కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఏకగ్రీవముగా’ దేవుణ్ణి మహిమపరచండి

‘ఏకగ్రీవముగా’ దేవుణ్ణి మహిమపరచండి

‘ఏకగ్రీవముగా’ దేవుణ్ణి మహిమపరచండి

‘ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచండి.’​—⁠రోమీయులు 15:⁠5.

క్రైస్తవులందరికీ ఒకే రకమైన కోరికలు లేదా అభిరుచులు ఉండవు. అయినప్పటికీ, క్రైస్తవులందరూ జీవమార్గంలో ఐకమత్యంతో నడవాలి. అది సాధ్యమవుతుందా? మనం చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా చేయకుండా ఉంటే తప్పకుండా సాధ్యమవుతుంది. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు ఆ పాఠాన్నే నేర్పించాడు. ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని ఆయనెలా వివరించాడు? ఆయనిచ్చిన దైవప్రేరేపిత ఉపదేశాన్ని నేడు మనమెలా అన్వయించుకోవచ్చు?

క్రైస్తవ ఐక్యతకున్న ప్రాముఖ్యత

2 క్రైస్తవ ఐక్యత ఆవశ్యకమని పౌలుకు తెలుసు, అందుకే ఆయన ప్రేమతో ఒకరినొకరు సహించడానికి క్రైస్తవులకు తోడ్పడే చక్కని ఉపదేశాన్నిచ్చాడు. (ఎఫెసీయులు 4:1-3; కొలొస్సయులు 3:​12-14) అయినప్పటికీ, ఆయన దాదాపు 20 కంటే ఎక్కువ సంవత్సరాల కాలంలో అనేక సంఘాలు స్థాపించడంతోపాటు ఇతర సంఘాలనూ సందర్శించిన తర్వాత, ఐక్యతను కాపాడుకోవడం ఒక సవాలుగా ఉండగలదని గ్రహించాడు. (1 కొరింథీయులు 1:11-13; గలతీయులు 2:​11-14) అందువల్ల, ఆయన రోమాలో నివసిస్తున్న తోటి విశ్వాసులకిలా ఉద్బోధించాడు: “మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, . . . ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.” (రోమీయులు 15:​5, 6) అదే ప్రకారంగా నేడు మనం యెహోవా దేవుని ఐక్య ప్రజలుగా ఆయనను ‘ఏకగ్రీవముగా’ మహిమపరచాలి. ఈ విషయంలో మనమెలా చేస్తున్నాం?

3 రోమాలోని చాలామంది క్రైస్తవులు పౌలుకు స్నేహితులు. (రోమీయులు 16:​3-16) వారి నేపథ్యాలు విభిన్నంగా ఉన్నప్పటికీ, పౌలు తన సహోదరులందరినీ ‘దేవునికి ప్రియమైనవారిగానే’ అంగీకరించాడు. ఆయనిలా వ్రాశాడు: “మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” దీనినిబట్టి, రోమీయులు అనేక రీతుల్లో మాదిరిగా ఉన్నట్లు రూఢి అవుతోంది. (రోమీయులు 1:​1, 8; 15:​14) అదే సమయంలో అక్కడి సంఘంలోని కొందరికి కొన్ని విషయాల్లో విభిన్న దృక్కోణాలున్నాయి. నేటి క్రైస్తవులు కూడా భిన్న నేపథ్యాల నుండి, సంస్కృతుల నుండి వచ్చారు కాబట్టి భిన్నాభిప్రాయాలతో ఎలా వ్యవహరించాలనే విషయంపై పౌలు ఇచ్చిన ప్రేరేపిత ఉపదేశాన్ని అధ్యయనం చేయడం ‘ఏకగ్రీవముగా’ మాట్లాడేందుకు వారికి సహాయం చేయగలదు.

4 రోమాలో ఇటు యూదులు అటు అన్యులు కూడా విశ్వాసులుగా ఉన్నారు. (రోమీయులు 4:1; 11:​13) మోషే ధర్మశాస్త్రం క్రింద పాటించిన ఆచారాలు రక్షణ పొందడానికి ఆవశ్యకం కాదని గ్రహించవలసి ఉన్నప్పటికీ కొందరు యూదా క్రైస్తవులు వాటిలో కొన్నింటిని ఆచరించడం మానలేకపోయారని స్పష్టమవుతోంది. మరోవైపున, చాలామంది యూదా క్రైస్తవులు తాము క్రైస్తవులు కాకముందు పాటించిన ఆచార నియమాల నుండి క్రీస్తు బలి తమను విముక్తుల్ని చేసిందని అంగీకరించారు. అందువల్ల వారు తమ వ్యక్తిగత అలవాట్లను, ఆచారాలను కొన్నింటిని మానుకున్నారు. (గలతీయులు 4:​8-11) అయినప్పటికీ, పౌలు సూచించినట్లుగా వారందరూ ‘దేవునికి ప్రియమైనవారిగానే’ ఉన్నారు. వారు ఒకరిపట్ల మరొకరు సరైన మనోవైఖరిని కాపాడుకుంటే, వారందరూ ‘ఏకగ్రీవముగా’ దేవుణ్ణి స్తుతించగలుగుతారు. నేడు మనకు కూడా ఆయా విషయాలపై విభిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, అందువల్ల ఆ ప్రాముఖ్యమైన సూత్రాన్ని పౌలు ఎలా వివరిస్తున్నాడో మనం జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.​—⁠రోమీయులు 15:4.

“ఒకనినొకడు చేర్చుకొనుడి”

5 రోమీయులకు వ్రాసిన పత్రికలో, వివిధ అభిప్రాయాలున్న ఒక పరిస్థితి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూరగాయలనే తినుచున్నాడు.” ఎందుకలా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం పంది మాంసం తినడం నిషిద్ధం. (రోమీయులు 14:2; లేవీయకాండము 11:⁠7) అయితే, యేసు మరణించిన తర్వాత ఆ నియమం కొట్టివేయబడింది. (ఎఫెసీయులు 2:​14) ఆ పిమ్మట, యేసు మరణించిన మూడున్నర సంవత్సరాల తర్వాత, ఒక దేవదూత దేవుని అభిప్రాయం ప్రకారం ఏ విధమైన ఆహారాన్నైనా అపవిత్రంగా దృష్టించకూడదని అపొస్తలుడైన పేతురుకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 11:​7-12) ఈ విషయాలను మదిలో ఉంచుకొని కొందరు యూదా క్రైస్తవులు తాము పందిమాంసాన్ని లేదా ధర్మశాస్త్రం నిషేధించిన మరితర రకాల ఆహారాన్ని భుజించవచ్చని తలంచి ఉండవచ్చు.

6 అయితే, అంతకుముందు అపవిత్రమని భావించిన వాటిని భుజించడమనే తలంపే ఇతర యూదా క్రైస్తవులకు జుగుప్సాకరంగా ఉండివుండవచ్చు. అలాంటి సున్నిత భావాలుగలవారు, తోటి యూదా క్రైస్తవ సహోదరులు అలాంటి ఆహారం భుజించడాన్ని బట్టి సహజంగానే అభ్యంతరపడి ఉండవచ్చు. అంతేకాక, ఎలాంటి ఆహార నిషేధాలు లేని మత నేపథ్యం నుండి వచ్చిన కొందరు అన్య క్రైస్తవులు ఆహారం విషయంలో ఎవరైనా అభ్యంతరపడడాన్ని బట్టి తికమకపడి ఉండవచ్చు. రక్షణ కోసం ఫలాని ఆహారం భుజించకూడదని ఇతరులను ఒత్తిడి చేయనంతవరకు ఎవరైనా సరే ఫలాని ఆహారం తినకూడదని నిర్ణయించుకుంటే దానిలో తప్పేమీ లేదు. అయినప్పటికీ, విభిన్న అభిప్రాయాలు సంఘంలో సులభంగా వివాదాలు రేపవచ్చు. అలాంటి విభేదాలు దేవుణ్ణి ‘ఏకగ్రీవముగా’ మహిమపరచడానికి అడ్డుతగలకుండా రోమాలోని క్రైస్తవులు జాగ్రత్తపడాలి.

7 పౌలు రెండవ ఉదాహరణనిస్తున్నాడు: “ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు.” (రోమీయులు 14:⁠5) మోషే ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినమున ఏ పనీ చేయకూడదు. ఆ రోజున ప్రయాణాలు చేయడం కూడా నిషేధించబడింది. (నిర్గమకాండము 20:8-10; మత్తయి 24:20; అపొస్తలుల కార్యములు 1:​12) అయితే ధర్మశాస్త్రం రద్దుచేయబడినప్పుడు, ఆ నిషేధాలు ఎత్తివేయబడ్డాయి. అయినప్పటికీ, కొందరు యూదా క్రైస్తవులు తాము ఇంతకుముందు పవిత్రమని ఎంచిన ఆ దినమున ఎలాంటి పనిచేయడానికైనా లేదా దూర ప్రయాణాలు చేయడానికైనా వెనుకాడి ఉండవచ్చు. క్రైస్తవులైన తర్వాత కూడా, దేవుని దృష్టిలో విశ్రాంతి దినాన్ని ఆచరించడం అవసరం లేకపోయినా వారు ఏడవ దినాన్ని కేవలం ఆధ్యాత్మిక విషయాలకే కేటాయించి ఉండవచ్చు. వారలా చేయడం తప్పా? దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించాలని కోరుతున్నాడని ఇతరులపై ఒత్తిడి తీసుకురానంత వరకూ అదేమీ తప్పుకాదు. కాబట్టి, తన క్రైస్తవ సహోదరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకుంటూ పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.”​—⁠రోమీయులు 14:⁠5బి.

8 ఏదేమైనప్పటికీ, తమ మనస్సాక్షికి సంబంధించిన విషయాలతో పోరాడుతున్న వారిపట్ల ఓపిక వహించమని తన సహోదరులను ఆప్యాయంగా ప్రోత్సహిస్తూనే, రక్షణ కోసం మోషే ధర్మశాస్త్రానికి తప్పకుండా లోబడాలని తోటి విశ్వాసులపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్న వారిని పౌలు గట్టిగా ఖండించాడు. ఉదాహరణకు, దాదాపు సా.శ. 61వ సంవత్సరంలో పౌలు హెబ్రీయులకు పత్రిక వ్రాశాడు. అందులో ఆయన యూదా క్రైస్తవులకు యేసు విమోచన క్రయధనంపై ఆధారపడిన ఉన్నతమైన నిరీక్షణ ఉన్నందువల్ల, మోషే ధర్మశాస్త్రానికి లోబడడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టంగా వివరించాడు.​—⁠గలతీయులు 5:1-12; తీతు 1:10, 11; హెబ్రీయులు 10:1-17.

9 మనం చూసినట్లుగా, ఎంపిక చేసుకునే విషయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ, క్రైస్తవ సూత్రాలు ఉల్లంఘించబడనంత వరకు అవి ఐక్యతకు ప్రమాదకరం కాకూడదని పౌలు సూచిస్తున్నాడు. అందువల్ల బలహీన మనస్సాక్షిగల క్రైస్తవులను పౌలు ఇలా అడుగుతున్నాడు: “నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల?” బలమైన వారిని (బహుశా ధర్మశాస్త్రం క్రింద నిషేధించబడిన కొన్ని రకాల ఆహార పదార్థాల్ని భుజించడానికి లేదా విశ్రాంతి దినాన పనిచేసుకోవడానికి తమ మనస్సాక్షి అనుమతించిన వారిని) ఆయనిలా ప్రశ్నిస్తున్నాడు: “నీ సహోదరుని నిరాకరింపనేల?” (రోమీయులు 14:​10) పౌలు అభిప్రాయం ప్రకారం, బలహీన మనస్సాక్షిగల క్రైస్తవులు విశాల దృక్పథంగల తమ సహోదరులను ఆక్షేపించకూడదు. అదే సమయంలో బలంగావున్న క్రైస్తవులు కొన్ని విషయాల్లో తమ మనస్సాక్షి ఇంకా బలహీనంగావున్న వారిని తక్కువ చూపు చూడకూడదు. అందరూ ఇతరుల సరైన ఉద్దేశాలను గౌరవిస్తూ “[తాము] ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొన” కూడదు.​—⁠రోమీయులు 12:3, 18.

10 సమతూకమైన దృక్కోణాన్ని పౌలు ఇలా వివరించాడు: “తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.” ఆయనింకా ఇలా అంటున్నాడు: ‘దేవునికి మహిమ కలుగునట్లు క్రీస్తు మిమ్మును చేర్చుకొనెను.’ అటు బలంగలవారు ఇటు బలహీనులు దేవునికి, క్రీస్తుకు అంగీకారమయ్యారు కాబట్టి మనం కూడా విశాల దృక్పథంతో ‘ఒకరినొకరం చేర్చుకోవాలి.’ (రోమీయులు 14:⁠3; 15:⁠7) దీనితో ఎవరు మాత్రం అంగీకరించరు?

సహోదర ప్రేమ నేడు ఐకమత్యాన్ని కలిగిస్తుంది

11 పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో ఒక విశిష్ఠమైన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఆ మధ్యనే ఒక నిబంధనను రద్దుచేసి దాని స్థానంలో ఒక కొత్త నిబంధన స్థిరపరిచాడు. దానికి అనుగుణంగా దిద్దుబాటు చేసుకోవడం కొందరికి కష్టంగా ఉంది. అయితే అలాంటి పరిస్థితి నేడు లేదు, కానీ కొన్నిసార్లు అలాంటి వివాదాలే తలెత్తవచ్చు.

12 ఉదాహరణకు, ఒక క్రైస్తవ స్త్రీ గతంలో, దుస్తుల విషయంలోనూ అలంకరణ విషయంలోనూ నిరాడంబరంగా ఉండాలని నొక్కిచెప్పిన మతానికి చెందినదై ఉండవచ్చు. ఆమె సత్యాన్ని అంగీకరించినప్పుడు, సందర్భానికి అనుగుణంగా రంగుల దుస్తులు ధరించడం, కొంతమేర మేకప్‌ చేసుకోవడం నిషిద్ధం కాదనే తలంపును అంగీకరించడం ఆమెకు కష్టంగా ఉండవచ్చు. వీటికి సంబంధించిన బైబిలు సూత్రాలు లేవు కాబట్టి, ఆ క్రైస్తవ స్త్రీ తన మనస్సాక్షికి విరుద్ధంగా మెలిగేలా ఎవరైనాసరే ఆమెను ఒత్తిడి చేయడం మంచిది కాదు. అదే సమయంలో అలా చేయడానికి తమ మనస్సాక్షి అనుమతించే ఇతర క్రైస్తవ స్త్రీలను ఆమె విమర్శించకూడదని గుర్తుంచుకోవాలి.

13 మరో ఉదాహరణను పరిశీలించండి. ఒక క్రైస్తవుడు మద్యం సేవించడాన్ని ఇష్టపడని వాతావరణంలో పెరిగివుండవచ్చు. సత్యం నేర్చుకున్న తర్వాత, ఆయన ద్రాక్షారసం దేవుడిచ్చిన వరమనీ దానిని మితంగా సేవించవచ్చనీ తెలుసుకుంటాడు. (కీర్తన 104:​15) ఆయన ఆ దృక్కోణాన్ని అంగీకరిస్తాడు. అయినప్పటికీ తన నేపథ్యం కారణంగా ఆయన మద్యం అస్సలు ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నా, ఆయన దానిని మితంగా తీసుకొనేవారిని విమర్శించడు. ఆ విధంగా ఆయన, “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము” అని పౌలు పలికిన మాటలను తనకు అన్వయించుకుంటాడు.​—⁠రోమీయులు 14:​19.

14 రోమీయులకు పౌలు ఇచ్చిన సలహాలోని అసలు భావాన్ని అన్వయించుకోవలసిన అవసరం ఉండే ఇతర పరిస్థితులూ తలెత్తవచ్చు. క్రైస్తవ సంఘం అనేక రకాల వ్యక్తులతో రూపొందుతుంది, వారి అభిరుచులు విభిన్నంగా ఉంటాయి. అందువల్ల, వారు వస్త్రధారణ, కేశాలంకరణ తదితర విషయాల్లో విభిన్న రీతుల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే యథార్థ క్రైస్తవులందరూ పాటించే స్పష్టమైన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. మనలో ఎవ్వరూ విపరీతమైన లేదా అమర్యాదకరమైన లేదా ఈ లోకంలోని అభ్యంతరకరమైన వ్యక్తులతో మనల్ని జతకట్టేలాంటి దుస్తులు ధరించకూడదు లేదా ఆ విధంగా కేశాలంకరణ ఉండకూడదు. (1 యోహాను 2:​15-17) విశ్రాంతి తీసుకొనే సమయాలతోసహా అన్ని సమయాల్లో తాము విశ్వ సర్వాధిపతికి ప్రాతినిధ్యం వహించే పరిచారకులమని క్రైస్తవులు గుర్తుంచుకుంటారు. (యెషయా 43:10; యోహాను 17:16; 1 తిమోతి 2:​9, 10) అయితే క్రైస్తవులకు అనేక విషయాల్లో ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. *

ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకండి

15 రోమాలోని క్రైస్తవులకు తానిచ్చిన సలహాలో పౌలు మరో ప్రాముఖ్యమైన సూత్రాన్ని మన దృష్టికి తెస్తున్నాడు. చక్కని శిక్షణపొందిన మనస్సాక్షిగల క్రైస్తవుడు తప్పు కాకపోయినా తాను ఫలాని ఎంపిక చేసుకోకూడదని కొన్నిసార్లు తీర్మానించుకోవచ్చు. ఎందుకు? ఎందుకంటే తన నిర్ణయం ఇతరులకు అభ్యంతరం కలిగించవచ్చని ఆయన గ్రహిస్తాడు. అలాంటప్పుడు, మనమేమి చేయాలి? పౌలు ఇలా చెబుతున్నాడు: “మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.” (రోమీయులు 14:​14, 20, 21) ఆ విధంగా, “బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.” (రోమీయులు 15:​1, 2) మనం చేసే దానినిబట్టి తోటి క్రైస్తవుని మనస్సాక్షి అభ్యంతరపడినప్పుడు, మన సహోదర ప్రేమ మనం ఎంపిక చేసుకునే విషయాల పట్ల శ్రద్ధచూపడానికి, హద్దులు పాటించడానికి మనల్ని పురికొల్పుతుంది. దీనికి ఉదాహరణగా మద్యపానీయాలను సేవించే విషయాన్ని తీసుకోవచ్చు. ఒక క్రైస్తవుడు మితంగా ద్రాక్షారసం పుచ్చుకోవచ్చు. అయితే ఆయనలా పుచ్చుకోవడం తన తోటి వ్యక్తికి అభ్యంతరం కలిగిస్తే ఆయన తన పంతమే నెగ్గాలని ఒత్తిడి చేయడు.

16 ఈ సూత్రం క్రైస్తవ సంఘం వెలుపటి వారితో మనం వ్యవహరించే విధానానికీ అన్వయించగలదు. ఉదాహరణకు, బహుశా మనం వారంలో ఒకరోజును విశ్రాంతి దినంగా దృష్టించాలని అక్కడి మతం బోధిస్తున్న సమాజంలో నివసిస్తుండవచ్చు. అలాంటప్పుడు, మన పొరుగువారికి అభ్యంతరం కలిగించి మన ప్రకటనా పనికి అవాంతరాలు సృష్టించుకోవడానికి బదులు సాధ్యమైనంత మేరకు మన పొరుగువారికి అభ్యంతరం కలిగించేదేదీ ఆ రోజున చేయకుండా ఉంటాం. మరో పరిస్థితి ఏమిటంటే, అవసరత ఎక్కువగా ఉన్న బీద ప్రజలున్న క్షేత్రంలో సేవచేయడానికి ఒక సంపన్న క్రైస్తవుడు వెళ్లవచ్చు. అలాంటప్పుడు ఆయన సాధారణ దుస్తులు ధరిస్తూ లేదా తన ఆర్థిక స్థితిని బట్టి చక్కని స్థితిలో ఉండగలిగినప్పటికీ నిరాడంబరంగా జీవిస్తూ కొత్తవారైన తన పొరుగువారి పట్ల శ్రద్ధ చూపాలని నిర్ణయించుకోవచ్చు.

17 ‘బలవంతులైనవారు’ అలాంటి సర్దుబాట్లు చేసుకోవాలని అపేక్షించడం సముచితమేనా? ఈ ఉదాహరణను పరిశీలించండి: మనమొక ప్రధాన రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా, మన ముందు కొంతమంది పిల్లలు ప్రమాదానికి గురయ్యే విధంగా రోడ్డుపై నడవడాన్ని గమనించాం. మనం వేగంగా వెళ్లగల న్యాయబద్దమైన హక్కు మనకుంది కాబట్టి, మనమలాగే వేగంగా కారు నడుపుకుంటూ వెళతామా? లేదు, పిల్లలకు ప్రమాదం కలగకూడదని మనం వేగాన్ని తగ్గిస్తాం. కొన్నిసార్లు, మన తోటి విశ్వాసులతో లేదా ఇతరులతో మన సంబంధాల్లో మనం అలా వేగాన్ని తగ్గించుకోవడానికి లేదా పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సుముఖత చూపించవలసిన అవసరం ఉండవచ్చు. మనకు చేయగల సంపూర్ణ హక్కు ఉన్నది ఏదైనా మనం చేస్తుండవచ్చు. బైబిలు సూత్రాలేవీ ఉల్లంఘించబడకపోవచ్చు. అయినప్పటికీ, మనం ఇతరులను అభ్యంతరపరిచే లేదా బలహీన మనస్సాక్షిగల వారికి హాని కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వ్యవహరించేలా క్రైస్తవ ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. (రోమీయులు 14:​13, 15) ఐక్యతను కాపాడుకుంటూ రాజ్యాసక్తులను పురోగమింపజేయడం మన వ్యక్తిగత హక్కులు సాధించుకోవడం కంటే ఎంతో ప్రాముఖ్యమైనది.

18 మనమలా చేసినప్పుడు, మనం ఉత్తమ ఆదర్శాన్ని అనుసరిస్తాం. పౌలు ఇలా చెబుతున్నాడు: “క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని​—⁠నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.” మనకోసం తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి యేసు ఇష్టపడ్డాడు. మన హక్కుల్లో కొన్నింటిని త్యాగం చేయడం, ‘బలహీనులు’ మనతో ఏకగ్రీవంగా దేవుణ్ణి మహిమపరచడానికి సహాయం చేస్తే మనం తప్పకుండా అలా చేయడానికి ఇష్టపడతాం. బలహీన మనస్సాక్షిగల క్రైస్తవుల పట్ల మనం సహనం ప్రదర్శిస్తూ, ఔదార్యపు స్వభావాన్ని కనబరచడం లేదా మన ఎంపికలను స్వచ్ఛందంగా పక్కనబెట్టి మన హక్కుల కోసం ఒత్తిడి చేయకుండా ఉండడం నిజంగా ‘క్రీస్తుయేసు చిత్తాన్ని’ ప్రదర్శిస్తుంది.​—⁠రోమీయులు 15:1-5.

19 లేఖన సూత్రాలు అన్వయించని విషయాల్లో మన దృక్కోణాలు కొంతమేరకు విభిన్నంగా ఉన్నప్పటికీ, ఆరాధనకు సంబంధించిన విషయాల్లో మనం సంపూర్ణ ఐకమత్యంతో ప్రవర్తిస్తాం. (1 కొరింథీయులు 1:​10) ఉదాహరణకు, అలాంటి ఐకమత్యం సత్యారాధనను వ్యతిరేకించే వారి పట్ల మనం ప్రతిస్పందించే విధానంలో స్పష్టంగా కనబడుతుంది. అలాంటి వారిని దేవుని వాక్యము అన్యులని పిలుస్తూ అలాంటి “అన్యుల స్వరము” విషయంలో జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తోంది. (యోహాను 10:⁠5) మనమలాంటి అన్యులను ఎలా గుర్తించవచ్చు? వారి విషయంలో మనమెలా ప్రతిస్పందించాలి? ఈ ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

[అధస్సూచి]

^ పేరా 19 మైనరు పిల్లలు తల్లిదండ్రుల అభీష్టాన్నిబట్టే దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

మీరెలా సమాధానమిస్తారు?

వ్యక్తిగత విషయాల్లో విభిన్న దృక్కోణాలు ఉండడం ఐక్యతకు ఎందుకు ప్రమాదకరం కాదు?

క్రైస్తవులుగా మనం ఎందుకు పరస్పరం ప్రేమపూర్వక శ్రద్ధ చూపించుకోవాలి?

ఐక్యతకు సంబంధించి పౌలు ఇచ్చిన సలహాను నేడు మనం అన్వయించుకోగల కొన్ని మార్గాలేమిటి, అలా చేయడానికి మనల్నేది పురికొల్పుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. విభిన్న దృక్కోణాలకు సంబంధించిన ఏ పాఠాన్ని పౌలు తన తోటి విశ్వాసులకు వివరించాడు?

2. ఐక్యత యొక్క అవసరతను పౌలు ఎలా నొక్కిచెప్పాడు?

3, 4. (ఎ) రోమాలోని క్రైస్తవులకు ఎలాంటి విభిన్న నేపథ్యాలు ఉన్నాయి? (బి) రోమాలోని క్రైస్తవులు యెహోవాను ఎలా ‘ఏకగ్రీవముగా’ సేవించగలరు?

5, 6. రోమా సంఘంలో భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి?

7. వారంలో ఒక దినాన్ని ప్రత్యేకంగా దృష్టించే విషయంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి?

8. రోమాలోని క్రైస్తవులు ఇతరుల మనస్సాక్షికి విలువిస్తూనే ఏమి చేయకుండా ఉండాలి?

9, 10. క్రైస్తవులు ఏమి చేయకూడదు? వివరించండి.

11. పౌలు కాలంలో ఎలాంటి విశిష్ఠమైన పరిస్థితి ఉంది?

12, 13. నేడు క్రైస్తవులు తమ సహోదరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకుంటున్నామని చూపించగల కొన్ని పరిస్థితులు ఏవి?

14. పౌలు రోమీయులకు ఇచ్చిన సలహాలోని అసలు భావాన్ని క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో అన్వయించుకోవచ్చు?

15. ఒక క్రైస్తవుడు తన సహోదరుల ప్రయోజనార్థమై ఎప్పుడు తన హక్కుల విషయంలో నిగ్రహం చూపుతాడు?

16. మన క్షేత్రంలో వారిపట్ల మనమెలా శ్రద్ధ కనబరచవచ్చు?

17. మనం ఎంపిక చేసుకునే విషయాల్లో ఇతరులపట్ల శ్రద్ధ చూపడం ఎందుకు సముచితం?

18, 19. (ఎ) ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడంలో యేసు మాదిరిని మనమెలా అనుసరిస్తాం? (బి) ఏ విషయంలో మనమందరం సంపూర్ణ ఐకమత్యంతో ప్రవర్తిస్తాం, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[9వ పేజీలోని చిత్రం]

ఐక్యత విషయంలో పౌలు ఇచ్చిన సలహా సంఘానికి ఆవశ్యకం

[10వ పేజీలోని చిత్రం]

విభిన్న నేపథ్యాలున్నప్పటికీ క్రైస్తవులు ఐకమత్యంతో ఉన్నారు

[12వ పేజీలోని చిత్రం]

ఈ డ్రైవరు ఇప్పుడేమి చేయాలి?