కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతృప్తికరమైన, సంతోషకరమైన స్వేచ్ఛార్పణ జీవితం

సంతృప్తికరమైన, సంతోషకరమైన స్వేచ్ఛార్పణ జీవితం

జీవిత కథ

సంతృప్తికరమైన, సంతోషకరమైన స్వేచ్ఛార్పణ జీవితం

మారియోన్‌ మరియు రోసా షుమీగా చెప్పినది

“స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను” అని కీర్తన 54:⁠5 ప్రకటిస్తోంది. ఈ ప్రకటన ఫ్రాన్స్‌లో నివసిస్తున్న మారియోన్‌ షుమీగా, ఆయన భార్య రోసాల జీవితాలకు ప్రధానాంశం అయ్యింది. వారు యెహోవా సేవలో గడిపిన సుదీర్ఘమైన, సంతృప్తికరమైన జీవితంలోని ముఖ్యాంశాలను ఇటీవల తెలిపారు.

మారియోన్‌: మా తల్లిదండ్రులు పోలాండ్‌ నుండి వలస వచ్చిన రోమన్‌ క్యాథలిక్కులు. నాన్నగారు మృదు స్వభావి. ఆయనకు పాఠశాలకి వెళ్లే అవకాశమే దొరకలేదు. అయినా, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, ఆయన కందకాలలో గడుపుతూ చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. ఆయన దైవభక్తి గల వ్యక్తే, కానీ చర్చి ఆయనను ఎక్కువగా నిరాశపరచింది.

ప్రత్యేకించి ఒక ఘటన ఆయన జ్ఞాపకాల్లో అలాగే ఉండిపోయింది. యుద్ధ కాలంలో ఒకరోజు, నాన్నగారు పని చేస్తున్న సైనిక శిబిరాన్ని ఒక మతగురువు సందర్శించాడు. దానికి దగ్గర్లో ఒక బాంబు పేలడంతో, భయకంపితుడైన ఆ మతగురువు తన గుర్రాన్ని సిలువతో అదిలిస్తూ అక్కడి నుండి పారిపోయాడు. దేవుని “ప్రతినిధి” తన గుర్రాన్ని పరుగెత్తించడం కోసం “పవిత్రమైన” సిలువను ఉపయోగించడం చూసిన నాన్న నిర్ఘాంతపోయారు. అలాంటి అనుభవాలు ఎదురైనా, యుద్ధంలో భయంకరమైన ఘటనలను చూసినా దేవునిపై ఆయన విశ్వాసం సన్నగిల్లలేదు. ఆయన తాను దేవుని దయ మూలంగానే యుద్ధం నుండి క్షేమంగా ఇంటికి రాగలిగానని తరచూ చెబుతుండేవారు.

“చిన్న పోలాండ్‌”

నాన్నగారు 1911లో పొరుగు గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ఆమె పేరు అన్నా సిసాఫ్‌స్కీ. యుద్ధం తర్వాత కొద్దికాలానికి, 1919లో అమ్మానాన్నలు పోలాండ్‌ నుండి ఫ్రాన్స్‌కు వలస వచ్చారు, అక్కడ నాన్నగారికి బొగ్గు గనుల్లో ఉద్యోగం దొరికింది. నేను 1926 మార్చిలో నైరృతి ఫ్రాన్స్‌లోనున్న కాన్యాక్‌ లిమీన పట్టణంలో పుట్టాను. ఆ తర్వాత ఉత్తర ఫ్రాన్స్‌లోని లాన్స్‌కు సమీపంలో ఉన్న లోస్‌ అంగోయెల్లలోని పోలిష్‌ సమాజంలో మా తల్లిదండ్రులు స్థిరపడ్డారు. రొట్టెలు చేసే బేకరూ పోలాండ్‌ దేశస్థుడే, మాంసం అమ్మే కసాయీ పోలాండ్‌ దేశస్థుడే, మతబోధకుడూ పోలాండ్‌ దేశస్థుడే. అందుకే ఆ ప్రాంతం చిన్న పోలాండ్‌ అని పిలువబడేది. మా తల్లిదండ్రులు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనేవారు. నాన్నగారు తరచూ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు, వాటిలో నాటకాలు, సంగీతం, పాటలు పాడడం వంటివి ఉండేవి. ఆయన ప్రీస్టుతో తరచూ చర్చలు జరిపేవారు కూడా, అయితే ఆ ప్రీస్టు సాధారణంగా ఇచ్చే “అనేక మర్మాలు ఉన్నాయి” అనే జవాబు నాన్నగారిని తృప్తి పరచలేదు.

