కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మెక్సికో ఆదివాసులు సువార్త వింటున్నారు

మెక్సికో ఆదివాసులు సువార్త వింటున్నారు

మెక్సికో ఆదివాసులు సువార్త వింటున్నారు

మెక్సికోలోని మీకె ఆదివాసుల గుంపొకటి 2002 నవంబరు 10న సాన్‌మీగల్‌ కెట్‌సాల్టెపెక్‌లో సమావేశమైంది. అది దక్షిణానవున్న సుందరమైన ఓక్సాకా రాష్ట్రంలోని ఒక పట్టణం. ఆ గుంపు యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరయింది. ఆ రోజు ఉదయ కార్యక్రమపు ఉన్నతాంశం బైబిలు నాటకం.

బైబిలు నాటకపు తొలిపలుకులు సౌండ్‌ సిస్టమ్‌ నుండి వినబడిన వెంటనే ప్రేక్షకులు ఆశ్చర్యచకితులయ్యారు. వారిలో చాలామంది కళ్లనీళ్ల పర్యంతమై పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. ఆ నాటకం మీకె భాషలో అందించబడింది. అది ముగిసిన తర్వాత, ఊహించని ఆ వరానికి చాలామంది తమ ప్రగాఢ కృతజ్ఞత వెలిబుచ్చారు. “మొదటిసారి నేను నాటకాన్ని అర్థం చేసుకోగలిగాను, అది నా మనస్సులో నాటుకుంది” అని ఒకామె చెప్పింది. “నా సొంత భాషలో నాటకం వినే అవకాశం యెహోవా నాకిచ్చాడు, నేనిక సంతోషంగా చనిపోగలను” అని మరొకామె చెప్పింది.

ఆ ఉదయం జరిగినది, రాజ్య సువార్తతో ఆదివాసులను చేరుకోవడానికి మెక్సికోలోని యెహోవాసాక్షులు ఇటీవల చేపట్టిన విస్తృత కృషిలో ఒక భాగం.​—⁠మత్తయి 24:14; 28:19, 20.

యెహోవా ప్రార్థన ఆలకించాడు

మెక్సికోలో 60,00,000 కంటే ఎక్కువమంది ఆదివాసులున్నారు అంటే 62 భాషలతో వివిధ సంస్కృతులతో తమకు తాము ఒక దేశంగా ఏర్పడడానికి సరిపడేంతమంది ఉన్నారు. ఆ భాషల్లోని 15 భాషల్లో ఒకొక్క భాషను 1,00,000 కంటే ఎక్కువమంది మాట్లాడతారు. ఆదివాసుల్లో 10,00,000 కంటే ఎక్కువమంది మెక్సికో అధికార భాషయైన స్పానిష్‌ మాట్లాడరు. పైగా స్పానిష్‌ భాష మాట్లాడేవారిలో చాలామంది తమ స్వభాషలో బైబిలు సత్యాన్ని మరింత సులభంగా నేర్చుకోగలరు. (అపొస్తలుల కార్యములు 2:6; 22:⁠2) కొందరు బైబిలు అధ్యయనం చేసి, చాలా సంవత్సరాలుగా క్రైస్తవ కూటాలకు నమ్మకంగా హాజరవుతున్నా వారి అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి సత్య సందేశం తమ భాషలో లభ్యమవ్వాలని వారు కొంతకాలంగా ప్రార్థిస్తున్నారు.

ఆ సవాలును అధిగమించడానికి, మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఆదివాసుల భాషల్లో సంఘ కూటాలు జరపడానికి 1999లో ఏర్పాట్లు చేయడం ఆరంభించింది. అనువాదపు జట్లు కూడా రూపొందించబడ్డాయి. 2000వ సంవత్సరం నాటికి జిల్లా సమావేశపు నాటకం మాయా భాషలో ఆ తర్వాత అనేక ఇతర భాషల్లో అందించబడింది.

ఆ తర్వాత యెహోవాసాక్షులచే బైబిలు అధ్యయన సహాయక ప్రచురణలను అనువదించే పని చేపట్టబడింది. మొదట, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషుర్‌ వావె, మాయా, మాసాటెకో, టోటోనాక్‌, ట్సెల్‌టాల్‌, ట్సోట్సీల్‌ భాషల్లోకి అనువదించబడింది. దాని తర్వాత మాయా భాషలో క్రమంగా మన రాజ్య పరిచర్యతోపాటు, అనేక సాహిత్యాలు అనువదించబడ్డాయి. కొన్ని సాహిత్యాల ఆడియో క్యాసెట్లు కూడా తయారుచేయబడ్డాయి. ఆదివాసులకు తమ స్వభాషలో చదవడం, వ్రాయడం నేర్పించడానికి వీలుగా చదవడం మరియు వ్రాయడం మీద శ్రద్ధవహించండి అనే బ్రోషుర్‌ స్థానిక అవసరానికి తగినట్లు సవరించబడింది. బైబిలు సాహిత్యాలు ప్రస్తుతం 15 ఆదిమ భాషల్లో ఉత్పత్తి చేయబడుతున్నాయి, ఇంకా అనేకం రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

“సకలవిధాల ప్రయత్నిస్తున్నారు”

అనువదించడం అంత సులభంగా జరగలేదు. దానికి ఒక కారణమేమిటంటే, మెక్సికో ఆదిమ భాషల్లో లౌకిక సాహిత్యం అంతగా అందుబాటులో లేదు. చాలా సందర్భాల్లో పదకోశాలు సంపాదించడం చాలా కష్టమయ్యింది. అంతేగాక కొన్ని భాషల్లో మాండలికాలు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక్క సాపొటెక్‌ భాషలోనే కనీసం ఐదు మాండలికాలు ఉన్నాయి. ఈ మాండలికాలు ఎంత విభిన్నంగా ఉన్నాయంటే, వివిధ ప్రాంతాల సాపొటెక్‌ ప్రజలు ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకోలేరు.

అంతేకాకుండా, ఏదైనా ఒక భాషకు స్థాపిత ప్రామాణిక నియమాలు లేకపోతే అనువాదకులు తమ సొంత ప్రమాణాలు కొన్ని ఏర్పరచుకోవాలి. దీనికి ఎంతో పరిశోధన, సమాలోచన అవసరం. కాబట్టి వారిలో చాలామంది మొదట, వావె జట్టులోని ఎలీడలాగే భావించారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఆమె ఇలా గుర్తుతెచ్చుకుంటోంది: “అనువదించడానికి నేను మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఆహ్వానించబడినప్పుడు నాలో రెండు రకాల భావోద్వేగాలు కలిగాయి ఒకటి ఆనందం, రెండోది భయం.”

అనువాదకులు కంప్యూటర్‌పై పనిచేయడం, కాలపట్టిక వేసుకోవడం, అనువాదపు మెళకువలు లాంటివి నేర్చుకోవాలి. కాబట్టి ఆ పని నిజంగా వారికి ఒక పెద్ద సవాలే. దాని విషయంలో వారి భావాలెలా ఉన్నాయి? మాయా జట్టు సభ్యురాలైన గ్లోరీయ దానికిలా జవాబిస్తోంది: “మా స్వభాష మాయాలోకి బైబిలు సాహిత్యాలు అనువదించడంలో పాలుపంచుకోవడంలోని ఆనందాన్ని వర్ణించడానికి మాకు మాటలు చాలవు.” అనువాద విభాగపు పైవిచారణకర్త అనువాదకుల గురించి ఇలా చెబుతున్నాడు: “తమ స్వభాషలో బైబిలు సాహిత్యాలు ఉండాలనే వారి కోరిక ఎంత బలంగా ఉందంటే, ఆ సవాలును ఎదుర్కోవడానికి వారు సకలవిధాల ప్రయత్నిస్తున్నారు.” మరి అది ప్రయత్నార్హమైనదేనా?

“యెహోవా నీకు కృతజ్ఞతలు!”

ఆదివాసుల క్షేత్రంలోని సేవపై యెహోవా ఆశీర్వాదం ఉందని స్పష్టమైంది. క్రైస్తవ కూటాల, సమావేశాల హాజరు మరింత ఎక్కువైంది. ఉదాహరణకు, 2001లో క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీకె భాషా సాక్షులు 223 మంది సమకూడారు. అయితే అక్కడ హాజరైన వారి మొత్తం 1,674, అది సాక్షుల సంఖ్యకు ఏడున్నర రెట్లు ఎక్కువ!

సత్యాన్ని అంగీకరిస్తున్న కొందరు ఇప్పుడు మొదటి నుండే దానిని సరిగా అర్థం చేసుకోగలుగుతున్నారు. మాయాలో కూటాలు జరగక ముందు తన విషయంలో ఏమి జరిగిందో మీర్నా ఇలా గుర్తుచేసుకుంటోంది: “మూడు నెలల బైబిలు అధ్యయనం తర్వాత నేను బాప్తిస్మం తీసుకున్నాను. నేను బాప్తిస్మం తీసుకోవాలని నాకు తెలుసు, అయితే నేను బైబిలు సత్యాలను పూర్తిగా అర్థం చేసుకోలేదని ఒప్పుకోవలసిందే. నా స్వభాష మాయా కావడం, స్పానిష్‌ నాకు అంతగా అర్థం కాకపోవడం దానికి కారణమని నేను అనుకుంటున్నాను. సత్యంయొక్క నిజమైన భావాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కాస్త సమయం పట్టింది.” నేడు ఆమె, ఆమె భర్త మాయా అనువాదపు జట్టులో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు.

సంఘాల్లో ఉన్న వారందరికీ తమ స్వభాషలో సాహిత్యాలు అందుకోవడం చెప్పలేని ఆనందాన్నిస్తోంది. కొత్తగా అనువదించబడిన భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషుర్‌ ట్సోట్సీల్‌ భాషలో అందించబడినప్పుడు, క్రైస్తవ కూటాలకు హాజరు కావడం ఆరంభించిన ఒక స్త్రీ దానిని గుండెలకు హత్తుకొని సంతోషం పట్టలేక గట్టిగా, “యెహోవా నీకు కృతజ్ఞతలు!” అని అంది. చాలామంది బైబిలు విద్యార్థులు బాప్తిస్మం దిశగా వేగంగా అభివృద్ధి సాధిస్తున్నారనీ, నిష్క్రియులైన ప్రచారకులు తిరిగి క్రియాశీలురవుతున్నారనీ, చాలామంది క్రైస్తవ సహోదరులు సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు తాము అర్హులమని భావిస్తున్నారనీ నివేదికలు చూపిస్తున్నాయి. కొందరు గృహస్థులు స్వభాషలో బైబిలు సాహిత్యం తీసుకోవడానికీ, దానిని అధ్యయనం చేయడానికీ ఇష్టపడుతున్నారు.

ఒక సందర్భంలో ఒక సాక్షి బైబిలు అధ్యయనం నిర్వహించడానికి వెళ్ళింది, అయితే ఆ విద్యార్థిని ఇంటి దగ్గర లేదు. కానీ ఆమె భర్త ఉన్నాడు. ఆయన గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సాక్షి ఒక బ్రోషుర్‌ నుండి ఆయనకు చదివి వినిపిస్తానని చెప్పింది. అందుకాయన కటువుగా “నాకేదీ అక్కర్లేదు” అన్నాడు. అయితే ఆ సహోదరి ఆ బ్రోషుర్‌ తమ మాతృ భాషలో ఉందని టోటోనాక్‌లో చెప్పింది. ఆ మాట విన్న వెంటనే ఆయన పక్కనేవున్న ఓ బెంచి దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు. ఆమె దానిని చదువుతుండగా ఆయన “అది నిజం. అవును, అది నిజం” అనడం మొదలుపెట్టాడు. ఆయనిప్పుడు క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నాడు.

