కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషం కోసం అన్వేషణ

సంతోషం కోసం అన్వేషణ

సంతోషం కోసం అన్వేషణ

“సంతోషంగా ఉండడానికి ఏమి అవసరము?” అని కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రేట్‌ బ్రిటన్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రజలను ప్రశ్నించడం జరిగింది. అలా ఇంటర్వ్యూ చేయబడినవారిలో 89 శాతం మంది సంతోషంగా ఉండాలంటే మంచి ఆరోగ్యం అవసరం అన్నారు; 79 శాతం మంది సంతృప్తికరమైన కుటుంబ జీవితం లేక భాగస్వామ్యం అన్నారు; 62 శాతం మంది తల్లిదండ్రులవడం ద్వారా లభించే ప్రతిఫలాలు అన్నారు; 51 శాతం మంది విజయవంతమైన జీవనోపాధి మార్గం అవసరం అన్నారు. డబ్బు సంతోషానికి హామీ ఇవ్వదని చాలామంది అంగీకరించినా, అలా ప్రశ్నించబడినవారిలో 47 శాతం మంది డబ్బుంటే సంతోషంగా ఉండవచ్చనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. మరి వాస్తవాలు ఏమి చూపిస్తున్నాయి?

మొదట, డబ్బుకీ సంతోషానికీ మధ్య ఉన్నట్లు చెప్పబడుతున్న సంబంధాన్ని చూడండి. అమెరికాలోని వందమంది ధనవంతులను సర్వే చేసినప్పుడు, వారు సాధారణ ప్రజలకంటే ఏమంత సంతోషంగా లేరన్న విషయం వెల్లడయింది. అంతేకాక, గత మూడు దశాబ్దాల్లో అమెరికాలోని చాలామంది తమ ఆస్తులను దాదాపు రెట్టింపు చేసుకున్నారు, కానీ వారు అంతకుముందు కంటే ఎక్కువ సంతోషాన్నేమీ పొందడం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఒక నివేదిక ఇలా వివరిస్తోంది: “కృంగుదల రేటు చాలా పెరిగిపోయింది. కౌమారదశలోని ఆత్మహత్యలు మూడింతలు పెరిగాయి. విడాకులు రెండింతలు పెరిగాయి.” దాదాపు 50 దేశాల్లో, డబ్బుకీ సంతోషానికీ మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనం చేసిన పరిశోధకులు, డబ్బు సంతోషాన్ని కొనలేదనే ముగింపుకు వచ్చారు.

మరి మంచి ఆరోగ్యం, సంతృప్తికరమైన కుటుంబ జీవితం, విజయవంతమైన జీవనోపాధి మార్గం వంటివి సంతోషానికి ఎంత ప్రాముఖ్యం? సంతోషంగా ఉండడానికి అవే ప్రాముఖ్యమైతే, మంచి ఆరోగ్యం, సంతృప్తికరమైన కుటుంబ జీవితం లేని లక్షలాది మంది సంగతేమిటి? పిల్లలులేని దంపతుల, విజయవంతమైన జీవనోపాధి మార్గం లేని స్త్రీపురుషుల విషయమేమిటి? అలాంటి వాళ్లందరికీ సంతోషం లేని జీవితమిక తప్పదా? మంచి ఆరోగ్యం వల్ల, సంతృప్తికరమైన కుటుంబ జీవితం వల్ల ప్రస్తుతం సంతోషంగా ఉంటున్నామని భావిస్తున్న వారి పరిస్థితిలో ఏదైనా మార్పువచ్చినా ఆ సంతోషం కనుమరుగై పోతుందా?

సరైన స్థలాల్లోనే అన్వేషిస్తున్నామా?

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు, ఎందుకంటే మానవులను సృష్టించిన సృష్టికర్త “సంతోషముగల దేవుడు” అని వర్ణించబడ్డాడు, మానవులు దేవుని స్వరూపములో సృష్టించబడ్డారు. (1 తిమోతి 1:⁠11, NW; ఆదికాండము 1:​26, 27) ఆ కారణంగా, మానవులు సంతోషం కోసం అన్వేషించడం సహజమైనదే. అయితే సంతోషాన్ని నిలుపుకోవడం అంటే పిడికిట్లో ఇసుక రేణువులను పట్టుకోవడం వంటిది అని చాలామంది గ్రహించారు​—⁠అవి రెండూ సులభంగా చేజారిపోతాయి.

అయితే కొందరు సంతోషం కోసం అతిగా ప్రయత్నించడమే అది చేజారిపోవడానికి కారణమా? సమాజ తత్త్వవేత్త అయిన ఎరిక్‌ హోఫర్‌ అలాగే భావించాడు. ఆయనిలా ప్రకటించాడు: “సంతోషం కోసం అన్వేషించడమే సంతోషం లేకపోవడానికి ఒక ప్రధాన కారణం.” మనం సంతోషం కోసం తప్పు స్థలాల్లో వెదకితే ఆ మాటలు అక్షరాలా నిజమవుతాయి. అలా వెదకినట్లయితే మనకు నిస్సందేహంగా నిరాశా నిస్పృహలే ఎదురవుతాయి. ధనవంతులు కావాలని ప్రయత్నించడం; పేరుప్రతిష్ఠల కోసం పోటీపడడం; రాజకీయపరమైన, సామాజికపరమైన, ఆర్థికపరమైన లక్ష్యాలను సాధించడానికి కృషి చేయడం; స్వయంతృప్తి కోసమే జీవించడం, తక్షణ తృప్తి పొందడం వంటివన్నీ మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. ఒక రచయిత్రి వెల్లడి చేసిన పూర్తి విరుద్ధమైన దృక్పథాన్ని కొందరు అలవరచుకున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు, ఆమె ఇలా వ్రాసింది: “మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం మానేస్తే ఎంతో సంతోషంగా ఉండవచ్చు!”

ఈ ఆర్టికల్‌ మొదట్లో పేర్కొన్న ప్రజాభిప్రాయాల్లో, 10 మందిలో నలుగురు ఇతరులకు మంచి చేయడంలోను, సహాయం చేయడంలోను సంతోషం పొందవచ్చని భావించడం గమనార్హం. సంతోషంగా ఉండడంలో విశ్వాసం, మత నమ్మకం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నలుగురిలో ఒక్కరు చెప్పారు. దీన్నిబట్టి నిజంగా సంతోషంగా ఉండడానికి ఏమి అవసరమో మనం జాగ్రత్తగా పరిశీలించాలని స్పష్టమవుతోంది. అలా పరిశీలించడానికి దీని తర్వాతి ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది.

[3వ పేజీలోని చిత్రాలు]

సంతోషానికి కీలకం డబ్బు, సంతృప్తికరమైన కుటుంబ జీవితం, లేక విజయవంతమైన జీవనోపాధి మార్గం అని చాలామంది భావిస్తారు. మీరు దానికి అంగీకరిస్తారా?