కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన 1,44,000 అనే సంఖ్యను యెహోవాసాక్షులు సూచనార్థకంగా కాకుండా అక్షరార్థంగా ఎందుకు తీసుకుంటారు?

అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. . . . లక్ష నలువది నాలుగు వేలమంది.” (ప్రకటన 7:⁠4) బైబిలులోని “ముద్రింపబడినవారు” అనే మాట, రానున్న భూపరదైసును క్రీస్తుతోపాటు పరలోకం నుండి పరిపాలించడానికి మానవాళి నుండి ఎంపిక చేసుకోబడిన ఒక గుంపును సూచిస్తోంది. (2 కొరింథీయులు 1:​21, 22; ప్రకటన 5:​9, 10; 20:⁠6) వారి సంఖ్య అయిన 1,44,000ను అక్షరార్థంగా అర్థం చేసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ప్రకటన 7:4వ వచనం ఉన్న ఆ గ్రంథ భాగంలోనే కనబడుతుంది.

అపొస్తలుడైన యోహానుకు 1,44,000 మంది ఉన్న ఈ గుంపు గురించి దర్శనంలో చెప్పిన తర్వాత, ఆయనకు మరొక గుంపు చూపించబడింది. యోహాను ఈ రెండవ గుంపును “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” అని వర్ణించాడు. ఈ గొప్పసమూహము, ప్రస్తుత దుష్టలోకాన్ని నాశనం చేయనున్న, “మహాశ్రమల” నుండి రక్షించబడే వారిని సూచిస్తోంది. (ఇటాలిక్కులు మావి.)​—⁠ప్రకటన 7:​9, 14.

అయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోని 4, 9 వచనాల మధ్య యోహాను చూపిస్తున్న వ్యత్యాసాన్ని గమనించండి. ఆయన మొదటి గుంపు అయిన “ముద్రింపబడినవారి”కి నిర్దిష్ట సంఖ్య ఉన్నట్లు పేర్కొన్నాడు. కానీ రెండవ గుంపు అయిన “గొప్పసమూహము”నకు నిర్దిష్ట సంఖ్య లేదు. దీనిని మనసులో ఉంచుకుంటే, 1,44,000 సంఖ్యను అక్షరార్థంగా తీసుకోవడమే సహేతుకం. ఒకవేళ 1,44,000 సంఖ్య అసంఖ్యాకమైన ఒక గుంపును సూచించే సూచనార్థక సంఖ్య అయినట్లయితే, ఆ రెండు వచనాల మధ్య చూపించబడుతున్న వ్యత్యాసంలో బలం ఉండదు. ఆ కారణంగా 1,44,000 అనే సంఖ్యను అక్షరార్థంగానే తీసుకోవాలని సందర్భం గట్టిగా సూచిస్తోంది.

చాలామంది బైబిలు పండితులు, గతంలోనేకాక ఇప్పుడు కూడా, ఆ సంఖ్య అక్షరార్థమైనదనే నిర్ధారణకే వచ్చారు. ఉదాహరణకు, ప్రకటన 7:​4, 9 వచనాలపై వ్యాఖ్యానిస్తూ, బ్రిటిష్‌ నిఘంటుకర్త డా. ఎథెల్‌బర్ట్‌ డబ్ల్యు. బుల్లింగర్‌ దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇలా అన్నాడు: “ఇది సరళమైన వాస్తవం: ఇదే అధ్యాయంలో అనిర్దిష్టమయన సంఖ్యకు వ్యతిరేకంగా ఉన్న నిర్దిష్ట సంఖ్య.” (ది అపోకలిప్స్‌ లేదా “ద డే ఆఫ్‌ ద లార్డ్‌,” 282వ పేజీ) ఇటీవలే, అమెరికాలోవున్న ద మాస్టర్స్‌ సెమినరీలో న్యూ టెస్టమెంట్‌ ప్రొఫెసర్‌గావున్న రాబర్ట్‌ ఎల్‌. థామస్‌ జూనియర్‌ ఇలా వ్రాశాడు: “సూచనార్థకంగా పరిగణించడానికి బలమైన ఆధారం లేదు. 7:9లోని అనిర్దిష్టమైన సంఖ్యతో పోల్చి చూస్తే అది [7:4లోనిది] నిర్దిష్టమైన సంఖ్య. దాన్ని సూచనార్థకంగా తీసుకున్నట్లయితే, ఇక ఆ పుస్తకంలోని ఏ సంఖ్యనూ అక్షరార్థంగా తీసుకోలేము.”​—⁠రెవలేషన్‌: యాన్‌ ఎగ్జెగెటికల్‌ కామెంటరీ, సంపుటి 1, 474వ పేజీ.

కొందరు, ప్రకటన గ్రంథంలో ఎంతో సూచనార్థకమైన భాష ఉంది కాబట్టి, 1,44,000 అనే సంఖ్యతోపాటు ఆ పుస్తకంలో కనబడే సంఖ్యలన్నీ సూచనార్థకమైనవేనని వాదిస్తారు. (ప్రకటన 1:​1, 4; 2:​10) అయితే ఆ అభిప్రాయం సరైనది కాదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రకటన గ్రంథంలో సూచనార్థక సంఖ్యలు అనేకం ఉన్నాయనేది నిజమే, కానీ అందులో అక్షరార్థ సంఖ్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, యోహాను “గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేళ్ల” గురించి మాట్లాడుతున్నాడు. (ప్రకటన 21:​14) ఈ వచనంలో 12 సూచనార్థక సంఖ్యగా కాదు అక్షరార్థంగా ప్రస్తావించబడిందన్నది సుస్పష్టం. అంతేకాక అపొస్తలుడైన యోహాను, క్రీస్తు పరిపాలన యొక్క “వెయ్యి సంవత్సరముల” గురించి కూడా వ్రాశాడు. ఆ సంఖ్యను కూడా అక్షరార్థంగా తీసుకోవలసిందేనని, బైబిలును జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. * (ప్రకటన 20:​3, 5-7) ఆ కారణంగా, ప్రకటన గ్రంథంలోని ఒక సంఖ్యను అక్షరార్థంగా తీసుకోవాలా లేక సూచనార్థకంగా తీసుకోవాలా అనేది దాని నేపథ్యంపై, సందర్భంపై ఆధారపడి ఉంటుంది.

1,44,000 అన్న సంఖ్య అక్షరార్థమైనదీ, పరిమిత సంఖ్యలో ఉన్న వ్యక్తులను అంటే “గొప్ప సమూహము”తో పోలిస్తే చాలా చిన్న సంఖ్యలో ఉన్న వ్యక్తులను సూచిస్తుందీ అనే ముగింపుకు రావడం, ఇతర బైబిలు భాగాలతో కూడా సామరస్యంగా ఉంటుంది. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను పొందిన దర్శనంలో ఆ తర్వాత, 1,44,000 మంది “ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు” అని వర్ణించబడ్డారు. (ఇటాలిక్కులు మావి.) (ప్రకటన 14:​1, 4) “ప్రథమఫలము” అనే మాట ప్రతినిధులుగా ఎంపిక చేసుకోబడిన చిన్న గుంపును సూచిస్తుంది. అంతేకాక యేసు భూమిపై ఉన్నప్పుడు తనతోపాటు పరలోక రాజ్యాన్ని పరిపాలించే వారి గురించి మాట్లాడుతూ వారిని “చిన్న మందా” అని పిలిచాడు. (లూకా 12:​32; 22:​29) నిజానికి, రానున్న భూపరదైసులో జీవించే మానవాళితో పోల్చి చూస్తే, పరలోకంలో పరిపాలించే మానవుల సంఖ్య చాలా చిన్నది.

కాబట్టి, ప్రకటన 7:4 యొక్క సందర్భం, దానికి సంబంధించి బైబిలులో ఇతర చోట్ల కనబడే వ్యాఖ్యానాలు 1,44,000 అనే సంఖ్యను అక్షరార్థంగానే తీసుకోవాలని ధ్రువీకరిస్తున్నాయి. ఆ సంఖ్య, యెహోవా దేవుణ్ణి ఆరాధించే ఆనందభరితమైన, అనిర్దిష్ట బహుళ సంఖ్యలో ఉన్న ప్రజలతో నిండివుండే పరదైసు భూమిపై క్రీస్తుతోపాటు పరిపాలించే వారిని సూచిస్తుంది.​—⁠కీర్తన 37:⁠29.

[అధస్సూచి]

^ పేరా 7 క్రీస్తు వెయ్యేండ్ల పాలన గురించి మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 289-90 పేజీలు చూడండి.

[31వ పేజీలోని బ్లర్బ్‌]

పరలోక పాలకుల సంఖ్య 1,44,000కు పరిమితమైనది

[31వ పేజీలోని చిత్రం]

“గొప్పసమూహము” అసంఖ్యాకమైనది

[31వ పేజీలోని చిత్రసౌజన్యం]

నక్షత్రాలు: Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin