమకు నమ్మకముందని చాలామంది చెప్పినప్పటికీ, ఇది వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ దేవుని సలహాకోసం ప్రయత్నించి, దానిని పొందినప్పుడు మనకెలాంటి ప్రయోజనాలు కలగవచ్చు? ఈ విషయాన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 3 పేరు మార్చబడింది.