యూకటాన్‌ రాష్ట్రంలో ఒక సాక్షి భర్త సత్యాన్ని వ్యతిరేకిస్తూ, కొన్నిసార్లు ఆమె కూటం నుండి ఇంటికి రాగానే ఆమెను కొట్టేవాడు. మాయా భాషలో కూటాలు జరగడం ఆరంభమైనప్పుడు, ఆమె ఆయనను ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. ఆయన వచ్చి వాటినిబట్టి ఎంతో ఆనందించాడు. ఇప్పుడాయన క్రమంగా కూటాలకు హాజరవుతూ, బైబిలు అధ్యయనం చేస్తున్నాడు, భార్యను కొట్టడం మానేశాడని వేరే చెప్పనక్కర్లేదు.

టోటోనాక్‌ భాషవాడైన ఒక వ్యక్తి ఇద్దరు సాక్షులతో మాట్లాడుతూ, తానెన్నడూ ప్రార్థించలేదనీ, దానికి కారణం దేవుడు స్పానిష్‌లో చేసిన ప్రార్థనలే వింటాడని, ఒక క్యాథలిక్‌ ప్రీస్టు తనకు చెప్పాడనీ తెలియజేశాడు. పైగా టోటోనాక్‌ భాషస్థుల తరఫున ప్రార్థించినందుకు ఆయన ఆ ప్రీస్టుకు డబ్బుకూడా చెల్లించేవాడు. దేవుడు అన్ని భాషల ప్రార్థనలు వింటాడని ఆ సాక్షులు వివరించి టోటోనాక్‌ భాషలో ఆయనకు ఒక బ్రోషుర్‌ ఇచ్చినప్పుడు, ఆయన దానిని ఎంతో సంతోషంగా స్వీకరించాడు.​—⁠2 దినవృత్తాంతములు 6:32, 33; కీర్తన 65:2.

“కూవాల్ట్‌సీన్‌ టాక్టోయూవా”

ఈ పరిణామాలనుబట్టి ఉత్కంఠభరితులైన చాలామంది రాజ్య ప్రచారకులు ఆదివాసుల ఒక భాషను నేర్చుకోవడానికి లేదా ఒక భాషకు సంబంధించిన తమ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాన ప్యూబ్ల రాష్ట్రంలో ఐదు నావాటెల్‌ భాషా సంఘాలకు సేవచేస్తున్న ఒక ప్రాంతీయ పైవిచారణకర్త అదే చేస్తున్నాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “కూటాల్లో సాధారణంగా నిద్రపోయే పిల్లలు నేను నావాటెల్‌లో మాట్లాడినప్పుడు మెలకువగా ఉండి, జాగ్రత్తగా వింటున్నారు. ఒకరోజు కూటం ముగిసిన తర్వాత, నాలుగేళ్ల కుర్రాడు నా దగ్గరకొచ్చి ‘కూవాల్ట్‌సీన్‌ టాక్టోయూవా’ (మీరు చక్కగా మాట్లాడతారు) అన్నాడు. దానితో నాకు, చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం దక్కిందనే భావన కలిగింది.”

అవును, ఆదిమ భాషా సేవాక్షేత్రాలు నిజంగా “తెల్లబారి కోతకు వచ్చియున్నవి,” దానిలో భాగం వహిస్తున్నవారందరు ఎంతో ప్రోత్సాహం పొందుతున్నారు. (యోహాను 4:​35) అనువాదపు జట్లను వ్యవస్థీకరించడానికి కృషిచేసిన రోబర్టో విషయాన్నిలా క్లుప్తీకరించి చెబుతున్నాడు: “సహోదర సహోదరీలు సత్యాన్ని తమ స్వభాషలో విని, దాని భావాన్ని గ్రహిస్తున్నందుకు వారి కళ్ల నుండి ఆనంద బాష్పాలు కురవడాన్ని చూడడం ఒక మరపురాని అనుభవం. అది తలచుకున్నప్పుడల్లా నా గొంతు పూడుకుపోతుంది.” రాజ్యం పక్షాన నిలబడేందుకు ఈ యథార్థపరులకు సహాయం చేయడం నిస్సందేహంగా యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది.​—⁠సామెతలు 27:11.

[10, 11వ పేజీలోని బాక్సు]

అనువాదకుల్లో కొందరిని కలుసుకోండి

● “నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా తల్లిదండ్రులు నాకు సత్యం బోధించారు. విచారకరంగా, నాకు 11 ఏళ్లున్నప్పుడు మా నాన్న క్రైస్తవ సంఘం విడిచిపెట్టారు. రెండు సంవత్సరాల తర్వాత, మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. అప్పటికి నేనింకా చదువుకుంటున్నప్పటికీ, ఐదుగురు పిల్లల్లో అందరికంటే పెద్దదానిగా నేనే మా అమ్మ బాధ్యతల్ని చేపట్టాల్సివచ్చింది.

“మాకు ఆధ్యాత్మిక సహోదర సహోదరీల ప్రేమపూర్వక మద్దతు లభించింది, అయినా జీవితం కష్టంగానే సాగింది. ‘ఇలా నాకెందుకు జరుగుతోంది? నేనింకా చిన్నపిల్లనే కదా!’ అని నేను కొన్నిసార్లు విస్తుపోయేదాన్ని. అయితే యెహోవా సహాయంవల్లనే నేను ఆ పరిస్థితిని తట్టుకుని నిలబడగలిగాను. ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన వెంటనే నేను పూర్తికాల పరిచారకురాలినయ్యాను, అది నాకు చాలా సహాయం చేసింది. నావాటెల్‌ అనువాదపు జట్టు రూపొందించబడినప్పుడు, దానిలో భాగం వహించేందుకు నేను ఆహ్వానించబడ్డాను.

“మా నాన్న ఇప్పుడు సంఘానికి తిరిగివచ్చారు, నా తమ్ముళ్లు, చెల్లెళ్లు యెహోవాను సేవిస్తున్నారు. యెహోవాపట్ల నమ్మకంగా ఉండడం కృషికి తగిన ఫలితాన్నిచ్చింది. ఆయన మా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు.”​—⁠ఆలీస్యా.

● “సాక్షిగావున్న తోటి విద్యార్థిని జీవావిర్భావంపై క్లాసులో వివరించింది. నేను ఆ క్లాసుకు వెళ్లలేకపోవడంతో, ఆ పరీక్షంటే నాకు భయం పట్టుకుంది, అందువల్ల ఆ విషయాన్ని నాకు వివరించమని నేనామెను అడిగాను. ప్రజలెందుకు చనిపోతారని నేనెప్పుడూ ఆలోచించేవాణ్ణి. ఆమె నాకు సృష్టి పుస్తకం * ఇచ్చి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించినప్పుడు నేను దానికి అంగీకరించాను. సృష్టికర్త సంకల్పాన్ని బట్టి, ప్రేమను బట్టి నేను ఎంతో చలించిపోయాను.

“నేను పాఠశాల విద్య ముగించిన తర్వాత, నేను ద్విభాషా బోధకుణ్ణి అంటే స్పానిష్‌లో, ట్సోట్సీల్‌లో బోధించే ఉపాధ్యాయ వృత్తి చేపట్టే అవకాశం నాకు లభించింది. అయితే అందులో చేరితే నేను చాలాదూరంలో ఇల్లు తీసుకొని వారాంతాల్లో తరగతులు నిర్వహిస్తూ క్రైస్తవ కూటాలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. దానికి బదులు నేను తాపీ మేస్త్రిగా పని చేయడం ఆరంభించాను. సాక్షికాని మా నాన్నకు నా నిర్ణయం ఎంతమాత్రం నచ్చలేదు. ఆ తర్వాత నేను పయినీరు పరిచారకునిగా సేవచేస్తున్నప్పుడు, ట్సోట్సీల్‌లోకి బైబిలు సాహిత్యాలు అనువదించే జట్టు వ్యవస్థీకరించబడింది. దానిలో భాగం వహించడానికి నేను పురికొల్పబడ్డాను.

“తమ స్వభాషలో సాహిత్యాలు ఉండడం మన సహోదర సహోదరీలు తాము విలువైనవారమని, తాము గౌరవించబడుతున్నామని భావించేలా చేస్తున్నట్లు నేను చూడగలిగాను. అది ఎంతో సంతృప్తినిస్తుంది. ఈ నియామకం నాకు లభించినందుకు నాకెంతో గొప్ప ఆధిక్యత లభించినట్లు నేను భావిస్తున్నాను.”​—⁠ఊమ్‌బర్టో.

● “నాకు ఆరేళ్లున్నప్పుడు మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. నేను టీనేజీలో ఉన్నప్పుడు మా నాన్న యెహోవాసాక్షులతో అధ్యయనం చేయడం ఆరంభించారు. ఒకరోజు ఒక సహోదరి యౌవనులకు మంచి సలహా ఇవ్వబడే బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించింది. తల్లిలేని టీనేజరుగా నాక్కావలసింది కూడా ఖచ్చితంగా అదేనని నేను భావించాను. నాకు 15 సంవత్సరాలున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను.

“1999లో మా నాన్నగారి స్థలంకోసం కొంతమంది ముష్కరులు ఆయనను హత్యచేశారు. ఏంచేయాలో నాకు తోచలేదు. మానసికంగా నేనెంతో కృంగిపోయి నేనిక జీవించలేను అని భావించాను. కానీ బలంకోసం యెహోవాను ప్రార్థించడం మానలేదు. ప్రయాణ పైవిచారణకర్త, ఆయన భార్య నన్నెంతో ప్రోత్సహించారు. అనతికాలంలోనే నేను క్రమ పయినీరు సేవ చేపట్టాను.

“కొంతమంది టోటోనాక్‌ భాషలో ఇవ్వబడే 20 నిమిషాల ప్రసంగం వినడానికి, మిగతా కూటమంతా తమకు పెద్దగా అర్థంకాని స్పానిష్‌లో నిర్వహించబడినా, ఆరు గంటలు నడిచివెళ్లి కూటానికి హాజరవడం నేనొకసారి గమనించాను. అందువల్ల, టోటోనాక్‌ భాషలోకి బైబిలు సాహిత్యాలు అనువదించేలా సహాయం కోసం నన్ను ఆహ్వానించినప్పుడు నేనెంతో పులకించిపోయాను.

“యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేయాలని కలలు కంటున్నానని మా నాన్నకు చెప్పేదాన్ని. నా వయస్సులోని ఆడపిల్లలకు అదంత సులభం కాదని ఆయన నాతో అనేవారు. ఆయన పునరుత్థానంలో వచ్చినప్పుడు, మా భాషలోకి బైబిలు సాహిత్యాలు అనువదిస్తూ నేనలా చేయగలిగానని తెలుసుకొని ఆయనెంత పులకించిపోతారో కదా!”​—⁠ఇడీత్‌.

[అధస్సూచి]

^ పేరా 28 జీవము​—⁠ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) పుస్తకాన్ని యెహోవాసాక్షులు 1985లో ప్రచురించారు.

[9వ పేజీలోని చిత్రం]

ట్సోట్సీల్‌ అనువాదపు జట్టు సభ్యులు అనువదించడం కష్టంగావున్న ఒక పదం గురించి చర్చిస్తున్నారు