1930లో ఒకరోజు, ఇద్దరు స్త్రీలు మా తలుపు తట్టారు. వారు అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలువబడిన యెహోవాసాక్షులు. నాన్నగారు వాళ్ళ దగ్గరి నుండి ఒక బైబిలు తీసుకున్నారు, అది ఆయన చాలాకాలం నుండి చదవాలని కోరుకుంటున్న పుస్తకం. ఆ స్త్రీలు ఇచ్చిన బైబిలు ఆధారిత సాహిత్యాలను కూడా నాన్నగారు, అమ్మ ఆసక్తితో చదివారు. ఆ ప్రచురణల్లో చదివిన దాన్నిబట్టి వారు ఎంతో ప్రభావితులయ్యారు. వారు తీరికలేని జీవితం గడుపుతున్నప్పటికీ, బైబిలు విద్యార్థులు ఏర్పాటు చేసిన కూటాలకు హాజరవడం ప్రారంభించారు. ప్రీస్టుతో చేసే చర్చలు మరింత తీవ్ర రూపం దాల్చాయి, చివరకు ఒకరోజు ఆ ప్రీస్టు, మా తల్లిదండ్రులు బైబిలు విద్యార్థులతో సహవాసం అలాగే కొనసాగిస్తే, మా అక్క స్తిఫనీని చర్చి సభ్యత్వం పొందడానికి అవసరమయ్యే కోర్సు నుండి బహిష్కరిస్తామని బెదిరించాడు. దానితో నాన్నగారు, “ఆ విషయంలో మీరేమీ చింతించకండి. ఇప్పటి నుండి నేను నా కూతుర్ని, మిగతా పిల్లలను మాతోపాటు బైబిలు విద్యార్థుల కూటాలకు తీసుకువెళ్తాను” అని బదులిచ్చారు. నాన్నగారు చర్చికి వెళ్ళడం మానేశారు, 1932 ఆరంభంలో మా తల్లిదండ్రులు బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు ఫ్రాన్స్‌లో కేవలం 800 మంది రాజ్య ప్రచారకులు మాత్రమే ఉండేవారు.

రోసా: మా తల్లిదండ్రులు హంగరీ దేశస్థులు, మారియోన్‌ కుటుంబంలాగే వారు కూడా బొగ్గు గనుల్లో పనిచేయడానికి ఉత్తర ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. నేను 1925లో పుట్టాను. 1937లో ఆగూస్త బూజన్‌ అనే ఒక యెహోవాసాక్షి మా తల్లిదండ్రుల కోసం హంగేరియన్‌ భాషలోని కావలికోట తీసుకురావడం ఆరంభించాడు, మేము ఆయనను పపా ఆగూస్త అని పిలిచేవాళ్ళం. ఆ పత్రికలు వారికి ఆసక్తికరంగా అనిపించాయి, కానీ వారిద్దరూ యెహోవాసాక్షులు కాలేదు.

నేను చిన్నపిల్లనే అయినా, కావలికోటలో నేను చదివిన విషయాలు నా హృదయాన్ని స్పృశించాయి, పపా ఆగూస్త వాళ్ళ కోడలు స్యుసాన బూజన్‌ నన్ను చేరదీసింది. నన్ను తనతోపాటు కూటాలకు తీసుకువెళ్ళడానికి మా తల్లిదండ్రులు అనుమతించారు. కానీ ఆ తర్వాత, నేను ఉద్యోగం చేయడం ఆరంభించినప్పుడు, నేను ఆదివారాలు కూటాలకు వెళ్ళడం మా నాన్నగారికి కోపం తెప్పించింది. సాధారణంగా ఆయన స్వభావం మంచిదే అయినా, “నువ్వు వారమంతా ఇంట్లో ఉండవు, ఆదివారాలేమో నీ కూటాలకని వెళతావు!” అని అసంతృప్తి వ్యక్తం చేసేవారు. అయినా నేను మానలేదు. దాంతో ఒకరోజు మా నాన్నగారు “నీ బట్టలు సర్దుకొని వెళ్లిఫో!” అని అన్నారు. అప్పటికే రాత్రి అయింది. నాకప్పుడు 17 ఏండ్లే, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచలేదు. నేను ఏడుస్తూ చివరకు స్యుసాన ఇంటికి చేరుకున్నాను. నేను స్యుసాన దగ్గరే దాదాపు వారం రోజులు ఉన్నాను, ఆ తర్వాత మా నాన్నగారు మా అక్కను పంపించి నన్ను ఇంటికి పిలిపించారు. నేను నలుగురిలోకి వెళ్ళాలంటే భయపడేదాన్ని, కానీ 1 యోహాను 4:18లో వ్యక్తం చేయబడిన తలంపు నేను దృఢంగా నిలబడడానికి దోహదపడింది. ఆ లేఖనము “పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును” అని చెబుతోంది. 1942లో నేను బాప్తిస్మం తీసుకున్నాను.

అమూల్యమైన ఆధ్యాత్మిక పిత్రార్జితం

మారియోన్‌: నేను 1942లో బాప్తిస్మం తీసుకున్నాను, నాతోపాటే మా అక్కలు స్తిఫనీ, మిలనీ, మా అన్నయ్య స్తిఫాన్‌ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. ఇంట్లో మా కుటుంబ జీవితం దేవుని వాక్యం చుట్టూ పరిభ్రమించేది. మేమందరము బల్ల చుట్టూ కూర్చొని ఉంటే, నాన్నగారు మాకు పోలిష్‌ భాషలో బైబిలు చదివి వినిపించేవారు. మా సాయంకాలాలు ఎక్కువగా, మా తల్లిదండ్రులకు రాజ్య ప్రకటనా పనిలో ఎదురైన అనుభవాలు వినడంతోనే గడిచేవి. ఆధ్యాత్మికంగా ప్రోత్సాహకరమైన అలాంటి క్షణాలు, మేము యెహోవాను ఇంకా ఎక్కువగా ప్రేమించడాన్ని, ఆయనపై నమ్మకం ఉంచడాన్ని నేర్పించాయి. అనారోగ్యం వల్ల మా నాన్నగారు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది, అయినా ఆయన మాకు కావలసిన ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలను సమకూర్చడం మానలేదు.

నాన్నగారికి అప్పుడు ఎక్కువ సమయం ఉండడం వల్ల, ఆయన వారానికి ఒకరోజు సంఘంలోని యౌవనులతో పోలిష్‌ భాషలో బైబిలు అధ్యయనం నిర్వహించేవారు. అప్పుడే నేను పోలిష్‌ చదవడం నేర్చుకున్నాను. నాన్నగారు యువతను ఇతర విధాలుగా కూడా ప్రోత్సహించేవారు. ఒకసారి అప్పట్లో ఫ్రాన్స్‌లో యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షిస్తున్న సహోదరుడు గిస్తావ్‌ జొఫర్‌ మా సంఘాన్ని సందర్శించినప్పుడు, నాన్నగారు ఒక గాయకబృందాన్ని ఏర్పాటు చేసి, బెల్షస్సరు రాజు ఇచ్చిన విందు, గోడమీది వ్రాతల ఆధారంగా వేషాలు కట్టించిన బైబిలు నాటకం వేయించారు. (దానియేలు 5:​1-31) అందులో దానియేలు పాత్రను లూయీ ప్యెషుతా పోషించారు, ఆయనే ఆ తర్వాత నాజీలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడ్డారు. * పిల్లలమైన మేము అలాంటి వాతావరణంలో పెరిగాము. మా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నులై ఉండడం మేము గమనించాం. మా తల్లిదండ్రులు మా కోసం వదిలిన పిత్రార్జితం ఎంత విలువైనదో నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను.

1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, ఫ్రాన్స్‌లో యెహోవాసాక్షుల ప్రకటనా పని నిషేధించబడింది. ఒకసారి మా గ్రామం అంతా గాలింపుకు గురైంది. ఇండ్లన్నిటినీ జర్మన్‌ సైనికులు చుట్టుముట్టారు. నాన్నగారు బీరువా కింద ఒక నేల మాళిగ తయారు చేసి అందులో వివిధ బైబిలు సాహిత్యాలను దాచిపెట్టారు. అయితే ఫాసిజమా స్వాతంత్రమా (ఆంగ్లం) అనే బుక్‌లెట్‌ కాపీలు కొన్ని ఒక టేబుల్‌ సొరుగులో ఉండిపోయాయి. నాన్నగారు వాటిని వెంటనే తీసి వరండాలో తగిలించి ఉన్న ఒక కోటు జేబులో దాచారు. ఇద్దరు సైనికులు, ఒక ఫ్రెంచి పోలీసు మా ఇంటిని సోదా చేశారు. మేము ఊపిరి బిగపట్టి చూస్తున్నాం. ఒక సైనికుడు వరండాలో తగిలించివున్న బట్టలు సోదా చేస్తున్నాడు, అతను కొద్దిసేపటి తర్వాత వంటగదిలోకి అడుగు పెట్టాడు, మేము అక్కడే ఉన్నాము, అతని చేతిలో బుక్‌లెట్లు ఉన్నాయి. అతను మావైపు తీక్షణంగా చూసి తన చేతిలోని బుక్‌లెట్లను టేబుల్‌ మీద పెట్టి మరోచోట వెతకడానికి వెళ్ళాడు. నేను తటాలున ఆ బుక్‌లెట్లు తీసి సైనికులు వెదకడం పూర్తి చేసిన ఒక టేబుల్‌ సొరుగులో పెట్టాను. ఆ సైనికుడు ఆ బుక్‌లెట్ల గురించి పూర్తిగా మరచిపోయినట్లు, వాటి గురించి మళ్ళీ అడగనే లేదు!

