కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మీ పిల్లలకు ఎలాంటి స్వాస్థ్యం రుణపడి ఉన్నారు?

మీరు మీ పిల్లలకు ఎలాంటి స్వాస్థ్యం రుణపడి ఉన్నారు?

మీరు మీ పిల్లలకు ఎలాంటి స్వాస్థ్యం రుణపడి ఉన్నారు?

పావ్‌లోస్‌ దక్షిణ యూరప్‌కు చెందిన ఒక కుటుంబీకుడు, ఆయనకు 13, 11 ఏండ్లున్న ఇద్దరు కూతుర్లు, 7 ఏండ్ల ఒక కొడుకు ఉన్నారు. ఆయన తన భార్యాపిల్లలతో సమయం గడుపుతూ ఇంట్లో ఉండడం చాలా అరుదు. పావ్‌లోస్‌ తన కలను నిజం చేసుకోవడానికి కావలసిన డబ్బు సంపాదించాలని, వారానికి ఏడు రోజులు ఎక్కువ గంటలు పని చేస్తూ అధిక సమయం పనిలోనే గడుపుతాడు. తన కూతుర్లిద్దరికీ ఒక్కో ఇల్లు కొనాలని, కొడుకు కోసం ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని ఆయన కోరిక. ఆయన భార్య సోఫియా, తమ పిల్లల సంసారాల కోసం దుప్పట్లు, వంట సామాన్లు, పింగాణీ పాత్రలు, వెండి సామగ్రి వంటి అదనపు గృహోపకరణాలను కూడబెట్టడం కోసం కష్టపడి పని చేస్తుంది. అంతగా ఎందుకు కష్టపడుతున్నారని వారిని అడిగితే, వారు ముక్తకంఠంతో ఇలా సమాధానమిస్తారు: “మా పిల్లల కోసం!”

పావ్‌లోస్‌, సోఫియాల్లాగే ప్రపంచమంతటా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవితంలో మంచి ఆరంభాన్ని ఇవ్వడం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తారు. కొందరు పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు పక్కన పెడతారు. మరికొందరు తమ పిల్లలకు భావి జీవితంలో ఉపయోగకరంగా ఉండేందుకు వారికి మంచి చదువు, వృత్తులు నేర్పిస్తారు. ఇలాంటి బహుమతులను ఎక్కువమంది తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చే స్వాస్థ్యంగా దృష్టించినప్పటికీ, వాటిని సమకూర్చడంలో తల్లిదండ్రులు తమ బంధువుల, మిత్రుల, తాము ఉంటున్న సమాజ అంచనాలకు అనుగుణంగా ఉండేందుకు చాలా ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి, ఆలోచన గల తల్లిదండ్రులు, ‘మనం మన పిల్లలకు ఎంత రుణపడి ఉన్నాము?’ అని అడగడం సమంజసమే.

భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేయడం

క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏర్పాట్లు చేయడం సహజమైనదే కాదు లేఖనబద్ధమైనది కూడా. అపొస్తలుడైన పౌలు తన కాలంలోని క్రైస్తవులతో ఇలా అన్నాడు: “పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా.” (2 కొరింథీయులు 12:​14) తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపించడం గంభీరమైన బాధ్యత అని తెలుపుతూ పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:⁠8) బైబిలు కాలాల్లోని దేవుని సేవకులకు స్వాస్థ్యానికి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవిగా ఉండేవని అనేక బైబిలు వృత్తాంతాలు నొక్కి చెబుతున్నాయి.​—⁠రూతు 2:​19, 20; 3:​9-13; 4:​1-22; యోబు 42:​15.

అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఘనమైన స్వాస్థ్యం ఇచ్చే ప్రయత్నంలోనే పూర్తిగా నిమగ్నులవుతారు. కారణం? దక్షిణ యూరప్‌ నుండి అమెరికాకు వలస వెళ్ళిన మానోలీస్‌ అనే తండ్రి, ఒక కారణాన్ని ఇలా సూచిస్తున్నాడు: “రెండవ ప్రపంచ యుద్ధపు విధ్వంసాలు, కరవు, పేదరికం వంటివాటిని అనుభవించిన తల్లిదండ్రులు, తమ పిల్లల జీవితాలను మెరుగుపరచాలని నిశ్చయించుకున్నారు. వారు తమ బాధ్యతా భావాన్ని, తమ పిల్లలకు జీవితంలో సాధ్యమైనంత మంచి ఆరంభాన్ని ఇవ్వాలనే కోరికను అమితంగా పెంచుకోవడం కారణంగా, కొన్నిసార్లు వారు తమకు తామే హాని కలుగజేసుకుంటున్నారు.” నిజానికి, కొందరు తల్లిదండ్రులు, తమ సంతానం కోసం వస్తుసంపదలను సమకూర్చడం కోసం, జీవితంలో తమ అవసరాలను కూడా తీర్చుకోరు లేదా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు. కానీ తల్లిదండ్రులు అలా జీవించడం వివేకవంతమైనదేనా?

‘వ్యర్థమూ గొప్ప చెడుగూ’

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను, స్వాస్థ్యం విషయంలో హెచ్చరిస్తూ ఒక మాట అన్నాడు. ఆయనిలా వ్రాశాడు: “సూర్యునిక్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే. . . . ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.”​—⁠ప్రసంగి 2:​18-21.

సొలొమోను వివరిస్తున్నట్లుగా, స్వాస్థ్యమును పొందేవారు దాని కోసం స్వయంగా కష్టపడరు కాబట్టి దాని పూర్తి విలువను గ్రహించకపోవచ్చు. ఆ కారణంగా, తల్లిదండ్రులు బాగా కష్టపడి వారికోసం కూడబెట్టిన దాన్ని వారసులు మూర్ఖంగా వినియోగించవచ్చు. కష్టపడి సంపాదించిన ఆ ఆస్తులను వారు దుర్వ్యయం కూడా చేయవచ్చు. (లూకా 15:​11-16) అది ఎంతటి ‘వ్యర్థమూ గొప్ప చెడుగో’ కదా!

స్వాస్థ్యము, దురాశ

తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం మరొకటుంది. వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, పెళ్ళికానుకలు వంటివి బాగా పాతుకుపోయిన సంస్కృతుల్లో జీవించే పిల్లలు, తమ తల్లిదండ్రులు ఇవ్వగలిగిన వాటికంటే ఎక్కువ స్థిరాస్తులను లేక కట్నాన్ని పట్టుబట్టి తీసుకునే దురాశాపరులుగా మారే అవకాశం ఉంది. “ఇద్దరు లేక ముగ్గురు కూతుర్లు ఉన్నారంటే ఆ తండ్రి పని అయిపోయినట్లే,” అని గ్రీసుకు చెందిన లౌకాస్‌ అనే ఒక తండ్రి హాస్యంగా అంటున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “కూతుర్లు తమ తండ్రి ఇవ్వగలిగిన దాన్ని, ఇతరుల తండ్రులు వారి పిల్లల కోసం ‘ఔదార్యంగా’ సమకూర్చేవాటితో పోల్చవచ్చు. తమతోపాటు తగిన కట్నం తీసుకుపోలేకపోతే తమకు వివాహమయ్యే అవకాశాలు తగ్గిపోతాయని వారు సూచించవచ్చు.”

ముందుగా పేర్కొన్న మానోలీస్‌ ఇలా అంటున్నాడు: “ఒక యువకుడు తనకు కాబోయే వధువు తండ్రి ఆమెకు ఏదో ఒకటి, సాధారణంగా భూమి లేక పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని వాగ్దానం చేసేంతవరకు కోర్ట్‌షిప్‌ (పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎదుటి వ్యక్తిని మరింత బాగా తెలుసుకునేందుకు కలిసి గడపడం) కొనసాగిస్తుండవచ్చు. అది ఒక రకమైన బ్లాక్‌మెయిల్‌లా అవుతుంది.”

బైబిలు అన్ని రకాల దురాశల గురించి హెచ్చరిస్తోంది. సొలొమోను ఇలా వ్రాశాడు: “మొదట్లో పేరాశతో దక్కించుకొన్న ఆస్తికి చిట్టచివరకు దీవెనలు కలగవు.” (సామెతలు 20:​21, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) అపొస్తలుడైన పౌలు ఇలా నొక్కిచెప్పాడు: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.”​—⁠1 తిమోతి 6:​10; ఎఫెసీయులు 5:⁠5.

“జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము”

స్వాస్థ్యానికి లేక ఆస్తికి కొంత విలువ ఉంటుందన్నది నిజమే, కానీ జ్ఞానము విలువ భౌతికపరమైన ఆస్తులకంటె ఎంతో విలువైనది. సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; . . . జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:​11, 12; సామెతలు 2:⁠7; 3:​21) డబ్బు తన సొంతదారుని అవసరాలను తీరుస్తూ కొంతవరకు రక్షణగా ఉన్నప్పటికీ, దాన్ని నష్టపోయే అవకాశముంది. మరోవైపున, సమస్యలను పరిష్కరించడానికి లేదా కొన్ని లక్ష్యాలను సాధించడానికి పరిజ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యం అయిన జ్ఞానము, ఒక వ్యక్తి మూర్ఖత్వంతో ప్రమాదాల్లో పడకుండా కాపాడుతుంది. ఆ జ్ఞానము దేవుని భయం మీద ఆధారపడినదైతే, అది ఆ వ్యక్తి త్వరలో రానున్న దేవుని నూతనలోకంలో నిత్యజీవం పొందేందుకు సహాయపడుతుంది​—⁠నిజానికి అదే అమూల్యమైన స్వాస్థ్యం!​—⁠2 పేతురు 3:​13.

క్రైస్తవ తల్లిదండ్రులు తమ కొరకు, తమ పిల్లల కొరకు సరైన ప్రాథమ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా అలాంటి జ్ఞానమును ఆచరణలో పెడతారు. (ఫిలిప్పీయులు 1:​9-11) పిల్లల ఉపయోగార్థం సమకూర్చే భౌతిక సంపదలు ఆధ్యాత్మిక విషయాలకంటే ప్రాముఖ్యం కాకూడదు. యేసు తన అనుచరులను ఇలా ప్రోత్సహించాడు: “మీరు ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:​33) తమ క్రైస్తవ కుటుంబం కోసం ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచే తల్లిదండ్రులు సమృద్ధిగా ఆశీర్వదించబడతామని ఎదురుచూడవచ్చు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును; జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.”​—⁠సామెతలు 23:​24, 25.

శాశ్వతమైన స్వాస్థ్యం

ప్రాచీన ఇశ్రాయేలీయులు వారసత్వంగా సంక్రమించే ఆస్తికి సంబంధించిన విషయాలను చాలా ప్రాముఖ్యమైనవిగా పరిగణించేవారు. (1 రాజులు 21:​2-6) అయితే యెహోవా వారికి ఇలా ఉద్బోధించాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:​6, 7) అదేవిధంగా క్రైస్తవ తల్లిదండ్రులకు కూడా ఇలా చెప్పబడింది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”​—⁠ఎఫెసీయులు 6:⁠4.

ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులకు సమకూర్చే వాటిలో, బైబిలు ఉపదేశం కూడా ఉండాలని గ్రహిస్తారు. ముగ్గురు పిల్లల తండ్రి ఆంద్రియాస్‌ ఇలా అంటున్నాడు: “పిల్లలు తమ జీవితంలో దేవుని సూత్రాలను అన్వయించుకోవడం నేర్చుకుంటే, వారు భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా సిద్ధమైనట్లే.” అటువంటి పిత్రార్జితం, వారు తమ సృష్టికర్తతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకొని దాన్ని వృద్ధి చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది.​—⁠1 తిమోతి 6:​18, 19.

మీరు మీ పిల్లల ఆధ్యాత్మిక భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేయడం గురించి ఆలోచించారా? ఉదాహరణకు, పిల్లవాడు పూర్తికాల సేవ చేస్తున్నట్లయితే తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు? ఒక పూర్తికాల సేవకుడు ఆర్థిక మద్దతు కోసం అర్థించకూడదు, ఎదురుచూడకూడదు అయినప్పటికీ, అతడు పూర్తికాల సేవలోనే కొనసాగేందుకు సహాయంగా ప్రేమగల తల్లిదండ్రులు అతని ‘అవసరములలో పాలుపొందడానికి’ నిర్ణయించుకోవచ్చు. (రోమీయులు 12:​13; 1 సమూయేలు 2:​18, 19; ఫిలిప్పీయులు 4:​14-18) అలాంటి మద్దతిచ్చే స్వభావం యెహోవాను సంతోషపరుస్తుంది.

కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి రుణపడి ఉన్నారు? క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల భౌతికావసరాలను తీర్చడంతోపాటు, తమ పిల్లలకు నిరంతర ప్రయోజనాన్ని చేకూర్చే సుసంపన్నమైన ఆధ్యాత్మిక స్వాస్థ్యం కూడా అందేలా చూస్తారు. ఆ విధంగా, కీర్తన 37:18లోని ఈ మాటలు నిజమవుతాయి: “నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.”

[26, 27వ పేజీలోని చిత్రాలు]

మీరు మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు?