కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సువార్త వ్యాపింపజేయాలనే ఆశయంతో నిర్భయంగా ప్రయాణించిన” ధైర్యశాలి

“సువార్త వ్యాపింపజేయాలనే ఆశయంతో నిర్భయంగా ప్రయాణించిన” ధైర్యశాలి

“సువార్త వ్యాపింపజేయాలనే ఆశయంతో నిర్భయంగా ప్రయాణించిన” ధైర్యశాలి

జార్జ్‌ బారోకు 18 ఏళ్లు వచ్చేటప్పటికే ఆయనకు 12 భాషలు వచ్చని చెప్పబడుతోంది. రెండు సంవత్సరాల తర్వాత, ఆయన 20 భాషల్లో “సులభంగా రసరమ్యంగా” అనువదించగలిగాడు.

ఈ విశిష్ఠ వరపుత్రుణ్ణి ఇంటర్వ్యూ చేయడానికి 1833లో, ఇంగ్లాండ్‌లోని లండన్‌లో ఉన్న బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ ఆహ్వానించింది. ఆ ప్రయాణానికయ్యే ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తీర్మానంతో 30 ఏళ్ల బారో నార్విచ్‌లోవున్న తన ఇంటి నుండి బయలుదేరి 180 కిలోమీటర్లు నడిచివెళ్ళాడు, అదీ కేవలం 28 గంటల్లోనే.

బైబిలు సొసైటీ ఆయనకొక కష్టభరితమైన పని అప్పగించింది. అదేమిటంటే, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే మంచూ భాషను ఆయన ఆరు నెలల్లో నేర్చుకోవాలి. తనకు ఒక వ్యాకరణ పుస్తకం ఇవ్వాల్సిందిగా ఆయన అడిగినప్పుడు, వారాయనకు మంచూ భాషలోవున్న మత్తయి సువార్త ప్రతిని, మంచూ-ఫ్రెంచ్‌ నిఘంటువును మాత్రమే ఇవ్వగలిగారు. అయినప్పటికీ, కేవలం 19 వారాల్లోపే, ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “దేవుని సహాయంతో నేను మంచూ భాషపై పట్టు సాధించగలిగాను” అని లండన్‌కు ఉత్తరం వ్రాశాడు. ఈ ఘనకార్యం మరి విశిష్ఠమైనది ఎందుకంటే అదే సమయంలో ఆయన మెక్సికో ఆదిమ భాషల్లో ఒకటైన నావాటెల్‌లో లూకా సువార్తను సరిచేస్తున్నట్లు చెప్పబడింది.

మంచూ బైబిలు

మంగోలియన్‌ వీగుర్‌ వర్ణమాలను ఉపయోగిస్తూ 17వ శతాబ్దంలో మొదటిసారిగా మంచూ లిపి రూపొందించబడినప్పుడు, అది చైనా అధికార భాషయ్యింది. కాలప్రవాహంలో దాని వాడుక తగ్గిపోయినప్పటికీ, మంచూలో బైబిళ్లను ముద్రించి, పంచిపెట్టాలని బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ సభ్యులు కుతూహలపడ్డారు. 1822కల్లా వారు స్ట్యీపాన్‌ వి. లిపోఫ్ట్‌సెఫ్‌ అనువదించిన, మత్తయి సువార్తకు సంబంధించిన 550 ప్రతులు ముద్రించడానికి ఆర్థిక సహాయం చేశారు. ఆయన రష్యా విదేశాంగ అధికారిగా చైనాలో దాదాపు 20 సంవత్సరాలు నివసించాడు. ఇది సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ముద్రించబడింది, అయితే దాని ప్రతులు కొన్ని మాత్రమే పంచిపెట్టబడిన తర్వాత, మిగిలినవి వరదలో నాశనమయ్యాయి.

త్వరలోనే క్రైస్తవ గ్రీకు లేఖనాలన్నీ అనువదించబడ్డాయి. 1834లో హీబ్రూ లేఖనాల ప్రాచీన చేతివ్రాత ప్రతుల గ్రంథం లభించడంతో బైబిలుపై ఆసక్తి పెరిగింది. అప్పటికే మంచూ భాషలోవున్న బైబిలును సవరించడంతోపాటు మిగతా అనువాదాన్ని ఎవరు పూర్తి చేయగలరు? బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ తమ తరఫున ఆ పని చేపట్టడానికి జార్జ్‌ బారోను పంపించింది.

రష్యాకు

బారో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చేరుకున్న తర్వాత, బైబిలు మూలపాఠాన్ని మరింత ప్రామాణికంగా తీర్చిదిద్దేలా తప్పులు సరిదిద్ది, సవరించగలిగేలా మంచూను లోతుగా అధ్యయనం చేశాడు. అయినా, ఆ పని చాలా కష్టంగా ఉండేది, క్రొత్త నిబంధన అచ్చును కూర్చడానికి ఆయన రోజుకు 13 గంటలకు పైగా పనిచేశాడు, చివరికది “ప్రాక్‌ దేశీయ ఇంపైన ప్రతి” అని వర్ణించబడింది. 1835లో వెయ్యి ప్రతులు ముద్రించబడ్డాయి. అయితే వాటిని చైనాకు తీసుకెళ్లి పంచిపెట్టాలనే బారో అభీష్టం అడ్డగించబడింది. ఈ పని మిషనరీ సేవగా దృష్టించబడి, పొరుగు దేశంతో తమకున్న స్నేహ సంబంధాలు ప్రమాదంలో పడతాయనే భయంతో రష్యా ప్రభుత్వం బారో తనతోపాటు “ఒక్క మంచూ బైబిలును” తీసుకెళ్ళినా ఆయన చైనా సరిహద్దు వరకు ప్రయాణించడానికి అనుమతి ఇచ్చేందుకు కూడా నిరాకరించింది.

దాదాపు పది సంవత్సరాల తర్వాత కొన్ని ప్రతులు పంచిపెట్టబడ్డాయి, 1859లో మంచూ, చైనా భాషల సమాంతర నిలువు విభాగాలతో మత్తయి మార్కు సువార్తల అనువాదాలు వెలువడ్డాయి. అయితే అప్పటికే మంచూ చదవగల చాలామంది ప్రజలు చైనీస్‌ చదవడానికే ఇష్టపడుతుండడంతో మంచూలో పూర్తి బైబిలును సిద్ధం చేయాలనే ఆశ అడుగంటడం ఆరంభమైంది. నిజానికి మంచూ భాష త్వరలోనే అంతరించి, దాని స్థానాన్ని చైనా భాష ఆక్రమించనుంది. చైనా స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు, 1912కల్లా ఆ మార్పు పూర్తిస్థాయికి చేరుకుంది.

ఐబీరియన్‌ ద్వీపకల్పం

జార్జ్‌ బారో తన అనుభవాలతో చైతన్యవంతుడై లండన్‌కు తిరిగివచ్చాడు. “క్రైస్తవ సత్యాలను స్వీకరించడానికి ప్రజల మనస్సులు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాయో అంచనా వేయడానికి” అని ఆయన తర్వాత వ్రాసినట్లుగా, 1835లో ఆయన తిరిగి పోర్చుగల్‌కు, స్పెయిన్‌కు పంపించబడ్డాడు. రాజకీయ, సామాజిక అలజడి విస్తరించిన కారణంగా బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ అప్పటికింకా ఆ రెండు దేశాల్లో ఎక్కువగా పనిచేయలేదు. పోర్చుగల్‌ గ్రామీణ సమాజాల్లోని ప్రజలతో బైబిలు విషయాలు మాట్లాడడానికి బారో చాలా సంతోషించాడు, అయితే అనతికాలంలోనే ఆయనకు అక్కడ మత ఉదాసీనత, విరుద్ధత ఎదురుకావడంతో ఆయన అక్కడనుండి స్పెయిన్‌కు వెళ్లాల్సివచ్చింది.

బారోకు జిప్సీల భాషవచ్చు కాబట్టి వారితో ప్రత్యేకంగా ఏర్పడిన సన్నిహిత అనుబంధంతో ఆయనకు స్పెయిన్‌లో ఒక విభిన్నమైన సవాలు ఎదురైంది. ఆయన అక్కడకు చేరుకున్న అనతికాలంలోనే స్పానిష్‌ జిప్సీల భాషయైన కీటానోలోకి “క్రొత్త నిబంధన” అనువదించడం ఆరంభించాడు. ఈ పనిలో కొంతమేరకు తనకు సహాయం చేయడానికి ఆయన ఇద్దరు జిప్సీ స్త్రీలను ఆహ్వానించాడు. ఆయన వారికి స్పానిష్‌ మూలపాఠం చదివి వినిపించి, దానిని తనకు అనువదించి చెప్పమని ఆయన వారినడిగేవాడు. ఈ విధంగా ఆయన జిప్సీ భాషలోని జాతీయాలను చక్కగా ఉపయోగించడం నేర్చుకోగలిగాడు. ఈ ప్రయత్నం ఫలితంగా 1838 వసంతకాలంలో లూకా సువార్త ప్రచురించబడింది. దీనిని చూసిన ఒక బిషప్‌ “జిప్సీ భాషతో ఆయన మొత్తం స్పెయిన్‌నే మార్చివేస్తాడు” అన్నాడు.

“బాస్క్‌లోకి లేఖనాల్ని అనువదించగల సమర్థుడైన వ్యక్తిని” కనుగొనడానికి జార్జ్‌ బారోకు అధికారం ఇవ్వబడింది. ఆ పని వైద్యుడైన డా. ఓటేసాకు అప్పగించబడింది, బారో ఆయనను గురించి “నాక్కూడా కొంతవరకు తెలిసిన ఆ భాషలో నిష్ణాతుడు” అని వ్రాశాడు. 1838లో స్పానిష్‌ బాస్క్‌లో లూకా సువార్త మొదటి బైబిలు పుస్తకంగా వెలువడింది.

సామాన్య ప్రజలకు జ్ఞానాభివృద్ధి కలిగించాలనే కోరికతో బారో గ్రామీణ సమాజాల్లోని బీదలకు బైబిలు పుస్తకాలు పంచడానికి తరచూ ప్రమాదభరితమైన సుదూర ప్రయాణాలు చేశాడు. ఆయన వారిని మత అజ్ఞానం నుండి, మూఢ నమ్మకాల నుండి విముక్తుల్ని చేయాలని అనుకున్నాడు. ఉదాహరణకు, ఆయన వారు కొంటున్న పాపపరిహారపత్రాల నిష్ప్రయోజనాన్ని రట్టుచేస్తూ ఇలా తర్కించేవాడు: “సత్పురుషుడైన దేవుడు పాపాన్ని అమ్ముకోవడాన్ని అనుమతిస్తాడా?” సుస్థాపిత నమ్మకాలపై అలాంటి దాడి తమ కార్యకలాపాల నిషేధానికి దారితీయవచ్చని భయపడిన బైబిల్‌ సొసైటీ, ఆయనను కేవలం లేఖనాలను పంచిపెట్టడంపైనే దృష్టినిలపమని ఆదేశించింది.

రోమన్‌ క్యాథలిక్‌ సైద్ధాంతిక లిఖిత సంకేతాలు లేకుండా ఎల్‌ న్యావో టెస్ట్‌మెంటొ, స్పానిష్‌లో క్రొత్త నిబంధనను ముద్రించడానికి బారో మౌఖిక అనుమతి సంపాదించాడు. ఆ అనువాదాన్ని ప్రమాదకరమైన “అనుచిత పుస్తకం” అని వర్ణించిన, ప్రధానమంత్రి దానిని తొలుత వ్యతిరేకించినప్పటికీ, ఆయన ఆ తర్వాత అనుమతి సంపాదించాడు. ఆ తర్వాత బారో ఈ స్పానిష్‌ క్రొత్త నిబంధనను అమ్మడానికి మాడ్రిడ్‌లో ఒక పుస్తకశాలను తెరిచాడు. ఇలా చేయడంవల్ల ఆయన ఇటు మతనాయకులతో, అటు లౌకిక అధికారులతో ఢీకొనాల్సివచ్చింది. ఆయన 12 రోజులపాటు జైల్లో వేయబడ్డాడు. బారో తన నిరసన తెలిపినప్పుడు, మౌనంగా వెళ్లిపోవాలని ఆదేశించబడ్డాడు. తనను జైల్లో వేయడం చట్ట విరుద్ధమని పూర్తిగా తెలిసినవాడై ఆయన అపొస్తలుడైన పౌలు ఉదాహరణను ఎత్తి చూపిస్తూ తన పేరుకు ఎలాంటి కళంకం ఆపాదించకుండా తనను యుక్తరీతిలో నిరపరాధిగా ప్రకటించేంతవరకు అక్కడే ఉండడానికి తీర్మానించుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 16:37.

ఆ బైబిల్‌ సొసైటీ, అసక్తిగల తమ ప్రతినిధి 1840లో స్పెయిన్‌ వదిలి వచ్చేనాటికి ఇలా నివేదించగలిగింది: “గత ఐదు సంవత్సరాల్లో స్పెయిన్‌లో దాదాపు 14,000 లేఖన ప్రతులు పంచిపెట్టబడ్డాయి.” ఈ పనిలో ప్రముఖ పాత్ర వహించిన బారో స్పెయిన్‌లో తన అనుభవాన్ని క్లుప్తంగా “నా జీవితంలో అవి అత్యంత సంతోషకరమైన సంవత్సరాలు” అని చెప్పాడు.

మొట్టమొదట 1842లో ప్రచురించబడి, ఇప్పటికీ ప్రచురించబడుతున్న ద బైబిల్‌ ఇన్‌ స్పెయిన్‌ అనేది జార్జ్‌ బారో ప్రయాణాల, సాహసాల వ్యక్తిగత వృత్తాంతపు వాస్తవిక స్వీయ గ్రంథం. అత్యల్ప వ్యవధిలో విజయం సాధించిన ఈ పుస్తకంలో ఆయన తనను “సువార్త వ్యాపింపజేయాలనే ఆశయంతో నిర్భయంగా ప్రయాణించిన” వానిగా అభివర్ణించుకున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “రాళ్లురప్పలున్న గుట్టల్లో, పర్వతాల్లో గుట్టుగావున్న మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నా పద్ధతిలో క్రీస్తును ప్రకటించాలని కోరుకున్నాను.”

అంతటి ఉత్సాహంతో లేఖనాల్ని అనువదించి పంచిపెట్టడంలో జార్జ్‌ బారో ఇతరులకు చక్కని పునాది వేశాడు, అది నిజంగా ప్రశస్తమైన ఆధిక్యత.

[29వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

బైబిలును అనువదించి పంచిపెట్టాలనే జార్జ్‌ బారో ప్రయత్నాలు ఆయనను (1) ఇంగ్లాండు నుండి (2) రష్యాకు, (3) పోర్చుగల్‌కు, (4) స్పెయిన్‌కు తీసుకెళ్లాయి

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[28వ పేజీలోని చిత్రం]

మంచూలో 1835లో ముద్రించబడిన యోహాను సువార్తలోని తొలి పలుకులు, ఇది పైనుండి క్రిందికి, ఎడమ నుండి కుడికి చదవబడుతుంది

[చిత్రసౌజన్యం]

The Bible of Every Land, 1860 అనే పుస్తకం నుండి

[27వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the book The Life of George Borrow by Clement K. Shorter, 1919