పూర్తికాల సేవను చేపట్టడం

1948లో నేను యెహోవాకు పూర్తికాల సేవ చేయడానికి పయినీరు సేవ చేపట్టాలని నిర్ణయించుకున్నాను. కొన్ని రోజుల తర్వాత, ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి నాకొక లెటర్‌ వచ్చింది. అందులో నేను బెల్జియం సమీపంలోని సుదాన్‌ సంఘంలో పయినీరుగా సేవ చేయడానికి నియమించబడిన వివరాలు ఉన్నాయి. నేను ఆ విధంగా యెహోవా సేవను హత్తుకోవడం చూసిన మా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే నాన్నగారు, పయినీరు సేవ అంత సులభం కాదని, బాగా కష్టపడాలని సూచించారు. అయినప్పటికీ, నాకేమైనా కష్టాలు ఎదురైతే తన ఇంటి తలుపులు నాకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. మా తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బు లేకపోయినా, వారు నాకొక కొత్త సైకిలు కొనిపెట్టారు. ఆ సైకిలు బిల్లు ఇప్పటికీ నా దగ్గర ఉంది, నేను దాన్ని చూసినప్పుడల్లా, నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అమ్మానాన్నలు 1961లో చనిపోయారు, అయినా నాన్నగారు చెప్పిన జ్ఞానవంతమైన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతుంటాయి; నేను సేవ చేసిన సంవత్సరాలన్నింటిలోను అవి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఓదార్పును ఇచ్చాయి.

ప్రోత్సాహానికి మరొక మూలం, సీడన్‌ సంఘంలోని ఎలీస మత్‌ అనే 75 ఏండ్ల క్రైస్తవ సహోదరి. వేసవిలో నేను శివార్లలోని గ్రామాల్లో ప్రకటించడానికి సైకిలు మీద వెళ్ళేవాడిని, ఎలీస రైలులో వచ్చేది. అయితే ఒకరోజు రైలు ఇంజనీర్లు సమ్మె చేయడంతో ఎలీస ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఇబ్బంది ఏర్పడింది. నాకప్పుడు తోచిన పరిష్కారమల్లా, ఆమెను సైకిలు క్యారేజిపై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళడమే, సైకిలు తొక్కడానికి అదేమంత అనువైన మార్గం కాదు. మరుసటి రోజు ఉదయం, మెత్తగా ఉండడానికి ఒక మెత్త తీసుకుపోయి, ఎలీసను వాళ్ళింటి దగ్గర నుండి ఎక్కించుకుపోయాను. ఆమె రైలులో రావడం మానేసి, అలా మిగిలిన డబ్బుతో మధ్యాహ్న భోజన సమయంలో మాకోసం ఒక వేడి పానీయాన్ని కొనేది. నా సైకిలు ఆ విధంగా రవాణా వాహనంగా ఉపయోగపడుతుందని ఎవరనుకున్నారు?

మరిన్ని బాధ్యతలు

1950లో ఉత్తర ఫ్రాన్స్‌ అంతటా ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేయడానికి పిలుపు వచ్చింది. అప్పుడు నా వయస్సు కేవలం 23 ఏండ్లే కాబట్టి నేను మొదట భయపడ్డాను. బ్రాంచి కార్యాలయంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందనుకున్నాను! నా బుర్ర నిండా ప్రశ్నలు పరుగెడుతున్నాయ్‌: ‘నేను ఆ పని చేయడానికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా అర్హుడనేనా? ప్రతి వారం విభిన్న నివాసాలలో నేనెలా సర్దుకుపోగలను?’ అంతేకాక, నా ఆరవ యేట నుండి నా కళ్లలో ఒక దానికి, డైవర్జంట్‌ స్ట్రాబిస్మస్‌ (కంటి కండరాల్లో సమన్వయ లోపం వల్ల కలుగుతుంది) అనే రుగ్మతతో బాధపడుతున్నాను. ఆ పరిస్థితి వల్ల ఒక కన్ను వెలుపలికి వస్తున్నట్లు ఉండేది. దాని కారణంగా, ఇతరులు ఎలా స్పందిస్తారోననే చింతతో నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడిని. ఆ సందర్భంలో, గిలియడ్‌ మిషనరీ స్కూలు పట్టభద్రుడైన స్తిఫాన్‌ బెహూనిక్‌ నాకు చాలా సహాయం చేశారు, ఆయనకు నా ధన్యవాదాలు. సహోదరుడు బెహూనిక్‌ తన ప్రకటనా కార్యకలాపాల కారణంగా పోలాండ్‌ నుండి బహిష్కరించబడడంతో, తిరిగి ఫ్రాన్స్‌కి నియమించబడ్డాడు. ఆయన ధైర్యం నాలో గాఢమైన ముద్ర వేసింది. ఆయనకు యెహోవా పట్ల, సత్యం పట్ల ప్రగాఢమైన గౌరవం ఉండేది. ఆయన నాతో చాలా కఠినంగా ఉంటున్నాడని కొందరనుకునేవారు, కానీ నేను ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన కనబరచిన ఆత్మవిశ్వాసం నాలో దృఢ నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడింది.

ప్రాంతీయ సేవలో నాకు కొన్ని అద్భుతమైన క్షేత్ర సేవా అనుభవాలు రుచి చూసే అవకాశం లభించింది. 1953లో, దక్షిణ పారిస్‌లో నివసిస్తున్న పౌలీ అనే ఒక వ్యక్తిని కలుసుకొమ్మని నాకు సందేశం వచ్చింది, ఆయన కావలికోట చందాదారుడు. నేను వెళ్ళి ఆయనను కలుసుకున్నాను, ఆయన ఆర్మీ నుండి పదవీ విరమణ పొందిన వ్యక్తి అని, కావలికోట పట్ల ఆయన చాలా ఆకర్షితుడయ్యాడని తెలిసింది. ఆయన ఆ మధ్య ఒక సంచికలో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ గురించిన ఒక ఆర్టికల్‌ చదివిన తర్వాత, ఆయన ఒక్కడే జ్ఞాపకార్థ ఆచరణ పాటించి ఆ రాత్రంతా కీర్తనలు చదువుతూ గడిపానని చెప్పాడు. దాదాపు ఆ మధ్యాహ్నమంతా మా చర్చ కొనసాగింది. నేను అక్కడి నుండి వీడ్కోలు తీసుకోవడానికి ముందు, బాప్తిస్మం గురించి కూడా క్లుప్తంగా మాట్లాడాం. 1954 ప్రథమార్థంలో జరిగే ప్రాంతీయ సమావేశానికి హాజరవమని ఆ తర్వాత నేను ఆయనకు ఆహ్వానం పంపించాను. ఆయన వచ్చాడు, అప్పుడు బాప్తిస్మం తీసుకున్న 26 మందిలో సహోదరుడు పౌలీ ఒకరు. అలాంటి అనుభవాలు నాకు ఇప్పటికీ సంతోషాన్నిస్తాయి.

రోసా: 1948 అక్టోబరులో నేను పయినీరు సేవ ఆరంభించాను. బెల్జియం సమీపంలో ఉన్న అనోర్‌లో సేవ చేసిన తర్వాత, ఇర్రేన కొలోస్కీ (ఇప్పుడు లోర్వా) అనే మరో పయినీరుతోపాటు పారిస్‌కు నియమించబడ్డాను. మేము నగరం నడిబొడ్డున ఉన్న సా జెహ్మా దీప్‌కీలో ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళం. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన నేను, పారిస్‌ ప్రజలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. వాళ్ళందరూ అసాధారణమైనవారు, చాలా తెలివైనవాళ్ళు అని ఊహించుకున్నాను. కానీ వాళ్ళకు ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళు ఇతర ప్రజలకంటే భిన్నంగా ఏమీ లేరని త్వరలోనే తెలుసుకున్నాను. కాపలాదారులు తరచుగా మమ్మల్ని తరిమేసేవారు కాబట్టి బైబిలు అధ్యయనాలు ఆరంభించడం కష్టంగా ఉండేది. అయినప్పటికీ, మా సందేశాన్ని కొందరు స్వీకరించారు.

1951లో జరిగిన ఒక ప్రాంతీయ సమావేశంలో, పయినీరు సేవ గురించి ఇర్రేన, నేనూ ఇంటర్వ్యూ చేయబడ్డాం. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఎవరో ఊహించండి? మారియోన్‌ షుమీగా అనే యువ ప్రయాణ పైవిచారణకర్త. మేము అంతకు ముందు ఒకసారి కలుసుకున్నాం, అయితే ఆ సమావేశం తర్వాత మేము ఉత్తరాలు వ్రాసుకోవడం ఆరంభించాం. మేము బాప్తిస్మం తీసుకున్నది ఒకే సంవత్సరం, పయినీర్లు అయింది ఒకే సంవత్సరం వంటివే కాకుండా మారియోన్‌లో నాలో చాలా పోలికలున్నాయి. అయితే చాలా ముఖ్యంగా, పూర్తికాల సేవలోనే ఉండాలన్నది మా ఇద్దరి కోరిక. ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాలు పరిశీలించుకున్న తర్వాత, మేము 1956 జూలై 31న పెళ్ళి చేసుకున్నాం. దానితో నేను పూర్తిగా ఒక కొత్త జీవితంలో అడుగుపెట్టాను. నేను భార్యగానే కాక, ప్రాంతీయ సేవలో మారియోన్‌తో వెళ్ళడం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది, ప్రతి వారం నివాసం మారేది. మొదట్లో చాలా కష్టమైంది, కానీ గొప్ప సంతోషకరమైన విషయాలు ముందున్నాయి.

సంతృప్తికరమైన జీవితం

మారియోన్‌: చాలా సంవత్సరాలపాటు మేము పలు సమావేశాలను ఏర్పాటు చేయడంలో సహాయం చేసే ఆధిక్యతను అనుభవించాం. ప్రత్యేకించి బర్దూలో 1966లో జరిగిన సమావేశం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు పోర్చుగల్‌లో యెహోవాసాక్షుల కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. అందుకే సమావేశ కార్యక్రమం, ఫ్రాన్స్‌కు రాగల సాక్షుల ప్రయోజనార్థం, పోర్చుగీస్‌ భాషలో కూడా సమర్పించబడింది. పోర్చుగల్‌ నుండి మన సహోదర సహోదరీలు వందలాదిమంది వచ్చారు, అయితే వారందరికీ వసతి ఏర్పాట్లు ఎలాగన్నది సవాలైంది. బర్దూలోని సాక్షుల ఇండ్లలో సరిపడేంత స్థలం లేదు కాబట్టి, ఖాళీగా ఉన్న ఒక సినిమా హాలును వసతి గృహంగా ఉపయోగించడానికి అద్దెకు తీసుకున్నాం. సీట్లన్నీ తీసేసి స్టేజి మీది కర్టెన్‌లను మధ్యకు కట్టి సహోదరులు ఒక వైపు, సహోదరీలు ఒక వైపు ఉండేలా ఆ హాలును రెండు భాగాలుగా ఏర్పాటు చేశాం. స్నానానికి షవర్లు, ముఖం కడుక్కోవడానికి వాష్‌ బేసిన్లు కూడా ఫిక్స్‌ చేశాం. నేలమీద ఎండుగడ్డి పరచి దాని మీద కాన్వాస్‌ కప్పాం. ఆ ఏర్పాటుతో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందారు.

సమావేశం సెషన్లు ముగిసిన తర్వాత మేము మన సహోదర సహోదరీలను కలవడానికి వసతి గృహానికి వెళ్లాం. అక్కడ అద్భుతమైన వాతావరణం నెలకొనివుంది. చాలా సంవత్సరాల వ్యతిరేకత మధ్య వారు చవిచూసిన అనుభవాలు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి! సమావేశం అయ్యాక వారు వెళ్ళిపోతున్నప్పుడు మేమందరమూ ఏడ్చాము.

దానికి రెండు సంవత్సరాల ముందు 1964లో, జిల్లా పైవిచారణకర్తగా సేవ చేయమన్నప్పుడు నాకు మరొక ఆధిక్యత లభించింది. కానీ నేను దానికి అర్హుడనేనా అని మళ్ళీ సందేహించాను. అయితే బాధ్యతాయుతులైన సహోదరులే ఆ నియామకాన్ని చేపట్టమని నన్ను అడిగారంటే, దాన్ని నిర్వహించే సమర్థుడనని వారు ఖచ్చితంగా భావించారని నాకు నేను చెప్పుకున్నాను. ఇతర ప్రయాణ పైవిచారణకర్తలతో కలిసి సేవ చేయడం ఎంతో చక్కని అనుభవం. నేను వారి నుండి చాలా నేర్చుకున్నాను. వారిలో చాలామంది సహనానికి, పట్టుదలకు నిజమైన ఉదాహరణలుగా ఉన్నారు, ఆ లక్షణాలు యెహోవా దృష్టిలో చాలా ముఖ్యమైనవి. మనం సహనాన్ని అలవరచుకుంటే, మనల్ని ఎలా ఆశీర్వదించాలో యెహోవాకు తెలుసు అనే విషయం నేను అర్థం చేసుకున్నాను.

1982లో, పారిస్‌ శివారుల్లోని బులోన్య బియాంకూర్‌లో 12 మంది పోలిష్‌ ప్రచారకులున్న ఒక గుంపును చూసుకొమ్మని బ్రాంచి కార్యాలయం కోరింది. అది ఆశ్చర్యం కలిగించింది. పోలిష్‌ భాషలో నాకు దైవపరిపాలనా పదాలు తెలుసు, కానీ వాక్య నిర్మాణం నాకు సమస్యగా ఉండేది. అయినా ఆ సహోదరుల ప్రేమపూర్వకమైన, ఇష్టపూర్వకమైన సహకారం నాకెంతో తోడ్పడింది. ఇప్పుడు ఆ సంఘంలో దాదాపు 170 మంది ప్రచారకులు ఉన్నారు, అందులో దాదాపు 60 మంది పయినీర్లు. ఆ తర్వాత రోసా, నేను ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీల్లోని పోలిష్‌ గుంపులను, సంఘాలను కూడా సందర్శించాం.

మారుతున్న పరిస్థితులు

వివిధ సంఘాలను సందర్శించడమే మా జీవితం, కానీ క్షీణిస్తున్న నా ఆరోగ్యం వల్ల మేము మా ప్రయాణ పరిచర్యను 2001లో ఆపేయవలసి వచ్చింది. మా చెల్లి రూత్‌ ఉంటున్న పితీవ్యె పట్టణంలోనే మాకు ఒక అపార్ట్‌మెంట్‌ దొరికింది. బ్రాంచి కార్యాలయం ఎంతో దయతో, మా పరిస్థితుల దృష్ట్యా అవసరమైన గంటలను తగ్గించి, మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా నియమించింది.

రోసా: ప్రాంతీయ సేవ ఆపేసిన తర్వాత మొదటి సంవత్సరం నాకు చాలా కష్టమనిపించింది. అది చాలా పెద్ద మార్పు, దానితో నాలో ఎందుకూ పనికిరాననే భావన కలిగింది. అప్పుడు నాకు నేను ఇలా చెప్పుకున్నాను, ‘నీకున్న సమయాన్ని, శక్తిని పయినీరుగా సేవ చేస్తూ ఇప్పటికీ ఉపయోగించవచ్చు.’ నేడు మా సంఘంలోని ఇతర పయినీర్లతో కలిసి పని చేస్తూ సంతోషంగా ఉన్నాను.

యెహోవా ఎల్లప్పుడూ మా పట్ల శ్రద్ధ చూపించాడు

మారియోన్‌: గత 48 సంవత్సరాలుగా రోసా నాకు తోడుగా ఉన్నందుకు, నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞుడ్ని. నేను ప్రయాణ పనిలో ఉన్న ఆ సంవత్సరాలన్నింటిలోను ఆమె నాకు గొప్ప సహాయకారిగా ఉంది. ‘మనం ఒకచోట స్థిరపడి, మనకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండేది’ అని ఆమె ఒక్కసారైనా అన్నట్లు నేను వినలేదు.

రోసా: కొన్నిసార్లు, “మీరు మామూలు జీవితం గడపడం లేదు. మీరు ఎప్పుడూ ఇతరులతో ఉంటారు” అని నాతో కొందరు అంటుండేవారు. కానీ నిజానికి “మామూలు జీవితం” అంటే ఏమిటి? తరచూ మనం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కొనసాగకుండా మనకు ఆటంకాలుగా మారగల అనేకమైన వాటిని మన చుట్టూ ఉంచుకుంటాము. మనకు నిజంగా కావలసిందల్లా ఒక మంచి మంచం, ఒక బల్ల, కొన్ని ఇతర ప్రాథమికమైనవి. పయినీర్లుగా మా దగ్గర వస్తుపరంగా ఉన్నవి చాలా తక్కువ, కానీ యెహోవా చిత్తం చేయడానికి కావలసినవన్నీ మా దగ్గర ఉన్నాయి. “మీకు సొంత ఇల్లు లేదు, పెన్షన్‌ కూడా రాదు కదా, మరి మీరు వృద్ధులైతే ఏమి చేస్తారు?” అనే ప్రశ్న కొన్నిసార్లు నాకు ఎదురైంది. అప్పుడు నేను, “యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు” అని చెబుతున్న కీర్తన 34:10లోని మాటలను ఉటంకించేదాన్ని. యెహోవా ఎల్లప్పుడూ మా గురించి శ్రద్ధ తీసుకున్నాడు.

మారియోన్‌: నిజమే! వాస్తవానికి యెహోవా మాకు అవసరమైన దానికంటె ఎంతో ఎక్కువ ఇచ్చాడు. ఉదాహరణకు 1958లో, న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి మా సర్క్యూట్‌ నుండి నేను ప్రతినిధిగా ఎంపికయ్యాను. అయితే రోసాకు టిక్కెట్‌ కొనగలిగేంత డబ్బు మా దగ్గర లేదు. ఒక సాయంకాలం ఒక సహోదరుడు “న్యూయార్క్‌” అని వ్రాసి ఉన్న ఒక కవరు మా చేతికిచ్చాడు. అందులో ఉన్న కానుక రోసాకు టిక్కెట్‌ కొనడానికి తోడ్పడింది!

యెహోవా సేవలో మేము గడిపిన సంవత్సరాల గురించి నేను గానీ రోసా గానీ ఎన్నడూ చింతించలేదు. పూర్తికాల సేవలో మేము కోల్పోయింది ఏమీ లేదు కానీ పొందినవి ఎన్నో ఉన్నాయి​—⁠సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితం. యెహోవా ఎంతో అద్భుతమైన దేవుడు. మేము ఆయనపై పూర్తిగా నమ్మకముంచడం నేర్చుకున్నాం, ఆయన పట్ల మా ప్రేమ ప్రగాఢమైంది. మన క్రైస్తవ సహోదరుల్లో కొందరు తమ విశ్వసనీయత కోసం ప్రాణాలనే కోల్పోయారు. అయితే, ఒక వ్యక్తి తన జీవితాన్ని కొద్ది కొద్దిగా అనేక సంవత్సరాలపాటు అర్పించవచ్చునని నేను నమ్ముతున్నాను. రోసా, నేనూ ఇప్పటివరకూ అలా చేయడానికే కృషి చేశాము, భవిష్యత్తులో కూడా అలాగే చేయాలన్నది మా కృత నిశ్చయం.

[అధస్సూచి]

^ పేరా 14 లూయీ ప్యెషుతా జీవిత కథ, “‘మరణ యాత్ర’ నుండి నేను బయటపడ్డాను,” కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1980లో ప్రచురించబడింది.

[20వ పేజీలోని చిత్రం]

1930 ప్రాంతంలో ఫ్రాస్వా, అన్నా షుమీగా, వారి పిల్లలు స్తిఫనీ, స్తిఫాన్‌, మిలనీ, మారియోన్‌. స్టూలు మీద నిలబడి ఉన్నది మారియోన్‌

[22వ పేజీలోని చిత్రం]

పైన: 1950లో, ఉత్తర ఫ్రాన్సులోని అర్మోత్యేర్‌లోని ఒక దుకాణంలో బైబిలు సాహిత్యాలను ప్రతిపాదించడం

[22వ పేజీలోని చిత్రం]

ఎడమ: 1950లో, స్తిఫాన్‌ బెహూనిక్‌ మారియోన్‌తో

[23వ పేజీలోని చిత్రం]

మారియోన్‌, రోసాల పెళ్ళికి ఒకరోజు ముందు

[23వ పేజీలోని చిత్రం]

రోసా (ఎడమవైపు చివర) తన పయినీరు భాగస్వామి ఇర్రేన (ఎడమ నుండి నాలుగవ స్థానం)తో, 1951లో జరగబోయే సమావేశం గురించి ప్రకటిస్తున్నారు

[23వ పేజీలోని చిత్రం]

ప్రయాణ సందర్శనాలకు సైకిలే ముఖ్య వాహనం