కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషంగా ఉండడానికి నిజంగా ఏమి అవసరము?

సంతోషంగా ఉండడానికి నిజంగా ఏమి అవసరము?

సంతోషంగా ఉండడానికి నిజంగా ఏమి అవసరము?

సంతోషంగా ఉండడానికి ఏమి అవసరమో, “సంతోషముగల దేవుడు” అయిన యెహోవాకు, “సంతోషించే అద్వితీయ అధిపతి” అయిన యేసుక్రీస్తుకు అందరికంటే బాగా తెలుసు. (1 తిమోతి 1:​11; 6:​15, NW) కాబట్టి సంతోషానికి కీలకమేమిటో దేవుని వాక్యమైన బైబిలు చెబుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.​—⁠ప్రకటన 1:⁠3; 22:⁠7.

యేసు ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగంలో, సంతోషంగా ఉండడానికి ఏమి అవసరమో వివరించాడు. (1) తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు, (2) దుఃఖపడేవారు, (3) సాత్వికులు, (4) నీతికొరకు ఆకలిదప్పులు గలవారు, (5) కనికరముగలవారు, (6) హృదయశుద్ధిగలవారు, (7) సమాధానపరచువారు, (8) నీతినిమిత్తము హింసించబడుతున్నవారు, (9) ఆయన నిమిత్తము నిందించబడి హింసించబడుతున్నవారు “ధన్యులు” అని లేక సంతోషంగా ఉంటారు అని ఆయన పేర్కొన్నాడు.​—⁠మత్తయి 5:​3-11. *

యేసు వ్యాఖ్యానాలు సరైనవేనా?

యేసు చేసిన కొన్ని వ్యాఖ్యానాల సత్యత్వానికి కాస్త వివరణ అవసరం. హృదయశుద్ధితో పురికొల్పబడే సాత్వికుడు, కనికరముగల వ్యక్తి, సమాధానపరిచే వ్యక్తి, కోపిష్ఠి, జగడమాడే వ్యక్తి, కనికరము లేని వ్యక్తి కంటే సంతోషంగా ఉంటాడనే విషయాన్ని ఎవరు కాదంటారు?

అయితే, నీతికోసం ఆకలిదప్పులు గలవారు లేక దుఃఖపడుతున్నవారు సంతోషంగా ఎలా ఉండగలరని మనం ఆశ్చర్యపోవచ్చు. అటువంటి వారికి లోక పరిస్థితుల పట్ల వాస్తవిక దృక్పథం ఉంటుంది. వారు మన కాలంలో ‘జరుగుతున్న హేయకృత్యముల గూర్చి మూల్గులిడుచు ప్రలాపిస్తారు.’ (యెహెజ్కేలు 9:⁠4) అయితే అలాంటి దృక్పథం మాత్రమే వారికి సంతోషాన్నివ్వదు. ఈ భూమిపైకి నీతియుక్తమైన పరిస్థితులను తీసుకురావాలనే, అణచివేతకు గురైన వారికి న్యాయం చేకూర్చాలనే దేవుని సంకల్పం గురించి తెలుసుకున్నప్పుడు, వారి ఆనందానికి అవధులుండవు.​—⁠యెషయా 11:​3, 4.

నీతి పట్ల ప్రేమ, సరైనది చేయడంలో తరచూ విఫలమవుతున్నందుకు దుఃఖించేలా కూడా చేస్తుంది. కాబట్టి వారు తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తిస్తారు. అటువంటివారు దేవుని మార్గదర్శకం కోసం చూడడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ప్రజలు తమ బలహీనతలను అధిగమించేందుకు దేవుడు మాత్రమే సహాయం చేయగలడని వారు గ్రహిస్తారు.​—⁠సామెతలు 16:​3, 9; 20:​24.

దుఃఖపడేవారికి, నీతికోసం ఆకలిదప్పులు గలవారికి, తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించిన వారికి సృష్టికర్తతో మంచి సంబంధం ఏర్పరచుకోవలసిన ఆవశ్యకత గురించి తెలుసు. మానవులతో మంచి సంబంధం ఏర్పరచుకోవడం సంతోషానికి దోహదపడుతుంది, కానీ దేవునితో మంచి సంబంధం ఏర్పరచుకోవడం దానికంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అవును సరైనదాన్ని ప్రేమించే ఆలోచనాపరులు, దైవిక మార్గదర్శకాన్ని అంగీకరించడానికి ఇష్టపడేవారు నిజంగా సంతోషంగా ఉంటారని అనవచ్చు.

అయినా హింసించబడుతున్నవారు, నిందించబడుతున్నవారు సంతోషంగా ఉండగలరంటే నమ్మడానికి మీకు కష్టంగా ఉండవచ్చు. కానీ ఆ మాటలు యేసే స్వయంగా అన్నాడు కాబట్టి అది తప్పకుండా నిజమైవుండాలి. అలాగైతే ఆయన మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?

హింసించబడుతున్నా సంతోషంగా ఉంటారు—⁠అదెలా సాధ్యం?

నింద, హింస సంతోషాన్నిస్తాయని యేసు చెప్పలేదన్న విషయం గమనించండి. ఆయనిలా స్పష్టంగా చెప్పాడు: ‘నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు.’ (మత్తయి 5:​10, 11) కాబట్టి, ఒక వ్యక్తి క్రీస్తును అనుసరిస్తున్న కారణంగా లేక తన జీవితాన్ని యేసు బోధించిన నీతి సూత్రాలకు అనుగుణంగా మలుచుకొంటున్న కారణంగా నిందలపాలైనప్పుడు మాత్రమే అతనికి సంతోషం కలుగుతుంది.

ఈ విషయం తొలి క్రైస్తవులకు ఎదురైన అనుభవం ద్వారా స్పష్టమైంది. యూదుల మహాసభ సభ్యులు, “అపొస్తలులను పిలిపించి కొట్టించి​—⁠యేసు నామమునుబట్టి బోధింప కూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.” దానికి అపొస్తలులు ఎలా స్పందించారు? “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (ఇటాలిక్కులు మావి.)​—⁠అపొస్తలుల కార్యములు 5:​40-42; 13:​50-52.

నిందకు, సంతోషానికీ మధ్య ఉన్న సంబంధంపై అపొస్తలుడైన పేతురు మరింత వెలుగును ప్రసరింపజేశాడు. ఆయనిలా వ్రాశాడు: “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.” (1 పేతురు 4:​14) అవును సరైనదాన్ని చేస్తున్నందుకు ఒక క్రైస్తవుడిగా బాధ అనుభవించడం ప్రీతిదాయకంగా ఉండనప్పటికీ అది మనకు సంతోషాన్నిస్తుంది, మనం బాధ అనుభవిస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మను పొందుతామని తెలుసుకోవడం ద్వారా ఆ సంతోషం కలుగుతుంది. ఇక్కడ దేవుని ఆత్మ సంతోషంతో ఎందుకు జతచేయబడింది?

శరీరకార్యాలా లేక ఆత్మఫలమా?

దేవుడే పాలకుడని ఎంచి ఆయనకు విధేయులుగా ఉండేవారికే ఆయన పరిశుద్ధాత్మ లభిస్తుంది. (అపొస్తలుల కార్యములు 5:​32) యెహోవా “శరీరకార్యములను” అభ్యసించే వారికి తన ఆత్మను ఇవ్వడు. అవేవంటే, “జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి.” (గలతీయులు 5:​19-21) నిజమే, నేటి లోకంలో “శరీరకార్యములు” ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వాటిని అభ్యసించే వారు నిజమైన, శాశ్వతమైన సంతోషాన్ని పొందరు. బదులుగా, అలాంటి కార్యములను చేసేవారు తమ బంధువులతో, స్నేహితులతో, పరిచయస్థులతో ఉన్న మంచి సంబంధాన్ని పాడు చేసుకుంటారు. అంతేకాక, “ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని” దేవుని వాక్యం తెలియజేస్తోంది.

దానికి భిన్నంగా, “ఆత్మ ఫలమును” అలవరచుకునే వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఈ ఫలంలో ఉన్న లక్షణాలేమిటంటే, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” (గలతీయులు 5:​22) ఎప్పుడైతే మనం ఈ లక్షణాలను కనబరుస్తామో, అప్పుడు మనం ఇతరులతోను దేవునితోను సమాధానకరమైన సంబంధాలను ఏర్పరచుకొనే పరిస్థితులను కల్పించుకుంటాం, తద్వారా నిజమైన సంతోషం కలుగుతుంది. (బాక్సు చూడండి.) మరింత ముఖ్యంగా, ప్రేమ, దయాళుత్వము, మంచితనముతోపాటు ఇతర దైవిక లక్షణాలను చూపించడం ద్వారా మనం యెహోవాను సంతోషపరుస్తాము, దేవుని నీతియుక్తమైన నూతనలోకంలో నిత్యం జీవించే సంతోషభరితమైన నిరీక్షణా ఉంటుంది.

సంతోషం ఒక ఎంపిక

వోల్ఫ్‌గాంగ్‌, బ్రీగిట్‌ అనే దంపతులు జర్మనీలో ఉంటున్నారు, వారు బైబిలు అధ్యయనాన్ని హృదయపూర్వకంగా ఆరంభించారు, అయితే సంతోషంగా ఉండడానికి అవసరమైనవి అని ప్రజలు భావించే వస్తుసంపదలెన్నో వాళ్ళదగ్గర అప్పటికే ఉన్నాయి. వారు యౌవనంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఖరీదైన బట్టలు ధరించేవారు, విలాసవంతంగా ఉండే ఇంట్లో ఉన్నారు, మంచి వ్యాపారమూ ఉంది. అయినా వారు మరిన్ని వస్తుసంపదలను సమకూర్చుకోవడానికే తమ సమయాన్ని ఎక్కువగా గడిపారు, కానీ అది వారికి నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత వోల్ఫ్‌గాంగ్‌, బ్రీగిట్‌లు ఒక ముఖ్యమైన ఎంపిక చేసుకున్నారు. వారు ఆధ్యాత్మిక విలువలకు ఎక్కువ సమయాన్ని అంకితం చేయడం, యెహోవాకు సన్నిహితమవడానికి మార్గాలను వెదకడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. వారి ఎంపిక త్వరలోనే వారి వైఖరిలో మార్పు తెచ్చింది, తత్ఫలితంగా వారు తమ జీవితాన్ని సరళం చేసుకొని పయినీర్లుగా లేక పూర్తికాల రాజ్య సువార్తికులుగా సేవ చేసేందుకు పురికొల్పబడ్డారు. వారిప్పుడు జర్మనీలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో స్వచ్ఛంద సేవకులుగా సేవ చేస్తున్నారు. దానితోపాటు, దేవుని వాక్యమైన బైబిలులోని సత్యాన్ని నేర్చుకోవడానికి విదేశీయులకు సహాయపడేందుకు వారు ఒక ఆసియా భాష కూడా నేర్చుకుంటున్నారు.

ఈ దంపతులు నిజమైన సంతోషాన్ని పొందారా? వోల్ఫ్‌గాంగ్‌ ఇలా అంటున్నాడు: “మేము ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా నిమగ్నులం అయినప్పటి నుండి, సంతోషంగా ఉంటూ మరింత సంతృప్తిని పొందుతున్నాము. యెహోవాను పూర్ణహృదయంతో సేవించడం వల్ల మా వైవాహిక బంధం కూడా బలోపేతమైంది. మా దాంపత్య జీవితం ఇంతకు ముందు సంతోషంగా ఉండేది, కానీ మా బాధ్యతలు, ఆసక్తులు మమ్మల్ని భిన్న దిశల్లో నడిపించేవి. ఇప్పుడు మేము ఐక్యంగా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.”

సంతోషంగా ఉండడానికి ఏమి అవసరము?

టూకీగా చెప్పాలంటే, “శరీరకార్యములను” వదిలేసి దేవుని “ఆత్మఫలమును” వృద్ధి చేసుకోవాలి. సంతోషంగా ఉండాలంటే, దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండడానికి తపనపడాలి. దీన్ని పొందడానికి ఎవరు కృషి చేస్తారో వారు, ధన్యులని లేదా సంతోషంగా ఉంటారని యేసు చేసిన వర్ణనకు సరిపోతారు.

కాబట్టి సంతోషాన్ని ఎన్నడూ పొందలేమని పొరపాటు పడకండి. ప్రస్తుతం మీరు సంపూర్ణ ఆరోగ్యంతో లేకపోవచ్చు లేదా మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. పిల్లల్ని కనే వయసు దాటిపోయి ఉండవచ్చు లేదా మంచి జీవనోపాధి మార్గం కోసం తంటాలుపడుతుండవచ్చు. ఇంతకు ముందులాగ మీ జేబు నిండుగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ ధైర్యంగా ఉండండి, మీరు నిరాశ చెందడానికి ఏ కారణమూ లేదు! దేవుని రాజ్య పరిపాలన ఇలాంటి సమస్యలనేకాక ఇంకా వందలాది సమస్యలను పరిష్కరిస్తుంది. వాస్తవానికి యెహోవా దేవుడు కీర్తనకర్త ద్వారా వ్యక్తం చేసిన ఈ వాగ్దానాన్ని త్వరలోనే నెరవేరుస్తాడు: “నీ రాజ్యము శాశ్వతరాజ్యము . . . నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్తన 145:​13, 16) యెహోవా చేసిన ప్రోత్సాహకరమైన ఈ వాగ్దానాన్ని మనసులో ఉంచుకోవడం నేడు మీ సంతోషానికి ఎంతో దోహదపడుతుందని చెప్పడానికి, ప్రపంచమంతటా ఉన్న లక్షలాదిమంది యెహోవా సేవకులే నిదర్శనం.​—⁠ప్రకటన 21:⁠3.

[అధస్సూచి]

^ పేరా 3 యేసు చేసిన ఈ వ్యాఖ్యానాల్లో ప్రతి ఒక్కటి, మకారీయి అనే గ్రీకు పదంతో ముగుస్తున్నాయి. కొన్ని అనువాదాలు దీన్ని “ధన్యులు” అని తర్జుమా చేశాయి, కానీ నూతనలోక అనువాదం మరియు కొన్ని ఇతర అనువాదాలు “సంతోషంగా ఉంటారు” అనే మరింత సరైన మాటలను ఉపయోగించాయి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

సంతోషానికి దోహదపడే అంశాలు

ప్రేమ ఇతరులు మిమ్మల్ని తిరిగి ప్రేమించేలా పురికొల్పుతుంది.

సమాధానం మీ సంబంధాల్లో గొడవలు లేకుండా తోడ్పడుతుంది.

దీర్ఘశాంతం మీకు పరీక్షలు ఎదురైనా మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది.

దయాళుత్వం ఇతరులను మీవైపు ఆకర్షిస్తుంది.

మంచితనం చూపిస్తే, మీకు సహాయం అవసరమైనప్పుడు ఇతరులు సంతోషంగా స్పందిస్తారు.

విశ్వాసం దేవుని ప్రేమపూర్వక మార్గనిర్దేశంపై మీకు నమ్మకం కలిగిస్తుంది.

సాత్వికం మీ మనస్సుకు, హృదయానికి, శరీరానికి ప్రశాంతత తెస్తుంది.

ఆశానిగ్రహం ఉంటే మీ పొరపాట్లు తక్కువవుతాయి.

[7వ పేజీలోని చిత్రాలు]

సంతోషం పొందాలంటే, మీరు మీ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవాలి