కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చెస్టర్‌ బీటీ సంపదల పరిశీలన

చెస్టర్‌ బీటీ సంపదల పరిశీలన

చెస్టర్‌ బీటీ సంపదల పరిశీలన

“ప్రస్తుతం ఉనికిలో లేని ఎన్నో నాగరికతలకు చెందిన సంపదలతో నిండివుంటుంది, . . . సూక్ష్మచిత్రాల మరియు వర్ణచిత్రాల ప్రకాశవంతమైన వెలుగులో కన్నుల పండుగగా ఉంటుంది.” ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లోవున్న చెస్టర్‌ బీటీ లైబ్రరీ మాజీ నిర్వాహకుడైన ఆర్‌. జె. హేయిస్‌ ఆ లైబ్రరీని పై మాటల్లో క్లుప్తంగా వర్ణించాడు. అమూల్యమైన ప్రాచీన వస్తువులు, అపురూపమైన కళాఖండాలు, అరుదైన పుస్తకాలు, వెలకట్టలేనంత విలువైన వ్రాతప్రతుల విస్తారమైన సంచయానికి అది నెలవు. ఇంతకీ చెస్టర్‌ బీటీ ఎవరు? ఆయన ఎలాంటి సంపదలను సేకరించాడు?

అమెరికాలోని న్యూయార్క్‌లో 1875లో జన్మించిన ఆల్‌ఫ్రెడ్‌ చెస్టర్‌ బీటీ స్కాటిష్‌, ఐరిష్‌, ఇంగ్లీష్‌ వంశాలకు చెందినవాడు. ఆయనకు 32 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఆయన గనుల ఇంజనీరుగా, సలహాదారునిగా ఎంతో ధనం సంపాదించుకున్నాడు. ఆయన తన జీవితం అంతటిలోను తన సంపదలో చాలాభాగం అందమైన, శ్రేష్ఠమైన వస్తువులను సేకరించడానికి ఉపయోగించాడు. బీటీ 1968లో 92 సంవత్సరాల వయసులో మరణించినప్పుడు తన సంచయాన్నంతటిని ఐర్లాండ్‌ ప్రజలకు వదిలిపెట్టాడు.

ఆయన ఏమి సేకరించాడు?

బీటీ సేకరించిన వస్తువులు విస్తృతమైనవి, విభిన్నమైనవి. ఆయన సేకరించిన వస్తువులు ప్రదర్శించబడేటప్పుడు, ఒక్కో ప్రదర్శనలో కేవలం 1 శాతం మాత్రమే ప్రదర్శించబడతాయి. ఆయన వివిధ కాలాలకు చెందిన వస్తువులను, వేలాది సంవత్సరాలపాటు కొనసాగిన సంస్కృతులకు చెందిన వస్తువులను సేకరించాడు. మధ్యయుగంలోని మరియు పునర్జాగరణోద్యమ కాలంలోని యూరప్‌కు చెందిన, అనేక ఆసియా దేశాలకు మరియు ఆఫ్రికా దేశాలకు చెందిన అరుదైన అమూల్యమైన వస్తువులను సేకరించాడు. ఉదాహరణకు ఆయన సేకరించిన అందమైన జాపనీస్‌ చెక్కదిమ్మలతో అచ్చొత్తిన చిత్రాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిలో భాగంగా పరిగణించబడుతున్నాయి.

ఇలాంటి కళాత్మకమైన వస్తువులకు పూర్తి భిన్నంగా, ప్రాచీన కీలలిపి వ్రాతగల వందకంటే ఎక్కువ బాబిలోనియన్‌ మరియు సుమేరియన్‌ మట్టి పలకల ఆసక్తికరమైన సంచయాన్ని కూడా ఆయన సేకరించాడు. 4,000 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం మెసపొతమియలో జీవించిన ప్రజలు తమ జీవితాల గురించి తడి ఆరని మట్టి పలకలపై వివరంగా వ్రాసి, ఆ తర్వాత ఆ పలకలు గట్టి పడడానికి వాటిని కాల్చారు. వ్రాయడం ఎంత పురాతనమైనదో స్పష్టంగా రుజువు చేస్తూ అలాంటి ఎన్నో పలకలు మనకాలం వరకూ భద్రంగా ఉన్నాయి.

పుస్తకాల పట్ల ఆకర్షణ

చక్కని పుస్తకాలు తయారుచేయడానికి కావలసిన కళాత్మకమైన పనితనం చెస్టర్‌ బీటీని ఆకర్షించిందని తెలుస్తోంది. ఆయన ఎంతో సునిశితంగా అలంకరించబడిన ఖురాన్‌ గ్రంథాలతో పాటు వేలాది లౌకిక పుస్తకాలను, మత సంబంధ పుస్తకాలను సేకరించాడు. ఆయన “అరబిక్‌ లిపికి ఉన్న గణిత శాస్త్ర నిష్పత్తులను చూసి ముగ్ధుడయ్యాడు . . . అక్షరాలను బంగారు మరియు వెండి రేకుతోను ఇతర ప్రకాశవంతమైన ఖనిజాలతోను అలంకరించడాన్ని చూసినప్పుడు కళాసౌందర్యం పట్ల ఆయనకున్న ప్రశంసాభావం అధికమయ్యేది” అని ఒక రచయిత చెప్పారు.

పచ్చరాళ్ళు, తొలి శతాబ్దాలకు చెందిన చైనా చక్రవర్తులను ఎంతో ఆకర్షించినట్లే చెస్టర్‌ బీటీని కూడా ఆకర్షించాయి. చైనా చక్రవర్తులు స్వచ్ఛమైన పచ్చలను ఖనిజాలు అన్నింటికంటే ఎక్కువ విలువైనవిగా, బంగారం కంటే కూడా విలువైనవిగా పరిగణించేవారు. ఈ పరిపాలకులు పచ్చరాళ్ళ ఖండాలను మృదువైన పలుచని రేకుల్లా చేయడానికి నైపుణ్యంగల పనివాళ్ళను నియమించారు. ఆ తర్వాత నిపుణులైన కళాకారులు ఆ పచ్చరాళ్ళ పేజీలపై బంగారంతో సున్నితంగా అక్షరాలను చిత్రాలను చెక్కి అత్యంత ఆశ్చర్యజనకమైన పుస్తకాలను తయారు చేశారు. బీటీ సేకరించిన ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి.

అమూల్యమైన బైబిలు వ్రాతప్రతులు

బైబిలును ప్రేమించేవారికి చెస్టర్‌ బీటీ సంపదలలో అత్యంత విలువైనవి, ఆయన సేకరించిన అనేక ప్రాచీన మరియు మధ్యయుగానికి చెందిన బైబిలు వ్రాతప్రతులే. అందంగా అలంకరించబడిన ఆ వ్రాతప్రతులు, వాటిని చేతి ద్వారా నకలు చేసిన లేఖికుల ఓపికను పనితనాన్ని ప్రదర్శిస్తాయి. ముద్రిత పుస్తకాలు, తొలికాలాల్లో పుస్తకాలు బైండ్‌ చేసేవారి మరియు ప్రచురించేవారి నైపుణ్యాన్నీ పనితనాన్నీ ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు, బిబ్లియా లాటినాను 1479లో ఆన్టోన్‌ కోబెర్గర్‌ ప్రచురించాడు. జోహెన్నస్‌ గుటెన్‌బర్గ్‌ కాలంలో జీవించిన ఆయన “తొలి ప్రకాశకుల్లో అత్యంత ముఖ్యమైన మరియు చురుకైన వ్యక్తుల్లో ఒకరు” అని వర్ణించబడ్డాడు.

చెస్టర్‌ బీటీ లైబ్రరీలో ప్రదర్శించబడేవాటిలో, సిరియా విద్వాంసుడైన ఎఫ్రాయిమ్‌ వ్రాసిన నాలుగవ శతాబ్దానికి చెందిన తోలుకాగితపు వ్రాతప్రతి విశిష్టమైనది. ఎఫ్రాయిమ్‌ రెండవ శతాబ్దానికి చెందిన థియాటెస్సరోన్‌ అనే గ్రంథంలోని భాగాలను తన పుస్తకంలో ఉల్లేఖించాడు. ఆ గ్రంథాన్ని వ్రాసిన టాషెన్‌ యేసుక్రీస్తు జీవితం గురించి చెప్పే నాలుగు సువార్త వృత్తాంతాలను కలిపి ఒకే కథనంగా చేశాడు. ఆ తర్వాత రచయితలు థియాటెస్సరోన్‌ గురించి తమ రచనల్లో ప్రస్తావించారు కానీ ఆ గ్రంథపు ప్రతులు ఉనికిలో లేకుండా పోయాయి. 19వ శతాబ్దానికి చెందిన కొంతమంది విద్వాంసులు దాని ఉనికిని సందేహించారు కూడా. అయితే 1956లో బీటీ, టాషెన్‌ వ్రాసిన థియాటెస్సరోన్‌పై ఎఫ్రాయిమ్‌ వ్రాసిన వ్యాఖ్యాన గ్రంథాన్ని కనుగొన్నాడు. బైబిలు ప్రామాణికత్వాన్ని, వాస్తవికతను రుజువుచేసే ఆధారాలకు ఆ గ్రంథం కూడా తోడయ్యింది.

పపైరస్‌ వ్రాతప్రతుల నిధి

బీటీ మత సంబంధమైన మరియు లౌకికమైన పపైరస్‌ (రెల్లు కాగితపు) వ్రాతప్రతులను కూడా చాలా పెద్ద సంఖ్యలో సేకరించాడు. 50 కంటే ఎక్కువ కోడెక్స్‌లు (పపైరస్‌ వ్రాతప్రతి పుస్తకాలు) సా.శ. నాలుగవ శతాబ్దం కంటే పురాతనమైనవి. వాటిలో కొన్ని ఎన్నో శతాబ్దాలుగా ఐగుప్తు ఎడారిలో చెత్తకాగితాల కుప్పలా పడివున్న పపైరస్‌ కుప్పల్లోనుండి సేకరించబడినవి. ఆ పపైరస్‌ దస్తావేజులను అమ్మకానికి పెట్టినప్పుడు వాటిలో చాలామట్టుకు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. వర్తకులు పపైరస్‌ ముక్కలతో నిండివున్న అట్టపెట్టెలతో వచ్చేవారు. “వాటిని కొనాలనుకునేవారు ఆ అట్టపెట్టెలలో చెయ్యి పెట్టి అన్నింటికంటే పెద్ద ముక్కను తీసుకునేవారు” అని చెస్టర్‌ బీటీ లైబ్రరీకి చెందిన వెస్టర్న్‌ కలెక్షన్స్‌ నిర్వాహకుడు చార్లెస్‌ హార్టన్‌ చెబుతున్నారు.

బీటీ “కనుగొన్నవాటిలో అత్యంత గమనార్హమైనవి,” విలువైన బైబిలు కోడెక్స్‌లేనని, “వాటిలో అత్యంత పురాతనమైన క్రైస్తవ పాత నిబంధన ప్రతులు, క్రొత్త నిబంధన ప్రతులు ఉన్నాయి” అని హార్టన్‌ చెబుతున్నారు. ఆ కోడెక్స్‌ల విలువ తెలిసిన వర్తకులు వాటిని వివిధ కొనుగోలుదారులకు అమ్మడానికి వాటిని చింపివుండేవారే. అయితే బీటీ ఆ కోడెక్స్‌లలో అధికశాతాన్ని తానే కొనగలిగాడు. ఆ కోడెక్స్‌లు ఎంత ప్రాముఖ్యమైనవి? 1844లో టిషెండార్ఫ్‌, సినాయిటికస్‌ కోడెక్స్‌ను కనుగొన్న తర్వాత “ఇప్పటివరకూ ఇదే అత్యంత ప్రాముఖ్యమైన” ఆవిష్కరణ అని సర్‌ ఫ్రెడ్‌రిక్‌ కెన్యాన్‌ వివరిస్తున్నారు.

ఈ కోడెక్స్‌లు సా.శ. రెండవ మరియు నాలుగవ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవి. గ్రీకు సెప్టాజింట్‌ అనువాదంలోని హీబ్రూ లేఖనాల పుస్తకాల్లో ఆదికాండానికి సంబంధించిన రెండు ప్రతులు ఉన్నాయి. అవి ఎంతో విలువైనవి ఎందుకంటే నాలుగవ శతాబ్దానికి చెందిన తోలుకాగితపు వ్రాతప్రతులైన “వాటికానస్‌ మరియు సినాయిటికస్‌లలో [ఆదికాండము] అసలు లేదు” అని కెన్యాన్‌ చెబుతున్నారు. మూడు కోడెక్స్‌లలో క్రైస్తవ గ్రీకు లేఖనాల పుస్తకాలు ఉన్నాయి. ఒకదానిలో నాలుగు సువార్తల్లోని అధికశాతం మరియు అపొస్తలుల కార్యముల పుస్తకంలో చాలామట్టుకు ఉన్నాయి. రెండవ కోడెక్స్‌ మొదట పూర్తిగా లభించకపోయినా ఆ తర్వాత దానికి సంబంధించిన అదనపు పేజీలను కూడా బీటీ సంపాదించాడు. ఆ రెండవ కోడెక్స్‌లో అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన లేఖతోపాటు దాదాపు ఆయన వ్రాసిన ఇతర లేఖలన్నీ ఉన్నాయి. మూడవ కోడెక్స్‌లో ప్రకటన గ్రంథంలోని మూడవ వంతు ఉంది. కెన్యాన్‌ ప్రకారం ఈ పపైరస్‌ వ్రాతప్రతులు “ప్రస్తుతమున్న క్రొత్త నిబంధనపై మనకు ఇప్పటికే ఎంతో ఎక్కువగా ఉన్న నమ్మకాన్ని స్పష్టమైన రుజువులతో మరింత బలపరిచాయి.”

క్రైస్తవులు ఎంతోకాలం క్రితమే అంటే బహుశా సా.శ. మొదటి శతాబ్దం ముగియక ముందే అసౌకర్యంగా ఉండే గ్రంథపు చుట్టలకు బదులు కోడెక్స్‌ను లేదా పేజీలుగల పుస్తకాన్ని ఉపయోగించడం ప్రారంభించారు అని చెస్టర్‌ బీటీకి చెందిన బైబిలు సంబంధమైన వ్రాతప్రతులు చూపిస్తున్నాయి. అంతేకాక వ్రాత పరికరాలు తక్కువగా ఉండడంవల్ల లేఖికులు పాత పపైరస్‌నే మళ్ళీ ఉపయోగించేవారని కూడా అవి చూపిస్తున్నాయి. ఉదాహరణకు, యోహాను సువార్తలోని ఒక భాగానికి చెందిన కాప్టిక్‌ వ్రాతప్రతి “గ్రీకు లెక్కలు గల స్కూలు అభ్యాస పుస్తకంలా కనిపించేదానిపై” వ్రాయబడింది.

ఈ పపైరస్‌ దస్తావేజులు చూడడానికి ఆకర్షణీయంగా కనిపించకపోయినా అవి వెలకట్టలేనంత అమూల్యమైనవి. అవి క్రైస్తవత్వపు ప్రారంభాలకు ప్రత్యక్షమైన స్పష్టమైన రుజువులు. “మీరు ఇక్కడ కొన్ని తొలి క్రైస్తవ సమాజాలు ఉపయోగించిన, వారు భద్రంగా దాచుకొన్న పుస్తకాలు ఎలా ఉంటాయో స్వయంగా చూడవచ్చు” అని చార్లెస్‌ హార్టన్‌ చెబుతున్నారు. (సామెతలు 2:​4, 5) చెస్టర్‌ బీటీ లైబ్రరీలోని ఈ నిధులను పరిశీలించే అవకాశం మీకు లభిస్తే, వాటిని చూసి మీరు తప్పకుండా ఆనందిస్తారు.

[31వ పేజీలోని చిత్రం]

కాట్సుషికా హోకుసాయి జాపనీస్‌ చెక్కదిమ్మలతో అచ్చొత్తిన చిత్రం

[31వ పేజీలోని చిత్రం]

ప్రచురించబడిన బైబిలు తొలి ప్రతుల్లో “బిబ్లియా లాటినా” ఒకటి

[31వ పేజీలోని చిత్రం]

టాషెన్‌ వ్రాసిన “థియాటెస్సరోన్‌”పై ఎఫ్రాయిమ్‌ వ్యాఖ్యాన గ్రంథం బైబిలు ప్రామాణికత్వాన్ని బలపరుస్తుంది

[31వ పేజీలోని చిత్రం]

చెస్టర్‌ బీటీ పి45, ప్రపంచంలోకెల్లా అతిపురాతన కోడెక్స్‌, దీనిలో నాలుగు సువార్తల్లో అధికశాతం మరియు అపొస్తలుల కార్యములులో చాలామట్టుకు ఒకే పుస్తకంలో ఉన్నాయి

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin

[31వ పేజీలోని చిత్రసౌజన్యం]

చిత్రాలన్ని: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin